తొలకరి జల్లు
- Surekha Puli

- Mar 28
- 6 min read

Tholakari Jallu - New Telugu Story Written By Surekha Puli
Published in manatelugukathalu.com on 28/03/2026
తొలకరి జల్లు - తెలుగు కథ
రచన: సురేఖ పులి
“రైతుల కన్నీళ్లు… చివరికి వర్షంగా మారాయి!” ఆద్యంతం ఆసక్తిని కలిగించే సురేఖ పులి గారి తొలకరి జల్లులో తడవండి. |
అదితి రైతు కుటుంబంలో ఏకైక సంతానం. ఉన్న ఊళ్ళో ఇంటర్ వరకు చదివి, పట్టణంలో పైచదువుల పట్టుదలను సాకారం చేసుకోవాలని తండ్రి వెంట నల్గొండ నుంచి హైదరాబాద్ ఎం.జి.బి.ఎస్. బస్ స్టాండ్ దిగి, క్లోక్ రూంలో ఫ్రెష్ అయ్యి, ఆటోలో కోఠి వచ్చారు.
హోటల్ రూమ్ తీసుకుని టిఫిన్, కాఫీ అయ్యాక ప్రఖ్యాతి చెందిన ఉమెన్స్ కాలేజీ చేరుకున్నారు.
శివరామకృష్ణయ్యకు పొలం పనుల ఒత్తిడి వలన పట్టణ ప్రయాణం వారం ఆలస్యం అయ్యింది. ‘సిటీ చదువులు, పైగా కాలేజీ తెరిచి వారం అయింది’ అని కూతురు పడే టెన్షన్ గమనించాడు తండ్రి.
“అడ్మిషన్ దొరికింది, ఇంక టెన్షన్ పడకు తల్లి. నువ్వు వచ్చే వరకు నేను ఈ చుట్టూ పరిసరాల్లో వసతి చూస్తాను. నీ క్లాస్ అయిపోగానే నాకు ఫోన్ చేయమ్మా” అని కూతురు భుజం తట్టి ధైర్యం చెప్పారు.
సరే అంటూ కాలేజీ లోనికి వెళ్ళింది. కనుమరుగయ్యే వరకు అదితి వైపు చూస్తూ గేట్ వద్ద నిలబడ్డాడు తండ్రి. మోకాళ్ళు దాటిన తెల్లటి ఖద్దరు లాల్చీ, భుజాన కండువా, సిల్క్ ఖద్దరు కలగలుపు ధోవతి ధరించి హుందాగా రాజకీయవేత్త గెటప్‌లో ఉన్న శివరామకృష్ణయ్యను ఉద్దేశించి “ఒక పక్కకు జరగండి” అని, వరుసగా కాలేజీకి వస్తున్న అమ్మాయిలకు అడ్డంగా ఉన్నాడని చౌకీదార్ అడ్డు తొలగమన్నాడు.
ససేమిరా హాస్టల్ వద్దంటున్న భార్య మాటలు దృష్టిలో పెట్టుకొని, ‘ఇంత పెద్ద మహానగరంలో ఎక్కడని అదితి కోసం వసతి చూడాలి? ఇబ్బంది లేకుండా చదువుకునే చిన్నపాటి ఇల్లు సమకూరితే బాగుండు’ అనుకున్నాడు శివరామకృష్ణయ్య.
పెద్ద థర్మాస్ నుండి కాగితం కప్పులో ‘టీ’ వంచి చౌకీదార్ చేతిలో పెట్టి, ‘కావాలా?’ అని సైగ చేశాడు ఛాయ్ వాలా.
తాగాలని లేకున్నా శివరామకృష్ణయ్య టీ తీసుకుని, ఛాయ్ వాలా చేతిలో రెండు టీల డబ్బులు పెట్టగానే ఆనందంతో చౌకీదార్ “ఏ ఊరు సేటు? ఏం చేస్తుంటారు?” అన్నాడు.
