top of page

ముత్యాలరావు – ముంజికాయలు


'Muthyalarao - Munjikayalu' written by M R V Sathyanarayana Murthy

రచన : M R V సత్యనారాయణ మూర్తిస్కూళ్ళకి వేసవి సెలవలు ఇచ్చేసారు. మా సావాసగాళ్ళకి ఏం తోచడంలేదు. లైబ్రరీకి వెళ్లి పుస్తకాలు చదివే మంచి బుద్ధులు ఎవరికీ లేవు. నగరేశ్వర స్వామి గుడిలోని బాదం చెట్టు కింద కూర్చుని కబుర్లు చెప్పుకోవడం తప్ప పెద్దగా కాలక్షేపం ఏమీ లేదు. నేనూ,హరనాద్,కొండవేటి అయ్యన్న,గాంధి ఉన్నాం. “ఈ కబుర్లు ఏవో మా పొలం దగ్గర చెరువుగట్టున చెప్పుకొందాం. చల్లగా కూడా ఉంటుంది” అన్నాడు అయ్యన్న. “ఆ..అయ్యన్న పొలం వెళ్దాం.మామిడికాయలు ఉంటాయ్” కళ్ళు పెద్దవి చేసి ఆనందంగా అన్నాడు గాంధీ. “రెండురోజుల క్రితమే కాయలన్నీ కోసేసి పచ్చడి పెట్టేసారు. మీ అదృష్టం బాగుంటే కొద్దిగా ఉంటాయేమో”అన్నాడు అయ్యన్న. నలుగురం బయల్దేరి అయ్యన్న పొలం వెళ్లాం. పెనుగొండ-మార్టేరు దారిలో ఉద్దగిరి వారి రైస్ మిల్ దాటాకా ఉంది అయ్యన్న పొలం. నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్లాం. పొలానికి ముందుగానే చెరువు. చెరువుగట్టుమీద మామిడి,కొబ్బరి చెట్లు ఉన్నాయి. చల్లగా ఉంది వాతావరణం. గాంధీ ఆతృతగా మామిడిచెట్ల కేసి చూసాడు. చాలా కొద్దిగా, అవీ చాలా ఎత్తున ఉన్నాయి మామిడికాయలు. గాంధీ అయ్యన్న వైపు చూసాడు. వాడి చూపు అర్ధం గ్రహించిన అయ్యన్న చెట్టు ఎక్కి నాలుగు కాయలు కోసి కిందకు వేస్తే హరనాద్ ఒడుపుగా పట్టుకున్నాడు. కబుర్లు చెప్పుకుంటూ నాలుగు మామిడికాయలు తినేశాం. చెట్టుకు ఆనుకుని కూర్చున్న గాంధీ హిందీ సినిమాలోని పాట ఈలవేస్తూ పాడాడు. ఈలోగా ముత్యాలరావు ఒగుర్చుకుంటూ వచ్చాడు.”మీరు అయ్యన్న పొలంకేసి వెళ్ళారని గుడిలో పనిచేసే సోమరాజు చెప్పాడు”అన్నాడు ముత్యాలరావు. “నువ్వు ఆలస్యంగా వచ్చావ్.ఇప్పుడే మామిడికాయలు తిన్నాం”అన్నాడు గాంధీ ఉడికిస్తూ. “పోనీలే మామిడికాయలు అయిపోతే ముంజికాయలు తినవచ్చు. ఏరా అయ్యన్నా?”అన్నాడు ముత్యాలరావు. అయ్యన్న చుట్టూచూసి “పాలేరు వెళ్ళిపోయినట్టున్నాడు”అన్నాడు. “పాలేరు లేకపోతే, నువ్వు తాడిచెట్టు ఎక్కి రెండు గెలలు కొడితే అందరం ముంజలు తింటాం” అన్నాడు ముత్యాలరావు. గాంధీ ‘అవునవును’ అన్నాడు. “నాకు తాడిచెట్టు ఎక్కడం రాదు. మీలో ఎవరైనా ఎక్కుతానంటే పాకలో కొడవలి ఉంది. ఇస్తాను” అన్నాడు అయ్యన్న.

