top of page
Original.png

తప్పెవరిది

తప్పెవరిది, వీధి కుక్కల సమస్య, తెలుగు సామాజిక కథ, dog attack story, stray dogs issue, social awareness story, emotional Telugu story, child safety, human values, Telugu short story, social responsibility, Telugu literature, thought provoking story, community safety, జీవకారుణ్యం, సామాజిక కథ

www.manatelugukathalu.com లో ప్రచురింపబడ్డ 'తప్పెవరిది' కథలో వీధి కుక్కల సమస్య, చిన్నారుల భద్రత, సామాజిక బాధ్యతల మధ్య సంఘర్షణను ప్రతిబింబించే భావోద్వేగ దృశ్యం.
www.manatelugukathalu.com లో ప్రచురింపబడ్డ 'తప్పెవరిది' కథలో వీధి కుక్కల సమస్య, చిన్నారుల భద్రత, సామాజిక బాధ్యతల మధ్య సంఘర్షణను ప్రతిబింబించే భావోద్వేగ దృశ్యం.

Thappevaridi - Telugu Emotional Story | Vemparala Durga Prasad

తప్పెవరిది - తెలుగు భావోద్వే కథ | వెంపరాల దుర్గాప్రసాద్

Published In manatelugukathalu.com On 18/06/2026


మనిషి ప్రాణం ముఖ్యమా? లేక వీధి జంతువుల హక్కులా? ఈ ప్రశ్నకు సులభమైన సమాధానం ఉండకపోవచ్చు. కానీ ఒక చిన్నారి జీవితమే ప్రమాదంలో పడినప్పుడు పరిస్థితులు ఎలా మారిపోతాయో "తప్పెవరిది?" కథ మనకు చూపిస్తుంది. వీధి కుక్కల సమస్య, జీవకారుణ్య సంస్థల వాదనలు, తల్లిదండ్రుల బాధ్యత, ప్రభుత్వ నిర్లక్ష్యం వంటి అనేక కోణాలను స్పృశిస్తూ రచయిత సమాజాన్ని ఆలోచింపజేసే ప్రయత్నం చేశారు. భావోద్వేగం, సామాజిక బాధ్యత, వాస్తవికత కలగలిపిన ఈ కథ ప్రతి పాఠకుడిలో చర్చకు దారితీస్తుంది.


ముందు రోజు రాత్రి టీవీలో చూసిన వార్త వనజ గుండెని పిండేసింది. హైదరాబాద్‌లో 4 సంవత్సరాల చిన్న పిల్లవాడిని కుక్కలు చుట్టుముట్టి చంపేశాయి అన్న వార్త ఆమెను విపరీతంగా కదిలించింది. వనజ స్వతహాగా చాలా సెన్సిటివ్. పైగా ఆమెకు చిన్న పిల్లలంటే ఎంతో ఇష్టం. చిన్నపిల్లలు, ఇంట్లోవాళ్ళయినా, బయటివాళ్లయినా, ఎదురుపడితే ముద్దాడకుండా ఉండలేదు. చదువుకున్న చదువు, సామాజిక బాధ్యతలు, ఆమెను ఆ దుర్ఘటన విషయంలో ఆలోచింపజేస్తున్నాయి. 


ఉదయం వాకింగ్‌కి కూడా వెళ్ళలేదు ఆమె. ఒక విధంగా చెప్పాలంటే ఆమె యాంత్రికంగా తన పనులు తాను చేసుకుంటున్నా, మనసు పరిపరి విధాలుగా ఆ దుర్ఘటనను తలుచుకుని వేదనగా ఉంది. అందరు ఆడవాళ్ళలాగా టీవీ సీరియల్స్‌కు అంకితమయ్యే మనస్తత్వం కాదు ఆమెది. టీవీ పెడితే ఎక్కువగా న్యూస్ చానెల్స్, డిబేట్స్ వైపే మొగ్గు చూపుతుంది.