“నేను రైతును, నల్గొండ దగ్గర మా ఊరు. నా బిడ్డ ఈ కాలేజీలో చేరింది. ఇక్కడిక్కడ దగ్గరలో చిన్న ఇల్లు.. లేదంటే మంచి ఫ్యామిలీ రూమ్ కావాలి” అని రైతు స్వరంలో అభ్యర్థన చేశాడు.
“కూర్చో సేటు! నాలుగైదు కిలోమీటర్ల దూరం ఉంటే సరిపోతదా?” అని శుభ్రంగా ఉన్న తన కుర్చీ ఇచ్చి మరోసారి తుడిచి, తాగిన టీ కప్పులను పక్కన డస్ట్‌బిన్‌లో వేశాడు.
“నా బిడ్డ ఉండాల్సిన వసతి కాలేజీకి నడక దూరంలో ఉంటే బాగుంటది. దూరంగా ఉంటే బస్సుల రద్దీ! నా బిడ్డ ఈ మనుషుల తొక్కిసలాటలో ఎట్లుంటదో? వేరే ఏదైనా తెలిస్తే చెప్పు, తొందర లేదు. నేను రెండు రోజులు సిటీలో ఉంటా” అని మనసంతా అస్తవ్యస్తంగా ఉన్నందుకు కుర్చీలో రైతు కూర్చోలేదు.
కిలోమీటర్ పరిధిలో ఉన్న అద్దె గదుల వివరణ ఇచ్చాడు చౌకీదార్. అదే విషయం ఫోన్లో గంగతో చెప్పాడు. చుట్టూ పరిసరాల కోలాహలం వలన స్పీకర్ ఆన్ చేశాడు. గంగ పేయింగ్ గెస్ట్ వసతికి ఒప్పుకోలేదు.
పక్కనే ఉన్న చౌకీదార్ వారి సంభాషణ విని, “సేటు! మేడం చెప్పినట్టు తీసుకోండి, చిన్న కిరాయి ఇల్లు ఉంది. మన కాలేజీ స్టూడెంటు వాళ్ళదే ఇల్లు. ఇద్దరూ కలిసి రావచ్చు, పోవచ్చు. అటు.. అగో, కనిపిస్తుందా.. మెట్రో ట్రైన్! రాను, పోను మెట్రో ఉంది. అస్సలు ఫికర్ లేదు.”
చౌకీదార్, కావేరి ఇచ్చిన అడ్రస్ వివరాల కాగితం జేబులో నుండి తీసి శివరామకృష్ణయ్య చేతిలో పెట్టాడు.
“ఈ విషయాలు ఒకసారి నా బిడ్డకు చూపించు. అమ్మాయికి నచ్చితే చూద్దాం.” శివరామకృష్ణయ్య వంద నోటు చౌకీదార్ చేతిలో పెట్టాడు; నవ్వుతూ సెల్యూట్ చేశాడు చౌకీదార్.
ముఖాన నవ్వు పులుముకున్నా, మనసులో కూతురి వసతి ఏర్పాటు గురించి ఆలోచన కెలుకుతూనే ఉంది. వీల్స్ సూట్‌కేసు ఈడ్చుకుంటూ వెళ్ళాడు.
***
“హాయ్! నేను కావేరిని, యు.. అదితి..!?” వెనుక వైపు నుంచి వచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చింది.
“హాయ్.. అవును” అని చిరునవ్వుతో చేయి కలిపింది.
“రూమ్ కావాలన్నారట.. చౌకీదార్ చెప్పాడు. మా ఇల్లు ఒకసారి చూస్తే..” అంటూ కావేరి అడ్రస్ ఇచ్చింది.
“నాకు సిటీ కొత్త. నేను, మా నాన్న హోటల్‌లో ఉన్నాము. ఇద్దరం కలిసి చూస్తాము.”
“మూడింటికి మన లాస్ట్ క్లాస్. మీ డాడీని రమ్మని చెప్తే బెటర్! ముగ్గురం కలిసి వెళ్లొచ్చు.”
“అలాగే, రెంట్ ఎంత?” అని అదితి అడిగింది.
