top of page

వేటకు వేళాయెరా - పార్ట్ 1

Updated: Apr 19

#ParupalliAjayKumar, #పారుపల్లిఅజయ్కుమార్, #వేటకువేళాయెరా, #VetakuVelayera, #TeluguSuspenseCrimeThriller

Vetaku Velayera - Part 1/3 - New Telugu Story Written By Parupalli Ajay Kumar

Published In manatelugukathalu.com On 15/04/2025

వేటకు వేళాయెరా - పార్ట్ 1/3 - పెద్దకథ ప్రారంభం

రచన: పారుపల్లి అజయ్ కుమార్

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్



రాత్రి పదకొండు గంటల సమయం.

ఆకాశం నల్లటి దుప్పటి కప్పుకున్నట్లుగా కారు మేఘాలతో నిండి వుంది.


కన్ను పొడుచుకున్నా కానరాని కటిక చీకటి.  పరుగెడుతున్న పాములా,  మెలికలు తిరిగి వున్న నల్లటి తారు రోడ్డు నిర్మానుష్యంగా వుంది.


దయ్యం పట్టిన వారు జుట్టు విరబోసుకుని వూగినట్లు,  రోడ్డుకు ఇరువైపులా వున్న దట్టమైన పెద్ద పెద్ద చెట్లు గాలికి భయంకరంగా వూగుతున్నాయి.


ఏ క్షణంలోనైనా వర్షం పడే సూచనలు కానవస్తున్నాయి.


ఆ నిశీధి రాత్రిలో, ఆ నిర్మానుష్య రోడ్డులో ఒక కారు ప్రయాణం చేస్తున్నది.


డ్రైవింగ్ సీట్ లో విక్రమ్ కూర్చుని వున్నాడు. అతని పక్కన  భార్య ధీర కూర్చుని వుంది.  ఆమె ఒడిలో చిన్న పాప నిద్రపోతున్నది. విక్రం నిదానంగా డ్రైవ్ చేస్తున్నాడు.


ఇద్దరూ విక్రం బాల్య స్నేహితుడి పెళ్ళికి వెళ్ళి వస్తున్నారు.


“రాత్రి పూట ఆ దారివెంట ప్రయాణం మంచిది కాదు. మీకు తెలిసే వుంటుంది. గత నాలుగు నెలల్లో ఆ రోడ్డు మీద రాత్రి వేళ మూడు దారి దోపిడీలు జరిగాయి. ముసుగు దొంగలు కార్లను ఆపి డబ్బు, నగలు దోచుకోవడమే కాక, కారులో ప్రయాణిస్తున్న వారిని అక్కడ దింపేసి కార్లను కూడా ఎత్తుకెళ్లారు. మీకు చెప్పే వాణ్ణి కానులే కానీ, రాత్రికి ఇక్కడ వుండి ఉదయాన్నే వెళ్ళండి.”

అని స్నేహితుడు చెప్పినా వినకుండా ఇద్దరూ చంటిపాపను తీసుకుని కారులో

బయలుదేరారు.


చల్లగాలులు వీస్తుండటంతో  విక్రం కారులో ఏసీ ఆపుచేసి కారు విండో డోర్స్ కిందకి దించాడు.


గాలికి రేగుతున్న జుట్టును సరి చేసుకుంటూ  “విక్రం! ఇంత నెమ్మదిగా డ్రైవ్ చేస్తే ఇంటికి వెళ్ళేసరికి తెల్లవారి పోతుంది. వర్షం కూడా వచ్చేలా వుంది. స్పీడ్ గా పోనివ్వు.” అంది ధీర.


“డార్లింగ్! ఇంత ఆహ్లాదకరమైన వాతావరణం  మన ఏసీ గదుల్లో వుంటుందా? మనసారా ఆస్వాదించు ఈ చల్లని పిల్లగాలులను.”