మధ్యాహ్నం టీవీలో వచ్చిన డిబేట్ ఆమెను మరింత కలిచివేసింది. ఆ టీవీ వాళ్ళు, చనిపోయిన పిల్లవాడి తల్లిదండ్రులను, జీవ కారుణ్య సంఘం వాళ్ళని, నగర మేయర్ని స్టూడియోకి ఆహ్వానించినట్లున్నారు. నగర మేయర్ రాలేదు కానీ, ఒక ప్రముఖ సినీదర్శకుడిని ప్రత్యేక ఆహ్వానితుడిగా చర్చకు ఆహ్వానించారు. ఆయన చాలా ఆవేశంగా మాట్లాడుతున్నారు. సాధారణంగా చిత్రాలలో హింసాత్మక సన్నివేశాలు ఎక్కువగా చూపించే ఆయనలో ఉన్న మానవతా దృక్పథం, సమాజం పట్ల ధోరణి, మొదటిసారిగా చూసింది వనజ. 


ఎన్నో సంవత్సరాలుగా నిరంతర ప్రక్రియగా వీధి కుక్కలకు ఆపరేషన్లు చేసి వదిలిపెడుతున్నారన్న హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్, ఆ కుక్కల సంఖ్య ఇంకా 5, 6 లక్షలని చెప్పడం నమ్మశక్యంగా లేదన్నారాయన. వనజకు కూడా నిజమే అనిపించింది.


జీవ కారుణ్య సంఘం వాళ్ళ వాదనలు ఆమెకి చాలా అసహజంగా అనిపించాయి. “పిల్లవాడిని అలా వంటరిగా వదిలి వెళ్లడం తండ్రిదే తప్పని, వీధి కుక్కలు ఆహారం దొరకకే, పిల్లవాడి మీద దాడి చేశాయని, పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవలసింది తల్లిదండ్రులదే అని, నోరు లేని కుక్కల్ని ఆడిపోసుకోవడం కరెక్ట్ కాదని” వారి వాదన.


“నోరులేని మూగ జీవాలయితే, అంతంత పళ్ళేసుకుని ఆ పిల్లవాడిని పొట్టన పెట్టుకున్నాయి కదా, అది వాళ్ళకి కనపలేదా?” అనిపించింది వనజకి.


అదే మాట ఆ చర్చలో వచ్చింది.  ఆవేశకావేశాలు పెరిగాయి.   చర్చకి  వచ్చింది గాని, ఆ పిల్లవాడి తల్లి,  బిడ్డని పోగొట్టుకున్న పుట్టెడు దుఃఖంలో ఉందేమో పెద్ద పెట్టున ఏడుస్తోంది. ఆమెని ఊరుకో పెట్టడం ప్రయోక్త  వల్ల కూడా కావడం లేదు. 

సినీదర్శకుడికి కూడా చాలా కోపం వచ్చింది. “మూగ జీవాలని అభిమానించే వాళ్ళు వాటిని వీధుల్లోంచి పట్టుకు వెళ్ళి, తమ తమ ఇళ్లల్లో పెంచుకోండి” అని వ్యంగంగా అన్నారు.


“పిల్లలకి, మనుషులకి రక్షణలేని సమాజంలో బతుకున్నామని ఆవేదన లేదా?” అని సూటిగా ప్రశ్నించారాయన. జీవ కారుణ్య సంఘం వాళ్ళు ఏదో విచిత్రమయిన వాదన వినిపిస్తున్నారు. అక్కడకి వచ్చిన పబ్లిక్ కూడా, కుక్కల్ని నిర్మూలించాల్సిందే అని చాలా ఆవేశపడి చెప్తున్నారు. 


ఆ చర్చ చూసిన వనజకి రక్తం మరిగిపోయింది. ఆ చర్చలో పాల్గొన్న ఓ పెద్దాయనకి 50, 55 ఏళ్ళు ఉండచ్చు. పేరు సుబ్బారావుట, జీవిత భీమా కంపెనీలో ఉద్యోగమట. ఆయన వాదన ప్రకారం “పిల్లవాడి యందు శ్రద్ధ వహించని తండ్రిదే బాధ్యత అని, కుక్కలకి కూడా సమాజంలో బ్రతికే హక్కులు ఉంటాయి అని, ఆ మాటకొస్తే, వాటికి అన్నం, నీళ్లు పెట్టడం వంటివి జనాలు చేయట్లేదని” అంటున్నాడు. 


