top of page

వెంకట్రావు కాశీ యాత్ర


'Venkatrao Kasi Yathra' New Telugu Story

Written By Jidigunta Srinivasa Rao

'వెంకట్రావు కాశీ యాత్ర' తెలుగు కథ

రచన : జీడిగుంట శ్రీనివాసరావు

(ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత)
(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)


వెంకట్రావు, కళావతి యిద్దరూ గవర్నమెంట్ ఉద్యోగం నుంచి రిటైర్ అయ్యి పది సంవత్సరాలు అయ్యింది. వాళ్ళ యిద్దరి పిల్లలు ఉద్యోగాలు చేసుకుంటో తలో దేశం లో వుండిపోయారు. వెంకట్రావు కి, కళావతి కి వారి అన్నదమ్ములు హైదరాబాద్ లోనే ఉండటం, సర్వీస్ అంతా హైదరాబాద్ లోనే చేయడంతో హైదరాబాద్ వదిలి పిల్లల దగ్గర స్థిర పడటానికి యిష్టపడక హైదరాబాద్ లోనే వుంటున్నారు. “ఏమండోయ్ చూసారా, మా తమ్ముడు వాళ్ళు కాశీ వెళ్తున్నారుట, మీరు కూడా వస్తారా అని ఆడిగాడు. ఎప్పుడూ వండుకోవడం, తినడం, పడుకోవడం తప్ప ఏదైనా పుణ్యక్షేత్రానికి వెళదామని మీకు ఆలోచన రాదు అదేమిటో” అంది కళావతి భర్తతో. “చూడు.. నాకు డబ్భై. నీకు అరవై ఎనిమిది. బయట ఎండలు నలభై రెండు డిగ్రీలు. యిటువంటి సమయంలో కాశీకి వెళ్తే, పూర్వం నానుడి నిజమవుతుంది. రోజు ఎలాగో అన్ని దేవుళ్ళకి పూజలు చేస్తున్నావ్, అవి చాలు. అంతగా అయితే వానకాలం వెళ్దాం లే” అన్నాడు వెంకట్రావు. “వానకాలంలో గంగా స్నానం అంటే చలి. అదీకాక జారిపడిపోతాము అంటారు. అందుకే నా మాట విని మా తమ్ముడితో వెళ్తే క్షేమంగా తిరిగి రావచ్చు” అంది కళావతి. “కొద్దిగా టైమ్ యివ్వు. అలోచించుకుని అప్పుడు నిర్ణయం తీసుకుంటాను. అసలే బ్యాంకులకు నాలుగు రోజులు సెలవలు ట” అన్నాడు వెంకట్రావు. “అయ్యో! యింతకంటే చోద్యం వుంటుందా? వచ్చే నెల లో వెళ్ళే ప్రయాణానికి, ఇప్పుడు బ్యాంకు సెలవు కి ఏమిటి సంబంధం అండి?” అంది. ఇంతలో బావమరిది కృష్ణ ఫోన్ చేసి “బావగారు, మేము వెళ్ళలేక కాదు. మీరు పెద్దవాళ్ళు అయ్యారు. మీరిద్దరూ ఎవ్వరి సహాయం లేకుండా కాశీకి వెళ్లడం కష్టం. అందుకే మేము తోడుగా వుండి మీకు కాశీ చూపించి తీసుకుని వస్తాము. మణికర్ణిక లో స్నానం చేస్తే మంచిది” అన్నాడు. “సరే కానీ! అలాగే ఏసీ లో బుక్ చెయ్యి. లెక్క రాసుకో. మా ఖర్చులు మేము యిచ్చేస్తాము” అన్నాడు వెంకట్రావు.. “నేను మాట సహాయం చెయ్యగలను కానీ డబ్బు సహాయం చెయ్యలేను కదా బావగారు, మీ ఖర్చులు మీరే పెట్టుకోండి” అన్నాడు కృష్ణ. మొత్తానికి 15వ తేది న ఉదయం కాశీకి వెళ్లే ట్రైన్ కి బయలు దేరాలి. భర్త యింత త్వరగా యిల్లు కదిలి కాశీకి రావడానికి