వేటకు వేళాయెరా - పార్ట్ 3
- Parupalli Ajay Kumar
- Apr 24
- 8 min read
#ParupalliAjayKumar, #పారుపల్లిఅజయ్కుమార్, #వేటకువేళాయెరా, #VetakuVelayera, #TeluguSuspenseCrimeThriller

Vetaku Velayera - Part 3/3 - New Telugu Story Written By Parupalli Ajay Kumar
Published In manatelugukathalu.com On 24/04/2025
వేటకు వేళాయెరా - పార్ట్ 3/3 - పెద్దకథ
రచన: పారుపల్లి అజయ్ కుమార్
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
జరిగిన కథ:
వాహనాలను ఆపి దారి దోపిడీకి పాల్పడే వారిని పట్టుకుంటారు పోలీస్ డిపార్ట్మెంట్ లో పని చేస్తున్న దంపతులు విక్రమ్, ధీర. గతంలో వారిద్దరూ క్లాస్ మేట్స్. ధీర తండ్రికి విక్రమ్ సహాయం చేయడంతో వారిమధ్య పరిచయం పెరుగుతుంది. ట్రెక్కింగ్ కోసం మనాలి వెళ్ళినప్పుడు పూర్తిగా ప్రేమలో పడతారు.
ఇక వేటకు వేళాయెరా - పార్ట్ 3 చదవండి.
ఎత్తైన పర్వత మార్గాలను దాటుతున్నప్పుడు కలిగే ఉత్సాహ, ఉల్లాస ఉద్రేకాల వరవడి, పొగమంచు కురుస్తుండగా చేతికి అందే ఎత్తులో తేలియాడుతున్న మేఘాలను తాకినప్పుడు కలిగే పులకింత, కొండల నడుమ నుంచి గలగల పారే జలపాతాల హోరు మృదుమధుర సంగీతంలా చెవులకు ఇంపుగా వినిపించటం, అతి శీతల ప్రవాహంలో పాదాలను వుంచినప్పుడు కలిగిన గిలిగింత ఇవన్నీ ట్రెక్కింగ్ లో ధీరకు అనుభవంలోకి వచ్చాయి.
ట్రెక్కింగ్ చేయడం అంటే ఏదో కాలక్షేపం యాత్ర కాదు, అది ఒక మధుర మనోహరమైన అనుభవం అనిపించింది ధీరకు, విక్రంకు.
ధీర కు, విక్రం కు ఈ ట్రెక్, జీవితంలో మరుపురాని మధుర జ్ఞాపకంగా నిలిచి పోయింది అనటంలో ఏమాత్రం సందేహం లేదు.
తిరుగు ప్రయాణంలో అందరూ అలసి వుంటారని ఢిల్లీ నుండి హైదరాబాదుకు ఫ్లైట్ టికెట్స్ బుక్ చేశారు ముందుగానే.
ఢిల్లీ ఎయిర్ పోర్ట్ లో విక్రం, ధీర కాఫీ షాప్ లో కాఫీ త్రాగుతూ ట్రెక్కింగ్ గురించి మాట్లాడుకుంటున్నారు. ఎప్పుడూ చుట్టూ వుండే పరిసరాలను పరిశీలనగా చూసే విక్రం, ధీరతో మాట్లాడుతూనే ఎయిర్ పోర్ట్ లాంజ్ మొత్తాన్ని చూపులతో చుట్టేస్తున్నాడు.
ఒక గడ్డం మనిషి ఎత్తు బూట్లు వేసుకుని, నడవలేక నడుస్తూ వాష్ రూం కు వెళ్ళటం కనిపించింది. ఆ మనిషి ముఖంలో కంగారు స్పష్టంగా కనిపిస్తున్నది. వాష్ రూం డోర్ దగ్గర ఆగి ఒక ఎయిర్ పోర్ట్ సెక్యూరిటీ ఆఫీసర్ వైపు చూస్తూ తల ఊపటం విక్రం లో ఏదో అనుమానం రేకెత్తించింది.