అంటూ ధీర వైపు చిలిపిగా చూస్తూ కారులో ఆడియో సిస్టంను ఆన్ చేశాడు.


“వీటిని పిల్లగాలులు అనరు. ఈదురు గాలులు అంటారు.” విసురుగా అంటూ విండో డోర్ ను సగం పైకెత్తింది ధీర.


‘ఎచటి నుండి వీచెనో... ఈ చల్లని గాలి


తీవెలపై ఊగుతూ పూవులపై తూగుతూ


ప్రకృతినెల్ల హాయిగా....


తీయగా మాయగా


పరవశింప జేయుచూ’


సిస్టంలో వస్తున్న పాటకు కారు స్టీరింగ్ మీద లయగా దరువు వేయసాగాడు విక్రం.


“చూసావా! నా మనసు తెలిసినట్టు సిస్టం ఆన్ చేయగానే ఈ పాట వస్తున్నది.

పాత పాటలు మన మనస్సును ప్రశాంతం గా వుంచుతాయి. ఎక్కువసేపు ప్రయాణిస్తున్నప్పుడు మంచి సంగీతం వినడంవల్ల  రిలాక్స్‌డ్ గా వుంటుంది.

డ్రైవ్‌ లో  ఆహ్లాదకరమైన అనుభూతిని కలిగిస్తాయి ఈ పాత పాటలు.”

ధీర వైపు చూస్తూ నవ్వుతూ అన్నాడు.


“చాలు, మహానుభావా చాలు! ఈ మాటలు ఇప్పటికి వేయిన్నొక్క సార్లు చెప్పావు. మాటలు ఆపి రోడ్డు చూస్తూ డ్రైవ్ చేయి. కొద్దిగా స్పీడ్ పెంచు.” అంది.


“ఓకె మేడమ్ మీ ఆజ్ఞ... తప్పక పాటిస్తాను.”

అంటూ విక్రం కారు వేగం ఒక్కసారిగా పెంచేశాడు.


ఒక నిమిషం గడిచిందో లేదో దూరంగా రోడ్డు పక్కనున్న చెట్టు చాటు నుండి ఎవరో మనిషి కారుకు అడ్డంగా పరుగెత్తుకుంటూ వచ్చాడు.


ధీర ఆ మనిషిని చూస్తూనే ‘విక్రం’

అని అరిచింది.

విక్రం ఆ మనిషిని చూస్తూనే సడన్ బ్రేక్ వేసాడు.

టైర్లు రోడ్డును రాసుకుంటూ కీచుమంటూ శబ్దం చేసాయి. కారు రెప్పపాటులో వెళ్ళి ఆ మనిషిని ఢీకొట్టింది.

ఆ మనిషి ఒక్కసారిగా ఎగిరి రోడ్డు పక్కన  పడిపోయాడు.


కారు ఆగగానే విక్రం, ధీర వైపు చూసి సైగ చేసాడు. ధీర తల వూపుతూ తన వొడిలో నిద్రపోతున్న పాపను వెనుక సీట్లో పడుకో బెట్టి కారు దిగింది.


కారు హెడ్ లైట్ట్స్ వెలుగులో ముందుకు వెళ్ళి వొంగుని పడిపోయిన మనిషి ముఖంలోనికి చూసింది. నుదుటి మీద అయిన గాయం నుండి రక్తం కారుతున్నది. ఆ మనిషి స్పృహలో లేడు. ఆ మనిషి ముక్కు దగ్గర వేలు వుంచి చూసింది. శ్వాస ఆడుతున్నది.


’థ్యాంక్‌ గాడ్‌‘ అనుకుంటూ పైకి లేచి  విక్రం వైపు చూసింది.


అంతలోనే పక్కనున్న చెట్లచాటు నుండి అయిదుగురు మనుషులు ముఖానికి ముసుగులు ధరించి, కత్తులు చేత పట్టుకుని హఠాత్తుగా వచ్చి ధీరను చుట్టుముట్టారు. ఇద్దరు ధీరను గట్టిగా పట్టుకున్నారు.


