top of page
Original.png

తిక్క

#SurekhaPuli, #సురేఖపులి, #Thikka, #తిక్క,  #TeluguComedyStories, #తెలుగుహాస్యకథలు


Thikka - New Telugu Story Written By Surekha Puli

Published In manatelugukathalu.com On 30/12/2025

తిక్క - తెలుగు కథ

రచన: సురేఖ పులి

“మా అమ్మ కదూ! నా బుజ్జి కదూ, తిక్కా! నువ్వు బంగారు కొండ కదూ.. ఈ కాస్త అన్నం తినమ్మా” ఛాయమ్మ కొడుకు తిక్క శంకరయ్య చేత నిన్న రాత్రి మిగిలిన అన్నంలో పెరుగు కలిపి తాలింపు పెట్టి బతిమాలి, బామాలి.. తినిపించే ప్రయత్నం చేసింది.


“ప్రతి రోజు ఇదే తంతు, చద్ది అన్నం.. ఒక రోజు పెరుగు కలుపుతావు; ఇంకో రోజు కిందటేడు మిగిలిపోయి చప్పబడి, రంగు మారిన ఊరగాయ కలిపి, తాలింపు మాడ్చిన చిదరన్నం; రెండు తెలుగు రాష్ట్రాల ఫేమస్ ఆ.తె.స. (ఆంధ్ర, తెలంగాణ సమైక్యత) అని; ఇక ఆపై రోజుల్లో చింతపండు, మిరప్పండు, దబ్బకాయ, ఉసిరికాయ, నిమ్మకాయ.. నా తలకాయ.. ఇలా వారానికి ఆరు రోజులు చద్ది అన్నంలో పులుపు కలిపి పోపు పెట్టిన కూడు తినాలి” విసుక్కున్నాడు తిక్క శంకరయ్య.


“మరి ఏడో రోజు ఏం తింటావు రా, బుజ్జి బంగారు కొండ!?” పరమ ఆనందంగా అడిగాడు తండ్రి పరమానందయ్య.


“ఏడో రోజా? శని.. ఉపవాసాల శనివారం! ఆంజనేయ స్వామి గుడికెళ్ళి అడుక్కు తింటాను. రెండు, మూడు సార్లు లైన్ కట్టి, నా అరచేయి చాపి పూజార్లు ఇచ్చే ప్రసాదాలను తిని, నా చేతిని నాక్కుంటూ తింటాను” బాధగా చెప్పాడు తిక్క శంకరయ్య.


“తిప్పలు పడితే తప్పు లేదు. ఇల్లంటే తిప్పలతో కూడిన తోపులాట” ప్లేట్లో మిగిలిన అన్నం గోరుముద్ద చేసి కొడుకు నోట్లో కుక్కింది తల్లి.


“ఎంత ఆస్తి, ఐశ్వర్యం ఉన్నా ఇంకా కూడబెట్టాలని, మీ పిసినారితనానికి పొదుపు అనే రంగు పులిమి.. చద్దన్నం తినలేక నేను చస్తుంటే కూడా బలవంతంగా తినిపిస్తున్నారు” ఏడుపు మొహం పెట్టాడు తిక్క శంకరయ్య.


“ఓరి, నా.. తిశంకు!.. ఇదే అన్నాన్ని ఫారిన్‌లో ఎగబడి తింటున్నారంట!” అంతర్జాతీయ పరిశోధన వివరాలు బహిర్గతం చేసింది తల్లి.


“పులిసిన ప్రాసెస్డ్ వాళ్ళు ఫారిన్లు.. మనమెందుకు పులవాలి?” విదేశీ తత్వం నచ్చలేదు కొడుక్కి.


“చద్దన్నం ఆరోగ్యానికి మంచిది. నీతో పాటు మేము తింటాం కదా బంగారం!” ఛాయమ్మ సమర్థించింది.


“ఆ.. మహా తిన్నారు.. నేను తిన్నాక ఏం మిగులుతుంది గనుక..?” అమాయకంగా కూపీ లాగాడు.