విక్రం ఆ సెక్యూరిటీ ఆఫీసర్ వైపు చూశాడు. ఆ ఆఫీసర్ పక్కనున్న మరో ఆఫీసర్ తో ఏదో చెప్పి అతను వాష్ రూం లోకి వెళ్ళాడు. విక్రం లో అనుమానం రెండింతలయ్యింది.
ధీర తో “ఇప్పుడే వస్తా!” అని చెప్పి వడి వడిగా వాష్ రూం వైపు కదిలాడు.
లోపలికి వెళ్ళి చూశాడు. ఇద్దరూ కనపడలేదు. టాయిలెట్ ల వెైపు చూశాడు. మూడో టాయిలెట్ లో మనుషుల అలికిడి వినిపించింది. కొద్దిగా కిందికి వంగి చూశాడు. నాలుగు కాళ్ళు కనపడుతున్నాయి. లోపలున్న ఇద్దరు బూట్లు విప్పి ఒకరి బూట్లు మరొకరు తొడుక్కోవటం కనిపించింది. ఎందుకలా చేస్తున్నారో అర్థం కాలేదు విక్రం కు. చప్పుడు చేయకుండా వాష్ రూం నుండి బయటకు వచ్చేసాడు.
ధీర కూర్చున్న వైపుగా నడుస్తున్న విక్రం కు ఒక మహిళ మాటలు అనుకోకుండా అతని చెవిన పడ్డాయి.
“వదినా, మా ఆడబిడ్డ వాళ్ళు రెండు సంవత్సరాలు దుబాయ్ లో వున్నారు. మొన్న వాళ్ళు వస్తూ కొంత బంగారాన్ని తెచ్చారు. అక్కడ బంగారం మన దగ్గరకన్నా చౌక తెలుసా? అయితే ఎంత పడితే అంత తీసుకురావడానికి వీల్లేదట. మగవారు తమ వెంట 20 గ్రాముల బంగారం ఆభరణాలు తెచ్చుకోవచ్చట. అదే మహిళ అయితే 40 గ్రాముల వరకూ తెచ్చుకోవచ్చట. పెద్ద మొత్తంలో తీసుకొస్తే సుంకాలు చెల్లించాల్సి వస్తుందట. ”
ఆ మహిళ పక్కనున్న ఆమె “అందుకే విదేశాల నుండి బంగారం దొంగతనంగా తీసుకు రావటం ఎక్కువైంది ఈ మధ్య కాలంలో. ” అంటూ దీర్ఘం తీసింది.
ఆ మాటలు విన్న విక్రం ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు.
బంగారాన్ని కనపడని ప్రదేశాల్లో దాచిపెట్టి స్మగ్లింగ్ చేస్తున్నారన్న వార్తలు పేపర్లలో చాలా సార్లు చదివివున్నాడు. వాష్ రూం లో బూట్లు మార్చుకున్న వారిద్దరూ బంగారాన్నో, లేదా మరో విలువైన దాన్నో
స్మగ్లింగ్ చేస్తుండవచ్చు అన్న అనుమానం వచ్చింది.
వెంటనే NCC నోడల్ అధికారి ధర్మేంద్ర సింగ్ దగ్గరికి వెళ్ళి తను చూసింది చెప్పి తన అనుమానాన్ని కూడా విప్పిచెప్పాడు. వాష్ రూం నుండి బయటకు వస్తున్న వారిని చూపించాడు.
ధర్మేంద్రసింగ్ “ఆర్యూ ష్యూర్ అబౌట్ ఇట్?” అని అడిగాడు.
విక్రం అవునన్నట్లు తల ఊపాడు.
ధర్మేంద్ర సింగ్ వెంటనే కస్టమ్స్ అధికారుల దగ్గరకు వెళ్ళి తనను తాను పరిచయం చేసుకుని విక్రం చెప్పిన విషయాన్ని వారికి చెప్పాడు. వారు వెంటనే అలర్ట్ అయ్యారు.
ఆ సెక్యూరిటీ ఆఫీసర్ ను, గడ్డం మనిషిని చుట్టుముట్టి బలవంతాన చెకింగ్ రూం కు తీసుకెళ్లటం విక్రంకు కనిపించింది.
