top of page
Original.png

ఉద్యోగం కోసం

#CSGKrishnamacharyulu, #CSGకృష్ణమాచార్యులు, #UdyogamKosam, #ఉద్యోగంకోసం, #StoryOnSocialProblems, #సామాజికసమస్యలు


Udyogam Kosam - New Telugu Story Written By  - Dr. C. S. G. Krishnamacharyulu

Published in manatelugukathalu.com on 17/07/2025 

ఉద్యోగం కోసం - తెలుగు కథ

రచన: Dr. C..S.G . కృష్ణమాచార్యులు

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్

ఆర్ముగం విశ్వవిద్యాలయంలో, వుపాధ్యాయుల ఎంపిక కోసం ఇంటర్వ్యూలు జరుగుతున్నాయి. ప్రక్కనే వున్న సెనేట్ హాలులో అభ్యర్ధులు, తమ వంతు కోసం యెదురు చూస్తున్నారు. వారిలో, ఆ విశ్వ విద్యాలయంలోనే ఎంబియే చేసి, ఆ తర్వాత డాక్టరేట్ పట్టా సాధించిన చక్రవర్తి కూడా వున్నాడు. అశాంతితో అటు ఇటూ కదులుతున్న అతనిని గమనించిన ఒక సమీప అభ్యర్ధి, " నువ్వు ఈ విశ్వవిద్యాలయ విద్యార్ధివే గదా! పోస్ట్ నీకే యిస్తారు. ఎందుకలా ఒత్తిడికి గురవుతున్నావు?" అని మృదువుగా అడిగాడు. 


"అలాంటి గ్యారంటీ యేమీ లేదు. అందరికీ సమానావకాశాలివ్వాలన్నది మా వీసీ(వైస్ చాన్సెలర్ ). విధానం. అందువల్ల ఇక్కడున్న ఎవ్వరైనా సెలక్ట్ కావచ్చు " 


"ఇంటర్వ్యూలో వున్నది, ప్రొఫెసర్ కృష్ణమూర్తి గారని విన్నాను. నీ పిహెచ్. డి గురువుగారే కదా!ఆయన నీకు సహాయం చెయ్యడా?" 


"ఆయన విలువలు పాటించే వ్యక్తి. ఎవరు బాగా ఇంటర్వ్యూలో సమాధానాలిస్తారో వాళ్ళనే సెలెక్ట్ చేస్తారు. " 


" ఆలాగైతే, నువ్వు వేరే ప్రయత్నాలు చేసి వుండాల్సింది". 


 చక్రవర్తి సమాధానం చెప్పేలోపు, ఆ అభ్యర్ధి వంతు వచ్చింది. అతనికి ఆల్ ది బెస్ట్ చెప్పి, చక్రవర్తి గతం లోకి వెళ్ళాడు. 

@@@

చదువుకునే రోజుల్లో, కష్ట పడిచదివితే, మంచి వుద్యోగం వస్తుందన్న ఆశ విద్యార్ధిని శ్రమ పడేలా చేస్తుంది. అటువంటి ఆశే చక్రవర్తి యెదుగుదలకు కారణమైంది. చక్రవర్తి, ఒక పేద వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చాడు. చదివినది తెలుగు మీడియంలో నైనా ఇంగ్లీషు భాషపై పట్టు సాధించాడు. బోధనా వృత్తిపై కాంక్షతో ఎంబియే చేసి, వ్యాపార సంబంధమైన వుద్యోగాలకు వెళ్ళకుండా, పిహెచ్. డి చేసాడు. ఆ తర్వాత యుజిసి నెట్ పరీక్షలో ఉత్తీర్ణుడయ్యాడు. అలా ఒక యూనివర్సిటీ వుపాధ్యాయునిగా ఎన్నిక కావడానికి అవసరమైన అర్హతలన్నీ సాధించిన తరుణంలో వుద్యోగాల ప్రకటన వచ్చింది. 

అవకాశం వచ్చిందన్న ఆనందం ఒక ప్రక్క, అది తనకు దక్కుతుందో దక్కదో అన్న శంక మరొక ప్రక్క.. `  


అతడి మనసు సందిగ్ధతకు గురైంది. నీ కర్తవ్యాన్ని నువ్వు నిర్వహించు, ఫలితం దేవునికి వదిలిపెట్టు అనీ మనసులో అనుకుంటూ దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేసాడు. ప్రొఫెసర్ కృష్ణమూర్తి ఆశీస్సులు తీసుకుని దరఖాస్తుని యూనివర్సిటీకి పంపాడు. 

