#LakshmiSarmaThrigulla, #లక్ష్మీశర్మత్రిగుళ్ళ, #VidhiAdinaVinthaNatakam, #విధిఆడినవింతనాటకం, #TeluguSerials, #TeluguLoveStories, #తెలుగుప్రేమకథలు
Vidhi Adina Vintha Natakam - Part 14 - New Telugu Web Series Written By Lakshmi Sarma Thrigulla Published In manatelugukathalu.com On 17/11/2024
విధి ఆడిన వింత నాటకం - పార్ట్ 14 - తెలుగు ధారావాహిక
రచన: లక్ష్మీ శర్మ త్రిగుళ్ళ
(ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత)
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
జరిగిన కథ:
కొత్తగా పెళ్ళైన ప్రియాంక దగ్గరకు తన మాజీ ప్రేమికుడు మధు వస్తాడు. డిస్టర్బ్ అవుతుంది ప్రియాంక. అతనితో తన పరిచయం గుర్తు చేసుకుంటుంది. గతంలో ఉద్యోగం కోసం మధుని తన తండ్రి దగ్గరకు తీసుకొని వెళ్తుంది ప్రియాంక.
మధు, ప్రియాంకల మీద నిఘా పెడతాడు. వాళ్లిద్దరూ ప్రేమించుకుంటున్నట్లు గ్రహిస్తాడు. మధు తన డబ్బుతో పారిపోయినట్లు చెబుతాడు దామోదరం. తాను మధును ప్రేమిస్తున్న విషయం బయటపెడుతుంది ప్రియాంక.
గుండెపోటు వచ్చినట్లు నటిస్తాడు దామోదరం. హాస్పిటల్ లో చేరి, మధుని మరిచి పొమ్మని కూతురికి చెబుతాడు. కొద్ది రోజులకు తండ్రి ప్రోద్బలంతో రామకృష్ణను పెళ్లి చేసుకుంటుంది. అతని ఆప్యాయత చూసి అతనికి దగ్గర కావాలనుకుంటుంది. ఇంతలో మధు తనని కలవడంతో భర్తకు దగ్గర కాలేక పోతుంది.
గుడి దగ్గర మధు, ప్రియాంకలు మాట్లాడుకునే అవకాశం కల్పిస్తాడు రామకృష్ణ. తన తండ్రి చేసిన మోసం తెలుసుకుంటుంది ప్రియాంక. మధు అనారోగ్యంగా ఉండటానికి కారణం ఏమిటని భర్తను అడుగుతుంది ప్రియాంక.
ఇక 'విధి ఆడిన వింత నాటకం' ధారావాహిక పార్ట్ 14 చదవండి.
“ప్రియాంక .. నువ్వు అతను వచ్చాడని చెప్పాక నేను చాలా సార్లనుకున్నాను అతన్ని కలవాలని. అసలు అతని నిన్నెందుకు మోసంచేసాడో.. అందువలన అతనికి వచ్చిన లాభమేంటి.. ఒకవేళ నిన్ను పెళ్ళి చేసుకుంటే ఇంత ఆస్తికి వారసుడయ్యేవాడు కదా.. అసలు ఏం జరిగిందో కనుక్కోవాలని అతనికోసం వెదికాను. అతను నన్ను చూసి కూడా తప్పించుకుని చాటుమాటుగా నీ దగ్గరకు వస్తూపోతున్నాడని తెలుసుకున్నాను. అతను వచ్చి నిన్ను నాకు దూరంచేసాడన్న కోపం ఒకవైపు, అతన్ని నిన్ను వీడదీసి మీ ప్రేమతో ఆడుకున్నారు అన్న జాలి ఒకవైపు..