ఒప్పుకున్నందుకు విపరీతంగా సంతోషం తో రోజుకంటే రెండు కూరలు ఎక్కువ గా రుచిగా చేసింది. రెండు మూడు ఏ టి మ్ ల చుట్టూ తిరిగి ఒక యాభై వేలు తీసుకుని ఖర్చుల కోసం వుంచుకున్నాడు. “బావగారూ! రైలులో టికెట్స్ అయిపోయాయి, అతికష్టం మీద మీకు థర్డ్ ఏసీ, మాకు స్లీపర్ లో దొరికాయి” అన్నాడు బావమరిది. “అన్నీ ఏసీ లో దొరికితే వెళ్ళాలి కానీ, నువ్వు స్లీపర్ లో ముప్పై గంటలు కూర్చునివుంటే మామిడి పండు పండినట్టు ఉడికిపోతావు. టికెట్స్ దొరికినప్పుడు వెళ్దాం” అన్నాడు బావమరిది తో వెంకట్రావు. “పరవాలేదు బావగారు.. మాకు స్లీపర్ లో ప్రయాణం అలవాటే. చాలా సార్లు శబరిమల వెళ్లి వచ్చాను” అన్నాడు. “మరి రిటర్న్ టికెట్స్?” అని అడిగితే “అవి కూడా అంతే అన్నాడు నవ్వుతూ. “సరే నీ యిష్టం. అన్నీ ట్రైన్స్ లాంటి ట్రైన్ కాదు ఈ కాశీ ట్రైన్” అన్నాడు. మొత్తానికి ఉదయం ఏడుగంటలకే బయలుదేరి సికింద్రాబాద్ స్టేషన్ చేరుకున్నారు నలుగురు . స్టేషన్ జనం తో కిక్కిరిసిపోయి వుంది. ఇంతలో ఎవడో వెంకట్రావ్ ట్రోలీ సూట్ కేసు పట్టుకుని దర్జాగా వెళ్లిపోతున్నాడు స్టేషన్లోకి. “బావగారు! అది మీ సూట్ కేసు అనుకుంటా” అన్నాడు కంగారు గా కృష్ణ. “నాదే , లోపలకి తీసుకుని వచ్చిన తరువాత పట్టుకుంటా, ఈ జనం లో యిన్ని సూట్ కేసులు మోయాలి అంటే కష్టం” అన్నాడు ఒక కంట ఆ దొంగని కనిపెడుతో. స్టేషన్ లోపలికి వెళ్ళాక తన సూట్కేస్ తో పాటు ఆ దొంగ చెప్పిన సారీని కూడా అందుకున్నాడు వెంకట్రావు. అదృష్టం కొద్ది రైలు మొదటి ప్లాట్ ఫామ్ మీద ఆగడం తో జనం ఒక్కసారిగా తోసుకుని ఎవరి పెట్టిలో ఎవరు ఎక్కుతున్నారో తెలియకుండా ఎక్కెస్తున్నారు. వెంకట్రావు బావమరిది తన స్లీపర్ కంపార్ట్మెంట్ వెతుకుంటూ వెళ్ళిపోయాడు. వెంకట్రావ్ భార్య కళావతి ఎలా ఎక్కిందో తెలియదు, కోచ్ లోనుంచి ‘ఆ పెట్టెలు యిటు అందివ్వండి’ అని అరుస్తోంది. యింతలో ఒక పుణ్యత్ముడు వెంకట్రావు ని పెట్టి తో సహా కోచ్ లోపలికి ఒక నెట్టు నెట్టాడు. ఆ తోపుడికి వెంకట్రావు తెరిచివున్న టాయిలెట్ లో కి దూసుకుని వెళ్ళాడు. “అయ్యో రాత, యిటు రండి” అంటున్న భార్య ని “ముందు ఈ సూట్ కేసు పట్టుకో, యిప్పుడే వస్తాను” అని టాయిలెట్ తలుపు మూసుకున్నాడు. టాయిలెట్ తలుపు తీసుకుని బయటకి వస్తో, ‘అమ్మయ్య ట్రైన్ కదిలింది’ అనుకుంటూ తన బెర్త్ దగ్గరకి వెళ్ళాడు. అక్కడ తన భార్య ఎవరిమీదో అరుస్తోంది. వెళ్లి చూసిన వెంకట్రావు కొయ్యబారిపోయాడు. తన లోయర్ బెర్త్ మీద ఒక అతి లావుపాటి పిన్నిగారు విస్తరాకు నిండా పులిహోర పెట్టుకుని, కళావతి