“ముందు రూమ్ చూడండి. మీ పేరెంట్స్ ‘ఓకే’ అంటే..” అదితి తండ్రికి ఫోన్ చేసింది.
***
“హలో గంగ, ఇల్లు చూశాము. నాకైతే ఇల్లు నచ్చింది. ఇంటి దగ్గరలోనే మెట్రో రైలు, ఖైరతాబాద్ నుండి ఉమెన్స్ కాలేజీ; ట్రాఫిక్ సమస్య లేదు. పదిహేను నిమిషాల్లో కాలేజీ చేరుకోవచ్చును. ఓనర్ వాళ్ళ అమ్మాయి, మన అదితి ఒకటే క్లాస్!” అని శివరామకృష్ణయ్య తృప్తిగా అన్నాడు.
“అడ్వాన్స్ ఇచ్చేయండి” అని గంగ అంది.
“రెంట్ ఎక్కువ, వేరే చూద్దామని అదితి అంటుంది. నువ్వేమంటావ్?” అని భార్యను అడిగాడు.
“దానికేం తెలుసండీ? మీకు నచ్చింది కదా.. అడ్వాన్స్ ఇచ్చేయండి. నేను ఒక్కదాన్ని పొలం పనులు చూడలేకపోతున్నాను, మీరు త్వరగా వచ్చెయ్యండి.”
భార్య అంగీకారం భర్తకు మరీ నచ్చింది.
***
స్వచ్ఛమైన గాలి, వెలుతురూ కలిగిన ‘పాంచజన్యం’ అపార్ట్‌మెంట్; రెండు బెడ్రూంలు సొంతానికి పెట్టుకొని, ఒక బెడ్ రూం అద్దెకు ఇచ్చింది కామాక్షి.
డాబా పైకి వెళ్లారు కావేరి, అదితి. టీవీ, ఇంటర్నెట్ వైర్లతో డాబా చిందరవందరగా ఉంది.
“ఈ స్థలం పూర్తిగా మాదే. రెండు ఫ్లోర్లు మావి, మిగతా మూడు బిల్డర్ అమ్ముకున్నారు” అని కావేరి గుండ్రంగా తిరుగుతూ గొప్పగా చెప్పింది.
“వడియాలు, పప్పులు ఆరబెట్టుకోవడం ఇబ్బంది అనుకుంటా..” అని సందేహంగా వెలిబుచ్చింది అదితి.
“ఈ రోజుల్లో సంవత్సరమంతా సరుకులు నిల్వ చేయరు, అవసరమైన మేరకు ఆన్‌లైన్‌లో కొనుక్కుంటున్నారు” అని నివృత్తి చేసింది కావేరి.
“అపార్ట్‌మెంట్ నివాసులకు అన్ని సౌకర్యాలు ఉండవు, అసౌకర్యాలతో మేనేజ్ అవ్వాల్సిందే” అని ఊళ్ళో విశాలమైన తన ఇల్లు గుర్తుకు తెచ్చుకుంది అదితి.
“ఊళ్ళో పైచదువు లేదు, సిటీ అయినా విలేజ్ అయినా ప్లస్, మైనస్‌లు ఉంటాయి!” అని జవాబిచ్చింది కావేరి.
మోగుతున్న ఫోన్ తీసుకుంది. “హలో, అమ్మా! మేము ఇక్కడే డాబా పైన ఉన్నాం.”
“ఎంతసేపు పైన ఉంటారు? కిందికి రండి, భోజనం రెడీగా ఉంది” అని కామాక్షి అంది.
“వస్తున్నాము” అంటూ స్నేహితులిద్దరూ ప్రకృతి వీక్షణలు నిలిపి ఇంట్లోకి వచ్చారు.
“పనిమనిషి కావాలా?” అని కామాక్షి అడిగింది.
“వద్దండీ, నాకు ఇంటి పనులు, వంట పనులు వచ్చు” అని అదితి మొహమాటపడుతూనే భోజనం చేసింది.