ధీర వాళ్ళను చూస్తూనే బిత్తర పోయి, వాళ్ళను విదిల్చికొడుతూ విక్రం వైపు చూసింది. విక్రం కనులు చిట్లించి తీక్షణంగా వాళ్ళను చూసాడు.

ధీర కళ్ళలోకి చూస్తూ సైగ చేశాడు.


విక్రం కనుసైగను అర్థం చేసుకున్న ధీర

“విక్రం !  డబ్బు, నగలు  జాగ్రత్త!”

అని అరిచింది.


విక్రం కారు స్టార్ట్ చేయబోయాడు.

కారు వెంటనే స్టార్ట్ కాలేదు.

ఇద్దరు మనుషులు వచ్చి కారుకు అడ్డంగా నిలబడ్డారు.


విక్రం ఒకచేత్తో  బ్రీఫ్ కేస్ పట్టుకుని కారు దిగి వెనక్కి తిరిగి పరుగెత్తాడు.

అది చూస్తూనే  ధీరను చూస్తుండమని ఒకడికి చెప్పి, మిగిలిన నలుగురు అతని వెంటబడ్డారు.


ధీర తన దగ్గర నిలుచున్న మనిషిని చూసింది. అతను తన సహచరులు వెళుతున్న వైపు చూస్తున్నాడు.

ధీర కుడిచేతిని కత్తిలా చేసి అతని మెడ  మీద ఒకే ఒక్క దెబ్బ వేసింది. అతను ఆ ఒక్క దెబ్బకే స్పృహ తప్పి మొదలు నరికిన చెట్టులా బోర్లాపడ్డాడు.


ధీర కారులో నుండి తాడు తీసుకువచ్చి కారును ఢీకొని పడిపోయిన మనిషిని, తను పడగొట్టిన మనిషిని  కాళ్ళు చేతులు కట్టేసి రోడ్డు పక్కనున్న చెట్ల చాటుకు లాగింది.


కారు వెనుక డోర్ తెరిచి చూసింది. పాప నిద్ర పోతూనే వుంది. డోర్ మూసి, ప్రంట్ డోర్ తెరిచి డ్రైవింగ్ సీట్ లో కూర్చుని కారును రివర్స్ చేసి విక్రం పరుగెత్తిన వైపుకు పోనిచ్చింది.


సెల్ ఫోన్ తీసి పోలీస్ స్టేషన్ కు ఫోన్ చేసి లొకేషన్ షేర్ చేసింది.

ధీరకు తెలుసు రన్నింగ్ లో విక్రం నేషనల్ లెవెల్ ఛాంపియన్ అని.


ఉరుములు, మెరుపులు మొదలయ్యాయి. మలుపులు తిరిగి వున్న రోడ్డు మీద విక్రం జిగ్ జాగ్ గా పరుగెడుతున్నాడు.

ఆ నలుగురు మనుషులు అతన్ని పట్టుకోవాలని అతని వెనుకే పరుగెడుతున్నారు. వారు ఎంత వేగంగా పరుగెత్తినా విక్రంను అందుకోలేక పోతున్నారు.


గాలి మరింత వేగాన్ని పుంజుకుంది.

విక్రం  పరుగెడుతూనే కనుచివరల నుండి వెనక్కు చూసాడు. కొద్దిదూరంలో ఆ నలుగురు మనుషులు పరుగెత్తుకు వస్తున్నారు. దూరంగా కారు హెడ్ లైట్లు కనిపించాయి.


ఆ చిమ్మ చీకట్లో రోడ్డుమీద వారిని  ఎదుర్కుంటే, ఏవైనా వాహనాలు వస్తే ఇబ్బంది అవుతుంది అని ఆలోచిస్తూ

విక్రం తారు రోడ్డు విడిచిపెట్టి  రోడ్డు పక్కనున్న చెట్లను దాటుకుని పొలాలలోకి వెళ్ళాడు. ఆ మనుషులు కూడా అతన్ని తరుముతూ వెళ్ళారు.


