సూరిగాడు
- Anisa Tabassum Sk

- 13 hours ago
- 3 min read

Surigadu - Telugu Emotional Story | Anisa Tabassum Sk
సూరిగాడు - తెలుగు భావోద్వేగ కథ | అనిసా తబస్సుమ్ SK
Published in manatelugukathalu.com on 03/06/2026
అనుకోని ప్రకృతి విపత్తులు సాధారణ కుటుంబాల జీవితాలను ఎలా తలకిందులు చేస్తాయో చూపించే హృద్యమైన కథ ఇది.
అయితే కష్టకాలంలో నిరాశ చెందకుండా, సమస్యలోనే పరిష్కారాన్ని వెతికిన యువకుడు సూరి అందరికీ ఆదర్శంగా నిలుస్తాడు.
ప్రకృతిని అర్థం చేసుకోవడం, అవకాశాలను గుర్తించడం, పొరుగువారితో పంచుకోవడం వంటి విలువలను ఈ కథ అందంగా తెలియజేస్తుంది.
మానవత్వం, ఆత్మస్థైర్యం, జీవన పోరాటం కలిసిన భావోద్వేగ కథ.
ఇంకా జల్లు కురుస్తూనే ఉంది. వాకిలి మొత్తం బురదతో నిండిపోయింది. "ఇంకా ఎన్ని రోజులు?" అన్నట్లు వాన చినుకులను భారంగా మోస్తున్నాయి పూల మొక్కలు. చూరు మీద నుంచి సర్రున వాన నీరు జారుతోంది.
అదే వరండాలో ఒక పక్కకి కూర్చొని చూరు మీద నుంచి జారుతున్న వాన నీటిని తదేకంగా చూస్తున్నాడు సూరి.
మరి అలా చూడక ఇంకేం చేస్తాడు!! అప్పటికే కడుపునిండా అన్నం తిని మూడు రోజులు అయింది. ఆకలికి తట్టుకోలేక ఇంట్లో ఒక పక్కన పడేసిన కొన్ని నూకలు మిగిలితే వాటితోనే గంజి కాచుకొని తాగుతున్నారు. సూరి ఇంట్లో తాను, అతని తల్లిదండ్రులు, చెల్లి ఉంటున్నారు. ఇదే అతని కుటుంబం. సూరి కూలీ పనికి వెళ్లేవాడు. తల్లిదండ్రులు వ్యవసాయ పనులు చేస్తారు. అతని చెల్లి సుగుణకు వచ్చే శ్రావణ మాసంలో లగ్గం పెట్టుకున్నారు.
ఇంతలో సూరి తల్లి బయటకు వచ్చి, వరండాలో ఉన్న గుంజను పట్టుకొని, విరక్తి - నిరాశ కలగలిసిన భావంతో "ముసురు... మాయదారి ముసురు వారం నుంచి పడతానే ఉంది. మనవి రెక్కాడితే కానీ డొక్కాడని బతుకులాయే, ఇలాగే ఉంటే బతికి బట్టకట్టేది ఎలాగా? ఇక ఆ దేవుడే కనికరించాలి" అంటూ గుమ్మానికి ఆనుకొని చతికిలబడింది.
సూరి వాళ్ళ కుటుంబానికే కాదు, దాదాపు ఊర్లో అన్ని కుటుంబాలదీ ఇదే పరిస్థితి. ఇందుకు గల కారణం, సూరి వాళ్ళ ఊరి పక్కనే ఒక వాగు ప్రవహిస్తుంది. గట్టిగా నాలుగు రోజులు కుండపోత వాన పడితే వాగు పొంగి ఇళ్లు, వాకిలి, పశువుల కొట్టం, పొలాలు... ఊరు మొత్తం నీట మునిగిపోతుంది. దిగువన ఉన్న ఇళ్లలోకైతే ఇంటి లోపలికి నీళ్లు వచ్చేస్తాయి.