పదినిమిషాల తరువాత ఇద్దరు కస్టమ్స్ అధికారులు ధర్మేంద్ర సింగ్, విక్రం దగ్గరకు వచ్చి “మీరు గమనించిన విషయం వెంటనే మాకు తెలియచేయడం చాలా
మేలయింది. మూడు కోట్ల విలువ గల డైమండ్స్ ఆ బూట్లలో కనుగొన్నాం. వారిని అరెస్ట్ చేసి కేసు ఫైల్ చేస్తున్నాం. మీకు హృదయపూర్వక ధన్యవాదాలు. ” అంటూ కరచాలనం చేశారు.
విక్రం భుజం తట్టి ‘“నీ సునిశిత పరిశీలన చాలా బాగుంది. కీప్ ఇట్ అప్ మై బోయ్. మెనీ మెనీ థాంక్స్” అంటూ అభినందించారు.
ధీరతో పాటు సహచర విద్యార్థులంతా చప్పట్లతో విక్రంకు అభినందనలు తెలియచేశారు.
కస్టమ్స్ అధికారులు ఈ విషయాన్ని వారు ప్రయాణిస్తున్న విమాన సిబ్బందికి తెలియచేశారు. ఫ్లైట్ లో ధర్మేంద్ర సింగ్ బెటాలియన్ కు స్పెషల్ ట్రీట్ లభించింది.
***************************
ట్రెక్కింగ్ ముగించుకుని కాలేజీకి తిరిగి వచ్చాక ఫైనల్ ఇయర్ పరీక్షలు దగ్గర పడటంతో విక్రం, ధీరలు పూర్తిగా చదువులలో మునిగిపోయారు.
డిగ్రీ పాస్ అయ్యాక ఇద్దరూ సివిల్స్ రాయాలని నిర్ణయించుకున్నారు. సంవత్సరం పాటు ఇద్దరూ హైదరాబాద్ లో సివిల్స్ కు కోచింగ్ తీసుకున్నారు. మొదటి ప్రయత్నంలో ఇద్దరూ సఫలీకృతం కాలేకపోయారు. కొద్దిగా నిరాశ చెందారు. ఈ లోపున రాష్ట్రంలో పడిన SI రిక్రూట్ మెంట్ టెస్ట్ రాసి సబ్-ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ పోస్ట్ కు సెలెక్ట్ అయ్యారు.
ఉద్యోగాలు రాగానే ఇరువైపులా పెద్దలు వారి ఇష్టాన్ని తెలుసుకుని వారికి పెళ్ళి జరిపించారు. పెళ్ళి తరువాత జనవరి నెలలో వారిద్దరూ హానీమూన్ కోసం మరలా మనాలి వెళ్ళారు అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదనుకుంటా.
SI ట్రైనింగ్ పూర్తి కాగానే మొదట్లో ఇద్దరికీ వేరు వేరు చోట్ల పోస్టింగ్ వచ్చింది. ధీరకు పోస్టింగ్ వచ్చిన వూరిలో కాపురం పెట్టి విక్రం తన పోస్టింగ్ వున్న వూరికి వెళ్ళి వస్తుండేవాడు.
ఇద్దరూ తమ తమ పోలీస్ స్టేషన్ లో సబ్ ఇన్ స్పెక్టర్ గా చార్జి తీసుకున్న క్షణం నుండి సక్రమంగా విధులు నిర్వహిస్తూ వచ్చారు. పోలీస్ అనే గర్వం లేకుండా తమ పోలీస్ స్టేషన్ కు వచ్చిన ప్రజల మాన ప్రాణ ధన రక్షణే తమ ధ్యేయంగా పని చేసారు. ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ నేరాలకు పాల్పడిన వారిలో సైతం సత్ ప్రవర్తన కలిగే విధంగా కౌన్సిలింగ్ నిర్వహిస్తూ అనేకమందిలో మార్పు తీసుకు వస్తూ తమదైన శైలిలో సామాజిక బాధ్యతతో కూడిన విధులు నిర్వహించారు.