ఎలాగైనా అతన్ని పట్టుకోవాలన్న పట్టుదల ఎక్కవైంది నాలో. నాలుగురోజుల క్రితం నేను వెళ్ళిపోయాననుకుని నీ దగ్గరకు వస్తున్నాడు. ఎలాగైనా ఈ రోజు ఏదో ఒకటి తేల్చుకోవాలని నేను ఆఫీసుకు వెళ్ళినట్టే వెళ్ళి అవతలి కూడలిలో కారులో కూర్చొని ఉన్నాను. అప్పుడు చూసాను అతన్ని.. ఎన్నో రోజులుగా
అస్వస్థతగా ఉన్నట్టనిపించింది. ఒంట్లో ఓపికలేకున్నా నడవడానికి నీరసం అనిపిస్తున్నా బలవంతంగా కాళ్ళీడ్చుకుంటూ వస్తున్నాడు. నేను చకచకా వెనకగా వెళ్ళి పట్టుకున్నాను
తూలి కిందపడబోయాడు,
“ఏయ్! నీకేం కావాలి? ఎందుకు మా ఇంటికి వస్తున్నావు”
అతనెవరో తెలియనట్టే అడిగాను.
పేలవంగా నవ్వుతూ నా వైపు చూస్తూ. “నాక్కావలసినది, ముఖ్యమైనది పోయింది. ఇక్కడ దోరుకుతుందేమోనని వస్తున్నాను, ” అన్నాడతను.
“అంటే నువ్వు పోగొట్టుకున్న చోట వెతుక్కోవాలిగానీ ఇక్కడ వెతకడమేంటి? నీకేమైనా పిచ్చా, ” అన్నాను నేను.
“అవును పిచ్చి. ప్రేమ పిచ్చి. మాములుగా కాదు, పీకలదాకా మునిగిపోయిన పిచ్చి. నువ్వన్నావు కదా పోగొట్టుకున్నచోట వెతుక్కోవాలని.. నా ప్రేమ ఇక్కడ దాగిపోయింది. ఇప్పుడు వేరొకరి సొత్తయింది. అయినా తనను చూస్తూ నా ప్రాణం ఇలాగే పోవాలని వస్తున్నాను, ” అన్నాడు పకపకానవ్వుతూ.
“చూడు.. నువ్వెవరో నాకు తెలుసు.. నువ్వు వెతుకుతున్నది ఎవరికోసమో కూడా
తెలుసు. కానీ పెళ్ళి చేసుకుని పరాయి మనిషికి భార్యని తెలిసి కూడా నువ్వు ఇలా చెయ్యడం ఏం బాగుంది చెప్పు? ఆమె నిన్ను మరిచిపోయి హాయిగా నాతో కాపురం చేస్తున్నది. అనవసరంగా నువ్వు మా మధ్యలో దూరి కలతలు రేపకు, అసలే వాళ్ళ నాన్న డబ్బు మనిషి. నువ్వు వచ్చావని తెలిస్తే.. ”
చివ్వున తలెత్తి చూసాడు. కళ్ళు నిప్పులు చెరుగుతున్నట్టున్నాయి. కోపంతో ముక్కుపుటాలు అదురుతుండగా. “రమ్మను వాణ్ణి! ఇప్పుడే వాడి గొంతు పిసికి
చంపి కాకులకు గద్దలకు పారేస్తాను. నాకు వాడు చేసిన అన్యాయం వాడి నోటితోనే చెప్పిస్తా. దమ్ముంటే పిలుచుకురా, ”ఆవేశంతో రొప్పుతూ అంటూనే కిందపడిపోయాడు.
నేను వెంటనే అతన్ని హాస్పిటల్‌కు తీసుకవెళ్ళాను. అతని బాధ నాకర్ధమౌతుంది. ఇదంతా కావాలని చేసారనేది మాత్రం నిజం అనుకున్నాను. డాక్టర్లు అన్ని పరీక్షలు చేసి అతనికి రెండు కిడ్నిలు పాడైపోయాయి, అదొక్కటే కాదు, ఇంకా అతని శరీరంలో ఎముకలు తినే వ్యాధితో బాధపడుతున్నాడు, ఇంకా ఇతను ఎక్కువ కాలం బతకలేడని చెప్పారు డాక్టర్లు.
ఇతను మానసికంగా కూడా దేనికోసమో ఆలోచిస్తున్నాడు, సాధ్యమైనంతవరకు అదేంటో తెలుసుకుని ఇతని ప్రాణం పోయే వరకైనా సంతోషంగా ఉండేలా చూడండి అని చెప్పాడు,
ఆ సమయంలో నేను పడిన బాధ ఎవరికి తెలియదు, నీకు ఇతని విషయం చెబితే ఎలా తట్టుకుంటావో తెలియదు, సరే ఏదయితే అదవుతుంది ముందు అతన్ని మనింటికి తీసుకొచ్చే ప్రయత్నం చేసాను, కానీ ఇంతలోనే నువ్వు గుడికి వెళదామన్నావు. మన శ్రీహరిని పంపి మధును గుడికి తీసుకరమ్మన్నాను తరువాత జరిగింది నీకు తెలుసు, ”
చెప్పడం ఆపి భార్యవైపు చూసాడు తను ఏమన్న హడావుడి చేస్తుందేమోనని.
