top of page

స్వాతికిరణం 

#Swathikiranam, #స్వాతికిరణం, #KandarpaMurthy, #కందర్పమూర్తి, #TeluguInspirationalStories, #ప్రేరణాదాయకకథలు

Swathikiranam - New Telugu Story Written By Kandarpa Murthy

Published In manatelugukathalu.com On 02/07/2025

స్వాతికిరణం - తెలుగు కథ

రచన: కందర్ప మూర్తి


హైస్కూలు టీచర్ రామారావు మాస్టారికి ఇద్దరు అమ్మాయిలు. పెద్దమ్మాయి రేవతి సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, రెండవ అమ్మాయి స్వాతి బిఎ డిగ్రీ పూర్తిచేసారు. 

 

"స్వాతీ, డిగ్రీ అయిపోయింది కదా! బి ఎడ్ చేసి నాలాగ టీచింగ్ లైనుకు వస్తావా లేక గ్రూప్స్ సివిల్స్ కి ప్రిపేర్ అవుతావా ? " రామారావు మాస్టారు కూతుర్ని

అడిగారు. 


"లేదు నాన్న గారు, నేను జర్నలిజం, మాస్ కమ్యూనికేషన్ చదివి జర్నలిస్టునై సమాజంలో స్త్రీల పట్ల జరుగుతున్న అన్నాయాల్ని, అవమానాల్ని ప్రతిఘటిస్తాను" అంది ధృడంగా. 


స్వాతి చిన్నప్పటి నుంచి అభ్యుదయ భావాలు, పట్టుదల ఉన్న అమ్మాయి. ఎవరైనా ఆడవారిని కొట్టినా తిట్టినా కోపంతో ఊగిపోయేది. సమాజంలో స్త్రీల పట్ల జరుగుతున్న లింగ వివక్షల్ని వ్యతిరేకించేది. అందువల్ల కూతురి మాటను 

కాదనలేకపోయారు రామారావు. 


డిగ్రీ అయిన తర్వాత జర్నలిజం, మాస్ కమ్యూనికేషన్ పూర్తి చేసి జర్నలిస్టుగా స్థిరపడి పత్రికలకు రచనలు చేస్తు మహిళాభ్యుదయానికి కృషి చేస్తోంది స్వాతి. 

 

రేవతిని సాఫ్ట్వేర్ ఇంజినీర్ ప్రకాష్ కిచ్చి అంగరంగవైభవంగా

పెళ్లి జరిపించారు. కూతురు కూడా సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ చదివినప్పటికీ కట్నకానుకలు, లాంఛనాల కోసం తండ్రి నుంచి వచ్చిన యకరం భూమి అమ్మేయవల్సి వచ్చింది. ఐనా అమ్మాయి అత్తవారింటి నుంచి సాధింపులు తప్పలేదు రామారావుగారికి. 

 

బాల్యం నుంచి తండ్రి తమ చదువుల కోసం ఎంత కష్టపడింది, సమాన విద్యార్హతతో ఉన్నా కూడా అక్క పెళ్లి, వారు కోరిన విధంగా జరిపినప్పటికీ అత్తవారి దెప్పి పొడుపులకు నాన్న మనసులో పడ్డ బాధ అర్థం చేసుకుంది స్వాతి. 

 

చిన్నప్పటి నుంచి సమాజంలో స్త్రీల పట్ల వివక్ష, పురుషాధిక్యత చూసి తట్టుకునేది కాదు. ఆదినుంచి ఆడవారి పట్ల జరుగుతున్న అన్యాయాల్ని, లింగ వివక్ష గురించి పత్రికలలో అనేక వ్యాసాలు, విశ్లేషణలు రాస్తుంటుంది. 

 పూర్వం నుంచి అన్ని వర్గాల కుటుంబాల్లో అబ్బాయిల్ని ఒక విధంగా అమ్మాయిల్ని మరో విధంగా పెంచుతుంటారని విమర్శలు చేస్తుంటుంది. 


కొడుకులు లేకపోతే ముసలి తల్లిదండ్రులు కూతురింట్లో ఉండకూడదు. తమకున్న సర్వస్వం అర్పించి ఆడపిల్లకు పెళ్లి చేసిన వారు మాత్రం రోడ్డున పడాల్సిందే. 


పెళ్లి పేరుతో ఆడపిల్లల తల్లిదండ్రుల్ని పీల్చి పిప్పి చెయ్యడమే తప్ప అల్లారు ముద్దుగా పెంచిన తమ ఆడపిల్లను జీవితాంతం అత్తవారింటికి కానుకగా

పంపుతున్నారన్న విశ్వాసం ఉండదు. 