కాంతమ్మ, ఛాయమ్మ కవలలు. పరమానందయ్య కాంతమ్మ అందం చూసి ఇష్టపడ్డాడు. ఆస్తి ఉన్న అందగాడు అని పదేళ్ళ వయసు వ్యత్యాసం ఉన్నా, పెళ్లి అనే బంధం వేసి కట్టబెట్టారు పెద్దలు పందిట్లో!


కడుపొచ్చింది కానీ కాన్పు రాక మునుపే కన్ను మూసింది కాంతమ్మ. రెండో పెళ్లికి రెడీ అయ్యాడు కళత్రహీనుడు పరమానందయ్య.


ఆస్తిపాస్తులు అపరిచితుల పాలైపోతాయని పెద్దలు ఛాయమ్మను పరమానందయ్యకు మూడుముళ్ల బంధంతో ఒకటన్నారు. తిరునాళ్ళలో తిరిగిన తిరుగుళ్ళు ఫలించి, గొడ్రాలనే గొడ్డలిపెట్టు మాటలకు గుడ్‌బై చెప్పే రోజు వచ్చింది. తిక్క శంకరయ్య పుట్టాడు.


“మీ పెద్దమ్మ..” అంటూ అమ్మ నాన్న కథలు, కథలుగా చెప్పే కతల-వెతలు తిక్క శంకరయ్య బుర్రలో తొక్కతో సహా కూరుకుపోయాయి. పెత్తరమాస నాడు భక్తి శ్రద్ధలతో పెద్దమ్మ ఫోటోకు ధూప, దీప, నైవేద్యములు సమర్పించి నమస్కారం చేయడం ఆనవాయితీ అయింది.


పెద్దమ్మ ఏదో చెప్పింది చెవిలో.. ఏంటదీ?? గింజుకోసాగాడు తిక్క శంకరయ్య.. ‘ఎంత కవలలైనా నా చెల్లెలి సవతి రూపం నేను భరించలేను. శంకరా! వాళ్ల తిక్క కుదుర్చు!!’ ‘సరే కాంతుల పెద్దమ్మా..!’


చదువు-సంధ్య, రెండింటిలో చదువు అబ్బింది. ఇక సంధ్య వేటలో పడ్డారు.

“సంధ్య నాకు చాలా నచ్చింది. నీకు నచ్చిందీ, లేందీ.. చెబితే తర్వాత పనులు చేసుకోవచ్చు” అన్నది తల్లి.


“అవును, అమ్మాయి బాగుంది, చదువుకుంది, పై పెచ్చు మన గొంతెమ్మ కోరికలన్నీ తీర్చే కొండంత ఆస్తి ఉంది. ఇంకా వాడికి నచ్చకపోయే కారణ పుచ్చులు ఏమున్నాయి? ఏమీ ఉండకూడదు. ఓకే.. అందాం” పరమ ఆనందంగా అన్నాడు తండ్రి.


“అమ్మాయి.. ఒకే, ఒకే.. ఆమె కంటే వాళ్ళ ‘అమ్మ’ అదే ‘ఆంటీ’ మరీ నచ్చింది. ఎలాగూ ‘అంకుల్’ స్వర్గవాసి కదా; నాకు ‘వెధవ.. సారి, విధవరాలిని నా ఆలిగా కుదర్చండి. కుదరకపోతే చెప్పండి, నేను వేరే గాల్లో ఎగిరే గయ్యాళమ్మను నాతో ముడి పెట్టుకొస్తే, మీకు తిప్పలు తప్పవు” సిగ్గు-ఎగ్గులన్నిటిని పోగు చేసాడు సుపుత్రుడు.


“తిక్కలోడా! నీకేం పోయేకాలం? చక్కని చుక్క సంధ్య! ఆమె తల్లి.. సూర్యమ్మ.. నీకు.. ఛీ!” ఛీ కొట్టింది ఛాయమ్మ.