“లేదు. అలా జరగడానికి వీలులేదు. ఎంత డబ్బు ఖర్చయినా పరవాలేదు, మనం మధును మంచి హాస్పిటల్‌కు తీసుకవెళదాము, తనకేం కాకూడదు. నావల్ల అతని నూరేళ్ళ జీవితం పాడైపోయింది. కనీసం అతను ప్రాణాలతోటి ఉన్నా చాలు. మీరు నాకిదొక సహాయం చెయ్యండి. మీకు జన్మంతా ఋణపడి ఉంటాను, ” ప్రాధేయపడుతూ చేతులు జోడించి అడిగింది భర్తను.
“అయ్యో ప్రియా .. నువ్వు నాకు చెప్పాలా చెప్పు? సాటి మనిషి చేతగాని స్థితిలో ఉంటేనే ఆదుకునే వాణ్ణి, అలాంటిది నీకు ప్రాణసమానమైన మధును చూస్తూ ఊరుకుంటానని ఎలా అనుకున్నావు? అతనికి పెద్ద హాస్పిటల్ డాక్టరుతోనే చికిత్స నడుస్తున్నది. అందుకే గదా మనింట్లో అట్టే పెట్టుకున్నది.. వదిలేస్తే గాలికి ఎక్కడో తిరుగుతాడని ఎవరు దిక్కులేనట్టుగా ఎందుకని చెప్పి నీ కోసం మనింటికి తీసుకవచ్చాను. రెండురోజులకొకసారి హాస్పిటల్‌కు తీసుకవెళ్ళాలి, క్రమం తప్పకుండా మందులు పండ్లరసాలు ఇస్తూ ఉండు. మన ప్రయత్నం మనం చేద్దాం ఆపై భగవంతుడి దయ, ” ప్రియాంకను ఊరడిస్తూ ఆప్యాయత నిండిన మనసుతో చెప్పాడు.
“చాలా సంతోషం. మిమ్మల్ని నేను అర్థం చేసుకోలేకపోయినా నన్ను మీరు మంచి మనసుతో అర్థం చేసుకున్నారు. మీకెలా కృతజ్ఞతలు తెలుపుకోవాలో నాకు తెలియడంలేదు, తనను నేను కంటికి రెప్పలా కాపాడుకుంటాను, ” అంది.
“ఏమిటి మీరేదో మాట్లాడుతున్నారు నా గురించేనా? డాక్టర్ ఏమన్నాడు, ఎందుకు మీరు నా గురించి అనవసరమైన ప్రయాసపడుతున్నారు, నేను ఎప్పుడు ఏకాకినే ఒంటరిగా పోవలసినవాడినే నన్ను వెళ్ళనియ్యండి, ” ఎప్పుడు లేచి వచ్చాడో వీళ్ళు మాట్లాడుకున్నది విని అన్నాడు మధు.
ఆశ్చర్యంతో ఒక్కసారిగా మధువైపు తిరిగారు ఇద్దరు.
“మధు! అప్పుడే లేచావా ? మేము మాట్లాడుకున్నది అంతా విన్నావా, సరే మరింకేం.. బయటకు వెళ్ళిపోతానంటున్నావు. నీకు మంచి హాస్పిటల్ లో చికిత్స చేయిస్తున్నాము. నీకు తొందరలోనే నయమౌతుంది. నువ్వు మళ్ళి మాములు మనిషి అవుతావు. నీకు నయమయ్యేవరకు నిన్నెక్కడికి పంపించేది లేదు. అంతే కదూ ప్రియ, ” అడిగాడు.