చచ్చిన తర్వాత తలకు కొరివి పెట్టి పున్నామ నరకానికి చేరుస్తాడని కొడుకుల్ని నెత్తి మీద పెట్టుకుంటారు. చిన్నప్పటి నుంచి వారికి సకలభోగాలు సమకూరుస్తారు. ఎంతైన డబ్బు ఖర్చు పెట్టి పట్నాలకు పంపి పెద్ద చదువులు చదివిస్తారు. 


ఆస్థి పంపకాల్లోను వారిదే పై చెయ్యి. వారి ప్రవర్తన ఎలాగున్నా అడగరు. ఎన్ని దగుల్బాజీ పనులు చేసినా వెనకేసుకు వస్తారు. కొడుకు తన్ని తగిలేసి వృద్ధాశ్రమంలో పడేసినా సమ్మతమే. 


అదే అమ్మాయి ఐతే ఆడ(అత్తారింటి) పిల్లని చిన్న చూపు. పుట్టినప్పటి నుంచి ఆంక్షలు. కట్టు బొట్టు తిండిలో కూడా నిబంధనలే. పెద్దలు గీసిన గిరిలో పెరగాల్సిందే. 


సృష్టిలో ప్రకృతి పరంగా స్త్రీలలో శారీరకంగా కొన్ని సమస్యల్ని కల్పించాడు దేవుడు. ఆడది అంటే సహనం ఓర్పు శక్తితో జీవితమంతా బతుకుతుంది. కుటుంబ వ్యవస్థకు చుక్కానిలాంటిది స్త్రీ.. 

 

వివాహమైన తర్వాత కుటుంబ వ్యవస్థలో తొమ్మిది నెలలు తన గర్భంలో వంశాంకురాన్ని రక్తమాంసాలతో పెంచి భూమ్మీదకు తీసుకువస్తుంది. రాత్రింపవళ్లు కంటికిరెప్పలా కాపాడుతుంది అమ్మ అనే మహిళ. 


పురుషుడు తన శరీర సుఖాన్ని తీర్చుకుని స్త్రీలకు శరీర భారాన్ని మిగులుస్తాడు. సృష్టిలో ఈ క్రియ అన్ని జంతు జీవజాలాలలో జరుగుతుంది. పుష్పాలు కూడ పరపరాగ సంపర్కం ద్వారా తమ జాతులను విస్తరించుకుంటాయి. కొన్ని ప్రత్యేకంగా కొన్ని పరోక్షంగా తమ సంతతుల్ని అభివృద్ధి చేసుకుంటాయి. 


ఆదిమానవుడి నుంచి నేటి నాగరిక మానవుడు సమాజంలో జీవనానికి కొన్ని కట్టుబాట్లు ఆచారాలు నమ్మకాల ఏర్పాటు చేసి క్రమశిక్షణ జీవన విధానం ఏర్పరిచారు. 

 

పురుషాదిక్య ప్రపంచంలో స్త్రీ, పురుషులకు జీవన విధానంలో అనేక నియమ నిబంధనల్ని అమలు పరిచారు. పురుషుడంటే బలవంతుడని స్త్రీ అబలలాగ మగవారి అదుపాజ్ఞలలో ఉండాలని శాసించారు. మగవారి చెప్పు చేతల్లో ఉండాలి. అదే శాసనం ఇప్పటికీ అమలు

జరుగుతోంది. 


ఆలోచనల్లో చాణక్యుడిలాగ పడక మంచం మీద రంభలా కష్టంలో అమ్మలా లాలించమని స్త్రీలకు జీవన సూత్రాలు ఏర్పరిచారు. మరి పురుషుడు తన శరీర సుఖమే చూసుకుంటున్నాడు. తనకు వంశోద్ధారకుడు కావాలనుకుంటాడు. పురుషుడు ఎన్ని పెళ్లిళ్లైనా చేసుకోవచ్చు. భర్త చనిపోయిన స్త్రీ ని విధవను చేసి మూలన కూర్చోబెడుతున్నారు.. 


పెళ్లి అనే వేడుకతో మంగళసూత్రమనే బంధంతో అగ్ని సాక్షిగా ఏడడుగులు నడిపించి పెద్దల ముందు మంగళవాయిద్యాలు పురోహితుడి వేదమంత్రాలతో రెండు దశాబ్దాలు కన్నవారింట పుట్టి పెరిగిన కన్నెపిల్ల వెయ్యి స్వప్నాలతో పురుషుడి చేతివేలు పట్టుకుని సంసారమనే జీవిత నౌకలో అడుగిడుతుంది. 


