top of page

స్వర్ణ తాంబూలం

కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.
'Swarna Thambulam' written by M R V Sathyanarayana Murthy

రచన : M R V సత్యనారాయణ మూర్తి

బెంగుళూర్ నుండి కాకినాడ వెళ్ళే శేషాద్రి ఎక్సుప్రెస్ వేగంగా పరుగెడుతోంది. రైలు కైకలూరు స్టేషన్ దాటింది. ఏ. సి. కోచ్ లో కిటికీ దగ్గర, కర్టెన్ పక్కకు పెట్టి అద్దంలోంచి చూస్తున్నాడు గోపినాద్.

డిసెంబర్ నెల. పచ్చగా ఉన్న వరిచేల మీదనుంచి మంచు తెరలు, బద్ధకంగా వళ్ళు విరుచుకుంటూ పైకి లేస్తున్నాయి. కొందరు సైకిళ్ళ మీద పశువుల పాకల వైపు వెళ్తున్నారు పశువుల నుండి పాలు పితకడానికి. కొన్ని ఇళ్ళముందు ఉన్న బంతిపూల చెట్లు రైలు వేగానికి ప్రయాణీకులకు వీడ్కోలు చెబుతున్నట్టుగా అటూ ఇటూ ఊగుతున్నాయి. పక్షులు గూళ్ళ లోంచే రాగాలు తీస్తున్నాయి.

అతని మనసు ఆనందంతో గంతులు వేస్తోంది. రైలు విజయవాడ దాటగానే లేచి కూర్చున్నాడు గోపినాద్. కానీ అప్పటికి ఇంకా చీకటి తెరలు తొలగలేదు. ఇదిగో ఇప్పుడు కొంచెం కొంచెం బయట చెట్టూ, చేమా , మనుషులు కనిపిస్తున్నారు. ఆకివీడు దాటగానే కాఫీ అమ్మే కుర్రాడు వచ్చాడు. ఒక కప్పు తీసుకుని నెమ్మదిగా తాగడం మొదలెట్టాడు. వేడిగా

రుచిగా ఉంది. కుర్రాడికేసి తిరిగి బాగుందన్నట్టు కళ్ళతో నవ్వుతూ తలాడించాడు గోపినాద్. వాడూ నవ్వి ముందుకు వెళ్ళిపోయాడు. కాఫీ తాగి , కప్పు డస్ట్ బిన్ లో పడేసి వచ్చాడు.

కొద్దిసేపటికే భీమవరం వచ్చింది. చాలా మంది దిగారు. అనుకోకుండా మిత్రుడు నాగేంద్ర శర్మ గుర్తుకొచ్చాడు. భీమవరంలో అతనితో గడిపిన రోజులు గుర్తుకొచ్చి పెదవులపై చిరునవ్వు మెరిసింది. ఎన్నో సంతోషకరమైన సంఘటనలు మనో ఫలకంపై ఆవిష్కృతమయ్యాయి. మావుళ్ళమ్మ గుడికి వెళ్ళడం, వెంకట్రామ దియేటర్లో సినిమాలు చూడడం అన్నీ గుర్తుకొచ్చాయి. అవన్నీ తలుచుకున్నాడు. ఈలోగా ‘తణుకు

స్టేషన్మీకుస్వాగతంపలుకుతోంది’అంటూ మైక్ లోఅనౌన్స్ మెంట్ వినిపించింది.

సూట్ కేస్ తీసుకుని రైలు దిగాడు గోపినాద్. చుట్టూ పరికించి చూసి గుండెనిండా గాలి

పీల్చుకున్నాడు. రెండు నిముషాలు అలాగే చూస్త్తూ నిల్చున్నాడు.

ప్రయాణీకులు అందరూ వెళ్ళిపోయారు. రైలూ వెళ్ళిపోయింది. ప్లాట్ ఫారం మీద గోపినాద్ ఒక్కడే ఉన్నాడు. నెమ్మదిగా నడుచుకుంటూ స్టేషన్ బయటకు వచ్చాడు. ఆటో వాళ్ళు చుట్టుముట్టారు.

“నరేంద్ర సెంటర్ కి వెళ్ళాలి” అన్నాడు గోపినాద్. ఒకతను ముందుకు వచ్చి సూట్ కేస్ అందుకున్నాడు. అతని వెనకే వెళ్లి ఆటోలో కూర్చున్నాడు. ఆటో కొద్ది దూరం వెళ్ళగానే ఫ్లై ఓవర్ బ్రిడ్జి కనపడింది. అతని కళ్ళు ఆశ్చర్యంతో విచ్చుకున్నాయి. గతంలో రైలు రాగానే గేటు వేసేవారు. రోడ్ మీద వాహనాలు అన్నీ ఆగిపోయేవి. రైలు వెళ్ళాక గేటు తీయగానే చాలా హడావిడిగా ఉండేది. ఇంకొంచెం ముందుకు వెళ్ళగానే ఎడమ పక్క చిట్టూరి ఇంద్రయ్య కాలేజీ, కుడిపక్క ముళ్ళపూడి వారి పోలిటెక్నిక్ కాలేజీ కనిపించాయి. ఇంద్రయ్య కాలేజీ చూడగానే మందాకిని, శిరీష, మంజులత, బుచ్చిబాబు, హరనాద్ అందరూ గుర్తుకొచ్చారు.

