top of page
Writer's pictureLakshmi Sarma B

విధి ఆడిన వింత నాటకం - పార్ట్ 13

#LakshmiSarmaThrigulla, #లక్ష్మీశర్మత్రిగుళ్ళ, #VidhiAdinaVinthaNatakam, #విధిఆడినవింతనాటకం, #TeluguSerials, #TeluguLoveStories, #తెలుగుప్రేమకథలు


Vidhi Adina Vintha Natakam - Part 13 - New Telugu Web Series Written By Lakshmi Sarma Thrigulla Published In manatelugukathalu.com On 11/11/2024

విధి ఆడిన వింత నాటకం - పార్ట్ 13 - తెలుగు ధారావాహిక

రచన: లక్ష్మీ శర్మ త్రిగుళ్ళ

(ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత)

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్



జరిగిన కథ:


కొత్తగా పెళ్ళైన ప్రియాంక దగ్గరకు తన మాజీ ప్రేమికుడు మధు వస్తాడు. డిస్టర్బ్ అవుతుంది ప్రియాంక. అతనితో తన పరిచయం గుర్తు చేసుకుంటుంది. గతంలో ఉద్యోగం కోసం మధుని తన తండ్రి దగ్గరకు తీసుకొని వెళ్తుంది ప్రియాంక. 


మధు, ప్రియాంకల మీద నిఘా పెడతాడు. వాళ్లిద్దరూ ప్రేమించుకుంటున్నట్లు గ్రహిస్తాడు. మధు తన డబ్బుతో పారిపోయినట్లు చెబుతాడు దామోదరం. 


తాను మధును ప్రేమిస్తున్న విషయం బయటపెడుతుంది ప్రియాంక. 


గుండెపోటు వచ్చినట్లు నటిస్తాడు దామోదరం. హాస్పిటల్ లో చేరి మధుని మరిచి పొమ్మని కూతురికి చెబుతాడు. కొద్ది రోజులకు తండ్రి ప్రోద్బలంతో రామకృష్ణను పెళ్లి చేసుకుంటుంది. అతని ఆప్యాయత చూసి అతనికి దగ్గర కావాలనుకుంటుంది. ఇంతలో మధు తనని కలవడంతో భర్తకు దగ్గర కాలేక పోతుంది. 


గుడి దగ్గర మధు, ప్రియాంకలు మాట్లాడుకునే అవకాశం కల్పిస్తాడు రామకృష్ణ. తన తండ్రి చేసిన మోసం తెలుసుకుంటుంది ప్రియాంక. 

విధి ఆడిన వింత నాటకం - పార్ట్ 12 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


 ఇక 'విధి ఆడిన వింత నాటకం' ధారావాహిక పార్ట్ 13 చదవండి. 


“మధు .. నువ్వు చెప్పేది వింటూ ఉంటే నా ప్రాణం ఎందుకు ఆగిపోవడం లేదు? మధు.. నేను నిన్ను అనుమానించలేదు. ఇప్పటివరకు నా మస్తిష్కంలో నిన్ను తప్ప నేనెవరికి చోటివ్వలేదు. నా ప్రేమ నిజమైతే నువ్వు ఎప్పటికైనా తిరిగివస్తావని ఎదురుచూస్తున్నాను.


నా ప్రేమలో నిజాయితీ ఉంది కనుకనే నువ్వు తిరిగి వచ్చావు, నువ్వు నన్ను మోసంచెయ్యలేవని మా నాన్నతో కూడా పదేపదే చెప్పాను. మధు, విధి మన ప్రేమతో ఆడుకున్నది. మనను దూరం చెయ్యాలని ఎంత పన్నాగం పన్నిందో చూడు.. మధు నేనెప్పటికి నీ ప్రియనే నాకు బలవంతంగా పెళ్ళి చేసారు, ” 


మధు చేతులు దొరకబుచ్చుకుని అందులో ముఖం దాచుకుని తనివితీరా ఏడుస్తుంది ప్రియాంక. అలాగే ఏడవని మనసు ప్రశాంతం అవుతుంది అని సైగ చేసాడు రామకృష్ణ. 