తో గొడవ పడుతోంది. “మిమ్మల్ని పిన్నిగారు అనాలో లేక మేడం అనాలో తెలియడం లేదు. ఈ రెండు లోయర్ బేర్తలు మావి” అన్నాడు. “చూడు నాయనా, నాకు మిడిల్ బెర్త్ యిచ్చారు. ఈ కాయం తో నేను మిడిల్ బెర్త్ కి ఎలా చేరాలి? అందుకని నువ్వు మిడిల్ బెర్త్ లో పడుకో, మీ ఆవిడని అడిగినా వినడం లేదు” అంది. “చూడండి.. నేను కూడా వినను. లోయర్ బెర్త్ కోసం మూడు సార్లు టికెట్స్ కాన్సల్ చేసుకుంటే అప్పుడు లోయర్ బెర్త్లు వచ్చాయి. దానికి తోడు అప్పర్ బెర్త్ అతనికి కరోనాట, తగ్గదు అని చెప్పడం తో కాశీలో పోదామని బయలుదేరాడుట” అన్నాడు. “పైన ఎవ్వరు లేరు, నన్ను బయపెట్టటానికి అంటున్నావు” అన్న పిన్నిగారి తో “ముందు మీ పులిహోర పొట్లం తో లేచి వెళ్లి యింకా ఎవ్వరినైనా లోయర్ బెర్త్ కోసం అడగండి, నేను త్వరగా మొహం నిండా దుప్పటి కప్పుకుని పడుకోవాలి కరోనా అంటుకోకుండా” అన్నాడు వెంకట్రావు. కరోనా భయం వల్లో, లేకపోతే వెంకట్రావు మొండితనం కో తెలియదు గాని పిన్నిగారు, “ఉపకారం అంటే చచ్చి పోతున్నారు” అని తిడుతూ బెర్త్ మీద నుంచి లేచి, “అయినా కరోనా వున్న వాళ్ళని రైల్వే వాళ్ళు ఎలా రానిచ్చారో” అంది. “65 ఏళ్ళు వున్న మీకు మిడిల్ బెర్త్ ఎలా యిచ్చారో అలాగే” అన్నాడు వెంకట్రావు. “సరే నాయనా.. వెళ్లి టీసీ ని అడుగుతా. నువ్వు ఆ కరోనా అంటించుకుని హాయిగా లోయర్ బెర్త్ లోనే పడుకో” అంది. ‘హమ్మయ్య’ అనుకుంటు, బెర్త్ బాగా తుడిచి, దుప్పటి పరిచి, కాళ్ళు జాపుకుని పడుకున్నాడు. ట్రైన్ యింకా తెలంగాణా లోనే వుండటం తో, అంతా తెలుగు వాళ్లే వున్నారు. ఇంతలో ఒక అతను కిల్లీ నములుతు వెంకట్రావు ని “మాస్టారూ కొద్దిగా కాళ్లు ముడుచుకోండి, నేను కూర్చోవాలి” అన్నాడు. “ఏ.. మీకు బెర్త్ లేదా, నా బెర్త్ మీద కూర్చోవడం ఏమిటి?” అన్న వెంకట్రావు వంక కోపంగా చూసి, “నాది వెయిటింగ్ టికెట్, ఈ రాత్రికి కూర్చుని వెళ్ళాక తప్పదు” అంటూ వెంకట్రావు కాళ్ళు చెరుకుగెడాలా వంచి, కూర్చున్నాడు ఆ ఆగంతకుడు. కళావతి తన బెర్త్ పక్కన నుంచుని ప్రయాణం చేస్తున్న ఒక చంటిపిల్లా తల్లిని జాలితో తను కొద్దిగా జరిగి కూర్చోమని చెప్పి, ఆమెతో మాటలలో పడింది. బావమరిది పరిస్థితి ఏమిటో తెలుసుకుందామని ఫోన్ చేసాడు వెంకట్రావు. అటువైపు నుంచి బాహుబలి సినిమా లోని సౌండ్స్ మధ్యలో నుంచి బావమరిది గొంతు వినిపించి వినిపించక, “హలో.. మా బెర్త్ ల మీద ఎవ్వరో హిందీ స్టూడెంట్స్ కూర్చొని లేవడం లేదు. అందుకే కింద కూర్చొని వున్నాము. టీసీ తో చెప్పితే ‘ఈ ట్రైన్ లో నేను ఏమి చేయలేను, ఎక్కువగా