top of page
Original.png

సుల్తాన్ - వజీర్

#సుల్తాన్, #వజీర్, #SulthanVazir, #KarlapalemHanumanthaRao, #కర్లపాలెంహనుమంతరావు, #TeluguMoralStories, #నీతికథలు

ree

Sulthan Vazir - New Telugu Story Written By Karlapalem Hanumantha Rao

Published In manatelugukathalu.com On 10/07/2025

సుల్తాన్ వజీర్ - తెలుగు కథ

రచన: కర్లపాలెం హనుమంతరావు

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్

 

 భాగమతి నగరాన్ని రాజధాని చేసుకొని బాల్కొండను ఏలే కాలంలో, సుల్తాన్ ఇబ్రహీం ఖాన్ దర్బార్లో ఒక నమ్మకస్తుడైన వజీర్ ఉండేవాడు. అతని పేరు షాజా ఇబ్రహీం. 


ఇబ్రహీం వంశం మూడు తరాలుగా సుల్తాను వంశాన్ని నమ్మినబంటులా మెలిగింది. ఈ తరం సుల్తానుకూ తన తరం వాడైన ఇబ్రహీం పట్ల అమిత గౌరవాభిమానులు ఉండేవి. 

 

కానీ వజీర్ నీతి నిజాయితి అతనికి శత్రువయింది. సుల్తానుతో అతనికి ఉండే సాన్నిహిత్యం దర్బారులోని కొందరు తోటి ఉద్యోగుల్లో అసూయ రగిలించింది. వారు పదే 

పదే వజీర్ నడవడిక మీద సుల్తాన్ కు అనుమానం రేకెత్తించే కథలు అల్లి వినిపించేవారు. అదే పనిగా అందరి నోటా చెప్పుడు మాటలు వినటం వల్ల సుల్తానుకూ 

వజీర్ షాజా ఇబ్రహీం మీద శంక మొదలయింది. 

 

అనుమానం పెనుభూతం అంటారు కదా పెద్దలు! ఆ భూతం ఆవహించినందువల్ల సుల్తాన్, వజీర్ మీద నమ్మకం కోల్పోయాడు. తన ఉప్పు తింటూ శత్రువైన పల్నాడు 

పాలెగాడు వీరనాయుడు తరుపున పనిచేస్తున్నాడనే అభిప్రాయానికి వచ్చాడు. ఆగ్రహం పట్టలేకపోయాడు. 

 

రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవా? వజీర్ షాజాకు మరణదండన విధించాడు సుల్తాన్. 

 

సుల్తాన్ జమానాలో మరణదండనకు ఒక ప్రత్యేక విధానం ఉండేది. నిందితుణ్ణి రాజుగారి వేటకుక్కలకు ఆహారంగా వేసేవారు. జాగిలాల బారినపడ్డ వ్యక్తి ఎంత ఘోరంగా 

మృత్యువుపాలవుతాడో ప్రత్యేకంగా చెప్పేదేముంది? 

 

మరణ దండనకు ముందు తన ఆఖరి కోరిక తీర్చమని వేడుకొన్నాడు వజీర్. "పది రోజులు గడువు ఇస్తే.. ఇంటి బాధ్యతలు బిడ్డలకు అప్పగించి వస్తాను"అని ఆ కోరిక. 

 

దశాబ్దాలుగా తన వంశానికి చేసిన వజీర్ చివరి కోరికను మన్నించటం న్యాయం అనిపించింది సుల్తాన్ కు. ఇచ్చిన గడువు లోపు తిరిగి వస్తానని మాట ఇచ్చిన మీదట వజీర్ కు తాత్కాలిక విడుదల లభించింది. 

 

శిక్షాస్థలి నుంచి వజీర్ రాజుగారి సుల్తాన్ వేటకుక్కల శిక్షకుడిని రహస్యంగా కలిసి తన మనసులోని మాటను చెప్పాడు. వంద బంగారు నాణేలు చేతిలో పడిన మీదట 

పదిరోజులు కుక్కలను పోషించే బాధ్యత వజీర్ కు అప్పగించాడా శిక్షకుడు. 

 

ఈపది రోజులూ వజీరు వేటకుక్కల ఆలనా పాలనా శ్రద్ధగా చూసుకున్నాడు. వేళకు 

ఆహారం అందిస్తూ క్రమంగా మాలిమి చేసుకొన్నాడు. ఒక చిన్న మెతుకు విదిల్చినా జీవితాంతం విశ్వాసం చూపించే నైజం కుక్కలది.పది రోజులు తమను కంటికి రెప్పలా 

చూసుకున్న వజీర్ పట్ల సుల్తాన్ వేటకుక్కలు ప్రేమానుబంధాలు పెంచుకున్నాయి. 

