top of page

నవరాత్రి ముచ్చట్లు


'Navarathri Mucchatlu' written by M R V Sathyanarayana Murthy

రచన : M R V సత్యనారాయణ మూర్తి

మా పెనుగొండ , విజ్జేశ్వరం-నర్సాపురం కాలువ వడ్డునే వయ్యారాలు పోతూ పడుకున్న వనకన్యలా కిలో మీటర్ మేర ఉంటుంది. పది రైస్ మిల్లులు, రెండు ఫౌండ్రీలతో నిత్యం అందులో పనిచేసే కార్మికులతో ఊరంతా కళ కళ లాడుతూ ఉంటుంది.

మూడువేల సంవత్సరాల క్రితం వెలిసిన శ్రీ నగరేశ్వర స్వామి దేవాలయం, క్షేత్రపాలకుడు జనార్ధన స్వామి దేవాలయం మా ఊరికి ఎంతో కీర్తి తెచ్చాయని మా ఊరి పెద్దాయన సూర్యనారాయణ పంతులు గారు చెబుతా ఉంటారు. ఆ తర్వాత కోమట్ల ఇంట్లో పుట్టిన వాసవి కన్యకాపరమేశ్వరి వలన మా ఊరు మరింతగా ప్రఖ్యాతి చెందింది.

మా ఊర్లో కుర్రకారుకి దేవి నవరాత్రులు వచ్చాయంటే బోల్డు హడావిడి.పెద్దోళ్ళు అందరూ శివాలయం లో మహిషాసుర మర్ధని అమ్మవారికి, వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి పూజలు చేయించుకుంటారు. రాత్రి ఎనిమిది గంటలకు ప్రసాదాలు పెడతారు. ఆడపిల్లలు అందరూ గుడికి వచ్చి దాగుడు మూతలు ఆడుకుంటారు.ఆళ్ళని చూడటానికి, వీలైతే ఓ మాట కలపడానికి కుర్రకారు బెల్లం జీడి చుట్టూ మూగే ఈగల్లా వాలిపోతారు.

నగరేశ్వర స్వామి గుడి ఏభై స్తంభాలతో చూడ ముచ్చటగా ఉంటుంది. నవరాత్రులు తొమ్మిది రోజులూ రోజూ పూజలూ, అభిశేకాలు ఉంటాయి. ఆటితో పాటు జగన్నాధపురం సుబ్బారాయుడు గారు చేసే లింగార్చన మా పిల్లకాయలకు చాలా విచిత్రంగా ఉండేది. కాలవలోంచి మట్టిముద్ద తెచ్చి అంగుళం సైజులో చిన్న చిన్న స్తంభాలలా చేసి, ఒకో స్తంభానికి ఒకో బియ్యపు గింజ అద్ది నిలబెట్టేవోరు పంతులుగారు. చుట్టూ గుడిలా కట్టి అందులో శివలింగం ఉండేటట్లు మంత్రాలు చదువుతూ పేర్చేవారు.

మొత్తం అంతా పూర్తి అయ్యాకా ఆ శివలింగాన్ని పువ్వులతో పూజ చేసే వారు.ఇదంతా అయ్యేసరికి మూడు గంటలు పట్టేది. ఆ తర్వాత తీర్థం ఇచ్చి, చిన్న చిన్న పటిక బెల్లం ముక్కలు ప్రసాదంగా పెట్టేవారు. ప్రసాదం కోసం కాకుండా ఆయన ఆ మట్టిస్తంభాలతో కట్టే శివలింగం చూడటానికి నేనూ, హరనాద్, గాంధీ, భానుమూర్తి రోజూ పోద్దునే గుడికి వెళ్ళే వాళ్ళం.

ఆ తర్వాత సూర్యనారాయణ పంతులు గారు చేసే సూర్య నమస్కారాలు చూడటానికి మేం నలుగురం క్రమం తప్పకుండా వెళ్ళే వాళ్ళం.ఆరు అడుగుల పొడవు ఉండే పంతులు గారు చేసే నమస్కారాలు మాకు చాలా సరదాగా ఉండేవి. ప్రతి సారి నేలమీద పడుకుని నమస్కారం చేసి మళ్ళీ లేవడం చూసి ఆశ్చర్య పోయేవాళ్ళం. అన్ని సార్లు అలా పడుకుని లేవడం వలన కాళ్ళూ, చేతులూ నొప్పి పెట్టావా?అని మాకో ధర్మ సందేహం కలిగేది.ఈయన కూడా వరిపిండి తో సూర్యుడు బొమ్మ వేసి ఎర్రని పూలతో పూజ చేసే వారు. బొగ్గుల కుంపటి మీద ఆవు పాలతో పాయసం వండేవారు. పూజ అయ్యాకా తీర్థం ఇచ్చి మందార ఆకులో కొద్దిగా పాయసం పెట్టేవారు. పాయసం చాలా తియ్యగా ఉండేది.ఇంకొచెం