అవి ఎండలకు, వానలకు, చలికి ఆకలికి అలమటించి విసిగిపోతాయిట. “అందువల్లనే ఆ బక్కచిక్కిన జీవాలు తేలికగా దొరికే చిన్న పిల్లల మీద తమ ప్రతాపం చూపిస్తాయి” అంటాడు. అదేమంత పెద్ద విషయం కాదన్నట్లు చెప్తున్న వాదన చూస్తే వనజకి ఒళ్ళు మండిపోయింది.


“జీవుల పట్ల జాలి ఉండచ్చు కానీ, సమాజంలో ఒక్క పూటకి కూడా తిండి దొరకని జనాలు వున్నారని, ఈ సమాజంలో అసలు మనుషుల జీవితాల కంటే కుక్కలకి విలువ ఎక్కువా?” అనిపించింది.


ఆ సుబ్బారావు హావభావాలు, అడ్డంగా వాదిస్తున్న వాక్ధోరణి ఆమెకి చాలా కోపం తెప్పించాయి. టీవీ ఆపేసింది ఆమె. “వీధి కుక్కలకి ఇచ్చే ప్రాధాన్యం చంటి బిడ్డలకి ఇవ్వరా?” అనుకుంది. కుక్కలని ఎన్నో సంవత్సరాలుగా జీవ కారుణ్య సంఘం వాళ్ళ వత్తిళ్ల వలన, చంపకుండా మున్సిపాలిటీ వాళ్ళు వదిలిపెట్టేస్తూ వున్నారు. ఏదో తూతూ మంత్రంగా వాటికి కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు జరిపి, ఆ పేరుతో నిధులు బొక్కేయడం మామూలైపోయింది.


ఆలోచిస్తూ వున్న వనజ, కాలింగ్ బెల్ మోగడం తో ఈ లోకంలోకి వచ్చింది. ముందు గది తలుపు తీసింది. పని పిల్ల రంగి లోపలికి వచ్చింది.


“అమ్మగారూ మీకు ఇంక బోర్ కొట్టదు లెండి.. పక్కింట్లోకి కొత్తగా ఎవరో దిగుతున్నారుగా “ అంది. 


“ఓహో” అంది వనజ. రెండు నెలలుగా ఆ పోర్షన్ ఖాళీగా ఉంది.

వనజ భర్త బ్యాంకులో ఆఫీసర్. పిల్లలు పెద్దవాళ్లయ్యారు. కొడుకు చెన్నైలో ఇంజనీరింగ్ 3వ సంవత్సరం చదువుతున్నాడు. కూతురుకి పెళ్ళయిపోయింది. కూతురు, అల్లుడు వనస్థలిపురంలో వుంటారు. పేరుకి, ఒకే ఊరయినా, ఈ ట్రాఫిక్, ఉద్యోగాల వత్తిడి వల్ల నెలకి రెండు సార్లే కూతురు, అల్లుడు కనపడేది. ఒకసారి వీళ్ళు వనస్థలిపురం వెళ్తే, మళ్ళీసారి కూతురు, అల్లుడు పిల్లని తీసుకుని వస్తారు.


మనవరాలి తో ఆడుకోవాలని వనజకి అనిపిస్తుంది. కానీ, ఎల్ కేజీ చదువుకే వాళ్ళ నాన్న ఐఏఎస్ అంత బిల్డప్ ఇస్తాడు. దాంతో వీళ్ళ ఇంటికి వచ్చినప్పుడు కూడా యేవో హోమ్ వర్క్ బుక్స్ అంటూ పుస్తకాలు తెచ్చి దాని ప్రాణం తీస్తూవుంటాడు. పిల్ల చురుకయినది. దాని ముద్దు ముద్దు మాటలతో అమ్మమ్మని కట్టి పడేస్తుంది. వనజకి ఉదయం వాకింగ్‌కి వెళ్లడం అలవాటు. వనజ భర్త సుదర్శనరావు మాత్రం వాకింగ్ అంటే బద్ధకిస్తాడు. అందుకే.. ఆవిడ ఒక్కర్తే దగ్గర్లో వున్న పార్కులో నడచి వస్తూ ఉంటుంది.