 

చెప్పిన గడువుకు వజీర్ సుల్తాన్ ముందు హాజరయ్యాడు. చట్టప్రకారం జరగవల్సిన తంతంతా పూర్తయిన తరువాత వజీర్ ను వేటకుక్కలు ఉండే స్థలంలో వదిలారు. 

జాగిలాల బారిన పడి వజీర్ విలవిలలాడుతూ మరణిస్తుంటే చూసి ఆనందించాలన్న ఉబలాటంతో శిక్షాస్థలి చుట్టూ మూగిన దర్బారు సిబ్బందికి నివ్వెరపోయే అద్భుతం 

ఎదురయింది. 

 

వేటకుక్కలు వజీర్ ను కండకు కండగా చీల్చి పీక్కు తింటాయని భావించిన వారందరికి ఆశాభంగమయింది. వజీర్ ను చూడగానే సంతోషంతో తోకలు ఊపుకుంటూ అతని వైపు పరుగెత్తుకొచ్చాయి జాగిలాలు! గోముగా అతనితో ఆడుకోవడం సాగించాయి! కాట్లూ లేవు, కరవటాలూ లేవు! కంటి ముందు కనిపించేదంతా మూర్తీభవించిన ప్రేమాభిమానాల బాంధవ్యమే! 

 

సుల్తాన్ కు నోట మాట రాలేదు. కలలో కూడా ఊహించని సన్నివేశం! వజీర్ కట్లు విప్పించి తన ముందుకు రప్పించాడు సుల్తాన్. "ఒక వ్యక్తి వేటకుక్కల బారిన పడీ 

క్షేమంగా బైటపడటం నాకు తెలిసి ఇదే మొదటిసారి. ఎలా సంభవమయింది ఈ అద్భుతం?" అని అడిగాడు. 

 

వజీర్ వినయంగా "విశ్వాసం చేసిన అద్భుతం ఇది హుజూర్!" అంటూ మొదటి నుంచి తన పట్ల దర్బారులో జరిగిన కుట్రలతో సహా పది రోజులుగా తను వేటకుక్కలను 

ప్రేమాదరాలతో పోషించిన వైనం పూసుగుచ్చినట్లు వివరించాడు. 

 

సుల్తాన్ తన తొందరపాటుకు సిగ్గుపడ్డాడు. 'కేవలం పది రోజులు తమను శ్రద్ధగా చూసుకొన్న వ్యక్తి పట్ల వేటకుక్కలు ప్రదర్శించిన విశ్వాసంతో వజీర్ పట్ల తను చూపించిన అమానుష ప్రవర్తనను పోల్చుకొని పశ్చాత్తాపం చెందాడు. ప్రాయశ్చిత్తంగా వజీర్ ను విలువైన కానుకలతో సత్కరించి తిరిగి తన ఆంతరంగికులలో ఒకడిగా నియమించుకున్నాడు. కుట్రకు కారణమైన సిబ్బందికి మరణశిక్ష విధించి వేటకుక్కలకు ఆహారంగా వేయించాడు. 


 ***

కర్లపాలెం హనుమంతరావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


ree

రచయిత పరిచయం:

కర్లపాలెం హనుమంతరావు -పరిచయం


రిటైర్డ్ బ్యాంకు అధికారిని. 20 యేళ్ళ వయస్సు నుంచి రచనా వ్యాసంగంతో సంబంధం ఉంది. ప్రింట్, సోషల్ మీడియాల ద్వారా కవిత్వం నుంచి నవల వరకు తెలుగు సాహిత్యంలోని ప్రక్రియలు అన్నింటిలో ప్రవేశం ఉంది. సినిమా రంగంలో రచయితగా పనిచేశాను. వివిధ పత్రికలకు కాలమిస్ట్ గా కొనసాగుతున్నాను. పోటీ కథల జడ్జి పాత్రా నిర్వహిస్తున్నాను. కథలకు , నాటక రచనలకు వివిధ పత్రికల నుంచి బహుమతులు, పురస్కారాలు సాధించాను. ప్రముఖ దినపత్రిక 'ఈనాడు' తో 25 ఏళ్ళుగా రచనలు చేస్తున్నాను. మూడేళ్ళు ఆదివారం అతిధి సంపాదకుడిగా పనిచేసిన అనుభవం నా ప్రత్యేకత.

 


Comments


bottom of page