“ప్రియా .. విన్నావు కదా ! ఇదంతా ఎవరు చేసారో, ఇక ఇంటికి వెళదామా ఇప్పటికే చాలా లేటయింది, ” ఆమె వైపు చూస్తూ అడిగాడు. 


అరుణిమదాల్చిన కళ్ళతో చివ్వున తలెత్తి భర్తవైపు చూసింది. ఆ కోపానికే గనుక దహించే శక్తి ఉంటే నిలువునా భస్మమైపోయేవాడు రామకృష్ణ. ముక్కుపుటాలు అదురుతుండగా “నేను రాను. నాకు ఇల్లులేదు. మీరు వెళ్ళిపోవచ్చు, ” అంది. 


“అయ్యో అదేంటి ప్రియా.. అలా అంటున్నావు? మీ అమ్మా నాన్నలు నాకు అప్పగించారు వాళ్ళు వచ్చేవరకు నిన్ను భద్రంగా చూసుకోవాలి. వాళ్ళు చెప్పారనే కాదు! నా భార్యను నేను వదిలి ఎలా పోతాను, ఏమైంది ప్రియా .. మధు తప్పుచేసాడని నువ్వనుకుంటున్నావు అని నీ దగ్గరకు తీసుకవచ్చాను. అతని ప్రేమలో నిజాయితీని నిరూపించాడు. అంతేకదా మనకు కావలసింది.. రేపు మీ నాన్నడిగినా నువ్వు చెప్పొచ్చు మధు మంచివాడని.

 

సరే మధు.. ఎప్పుడైనా నీకు రావాలనిపిస్తే ఒక స్నేహితుడిగా రావచ్చు, నేను నా భార్య ప్రియాంక నీకు పరాయివాళ్ళం అనుకోకు. పోని ఒకపని చేస్తే బాగుంటుందేమో.. నువ్వు మాతోపాటుగా మా ఇంటికి వచ్చేయ్యి. అందరం కలిసి భోంచేద్దాం. ఏమంటావు ప్రియా, ”


క్రీగంట భార్య వైపు చూస్తూ అడిగాడు. భయంతో రెండడుగులు వెనక్కివేసింది. 


“లేదు నేనెక్కడికి రాను. నేను మధుతో వెళ్ళిపోతాను, ” అంది తడబడుతూ. 


“అదేంటి.. నన్ను పెళ్ళి చేసుకుని ఇప్పుడు అతనితో వెళ్ళిపోతానంటున్నావు, ఇదేం న్యాయం? ఇందుకోసమేనా నేను మధును నీ దగ్గరకు పిలిపించింది? నువ్వు నన్ను విడిచి వెళ్ళకపోతే లోకంకు, మీ నాన్నకు ఏం సమాధానం చెప్పను, ” అమాయకుడిలా నటిస్తూ అడిగాడు. 


“నన్ను క్షమించండి రామకృష్ణగారు.. నేను వచ్చింది మీ భార్యభర్తలను విడదియ్యడానికి రాలేదు. నేను ప్రేమించిన నా ప్రేయసి నా కోసం కాచుకుని ఉంటుందని, మా ప్రేమలో నిజాయితీ ఉందని, మా శరీరాలు వేరయినా మా మనసులు ఒక్కటేనన్న భావంతో ఇంతదూరం వచ్చాను. వచ్చాక తెలిసింది తను మరొకరి సొత్తు అని. తన మీద నాకెలాంటి అధికారం లేదని తెలుసుకున్నాను. ఎంతయినా ప్రేమించిన మనసు కదా! నేనేం తప్పు చెయ్యలేదని నిరూపించుకోవాలని తపన పడ్డాను అంతే, ఎక్కడనుండో వచ్చాను. ఎవరికి తెలియనంత దూరం వెళ్ళిపోతాను, ” అంటూ వెనకకు తిరిగి వెళ్ళిపోతున్నాడు. 