కన్నవారిని తోబుట్టువులు ఆప్తుల్ని వదిలి పరిచయం లేని అపరిచితుల మధ్య తన తనువు మనసు సర్వస్వం అర్పించి జీవిత చరమాంకం వరకు బ్రతుకుతుంది స్త్రీ. 


వివాహమైన తర్వాత పురుషుడు భార్య వెంట కాపురానికి ఆమె పుట్టింటికి వెళ్లడు. కట్న కానుకలు, లాంఛనాల పేరుతో అమ్మాయి పుట్టింటి వారి నుంచి ఆమె జీవిత చరమాంకం వరకు అయే ఖర్చులు లైఫ్ టేక్స్ మాదిరి వసూలు చేస్తున్నారు. ఇవికాక మొదటి కాన్పు, రెండవ కాన్పు పుట్టింటి వారే చేయించాలి. బాలసారె.. ఇలా అత్తింటికి పంపే వరకూ తడిసి మోపెడు ఖర్చులు అమ్మగారింటికి. 


ఉదయం పక్కమీద నుంచి లేచింది మొదలు రాత్రి పక్క మీద చేరేవరకు ఒక యంత్రంలా ఇంటి పనుల్లో పిల్లలకు మొగుడుకి అత్తమామలకు సేవలు చేసి అలిసినా రాత్రి మంచం మీద మొగుణ్ణి సుఖపెట్టాలి. ఇదా స్త్రీల జీవితం ఆమె మనిషి కాదా ? ఆమెకు మనసుండదా ? కోరికలుండవా?

ఈ వ్యవస్థ మారేదెప్పుడు ? ఈ పురుషాదిక్య ప్రపంచంలో స్త్రీలు కనులు తెరిచేదెప్పుడు ?


ఇలాంటి సవాలక్ష ప్రశ్నలు స్వాతి మనసులో కల్లోలం రేపుతున్నాయి. 


పాత తరం మహిళలు చదువు లోకజ్ఞానం లేక కుటుంబ వ్యవస్థలో సంప్రదాయం ఆచార వ్యవహారలతో పెరిగి అత్తింట్లో వంటింటి పిల్లిలా కాలం గడిపేవారు. 


పూర్వపు రోజుల్లో కొన్ని ప్రాంతాల్లో భర్త చనిపోతే భార్య కూడా భర్త శవంతో చితిమీద కూర్చొని కాలి ప్రాణత్యాగం చేసేవారట. ఎంత నరక జీవితం? ఇదెక్కడి సతీ సహగమనం?


ఇల్లే సర్వస్వం, సంసారమే సమస్తం. రాత్రి మొగుడి శరీర సుఖం తీర్చడం, పిల్లల్ని కని పెంచి పెద్ద చెయ్యడం, వార్ధక్యంలో మనుమలతో గడపడం చివర్లో రోగాలతో పోరాటం. ఇదీ స్త్రీల జీవితం. 


నేటి ఆధునిక తరంలో కూడా భర్తతో సమానంగా చదివి

ఉద్యోగంలో సంపాదన ఉన్నా పగలంతా ఉద్యోగ బాధ్యతలు

నిర్వర్తించి ప్రయాణ బడలికతో ఇంటికి వచ్చినా వంటపనులు, పిల్లల బాగోగులు భార్యకి తప్పవు. 


ఉమ్మడి కుటుంబ వ్యవస్థ నసించి ఏకాకి కుటుంబాల్లో మరొక మనిషి తోడుండదు. ఎన్ని కష్టాలైనా ఆడవారిని మాతృమమత కట్టి పడేస్తుంది. తన సుఖం చూసుకోదు. జీవితం కుటుంబానికే బలి చేస్తుంది. " ఇవీ స్వాతి ఆలోచనలు. 


"ఏరా, రామం! నీ చిన్న కూతురు ఇలా బరి తెగించిందేమిటి?  ఏవో పిచ్చి రాతలతో ఏనాటినుంచో వస్తున్న మన సంప్రదాయాల్ని తప్పుపడుతూ పత్రికలకి రాస్తోందట ఈ పిల్లకాకి. ఎవర్నో చూసి దాని మెడలో మూడు ముళ్లూ వేయించు. ఒకరిద్దరు పిల్లలు పుట్టాక అదే దారి కొస్తుంది. " విధవ మేనత్త సీతమ్మ తమ్ముడు రామారావు మీద నిప్పులు చెరిగింది. 