కారు డ్రైవ్ చేస్తున్న ధీర విక్రం మెయిన్ రోడ్డు విడిచి పక్కన్నున్న పొలాల్లోకి వెళ్ళటం చూసింది. అక్కడికి వెళ్ళాక కారు రోడ్డు పక్కన ఆపి, కారులో వున్న రివాల్వర్ ను చేత పట్టుకుని తను కూడా అటు పక్కకు పరుగెత్తింది.


విక్రం పరుగెత్తడం ఆపి ఎడమ చేతిలో వున్న బ్రీఫ్ కేస్ ను వెనుక వస్తున్న వాళ్ళ వైపు విసిరాడు. వాళ్ళు దాన్ని అందుకుని ఆత్రంగా తెరిచి చూసారు. అది ఖాళీ బ్రీఫ్ కేస్. వాళ్ళు విస్తుపోయి అతని వైపు చూసారు. వెంటనే వాళ్ళు  కత్తులతో విక్రంను చుట్టుముట్టి

“ఎక్కడ డబ్బులు?” అని అరిచారు.


“ఇక్కడ” అన్న మాటలు వినిపించి నలుగురూ వెనక్కు తిరిగి చూసారు.

అక్కడ ధీర నిలబడి వుంది.

మెరుపుల వెలుగులో ఆమె చేతిలోని రివాల్వర్ ను చూస్తూనే నివ్వెరపోయారు.


అదే అదనుగా విక్రం కుడికాలు పైకెత్తి పక్కనున్న ఇద్దరి మీద కరాటే పంచ్ లు విసిరాడు. వారు కిందపడిపోయారు.


మిగిలిన  ఇద్దరు ఒక్కసారిగా కత్తులతో విక్రంపై  దాడి చేయాలని చూసారు. ధీర షార్ప్ గా రియాక్ట్ అయి రివార్వర్ ను పేల్చి ఇద్దరి చేతులను గాయపరిచింది. ఇద్దరూ లబోదిబోమంటూ కత్తులు వదిలేసి కూలబడి పోయారు.


ధీర  చూస్తుండగానే ఆ నలుగురు మనుషులను విక్రం స్పృహ తప్పి పోయేలా కొట్టాడు. కారులో వున్న తాళ్ళు తెచ్చి వాళ్ళ కాళ్ళూ చేతులూ కట్టిపడేసాడు.

వారి దగ్గరున్న ఆయుధాలను, వారి జేబుల్లో వున్న సెల్ ఫోన్ లను స్వాధీనం చేసుకున్నాడు విక్రం.


ఇద్దరూ తిరిగి కారు దగ్గరకు చేరుకున్నారు. వాతావరణం మరింత చల్లగా తయారయింది.


“స్టేషన్ కు ఫోన్ చేశావా?” అడిగాడు విక్రం.


“చేశా విక్రం. ఈ పాటికి వస్తూనే వుంటారు.” అంది ధీర.


దూరంగా ఎక్కడో వాన పడుతున్నట్టు మట్టివాసన ముక్కుపుటాలను తాకింది.  చలి గాలికి కొద్దిగా వణుకుతున్న ధీరను కౌగిలిలో పొదుపుకున్నాడు విక్రం.

ధీర, విక్రం వక్షస్థలంపై తల ఆన్చికళ్ళు మూసుకుంది.


“ధీరా! నీకు ఆ రోజులు,ఆ క్షణాలు గుర్తున్నాయా?”

గుసగుసగా అడిగాడు విక్రం.


“ఏ రోజులు? ఏక్షణాలు?” కళ్ళు మూసుకునే అడిగింది ధీర.


“మనం మొదటిసారిగా పరిచయం పెంచుకున్న రోజులు. నేను నిన్ను తొలిసారిగా ముద్దుపెట్టుకున్న క్షణం…”

తన్మయత్వంతో అన్నాడు విక్రం.