“అమ్మా, పోయేకాలం అంటే సంధ్య! వచ్చే కాలం అంటే సూర్యమ్మ!”


“పిచ్చి పోలికలు మాని; పెద్దలు చెప్పిన మాట విను. పెద్దల మాట చద్ది మూట!” పరమ కోపంతో శాసించాడు పరమానందయ్య.


“నేను ఎల్లప్పుడూ వినేది.. పెద్దల మాటనే!” తిక్కన్న తాపీగా చెప్పాడు.

తల్లిదండ్రులు నోరు తెరిచారు, ఆకలితో కాదు, ఆశ్చర్యంగా..!


నోరు మూయకముందే మళ్లీ అన్నాడు. “పెద్దమ్మ చచ్చి ఏడాది కాలేదు, నాన్న ఆస్తి ఏ గద్ద తన్నుకుపోతుందో అని అమ్మతో మీ పెళ్లి చేశారు పెద్ద పెద్దలు!”


“అందులో తప్పేమీ లేదు..” అన్నాడు తండ్రి.


“నా అక్క ఆస్తి, అక్క మొగుడి ఆస్తి వేరే వాళ్ళు కాజేస్తే ఎవరైనా చూస్తూ ఎలా ఊరుకుంటారు?” వంత పాడింది తల్లి.


“అందుకే అంటున్నా.. సంధ్య తల్లి ఆస్తి ఆరుగురు సంతానం పంచుకుంటారు. ఆరో వంతు ఆస్తి సంధ్యకు దక్కుతుంది! అదే విధవ సూర్యమ్మను పెళ్లి చేసుకుంటే ఆస్తి మొత్తం నాకు చెందుతుంది” కొండను తవ్వి ఎలుకను పట్టుకున్నంత సంతోషంగా చెప్పాడు తిక్క శంకరయ్య.


కొడుకు మాటలు చెంప పెట్టుగా తోచి కొట్టబోయారు ఛాయమ్మ, పరమానందయ్య. తప్పించుకుని పారిపోయాడు తిక్క శంకరయ్య.


సమాప్తం.

*****

సురేఖ పులి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ సురేఖ పులి  గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 


విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు. లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం:

Profile Link:

Youtube Play List Link:

 

పేరు :సురేఖ  ఇంటి పేరు: పులి

భర్త పేరు: స్వర్గీయ పి. అరుణ్ కుమార్

వయసు : 70 సంవత్సరాలు. పుట్టి, పెరిగింది హైదరాబాద్ లో.

మా అమ్మనాన్నలు స్వర్గీయ లక్ష్మి అర్జున్ రావు గార్లు నా మార్గదర్శకులు.

ప్రస్తుత నివాసం బెంగళూరు  విశ్రాంత సీనియర్ సిటిజన్ ను.

ఎంఏ (సోషియాలజీ&ఇంగ్లీష్) చేశాను.  స్కూల్, కాలేజీ మ్యాగజైన్ కు రాయడంతో నా రచనా వ్యాసంగం ప్రారంభమైంది.

HMT Hyd లో నా ఉద్యోగం, 2008  లో స్వచ్ఛంద పదవీ విరమణ.

చందమామ, యువ, స్వాతి,  ఈనాడు,  మన తెలుగుకథలుడాట్ కాం, నెచ్చెలి, ఉష పత్రిక, కెనడా డే  లలో నా కథలు, కథానికలు ప్రచురితమయ్యాయి. కొన్నిటికి బహుమతులు కూడా వచ్చాయి. మూడు నవలలు మాత్రమే రాశాను. అందులో “కల్పతరువు” నవలకు మన తెలుగు కథలు డాట్ కాం వారి బహుమతి లభించింది. మరిన్ని రచనలతో పాఠకులకు దగ్గర కావాలన్నది నా ఆశయం.

Surekha Puli 


1 Comment

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating

@surekhap4148

•8 hours ago

ధన్యవాదాలు 🙏

Like
bottom of page