ప్రియాంకకు మతి తప్పినదానిలా పిచ్చి చూపులు చూస్తూ అలాగే నిలబడిపోయింది. 


పరుగున వెళ్ళి మధు రెక్కపట్టుకుని ఆపాడు రామకృష్ణ. 


“ప్రియా.. నువ్వు వచ్చెయ్యి. మధు మనింటికి వస్తున్నాడు, ” అంటూ కేకవేసాడు. 


 వెనకనుండి ఎవరో తోస్తున్నట్టు గబగబా పరుగెత్తుకుంటూ వచ్చింది. ప్రియాంకకు అంతా అయోమయంగా ఉంది. ఇతనేంటి తను ప్రేమించినవాడిని వెంటబెట్టుకుని ఇంటికి తీసుకవస్తున్నాడు. కోపంతో బంధించడు కదా.. నాన్న వచ్చేవరకు.. ఏమో నమ్మడానికిలేదు. 

ఎందుకైనా మంచిది మధు ఇంటికి రాకుండా ఆపాలి అనుకుంటూ. 


“ఏమిటి మీరనేది.. ఇతన్ని ఎందుకు ఇంటికి రమ్మంటున్నారు, మా నాన్న వచ్చాడంటే ఈసారి నిజంగానే మధు ప్రాణాలు నా ముందే తీస్తాడు. నేనది చూస్తూ ప్రాణాలతో ఉండలేను. ఇప్పటివరకు జరిగింది చాలు. నా వలన మధు ఎన్ని కష్టాలుపడినాడో నాకు తెలుసు. దయచేసి మమ్మల్ని వదిలేయండి. ఎక్కడికైనా వెళ్ళి ప్రశాంతమైన జీవనం గడుపుకుంటాము. భిక్షాటన చేసుకుని బతుకుతాము. మాకు ఆయన ఆస్తిపాస్తులు కూడా అక్కరలేదని చెప్పండి, ” ఆవేశంతో చెప్పింది. 


“ ప్రియాంక .. ఏమిటి నువ్వనేది ? ఇప్పుడు నేను నీకు పరాయివాడను, నువ్వు నాతో రావడానికి నువ్వు ఒప్పుకున్నా నేను ఒప్పుకోను. ఒకరికి అగ్నిసాక్షిగా భార్యవు అయ్యావు. పరులసొమ్ముకు ఆశపడే మనస్తత్వం నాకులేదు. నా ప్రేమలో బలంలేదు. నా జీవితంలో నేనుకున్నదేది నాకు దక్కదని తెలుసు, నీ సంసారాన్ని చిన్నాభిన్నం  చేయడానికి రాలేదు. నువ్వు సంతోషంగా ఉండడమే నాకు కావలసింది, ”అన్నాడు జీవంలేని నవ్వు నవ్వుతూ. 


“చూడండి మధు.. మీరు మీ నిర్ణయాలు చెప్పారు, మరి నా నిర్ణయం ఏంటో అడిగేది లేదా? అంటే ప్రేమించిన వాడికోసమని ఇన్నాళ్ళుగా నాకు దూరంగా ఉంది నా భార్య. నువ్వు ఉన్నావో లేదో తెలియనప్పుడే తను నీకోసం తపించిపోయింది. అలాంటిది నువ్వు ఉన్నావు అన్న సత్యం తెలిసిన తరువాత తను నాతో కాపురం చేస్తుందని నువ్వు నమ్ముతున్నావా? నీ జీవితంలో నువ్వు కోరుకున్నవి నీకు దక్కలేదని నువ్వు అనుకుంటున్నావు.


