top of page
Original.png

తోటకూర నాడేనా

#ThotakuraNadena, #తోటకూరనాడేనా, #JeediguntaSrinivasaRao, #జీడిగుంటశ్రీనివాసరావు, #TeluguMoralStories, #తెలుగునీతికథలు


Thotakura Nadena - New Telugu Story Written By Jeedigunta Srinivasa Rao Published In manatelugukathalu.com On 04/02/2026

తోటకూర నాడేనా - తెలుగు కథ

రచన : జీడిగుంట శ్రీనివాసరావు

ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత


రాజారావు, రాధిక దంపతులకు ఒక్కడే కొడుకు. రాజారావు చేసేది టాక్స్ వసూలు చేసే గవర్నమెంట్ ఉద్యోగం కాబట్టి, డబ్బులకు పెద్దగా ఇబ్బంది ఉండేది కాదు. కొడుకు సుకుమార్ కి ఊహ వచ్చిన తరువాత, మంచి స్కూల్లో చేర్పించాడు.


రోజూ తండ్రి ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేటప్పుడు, రకరకాల వస్తువులు తీసుకుని రావడం చూసి, తండ్రికి ఏదైనా కొట్టు ఉందేమో అనుకునే వాడు. ఆ వస్తువులు అన్నీ వ్యాపారస్తులని బెదిరించి తీసుకుని వచ్చినవి అని తెలిసినా, రాధిక భర్తని ఏమీ అనేది కాదు.


"సార్, ఇలా వారంకి ఒకసారి మా షాప్ కి వచ్చి డబ్బులు అడిగి తీసుకుని వెళ్ళటం మీకు న్యాయంగా ఉందా?" అన్న షాప్ యజమానికి నోటీసు ఇచ్చి, "నువ్వు టాక్స్ సరిగ్గా చూపించలేదు. నీ అకౌంట్ బుక్స్ పట్టుకుని ఆఫీసుకి రా," అన్నాడు.


"సార్, బుద్ధి తక్కువ అయ్యి డబ్బుల గురించి నా బాధ చెప్పాను. ఇదిగో, మీరు అడిగిన అయిదు వేలు. కేసు రాయకండి," అంటూ డబ్బులు రాజారావు చేతిలో పెట్టాడు.


“ఎందుకు నాన్నా, షాప్ ఆయన నీకు డబ్బులు ఇచ్చాడు? నువ్వు అతని ఆఫీసులో ఉద్యోగం చేస్తున్నావా?” అని అడిగిన కొడుకుతో, "పదరా, మీ స్కూల్ ఫీజు కట్టాలి," అంటూ కొడుకుని తీసుకుని వెళ్ళిపోయాడు.


ఎందుకు నాన్న అందరినీ డబ్బులు అడిగి తీసుకుంటున్నాడో సుకుమార్ కి అర్థమయ్యేది కాదు. సుకుమార్ టెన్త్ క్లాస్ కి వచ్చేసరికి, తన తండ్రి చేసే ఉద్యోగంలో లంచాలు బాగా వస్తాయి అని, తను కూడా పెద్ద అయిన తరువాత డబ్బులు బాగా సంపాదించే ఉద్యోగం చేయాలి అని నిర్ణయం చేసుకున్నాడు.


ఇంట్లో బాగా డబ్బులు ఉండటంతో, తల్లిదండ్రులకు తెలియకుండా డబ్బులు తీసుకుని, స్కూల్ స్నేహితులతో సినిమాలు, హోటళ్లు తిరిగేవాడు.


రాజారావు భార్య రాధిక కూడా కట్టిన చీర కట్టకుండా, డబ్బు నీళ్లలా ఖర్చు చేసేది.


ఒకరోజు రాజారావు ఆఫీసర్, "ఏమిటి, కలెక్షన్ తగ్గిపోతుంది? ఏమైనా నొక్కేస్తున్నావా? నాకు తెలియదు కదా?" అని అన్నాడు.


“సార్, వచ్చిన దానిలో మూడు వంతులు మీకే ఇస్తున్నాను సార్. మిమ్మల్ని మోసం చేసి ఒక్కరోజు కూడా ఈ ఉద్యోగంలో ఉండగలనా?” అన్నాడు రాజారావు. "సరే, జాగ్రత్తగా ఉండు," అనడంతో హమ్మయ్య అనుకుని బయటకు వచ్చాడు.