నరేంద్ర సెంటర్ రాగానే ఆటో వాడు అడిగాడు ‘ఎక్కడికి వెళ్లాలని?’

“మంచి హోటల్ కి పోనీ” అన్నాడు గోపినాద్.

రెండు నిముషాలలో శ్రీదేవి హోటల్ ముందు ఆగింది ఆటో.

“పైన రూములు ఉంటాయి సర్. కింద హోటల్ ఉంది. టిఫిన్, భోజనం రెండూ

బాగుంటాయి” అన్నాడు ఆటోవాడు. అతనికి థాంక్స్ చెప్పి డబ్బులు ఇచ్చాడు గోపినాద్. రిసెప్షన్ లోకి వెళ్లి తన విజిటింగ్ కార్డ్ ఇచ్చి రూమ్ తీసుకున్నాడు. స్నానం చేసి, డ్రెస్ చేసుకుని కిందకు వచ్చి టిఫిన్ తిన్నాడు. ఆటో అతను చెప్పినట్టు టిఫిన్ బాగుంది, ముఖ్యంగా సాంబారు మరీ బాగుంది. నరేంద్ర టాకీసులో “శ్రీకృష్ణ పాండవీయం” సినిమా చూసి , ఈశ్వర్ విలాస్ లో సాంబారు ఇడ్లి తిన్న రోజులు గుర్తుకు వచ్చాయి. టిఫిన్ అయ్యాక రోడ్ దాటి , కోర్ట్ ముందు నిలబడ్డాడు గోపినాద్.

”మార్టేరు. . పాలకొల్లు. . ”అంటూ పిలుస్తూ వచ్చి ఆగాడు ఆటోవాడు.

“శివపురం వెళ్ళాలి. రమ్మంటావా?”అడిగాడు గోపినాద్.

”రండి సార్”అని చెప్పగానే ఆటో ఎక్కి సీట్ లో కూర్చున్నాడు. మరికొంతమంది వచ్చేవరకూ ఆగి, అప్పుడు బయల్దేరింది ఆటో.

ఆటోలోంచి బయట దృశ్యాల్ని ఆసక్తిగా చూస్తున్నాడు గోపినాద్. పెరవలి దాటగానే విజ్జేశ్వరం నర్సాపురం కాలువపై కట్టిన చిన్న చిన్న వంతెనల్ని చూసి ఆశ్చర్యపోయాడు. ప్రతి ఊరుకి ఓ బల్లకట్టు ఉండేది. ప్రజలు దాని మీదే కాలువ దాటేవారు. కొద్దిసేపటికే శివపురం వచ్చింది. గోపినాద్ కాలేజీ వంతెన దగ్గర ఆటో దిగాడు. తను ఇక్కడ ఉన్నప్పుడు కాలేజీ లేదు. అందుకే తను, తణుకు కాలేజీలో చదువుకున్నాడు.

ముందుగా నగరేశ్వర స్వామి గుడికి వెళ్లి శివుడ్ని, మహిషాసుర మర్దని అమ్మవారిని, వాసవి

కన్యకాపరమేశ్వరి అమ్మవారిని దర్శనం చేసుకున్నాడు. తర్వాత లింగాల వీధి లోని రామాలయం వద్దకు వెళ్ళాడు. పాత రామాలయం స్థానే కొత్త ఆలయం కట్టారు. స్వామిని దర్శించుకుని మెట్లు మీద కూర్చున్నాడు గోపినాద్. తన చిన్నతనంలో సిమెంట్ స్తంభాలమీద పెంకుటి పై కప్పుతో ఉండేది. గుడి పక్కనే కొవ్వూరి వారి వీధికి వెళ్ళే మొగలో ఎనిమిది అడుగుల ఎత్తులో ఒక చిన్న దీపస్తంభం ఉండేది.

గ్రామ పంచాయితీ నుండి సాయంకాలం ఒక మనిషి వచ్చి దీపం అద్దాలు తుడిచి, దీపానికి కిరసనాయిల్ పోసి వెలిగించి వెళ్ళేవాడు. నాలుగు మెట్లు ఉన్న చిన్న నిచ్చెన ఎక్కి అతను ఈ పని చేసేవాడు. అది చూడటానికి తనూ, భానుమూర్తి అక్కడకు చేరే వారు. అలా చూడటం చాలా సరదాగా ఉండేది. అది గుర్తుకొచ్చి గోపినాద్ చిన్నగా నవ్వుకున్నాడు.

తర్వాత మెట్ల కింద ఉన్న చపటా చూసి గోపినాద్ మనసు భావోద్వేగానికి లోనయ్యింది. అతని కళ్ళు విశాలం అయ్యాయి. గుండె వేగంగా కొట్టుకోసాగింది. అతని మనసు ఏభై ఏళ్ళు వెనక్కి వెళ్ళింది.

