విదూషకుడు
- Malla Karunya Kumar
- Jul 30
- 5 min read
#MallaKarunyaKumar, #మళ్ళకారుణ్యకుమార్, #Vidushakudu, #విదూషకుడు, #TeluguInspirationalStories, #ప్రేరణాదాయకకథలు, #కొసమెరుపు

Vidushakudu - New Telugu Story Written By - Malla Karunya Kumar
Published In manatelugukathalu.com On 30/07/2025
విదూషకుడు - తెలుగు కథ
రచన: మళ్ళ కారుణ్య కుమార్
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
"ఇలాంటి స్థితిలో నువ్వు ఈ కేసు ను టేకప్ చేయడం మంచిది కాదేమో ఒకసారి ఆలోచించు. " ఎదురుగా కూర్చొని అసహనంగా ఉన్న వికాస్ వైపు చూస్తూ అన్నాడు దీక్షిత్.
"దీక్షిత్ నువ్వేనా ఈ మాట అంటున్నది. ఇలాంటి కేసులు నేను ఎన్ని టేకప్ చేయలేదు. " వికాస్ స్వరం లో దర్పం స్పష్టంగా ప్రతిధ్వనిస్తుంది.
"నిజమే వికాస్, నువ్వు ఉత్తమ హృద్రోగ నిపుణుడుగా అవార్డులు అందుకున్నావు. కానీ గత మూడు వారాలుగా నీ మానసిక స్థితి సరిగ్గా లేదు. స్టాఫ్ మీద అనవసరంగా కోపం చూపిస్తున్నావు. మొన్న ఓ పేషెంట్ ను కూడా సరిగ్గా డీల్ చేయలేక పోయావు. నాకు తెలిసి నీకు కొంత రెస్ట్ అవసరం అనిపిస్తుంది. " వికాస్ పరిస్థితి కి ఆందోళన చెందుతూ అన్నాడు దీక్షిత్.
"ఏంటి దీక్షిత్, నీ హాస్పిటల్ అభివృద్ధి అయ్యేసరికి నా కష్టం మరిచిపోయావా?. నీ కోసం నేను ఎన్ని ఆఫర్లు వదులుకొని ఈ హాస్పిటల్ లోనే వున్నాను. నువ్వు నాకు ఇచ్చే విలువ ఇదేనా?. ఇలాంటి చిన్న కారణాలకు నన్ను ఎత్తి చూపుతున్నావా?. " అసహనం తో అన్నాడు వికాస్
"కూల్ వికాస్, నీ శ్రమ నేను మరిచిపోలేదు. కానీ పేషెంట్ క్షేమం కూడా ముఖ్యమే కదా. నీ నుండి నేను ఇలాంటి ఔట్ పుట్ ఊహించలేదు. ఇవన్నీ పునరావృతం కాకూడదంటే నువ్వు నీ మనస్సు ని ప్రశాంతంగా ఉంచాలి. ప్రశాంతత కావాలంటే మళ్ళీ అమృత నీ దగ్గరకు రావాలి. "
"దీక్షిత్, ఎన్ని సార్లు చెప్పాలి ఆమె ప్రస్తావన నా దగ్గర తీసుకు రావద్దని. అయినా ఇది నా పర్సనల్. " కోపంతో అంటూ ముఖం పక్కకు తిప్పుకున్నాడు వికాస్.
"నీకు పర్సనల్ కావచ్చు. కానీ ఇది నాకు ఒక స్నేహితుడు, చెల్లెలు లా భావించిన అమృత సమస్య. దీనికి పరిష్కారం చూసే బాధ్యత నాది. ఎప్పటి నుండో నీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. నువ్వు నీ అహంకారంతో అందరినీ దూరం చేసుకుంటున్నావు. వికాస్! నీకు తెలియంది కాదు, ఎవరైనా సరే మర్యాద, గౌరవం కోరుకుంటారు. మనం హోదాలో ఉండి వాళ్లను చులకనగా చూస్తే వాళ్ళ మనకి దూరం కాక తప్పదు. అమృత విషయం లో కూడా ఇలానే జరిగింది. ఆమెను బాగా హర్ట్ చేసావు. ఒకసారి ఈ విషయం ఆలోచించు వికాస్. ఆమె దూరమైన దగ్గర నుండి నీలో ఈ కోపం పెరిగింది. "
దీక్షిత్ మాటలకు దీక్షిత్ వైపు కోపంతో చూసాడు. కానీ ఈసారి ఎదురు సమాధానం చెప్పకుండా మౌనం దాల్చాడు.
మౌనంగా వున్న వికాస్ వైపు చూస్తూ, "వికాస్ ముందుగా నీకు పుట్టిన రోజు శుభాకాంక్షలు, రేపే కదా నీ పుట్టిన రోజు. " నవ్వుతూ చెప్పాడు దీక్షిత్.