నేరస్తులు ఎక్కడ దాక్కున్నా వారిని కనుగొని వెంటాడి, వేటాడి బంధించేవారు. ప్రజల సమస్యలను సత్వరమే పరిష్కరిస్తూ, కరుడుగట్టిన నేరస్తుల పాలిట సింహస్వప్నంగా నిలిచారు. తమ విధి నిర్వహణలో ప్రజా మన్ననలతో పాటు ఉన్నతాధికారుల ప్రశంసలు కూడా పొందారు.
పెళ్ళయిన రెండుసంవత్సరాలకు ధీర ఒక పాపకు జన్మ నిచ్చింది. మూడుసంవత్సరాల్లో ఇద్దరూ ఒకే స్టేషనుకు ట్రాన్స్ఫర్ మీద వచ్చారు. మళ్ళీ ఇద్దరూ సివిల్స్ రాయాలని నిర్ణయించుకున్నారు.
ఆ సమయంలోనే పట్టణ పరిసరాలకు దూరంగా ఉన్న గ్రామాలకు రాత్రిపూట ప్రయాణం ప్రమాదకరంగా మారిందని, రోడ్డు దొంగతనాలు ఎక్కువవు తున్నాయని, పోలీసులు ఈ విషయంలో ఏమీ పట్టించుకోవటం లేదని పేపర్లలో వార్తలు వచ్చాయి. అర్ధరాత్రి పూట కారులో కానీ, బైక్ మీద కానీ ప్రయాణించే వారిని అడ్డుకుని డబ్బు, నగలు తీసుకుని వెహికిల్ ని కూడా తీసుకుని దొంగలు పారిపోతున్నారు. మూడు రోజుల క్రితం ఇద్దరు వ్యక్తులు తమ దగ్గరున్న డబ్బులతో పాటు తమ కారు కూడా తీసుకెళ్లారని కంప్లైంట్ చేసారు. రాత్రిపూట ఆ రోడ్డులో అప్పుడప్పుడూ పోలీస్ పెట్రోలింగ్ నిర్వహించినా లాభం లేకపోయింది.
విక్రం, ధీర ఆ విషయం తేల్చుకోవాలని అనుకున్నారు. రెండుసార్లు ఆ రోడ్డులో చుట్టు పక్కల ఉన్న ఊర్లలో వున్న చుట్టాల ఇంటికి కారులో వెళ్ళి అర్ధరాత్రి తరువాత తిరిగి వచ్చేవారు.
రెండుసార్లు ఎవరూ ఎదురు కాలేదు. ఈ రోజు స్నేహితుడి పెళ్ళికి వెళ్ళివస్తుంటే జరిగిన సంఘటనలో, ముందుగా అనుకున్న ప్రకారమే దొంగలను కన్ఫ్యుజ్ చేయటానికే ధీర అరవటం, విక్రం ఖాళీ బ్రీఫ్ కేస్ తో పరిగెత్తటం జరిగింది. రోడ్డు మీద కాకుండా కావాలనే పొలాల లోకి వాళ్ళను తీసుకెళ్ళి స్పృహ తప్పేలా కొట్టి బంధించటం జరిగింది.
**********************************
కారులో వున్న పాప ఏడుపుతో ధీర ఉలిక్కిపడి ఈ లోకంలోకి వచ్చింది. విక్రం కౌగిలి నుండి విడివడి కారు డోర్ తీసి పాపను ఎత్తుకుంది.
చినుకులు మొదలయ్యేసరికి ఇద్దరూ కారులో కూర్చున్నారు.
అప్పుడే పోలీసు వాహనాలు సైరన్ మోగించుకుంటూ వచ్చేశాయి.
నేరస్తులను పోలీస్ వాహనాల్లో ఎక్కించి అవి బయలుదేరాక, వాటి వెనుకే విక్రం తన కారును పోనిచ్చాడు.
**********************************
ఉదయం విక్రం, ధీర స్టేషనుకు వచ్చేసరికి కానిస్టేబుల్ సత్యం వచ్చి “సర్ నిన్న మీ కారు కింద పడిన అతను మీతో ప్రైవేటుగా మాట్లాడాలని చాలాసార్లు అడిగాడు. ” అన్నాడు.