ఆ పెనుచీకటిలో విక్రంను మరింత గాఢంగా పెనవేసుకుని “వూ!” అంది ధీర సిగ్గుపడుతూ.


ఇద్దరిలో గతకాలపు జ్ఞాపకాలు మదిలో మెదిలాయి.


*************************************


విక్రం, ధీరలు  డిగ్రీలో క్లాస్ మేట్స్ అయినా ముఖపరిచయం తప్ప ఇద్దరిమధ్య పెద్దగా మాటలు వుండేవి కావు.

విక్రం కాలేజీలో స్పోర్ట్స్ ఛాంపియన్. NCC, NSS లలో చురుకుగా పాల్గొనేవాడు.


విక్రం ఒక రోజు బ్యాంక్ పని మీద స్టేట్ బ్యాంక్ కు వెళ్ళాడు. బ్యాంక్ పని ముగించుకుని బయటకు వస్తున్నాడు.


సత్యనారాయణ చేతిలో కేష్ బేగ్ తో అప్పుడే బ్యాంక్ నుండి బయటికి వచ్చి దూరంగా పార్క్ చేసిన తన బండి దగ్గరకు నడవసాగాడు. దూరంనుంచి ఒక వ్యక్తి అది గమనించి అతన్నే ఫాలో అవుతున్నాడు. ఇద్దరిమధ్య అయిదు అడుగుల దూరం మాత్రమే వుంది.

చుట్టూ వున్న పరిసరాలను నిశితంగా గమనించే అలవాటున్న విక్రం అది చూస్తూనే జరగరానిది ఏదో జరగబోతున్నదని అలర్ట్ అయ్యాడు.

తను కూడా వాళ్ళనే ఫాలో అయ్యాడు.

స్పీడ్ గా నడచి వాళ్ళను దాటి పది అడుగులు ముందుకు వేసాడు. ఓర కంట వెనక్కు చూస్తూ నడుస్తున్నాడు విక్రం.


ఒక బైక్ వచ్చి సత్యనారాయణ ను ఫాలో అవుతున్న వ్యక్తి పక్కన ఆగింది. ఫాలో అవుతున్న వ్యక్తి బైక్ ఎక్కాడు. బైక్ నడుపుతున్న వ్యక్తి బైక్ ను

సత్యనారాయణ ప్రక్కన ఆపి

“సార్ ఈ అడ్రస్ ఎక్కడో చెపుతారా?” అని ఒక కాగితాన్ని చూపించాడు.


సత్యనారాయణ  కాగితం లోకి దృష్టి సారించేసరికి వెనుక వున్న వ్యక్తి కేష్ బేగ్ ను లాక్కొని సత్యనారాయణను వెనక్కు నెట్టాడు.

సత్యనారాయణ  కిందపడబోయి నిలదొక్కుకుని “దొంగ! దొంగ!” అంటూ పెద్దగా అరిచాడు.


బైక్ ఒక్కసారిగా స్పీడ్ అందుకుని ముందుకు దూకింది. విక్రం రోడ్డు పక్కనే వున్న ఒక ఎండి పోయిన చెట్టు కొమ్మను తీసుకుని ముందుకు దూసుకు వస్తున్న బైక్ ముందు చక్రానికి గురిచూసి విసిరాడు.

ఆ దెబ్బకు బైక్ బాలెన్స్ తప్పి ప్రక్కకు పడిపోయింది.


చుట్టూ జనాలు పోగయ్యారు. విక్రం  కిందపడిన వ్యక్తి చేతిలోని కేష్ బ్యాగ్ తీసుకుని వురుక్కుంటూ వస్తున్న సత్యనారాయణకు  అందజేశాడు.

జనాలు బైక్ నుండి క్రింద పడిన ఇద్దరినీ చితగ్గొట్టారు.