“ఇదిగో, మీ అకౌంట్స్ అసలు వాటితో సరిపడడం లేదు. ఇలా అయితే మీ ఫ్యాక్టరీ క్లోజ్ చేయాల్సి వస్తుంది. నిజాయితీగా వ్యాపారం చేసుకోవాలి, అంతేగానీ గవర్నమెంట్ కి టాక్స్ ఎగగొట్టాలి అనుకోవడం తప్పు,” అంటూ రాజారావు 'శ్రీను ఫర్నిచర్ వర్క్స్' ఉద్యోగులని అదరగొట్టడం మొదలుపెట్టాడు.


“సార్, మా యజమాని వచ్చే సమయం అయ్యింది. ఈ లోపున మీకు టిఫిన్ తెప్పించాము, తింటూ ఉండండి. మా కష్టాలు మీకు తెలియనివి కావు. మార్కెట్ బాగా డల్‌గా ఉంది సార్,” అంటూ అకౌంటెంట్ రాజారావుని ఏసీ గదిలోకి తీసుకుని వెళ్లి కూర్చోపెట్టి, అప్పటికే సిద్ధం చేసిన ఉప్మా, పెసరట్టు, పూరీ ప్లేట్ రాజారావుకి ఎదురుగా పెట్టాడు.


“ఇవి అన్నీ ఎందుకండీ? ఉదయం ఇంట్లో టిఫిన్ తిని బయలుదేరాను. మీరు ఇంత ఏర్పాటు చేసిన తరువాత వద్దంటే ఏం బాగుంటుంది? సరేలెండి, తింటాను. ఈ లోపు మీ యజమానికి ఫోన్ చేసి త్వరగా రమ్మనండి,” అన్నాడు రాజారావు.


ఒక అరగంటలో ఆ ఫ్యాక్టరీ యజమాని శ్రీరామ్ చెమటలు కక్కుతూ వచ్చి రాజారావు ముందు నిలబడి, "క్షమించండి, కొద్దిగా లేట్ అయ్యింది," అన్నాడు.


“ఏమిటండీ, గవర్నమెంట్ కి మీరు దగ్గర దగ్గర ఎనిమిది లక్షలు టాక్స్ కట్టాలి. అకౌంట్స్ చూస్తే లక్ష నష్టం అని చూపిస్తున్నారు. మేము అన్నీ తెలుసుకునే వచ్చాను,” అన్నాడు రాజారావు. “సార్, వ్యాపారం బాగుండలేదు. వస్తువులు తీసుకున్న షాప్ వాళ్ళు ఇంత వరకు డబ్బు పంపించలేదు. అంతా నష్టంగా ఉంది. మీరే కొద్దిగా మా పైన దయ చూపించాలి,” అన్నాడు.


“అందరూ అలాగే అంటే గవర్నమెంట్ ఎలా నడుస్తుంది? ఏమిటో మిమ్మల్ని చూస్తూ ఉంటే జాలి వేస్తోంది. మా ఆఫీసర్‌కి, మిగిలిన వాళ్లకు ఒక రెండు లక్షలు ఇస్తే, మీ వ్యాపారం నష్టంలో ఉంది అని రాసుకుంటాను,” అన్నాడు రాజారావు.


“సార్, అంత డబ్బులు ఇవ్వలేను. ఒక పదివేలు మీకు ఇస్తాను. కొద్దిగా దయచేసి ఈసారికి సద్దుకోండి,” అంటున్న శ్రీరామ్‌ని చూసి, “పదివేలు నాకు ముష్టి వేస్తావా? రేపు ఉదయం తొమ్మిది గంటలలోపు నేను అడిగిన రెండు లక్షలు నాకు మా ఇంటి దగ్గర అందజేయాలి. లేదంటే ఆఫీస్ నుంచి నీ ఫ్యాక్టరీ క్లోజ్ చేయటానికి ఆర్డర్స్ వస్తాయి. జాగ్రత్త,” అంటూ బయటకు వచ్చేసాడు.


ఎందుకైనా మంచిది అని తన ఆఫీసర్‌కి ఫోన్ చేసి, “ఒక లక్ష రూపాయలు డిమాండ్ చేసాను. బహుశా రేపు ఆ ఫ్యాక్టరీ యజమాని తెచ్చి ఇస్తాడు అనుకుంటున్నాను,” అని చెప్పాడు.


ఉదయం పేపర్ చదువుకుంటున్న రాజారావుకి, గేట్ తెరుచుకుని చేతిలో బ్యాగ్‌తో వస్తున్న ఫ్యాక్టరీ యజమాని శ్రీరామ్‌ని చూసి, మనసులో సంతోషంతో, “ఆ, రండి. అలా ఉండాలి. వ్యాపారం చేసుకునేవాళ్ళు పట్టువిడుపుతో ఉంటే మీకూ లాభం, మాకు లాభం,” అన్నాడు కుర్చీ చూపించి.