*****

శివపురం లో వెంకట్రామయ్య గారు ప్రాధమిక పాటశాల ఉపాధ్యాయుడు. చెల్లెలు వెంకటలక్ష్మి ఊళ్ళో హై స్కూల్ లేకపోవడం వలన మేనల్లుడు గోపినాద్ ని శివపురం తీసుకువచ్చి ఆరవతరగతిలో చేర్చారు. పదవ తరగతి పరీక్షలలో గోపినాద్ ప్రధమ శ్రేణిలో పాస్ అయ్యాడు. తణుకు లోని కాలేజీ లో గోపినాద్ ని ఇంటర్మీడియట్ లో చేర్చారు వెంకట్రామయ్య.

శివపురం లో దసరా ఉత్సవాలు చాలా బాగా చేస్తారు. ఎండు గడ్డితో కర్రలతో ఏనుగు బొమ్మని తయారు చేసి దానికి రంగు రంగుల కాగితాలు అతికించి అందంగా తీర్చిదిద్దుతారు. ఒక అంబారీ ని కూడా చేసి దానిలోపల రాముల వారి పటం పెడతారు. ఏనుగు బొమ్మ మూడు అడుగుల నుండి ఆరడుగుల ఎత్తు వరకూ చేస్తారు. అంబారీ కూడా రెండు అడుగుల నుండి నాలుగు అడుగుల ఎత్తు వరకూ ఉంటుంది.

ఇలా తయారు చేసిన ఏనుగు బొమ్మని, అంబారీ ని పెద్ద చెక్క బల్ల పై ఉంచి తాళ్ళతో కట్టి బలసాలులైన నలుగురు మోస్తూ ఊరు అంతా తిరుగుతారు. ఈ ఊరేగింపుకి ముందు భోగం మేళం ఉంటుంది. వారి నృత్యాలు చూడటానికి, ఏనుగుల సంబరం చూడటానికి చుట్టు పక్కల ఇరవై గ్రామాల నుంచి జనం వస్తారు. దసరా రోజున కనీసం ఆరు లేదా ఏడు భోగం మేళాలు శివపురం వస్తాయి. తమ ఇళ్ళల్లో పెళ్లిళ్లకు, కార్తీకమాసం పిక్నిక్కులకు భోగం మేళాలు మాట్లాడుకోవడం కోసం కూడా జనం శివపురం వస్తారు.

కాలేజీ మిత్రులు హరనాద్, బుచ్చిబాబు, సుధాకర్ ‘మీ ఊర్లో దసరా ఉత్సవాలు బాగా చేస్తారటగా, మేము చూడటానికి వస్తాం’అని అన్నారు గోపినాద్ తో. అలాగే అన్నాడు గోపినాద్. దసరా రోజు సాయంత్రం మిత్రబృందం శివపురం వచ్చారు. టిఫిన్లు తిన్నాకా నలుగురూ ఊళ్ళోకి బయల్దేరారు. వేండ్ర వారి వీధి యువకులు తయారుచేసిన పెద్ద ఏనుగు బొమ్మని చూసి తణుకు మిత్రులు ఆశ్చర్య పోయారు. అప్పటికే అక్కడ భోగంమేళం వారి నృత్యాలు ప్రారంభమయ్యాయి. కాసేపు అక్కడుండి తర్వాత మిగతా వీధులలోని

భజనలు, కర్రసాములు, మ్యూజిక్ ఆర్కెస్ట్రా కార్యక్రమములు చూసి ఇంటికొచ్చి భోజనం చేసి కాసేపు విశ్రాంతి తీసుకున్నారు మిత్రబృందం. రాత్రి పదిగంటలకు మరలా బయటకు వచ్చారు మిత్రబృందం.

కాలువగట్టున వంతెన దగ్గర జరుగుతున్న కర్రసాము, కత్తిసాము ల దగ్గర చాలాసేపు ఉన్నారు. కుర్రాళ్ళు ప్రదర్శించిన ఆ విన్యాసాలు హరనాద్, బుచ్చిబాబు, సుధాకర్ లను బాగా ఆకర్షించాయి. గోపినాద్ ఇవన్ని చాలా సార్లు చూసినందున పెద్దగా స్పందించలేదు. రాత్రి ఒంటి గంటకు అందరూ మరలా లింగాలవీది రామాలయం దగ్గరకు వచ్చారు. గుడి ముందు వేసిన స్టేజి మీద భోగంమేళం ఆడుతున్నారు. ముందు వరసలో వేసిన కుర్చీలు కొన్ని ఖాలీగా ఉన్నాయి. అక్కడ ‘కూర్చుందాము’ అన్నాడు హరనాద్.

‘అమ్మో, ఎవరైనా చూసి మామయ్యకి చెబితే బాగుండదు’అన్నాడు భయం భయంగా గోపినాద్.