“ఏం మాట్లాడుతాడట? సరే! తీసుకురా. ” అన్నాడు విక్రం.
సత్యం అతన్ని తీసుకువచ్చాడు. అతను వస్తూనే విక్రంకు, ధీరకు నమస్కారం చేసాడు.
“సర్, నా పేరు విజయకుమార్. నాకూ, ఆ దొంగలకూ ఏం సంబంధం లేదండి. ” అంటూ కన్నీరు పెట్టుకున్నాడు.
“దొంగలతో పాటుగా వచ్చి దొంగతనానికి సహకరించి దొంగలతో సంబంధం లేదని చెపితే నమ్మటానికి మేమెలా కనపడుతున్నాం. ” లాఠీ చేతితో తిప్పుతూ గద్దించాడు విక్రం.
“ఒట్టు సార్! నేను చెప్పేది నమ్మండి. ” అంటూ అతను విక్రం కాళ్ళ మీద పడి ఏడ్చాడు.
ధీర అతన్ని లేవమని చెప్పి “విక్రం, అతను ఏం చెపుతాడో విందాం. ” అని, విజయ్ కుమార్ వైపు తిరిగి “ఏం చేపుతావో చెప్పు? నువ్వు చెప్పేది నిజమో, అబద్దమో మేము కనిపెట్టగలం. ” అధికార స్వరంతో అంది.
“మా నాన్న ఆటో డ్రైవర్. డిగ్రీ దాకా అతి కష్టం మీద చదివాను. పై చదువులకు డబ్బు లేదు. ఉద్యోగ ప్రయత్నాలలో పడ్డాను. అప్పుడే మా అమ్మకు జబ్బు చేసింది. డాక్టర్ కు చూపిస్తే ఖరీదయిన మందులు వాడాలని అన్నాడు. నాన్న తెచ్చే డబ్బులు సరిపోవటం లేదు. నేను కూడా ఎంతో కొంత సంపాదించాలని పెట్రోల్ బంక్ లో జాబ్ కు కుదిరాను. అక్కడి వాళ్ళ సావాసంతో క్లబ్ కు వెళ్ళటం, పేకాట ఆడటం అలవాటు అయింది. నాకొచ్చిన జీతం మొత్తం పేకాటలో పెట్టి ఓడిపోయాను.
మూడు రోజుల కిందట మా నాన్న ఆటో కిరాయికి వెళుతూ, అమ్మకు మందులు తీసుకు రమ్మని డబ్బులు ఇచ్చాడు.
ఆ డబ్బులు చూడగానే, పోయిన డబ్బులు తిరిగి సంపాదించాలనే ఆశతో తిరిగి క్లబ్ కు వెళ్లాను. అక్కడి వాళ్ళు పెద్ద కిలాడీ మోసగాళ్లని తెలుసుకునేసరికి నా
డబ్బులన్నీ పోగొట్టుకున్నాను.
మోసంతో ఆడుతున్నారని వారిని అన్నందుకు నన్ను తిట్టి, కొట్టి బయటకు తరిమేశారు.
ఆ సమయంలోనే చలపతి అనే అతను పరిచయం అయ్యాడు. నా సంగతి విని జాలితో మందులకు డబ్బులు ఇచ్చాడు. బాగా డబ్బులు సంపాదించే పని చూపెడతానని అనడంతో అతనితో తిరగడం మొదలు పెట్టాను. ఒక్కరోజు లోనే చలపతి నిజస్వరూపం తెలిసింది. అతను ఒక దొంగల ముఠాకు సంబంధించిన వాడని తెలిసి భయం వేసి నేను అతని వెంట రానన్నాను. రానంటే చంపేస్తానని బెదిరించి వెంట తీసుకెళ్లాడు.
నిన్న రాత్రి రోడ్డు మీద నెమ్మదిగా వస్తున్న కారుకు అడ్డంగా వెళ్ళి ఆపమని చలపతి చెప్పాడు. నేను బెదురుగా చూస్తుంటే కత్తి చూపి బెదిరించాడు చలపతి.