మాట్లాడితే బయటకి గేంటెస్తారుట’ అన్నాడు. బుద్ది గడ్డి తిని స్లీపర్ టికెట్ తీసుకున్నాను. యిహ నుంచి థర్డ్ ఏసీ వుంటే నే ప్రయాణం” అన్నాడు కృష్ణ. మా పరిస్థితి అంతే! నా కాళ్ళ మీద ఎవడో కూర్చున్నాడు. క్రింద పేపర్లు పరుచుకుని జనం పడుకున్నారు. యింటి నుంచి తెచ్చుకున్న గారెల ప్యాకెట్ విప్పగానే ఎవడో వచ్చి, ‘మీరు అన్నీ తినలేకపోతే మిగిలినవి నాకిస్తారా..’ అన్నాడు. కాశీ కి వెళ్లిన వాడు కాటికి వెళ్లినవాడు ఒక్కటే అన్నది ఈ ట్రైన్ లో ప్రయాణం చేసిన తరువాత అన్నట్టున్నారు. మొత్తానికి ఏ అర్దరాత్రికో నిద్రపట్టింది. కాళ్ళకి చల్లగా తగలడం తో దుప్పటి లోంచి చూస్తే, ఎవరో స్నానం చేసి వాడి తడి టవల్ వెంకట్రావు కాళ్ళ మీద ఆరేసాడు. చిరాకుగా ఆ టవల్ ని ఒక తన్ను తన్నాడు. అది వెళ్లి టీ తాగుతున్న ఒక పెద్దాయన మీద పడింది. ఇంతలో టవల్ యజమాని హిందీలో ఏదో అంటున్నాడు. వెంకట్రావు కి వచ్చిన హిందీ కాదు అది. మెల్లగా లేచి మాట్లాడకుండా బ్రష్ పట్టుకుని జనాన్ని తప్పించుకుని వెళ్లి వాష్ బేసిన్ దగ్గర నుంచుని బ్రష్ చేసుకుని ట్యాప్ తిప్పాడు. నీటి చుక్క పడలేదు. పక్కనే వున్న కోచ్ అటెండర్ కిసుక్కున నవ్వుతు “యిప్పుడు పానీ రాదు సార్, వాటర్ బాటిల్ కొనుక్కుని మొహం కడుక్కోండి” అన్నాడు. కోపంగా భార్య వంక చూసాడు వెంకట్రావు, ఈ బాధలకి కారణం నువ్వే అని. చివరికి ఎప్పటికో కాశీ చేరుకుంది ట్రైన్. అప్పటికే గుమ్మం ముందు దిగటానికి చాలా మంది నిలబడి వున్నారు. కళావతి కూడా వెంకట్రావు ని కంగారు పెట్టి, రైలు నుంచి దింపేసింది. ట్రైన్ కూడా కదిలిపోయింది. వెంకట్రావు కి ఎందుకో కాళ్ళు మంటలుగా అనిపించి చూసుకుంటే, దిగే హడావిడి లో చెప్పులు వేసుకోకుండా దిగిపోయాడు. “చెప్పులు పోతే శని పోయినట్టే అంటారు, బయట కొత్తవి కొనుక్కుందురు, అందాక నా చెప్పులు వేసుకోండి” అంది కళావతి భర్త తో. “లేడీస్ చెప్పులు నేను వేసుకోను అని అంటూ అప్పుడే వగరస్తో కాళ్ళకి చెప్పులు లేకుండా వస్తున్న బావమరిది దంపతులని చూసి, “మీరు చెప్పులు లేకుండా ట్రైన్ దిగిపోయారా?” అన్నాడు వెంకట్రావు. “లేదు, మా చెప్పులు వేసుకుని ఎవ్వరో దిగిపోయారు” అన్నాడు బావమరిది కృష్ణ. “సరే పద! నా అభిప్రాయం ప్రకారం, స్టేషన్ పక్కన తప్పకుండా చెప్పుల షాప్ వుంటుంది” అన్నాడు పరుగులు తీస్తో. బయటకి వచ్చి అక్కడ దగ్గరలోనే వున్న షాపులో ముగ్గురు చెప్పులు కొనుక్కుని కాళ్ళకి వేసుకొని, ‘అబ్బా సుఖమంటే యిది కృష్ణ’ అన్నాడు వెంకట్రావు. మొత్తానికి కాశీ విశ్వేశ్వరుడిని, అమ్మవారిని, అటునుంచి