 

దరఖాస్తు చేసిన రెండు నెలల తర్వాత. ఇంటర్వ్యూలు ఎప్పుడు పెడతారో కనుక్కుందామని చక్రవర్తి ప్రొఫెసరు గారింటికి వెళ్ళాడు. ప్రొఫెసర్ గారి భార్య సౌజన్య స్కాలర్లను తల్లిలా అదరిస్తుంది. అతడిని చూసి ఆమె, " మీ వూరు వెళ్ళావా? అమ్మా నాన్నా బాగున్నారా! నీకు ఉద్యోగం వచ్చేస్తే, వాళ్ళని ఇక్కడికి తీసుకుని వచ్చేయచ్చు. " అని అంది. 


చక్రవర్తి మాటలు విని, కృష్ణమూర్తి బయటికి వచ్చారు. "నీ కోసమే చూస్తున్నాను. సెలెక్షన్ చాలా కష్టమయ్యేట్లుంది. దాదాపు వంద అప్లికేషన్స్ వచ్చాయి. ఉత్తర, దక్షిణాల ప్రభావం కూడా యెక్కువగా వుందని తెలిసింది. నీకెవరైనా, మంత్రులు తెలుసా?”


దీన వదనంతో చక్రవర్తి, " మంత్రులెవ్వరూ తెలియదు సర్!. నా స్నేహితుడు ఎకనామిక్స్ లో వుద్యోగానికి అప్లై చేసాడు. ఒక దళారిని కనుక్కుంటే కనీసం పాతిక లక్షలు, యివ్వాలన్నాడట. ” 


"మీ వూరి సర్పంచ్ ద్వారా మీ నియోజక వర్గం మినిస్టరు వుత్తరం సంపాదించుకుని రా. ”


"అలాగే సర్!" అని చక్రవర్తి, ప్రొఫెసరు గారికి, ఆయన భార్యకి నమస్కరించి వెళ్ళిపోయాడు. 


చక్రవర్తి ఒక పది రోజుల పాటు తన వంతు ప్రయత్నాలు చేసాడు. అవేవీ ఫలించకపోవడంతో, నిరాశతో ప్రొఫెసర్ గారిని కలిసి తన వేదనను వెళ్ళగ్రక్కాడు. 


“డబ్బే సర్! అధికారులని, రాజకీయ నాయకులని శాసించేది. నా దగ్గర అది లేదు. మా సర్పంచి, మంత్రి పర్సనల్ సెక్రటరీ, చివరికి. మంత్రి గారు అందరూ అంతో కొంతో యిచ్చుకోవాలన్నారు. వీరికి డబ్బులిచ్చే బదులు దళారి కిస్తే గ్యారంటీ వుంటుందని నాన్న అప్పుకోసం ప్రయత్నించాడు. అదీ కుదరక, నా పెళ్ళి చేస్తే, కట్నం వస్తుందని ఆశించాడు. ఆడ పిల్లలు ఐటీ అబ్బాయిలనే చేసుకుంటామనడంతో నాన్న, నేనూ విసిగిపోయాము. ” 


అతను చెప్పిందంతా విన్న ప్రొఫెసరు గారు “ నీ ప్రతిభే నీకు శ్రీరామ రక్ష. బాగా ప్రిపేరై రా. " అని అన్నారు. 

@@@

గత జ్ణాపకాల చేదు అతని మనసుని కలచి వేసింది. అంతలోనే ప్రొఫెసరు గారి శిష్య వాత్సల్యం, ప్రతిభ పట్ల ఆయనకున్నఅభిమానం గుర్తుకు వచ్చి ఒత్తిడిని అదుపులోకి తెచ్చుకున్నాడు. “ఇంక నా వంతు వస్తుందని” అతను అనుకుంటూండగా, పిలుపు వచ్చింది. ఆ తర్వాత ఒక గంటలో, అతను ఎంతో ప్రతిభావంతంగా ఇంటర్వ్యూ చేయడం, ఆ తర్వాతి నెలలో అతను వుద్యోగంలో చేరిపోవడం జరిగిపోయాయి. 