నేను ఏమైతే అదే అవుతుందనే మొండి దైర్యంతో మీ కారుకు ఎదురు పరుగెత్తుకుని వచ్చాను. ఇదే సార్ జరిగింది. నేను అరెస్ట్ అయ్యానని తెలిస్తే మా అమ్మ గుండె ఆగిపోతుంది. మా నాన్న పరువు పోయిందని చచ్చి పోతాడు. నేను ఏ నేరం చేయలేదు. బుద్ది తక్కువై పేకాట ఆడి డబ్బులు పోగొట్టుకుని చలపతి చేతిలో చిక్కాను. నన్ను క్షమించి వదిలెయ్యండి సార్. ” అంటూ ఏడవసాగాడు విజయ్ కుమార్.
అతని మాటల్లో నిజాయితీ కనిపించింది విక్రంకు. ధీరతో కాసేపు చర్చించాడు.
తరువాత విజయ్ తో “నువ్వు చెప్పినవన్నీ నిజమని నమ్మాలంటే వీళ్ళు ఎక్కడెక్కడ వున్నది? ఎంత మంది వున్నది? చెప్పాలి. ” అన్నాడు.
“చెప్పటమే కాదు. మీ వెంట వచ్చి చూపిస్తా సార్. ” అన్నాడు విజయ్.
“మొత్తం ఎంత మంది ఉంటారు?” అడిగింది ధీర.
“వీళ్ళ గ్రూప్ లో సుమారు పదిహేను మంది దాకా వున్నారు మేడమ్. నేను రెండు స్థావరాలు చూశాను. వాటిని మీకు చూపిస్తాను. ” అన్నాడు.
రెండు స్థావరాల మీద ఏక కాలంలో రైడింగ్ చేస్తేనే ఫలితం వుంటుంది అని ఆలోచించి విక్రం పై అధికారులకు విషయం తెలియ చేశాడు. జిల్లా అధికారి అదనపు పోలీసు బలగాలను విక్రం పోలీస్ స్టేషన్ కు పంపించాడు.
విక్రం పోలీసులను రెండు బృందాలుగా చేసి ఒక బృందాన్ని ధీరను లీడ్ చేయమన్నాడు.
“ధీరా! వేటకు వేళయింది. బయలుదేరు. ” అంటూ ధీరవెంట విజయ్ ను పంపించాడు.
రెండవ బృందాన్ని తీసుకుని విజయ్ చెప్పిన మరో స్థావరానికి బయలుదేరాడు విక్రం.
ఏక కాలంలో జరిగిన పోలీసు దాడుల ఫలితంగా లాకప్ లో వున్నవాళ్ళు కాక మరో ఆరుగురు దొంగలు పట్టుబడ్డారు. వారు దోచుకున్న డబ్బులు, నగలు కూడా కొన్ని దొరికాయి.
దారిదోపిడీ దొంగలను చాకచక్యంగా పట్టుకున్నందుకు పోలీస్ క్లబ్ లో విక్రం, ధీర లకు అభినందన సభ ను ఏర్పాటు చేశారు.
జిల్లా SP స్వాతంత్ర్య దినోత్సవం నాడు ఇచ్చే అవార్డుల కోసం వారిద్దరి పేర్లను ఎంపిక చేసి కలెక్టర్ కార్యాలయానికి పంపించాడు.
విక్రం కోరిక మీద FIR లో విజయ్ కుమార్ పేరు లేకుండా చేసారు.
***********************************
మూడుసంవత్సరాల కాలం గిర్రున తిరిగి పోయింది.
ధీర IPS కు సెలెక్ట్ అయి, ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ముస్సోరీలో ఉన్న లాల్ బహాదూర్ శాస్త్రి నేషనల్ అకాడెమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ప్రాథమిక శిక్షణ (బేసిక్ ట్రైనింగ్) పూర్తి చేసుకుని ప్రస్తుతం హైదరాబాద్ లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ (SVPNPA) లో శిక్షణ తీసుకుంటున్నది.