” రైతుబిడ్డవి నీకు తాడిచెట్టు ఎక్కడం రాదా?”అని నవ్వాడు ముత్యాలరావు. అయ్యన్న కి కోపం వచ్చింది. “పెద్ద మొనగాడివి, నువ్వు ఎక్కు తాడిచెట్టు” అంటూ ముత్యాలరావు కి సవాల్ విసిరాడు అయ్యన్న.

“వాడు బామ్మర్ల అబ్బాయి కదా, ఆడేం ఎక్కుతాడు?”అంటూ నవ్వాడు హరనాద్. ముత్యాలరావు కి పౌరుషం వచ్చింది. వెంటనే ‘అయ్యన్నా, నువ్వు కొడవలి పట్టుకురా. నేను చెట్టు ఎక్కి గెల కొడతాను”అన్నాడు ముత్యాలరావు. అయ్యన్న పశువుల పాకలోకి వెళ్లి కొడవలి పట్టుకుని వచ్చాడు. ఐదుగురం చెరువుగట్టు మీదనుంచి దిగి పొలంలో నడుచుకుంటూ దగ్గరలో ఉన్న తాడిచెట్టు దగ్గరకు వెళ్లాం. మిగతా చెట్లకన్నా అదే చిన్న చెట్టు. కాలికి బంధంగా గాంధీ పొడుగు చేతుల చొక్కాని తాడులా మెలితిప్పి కాలికి వేసుకుని తాడిచెట్టు ఎక్కాడు ముత్యాలరావు. వాడి ధైర్యానికి, చొరవకి మేము అందరం ఆశ్చర్యపోయాం. కొడవలి నోటితో కరిచి పట్టుకుని చక చకా ఎక్కి రెండు ముంజికాయల గెలలు కొడవలితో కొట్టాడు. తర్వాత కొడవలి కింద పడేసాడు. ముత్యాలరావు కి మామిడి చెట్టు, సపోటాచెట్టు ఎక్కడం తెలుసు కానీ, తాడిచెట్టు ఎక్కడం ఇదే ప్రధమం. మిత్రుల మాటకు పౌరుషం వచ్చి ఎక్కేడే గాని లోలోపల భయపడుతూనే ఎక్కాడు. నెమ్మదిగా దిగాడు ముత్యాలరావు. అందరం వాడిని అభినందించాం. రెండు గెలలు పట్టుకుని చెరువుగట్టుకు వచ్చాం. అయ్యన్న కొడవలితో ముంజి కాయలు కోసి అందరికీ ఇచ్చాడు. ఐదుగురం తృప్తిగా ముంజికాయలు తిన్నాం. కాసేపు విశ్రాంతి తీసుకుని మళ్ళీ గుడి దగ్గరకు వచ్చి అక్కడినుంచి ఎవరింటికి వాళ్ళం వెళ్ళిపోయాం. ***** మర్నాడు పొద్దున్నే ముత్యాలరావు మా ఇంటికి వచ్చాడు. గుడి దగ్గరకు వెళ్దాం రమ్మనమని పిలిచాడు. గుడి వెనుక వున్న చిన్న గోపురం దగ్గర కూర్చున్నాం ఇద్దరం. ‘సత్తిపండు, కొంప మునిగిందిరా. నిన్న తాడిచెట్టు ఎక్కడం వలన చాలా పెద్ద గాయం అయ్యిందిరా’అని చొక్కా బొత్తాములు విప్పి చూపించాడు. పొట్ట పైన, చాతీ పైన చర్మం రేగిపోయి ఎర్రగా అయిపొయింది. నాకు చాలా భయం వేసింది. ‘మీ ఇంట్లో చెప్పావా?’ అడిగాను నేను.