 కానీ కన్నతల్లి తండ్రులు, ఆస్తిపాస్తులు, అందమైన భార్య అన్నీ ఉండి కూడా అనుభవించలేని నేనేమనుకోవాలి, మీకు మాత్రమే తెలుసనుకుంటున్నారా త్యాగాలు, నాకు తెలుసు. నేను త్యాగం చెయ్యగలను. కానీ మీలాగా తొందరపడి నిర్ణయం తీసుకోను. దేనికైనా సమయం అనేది ఒకటుంటుందని అర్థం చేసుకుని నేను చెప్పినట్టు వినండి. మన ముగ్గురి జీవితాలు ఎటువైపు పయనించాలో ఆ కాలమే తేలుస్తుంది, ” అంటూనే కారు స్టార్టు చేసాడు. ఇద్దరు మారు మాట్లాడకుండా కారెక్కి కూర్చున్నారు. 


ఎవరి మనసులో వాళ్ళే ఆలోచిస్తున్నారు గెలుపెవరిదో విధి ఆడుతున్న ఈ నాటకంలో. 


“ప్రియా.. నేను ఆఫీసుకు వెళ్ళివస్తాను, మధు నువ్వు ఏమి ఆలోచించకుండా ప్రశాంతంగా ఉండు, నువ్వు కొన్నాళ్ళు నేను తెచ్చిన మందులు వేసుకుంటే నీ ఆరోగ్యం బాగుపడుతుంది, నీకు విశ్రాంతి చాలా అవసరమని డాక్టర్ చెప్పాడు, ఇదిగో మధును జాగ్రత్తగా చూసుకునే బాధ్యత నీదే, ” ప్రియాంకతో చెప్పాడు. 


“ఏమండి మీరు మధును హాస్పిటల్ కు తీసుకవెళ్ళారా ఎప్పుడు? మధుకు ఏమైంది, మధును మీరింతకు ముందే కలిసారా? నాకేమి అర్థంకావడంలేదు కాస్త అర్థమయ్యేట్టు చెప్పండి, ” ఆశ్చర్యంతో భర్తను చూస్తూ అడిగింది. 


“అబ్బా ప్రియాంక .. ఇప్పుడవన్నీ ఎందుకు నేను చెప్పింది చెయ్యి, సాయంత్రం వచ్చాక చెబుతాను కదా! కంగారుపడవలసిన ఏమిలేదు సరేనా”నవ్వుతూ చెప్పి వెళ్ళిపోయాడు. 


సరేనంటూ తలూపింది కానీ ఆమె మనసును ఏదో కీడు శంకిస్తుంది మధును చూస్తుంటే. 


నిజంగా నేను మధును గమనించనేలేదు ఎంతందంగా ఉండేవాడు. పచ్చటి పసినిమ్మపండులాంటి మేని చాయతో ఒక్కసారి చూసామంటే చూపు మరల్చుకోలేనంత అందగాడు. ఆ కళ్ళు లోపలకు పోయి బుగ్గలు సాగిపోయి ఎలా తయారయ్యడు. 


“మధు .. ఎందుకిలా తయారయ్యావు ఏమైంది నీకు ఒంట్లో బాగాలేదా? ఇన్నాళ్ళనుండి తిండి తిన్నావా లేదా, ఒకసారి నీ శరీరాన్ని చూసుకున్నావా ఎలా అయిపోయావో, ఎందుకు ఇలా నా మీద బెంగతో ఇలా అయ్యావా, ” బాధతో అతని చేతులుపట్టుకుని అడిగింది. 


తన చేతులను ఆమె చేతులలోనుండి తీసుకుని. “ ప్రియాంక .. నువ్వు ఏమి అనుకోనంటే ఒక విషయం చెబుతాను, ” అడిగాడు ఆమె వైపు చూస్తూ. 


“నేను ఏమి అనుకోను చెప్పు ఏంటో, ” అడిగింది. 