మనవరాలి వైపు ఆలోచనలో వున్న వనజ, రంగి పిలుపుకి ఉలిక్కి పడింది.

“అమ్మా.. నేనెళ్తున్నా.. పనయిపోయింది” అంటూ రంగి వెళ్ళిపోయింది.

వనజ హాలు లోకి వచ్చింది.


ఇంతలో వీధిలో ఏదో చప్పుడు అయితే, వెళ్లి తలుపు తీసి చూసింది.

వీధిలో వాన్ ఆగి వుంది. ఎవరో ఒక యువకుడు పక్క పోర్షన్ తలుపు తాళం తీస్తున్నాడు.


“అయితే పక్క పోర్షన్ లోకి ఎవరో ఇప్పుడే వస్తున్నారన్నమాట” అనుకుంది.

ఇంతలో వాన్ వెనుకే ఒక టాక్సీ వచ్చి ఆగింది. కారులోంచి ఒక యువతి, పెద్దావిడ దిగుతున్నారు. వాళ్ళు చిన్న స్టో, దేవుడి ఫోటో, తదితర, పాలు పొంగించుకునే సామగ్రితో ఇంట్లోకి ప్రవేశిస్తున్నారు.


మరికాసేపట్లో ఇంట్లోకి సామాన్లు చేర్పించేసేక, వాన్ వెళ్ళిపోయింది. ఇప్పుడు నెమ్మదిగా వాకిట్లోకి వెళ్ళింది. పలకరింపు గా నవ్వింది.


పరిచయాలు అయ్యాక తెలిసింది. ఆ అబ్బాయి ఐ.టీ కంపెనీలో పనిచేస్తాడుట. పెళ్ళయి 6 నెలలయింది ట. అతని ఆఫీసు కాంపస్ కి దగ్గరగా ఇల్లు మారేరుట. అతని చెల్లికి పెళ్ళయిపోయి, విజయవాడలో ఉంటుందిట. వాళ్ళ నాన్న గారికి సెలవు పెట్టడం కుదరక, ఆఫీసుకి వెళ్ళిపోయారుట అందుకే వీళ్ళు వచ్చి పాలు పొంగించుకున్నారని చెప్పారు.


ఏమయినా కావలిస్తే..  మొహమాటపడకుండా అడగమని   చెప్పి ఇంట్లోకి వచ్చేసింది  వనజ.

***

ఉదయాన్నే యధా ప్రకారంగా,  నడకకి బయలుదేరింది వనజ. అదే సమయం లో పక్క పోర్షన్ లోనుండి  కళ్ళజోడు ధరించిన ఒక పెద్దాయన కూడా గేట్ తీసుకుని వస్తూ ఉండడం చూసింది.  వనజని చూసి పలకరింపుగా నవ్వేడు ఆయన.

"మేడం ఈ వీధి చివర పార్కు వాకింగ్ కి బావుంటుందా ?”  ఆయన ప్రశ్న.

ఆయనని చూస్తూనే..అదిరిపడింది. ఆయన ఎవరో కాదు. ఆరోజు టీవీ డిబేట్లో చూసిన పెద్దమనిషి.


“బావుంటుంది అండీ. నేను కూడా వాకింగ్‌కు ఆ పార్కుకే వెళతాను” యధాలాపంగా అంది.


ఆయన తన గురించి చెప్పుకుంటున్నాడు.. “మేము నిన్ననే పక్క పోర్షన్ లోకి వచ్చేము. నా పేరు సుబ్బారావు. నేను ఇన్సూరెన్స్ కంపెనీలో చేస్తాను” అని చెప్పాడు.