***
ఐదేళ్ల క్రితం కామాక్షి భర్త చనిపోయాడు. కొడుకు అశ్వథ్ వారణాసి సంపూర్ణానంద సంస్కృత విశ్వవిద్యాలయంలో డిగ్రీ పూర్తి చేసి, తిరుపతి యూనివర్సిటీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుతున్నాడు.
కూతురు కావేరి మహిళా డిగ్రీ కళాశాలలో పర్యావరణ శాస్త్రం డిగ్రీ మొదటి సంవత్సరంలో చదువుతున్నది.
వేసవిలో అశ్వథ్ ఇంటికి వచ్చాడు. కొత్త అమ్మాయి కనబడగానే మనసులో కలవరం మొదలైంది.
“అమ్మా, ఎవరైనా ఫ్యామిలీ వాళ్ళు ఉంటే బాగుండేదేమో..!” అన్నాడు.
“ఎవరైతే ఏం? రూమ్ శుభ్రంగా పెట్టుకుంటే చాలు” అని కొడుక్కి జ్యూస్ ఇచ్చింది కామాక్షి.
“ఆంటీ, మా ఊరు వెళ్తున్నాను. సెలవులు అయిపోయాక వస్తాను.” హాల్లోకి సడన్గా అదితి వచ్చినందుకు తన మాటలు విన్నదేమోనని తలదించుకున్నాడు అశ్వథ్.
“నేను రెడీ, పద పోదాం” అంటూ కావేరి హడావిడి చేసింది.
“నేను ఎప్పుడో రెడీ..” అదితి మెయిన్ డోర్ వైపు నడిచింది.
“ఎక్కడికి?” అని అశ్వథ్ చెల్లిని ప్రశ్నించాడు.
“సెలవులని అదితి వాళ్ల ఊరెళ్తోంది, నా స్కూటీ పైన రైల్వే స్టేషన్ వరకు డ్రాప్ చేస్తాను.”
“చీకట్లో నువ్వెందుకు? నేను డ్రాప్ చేస్తాను” అని అశ్వథ్ అన్నాడు.
“కావేరి, నువ్వు రానంటే.. నేను ఆటోలో పోగలను” పరిచయం లేని వ్యక్తి రావడం కంటకంగా తోచింది అదితికి.
“అశ్వథ్ నిన్ను డ్రాప్ చేస్తే తప్పేంటి? ఇది ఊరు కాదు, సిటీ..” అని కామాక్షి కొడుక్కి మద్దతు పలికింది.
అదితికి ఇష్టం లేకున్నా ‘సరే’ అని హ్యాండ్ పర్స్ భుజాన వేసుకుని గేటు బయటకు వచ్చాక,
“అశ్వథ్, నేను వెళ్లగలను. ఆటో బుక్ చేసుకుంటాను. ఆంటీ బాధ పడతారని ‘ఓకే’ అన్నాను” అని మృదువుగా చెప్పింది.
అతను స్టార్ట్ చేసిన స్కూటీ ఆఫ్ చేసి, అదితి కళ్ళలోకి చూసాడు. ‘సారీ’ చెబుతుందేమో అనుకున్నాడు. ఆమె ఏమీ పట్టించుకోకుండా ఆటో ఎక్కింది.
***
అదితి పట్ల అశ్వథ్‌లో మొదలైన అతీతమైన ఆధ్యాత్మిక తరంగం ‘అమ్మ’తో వివరించాడు. “ముందు శ్రద్ధగా చదువు పూర్తి చేయి, ఉద్యోగం సంపాదించు. ఇది పెళ్లి చేసుకునే సమయం కాదు” అని కామాక్షి కళ్లెం వేసింది.
అశ్వథ్ చాలా సేపు ఆలోచించాడు. అదితి మనసులో తనంటే సద్భావన ఏర్పడాలి, ఏకపక్ష దారిలో వెళితే గమ్యం చేరడం సులువు కాదు. చెల్లెల్ని మధ్యవర్తిగా నిశ్చయించుకున్నాడు.