“అవును మధు .. ఇన్నాళ్ళు నువ్వు నీ ఆరోగ్యం గురించి పట్టించుకోక ఇంత దూరం తెచ్చుకున్నావు, మా దగ్గరకు వచ్చావు కాబట్టి సరిపోయింది లేకుంటే ఏమయ్యేది, నిన్ను నేను కాపాడుకుంటాను. నీకోసం కాకపోయినా నాకోసమైనా నువ్వు ఆరోగ్యంగా ఉండాలి, ” అంది ఆవేదనగా.
“అహా, ఎంతబాగా చెప్పావు ప్రియాంక, నేను నీకోసం బాగుండాలి. ఎందుకు? నువ్వు నీ ప్రేమను మరిచిపోయి సుఖసంతోషాలతో ఉంటే నిన్ను చూస్తూ బాధపడుతూ ఉండడానికా? లేకపోతే ఒక అనామకుడికి ప్రేమించే అర్హతలేదని, చావు కూడా నువ్వు చెప్పినట్టే చావాలనుకున్నావా, ” కోపంగా చూస్తూ ప్రియాంకవైపు చూస్తూ అడిగాడు.
“మధు .. నువ్వలా అంటుంటే నా హృదయం రంపపుకోతకు గురి అవుతుంది, ఇందులో నేను చేసినా తప్పేమిలేదు, మా నాన్న మన ప్రేమను ఓడించాలనుకున్నాడు, మన ప్రేమ గట్టిది కనుక నువ్వు ప్రాణాలతో బయటపడినావు, ఇప్పుడు నువ్వు నా దగ్గరనే ఉన్నావు. ఇక మనల్ని ఎవరు వేరు చెయ్యలేరు. ఆ విధి కూడా మన దగ్గరకు రావడానికి బయపడుతుంది. ముందు నీ ఆరోగ్యం కుదుటపడని, తరువాత ఏం చెయ్యాలో ఆలోచిద్దాము, ” అంటూ మధును కుర్చీలో కూర్చోబెడుతూ అతని జుట్టులోకి వేళ్ళు పోనిచ్చి
తలనిమురుతూ ఓదార్పు మాటలు చెప్పింది ప్రియాంక.
“ఇదిగో మధు.. నేను చెబుతున్నాను. జరిగిందేదో మంచికో చెడుకో జరిగిపోయింది, ముందు నీ ఆరోగ్యం కుదటపడని, నువ్వు కోరుకున్న నీ ప్రేయసి నీకు దక్కుతుంది, నువ్వింకేమి ఆలోచించకు. నామాట నమ్ము, ” అంటూ చేతిలో చెయ్యవేసాడు.
ఆశ్చర్యంగా రామకృష్ణ వైపు చూస్తూ. “ ఏంటి నువ్వు చెప్పేది ప్రియాంకను నువ్వు నాకు అప్పగిస్తావా? అంటే నీ ఉద్దేశంలో నేను పిచ్చివాడిలా కనిపిస్తున్నానా, పెళ్ళిచేసుకుని ఆమెతో కాపురం చేస్తూ ఈ మాటనడానికి నీకు నోరెలా వచ్చింది?
ఇదిగో, నేను ఎలాగు నా ప్రేమలో ఓడిపోయాను. కనీసం తనైనా సుఖపడాలని కోరుకుంటున్నవాడిని. తనను బాధపెట్టాలని చూసావో నీ అంతుతేలుస్తాను. ఏమనుకుంటున్నావో, ఆ.., ” ఆవేశం పొంగుకొచ్చి గట్టిగా అరవడంతో ఆయాసంతో దగ్గు తెర అడ్డుపడి మంచం మీద కూలబడిపోయాడు.
“మధు.. మధు ఇలా చూడు, ” అంటూ అతని చాతిమీద చేతితో రాస్తూ. “ఏమండి.. మధును హాస్పిటల్‌కు తీసుకవెళదాము, ఇలా మాటికి ఆయాసం దగ్గు వచ్చి విలవిలలాడుతున్నాడు. హాస్పిటల్ లో అయితే డాక్టర్లు ఉంటారు. వెంటనే ఏదో ఒకటి చేస్తుంటారు. ఇంట్లో ఉంటే క్షణక్షణానికి భయపడాలి. పదండి వెళదాము, ” అంది.
“సరే పద వెళదాము.. నర్సింగ్ ఇలా రా ఒకసారి, ” వాచ్ మెన్ ను పిలిచాడు.