దీక్షిత్ మాటలకు ఆలోచనలో నుండి తేరుకుని,
"నేను ఆ విషయమే మరిచిపోయాను. థాంక్స్, " అంటూ మళ్ళీ మౌనం వహించాడు.
"వికాస్, ప్రతి పుట్టిన రోజుకు ఒక పేషెంట్ కు నువ్వు ఆర్థిక సహాయం చేసే వాడివి. ఈ పుట్టిన రోజుకు ఏమి చేయాలనుకుంటున్నావు?. ఈ పుట్టిన రోజు నీ జీవితంలో అద్భుతమైన పుట్టిన రోజవ్వాలి. ఆ విధంగా నువ్వు ప్లాన్ చేయి వికాస్. "
కాసేపు ఆగి, "దీక్షిత్, నేను బాగా ఆలోచించాను. ఒక హాస్యగాడు చేత ఒక ప్రోగ్రాం పెట్టాలని అనుకుంటున్నాను. అతను హాస్పిటల్ జనరల్ వర్డ్ లో ఉన్న పేషెంట్ లను తన నటన తో అలరిస్తాడు. నేను జనరల్ వార్డ్ కు వెళ్ళిన ప్రతిసారి వాళ్ళను చూస్తుంటాను. వాళ్ళు చాలా దిగులుగా వుంటారు. ఈ ప్రోగ్రాం తో వాళ్ళు కొంత సమయమైనా వాళ్ల బాధల్ని మరిచిపోగలరు. "
"చాలా మంచి నిర్ణయం డాక్టర్ వికాస్. హాస్యగాడు ప్రదర్శన తో ఇక్కడ నవ్వులు వికసిస్తాయి!. "
"సరే, దీక్షిత్ నేను వెళ్తున్నాను. " అని చెప్పి అక్కడ నుండి వెళ్లిపోయాడు వికాస్.
***
"హల్లో వికాస్ గుడ్ మార్నింగ్, జన్మ దిన శుభాకాంక్షలు.
ప్రోగ్రామని చెప్పావు కదా ఆ వ్యక్తి ఎంత సమయంకు వస్తాడు. " కుతూహలం తో అడిగాడు దీక్షిత్.
"ఉదయం పది గంటలకు అక్కడ వుంటాడు. అయితే హాస్పిటల్ లో వున్న వారికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకో. " జాగ్రత్తలు చెప్పాడు వికాస్.
"దాని గురించి నువ్వేమీ ఆలోచించాల్సిన అవసరం లేదు. అవన్నీ నేను చూసుకుంటాను. ఏమిటో నువ్వు ఆ విషయం చెప్పిన దగ్గర నుండి నా మనసు అతని ప్రదర్శన చూడాలని ఉత్సాహంతో వుంది. " నవ్వుతూ అన్నాడు దీక్షిత్.
"తప్పకుండా ఈ ప్రోగ్రాం మీ అందరినీ అలరిస్తుంది. " నమ్మకం తో చెప్పి ఫోన్ పెట్టేసాడు వికాస్.
*****
"ఇంకా పది అవ్వడానికి ఐదు నిముషాలు వుంది. " తన మొబైల్ లో టైం చూసి, గేటు వైపుకు చూస్తూ అటూఇటూ పచార్లు కొడుతున్నాడు దీక్షిత్. ఇంతలో ఒక కారు వచ్చి అక్కడ ఆగింది. ఆశ్చర్యంతో దాని వైపు చూసాడు దీక్షిత్. ఇంతలో కారు డోర్ తెరుచుకుంది. రంగు రంగుల ముఖానికి పూసుకొని, వేషం ధరించిన ఒక వ్యక్తి అందులో నుండి దిగాడు.
అతన్ని చూడగానే చిరునవ్వులు చిందిస్తూ వేగంగా అతని దగ్గరకు చేరుకున్నాడు దీక్షిత్, ఎగాదిగా చూసి,
"నమస్తే నా పేరు దీక్షిత్. వికాస్ ఫ్రెండ్ ను. మీరు వస్తారని చెప్పాడు. సమయానికి వచ్చారు. నాతో పాటు రండి. " ఆహ్వానిస్తూ అతన్ని తనతో పాటు తీసుకువెళ్లాడు.
తన రూం కు చేరుకున్నాడు,
దీక్షిత్ వైపు అతను చూస్తూ, "నేను నా పని త్వరగా ముగించుకొని వెళ్లిపోవాలి. లేకుంటే ఇక్కడ పేషెంట్ కు ఇబ్బంది కలుగుతుంది. " అన్నాడు ఆ వ్యక్తి తొందర పడుతూ,
"సరే, నాతో పాటు రండి మీకు జనరల్ వర్డ్ కు తీసుకు వెళ్తాను. " అంటూ ఆ వ్యక్తిని జనరల్ వర్డ్ కు తీసుకు వెళ్ళాడు.