‘చాలు చాల్లే. తాడిచెట్టు ఎక్కానని చెబితే మా నాన్న బెల్టు తీసుకుని బాదేస్తాడు’ అన్నాడు కళ్ళ నీళ్ళు పెట్టుకుంటూ. గాయం చాలా పెద్దది. అక్కడక్కడ రక్తం చారలు కూడా వున్నాయి. ఐదు నిముషాలు ఆలోచించి, చాట్రాదివారి వీధిలో ఉండే ఆర్.ఎం.పి. సూర్యారావు గారి దగ్గరకు తీసుకువెళ్లాను వాడిని. ఆయన మా ఫ్యామిలీ డాక్టర్. నన్ను చూడగానే ‘ఏం సత్తిపండు? పొద్దున్నే ఇలా వచ్చావ్?” అని అడిగారు. “వీడు నా ఫ్రెండ్ ముత్యాలరావు. చిన్న దెబ్బ తగిలింది. కొంచం మందు వేస్తారని వచ్చాను” అని వాడిని ముందుకు తోసాను. ముత్యాలరావు చొక్కా విప్పి గాయం చూపించాడు. అది చూసి ఆయన ఆశ్చర్యపోయి, ’ఏం జరిగిందని?’ అడిగాడు. ముంజికాయల కోసం తాడిచెట్టు ఎక్కాడని, పొట్ట చాతీ చీరుకు పోయిందని చెప్పాను నేను. “నిజంగా ముంజికాయల కోసమేనా, కల్లు కోసం ఎక్కావా? నువ్వు వెంకటేశ్వర్లు గారి అబ్బాయివి కదూ?” అడిగారు సూర్యారావు గారు. అవునన్నట్టు తలూపాడు ముత్యాలరావు. ఆయన స్పిరిట్ దూదిలో ముంచి గాయం శుభ్రంచేసారు. ఆ మంట భరించలేక ఎడ్చేసాడు వాడు. “ఏమయ్యా పంతులూ, ముంజికాయలు కావలిస్తే కొనుక్కోవాలి, లేదా ఎవరినైనా కాయలు తీసి పెట్టమని అడగాలి. అంతేకానీ, పెద్ద వీరుడిలా నడుముకి పగ్గం లేకుండా తాడిచెట్టు ఎక్కుతావా? సినిమా హీరోననుకుంటున్నావా? ఇది తగ్గడానికి వారం రోజులు పడుతుంది. చీము పట్టేవి తినకు. గాయాన్ని తడవనీయకు” అని ఆయింటుమెంటు రాసారు. తర్వాత ఆ ఆయింటుమెంటు పేరు చీటీమీద రాసి ఇది కొనుక్కుని రోజూ రెండుపూటలా గాయం మీద రాయి” అని చెప్పారు. ఇద్దరం ఆయనకు థాంక్స్ చెప్పి బయటకు వచ్చాం. నేనే మెడికల్ షాప్ కి వెళ్లి ఆయింటుమెంట్ కొని వాడికి ఇచ్చాను. జాగ్రత్తలు చెప్పి వాడిని ఇంటిదగ్గర దింపి వచ్చాను.

సాయంత్రం అందరంచినగోపురం దగ్గర సమావేశం అయ్యాం. అయ్యన్న, హరనాద్, గాంధీ అందరూ వాడిని పలకరించారు, బాధపడ్డారు.

”నేను అనవసరంగా నిన్ను చెట్టుఎక్కమని సవాల్ విసిరాను”అని కళ్ళనీళ్ళు పెట్టుకున్నాడు అయ్యన్న.