“మన మీద నమ్మకంతో మీ ఆయన నన్ను మీ ఇంట్లోకి పిలిచాడు, ఆయన నమ్మకాన్ని నిలబెట్టవలసిన బాధ్యత మనిద్దరిది, అందుకని నువ్వు నాకు దూరంగా ఉండడం మంచిది, మీ ఆయన చాలా మంచి మనిషి, ఉత్తముడు. అలాంటి వాడిని మోసంచెయ్యకూడదు. ఇక నా సంగతంటావా? రామకృష్ణ గారు పిలిచారని అతని మాట తీసివెయ్యలేక వచ్చాను. తొందరలోనే నేను వెళ్ళవలసిన గమ్యంకు వెళతాను. జీవితంలో ఎన్నో అనుకుంటాము.

అనుకున్నవన్ని సాధ్యం కావు. అందులో నాలాంటి వాడికి మరీను.. ఎన్నో ఆశలతో నిన్ను వెదుక్కుంటూ వచ్చాను. నువ్వు నాకోసం తపించిపోతూ ఎదురుచూస్తుంటావని గంపెడాశతో వచ్చాను.


 మీ నాన్న చేసిన మోసం నీకు తెలియజెప్పి నేను తప్పుచెయ్యలేదని నిరూపించుకోవడానికి రెక్కలల్లార్చుకుంటూ నీ ముందు వాలిపోయాను, కానీ “నేను ఎక్కవలసిన రైలు ఒక జీవితకాలం లేటు” అని తెలుసుకోలేకపోయాను. నాతో జరుగవలసిన పెళ్ళి వేరొకరితో జరిగిపోయిందని నిన్ను చూసాక తెలిసింది, అయినా సరే నీకు నిజంచెప్పాలని నా మనసు నిన్ను విడిచి వెళ్ళలేకపోనని మారం చేస్తుంటే ? ఒకేసారి నిన్ను చూడడం మానేయడమంటే నా హృదయం ఎంత పంపపుకోతకు గురైందో నీకు తెలియదు, ” దగ్గు రావడంతో చెప్పడం ఆపాడు. 


మధు చెప్పే మాటలకు ప్రియాంక కళ్ళు జలప్రవాహంలో కొట్టుకుంటున్నాయి. తలమీద చేతితో కొడుతూ మంచినీళ్లు అందించింది. “ మధు, ఇందులో నా తప్పేమిలేదు. నువ్వు మోసంచేసి వెళ్ళిపోయావంటే నేను ఏ కోశాన నమ్మలేదు. అప్పుడేకాదు ఎప్పటికి నువ్వేంటో నాకు తెలుసు, నీకోసం ఏడ్చి ఏడ్చి నా కళ్ళు మసకబారిపోయాయి, నువ్వు ఇక రావని నీదంతా కపటప్రేమని మా నాన్న నన్ను నమ్మించాలని చాలా ప్రయత్నాలు చేసాడు.

 

చివరకు నేను పెళ్ళిచేసుకోకపోతే అమ్మా నాన్న చనిపోతామని బెదిరించాడు. వాళ్ళ తృప్తికోసమైతే పెళ్ళిచేసుకున్నాను గానీ అతనితో కాపురం చెయ్యాలంటే నా మనసును చంపుకోలేను, నీకు దగ్గరయినా నా మనసులో వేరొకరికి స్థానం ఉంటుందని ఎలా అనుకున్నావు మధు, అతన్ని చూస్తూ ప్రతిరోజు నేను బాధపడేదాన్నీ, ప్రేమించి నిన్ను పెళ్ళి చేసుకుని అతన్ని ఇద్దరిని బాధకు గురిచేసాననే బాధ నన్ను అనుక్షణం వేధిస్తుంది.


అతను నిన్ను చూస్తే కోపంలో ఏం చేస్తాడోనన్న భయంతో నన్ను కలవద్దని చెప్పాను నీకు. ఒకసారి నా వల్ల పడరాని కష్టాలుపడ్డావు. కనీసం నాకు దూరంగా ఉంటేనన్న నువ్వు సుఖపడతావనుకున్నాను మధు, ” అంది మనసు పడే వేదనను అతని ముందుంచుతూ. 