పెడితే బాగుండునని అనుకునేవాళ్ళం మేం నలుగురం. ఒక రోజు గాంధీ అడిగేసాడు’ఇంకొంచెం పెట్టండని’

ఆయన కోప్పడ్డాడు.’అందరికీ ఇవ్వాలిగా. సరిపోదు.అయినా ప్రసాదం అంటే ప్రసాదంలానే తినాలి.టిఫిన్ లా తినకూడదు’ అన్నారు పంతులుగారు. ఈలోగా గుమస్తా గంగరాజు వచ్చి మమ్మల్ని కేకలేయడంతో అక్కడనుంచి కదిలాం. అయినా పంతులు గారు మందార ఆకుల్లో కాకుండా బాదం ఆకుల్లో పెడితే మనం మళ్ళీ అడగంగా ‘అన్నాడు సుధాకర్. నేనూ , హరనాద్ వాడి మాటలకు నవ్వుకున్నాం.

సుధాకర్ క్లాసు మేటు మాధవి కోసం ఎదురు చూస్తుండే వాడు. ఆడపిల్లలు అందరూ దాగుడు మూతలు ఆడుతుంటే వాళ్ళ దగ్గరకు వెళ్లి “నేనూ ఆడవచ్చా మీతో” అని అడిగాడు. మాధవి ఖయ్యిమని లేచింది ‘ఆడ పిల్లలతో ఆడతావా?ఏం వళ్ళు ఎలావుంది?మా బావని పిలవనా?’ అంది. వాళ్ళ బావని గుర్తు చేయగానే హడలిపోయాడు సుధాకర్. వాళ్ళ బావ ఓ గున్న ఏనుగులా ఉంటాడు.వాడి చేతిలో పడితే పచ్చడే.

’వద్దులే’ అని మా దగ్గరకు వచ్చేసాడు. ‘ఎందుకురా ఆక్కడికి వెళ్లి చివాట్లు తిన్నావ్?’ అని నేనంటే ‘ ప్రేమలో ఇవన్ని మామూలే’ అని నవ్వేసాడు. నేనూ, హరనాద్ తొమ్మిదో తరగతి ‘ఏ’ సెక్షన్. సుధాకర్, గాంధీ ‘బి’సెక్షన్. మాధవి సన్నగా రివటలా ఉన్నా గొంతు మాత్రం ఖంగు మంటూ ఉంటుంది.

గుడి ఆవరణలోనే ఉన్న పెద్ద బావి దగ్గర పెద్ద బండ ఉంది.నిజానికి అది బండ కాదు. రెండు అడుగుల పొడవు, ఒకటిన్నర అడుగుల వెడల్పు, ఒక అడుగు ఎత్తు ఉన్న శిలా శాసనం. దాని పక్కనే మూడు అడుగుల ఎత్తులో నిలబడి ఉంది మరో శిలాశాసనం. ఈ పెద్ద బండని ఎత్తుకుని భుజాలమీద పెట్టుకుని గుడి చుట్టూ మూడు సార్లు ప్రదక్షిణం చేసిన వాడు పెనుగొండ లోకెల్లా ‘బలశాలి’ అని పిలిచేవారు. నవరాత్రులలో యువకులు ఎక్కువ మంది ఈ బండ ఎత్తడానికి గుడికి వచ్చేవారు. పల్లపు వీధి కాపుల కుర్రాళ్ళు, సెట్టిబలిజ కుర్రాళ్ళు, వెలమల కుర్రాళ్ళు , రెడ్ల కుర్రాళ్ళు ఈ బండ నెట్టడానికి పోటీ పడేవారు. బండని ఎత్తి , నిలబడి ఉన్న పెద్ద బండమీద పెట్టేవారు కానీ దాన్ని భుజాలమీద పెట్టుకోలేక పోయేవారు.