“అన్నయ్యా, అదితి ఇప్పుడున్న ట్రెండ్‌కు భిన్నం. తనలో నీకు నచ్చిన గుణమేంటి?” అని అడిగింది చెల్లెలు.
“ఆమె ప్రవర్తన. మంచి నడవడిక, అందమైన కళ్ళు, కుదురుగా వేసుకున్న బట్టలు, లక్షణంగా వేసుకున్న జడ.
ఇప్పుడున్న ట్రెండ్ నాకు నచ్చదు. ఫ్యాషన్ పేరిట పొట్టి బట్టలు, జుట్టు వదిలేసుకుని పూనకంతో శివమెత్తిన మేకప్ ముఖాలు! నువ్వు మరో సహాయం చేయాలి. వాళ్ళ ఇంట్లో వాళ్ళు పెళ్లి సంబంధం చూస్తే ఆపాలి, అదితి నా కోసం పుట్టింది.” అని చెల్లెలికి తన మనసులోని ప్రేమ పోరాటం చూచాయగా వివరించాడు.
***
వానలు లేవు. నేల పొడిగా మారి, సారవంతమైన గుణాన్ని కోల్పోయి దిగుబడి తగ్గిపోతుంది. ఖరీఫ్ పంటకు కావాల్సిన వర్షపాతం లేదు. రైతులు కొత్తగా విత్తనాలు వేయలేరు. పంటలు పండకపోతే నష్టం రైతు ఒక్కడికే కాదు, దేశానిది. వర్షాలు లేక పొలాలు ఎండిపోవడంతో ఇబ్బందులు పడుతున్న తల్లిదండ్రుల దీనావస్థ, కన్నుల్లో నిర్వేదం చూడలేక అదితి ఆకాశం కేసి చూసి ‘ప్రకృతి కరుణ కోసం’ మనసులో ప్రార్థించింది.
***
“నా సంస్కృత పట్టానికి, నా వేదశాస్త్ర పటిమకు తిరుమల దేవస్థానంలో వేద విద్య, సంస్కృతి, ఆధ్యాత్మికతను సామాన్య జనులకు అందుబాటులోకి తీసుకురావడానికి నాకు అనువైన పదవి దొరికింది” అని అశ్వథ్ అదితికి ఫోన్లో చెప్పాడు.
“కంగ్రాట్యులేషన్స్!” పొడిగా అభినందనలు తెలియచేసింది.
“థాంక్యూ! ఈ సంవత్సరం ఇటు నా ఉద్యోగం, అటు నీ డిగ్రీ పూర్తి.. ఇక మనం కలిసి..” అని ఆనందంగా అన్నాడు.
“నా బాధ నన్ను తొలిచేస్తుంది. నేను నీ అంత సంతోషంగా లేను.” ఆర్తిగా అంది.
“నాతో చెప్పలేని బాధలు ఏంటో?” చూచాయగా అడిగాడు అశ్వథ్
“ఆదివారం ఊరెళ్ళి చూశాక.. నా మూడ్ ఆఫ్ అయ్యింది. నీటి ఎద్దడి! రైతు శ్రమ ఫలితం దుఃఖమా? మా ఊళ్ళో పంటలకు సరిపడే నీళ్ళు లేవు. చెరువులు, బావులు ఎండిపోయాయి. ఉన్నోళ్లు వలస వెళుతున్నారు. లేనోళ్లు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మేము ఎటు గానీ మధ్యస్తం! ఏం చేయాలి?
ఊళ్ళో సహకార సంఘాల ద్వారా తీసుకున్న సహాయం ఎన్నాళ్ళని సమస్యలకు సమాధాన పర్చగలవు? రైతు శ్రమకు విలువ లేకుండా పోయింది!” అని అశ్వథ్ మాట్లాడటానికి అవకాశం ఇవ్వకుండా కంఠశోష సూటిగా చెప్పింది.
“ఈ దుఃఖం మనందరిది. బాధ పడకు. ఏదో ఒకటి చేద్దాం!” ధైర్యం చెప్పాడు.
“నువ్వు-నేను ఏం చేయగలం? దేవుడే రక్షించాలి” అని నిరసనగా అంది.