“అదేం లేదులే.నాకు అలవాటులేని పని చేయడం నాదే తప్పు. ముంజికాయల గెల కొట్టేక కిందకు చూసాను. అప్పుడు భయం వేసింది. అందుకే దిగేటప్పుడు తాడిచెట్టుని కౌగలించుకుని కిందకు దిగాను. చెట్టు బాగా గరుకుగా ఉంటుంది కదా. అందుచేత బాగా గీరుకుపోయింది” అన్నాడు ముత్యాలరావు. మిత్రులు వాడికి ధైర్యం చెప్పారు. “కానీ ఇంటి దగ్గర చిక్కొచ్చి పడింది. ఈరోజు మా అమ్మ కొబ్బరి సెనగపప్పు కూర,పెసరపప్పు పులుసు పెట్టింది. మా అమ్మ చూడకుండా కూర మా తమ్ముడి కంచంలో వేసి వాడిని బతిమాలాను తినమని. కొద్దిగా పులుసు వేసుకుని మజ్జిగ అన్నం తిన్నాను” అన్నాడు నీరసంగా. అయ్యన్న వెంటనే లేచి కామాక్షి గుడిదగ్గర ఉన్న సుబ్బారావు మిఠాయి కొట్టుదగ్గరకు వెళ్లి గోధుమపిండితో చేసిన పంచదార కొమ్ములు తెచ్చాడు. అవి తిని కొంచం తేరుకున్నాడు ముత్యాలరావు. “ఆయింటుమెంటు ఒక్కటే కాకుండా ఏవైనా టాబ్లెట్లు గాని కాప్సుల్స్ కానీ వేసుకుంటే గమ్మున తగ్గుతుంది. ఆ మధ్యన నాకు కాలికి దెబ్బ తగిలితే డాక్టర్ రాజు గారు నాకు కాప్సుల్స్ రాసారు. అవి వాడితే తొందరగా గాయం మాడిపోయింది. ఆ మందుల చీటీ కనిపిస్తుందేమో చూస్తాను “ అన్నాడు హరనాద్. ఒక గంట సేపు కబుర్లు చెప్పుకున్నాం. పరీక్షల రిజల్ట్స్ వచ్చాక ఏ కాలేజీలో చేరాలా అని. ఏడుగంటలకు ఎవరి ఇంటికి వాళ్ళు వెళ్ళిపోయాం. మర్నాడు హరనాద్ డాక్టర్ రాజు రాసిన కాప్సుల్స్ పది కొని పట్టుకుని వచ్చాడు. గాంధీ సుబ్బారావు కొట్టు దగ్గరనుంచి బెల్లం గవ్వలు కొని పట్టుకువచ్చి ముత్యాలరావుకి ఇచ్చాడు. వారం రోజుల్లో ముత్యాలరావు గాయం చాలా భాగం తగ్గిపోయింది. ఈ వారం రోజుల్లో ముత్యాలరావు అమ్మగారు చేసిన మైసూరుపాకు, జంతికలు వాళ్ళ తమ్ముడికి త్యాగం చేయాల్సివచ్చింది ముత్యాలరావు. అలాగే స్నానానికి అందరికంటే ముందుగా పెందరాళే లేచి, మొహం, కాళ్ళు,చేతులు కడుక్కుని వచ్చేవాడు ముత్యాలరావు. అయితే చివర్లో ఒక విచిత్రం జరిగి ముత్యాలరావు గుట్టు బయటపడింది. వెంకటేశ్వర్లు గారు ఒకరోజు బజారులో వెళుతుంటే,ఆర్.ఎం.పి.సూర్యారావు గారు ఆయన్ని ఆపి ”మీ అబ్బాయికి గాయం తగ్గిపోయిందా?” అని అడిగారు.

‘మా అబ్బాయికి దెబ్బ తగలడమేమిటి?’ అని ఆశ్చర్యంగా అడిగారు వెంకటేశ్వర్లు గారు.

“అయితే మీకు తెలియదా? వారం క్రితం సుబ్రహ్మణ్యం గారి అబ్బాయి సత్తిపండు, మీ వాడిని నా దగ్గరకు తీసుకువచ్చాడు. మీ వాడు తాడిచెట్టు ఎక్కితే పొట్ట, చాతీ గీరుకుపోయి గాయం అయ్యింది. నేను మందు రాసి పంపించాను. ఏమిటో? భలే పిల్లలు. భలే తల్లితండ్రులు” అని సూర్యారావు గారు వెళ్ళిపోయారు.