కొద్ది మంది అతికష్టం మీద భుజానికి ఎత్తుకున్నా ఒక ప్రదక్షిణం కన్నా ఎక్కువ చేయలేక పోయేవారు. వయసుమళ్ళిన పెద్దలు వారి వెనకే వెళ్లి ఎంతో ఉత్సాహ పరిచినా వాళ్ళు గమ్యం చేరుకోలేక పోయేవారు. బండని ఎత్తలేకపోయిన వారు ‘మరుసటి సంవత్సరం తప్పకుండా బండ ఎత్తుతానని’ శపధం కూడా చేసేవారు. నవరాత్రులలో ఇది ఒక ప్రత్యేక ఆకర్షణగా ఉండేది.

సాయంత్రం ఆరున్నరకి పూజలు అన్నీ అయిపోయాకా గుడిలో గంట కొట్టేవారు. వరండాలో కూర్చున్న వాళ్ళు, ఆవరణలో ఆడుకునే పిల్లలు అందరూ గుడి లోపలకు వచ్చేవారు. నవరాత్రులు కోసం ప్రత్యేకంగా వచ్చిన బ్రాహ్మణులు, పూజారులు రెండు వరుసలుగా నిలబడి మంత్రాలు చదివేవారు. చాలా సేపు అలా చదివేవారు.అవి మాకు ఏం తెలిసేవి కావు. తర్వాత పెద్దవాళ్ళు చెబితే తెలిసింది. వారు చదివేది మంత్రపుష్పం, అని నాలుగు వేదాలు లఘువుగా కూడా చదివేవారని. ఆ తతంగం అంతా అయ్యేసరికి గంట సమయం పట్టేది. రెండు వరుసలలో ఉన్న బ్రాహ్మలు ఒకరితో ఇంకొరు పోటీ పడి పెద్దస్వరంతో మంత్రాలు చదివేవారు. అది ఒక సంగీతంలా సాగేది.మాకు అర్ధం కాకపోయినా చాలా శ్రద్ధగా వినేవాళ్ళం. ఆ తర్వాత మాకు ఎంతో ఇష్టమైన కార్యక్రమం ‘ప్రసాదం పంచిపెట్టడం’ ప్రారంభం అయ్యేది.

గుమాస్తా గంగరాజు గేటు దగ్గర పెద్ద సిల్వర్ బేసిన్ నిండా ప్రసాదం పెట్టుకుని నిలబడి ఉండేవాడు. జనం ఇంటికి వెళ్ళిపోవాలని ఒకళ్ళని ఒకళ్ళు తోసుకుని ముందుకు వెళ్ళేవారు. బ్రాహ్మలు మంత్రాలు చదివేటప్పుడు బుద్ధిగా ఉండే పెద్దవాళ్ళు కూడా తోసుకుంటూ ముందుకు వెళ్లి ప్రసాదం తీసుకుని వెళ్లి పోయేవారు. వాళ్ళ వలన పిల్లలం వెనక ఉండిపోయేవాళ్ళం. ఇంత హడావిడిలోనూ సుధాకర్, మాధవి దగ్గరకు వెళ్లి ‘రేపు గుడికి వస్తావా?’ అని అడిగి వచ్చేవాడు.

ప్రసాదం మాకు దోసిడి నిండా పెట్టేవారు. ఒకరోజు సాతాలించిన సెనగలు పెడితే, మర్నాడు సెనగపప్పు పెట్టేవారు. వాటి మధ్యలో అప్పుడప్పుడు జీడిపప్పు వచ్చేది. ఆ రోజు మాకు ఆనందమే. గుడి మెట్ల మీద కూర్చుని ప్రసాదం తినే వాళ్ళం. ఆ తర్వాత కామాక్షి గుడి దగ్గర హరికధో, బుర్రకదో ఉంటె కాసేపు చూసి ఇళ్ళకు వెళ్ళే వాళ్ళం.

బుర్రకథ ఉంటె గాంధీ ఇంటికి వచ్చేవాడు కాదు. ప్రోగ్రాం మొత్తం చూసేవాడు.అందులో వంత చెప్పేవారిలో మా ఊరి విశ్వబ్రామ్మల ఆయన ఉండేవాడు.ఆయన మాట్లాడుతుంటే ఎస్వి రంగారావు మాట్లాడుతున్నట్టు ‘ఖంగు’మంటూ ఉండేది. ఆయన్ని అందరూ ‘సొర్న శ్రీ ‘గారని పిలిచేవారు.పెద్దయ్యాక తెలిసింది ‘సోర్నశ్రి కాదు ‘స్వర్ణశ్రీ’ అని. ఆయనకు జంటగా సత్యవరం నుంచి బ్రామ్మల ఆయన ‘సూర్యం’ గారు అని వచ్చేవారు.ఇద్దరూ బలే జోకులు చెప్పేవారు. బుర్రకథ మధ్యలో. అసలు కథ కన్నా వీళ్ళిద్దరి సంభాషణ బాగుండేది. ఈ జోకులన్ని మర్నాడు గాంధీ మాకు హావభావాలతో చెప్పేవాడు.