 ‘ఇదెక్కడి పోకడే, అందుకే ఆడపిల్లలకు ఎక్కువ చదువులు వద్దన్న’దని ఇరుగు పొరుగు బంధువుల ఈసడింపులు. 


"ఎప్పటినుంచో వస్తున్న మన వివాహ వ్యవస్థను కించ పరచడం బాగోలేదండీ మాస్టారు " అని మాస్టారి స్నేహితుల వాక్బాణాలు. 


ఎవరెలా మాట్లాడినా విమర్సించినా స్వాతి తన ధోరణి మార్చుకోవడం లేదు. ఇటువంటి ఆటుపోట్లు వస్తాయని తెలిసే ఈ పత్రికా రంగంలో దిగేను. ముఢాచారాలు ముమ్మరంగా ఉండే అప్పటి రోజుల్లో కూడా ఛాందసవాదుల ఒత్తిళ్లకు గురై ఉంటారు సంఘ సంస్కర్తలు. 


జాతిపిత మహాత్మా గాంధీ గారు కూడా నా కెందుకులే ఈ బాధలని తన స్వార్థం చూసుకుంటే అప్పటి స్వాతంత్రోధ్యమం ముందుకు సాగేదా ? అని తనలో తనే ప్రశ్నించుకుంటుంది స్వాతి. 


స్వాతికి మద్దతుగా అభ్యుదయ మహిళా సంఘాలు, స్త్రీ విముక్తి పోరాట సమితి సహకారం ఉంటోంది. నువ్వు ఒంటరిదానివి కాదు, నీ వెంట మేమంతా ఉన్నాము. ఇలాగే నీ రాతలతో మాకు ప్రోత్సాహం కల్గించమని మహిళా సమాజ సమావేశాల్లో వెన్ను తట్టేవారు. 


అప్పటి సమాజ సంస్కర్తలు గురజాడ అప్పారావు, కందుకూరి వీరేశలింగం పంతులు, ఉన్నవ లక్ష్మీ నారాయణ వంటి వారి రచనలు కన్యాశుల్కం, వరకట్నం, మాలపిల్ల, చింతామణి సాంఘిక దురాచారాలను ఎత్తి చూపే రచనలు సేకరించి చదివేది. ఆధునిక సమాజంలో స్త్రీల ఉన్నతికి పాటుపడిన సరోజినీ నాయుడు, దుర్గాబాయ్ దేశ్ ముఖ్, సావిత్రి భాయి ఫూలే వంటి మహిళల జీవిత చరిత్రలు చదివి స్ఫూర్తి తెచ్చుకుంది. 


పసితనంలో బాలికల పట్ల అనాగరిక సంప్రదాయాలు, ముక్కు పచ్చలారని బాలికల బాల్య వివాహాలు, కొన్ని మత సాంప్రదాయాల్లో స్త్రీల అభిప్రాయం తెలుసుకోకుండా

భార్యాభర్తల విడాకులు, గ్రామీణ ప్రాంత మహిళల పట్ల అనేక మూఢాచారాలు ఇవన్నీ తలుచుకుని స్వాతి మదన పడేది. 


సాధారణంగా పెళ్లిళ్ల సంప్రదింపుల్లో కట్నకానుకలు లాంఛనాలు విషయంలో మగవారి ప్రమేయముండదు కాని పెద్ద ముత్తయిదువలు, ఆడపడుచులు ఇది సంప్రదాయమని ప్రోద్బలం చేస్తారు. అటు ఆడపిల్ల తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితులు అర్థం చేసుకోరు. 

వారు కోరిన విధంగా కట్నకానుకలు లాంఛనాలు తీర్చి వారు చెప్పిన పదార్థాలతో విందుభోజనం విడిది ఏర్పాటు చేసి సారెతో అమ్మాయిని అత్తారింటికి పంపాలి. 


పెద్దమ్మాయి పెళ్లి చేసిన తర్వాత తను అనుభవించిన మానసిక వేదన తలుచుకుంటే చిన్నమ్మాయి స్వాతి ఆలోచనలు సబబే అనిపిస్తుంటుంది రామారావు మాస్టారికి. 


ఈ పురుషాధిక్య ప్రపంచంలో స్త్రీ కనులు తెరిచేదెప్పుడు? ఈ మహా సంగ్రామంలో తను సమిధనై నాశనమైనా పరవాలేదు. కొంతైనా సమాజంలో మార్పుకనబడితే చాలని నిశ్చయించుకుని 'స్వాతికిరణం' మహిళా పత్రికను నడుపుతు తనలాగె మహిళాభ్యుదయానికి పాటుపడుతున్న మహిళా జర్నలిస్టులను జతచేసి తన ఆశయాల కోసం పోరాడుతోంది మహిళా జర్నలిస్ట్ స్వాతి. 


