విధి వంచితుడు పరీక్షిత్తు
- Palla Deepika

- Mar 17, 2025
- 3 min read
#పరీక్షిత్తు, #Parikshitthu, #PallaDeepika, #పల్లాదీపిక, #TeluguStory, #తెలుగుకథ, #పురాణం, #ఆధ్యాత్మికం, #devotional

Vidhi Vanchithudu Parikshitthu - New Telugu Story Written By Palla Deepika
Published In manatelugukathalu.com On 17/03/2025
విధి వంచితుడు పరీక్షిత్తు - తెలుగు కథ
రచన: పల్లా దీపిక
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
కౌరవ పాండవుల మధ్య కురుక్షేత్ర యుద్ధం 18 రోజులపాటు భీకరంగా జరిగింది. యుద్ధంలో కౌరవుల వంశం అంతా నాశనం అయ్యింది. యుద్ధం చివరి రోజున అశ్వథ్థామ, తన తండ్రి ద్రోణుడి హత్యకు ప్రతీకారంగా పాండవుల వంశం ఉండకూడదని ఉపపాండవులందరిని చంపేశాడు.
పాండవుల వారసుడు ఎవరూ ఉండకూడదన్న ఆలోచనతో అశ్వథ్థామ, అభిమన్యుడి భార్య అయిన ఉత్తర గర్భం మీద బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తాడు. ఇది తెలిసిన శ్రీకృష్ణుడు అశ్వథ్థామకి నీకు మృత్యువు అనేది ఉండదు అంటూ శాపాన్ని ఇస్తాడు. అంతేకాదు చర్మ వ్యాధితో, శరీరమంతా దుర్వాసనతో బాధపడతావని శాపం పెట్టాడు.
ఉత్తర బాధతో తల్లడిల్లుతూ శ్రీకృష్ణుని దగ్గరకు వెళ్లి అశ్వథ్థామ ప్రయోగించిన బ్రహ్మాస్త్రం గర్భంలో ఉన్న శిశువుని దహించడం కోసం తనను వెంటాడుతున్నదని చెప్పింది. శ్రీకృష్ణుడు సుదర్శన చక్రాన్ని ప్రయోగించి బ్రహ్మాస్త్రాన్ని శాంతింపచేశాడు.
కొన్ని నెలల తర్వాత ఉత్తరకు పాండవ వారసుడైన బాలుడు జన్మించాడు. ధర్మరాజు పండితులను పిలిపించి జాతక కర్మాదులను నిర్వర్తించి, వారికి భూములను మరియు సువర్ణాభరణాలను, అశ్వాలను దానం చేసి వారిని తృప్తి పరిచాడు.
బ్రాహ్మణులు ధర్మరాజుతో “మహారాజా! భరతవంశం అంతరించిపోకుండా శ్రీకృష్ణుడే ఈ బిడ్డను బ్రతికించాడు” అని ఆ బిడ్డకు పరీక్షిత్తు అని పేరు పెట్టారు.
ధర్మరాజు పరీక్షిత్తుని కురుసామ్రాజ్యానికి పట్టాభిషిక్తున్ని చేస్తాడు. పరీక్షితుడు రాజు అయినందుకు ఏమాత్రం గర్వించలేదు. అది ఆయన బాధ్యతగా అనుకునేవారు. పరీక్షిత్తు మహారాజు ధర్మ పాలకుడుగా మంచి పేరును పొందారు. ఆయన ధర్మనిష్ఠుడు, న్యాయ పాలకుడు మరియు ప్రజాహితమైన పరిపాలకుడు. ధర్మాన్ని పాటిస్తూ రాజ్యాన్ని సంక్షేమంగా చూసుకునేవారు.
ఆయన పాలనలో కలియుగం మొదలైంది. కలియుగ ప్రవేశాన్ని అడ్డుకునేందుకు ఎన్నో ప్రయత్నాలు చేశారు. కానీ చివరకు రాజ్యంలో ప్రవేశించేందుకు కొన్ని చోట్ల అనుమతిని ఇవ్వాల్సి వచ్చింది. కలియుగ ప్రభావాన్ని తగ్గించేందుకు పరీక్షితుడు వివిధ యాగాలను నిర్వహించి, ధార్మిక జీవనాన్ని ప్రోత్సహించేవాడు.