విక్రంకు IPS కు సెలెక్ట్ కాలేదు. IRS (C&CE) ఇండియన్ రెవెన్యూ సర్వీస్ (కస్టమ్ & సెంట్రల్ ఎక్సైజ్) కు సెలక్షన్ వచ్చినా వెళ్ళలేదు. ప్రస్తుతం డిపార్ట్ మెంట్ ప్రమోషన్ లిస్ట్ లో వున్నాడు.
విక్రం పర్యవేక్షణలో విజయ్ కుమార్ శ్రద్ధగా చదివి కానిస్టేబుల్ పరీక్షలు రాసి సెలెక్ట్ అయ్యాడు. శిక్షణ ముగిసాక, ప్రస్తుతం విక్రం SI గా పని చేసే స్టేషన్ లోనే కానిస్టేబుల్ గా విధుల్లో చేరాడు.
*********************************
ఆ రోజు విజయ్ కుమార్ రాత్రి పదకొండు గంటలకు రైల్వే ట్రాక్ పక్కనే వున్న రోడ్డుపై స్కూటీ మీద స్టేషన్ నుండి ఇంటికి వెళుతున్నాడు.
అనుకోకుండా రైల్వే ట్రాక్ వైపు చూసి స్కూటీ ఆపు చేసాడు.
ఒక యువతి రైలు పట్టాలను దాటుకుని వేగంగా పరుగెత్తుకుంటూ వస్తున్నది. విజయ్ కుమార్ పోలీస్ డ్రస్ ను చూస్తూనే “సార్, నన్ను కాపాడండి ప్లీజ్” అంటూ చేతులు జోడించి వేడుకుంది.
“ఎవరు మీరు? మీకేమయింది?” అడిగాడు విజయ్.
“నన్ను ఇద్దరు రౌడీలు తరుముకుంటూ వస్తున్నారు. ప్లీజ్, ముందు ఇక్కడినుండి దూరంగా తీసుకెళ్ళండి. ”
అంటూ స్కూటి ఎక్కింది.
విజయ్ కుమార్ తలపంకించి స్కూటీ స్టార్ట్ చేసి పక్కనున్న సందులోకి పోనిచ్చి ఆపాడు. విజయ్ కుమార్ ఆమెను పక్కనే వున్న చెట్ల చాటుకు తీసుకెళ్ళి కనిపించకుండా దాక్కోమన్నాడు.
తాను స్కూటీ మీద తిరిగి మెయిన్ రోడ్డు మీదకు వచ్చాడు. ఎవరో ఇద్దరు మనుషులు రోడ్డు మీద అటూఇటూ తచ్చాడుతూ కనిపించారు.
స్కూటీ వారి పక్కగా ఆపి “ఎవరు మీరు? అర్ధరాత్రి ఇక్కడ ఎందుకు తిరుగుతున్నారు?” పోలీస్ అధికార స్వరంతో ప్రశ్నించాడు.
వారిద్దరు విజయ్ కుమార్ ను చూస్తూనే తడబడుతూ “ఏమీ లేదు సార్. మా స్నేహితుని ఇంటి అడ్రస్ పోగొట్టుకున్నాం. ఇదే ఏరియా అని గుర్తు. అందుకే వెతుకుతున్నాం. ” అన్నాడు ఒకడు నసుగుతూ.
“మీ స్నేహితుని పేరు?”
“పేరు.. పేరు..వెంకటేశ్వర్లు. ”
“ఇంటిపేరు?”
“సరిగా గుర్తులేదు సార్. ఈ చీకటిలో ఇల్లు గుర్తుపట్టలేము. రేపు ఉదయం వచ్చి కలుస్తాం లేండి మా స్నేహితుణ్ణి. ”
అంటూ అక్కడ నుండి వేగంగా వెళ్ళిపోయారు ఆ ఇద్దరు మనుషులు.
విజయ్ కుమార్ వారు వెళ్ళి పోయేదాకా ఆగి తిరిగి ఆమె దగ్గరకు వచ్చాడు.
“వాళ్ళు వెళ్ళిపోయారు. ఇప్పుడు చెప్పు మీరు ఎవరు? వాళ్ళు ఎందుకు మీ వెంటపడ్డారు?” అడిగాడు.