“ఎంతపిచ్చిదానివి ప్రియా.. నీతో ఉండిపోయినా నా మనసు లేకుండా నేనెలా సుఖపడతాననుకున్నావు? నీలాగా మనసు చంపుకుని బతకడం నాకు చేతకాదు, ఇక ఈ జన్మకు నాకా అదృష్టం లేదని తెలిసిపోయింది, చివరిసారిగానైనా నీతో మాట్లాడే అవకాశం దొరికింది కృతజ్ఞుడ్ని, ఇంకెప్పుడు నీ జీవితంలోకి తొంగిచూడను నువ్వు హాయిగా ఉండడమే నాక్కావలసింది, నేను మంచివాడినేనని నీకు అర్థమైంది అది చాలు.


నేను ఆరోజే చెప్పాను నీకు ప్రేమ కథలు కొన్ని కంచికి చేరతాయే తప్పా ఫలించవని, లైలా మజ్ఞులు, దేవదాసు పార్వతి ఏమయ్యారు.. నేను అంతే, మన ప్రేమలో ఎక్కడో లోపం ఉంది. అందుకే మన మధ్య అగాధం ఏర్పడింది, ” ఆయాసంతో కూడిన దగ్గు రావడంతో ఉక్కిరిబిక్కిరి అయ్యాడు.


 గబగబా మాత్ర వేసి నీళ్ళిచ్చి పడుకోబెట్టింది. 


“మధు .. నువ్విప్పుడేం మాట్లాడకు కాసేపు విశ్రాంతిగా పడుకో, మన ప్రేమకు ఏ అడ్డంకులు రావు మనను ఎవరు ఆపలేరు ఇక, నువ్వనసరంగా ఆలోచించి ఆరోగ్యం పాడు చేసుకోకు, నా నిన్ను కాపాడుకునే బాధ్యత నాది, ” అంటూ దుప్పటికప్పి చెప్పింది. 


జీవంలేని నవ్వు మధు దరహాసాలమీద కదలాడింది. మెల్లెగా నిద్రలోకి జారిపోయాడు. ఆలోచిస్తూ మధును చూస్తూ అలాగే కూర్చుండిపోయింది ప్రియాంక ఎంతోసేపు. 


ఆఫీసుకు వెళ్ళాడన్నమాటే కానీ రామకృష్ణకు ఏమి తోచడంలేదు. ఇంట్లో మధు ప్రియాంక ఏం చేస్తున్నారో.. ఉన్నారా లేకా ఎటైనా వెళ్ళిపోయారా? మధు నెమ్మది మనిషి తొందరపడే స్వభావం కాదు, ప్రియాంకకు తొందరెక్కువ పొరబాటున మధు ఏమన్న అంటే తను ఏమైనా చేసుకోగలదు. లేదు అలా జరగడానికి లేదు. అసలే మధు ఆరోగ్యం బాగాలేదు. 


అతను ఉండేది ఏ కొద్దిరోజులు.. కనీసం ఇప్పుడన్నా అతన్ని ఆదుకోకపోతే ప్రేమించిన మనసుకు అర్థంలేదు. అవును త్వరగా ఇంటికి వెళ్ళి ఈ విషయం ప్రియకు చెప్పాలి.. అనుకుంటూ ఒక్క క్షణం ఆలస్యం చెయ్యకుండా బయలుదేరి ఇంటికి వచ్చాడు. 


“అమ్మయ్యా .. ఇంట్లోనే ఉన్నావా? ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా, నా మీద కోపంతో ఎటైనా వెళ్ళిపోయావేమో అనుకున్నాను, అతను బాగానే ఉన్నాడా ఏమంటున్నాడు, ” సోఫాలో కూర్చొని దీర్ఘంగా ఆలోచనలో మునిగిపోయిన ప్రియాంకను చూసి పక్కనే ఉన్న మరో సోఫాలో కూర్చుంటూ అడిగాడు. 