కుర్చీలో కూర్చుంటూ, “సార్, మీ మాట కాదనలేక మా భార్య నగలు తాకట్టు పెట్టి డబ్బు తెచ్చాను. 'నో టాక్స్ డ్యూస్ సర్టిఫికెట్' త్వరగా ఇప్పించండి,” అన్నాడు బ్యాగ్ రాజారావు చేతికి ఇస్తూ. రాజారావు భార్య రాధిక లోపల నుంచి అంతా వింటూ, ఈ డబ్బుతో తను నగలు చేయించుకోవాలి అనుకుంది.


“రెండు లక్షలు ఉన్నాయా?” అన్నాడు రాజారావు. “లెక్కపెట్టుకోండి సార్,” అన్నాడు శ్రీరామ్.


“అక్కరలేదు,” అంటూనే బ్యాగ్‌లో నోటు కట్టలు లెక్కపెడుతున్న రాజారావుకి, గేట్‌లోనుండి నలుగురు వ్యక్తులు లోపలికి వచ్చి, “మేము ఏ.సి.బి. (ACB) నుంచి వచ్చాము. నీ బండారం బయటపడింది. ఇలా ఎంత డబ్బు సంపాదించావో నీ చేతే కక్కిస్తాము,” అంటూ చేతిలోని బ్యాగ్‌తో ఉన్న రాజారావుని ఫోటో తీసి, బ్యాగ్ స్వాధీనం చేసుకుని, ఇల్లు సెర్చ్ చేయడం మొదలుపెట్టారు.


నిన్నటి రోజు కలెక్షన్ కూడా ఇంట్లో పెట్టుకున్న రాజారావు, “సార్, నాకు ఏ పాపం తెలియదు. మా ఆఫీసర్ నన్ను బలవంతం పెట్టి ఈ పని చేయిస్తున్నాడు. ఏదో ట్రాన్స్‌ఫర్ తప్పించుకోవడానికి ఈ పాడు పని చేస్తున్నాను,” అన్నాడు వణుకుతూ.


“ఆపావయ్యా నీ నాటకాలు. నిన్న నువ్వు ఈ శ్రీరామ్ గారితో డబ్బు గురించి మాట్లాడిన మాటలు రికార్డు చేసాడు. వింటావా?” అంటూ ఇన్స్పెక్టర్ గారు, “రాజారావుని అరెస్ట్ చేయండి,” అన్నాడు.


ఈ తతంగాం అంతా చూస్తున్న రాజారావు భార్య రాధిక, భర్తని అరెస్ట్ చేసారు అని తెలుసుకుని, ఏడుస్తూ భర్తని కౌగిలించుకుని, "ఇప్పుడు ఎలా అండీ?" అంది.


“పెళ్లి అయిన కొత్తల్లో డబ్బు కట్టలు తెచ్చి ఇచ్చినప్పుడే 'పట్టుబడితే ఎలా' అని అడిగి ఉంటే నాకు ఈ గతి పట్టేది కాదు. అందుకే, 'తోటకూర పక్కింటి పెరడు నుంచి దొంగిలించినప్పుడే తల్లి కొడుకుని శిక్షించి ఉంటే కొడుకు దొంగగా మారేవాడు కాదు' అంటారు. ఇంతవరకు నగలు కొనుకోవాలి, ఇల్లు కొనుకోవాలి అనుకున్నామే గానీ, ఇలా జైలు కూడు తినాలి అనుకోలేదు.”


ప్రతి భార్య తన భర్త జీతం కంటే ఎక్కువ తెస్తూ ఉంటే, ఆ డబ్బులు భర్త ఎలా సంపాదిస్తున్నాడో తెలుసుకుని, భర్తని చెడు మార్గం నుంచి మంచి మార్గంలోకి తెచ్చుకోవాలి. లేకపోతే ఇంతే సంగతులు.


నిజాయితీని మించిన ఆస్తి లేదు.


  శుభం

జీడిగుంట శ్రీనివాసరావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ జీడిగుంట శ్రీనివాసరావు గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 

ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం:

నా పేరు జీడిగుంట శ్రీనివాసరావు. నేను గవర్నమెంట్ జాబ్ చేసి రిటైర్ అయినాను. నేను రాసిన కథలు అన్నీ మన తెలుగు కథలు లో ప్రచురించినందులకు ఎడిటర్ గారికి కృతజ్ఞతలు.







30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.



Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page