రామకృష్ణ నర్సింగ్ కలిసి మధు భుజాలకింద చేతులువేసి నడిపించుకుంటూ కార్లో వెనక సీటులో ఎక్కించారు. ఆపాటికే ప్రియాంక వెనక సీటులో కూర్చొని మధును తలను తన తోడమీద పడుకోబెట్టుకుంది. చంటిపాపాయిలా కళ్ళుమూసుకుని పడుకున్న మధును చూస్తుంటే గుండె తరుక్కుపోతుంది ప్రియాంకకు.
“హల్లో రామకృష్ణ.. ఏంటి ఇలా వచ్చారు ? ఎవరన్నా తెలిసిన వాళ్ళున్నారా ఇక్కడ,” రామకృష్ణను చూసి నవ్వుకుంటూ దగ్గరకు వస్తూ అడిగాడు డాక్టర్ ప్రభాకర్.
“హలో ప్రభాకర్ .. అదే ఆ రోజు తీసుకవచ్చాను కదా మధు అని ఒక పేషెంటుని,
అతనికి బాగాలేదు ఇంట్లో ఉంటే ఆయాసం దగ్గుతో విలవిలలాడిపోతున్నాడు, అందుకని ఇక్కడే హాస్పిటల్ ఉంచి చికిత్స చేస్తే మంచిదని తీసుకవచ్చాను, ” చెప్పాడు.
“అదేంటి.. అతనెవరో తెలిసినవాడు అన్నావు? ఇప్పుడేమో నీకు బాగా కావలసిన వాడు అన్న బాధ్యతతో చెబుతున్నావు ఇంతకు ఎవరతను, ” మధును పరీక్ష చేస్తూ అడిగాడు.
“అవును. అతను నా భార్యకు చాలా దగ్గరివాడు, అతనికేమన్న అయితే తను తట్టుకోలేదు. తన బలవంతం మీదనే ఇక్కడకు తీసుకవచ్చాను, డబ్బుకోసం ఆలోచించకు, ఎంత ఖర్చయినా పరవాలేదు. అతను ఇక్కడే ఉండని, ” చెప్పాడు రామకృష్ణ.
“ఓహో అలాగా .. ఆమెకేంటిరా డబ్బులో పుట్టి డబ్బులో పెరిగింది, కోట్ల ఆస్తికి వారసురాలు. డబ్బు గురించి ఆలోచిస్తారా వాళ్ళు.. సరే, నువ్వున్నట్టుగా అతన్ని ఇక్కడే ఉండనివ్వు. రోజులు కావచ్చు. నేను చూసుకుంటానులే. కాకపోతే నువ్వు మధ్య మధ్యలో వచ్చి చూస్తుండు, ” అన్నాడు డాక్టర్ ప్రభాకర్, మొత్తం నామీదనే పడేయ్యకు అన్నధోరణిలో.
“ థాంక్స్ ప్రభాకర్ .. నాకు వీలు దొరికినప్పుడల్లా రోజు వచ్చి చూసిపోతాను, ” అన్నాడు.
“ఏమన్నాడు డాక్టర్.. అడ్మిట్ చేసుకున్నారా? ఎలా ఉంది మధుకు, ” రామకృష్ణ బయటకు రాగానే ఆత్రుతగా అడిగింది.
“ఇప్పుడు బాగానే ఉన్నాడు గ్లూకోజ్ పెట్టారు, స్పెషల్ వార్డులో ఉంచి చికిత్స చేస్తాను,తను చూసుకుంటానని చెప్పాడు, మనం మధ్య మధ్యలో వచ్చి చూసి వెళదాము. తనకు బాగయ్యాక ఇంటికి తీసుకవెళదాము, ” ప్రియాంక వైపు చూస్తూ నిజం చెప్పలేక అటువైపు తిరిగి చెప్పాడు.
“లేదండి. నేను ఇక్కడే ఉండి మధును చూసుకుంటాను. తను ఇబ్బంది పడుతుంటే ఎవరు పట్టించుకుంటారో లేదో, నేను దగ్గరుండి చూసుకుంటాను. వారం రోజుల్లో మాములు మనిషైపోతాడు, మీరు వెళ్లండి ఇంటికి. ఆ ..మా నాన్న అడిగితే ఏమి చెప్పకండి, ” అంది.