“ అలాగా!  “ అంది.  ఇద్దరూ కలసి నడిచేరు.

పార్కులో వాకింగ్ అయిపోయాక వెనుకకి వచ్చేస్తూ ఉంటే  అయన వీధి కుక్కలకి బిస్కట్లు వేస్తూ ఆగిపోయాడు.


వింతగా చూస్తూ ఆగిన వనజ కేసి తిరిగి, “మీరు వెళ్లిపోండి.  వీటికి ఫుడ్ పెట్టి వస్తాను.  నేను ఎక్కడ వున్నా ఇది నాకు మామూలే “ అన్నాడు.  వెనక్కి తిరిగి వచ్చేసింది వనజ.


సుబ్బారావుగారు, వనజ, రోజూ వాకింగ్ కి కలిసి వెళ్లడం అలవాటయింది. వనజ భర్త అప్పుడప్పుడు వీళ్లతోకలుస్తాడు.  కానీ తరచూ ఏదో వంక తో వాకింగ్ మానేస్తూ ఉంటాడు.


ఓ నెల్లాళ్ళు రోజూ వాకింగ్ కి వెళ్లి వస్తూ ఉండడంతో, సుబ్బారావు గారిద్వారా వాళ్ళ ఇంటి విషయాలు వనజ కి తెలిసాయి.


కూతురు, అల్లుడు, మనవరాలు విజయవాడలో ఉంటారని, ఆ మనవరాలు అంటే వల్లమాలిన అభిమానమని అన్నారు. ఆ పిల్లకి 4 ఏళ్ళుట. కూతురు మళ్ళీ గర్భవతి అని, రేపో మాపో కూతురిని పురిటి తీసుకుని రావాలి అని చెప్పారాయన.


మళ్ళీ ఆయనే ఇలా అన్నారు:

“మామయ్యా! మీకెందుకు శ్రమ, ఆ ఫార్మాలిటీస్ ఏమీ వద్దు.. నేనే మీరు ఇల్లు మారిపోయాక కారులో మీ అమ్మాయిని, మనవరాలిని తీసుకొచ్చి దింపుతానని” ఆయన అల్లుడు చెప్పాడట. అల్లుడి మంచితనం గురించి పొగిడారు.


మరునాడు ఉదయం నడకకి బయలు దేరిన వనజకి సుబ్బారావు గారు, “ఆ రోజు సాయంత్రం అల్లుడు, తన కూతురిని, మనవరాలిని తీసుకుని వస్తున్నారని, సాయంత్రం వాళ్ళు వచ్చేసరికి ఆఫీసు నుండి వచ్చేస్తానని” చెప్పారు. ఆయన మొహం లో సంతోషం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది.


మధ్యాహ్నం సుబ్బారావు గారి భార్య యశోదతో మాట కలిపింది వనజ. సుబ్బారావు గారికి ఆఫీసులో ఏదో అర్జంటు మీటింగ్ వుందని, అదయ్యేక సాయంత్రం వస్తారని, ఈలోగా కూతురు అల్లుడు టాక్సీలో ఇంటి ముందు దిగుతారని ఆవిడ చెప్పారు. కూతురికి దగ్గరలోని నర్సింగ్ హోమ్ లో పురుడు పొసే ఉద్దేశ్యం వ్యక్తపరిచింది.

“మరో 6 నెలలు ఇల్లంతా సందడే” అంది ఆవిడ.


వనజకి కూడా యశోద మనవరాలిని  చూడచ్చని, తన మనవరాలు తన దగ్గర లేని లోటు కొన్నాళ్ళు  ఆ చంటిపిల్ల తో తీరుతుందని అనిపించింది.


సాయంత్రం ఆరు దాటింది. చీకట్లు ముసురుకున్నాయి. సుబ్బారావు గారి అల్లుడు రమేష్ చంటిపిల్లని, భార్యని, తీసుకుని టాక్సీలో వస్తున్నాడు. ఆ టాక్సీ, వీళ్ళుండే వీధి ప్రక్క వీధి చివరకి వచ్చేసరికి టైర్ పంచరై, కీచు మంటూ పెద్ద శబ్దంతో ఆగిపోయింది.