“ ఉష్ మెల్లెగా మధు నిద్రపోతున్నాడు పాపం దగ్గి దగ్గి బాగా ఇబ్బంది పడుతున్నాడు, డాక్టర్ ఏమన్నాడు అసలు ఏమైంది మధుకు మీరు నా దగ్గర ఏదో దాస్తున్నారు, నిజం చెప్పండి నాకెందుకో భయంగా ఉంది ఊపిరాడనట్టు దగ్గు వచ్చినప్పుడల్లా మెలికలు తిరిగిపోతున్నాడు, చూస్తూ తట్టుకోలేక పోతున్నాను ఏదైనా మంచి హాస్పిటల్ కు తీసుకవెళదాము, ” అడిగింది బాధపడుతూ. 


“ప్రియా.. నేను నీ దగ్గర ఏ నిజం దాచలేదు అన్నీ నీకు చెప్పాలనే వచ్చాను, నువ్వు కొంచెం మనసు దిటవుచేసుకుని వినాలి, మనకు చేతనైనా సహాయం చెయ్యడం తప్పా ఇంకేమి చెయ్యలేము, విన్న తరువాత నువ్వే అఘాయిత్యం చెయ్యనని నాకు మాటిస్తే గానీ చెప్పలేను, ” అన్నాడు తన వైపు చూస్తూ. 


“ఏం జరిగింది మీరేం చెప్పాలనుకుంటున్నారు మధు గురించేనా? ముందు విషయమేంటో చెప్పండి నాకు భయంగా ఉంది, ” ఆత్రుతగా అడిగింది. 


“అదే చెప్పబోతున్నాను ప్రియ.. నువ్వు ముందు నాకు మాటివ్వు, ఎట్టి పరిస్థితులలోను అతనికి తెలియకూడదు, ” చెయ్యి జాపాడు. 


అదురుతున్న గుండెలతో అతనిచేతిలో చెయ్యి వేసింది బేలగా చూస్తూ. 


=================================================================================

                                                       ఇంకా వుంది..


=================================================================================


లక్ష్మీ శర్మ త్రిగుళ్ళ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ లక్ష్మీ శర్మ త్రిగుళ్ళ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం


ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత్రి పరిచయం : లక్ష్మి శర్మ త్రిగుళ్ళ

నా గురించి కొన్ని విషయాలు ప్రస్తావిస్తాను, నేను సికింద్రాబాద్ లాలాపేటలో వుంటాను,

నాకు చిన్నప్పటి నుండి కథలు రాయడంమన్న చదవడంమన్న చాలా ఇష్టం, 1991 నుండి రాయడం మొదలుపెట్టాను, ఎక్కడ ఏ పేపర్ కనిపించినా రాసాను, కానీ ఎవరికి చూపలేదు చెప్పుకోలేదు, ఈమధ్యనే మా అమ్మాయిలు మావారు చూసి కథలు బాగున్నాయి కదా ఏదైనా పత్రికకు పంపమంటే పంపంస్తున్నాను, కర్నూలు గణేశ్ పత్రిక లో నేను రాసిన కవితలు కథలు చాలా వచ్చాయి.ఈ మధ్యలో నేను రాసిన కథలన్నీ ( మబ్బులు వీడిన ఆకాశం ) అనే కథల సంపుటి వచ్చింది, (కిన్నెర ఆర్ట్ పబ్లికేషన్స్) వారిచేత.


ఇంకా ముఖ్యంగా, (మన తెలుగు కథలు కామ్) యాజమాన్యం వారి ప్రోత్సాహం , నాకు ప్రశంసా పత్రాలు ఇవ్వడంతో నాలో ఇంకా ఉత్సాహం పెరిగింది.

 

మీకు చాలా కృతజ్ఞతలు తెలుపుతూ,

లక్ష్మి శర్మ

లాలాపేట సికింద్రాబాద్

30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత్రి బిరుదు పొందారు. 




45 views0 comments

Comments


bottom of page