“థాంక్స్ బాబూ! దేవుడిలా వచ్చి సహాయం చేసావు. లేకపోతే పది లక్షలు పోగొట్టుకునే వాడిని ఈ రోజు. నాపేరు సత్యనారాయణ. MRO ఆఫీసులో పనిచేస్తున్నా.” అన్నాడతను.


“నా పేరు విక్రం అండి. డిగ్రీ  చదువుతున్నా.” అన్నాడు విక్రం.


చుట్టూ చేరిన జనాల్లో ఎవరో పోలీసులకు ఫోన్ చేశారు. పోలీసులు వచ్చి వాళ్ళిద్దరినీ స్టేషనుకు తీసుకెళుతూ, సత్యనారాయణ, విక్రంలను  వచ్చి రిపోర్ట్ ఇవ్వమన్నారు.


విక్రం స్టేషన్ లో వుండగా ధీర అక్కడకు వచ్చింది. ధీరను చూపిస్తూ “మా అమ్మాయి ధీర” అన్నాడు సత్యనారాయణ.


ధీరకు విక్రంను చూపిస్తూ  “ఇతను విక్రం. ఈ రోజు మన డబ్బులు దొంగల పాలు కాకుండా కాపాడింది ఇతనే.” అంటూ జరిగింది చెప్పాడు.


ఇద్దరూ ఒకరనొకరు చూసుకుని చిరునవ్వుతో “హలో” అని  పలకరించుకున్నారు.


ధీర, విక్రంతో “ థాంక్స్!” అని,

తండ్రి వైపు తిరిగి

“నాన్నా! మేమిద్దరం క్లాస్ మేట్స్ మి.” అంది.


దొంగలను సమయస్ఫూర్తితో దెబ్బగొట్టి తమ డబ్బులను కాపాడిన విక్రం అంటే అభిమానం పుట్టుకొచ్చింది ధీరకు.

అప్పటినుండి వారి పరిచయం మరో మెట్టు పైకి ఎక్కింది.

=======================================================================

                                                ఇంకా వుంది

========================================================================


పారుపల్లి అజయ్ కుమార్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ పారుపల్లి అజయ్ కుమార్ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం


విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు. లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.



రచయిత పరిచయం:

నా పేరు పారుపల్లి అజయ్ కుమార్ ...

పదవీ విరమణ పొందిన ప్రభుత్వ జూనియర్ అధ్యాపకుడుని ...

ఖమ్మం జిల్లా, ఖమ్మం పట్టణ వాసిని ...

సాహిత్యం అంటే ఇష్టం .... కథలు,

నవలలు చదవటం మరీ ఇష్టం ...

పదవీ విరమణ తరువాత నా సహచరి దుర్గాభవాని సహకారంతో ఖమ్మం లో

"పారుపల్లి సత్యనారాయణ పుస్తక పూదోట - చావా రామారావు మినీ రీడింగ్ హాల్ " పేరిట ఒక చిన్న లైబ్రరీని మా ఇంటి క్రింది భాగం లో నిర్వహిస్తున్నాను ..

షుమారు 5000 పుస్తకాలు ఉన్నాయి .

నిరుద్యోగ మిత్రులు ఎక్కువుగా వస్తుంటారు ..

రోజుకు 60 నుండి 70 మంది దాకా వస్తుంటారు ...

ఉచిత లైబ్రరీ ....

మంచినీరు ,కుర్చీలు ,రైటింగ్ ప్యాడ్స్ ,వైఫై ,కరెంటు అంతా ఉచితమే ...

ఉదయం 6 A M నుండి రాత్రి 10 P M దాకా ఉంటారు ...మనసున్న

మనిషిగా నాకు చేతనైన సాయం నిరుద్యోగ మిత్రులకు చేస్తున్నాను. ఇప్పుడిప్పుడే కొంతమందికి జాబ్స్ వస్తున్నాయి.



Comments


bottom of page