ఆమె బోరుమంటూ ఏడుస్తూ కూలబడి పోయింది.
కాసేపటికి తేరుకుని
“నా పేరు కల్యాణి. నాది ఈ వూరు కాదు. నన్ను కొంతమంది దుర్మార్గులు రెండు రోజుల క్రితం కిడ్నాప్ చేసి ఇక్కడకు తెచ్చారు. వాళ్ళ ఆధీనంలో ఇంకా పదిమంది అమ్మాయిలు ఉన్నారు. వాళ్లందరినీ వివిధ ప్రదేశాల నుండి కిడ్నాప్ చేసి తీసుకొచ్చారు. రేపు మమ్ములనందరినీ ముంబై తరలించాలని ప్లాన్ చేస్తుంటే వాళ్ళనుండి తప్పించుకుని పారిపోయి వచ్చాను. ఇద్దరు నా వెంటబడ్డారు. వారికి చిక్కేకన్నా చావే నయమని ట్రైన్ కింద పడాలని చూస్తుంటే ట్రెయిన్ రాలేదు. ఈలోగా వాళ్ళని చూసి భయంతో ఇటు పరుగెత్తుకుని వస్తే మీరు కనిపించారు. ” అంది.
కల్యాణి చెప్పింది విని ఒక్కక్షణం కలవర పడ్డాడు విజయ్ కుమార్.
“ఆ కిడ్నాప్ ముఠా వాళ్ళు వుండేది ఎక్కడో గుర్తు పట్టగలరా?” అడిగాడు.
“గుర్తుపట్టగలననే అనుకుంటున్నాను. వాళ్ళు వుండే ఇంటికి ఎదురుగా ఒక మసీదు వుంది. నమాజు వినిపించేది. అక్కడినుండి పారిపోయి వచ్చేటప్పుడు దగ్గరలో ఒక సినిమా హాలును చూశాను. రైల్వే ట్రాక్ కు ఫర్లాంగు దూరంలో ఆ ఇల్లు వుందనుకుంటాను. ” అంది కల్యాణి.
సెల్ తీసి విక్రంకు ఫోన్ చేసి “సర్, మరో వేటకు వేళయింది. ” అని వివరాలు చెప్పి లొకేషన్ షేర్ చేసాడు.
========================================================================
సమాప్తం
========================================================================
పారుపల్లి అజయ్ కుమార్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ పారుపల్లి అజయ్ కుమార్ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు. లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:
నా పేరు పారుపల్లి అజయ్ కుమార్ ...
పదవీ విరమణ పొందిన ప్రభుత్వ జూనియర్ అధ్యాపకుడుని ...
ఖమ్మం జిల్లా, ఖమ్మం పట్టణ వాసిని ...
సాహిత్యం అంటే ఇష్టం .... కథలు,
నవలలు చదవటం మరీ ఇష్టం ...
పదవీ విరమణ తరువాత నా సహచరి దుర్గాభవాని సహకారంతో ఖమ్మం లో
"పారుపల్లి సత్యనారాయణ పుస్తక పూదోట - చావా రామారావు మినీ రీడింగ్ హాల్ " పేరిట ఒక చిన్న లైబ్రరీని మా ఇంటి క్రింది భాగం లో నిర్వహిస్తున్నాను ..
షుమారు 5000 పుస్తకాలు ఉన్నాయి .
నిరుద్యోగ మిత్రులు ఎక్కువుగా వస్తుంటారు ..
రోజుకు 60 నుండి 70 మంది దాకా వస్తుంటారు ...
ఉచిత లైబ్రరీ ....
మంచినీరు ,కుర్చీలు ,రైటింగ్ ప్యాడ్స్ ,వైఫై ,కరెంటు అంతా ఉచితమే ...
ఉదయం 6 A M నుండి రాత్రి 10 P M దాకా ఉంటారు ...మనసున్న
మనిషిగా నాకు చేతనైన సాయం నిరుద్యోగ మిత్రులకు చేస్తున్నాను. ఇప్పుడిప్పుడే కొంతమందికి జాబ్స్ వస్తున్నాయి.
Comentarios