‘ఏం ఫరవాలేదు’అని సుధాకర్ బలవంతంగా గోపినాద్ ని తీసుకొచ్చి కుర్చీలో కూలేసాడు. నలుగురూ

దగ్గరగా కూర్చుని వాళ్ళ నృత్యం చూస్తుంటే తణుకు మిత్రులకు చాలా త్రిల్లింగ్ గా ఉంది. గోపినాద్ భయం భయంగా తల దించుకుని కూర్చున్నాడు. శాంతినివాసం సినిమా లోని ‘రాధ రావే, రాణి రావే’అన్న పాటకు సుమారు పదహారు, పదిహేడు సంవత్సరాల వయసున్న ఇద్దరు ఆడపిల్లలు నృత్యం చేసారు. పాట పూర్తి కాగానే వెనక వరసలో ఉన్నవారు గట్టిగా ఈలలు వేసారు. మరో రెండు పాటలకు నృత్యం చేసిన ఆ అమ్మాయిలు స్టేజి కిందకు దిగి ముందు వరసలో కూర్చున్న వారికి తాంబూలాలు ఇచ్చారు. కొంత మంది

ఆ పిల్లలతో వేళాకోళం ఆడేరు. తర్వాత ఆ తమలపాకులతో పాటు డబ్బులు ఇచ్చారు కుర్రాళ్ళు.

ఇద్దరిలో ఒక అమ్మాయి బంగారు రంగులో మెరిసిపోతూ ఉంది. తణుకు మిత్రులు కూడా ఆ పిల్లలతో సరదాగా మాట్లాడి డబ్బులు ఇచ్చి షేక్ హ్యాండ్ కూడా ఇచ్చారు. గోపినాద్ ని డబ్బులు అడిగింది మేరుపు తీగ.

‘నా దగ్గర డబ్బులు లేవు’ భయం భయంగా తల దించుకునే చెప్పాడు.

“మరి డబ్బులు లేనప్పుడు కుర్చీలో ఎందుకు కూర్చున్నావ్? తాంబూలం ఎందుకు

తీసుకున్నావ్?”మెరుపుతీగ పక్క పిల్ల అడిగింది గోపినాద్ బుగ్గలు సాగదీస్తూ.

బుగ్గలు చేతితో రాసుకుంటూ తల పైకెత్తాడు గోపినాద్. ఎదురుగా మెరుపుతీగ నిలబడి ఉంది. నృత్యం చేసి అలసిపోయి ఉండడం వలన మొహం మీద చిరు చెమటలు పట్టాయి. అంత అందమైన అమ్మాయిని, అంత దగ్గరగా చూసి ఒక్క క్షణం నోటమాట రాలేదు గోపినాద్ కి.

“డబ్బులు ఇవ్వండి”గులాబి రంగు పెదవులు విచ్చుకోగా నవ్వుతూ అడిగింది మెరుపుతీగ. ”నిజంగా డబ్బులు లేవండి”మాటలు కూడతీసుకుని అన్నాడు.

“స్వర్ణా, ఇది మొండి బాకీయే” పగలబడి నవ్వుతూ అంది మొదటిపిల్ల.

“సరే, నేను ఇచ్చిన తాంబూలం ఇచ్చేయండి. మా పెద్దమ్మకి లెక్క చెప్పాలి” అంది స్వర్ణ.

“తాంబూలం తినేసాను”అన్నాడు గోపినాద్. మరోసారి పగలబడి నవ్వింది మొదటిపిల్ల గోపినాద్ మాటలకు.

”డబ్బులూ ఇవ్వక, తాంబూలం ఇవ్వక ఏం చేద్దామని కూర్చున్నావు బావా?”అంటూ మరోసారి గోపినాద్ బుగ్గలు సాగదీసింది మొదటిపిల్ల. ఆమె చర్యకి స్వర్ణ కిల కిలా నవ్వింది. బుగ్గలు మండుతున్నా, స్వర్ణ నవ్వు గోపినాద్ కి హాయి నిచ్చింది. స్టేజి మీద నృత్యం జరుగుతూనే ఉంది. జనం ఆ నృత్యం చూస్తున్నారు. వీళ్ళ మాటలు ఆ సంగీతం హోరులో ఎవరికీ వినపడటం లేదు.

చివరకు హరనాద్ దగ్గర డబ్బులు తీసుకుని స్వర్ణ కి ఇచ్చాడు గోపినాద్. చిరునవ్వులు చిందిస్తూ స్టేజి మీదకు వెళ్లి ఆ డబ్బులు అన్నీ, మేనా నాయకురాలికి ఇచ్చింది స్వర్ణ. ఇంకో రెండు నృత్యాలు చూసాకా మిత్రుల్ని బలవంతంగా లేవదీసి ఇంటికి తీసుకువచ్చాడు గోపినాద్.

మర్నాడు ఉదయం తణుకు మిత్రబృందం వెళ్ళిపోయారు. గోపినాద్ వారం రోజులు భయం భయం గానే ఉన్నాడు, మావయ్య పిలిచి తిడతాడేమోనని. కానీ ఏం జరగలేదు. గోపినాద్ రోజూ బస్సు మీద తణుకు కాలేజీకి వెళ్లివస్తున్నాడు. రెండు నెలలు గడిచాకా ఒకరోజు హరనాద్” అత్తిలి లో భోగం మేళం ఉంది వచ్చే ఆదివారం. సుధాకర్ వాళ్ళ మావయ్య షష్ఠి పండుగకు పెట్టిస్తున్నాడు. స్వర్ణ వస్తోందిట. ”అన్నాడు నవ్వుతూ.