నవరాత్రి తొమ్మిది రోజుల్లో ఒకరోజు ఖచ్చితంగా రికార్డింగ్ డాన్స్ ఉండేది. మా ఊరివాళ్ళ ట్రూపె. అందులో వెంకటలక్ష్మి మగాడిలా ఫాంట్ వేసుకుని, షర్ట్ టక్ చేసుకుని టోపీ పెట్టుకుని ఇంకో అమ్మాయితో కలిసి డాన్స్ చేసేది. ’వాగ్దానం’ సినిమాలో ‘నా కంటి పాపలో నిలిచిపో’ అనే పాటకు వాళ్ళు ఇద్దరూ చాలా బాగా డాన్స్ చేసేవారు. జనం ఈలలు వేసి ‘ఒన్స్ మోర్’ అని అరిచేవారు. వాళ్ళు మళ్ళీ ఆ పాటకు డాన్స్ చేసేవారు. కొందరు కుర్రాళ్ళు ఐదు, పడి, ఇరవై రూపాయలు చదివించేవారు. ప్రతి పాటకు ముందు మైక్ పట్టుకుని ఒకతను ‘డాన్స్ చేసే పాట’ అనౌన్స్ చేసే వాడు.

ఇప్పుడు ఆత్మబలం చిత్రం నుండి ‘చిటపట చినుకులు పడుతూ ఉంటె’ పాటకు వెంకటలక్ష్మి, అనూరాధ డాన్స్ చేస్తారు.అని చెప్పగానే జనం ఖయ్యి మంటూ ఈలలు వేసేవారు. ముందు వరసలో కూర్చుంటే పెద్దవాళ్ళు చూసి తిడతారని, బాగా వెనకకు వెళ్లి నిలబడి చూసేవాళ్ళం. పాట అయిపోగానే జనం మధ్యనించి ‘మైసూరు పాకు, మడతపూరి’ అంటూ ఒకతను లేచేవాడు.స్వీట్లు కావాల్సిన వాళ్ళు కొనుక్కుని తింటూ డాన్స్ చూసేవారు. పాటకు పాటకు మధ్యన రెండు మూడు నిముషాలు గ్యాప్ ఉండేది. గ్రామ ఫోన్ రికార్డు మార్చడం, తర్వాత పాటకు డాన్సు చేసే వాళ్ళు రెడీ అవడం. ఇవన్నీ చూసుకుని మైక్ అనౌన్స్ మెంట్ జరిగేది. మధ్యలో హాస్యం పాటలు కూడా వేసేవారు.దానికి డాన్స్ చేసేవాళ్ళు వేరేగా ఉండేవారు.వాళ్ళు బాగుండెవారు కాదు. వెంకటలక్ష్మి, అనూరాధ, వెంకటలక్ష్మి రత్నమణి చేసే డాన్సులకు జనం ఈలలు వేసి హడావిడి చేసేవారు. హరికథ, బుర్రకథల కన్నా రికార్డింగ్ డాన్స్ ఉన్న రోజున జనం బాగా వచ్చేవారు. ఆరోజు నవరాత్రులలో ఆఖరి రోజు. మర్నాడు విజయదశమి. ఇంక గుడిలో ప్రత్యేక పూజలు, ప్రసాదాలు పంచిపెట్టడం ఏమీ ఉండవు. సుధాకర్ కి చాలా ఆందోళనగా ఉంది. మాధవికి

ఏదోరకంగా మంచి చేసి ఆమె దృష్టిలో గుడ్ బాయ్ లా మార్కులు కొట్టేయాలని కిందా, మీదా పడిపోతున్నాడు. దాగుడు మూతలు ఆటలో రోజూ మాధవి దొరికిపోతోంది. ఆమె ఎక్కడ దాక్కున్నా ఆమె స్నేహితురాళ్ళు యిట్టే పట్టేసుకుంటున్నారు. వాడి బుర్రలో ఒక ఆలోచన వచ్చింది. గబా గబా మాధవి దగ్గరకు వెళ్ళాడు.