ఆనందోత్సాహాలతో పొంగిపోతూ, తిరుగుతున్నచక్రవర్తికి, తెలియని విషయమొకటుంది. 

 ఆ రోజు అతడు వెళ్ళిపోయాక, సౌజన్య భర్త దగ్గర కూర్చుని "మీరు నాకు నచ్చడం లేదు. సహాయం చెయ్యాల్సిన మీరు, చేతులెత్తేసినట్లు మాట్లాడడం న్యాయమా?" అని అడిగింది. 


"ఇంతకన్నా యేం చేయను?" 

"మీరు తలుచుకుంటే, ఆ అబ్బాయికి జాబ్ ఇప్పించగలరు". 


భార్య మాటల్లో ధ్వనిస్తున్న నిరసనని గమనించిన ఆయన, ఆప్యాయంగా ఆమె తల నిమురుతూ, " తల్లిలా ఆలోచిస్తున్నావు. మెరిట్ ప్రకారం అతనికి జాబ్ ఇచ్చి తీరాలని వీసీకి చెప్పాను. ఆయన కూడా ఆ జాబ్ నాకొదిలేసాడు. అందువల్ల అతనికి జాబ్ ఖచ్చితంగా వస్తుంది" అని అనునయంగా చెప్పాడు. 


"మరి ఆ మాట చెప్పక ఇంత ఇబ్బంది పెడుతున్నారెందుకు?" 


"నేను తండ్రిలా ఆలోచించాను గనుక. తేలికగా దొరికిన వాటి పట్ల మనకి గౌరవం వుండదు. ఒక జాబ్ తెచ్చుకోవడానికి. ఈ నాడు యువత, ఎంత కష్టపడుతున్నారో, ఎన్ని తలలు తాకట్లు పెడుతున్నారో అనుభవం మీద తెలిస్తే, అతనికి వుద్యోగం పట్ల శ్రద్ధ, తండ్రిపట్ల ప్రేమ, నా పట్ల కృతజ్ణత వుంటాయి. అంతే కాదు, స్వశక్తి మీద నమ్మకం పెరుగుతుంది. " 


భర్త మాటలు విన్న సౌజన్య, "ఔరా! ఎంత తెలివి" అని భర్త భుజాల మీద ప్రేమగా తలవాల్చింది. 

@@@@@


C..S.G . కృష్ణమాచార్యులు  గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం: Dr. C..S.G . కృష్ణమాచార్యులు

 

శ్రీ వెంకటేశ్వర విశ్వ విద్యాలయం, తిరుపతి  లో మేనేజ్మెంట్ విభాగంలో ప్రొఫెసరుగా రిటైర్ అయ్యాను. ప్రస్తుత నివాసం పుదుచెర్రీ లో.  నేను రచించిన మేనేజ్మెంట్ పాఠ్య గ్రంధాలు ప్రెంటిస్ హాల్, పియర్సన్ ఎడ్యుకేషన్, వంటి ప్రముఖ సంస్థలు  ప్రచురించాయి.

 ఈ మధ్యనే నాకిష్టమైన  తెలుగు రచనా వ్యాసంగం, ప్రారంభించాను.  ఆ సరస్వతీ మాత కృపవల్ల కొన్ని బహుమతులు గెలుచుకున్నాను. అందులో కొన్ని. చేజారనీకే జీవితం- నవల, ( కన్సొలేషన్ -మన తెలుగు కథలు .కాం ). మనసు తెలిసింది,  చీకటి నుంచి వెలుగుకు, (వారం వుత్తమ కథ- మన తెలుగు కథలు .కాం), గురువే కీచకుడైతే (3 వ బహుమతి - విమల సాహితీ ఉగాది కథల పోటీ) ఒకే పథం- ఒకే గమ్యం( ప్రత్యేక బహుమతి --వాసా ప్రభావతి స్మారక కథల పోటీ-  వాసా ఫౌండేషన్ & సాహితీకిరణం), తెలుగు భాష (ప్రత్యేక బహుమతి- పద్యాలు - షార్ సెంటర్ ఉగాది పోటీ), జంటగా నాతి చరామి ( కన్సొలేషన్- సుమతి సామ్రాట్ కథల పోటీ).

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page