గోపినాద్ ఏం మాట్లాడలేదు. కానీ ఆదివారం మిత్రులతో కలిసి అత్తిలి వెళ్ళాడు. ఎందుకో స్వర్ణ ని మళ్ళీ ఒకసారి చూడాలని అనిపించింది.

ఉదయమే గుడి ముందరున్న పందిట్లో ఒకసారి నృత్యాలు జరిగాయి. వాళ్లకు భోజనాలు సుధాకర్ వాళ్ళ మావయ్య ఇంట్లో ఏర్పాటు చేసారు. సుధాకర్ మిత్రులు కూడా వడ్డనలో పాల్గొన్నారు. గోపినాద్ స్వీట్ వడ్డిస్తూ స్వర్ణ ని ‘బాగున్నావా?’ అని నెమ్మదిగా అడిగాడు. తలెత్తి చూసిన స్వర్ణ గోపినాద్ ని గుర్తుపట్టి నవ్వింది. సాయంత్రం ఒక గంటసేపు వాళ్ళ నృత్యాలు చూసి తణుకు వెళ్ళిపోయారు.

ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం పరీక్షలు ఐపోయాయి. గోపినాద్, సుధాకర్ ద్వారా స్వర్ణ వివరాలు తెలుసుకున్నాడు. స్వర్ణ ది పెద్దాపురం అని, రత్నమాల బృందములో ఉంటోందని.

వేసవి సెలవులలో సుధాకర్ ని తీసుకుని పెద్దాపురం వెళ్ళాడు గోపినాద్. రత్నమాల సుధాకర్ ని ఆదరంగా ఆహ్వానించింది. కుశలప్రశ్నలు అయ్యాక ”ఖాళీగా ఉంటున్నాం. ఏదైనా పెళ్లిళ్లకు మా ప్రోగ్రాం పెట్టించమని మీ మావయ్య గారికి చెప్పండి బాబూ”అని “స్వర్ణా రెండు కాఫీలు తేవే. అబ్బాయిలు వచ్చారు” అంది రత్నమాల. కాసేపటికి రెండు కప్పులలో కాఫీ తెచ్చింది స్వర్ణ. గోపినాద్ ని చూసి ఆశ్చర్యపోయింది. రత్నమాల చూడకుండా అతనికేసి చూసి నవ్వింది స్వర్ణ. ఆ నవ్వు చూడగానే ప్రయాణ బడలిక అంతా

మర్చిపోయాడు గోపినాద్. పది నిముషాలు ఉండి బయల్దేరారు సుధాకర్, గోపినాద్.

******

ఇంటర్మీడియట్ పూర్తి కాగానే తణుకు కాలేజీలోనే డిగ్రీ లో చేరారు గోపినాద్ మిత్రబృందం. మళ్ళా షష్ఠి పండుగకు అత్తిలిలో రత్నమాల బృందం నృత్యం ఏర్పాటు చేసాడు సుధాకర్ వాళ్ళ మావయ్య. గోపినాద్ మిత్రులతో కలిసి అత్తిలి వెళ్ళాడు. రత్నమాల బృందంలో మరో ఇద్దరు కొత్త అమ్మాయిలు చేరారు. జనం వాళ్ళ చుట్టూ తిరగడం మొదలుపెట్టారు. భోజనాలు చేసి, వాళ్ళ బసకు వెళ్ళేటప్పుడు స్వర్ణ ని పలకరించాడు గోపినాద్.

”మీరు ఏం చేస్తారు?”అడిగింది స్వర్ణ చిన్నగా నవ్వుతూ. వెన్నెల కురిసినట్టున్న

ఆ నవ్వుకు పులకించిపోయాడు గోపినాద్. తణుకు లో డిగ్రీ చదువుతున్నానని చెప్పాడు. ’బాగా చదువుకుని మంచి ఉద్యోగం చేయండి’ అని చెప్పి వెళ్ళింది స్వర్ణ. ఆమె తనతో మాట్లాడినందుకు ఎవరెస్ట్ శిఖరం ఎక్కినంత ఆనందం పొందాడు గోపినాద్.

రెండేళ్ళు గిర్రున తిరిగాయి. గోపినాద్ డిగ్రీ ఆఖరి సంవత్సరం చదువుతున్నాడు. సంక్రాంతి సెలవులలో సుధాకర్ ని తీసుకుని మరలా పెద్దాపురం వెళ్ళాడు. రత్నమాల ఇంటి దగ్గర లేదు. స్వర్ణ ఒకత్తే ఉంది. సుధాకర్ ‘నేను పది నిముషాలలో వస్తాను. నువ్వు మాట్లాడు’ అని బయటకు వెళ్ళిపోయాడు.

స్వర్ణ హుషారుగా లేదు. గ్రహణం పట్టిన చందమామలా ఉంది ఆమె మొహం.