రమేష్ కి అర్థం కాలేదు. ఏమైందని డ్రైవర్ ని అడిగేడు. డ్రైవర్ కారు దిగి, టైర్ పంచరైనట్లు చెప్పాడు. స్టెఫినీ వెయ్యమన్నాడు రమేష్.

“స్టెఫినీ లేదండీ”  అన్నాడు డ్రైవర్.


“టాక్సీ అంటే స్టెఫినీ టైర్ ఉండాలి కదా” అని వాదిస్తున్నాడు రమేష్. అతనికి, జరిగిన అసౌకర్యానికి డ్రైవర్ మీద చాలా కోపం వచ్చింది.

డ్రైవర్ అదేమీ పట్టించుకోకుండా.. “టైరు కూడా పగిలి పోయింది. బాగు చేయించుకుని వస్తాను ఆగండి” అంటున్నాడు.


అప్పటికే స్వప్న మొబైల్ లో లొకేషన్ పెట్టుకుంది. మరో రెండు వీధుల్లో అన్నయ్య ఇల్లు చూపిస్తోంది .  అన్నయ్య చెప్పిన గుర్తుల ప్రకారం, ఆ పార్కు వీధిలో రెండు ఫర్లాంగులు ముందుకు వెళ్లిన తర్వాత ఎడమ పక్క వీధిలోకి తిరిగాక కుడి ప్రక్క 8వ ఇల్లే అని చెప్పిన విషయం గుర్తుకు వచ్చింది.


డ్రైవర్ తో తగాదా పడుతున్న రమేష్ తో స్వప్న  ఇలా అంది :

“అన్నయ్య ఇల్లు దగ్గరే.. మీరు డ్రైవర్ కి డబ్బులు సెటిల్ చేసి రండి, బుజ్జితల్లిని తీసుకుని నేను నడుస్తూ వుంటాను” అని ముందుకు కదిలింది.


స్వప్న నిండు గర్భిణీ అవడం వల్ల నెమ్మదిగా నడుస్తోంది, పాప తల్లి పక్కనే నడుస్తోంది. రెండు ఫర్లాంగుల దూరం నడిచేరు, ఎడమ పక్క సందులోకి తిరిగేరు. వీధి లైట్లు వెలగడం లేదు. వీధి చీకటిగా వుంది. వాళ్ళు గమనించుకోలేదు, ఇంతలో ఎక్కడినుండి వచ్చేయో నాలుగైదు కుక్కలు ఒక్కసారిగా పిల్లమీద మూకుమ్మడి దాడి చేశాయి. పిల్ల బెంబేలెత్తిపోయి అరుస్తోంది. స్వప్నకి ఏం చెయ్యాలో తోచలేదు. ఏమీ చెయ్యలేని నిస్సహాయత. అవి పిల్లని ఒక పక్కకి లాక్కెళ్లిపోతున్నాయి. పిల్ల ఆర్తనాదాలు వినే నాధుడు లేడు. వీధి నిర్మానుష్యంగా వుంది.


స్వప్న “ఏమండీ” అని అరుస్తోంది కానీ, అప్పటికే వాళ్ళు మలుపు తిరిగి ఉండడం తో ఆమె అరుపులు, భర్తకి వినపడే అవకాశం లేదు. ఆమె నిస్సహాయతకి, వాటికి మరింత ధైర్యం వచ్చింది. పిల్లని ఇష్టం వచ్చినట్లు కొరికేస్తున్నాయి. బిడ్డని కాపాడే ప్రయత్నంలో, తాను నిండు గర్భిణీ అన్న విషయాన్ని పక్కన పెట్టి వేగంగా కదలబోయింది కానీ పట్టుతప్పి కింద పడిపోయింది. 