“మాధవీ, నువ్వు దాక్కోవడానికి ఒక మంచి చోటు చూపిస్తాను రా”అన్నాడు సుధాకర్. ఈ ఒక్క రోజైనా ఎవరికీ దొరకకుండా ఉండాలని అనుకుంటున్న మాధవి, సుధాకర్ వెనకే వెళ్ళింది. చీకటిగా ఉన్న రధసాల దగ్గరకు తీసుకెళ్ళాడు సుధాకర్. దేవుడి రధం వర్షానికి తడవకుండా ఉండటానికి, రధానికి చుట్టూ తాటిఆకులతో గూడులా కట్టారు.”నువ్వు దీని వెనక దాక్కో.ఎవరూ ఇక్కడికి రారు. నీకు కొంచం దూరంలో నేను ఉంటాను. ఒకవేళ ఎవరైనా వచ్చినా ఇక్కడ ఎవరూ లేరని నేను చెబుతాను” అని భరోసా ఇచ్చాడు సుధాకర్. మాధవి రధం వెనక నక్కి కూర్చుంది. ‘నిజమే! ఇక్కడ వుంటే ఎవరికీ కనపడను’ అని ఆనందించింది. సుధాకర్ కొద్ది దూరంలో అటూ ఇటూ తచ్చాడుతున్నాడు.

ఐదునిముషాలు గడిచేసరికి మాధవి”అమ్మా”అంటూ గట్టిగా కేకేసింది. సుధాకర్ గబా గబా ఆమె వద్దకు వచ్చాడు. ఆమె ఏడుస్తూ బయటకు వచ్చింది.”నన్ను కాలి మీద ఏదో కుట్టింది.” అంది. మాధవిని నెమ్మదిగా నడిపించుకుంటూ వెలుగులోకి తీసుకువచ్చాడు. ముందుగా మాధవి అన్నయ్య రమణ చూసాడు సుధాకర్ ని. చెల్లెలు ఏడవడం, ఆమెతో పాటు సుధాకర్ ’ఏం లేదు, కంగారు పడకు’ అనడం విని ఏదో జరిగిందని ఊహించి సుధాకర్ ని పిడి గుద్దులతో సత్కరించడం జరిగింది .నేనూ, గాంధీ, హరనాద వేగంగా వెళ్లి సుధాకర్ని రమణ బారి నుంచి రక్షించాము. ఈలోగా అటు వచ్చిన గుడి గుమస్తా ఏం జరిగిందని అడగడం, తాను రధసాల దగ్గరకు వెళ్లాలని, కాలి మీద ఏదో కుట్టిందని మాధవి చెప్పింది.

‘అక్కడ తేళ్ళు ఉన్నాయమ్మ, అక్కడికి ఎందుకు వెళ్ళావ’ని కేకలేసి , సత్రం అరుగు మీద కూర్చోబెట్టి తేలుమంత్రం వేసాడు గుమస్తా గంగరాజు. ఐదు నిముషాలకు మాధవికి కొద్దిగా బాధ తగ్గింది. గంగరాజు భార్య లోపల నుంచి ఆయింటు మెంటు తెచ్చి రాసింది. పావుగంట గడిచాక మాధవిని తీసుకుని రమణ ఇంటికి వెళ్ళిపోయాడు. నేను సుధాకర్ ని తీసుకుని వాడి ఇంటి దగ్గర దిగబెట్టి వచ్చాను.

పదేళ్ళు గడిచి, సుధాకర్ ఉద్యోగస్తుడు అయ్యాకా రమణ వచ్చి ‘మా చెల్లాయిని పెళ్లి చేసుకో’మని అడగడం, వాడు ఆనందంగా ఒప్పుకుని, మాధవి ని పెళ్ళిచేసుకోవడం గొప్ప విచిత్రం.

ఇదండీ మా ఊరి నవరాత్రి ముచ్చట్లు.

***శుభం***

మనతెలుగుకథలు.కామ్ లో రచయిత ఇతర రచనలు :

రచయిత పరిచయం : సత్యనారాయణ మూర్తి M R V

ఎమ్. ఆర్. వి. సత్యనారాయణ మూర్తి. పెనుగొండ. పశ్చిమ గోదావరి జిల్లా. కవి, రచయిత, వ్యాఖ్యాత, రేడియో ఆర్టిస్టు. కొన్ని కథల పుస్తకాలు, కవితల పుస్తకాలు ప్రచురితం అయ్యాయి. కొన్ని కథలకు బహుమతులు కూడా వచ్చాయి. రేడియోలో 25కథలు ప్రసార‌మయ్యాయి. 20 రేడియో నాటికలకు గాత్ర ధారణ చేసారు. కవితలు, కథలు కన్నడ భాషలోకి అనువాదం అయ్యాయి.


71 views0 comments
bottom of page