 సమాప్తం


కందర్ప మూర్తి  గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


  పూర్తి పేరు  :  కందర్ప వెంకట సత్యనారాయణ మూర్తి

  కలం పేరు :  కందర్ప మూర్తి

  పుట్టి పెరిగిన ఊరు : 02 జూలై -1946, చోడవరం (అనకాపల్లి జిల్లా)ఆం.ప్ర.

  భార్య పేరు:   శ్రీమతి  రామలక్ష్మి

 కుమార్తెలు:


శ్రీమతి రాధ విఠాల, అల్లుడు  డా. ప్రవీణ్ కుమార్

              

శ్రీమతి ఉషారమ , అల్లుడు వెంకట్

                  

శ్రీమతి  విజయ సుధ, అల్లుడు సతీష్

                   

  విద్యార్థి దశ నుంచి తెలుగు సాహిత్యం మీద అభిలాషతో చిన్న కథలు, జోకులు, కార్టూన్లు వేసి పంపితే  పత్రికలలో  ప్రచురణ జరిగేవి. తర్వాత హైస్కూలు  చదువులు,  విశాఖపట్నంలో  పోలీటెక్నిక్ డిప్లమో  కోర్సు చదివే రోజుల్లో  1965 సం. ఇండియా- పాకిస్థాన్  యుద్ధ  సమయంలో చదువుకు స్వస్తి  పలికి  ఇండియన్  ఆర్మీ  మెడికల్ విభాగంలో చేరి  దేశ సరిహద్దులు,  

వివిధ నగరాల్లో  20 సం. సుదీర్ఘ సేవల  అనంతరం పదవీ విరమణ  పొంది సివిల్  జీవితంలో  ప్రవేసించి 1987 సం.లో  హైదరాబాదు  పంజగుట్టలోని నిజామ్స్  వైద్య  విజ్ఞాన  సంస్థ  (నిమ్స్ సూపర్  స్పెషాలిటీ  హాస్పిటల్) బ్లడ్ బేంక్  విభాగంలో  మెడికల్ లేబోరేటరీ  సూపర్వైజరుగా  18 సం. సర్వీస్  చేసి  పదవీ  విరమణ  అనంతరం  హైదరాబాదులో కుకట్ పల్లి

వివేకానందనగర్లో  స్థిర  నివాసం.


సుదీర్ఘ  ఉద్యోగ  సేవల  పదవీ విరమణ  తర్వాత  మళ్లా  తెలుగు సాహిత్యం మీద  శ్రద్ధ  కలిగి  అనేక  సామాజిక కథలు,  బాల సాహిత్యం, సైనిక జీవిత అనుభవ కథలు, హాస్య కథలు, విశ్లేషణ వ్యాసాలు, కవితలు, గేయాలు రాయగా  బాలమిత్ర, బుజ్జాయి, బాలల చంద్ర ప్రభ, హాయ్ బుజ్జీ, 

బాలభారతం,  బాలబాట, మొలక,  సహరి,  సాక్షి ఫన్ డే, విపుల,చిన్నారి, హాస్యానందం, ప్రజాశక్తి,  గోతెలుగు. కాం, తపస్వి మనోహరం, సాహితీ కిరణం, విశాఖ సంస్కృతి, వార్త  ఇలా  వివిధ  ప్రింటు, ఆన్లైన్  మేగజైన్లలో ప్రచురణ జరిగాయి.


నాబాలల  సాహిత్యం  గజరాజే వనరాజు, విక్రమసేనుడి  విజయం రెండు  సంపుటాలుగాను, సామాజిక  కుటుంబ కథలు  చిగురించిన వసంతం,  జీవనజ్యోతి   రెండు  సంపుటాలుగా  తపస్వి మనోహరం పబ్లికేషన్స్  ద్వారా  పుస్తక రూపంలో  ముద్రణ  జరిగాయి.


 నా సాహిత్య  రచనలు  గ్రామీణ,  మద్య తరగతి,  బడుగు బలహీన   వర్గ ప్రజల, జీవన విధానం, వారి స్థితిగతుల గురించి రాస్తు  సమాజానికి  ఒక సందేశం  ఉండాలని  కోరుకుంటాను.


 


Comments


bottom of page