“ఏమయింది?ఎందుకు అలా ఉన్నావ్?” ఆందోళనగా అడిగాడు గోపినాద్. శ్రావణ మేఘంలా ఆమె కళ్ళు ధారగా వర్షించాయి. గోపినాద్ ఆమె భుజం మీద చేయి వేసి ”బాధ పడకు. ఏం జరిగిందో చెప్పు” అన్నాడు అనునయంగా. రెండు నిముషాలకు కళ్ళు తుడుచుకుంది స్వర్ణ. గోపినాద్ కేసి సూటిగా చూసి ”నన్ను ఈ నరకం నుంచి తీసికెళ్ళిపొండి. నన్ను ఎవరో జమిందారుకి అమ్మేయాలని చూస్తోంది మా పెద్దమ్మ. నన్నుమీతో తీసుకెళ్తారా?” బేలగా అడిగింది స్వర్ణ.

గోపినాద్ ఖిన్నుడైపోయాడు ఆమె మాటలకు. తనే ప్రస్తుతం మేనమామ దయా ధర్మాల మీద బతుకుతున్నాడు. ఇంకా డిగ్రీ పూర్తి కాలేదు. చదువు అవ్వాలి, ఉద్యోగం రావాలి. అప్పుడు కానీ తను స్వతంత్రుడు కాలేడు. ”ఒక్క నాలుగు నెలలు ఓపిక పట్టు. నా పరీక్షలు కాగానే ఏదో ఉద్యోగం చూసుకుంటాను. అప్పుడు వచ్చి నిన్ను తీసుకువెళ్తాను” అన్నాడు గోపినాద్. ఆమె అతనికేసి మౌనంగా చూసింది.

కొద్దిసేపటికే సుధాకర్ వచ్చాడు. రెండు నిముషాలు ఉండి వచ్చేశారు గోపినాద్, సుధాకర్. స్వర్ణ గుమ్మం దగ్గరే నిలబడి వీడ్కోలు గా చెయ్యి ఊపింది. యాంత్రికంగా చెయ్యి ఊపాడు గోపినాద్.

దారిలో సుధాకర్ అడిగాడు ‘ఏం ఇద్దరూ అలా ఉన్నారు?’అని. జరిగిన విషయం చెప్పాడు గోపినాద్.

”వాళ్ళలో ఇవి మామూలే. కొందరు డబ్బున్న వాళ్ళ అండ దొరకగానే వారితో వెళ్ళిపోతారు.

కొంతమందిని వాళ్ళ పెద్దవాళ్లే ఇలా డబ్బులకు ఆశపడి ‘పెళ్లి’ పేరుతొ అమ్మాయిల్ని అమ్మేస్తారు. ఐతే వీరిలో కొంతమంది జీవితాలు సజావుగా సాగితే, మరికొందరివి నరకంగా మారిపోతాయి. ఇంక మూడోరకం వాళ్ళు జీవితాంతం ఇలా నృత్యాలు చేస్తూ, బృందాల్ని ఏర్పాటు చేసుకుంటూ జీవితాల్ని గడిపేస్తారు. కానీ స్వర్ణని అంత తేలిగ్గా రత్నమాల వదులుకోదు. బంగారు గుడ్లు పెట్టె బాతు కదా” గంభీరంగా చెప్పాడు సుధాకర్.

ఇద్దరూ తణుకు వచ్చారు. ఆ రాత్రి అంతా నిద్ర లేకుండానే గడిపాడు గోపినాద్. ఏమైనా సరే, డిగ్రీ పూర్తి కాగానే సుధాకర్ ద్వారా ఏదో ఉద్యోగం చూసుకుని స్వర్ణని తన దగ్గరకు

తెచ్చుకుని పెళ్లి చేసుకోవాలి అని గట్టిగా నిర్ణయించుకున్నాడు గోపినాద్.

డిగ్రీ పరీక్షలు పూర్తి అయ్యాయి. సుధాకర్ వాళ్ళ మావయ్య పలుకుబడితో తణుకులోనే టెక్స్ టైల్స్ ఫ్యాక్టరీ లో చిన్న ఉద్యోగంలో చేరాడు గోపినాద్. ఒక నెల గడిచాకా సుధాకర్ ని తీసుకుని పెద్దాపురం రత్నమాల ఇంటికి వచ్చాడు. కుశల ప్రశ్నలు అయ్యాక ”ఇతను గోపినాద్. నా స్నేహితుడు చాలా బుద్ధిమంతుడు. డిగ్రీ చదివి తణుకులోనే ఉద్యోగం చేస్తున్నాడు. మీ స్వర్ణ ని పెళ్ళిచేసుకోవాలని అనుకుంటున్నాడు. ” అన్నాడు సుధాకర్.

“మొన్న ఫిబ్రవరి నెలలోనే రాఘవపురం జమిందారు గారితో స్వర్ణ పెళ్లి అయిపొయింది” అంది నర్మగర్భంగా నవ్వుతూ రత్నమాల. ఆమె మాటలకు నివ్వెరపోయాడు గోపినాద్. గొంతుక తడారిపోయి ఆమెకేసి అలా చూస్తూ ఉండి పోయాడు. గుండెల్లో ఏవేవో భయంకరమైన ధ్వనులు. రెండు నిముషాలు రత్నమాల తో మాట్లాడి స్నేహితుడిని తీసుకుని బయటకు వచ్చేసాడు సుధాకర్.