"మీ అందరికీ ఒక విషయం చెప్పాలి. ఈ రోజు మిమ్మల్ని అలరించడానికి ఒక వ్యక్తి వచ్చారు. ఇదిగో ఇతనే, తన ప్రతిభతో మిమ్మల్ని కాసేపు నవ్విస్తాడు. " అని అంటూ చప్పట్లు కొట్టాడు దీక్షిత్ అక్కడకు చేరుకొని అక్కడ వున్న వాళ్లకు వివరిస్తూ.
దీక్షిత్ మాటలకు ఆశ్చర్యంగా దీక్షిత్ వైపు, అలాగే ఆ వేషం వేసుకున్న వ్యక్తి వైపు చూస్తూ నీరసంగా చప్పట్లు కొడుతున్నారు బెడ్ మీద వున్న పేషంట్స్.
"అందరికీ నమస్కారం, రాజుల కాలం లో నా లాంటి వారిని విదూషకుడు అనేవారు, ఈ కాలంలో హాస్యగాడు అంటున్నారు, ఇంగ్లీష్ భాషలో క్లౌన్ అని పిలుస్తారు. నా వృత్తి మిమ్మల్ని అలరించడం. " అని అంటూ వివిధ భంగిమల్లో తన ముఖాన్ని పెట్టి హాస్యాన్ని తెప్పించే ప్రయత్నం చేస్తున్నాడు. వివిధ రకాలుగా తన ప్రతిభను ప్రదర్శిస్తూ అందరినీ అలరిస్తున్నాడు.
అప్పటి వరకు విచారంగా వున్న వాళ్ల మోముల్లో నవ్వులు వెలుగులు విరబూస్తున్నాయి. విదూషకుడు ప్రదర్శన గురించి తెలుసుకున్న హాస్పిటల్ లో ఉన్నా మిగతా వారు కూడా అక్కడకు చేరుకొని ఆ ప్రదర్శన కళ్ళు అప్పగించుకుంటూ చూస్తున్నారు.
అప్పటికే చాలా సమయం వరకు తన నైపుణ్యం తో అందరికీ నవ్వును పంచాడు. రాను రాను జనాలు తాకిడి ఎక్కువ అవ్వడం తో తన ప్రదర్శన నిలిపివేయాలనుకున్నాడు. చివరిగా అందరికీ అభివాదం తెలుపుతూ తన ప్రదర్శన ఆపివేశాడు.
అందరూ తమ కరతాళ ధ్వనులతో తమ సంతృప్తిని తెలియజేశారు. వాళ్ల కళ్ళలో ఆనందం స్పష్టంగా కనిపిస్తుంది.
తనకు తన చిన్నప్పటి సంఘటనలు గుర్తుకు వస్తున్నాయి. అక్కడే కూర్చుండి పోయాడు. జ్ఞాపకాలు మెల్లమెల్లగా తన మదిలో కదలాడుతున్నాయి.
"ఏమైంది వికాస్, ఎందుకు ఇలా డల్ గా వున్నావు?. ఏదో స్కిట్ వుందని చెప్పావు?. " గోముగా అడిగింది తల్లి లక్ష్మి.
"వుంది అమ్మ కానీ నాకు నచ్చిన పాత్ర రాలేదు. రాజు పాత్ర వస్తుంది అనుకున్నాను. కానీ మాస్టారు స్లిప్స్ వేశారు. నేను తీసిన స్లీప్ లో విదూషకుడు అని వచ్చింది. అంటే జోకర్ అమ్మ. ఆ పాత్ర చేయడం నాకు ఇష్టం లేదు. " అసహనంగా పలికాడు వికాస్.
"పాత్ర ఏదైతే ఏముంది. దాన్ని మనం రంజింప జేసే విధంగా మలచుకోవాలి. విదూషకుడు అంటే మామూలు వ్యక్తి అనుకుంటున్నావా అందరినీ నవ్వించే వ్యక్తి. నవ్వు తెప్పించడం అంత సులువైన పని కాదు. నువ్వు ఆ పాత్ర చేయి. మనసు పెట్టి చేయి. నీ పాత్రకే మంచి పేరు వస్తుంది. " వికాస్ తో చెప్పింది లక్ష్మి.
తల్లి చెప్పిన విధంగా వికాస్ ఆ పాత్రలో ఒదిగి పోయాడు. ఆ రోజు అందరి మాటల్లో ఆ పాత్ర గురించి చర్చ నడుస్తోంది. ఆ మాటలు వికాస్ కు ఎంతో ప్రేరణగా నిలిచాయి.