కళ్ళు తిరిగి, స్పృహ కోల్పోతోంది ఆమె. చంటి పిల్ల హృదయవిదారకంగా అరుస్తోంది. ఇంతలో వీధిలోకి ప్రవేశించిన రమేష్, కుక్కల అరుపులు, బిడ్డ ఆర్తనాదాలు వినడంతో, వేగంగా కదిలేడు. కుక్కల మీదకి దొరికిన రాళ్లు విసిరేడు. రాళ్ళ దెబ్బలకి అవి అదిలిపోయి పారిపోయేయి కానీ, అప్పటికే పిల్ల పరిస్థితి దీనంగా వుంది. షాక్ తో హడిలిపోయిన పిల్ల స్పృహ కోల్పోయింది. వళ్ళంతా రక్తం కారుతోంది. కుక్కలు ఆ చిన్నపిల్ల బుల్లి వేళ్ళు అప్పటికే కొరికేసాయి. కాళ్ళూ చేతులూ కండలు ఊడి వచ్చేయి. ఒక పక్క భార్య, బిడ్డ అచేతనంగా పడి ఉండడం తో రమేష్ కి కాళ్ళూ చేతులూ ఆడడం లేదు.


అప్పుడే ఆఫీసునుండి వస్తున్నారు సుబ్బారావు గారు. స్కూటర్ లైట్ వెలుగులో కనపడిన దృశ్యం చూసి ఆయన కి పిచ్చెత్తినట్లు అయిపోయింది. గబాగబా స్కూటర్ ఆపి కూతురి మొహం మీద తన దగ్గర వున్న  బాటిల్ లోని నీళ్లు చిలకరించారు. అలాగే, చంటిపిల్ల మీద కూడా జల్లారు. ఇంటికి దగ్గరలోనే ఉండడంతో..భుజం మీద వేసుకుని వాళ్ళని ఇంటిదగ్గరికి తెచ్చారు, మామ అల్లుడు. అప్పటికే ఇంటికి వచ్చిన కొడుకు, ఇదంతా చూసి, వెంటనే  108 కి కబురు  చేసి, చెల్లిని, మేనకోడలిని దగ్గర్లోని  హాస్పిటల్ కి తీసుకెళ్లి జాయిన్ చేసేసాడు .


ఈ హడావిడికి సుబ్బారావు గారు, యశోద తల్లడిల్లి పోయారు. రాత్రి 9 గంటల వేళకి కొడుకు, అల్లుడు హాస్పిటల్ నుండి వచ్చేరు. స్వప్న కోలుకుందని, చంటిపిల్లని ICU లో వుంచేరని చెప్పారు. చంటిపిల్ల దగ్గర తల్లిని ఉంచి వచ్చేరుట. క్యారేజీ తీసుకుని సుబ్బారావు గారు, యశోద గారు కూడా హాస్పిటల్ కి వెళ్లారు. వనజ, సుదర్శనరావు కూడా వాళ్ళతో వెళ్ళేరు.


సుబ్బారావుగారి మొహం పాలిపోయింది. విషయం విన్న వనజకి కూడా అన్నం తినబుద్ధి కాలేదు, నిద్ర పట్టలేదు.


నిండు గర్భవతి కనుక, వత్తిడిలో వుంచద్దని రాత్రి 11 గంటలకి స్వప్నని ఇంటికి తెచ్చేసారు.


ఆమె అన్నయ్య,  యశోద గారు మనవరాలి కోసం హాస్పిటల్ లో ఉండి పోయారు.

“ 48 గంటలు గడిస్తే కానీ పిల్ల సంగతి చెప్పలేము”  అన్నారు డాక్టర్లు. స్వప్న, రమేష్ ల వేదనకి అంతు లేదు. రెండు రోజులు భారంగా గడిచేయి.  ఆ ఇల్లంతా నిశ్శబ్దం తాండవిస్తోంది. మూడవరోజుకి కాస్త రిలీఫ్ వచ్చింది. పిల్లకి ప్రాణాపాయం తప్పింది కానీ, చెయ్యికి ఆపరేషన్ చేయడం, కట్టు కట్టడం తో మరో రెండు, మూడు  రోజులు హాస్పిటల్ లోనే ఉండాలి అన్నారుట.