తణుకు వచ్చాక చెప్పాడు సుధాకర్. స్వర్ణ కి పెళ్లి అయిన సంగతి తనకు తెలిసిందని, కానీ ఆ విషయం చెబితే నువ్వు పరీక్షలు సరిగా రాయవని చెప్పలేదని. ఆ రాత్రి స్వర్ణ ఆలోచనలతో నిద్ర లేకుండా గడిపాడు గోపినాద్.

స్వర్ణతో తన జీవితాన్ని ఎంతో సుందరంగా ఊహించుకున్న కలలన్ని కల్లలు అయ్యాయని చాలా బాధపడ్డాడు. డిగ్రీ రిజల్ట్స్ రాగానే పట్టుదలతో బ్యాంకు టెస్ట్ లు కట్టి గుమాస్తాగా సెలెక్ట్ అయ్యాడు గోపినాద్. తర్వాత రెండేళ్లకు వసంతతో వివాహం జరిగింది. అబ్బాయి పుట్టాడు. హెడ్ కేషియర్ గా కాకినాడ బదిలీ అయ్యింది. ఒక రోజు సాయంత్రం మసీద్ సెంటర్ లో సరుకులు కొనుక్కుని స్కూటర్ ఎక్కబోతుంటే ఒకావిడ వచ్చి “బాగున్నారా?” అని పలకరించింది.

ఎక్కడో చూసినట్టుంది కానీ ఎవరో గుర్తు రాలేదు. ఆ మాటే ఆమెతో అన్నాడు. ఆవిడ చిన్నగా నవ్వింది. ’నేనండి. రాగిణి ని. స్వర్ణ స్నేహితురాలిని, మీ ఊరు శివపురం వచ్చాను. ” అంది. అప్పుడు జ్ఞాపకం వచ్చింది గోపినాద్ కి. తన బుగ్గలు సాగదీసి ఏడిపించిన సుందరి ఈమే

నని. చిన్నగా నవ్వాడు. “ఈ పక్క సందులోనే మా షాప్ ఉంది. ఒకసారి రండి. ”అంది రాగిణి. స్కూటర్ తాళం వేసి ఆమె వెనకాలే వెళ్ళాడు గోపినాద్.

రెండు నిముషాలలో ఒక చిన్న ఫాన్సీ షాప్ ముందు ఆగి ‘రండి’ అంది రాగిణి. షాప్ లో ఉన్న అమ్మాయి లోపలకు వెళ్ళిపోయింది. స్టూల్ మీద కూర్చున్నాడు గోపినాద్.

‘మీరు ఏం చేస్తున్నారని?’అడిగింది రాగిణి

. ’ఇక్కడే బ్యాంకు లో హెడ్ కేషియర్ గా పనిచేస్తున్నాను’ అని ‘స్వర్ణ ఎలా వుంది?ఎక్కడ వుంది?’ ఆతృతగా అడిగాడు గోపినాద్. స్వర్ణ ప్రస్తావన రాగానే రాగిణి కళ్ళల్లో

నీళ్ళు గిర్రున తిరిగాయి. చీర చెంగుతో కళ్ళు తుడుచుకుంది.

’నేను రత్నమాల పంజరం నుంచి తప్పించుకున్నాను గానీ, స్వర్ణ తప్పించుకోలేక పోయింది. స్వర్ణ మీ మీద చాలా ఆశలు పెట్టుకుంది. మీరు వస్తారని, తనని మీతో తీసుకువెళ్తారని. మీరు సుధాకర్ గారు వచ్చి వెళ్ళాకా రత్నమాల లో కంగారు ఎక్కువయ్యింది. స్వర్ణ తన చేతిలోంచి ఎక్కడ జారి పోతుందోనని హడావిడిగా రాఘవపురం జమిందార్ తో పెళ్లి జరిపించేసింది మా వూరి గుడిలో. అందుకు రత్నమాలకు ఏభై వేల రూపాయలు ఇచ్చాడు, జమిందార్. అప్పటికే ఆయనకు పెళ్లి అయ్యింది, ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఒక నెల బాగా చూసుకున్నాడు స్వర్ణ ని. ఆ తర్వాత ఆమెని చిత్రహింసలు పెట్టాడు. సిగరెట్ కాల్చి వళ్ళు అంతా వాతలు పెట్టేవాడు. నువ్వు ఎవరెవరితోనో తిరిగి నా దగ్గరకు చేరావు అనేవాడు. నీ మీద నాకు మోజు తీరిపోయింది, నిన్ను బొంబాయి తీసుకెళ్ళి అమ్మేస్తాను అని బెదిరించే వాడు.

ఒకసారి పెద్దాపురం వచ్చి నప్పుడు నాకు చెప్పి బాధపడింది. అదే స్వర్ణ ని ఆఖరిసారి చూడడం. తర్వాత నెల రోజులకే తను ఫ్యాన్ కి ఉరి వేసుకుని చనిపోయింది’ రాగిణి కళ్ళమ్మట కన్నీళ్ళు జల జలా రాలాయి.