ఆ సంఘటన గుర్తుకు వచ్చి వికాస్ కళ్ళ వెంబడి నీళ్లు ధరగా వస్తున్నాయి.
"అమ్మ, ఆ రోజు నువ్వు నాకు ఆ పాత్ర గురించి చెప్పి ఆ పాత్ర ద్వారా పేరు వచ్చేలా చేశావు. ఈ రోజు ఆ పాత్ర ద్వారా నేను నలుగురిలో సంతోషం కలిగించి నాలో అహాన్ని విడిచి పెట్టాలి దృఢంగా సంకల్పించుకున్నాను. నేను ఇందులో గెలిచానని అనుకుంటున్నాను. ఇక ముందు కూడా నన్ను సరైన మార్గంలో నడిచేలా చేయి. ఈ ప్రదర్శన నీకు అంకితం ఇస్తున్నాను. నా పుట్టిన రోజున నీ ఆశీర్వాదం ఇవ్వు అమ్మ. " కన్నీటి తో తల్లికి వందనం సమర్పించాడు.
అందరూ వికాస్ వైపు చూస్తున్నారు. వికాస్ ఏడవడం చూసి పరిగెత్తుకుంటూ వచ్చి "ఏమైంది మీకు. " అని కంగారుగా అడిగాడు దీక్షిత్.
"నాకేమీ కాలేదు. నువ్వేమీ కంగారు పడాల్సిన పని లేదు దీక్షిత్. "
ఆశ్చర్యంతో వికాస్ వైపు చూస్తూ అలా వుండి పోయాడు దీక్షిత్, కాసేపటి తర్వాత, “వికాస్ నువ్వేనా ఈ వేషంలో వచ్చింది. ఎంత మాయా చేసావు. ఈ వేషంలో నిన్ను గుర్తు పట్టలేక పోయాను. అప్పుడు గొంతు మార్చి మాట్లాడవు కదా. ఇప్పుడు దొరికి పోయావు. " నవ్వుతూ వికాస్ ను ఒక్కసారిగా కౌగలించుకున్నాడు దీక్షిత్.
“దీక్షిత్, నువ్వు చెప్పిన విషయం గురించి ఆలోచించాను. అందుకే నాలోన ఉన్న అహాన్ని భస్మం చేసేందుకు. నాకు ఇష్టమైన పాత్ర నా పుట్టిన రోజున వేసాను. పైన వున్న అమ్మ కూడా నా ప్రదర్శన చూసి ఆనందించి వుంటుంది. ” గద్గద స్వరంతో అన్నాడు వికాస్.
“అవును వికాస్, అమ్మగారు తప్పకుండా ఆశీర్వదించారు. అదుగో అమృత కూడా ఇక్కడకు వచ్చింది. బహుశా నీతో మాట్లాడడానికి ఏమో. ” ఆమెను చూపిస్తూ అన్నాడు దీక్షిత్.
“తాను ఇక్కడకు వచ్చిందా. ” ఒక్కసారిగా ఆశ్చర్యపోతూ, దీక్షిత్ చూపించిన వైపుకు చూసాడు వికాస్. ఆమెను చూడగానే వికాస్ కళ్ళు పశ్చాత్తాపం తో నిండి పోయాయి. ఆమె కు క్షమాపణ చెప్పాలనుకుంటూ ముందుకు కదిలాడు. ఇప్పుడు పరిపూర్ణత సాధించిన మనిషిలా మారేందుకు ప్రయత్నం చేస్తూ.
***సమాప్తం***
మళ్ళ కారుణ్య కుమార్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:
నా పేరు మళ్ళ కారుణ్య కుమార్అమ్మవారి పుట్టుగ (గ్రామం)శ్రీకాకుళం జిల్లా.
విద్య : ఫార్మసీఉద్యోగం : ప్రైవేట్ ఉద్యోగం.
సాహితీ ప్రస్థానం : నేను కథలు,కవితలు రాస్తాను.యిప్పటి వరకు చాలా కథలు,కవితలు వివిధ పత్రికల్లో సాక్షి,ప్రజాశక్తి,తపస్వి మనోహరం,సుమతీ,తెలుగు జ్యోతి,సహరి,సంచిక,జాగృతి ప్రింట్/అంతర్జాల మాస/వార పత్రికల్లో ప్రచురితం అయ్యాయి.
పురస్కారాలు :1.లోగిలి సాహితీ వేదిక యువ కవి పురస్కారం.2.సుమతీ సాహితీ సామ్రాట్ పోటీలలో ద్వితీయ స్థానం.3.సుమతీ మాసపత్రిక వారి దీపం ఉగాది పురస్కారం.
Comments