“ఆ పరమాత్మనే అడుగుదాం!” అశ్వథ్ నమ్మకంగా అన్నాడు.
“అడుగు..” నిర్లిప్తంగా ఫోన్ ఆఫ్ చేసింది.
***
భారతీయ వేద విద్యా సంప్రదాయంలో అసమానమైన కీర్తి పొందిన ప్రముఖ ఆధ్యాత్మిక పండితులు, గురువులు తిరుమల దేవస్థానంలో వరుణ యాగం జరిపించారు. మహామహుల దీక్షా సమూహ సమక్షంలో అశ్వథ్ ఒకడైనాడు.
దేవదేవుడు కరుణించాడు. వర్షం కురిసి నేలతల్లి పులకరించింది. చెరువులు నిండాయి, వాగులు పొంగి, పంటచేలు కళకళలాడాయి. ఎండిన ఆకులకు, కొమ్మలకు ఇక సెలవు; ఇప్పుడంతా పచ్చని చిగుళ్లు!
ఆకాశం వైపు ఆనందంగా చూసింది. మనసంతా పరవశం! మానవాతీతమైన ఆధ్యాత్మిక అద్భుతం అంటే ఇదే! ఇంతకంటే ఏం కావాలి?!
***
“అదితి ఏదైనా మాట్లాడు..” అని ఆసక్తిగా అడిగాడు అశ్వథ్.
“నా కోసం ఎప్పుడొస్తున్నావు..?” గోముగా అడిగింది.
“నువ్వు ఎప్పుడు రమ్మంటే అప్పుడే!” అని కొంటెగా అన్నాడు.
“కరెక్ట్ డేట్ చెప్పు. ఎందుకంటే, నువ్వు మా ఊరికి వచ్చి మా అమ్మానాన్నలతో కలిసి మాట్లాడాలి.”
“మీ ఊరికి నేను ఒక్కడిని కాదు, మా అమ్మ, చెల్లి కూడా వస్తారు.”
“యు ఆర్ మోస్ట్ వెల్కమ్!”
సమాప్తం.
*****
సురేఖ పులి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ సురేఖ పులి గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు. లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం:
Profile Link:
Youtube Play List Link:
పేరు :సురేఖ ఇంటి పేరు: పులి
భర్త పేరు: స్వర్గీయ పి. అరుణ్ కుమార్
వయసు : 70 సంవత్సరాలు. పుట్టి, పెరిగింది హైదరాబాద్ లో.
మా అమ్మనాన్నలు స్వర్గీయ లక్ష్మి అర్జున్ రావు గార్లు నా మార్గదర్శకులు.
ప్రస్తుత నివాసం బెంగళూరు విశ్రాంత సీనియర్ సిటిజన్ ను.
ఎంఏ (సోషియాలజీ&ఇంగ్లీష్) చేశాను. స్కూల్, కాలేజీ మ్యాగజైన్ కు రాయడంతో నా రచనా వ్యాసంగం ప్రారంభమైంది.
HMT Hyd లో నా ఉద్యోగం, 2008 లో స్వచ్ఛంద పదవీ విరమణ.
చందమామ, యువ, స్వాతి, ఈనాడు, మన తెలుగుకథలుడాట్ కాం, నెచ్చెలి, ఉష పత్రిక, కెనడా డే లలో నా కథలు, కథానికలు ప్రచురితమయ్యాయి. కొన్నిటికి బహుమతులు కూడా వచ్చాయి. మూడు నవలలు మాత్రమే రాశాను. అందులో “కల్పతరువు” నవలకు మన తెలుగు కథలు డాట్ కాం వారి బహుమతి లభించింది. మరిన్ని రచనలతో పాఠకులకు దగ్గర కావాలన్నది నా ఆశయం.
Surekha Puli




@divikg5573
•11 hours ago
మన సంస్కృతి, సభ్యత చెప్పకనే చెప్పారు. Good 👍
@surekhap4148
•13 hours ago
ధన్యవాదాలు సర్ 🙏