పొలాలు నీట మునిగి రైతు బిడ్డలకు కన్నీళ్లను మిగులుస్తాయి. వాకిలి దాకా నీళ్లతో మునిగి ఉండడంతో ఎవరూ బయటికి కదలలేని పరిస్థితి. ఇక పొయ్యి ఎలా వెలుగుతుంది?
సూరి వాళ్ళ ఇంటి పక్కనే ఒక చిన్న కుటుంబం ఉంది. ఇంట్లో పొయ్యి వెలిగించి ఎన్ని రోజులు అయిందో! ఆకలికి పసిపిల్లల ఏడుపులు వినిపిస్తూనే ఉంటాయి. ఆటల్లో పడి ఆకలి మర్చిపోతారని బయటికి పంపుదామన్నా వీలుకాని పరిస్థితి.
రెండు మూడు రోజుల నుంచి వర్షం తగ్గడంతో ఇళ్ల ముందున్న నీరు తగ్గిపోయింది.
ఆలోచనలోంచి బయటకు వచ్చిన సూరి, చినుకు జల్లులు లెక్కచేయకుండా "పొలం చూసొస్తానే అమ్మా" అంటూ వరండాలో నుంచి అడుగు బయట పెట్టాడు. మడమల దాకా బురదలో కాళ్లు దిగాయి. చెప్పులు పనికిరావని అర్థం చేసుకొని, చెప్పులు తీసి వరండాలో ఒక పక్కకి విసిరి కొట్టి నడక మొదలుపెట్టాడు.
ఎలాగోలా పొలం చేరుకున్నాడు. నిరాశతో పొలమంతా కలియచూశాడు. ఏమీ మిగలకుండా పొలమంతా నాశనమైంది. పొలంలో మిగిలిన కాస్తపాటి నీళ్లలోనే ఎన్నో నత్తలు, చేపలు కనిపిస్తున్నాయి.
అకస్మాత్తుగా సూరికి తాత చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. "ప్రకృతి మనకు ఏదీ ఊరికే ఇవ్వదు. అనవసరమైనది ఏదీ లేదు. అది ఏమిచ్చినా అది మన మంచికే. మనం కూడా దాన్ని అంతే గౌరవించాలి, జాగ్రత్తగా కాపాడుకోవాలి" అని.
సూరి వెంటనే తన ప్యాంటును మోకాళ్లదాకా మడుచుకొని, పొలంలోకి దిగి గబగబా గంప నిండా నత్తలు, చేపలు పట్టాడు. అటునుంచి అటే చుట్టుపక్క గ్రామాలకు వెళ్లి వాటిని అమ్మి, వచ్చిన డబ్బుతో సరుకులు తీసుకొని ఇంటిదారి పట్టాడు.
ఇంటికి చేరాక కొన్ని సరుకులు పిల్లలున్న పక్కింట్లో ఇచ్చాడు. ఆ రోజు సాయంత్రానికి ఇంట్లో ఒక పక్కకి మూడు ఇటుకలు పేర్చి, నిప్పు ముట్టించి ఘుమఘుమలాడే చేపల పులుసు, నత్తల వేపుడు చేసి ఇంట్లో అందరికీ వడ్డించింది సూరి తల్లి. "ఆహా!! ఎన్ని రోజులైంది నోటికి రుచి తగిలి!" అంటూ సూరి నాన్న, "నీ వంటే వంటే వీరమ్మ" అంటూ సూరి మెచ్చుకున్నారు. అందరూ కడుపు నిండా తిని హాయిగా నిద్రపోయారు. రాత్రి పిల్లల ఏడుపులు కూడా వినిపించలేదు.
కథ సమాప్తం
-*అనిసా తబస్సుమ్ Sk(Anisa Tabassum SK)
అనిసా తబస్సుమ్ SK గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2026 కథల పోటీల వివరాల కోసం
ఉగాది షడ్రుచుల కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
కథ సమాప్తం

అనిసా తబస్సుమ్ SK




❤💫