గయ లో చనిపోయిన పెద్ద వాళ్ళకి పిండప్రదానం చేసి, కాశీ చేరుకున్నారు. “రేపు మళ్ళీ ట్రైన్ ప్రయాణం, ఈ లోపు ఒకసారి గంగలో స్నానం చేసి, శివుడిని దర్శనం చేసుకుందాం బావగారు” అన్నాడు. “సరే గాని నేను మీ అక్కయ్య విమానం లో హైదరాబాద్ వెళ్తాము. జన్మలో ఇటువైపు వచ్చే ట్రైన్ ఎక్కను. నీ సంగతి ఏమిటి?” అన్నాడు వెంకట్రావు బావమరిది ని. “విమానం అంటే తిడతారేమో అని మిమ్మల్ని అడగలేదు. మేము కూడా విమానం లోనే” అన్నాడు కృష్ణ. వెంటనే వెంకట్రావు నాలుగు ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసి, అప్పుడు మళ్ళీ గంగలో దిగటానికి బయలుదేరారు. కేదారేశ్వర ఘాట్ లో మెట్లు మొత్తం దిగి స్నానం చేసి పైకి వచ్చి చూస్తే వెంకట్రావు, వెంకట్రావు బావమరిది చెప్పులు మాయం. “యిదేమిటి.. షిర్డీ లో చెప్పులు ఎత్తుకుపోతారు అంటారు, కాశీలో కూడానా, సరే నడవండి. నాకు ఎలాగో అర్దాష్టమ శని నడుస్తోంది. శని చెప్పులు లేకుండా నడిపిస్తాడుట” అంటూ ముందుకు నడిచాడు వెంకట్రావు. విశ్వనాధ్ టెంపుల్ దగ్గరికి వచ్చి చెప్పులు స్టాండ్ ఎక్కడా అని అడుగుతున్న బావగారి కాళ్ల వంక చూసాడు. తళతళ మెరుస్తున్న చెప్పులు చూసి, “అక్కా.. బావగారు యింతలోనే చెప్పులు ఎప్పుడు కొనుకున్నారు?” అన్నాడు కృష్ణ. భర్త కాళ్ళ వంక చూసి “అవును.. ఎక్కడివి?” అంది. ఇంతలో వెంకట్రావు “అటుపదండి, చెప్పుల స్టాండ్ అక్కడ వుంది ట” అన్నాడు. “ఈ చెప్పులు ఎప్పుడు కొన్నారు యింతలోనే?” అంది కళావతి భర్తతో. “గుడి ముందు వదిలిన మంచి చెప్పులు చూసి వేసుకుని వచ్చేసా, కింద కాళ్ళు వేడికి మైసూర్ బజ్జి లాగా పొంగుతోవుంటే ఏమిచేయాలి?” అన్నాడు వెంకట్రావు. “అయ్యో.. ఇంకొకరి చెప్పులు దొంగిలించి వేసుకోవడం పాపం అండి” అన్నారు యిద్దరు ఒకేసారి. “చాల్లే.. కాశీలోనే రెండు సార్లు మన చెప్పులు పోయినప్పుడే పాపం గురించి ఆలోచించడం వేస్ట్ అనుకున్నా. యిదిగో కృష్ణ.. నువ్వు కూడా మంచి చెప్పులు చూసి వేసుకో, లేకపోతే ఫ్లైట్ లో బాగుండదు” అన్నాడు. ***శుభం***

జీడిగుంట శ్రీనివాసరావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం:

నా పేరు జీడిగుంట శ్రీనివాసరావు. నేను గవర్నమెంట్ జాబ్ చేసి రిటైర్ అయినాను. నేను రాసిన కథలు అన్నీ మన తెలుగు కథలు లో ప్రచురించినందులకు ఎడిటర్ గారికి కృతజ్ఞతలు.


30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.


73 views1 comment

1 Comment


Sai Praveena jeedigunta • 1 day ago

Good one

Like
bottom of page