“అదేంటి ప్రియా .. నువ్వుండడమేంటి? ఎవరైనా చూస్తే బాగోదు, ఆయనెవరు.. నీకేమౌతారు.. నువ్వెందుకుంటున్నావని అందరికి అనుమానం వస్తుంది. ముఖ్యంగా నా స్నేహితుడు ఆ ప్రభాకరానికే వస్తుంది. డబ్బులు పెట్టి ఒక నర్సును మాట్లాడమని చెబుతాను. అయినా నేను ప్రభాకరానికి చెప్పాను. వాడు బాగా చూసుకుంటాడు. పద మనం వెళదాం, ” అన్నాడు.
“చూడండి.. ఎవరికోసమో నేను భయపడవలసిన అవసరంలేదు. అతని ఊపిరి ఆగిపోయ్యేవరకు చూసుకునే బాధ్యత నాది. ఒంటరివాడినన్న ఆలోచన అతనికి రానివ్వను, నావల్ల అన్ని కోల్పోయిన మధుకు కనీసం జీవితచరమాంకంలోనైనా నన్ను తోడుగా ఉండనివ్వండి, దయచేసి నన్నర్ధం చేసుకోండి నా మనసుకు ఈ తృప్తినన్న మిగిలించండి, ”
ప్రాధేయపడుతూ అడిగింది.
ఏం చెప్పాలో తెలియక తికమకపడ్డాడు రామకృష్ణ. మధును వదిలిపెట్టి ప్రియాంక రాదని అర్థమైంది. తను ఇక్కడ హాస్పిటల్ లో ఉంటే మధును చూస్తూ తట్టుకోగలదా. ఏమి చెప్పినా తను వినదు పోని ఆ నర్సును ఇంటికే పిలిపించుకుంటే సరిపోయేదేమో.
“అదికాదు ప్రియ .. కష్టమంటే ఏంటో తెలియని నువ్వు ఇలా ఒంటరిగా హాస్పిటల్‌లో ఉండడమంటే కొంచెం కష్టమేమో, పోని ఒకపని చేద్దామా మధుకు మనింటివద్దనే చికిత్స చేయిద్దాము, ఒక నర్సును మనింట్లోనే పెట్టి చూసుకునేట్టు చేద్దాం ఏమంటావు, ” ఒప్పుకుంటుందన్న నమ్మకంతో అడిగాడు.
“వద్దు. ఇక్కడైతేనే అన్ని వసతులు సరిగా ఉంటాయి, చూడండి మీకు తెలుసు మధు పరిస్థితి ఏంటో.. అతను ఎంతో కాలం బతకడని మీరే చెప్పారు. ఉన్న నాలుగురోజులన్న నన్ను తనతో ఉండనీయ్యండి. తప్పో ఒప్పో మీతో నా పెళ్ళి జరిగిపోయింది. మధును ప్రేమించిన నేను చాలా రోజులుగా బాధపడుతూనే ఉన్నాను. తనను మరిచిపోలేక మీకు దగ్గరవ్వలేక ఇన్నాళ్లు నాలో నేను చాలా కుమిలిపోయాను.
పవిత్రమైన తాళి అగ్నిసాక్షిగా నా మెడలో కట్టారు. దానికి నేను కట్టుబడి ఉండవలసిన బాధ్యత నాది. నా మనసును మీ వైపు మరలడానికి చాలా కష్టపడ్డాను. చివరకు మీ భార్యగా నన్ను నేను మీకు సమర్పించుకునే సమయానికి మధు వచ్చాడు. నేను మొదట్లో తనను దూరంగానే పెట్టాను.
నన్ను కలవడానికి రాకూడదని నిక్కచ్చిగా చెప్పాను. మీరే తనను కలిసి నా మనసులో అతనికి చోటుందని తీసుకవచ్చారు. అతని ఆరోగ్యం గురించి చెప్పారు.
ఎలాగు అన్నిటిని కోల్పోయిన మనిషికి కనీసం ప్రియురాలిగానైనా సేవ చేసుకునే భాగ్యం కలిగిందని సంతోషపడుతున్నాను. తను కూడా చివరి క్షణంలో తృప్తిగా వెళ్ళిపోని.. నా కోరిక మన్నిస్తారు కదూ, ” కళ్ళనిండి కన్నీళ్లు జలజలారాలుతుండగా అడిగింది.