గోపినాద్ కి తన గుండెని ఎవరో బలంగా నొక్కిపెట్టిన బాధ కలిగింది. నిస్తేజంగా రాగిణి కేసి చూసాడు. మంచినీళ్ళ గ్లాసు అతనికి అందించింది రాగిణి. మౌనంగా నీళ్ళు తాగి కళ్ళజోడు తీసి కళ్ళు తుడుచుకున్నాడు. అతని కళ్ళు తడిగా ఉండడం గమనించింది రాగిణి. తను పెద్దాపురంనుంచి పారిపోయి వచ్చి ఇక్కడ ఉంటున్న గుర్నాధాన్ని పెళ్లి చేసుకున్నానని చెప్పింది రాగిణి. ఐదు నిముషాలు ఉండి భారంగా వెనుదిరిగాడు గోపినాద్.

సెంటర్ కి వచ్చి స్కూటర్ తీసుకుని ఇంటికి వచ్చాడు గోపినాద్. రాత్రి అంతా స్వర్ణ జ్ఞాపకాలతో నిద్రకు దూరమయ్యాడు. ‘నన్ను మీతో తీసికెళ్ళండి’ అని బేలగా అడిగిన స్వర్ణ ముఖమే పదే పదే గుర్తుకు వస్తోంది.

మరునాడే మావగారి నుండి కబురు, వసంతకి అమ్మాయి పుట్టిందని. అప్పుడే ఒక నిర్ణయానికి వచ్చాడు. కాల చక్రం గిర్రున తిరిగింది. గోపినాద్ ఉద్యోగంలో అంచెలంచులుగా ఎదిగి రీజనల్ మేనేజర్ గా రిటైర్ అయ్యాడు. కొడుకు కోడలు డిల్లి లో ఉంటారు. కూతురు అల్లుడు బెంగుళూరు లో ఉంటారు. ఆరు నెలలు కొడుకు దగ్గర, ఆరు నెలలు కూతురు దగ్గర ఉంటున్నారు గోపినాద్, వసంత.

ప్రస్తుతం బెంగుళూరు లో కూతురు దగ్గర ఉంటున్నాడు. మావయ్య, అత్తయ్య చనిపోయారు. శివపురం లో ఎవరూ లేరు. ఐనా పాత జ్ఞాపకాలు నెమరు వేసుకోవాలని శివపురం వచ్చాడు. కూతురు నుండి ఫోన్ రావడంతో, గతం లోంచి వాస్తవం లోకి వచ్చాడు గోపినాద్. ”నాన్నా, ఉదయం నుంచి ఫోన్ చేయలేదు నువ్వు. అమ్మ కంగారు పడుతోంది. క్షేమంగా చేరావా? శివపురం వెళ్ళావా? మీ ఫ్రెండ్స్ ఎవరైనా కలిసారా?” ప్రశ్నల వర్షం కురిపించింది కూతురు.

“ఆ బాగానే చేరానమ్మా. శివపురం వచ్చి దైవదర్సనం చేసుకున్నాను. ఫ్రెండ్స్ ని ఇంకా కలవలేదు. పనులు చూసుకుని సాయంత్రం మళ్ళీ శేషాద్రి కే వస్తాను. ”అన్నాడు గోపినాద్.

“జాగ్రత్త నాన్నా. టైం కి భోజనం చేసి టాబ్లెట్లు వేసుకో. మినరల్ వాటరు తాగు. బై” అంది కూతురు.

“అలాగే అమ్మా. నువ్వు చెప్పినట్లే చేస్తాను” అన్నాడు గోపినాద్ నవ్వుతూ. కూతురు రూపం కళ్ళ ముందు కదలాడింది. ఆమె పేరు “స్వర్ణ లత”.

***శుభం***ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

https://linktr.ee/manatelugukathalu

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


మనతెలుగుకథలు.కామ్ లో రచయిత ఇతర రచనలు :

ముత్యాలరావు – ముంజికాయలు

స్వర సంగమం

నాన్న ..ఒంటరి

నా మార్గం

గురు దక్షిణ

నవరాత్రి ముచ్చట్లు

రచయిత పరిచయం : సత్యనారాయణ మూర్తి M R V

ఎమ్. ఆర్. వి. సత్యనారాయణ మూర్తి. పెనుగొండ. పశ్చిమ గోదావరి జిల్లా. కవి, రచయిత, వ్యాఖ్యాత, రేడియో ఆర్టిస్టు. కొన్ని కథల పుస్తకాలు, కవితల పుస్తకాలు ప్రచురితం అయ్యాయి. కొన్ని కథలకు బహుమతులు కూడా వచ్చాయి. రేడియోలో 25కథలు ప్రసార‌మయ్యాయి. 20 రేడియో నాటికలకు గాత్ర ధారణ చేసారు. కవితలు, కథలు కన్నడ భాషలోకి అనువాదం అయ్యాయి.


188 views0 comments
bottom of page