ఆయన మాటలకు ఆగ్రహోదగ్రులైన వెంకటేశ్వర్లు గారు ఇంటికి వెళ్లి ముత్యాలరావు చొక్కా విప్పి చూసి, నడ్డి మీద నాలుగు వడ్డించడం, వాళ్ళ అమ్మగారు అడ్డుకుని వాడిని రక్షించడం జరిగింది. “అందుకా, వీడు వారం నుంచి సరిగ్గా తినకుండా ఉంటున్నాడు” అని వాడి గాయం చూసి "ఎంత దెబ్బ తగిలిందిరా నాయనా, నాకు కూడా ఎందుకు చెప్పలే"దని కళ్ళనీళ్ళు పెట్టుకుని, వంటింట్లోకి తీసుకువెళ్ళి డబ్బాలోంచి రెండు పూతరేకులు తీసి పెట్టడం చూసి “హూ..నీ గారమే వాడిని ఇలా చేసింది” అని కోపంగా వీధిలోకి వెళ్ళిపోవడం జరిగింది. ఆ సంఘటన తర్వాత వెంకటేశ్వర్లు గారు కొడుకుతో నెల్లాళ్ళు మాట్లాడలేదు. అయితే ముత్యాలరావు తాడిచెట్టు ఎక్కడం ముంజికాయల కోసం కాదని కల్లు కోసమేనని, వాడి స్నేహితులు అందరూ రాలుగాయలే నని కొంతమంది తీర్మానించారు. బ్రాహ్మలు ధైర్వవంతులేనని ముత్యాలరావు నిరూపించాడని మరి కొందరు వాదించారు. ఇదంతా సూర్యారావు గారు కనిపించిన వాడికల్లా ముత్యాలరావు వీరోచితగాధ వర్ణించి, వర్ణించి చెప్పడమే నని హరనాద్, గాంధీ గ్రామంలో గూఢచర్యం చేసి కనిపెట్టారు. ఇది ఎంత వరకూ వెళ్లిందంటే ముత్యాలరావు ఉద్యోగస్తుడై పెళ్ళికి తయారుగా ఉన్నప్పుడు, పెళ్ళిళ్ళ శాస్త్రి గారు అమలాపురం నుంచి ఒక సంబంధం తీసుకువచ్చారు.

పెళ్లి మాటలు మాట్లాడుతూ, ’మా ముత్యం చాలా సాహసం కలవాడండి. మీ కోనసీమ కొబ్బరిచెట్టే కాదు, తాడిచెట్టు కూడా అవలీలగా ఎక్కేస్తాడు’ అని కితాబు ఇచ్చాడు.

’బ్రాహ్మడు అయ్య్యుండి, తాడిచెట్టు ఎక్కడ మేమిటి? ఇదేదో తిరకాసు సంబంధంలా ఉందని’ వాళ్ళు తిరుగు టపా పోస్ట్ కార్డు లా వెంటనే వెనక్కి వెళ్ళిపోయారు. చివరకి హైదరాబాద్ లోనే వాళ్ళ ఆఫీస్లో పనిచేసే సుప్రజతో వాడి పెళ్లి జరిగింది. వాళ్ళు కోత్తపేట బ్రాహ్మలే. ఇప్పుడు కూడా ముంజికాయలు చూస్తె మా ముత్యాలరావు వీరగాధ గుర్తుకొచ్చి మనసు కోటిపల్లి రేవులో పడవ ప్రయాణంలా పులకించిపోతుంది.

***శుభం***

మనతెలుగుకథలు.కామ్ లో రచయిత ఇతర రచనలు :

రచయిత పరిచయం : సత్యనారాయణ మూర్తి M R V

ఎమ్. ఆర్. వి. సత్యనారాయణ మూర్తి. పెనుగొండ. పశ్చిమ గోదావరి జిల్లా. కవి, రచయిత, వ్యాఖ్యాత, రేడియో ఆర్టిస్టు. కొన్ని కథల పుస్తకాలు, కవితల పుస్తకాలు ప్రచురితం అయ్యాయి. కొన్ని కథలకు బహుమతులు కూడా వచ్చాయి. రేడియోలో 25కథలు ప్రసార‌మయ్యాయి. 20 రేడియో నాటికలకు గాత్ర ధారణ చేసారు. కవితలు, కథలు కన్నడ భాషలోకి అనువాదం అయ్యాయి.


99 views0 comments

コメント


bottom of page