“ప్రియ.. నీకు ఎలా ఇష్టమైతే అలానే చెయ్యి నిన్ను నేను తప్పుపట్టడంలేదు, నువ్వెక్కడ హైరానాపడతావేమోనని నాకు నా భయం అంతే, నువ్వు పవిత్రమైన మనసుతో సేవ చేస్తానంటే అందుకు నేను కూడా సిద్ధం, నీకు తోడుగా నేను ఇక్కడే ఉంటాను నిన్ను చూసుకోవడం నా బాధ్యత, ” అన్నాడు.
“కానీ మీరిక్కడుంటే మన బిజినెస్ వ్యవహారాలు ఎవరు చూస్తారు, ఒకవేళ నాన్నకు ఈ విషయం తెలిస్తే చనిపోయాడనుకున్న మధును నిజంగానే చంపేస్తాడు, ఎంతకైనా తెగిస్తాడు. మీరు అనవసరంగా ఇబ్బందిపడకండి. నాకోసం మీరు మధు కోసం నేను అందరం కష్టపడుతున్నాము. నా మాట వినండి మీరు వెళ్ళిపొండి, ” అంది.
“పోని ఒకపని చేద్దాం నేను మధుకు తోడుగా ఉంటాను నువ్వు ఇంటికి వెళ్ళి రెస్టు తీసుకో, లేదంటే ఉదయమంతా నువ్వుండి చూసుకో రాత్రంతా నేనుంటాను సరేనా, ” అడిగాడు.
“చూడండి.. నన్ను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన మధుకు కోసం నన్ను తన చివరి శ్వాసవరకు తనతో ఉండనియ్యండి, ఇక మీరేమి చెప్పకండి. నేనేంటో నాకు తెలుసు, ” అంది.
“సరే మరి, నేను వెళతాను. నీకు ఎప్పుడు ఏ విషయంలో అవసరం వచ్చినా ఫోన్ చెయ్యడం మరిచిపోవద్దు, ” అంటూ వడివడిగా అడుగులువేసుకుంటూ వెళ్ళిపోయాడు.
=================================================================================
ఇంకా వుంది..
=================================================================================
లక్ష్మీ శర్మ త్రిగుళ్ళ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ లక్ష్మీ శర్మ త్రిగుళ్ళ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత్రి పరిచయం : లక్ష్మి శర్మ త్రిగుళ్ళ
నా గురించి కొన్ని విషయాలు ప్రస్తావిస్తాను, నేను సికింద్రాబాద్ లాలాపేటలో వుంటాను,
నాకు చిన్నప్పటి నుండి కథలు రాయడంమన్న చదవడంమన్న చాలా ఇష్టం, 1991 నుండి రాయడం మొదలుపెట్టాను, ఎక్కడ ఏ పేపర్ కనిపించినా రాసాను, కానీ ఎవరికి చూపలేదు చెప్పుకోలేదు, ఈమధ్యనే మా అమ్మాయిలు మావారు చూసి కథలు బాగున్నాయి కదా ఏదైనా పత్రికకు పంపమంటే పంపంస్తున్నాను, కర్నూలు గణేశ్ పత్రిక లో నేను రాసిన కవితలు కథలు చాలా వచ్చాయి.ఈ మధ్యలో నేను రాసిన కథలన్నీ ( మబ్బులు వీడిన ఆకాశం ) అనే కథల సంపుటి వచ్చింది, (కిన్నెర ఆర్ట్ పబ్లికేషన్స్) వారిచేత.
ఇంకా ముఖ్యంగా, (మన తెలుగు కథలు కామ్) యాజమాన్యం వారి ప్రోత్సాహం , నాకు ప్రశంసా పత్రాలు ఇవ్వడంతో నాలో ఇంకా ఉత్సాహం పెరిగింది.
మీకు చాలా కృతజ్ఞతలు తెలుపుతూ,
లక్ష్మి శర్మ
లాలాపేట సికింద్రాబాద్
30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత్రి బిరుదు పొందారు.
Comments