ఒకరోజు పరీక్షిత్ మహారాజు వేటకు వెళ్లి దాహంతో అలిసిపోయి ఉన్న సమయంలో అక్కడే ఉన్న శమీక మహర్షి ఆశ్రమానికి చేరుకున్నాడు. ఆ సమయంలో శమీక మహర్షి ధ్యానంలో మునిగిపోయి ఉన్నారు. రాజు వచ్చాడు అన్న విషయాన్ని గమనించుకోలేదు. దానికి రాజుకు కోపం వచ్చింది. ఆకలి దప్పులతో ఉన్నవారికి కోపం సహజం. ఇక్కడ కలి తన ప్రభావం చూపించింది.
పరీక్షిత్తు కోపంతో ఆ ఋషి మెడలో ఒక మృత సర్పాన్ని వేసి వెళ్ళిపోయాడు. ఈ విషయం శమీక మహర్షి కుమారుడైన శృంగి అనే ఋషికి తెలియగానే కోపంతో పరీక్షిత్ మహారాజుకు "ఈరోజు నుంచి ఏడవ రోజు తక్షకుడు అనే మహానాగు నిన్ను కరిచి చంపుతాడు" అని శాపం పెడతాడు.
తరువాత శమీకునికి ఈ విషయం తెలిసి బాధపడతాడు. అనవసరంగా మహారాజును శపించావని శృంగిని మందలిస్తాడు. తన శిష్యుని పిలిచి పరీక్షిత్తుకు శాపం విషయం తెలపమని పంపుతాడు.
హస్తినాపురం చేరుకున్న పరీక్షిత్తు ఆందోళనకు గురయ్యాడు. తను చేసిన పొరపాటును గ్రహించాడు. ఇంతలో శమీకుని శిష్యుడు పరీక్షిత్ ని కలిసి శృంగి శాపాన్ని తెలిపి ఏడు రోజుల్లో తక్షకుని కాటుకు మరణిస్తావని చెప్పాడు. ఆ మాటలకు పరీక్షిత్తులో ఎలాంటి బాధ కలగలేదు. తను చేసిన తప్పుకు ఇది సరైన శిక్ష అని అనుకున్నాడు.
విషయం తెలిసిన తర్వాత అన్ని బంధాలనూ తెంచుకున్నాడు. తన కుమారుడు అయిన జయమేజయునికి రాజ్య భారాన్ని అప్పగిస్తాడు. ఆ తర్వాత మంత్రులను పిలిపిస్తాడు. ఒంటి స్తంభం మేడను నిర్మించి, అక్కడే ఉంటూ, తన దగ్గర పాము కాటుకు వైద్యం చేసే వైద్యులను ఉంచుకున్నాడు. తనని చూడడానికి వచ్చిన శుక మహర్షి ద్వారా ఏడు రోజులపాటు భాగవతాన్ని శ్రద్ధగా వింటాడు.
తక్షకుడు రాజును కాటు వేయడానికి నాగలోకం నుండి బయలుదేరాడు. దారిలో కశ్యపుడు అనే వ్యక్తిని చూశాడు. కశ్యపుడు ఎలాంటి విషానికైనా విరుగుడు ఇస్తాడు కాబట్టి తక్షకుడు కశ్యపునికి ధనరాశులు ఇచ్చి వెనక్కి పంపిస్తాడు. కొందరు సర్ప రాజులు మారువేషంలో రాజుకు పండ్లను తీసుకువెళ్లి ఇస్తారు. ఆ పండ్ల మీద క్రిమి రూపంలో ఉంటాడు తక్షకుడు.
ఋషి ఇచ్చిన శాపం ప్రకారం ఏడవ రోజు వచ్చింది. సూర్యస్తమయం కూడా అవ్వడంతో పరీక్షితుడు పండును తినాలి అని తీసుకుంటాడు. రాజు తీసుకున్న పండు మీదే క్రిమి రూపంలో ఉన్న తక్షకుడు మహాసర్పమై రాజును కరుస్తాడు. అలా కాటు వేయగా ఆయన తన భౌతిక దేహాన్ని కోల్పోయి మోక్షాన్ని పొందుతాడు.
***
పల్లా దీపిక గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం : పల్లా దీపిక
వయసు: 21
చదువు: బీటెక్, ఫైనల్ ఇయర్
హాబీ: చిత్రలేఖనం,కథా రచన, కవిత్వం
నివాసం: ప్రొద్దుటూరు కడప జిల్లా ఆంధ్ర ప్రదేశ్.




Comments