సుబ్బారావు గారు, వాళ్ళ అబ్బాయి  ఆఫీసుకి సెలవు పెట్టేసేరు. ఆయన  చాలా పీక్కు పోయారు. గడ్డం పెరిగి పోయింది. దిగులుగా కనిపిస్తున్నారు.  రోజూ హాస్పిటల్ కి క్యారేజీలు పట్టుకెళ్ళడం జరుగుతోంది.


ఆరోజు పొద్దున్నే జీవకారుణ్య సంఘం వాళ్ళు, ఆయన ఆఫీసు వాళ్ళు, విషయం తెలిసి ఆయన్ని పలకరించడం కోసం ఒకరి తర్వాత ఒకరు వచ్చేరు. సుబ్బారావు గారి ముఖం చూస్తే వనజకి చాలా జాలి వేసింది. ఈయన ఆరోజు టీవీ డిబేట్ లో “పిల్లవాడి మరణం తల్లిదండ్రుల అజాగ్రత్త వల్లనే అని, వీధి కుక్కలకేమి తెలుస్తుంది” అన్నట్లు మాట్లాడేరు కదా... ఈ రోజు తన మనవరాలిని చావు వరకు తీసుకెళ్ళినవి అలాంటి కుక్కలే కదా. ఇప్పుడు ఆయన ఆలోచనా ధోరణి ఏమిటో? అనిపించింది.


“ఇప్పుడు తప్పు ఎవరిదంటారు? తప్పు మనవరాలిదా? లేక నిస్సహాయంగా వుండిపోయిన స్వప్నదా? లేక అల్లుడు రమేష్ దా?.. ఎవరిదంటారు ఈయన?” అని అనుకుంది వనజ.


మరో మూడు రోజులకి చంటిపిల్లని హాస్పిటల్ నుండి ఇంటికి తెచ్చేరు. పిల్ల కోలుకుంది. సుబ్బారావు గారు యశోద గారు కాస్త స్థిమిత పడ్డారు. వనజకి కూడా పిల్ల ఆరోగ్యం కుదుట పడడం తో చాలా రిలీఫ్ అనిపించింది.


మరునాడు మాటల్లో సుబ్బారావు గారు చెప్పారు “జీవ కారుణ్య సంఘంలో తన సెక్రటరీ పదవికి రాజీనామా చేసేరుట. వీధి కుక్కల నిర్మూలనలో తన వంతు కృషి చేయడానికి నడుం కడతానని” చెప్పారు.


విషయం ఏదయినా..తన వరకూ వస్తే, మనుషుల ఆలోచనా ధోరణి ఎలా మారుతుందో వనజ స్పష్టంగా గమనించింది.


సమాప్తం

వెంపరాల దుర్గాప్రసాద్ గారి కొన్ని ఇతర రచనలు( కథ పేరు పైన క్లిక్ చేయండి.):






వెంపరాల దుర్గాప్రసాద్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 




మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.



రచయిత పరిచయం:


నా పేరు: వెంపరాల దుర్గాప్రసాద్


నేను AP ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ లో


అనగా APEPDCL లో personnel Officer గా పని చేసి november 2022 లో రిటైర్ అయ్యేను.


రచనలు చెయ్యడం, బొమ్మలు వేయడం, పద్యాలు రాయడం నా హబీ లు.


క్రికెట్, ఫుట్ బాల్, టెన్నిస్ ఆటలు టీవీ లో చూడడం ఇష్టం.


ధోనీ, రోహిత్ శర్మ అంటే  క్రికెట్ లో చాలా ఇష్టం.


సంప్రాస్, జకోవిక్ ల టెన్నిస్ ఆట ఇష్టం.


ఫుట్ బాల్ లో రోనాల్డో కి ఫాన్.


వుండేది విశాఖపట్నం.


ఇప్పటి దాకా వివిధ పత్రికల్లో 40 కధలు రాసేను.





Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page