విహార యాత్ర
- Otra Prakash Rao

- Oct 4
- 7 min read
#OtraPrakashRao, #ViharaYathra, #విహారయాత్ర, #TeluguStory, #తెలుగుకథ

Vihara Yathra - New Telugu Story Written By Otra Prakash Rao
Published In manatelugukathalu.com On 04/10/2025
విహార యాత్ర - తెలుగు కథ
రచన : ఓట్ర ప్రకాష్ రావు
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
ఐదవతరగతి పిల్లలను విహార యాత్రగా ఎక్కడికైనా తీసుకెళదామన్న ఆలోచన నాకూ, మా ఆవిడకు కలిగింది. మేమిద్దరం ఒక ప్రైవేటు ప్రాథమిక స్కూలునందు టీచర్లుగా పనిచేస్తున్నాము.
బడి యజమాని ఎల్లారెడ్డిగారు ప్రధానోపాధ్యాయుడుగా పనిచేస్తూ వ్యాపారరీత్యా వెళ్లకుండా, తక్కువ ఫీజులతో బడి నడుపుతున్నారు. ప్రతివిషయంలోనూ అలోచించి నిర్ణయాలు తీసుకొంటారు.
నేను విహార యాత్ర గురించి చెప్పిన మాటవిని ఎల్లారెడ్డి నవ్వారు.
"ఎందుకు నవ్వుతున్నారు" అడిగాను.
"ఈ కాలం పిల్లల తల్లి తండ్రులు అంత సులభంగా అంగీకరించరు. "
"అంగీక రించే తల్లి తండ్రుల పిల్లలను తీసుకేల్దాము. చిన్నప్పుడు నేను రాయల చెరువులో అరవతరగతి చదువుతున్నప్పుడు మా బడిలో వారు విహార యాత్రగా గండికోటకు తీసుకెళ్లారు. ఎన్నో సంవత్సరాలు గడిచినా ఇప్పటికీ ఆ అనుభూతి మరిచిపోలేదు. అందుకే మనం పిల్లలను అలా తీసుకెళ్తే వారి జీవితాంతం ఒక తీయని గురుతుగా వుంటుంది. " అన్నాను.
“ఇప్పుడు గండికోటవరకు ఏ సి బస్సులో తీసుకెళ్ళబోతున్నట్లు చెప్పినా, గండికోటలో బ్యాటరీతో నడిచే బండ్లు ఉంటాయా అని పిల్లలు అడగక పోయినా పిల్లల తల్లితండ్రులు అడుగుతారు. ఇంతకూ మీరు ఎక్కడకు వెళ్లాలని అనుకొన్నారు" అడిగారు.
"ఇక్కడినుండి ఎనభై నాలుగు కిలోమీటర్ల దూరంలో నున్న ప్రముఖ యాత్రా స్థలమైన.." అంటూ చెబుతుంటే నా మాటలకూ అడ్డుపడుతూ "మంచి యాత్రా స్థలమే, అక్కడకు వెళ్ళలంటే బస్సు ఏర్పాటు చెయ్యాలి. ప్రైవేటు బడులంటే డబ్బులు గుంజే బడులన్న పేరు వుంది. మీరేదో మంచి కోసం వెళ్లినా చెడ్డపేరు మనకే వస్తోంది. మీకోసం ఒక చిన్న యాత్ర ఏర్పాటు చేద్దాము. పిల్లల దగ్గర పైసా అడగవలసిన పనిలేదు. "
"భోజన ఖర్చులు అయినా.." అన్నాను.
"మన ఊరి బయటున్న టోల్ గేట్ నుండి అడ్డ దారిలో మా స్నేహితుడు బాలాజీకి పెద్ద మామిడి తోట వుంది. మన బడి పిల్లలతో రమ్మని నన్ను ఎన్నో సార్లు రమ్మని చెప్పేవాడు. భోజన ఏర్పాట్లు వాడే చేస్తానని చెప్పాడు. ఆ తోటకు మధ్య దారిలో ఒక చెరువు వుంది. అక్కడ పిల్లల్ని కాసేపు ఆడించవచ్చు. " అన్నారు.
"తప్పకుండా పిల్లలు ఆనందిస్తారు సార్ " అన్నాను.
"మనకు సమస్యలు రాకుంటే సరే, ఇప్పటికి ఐదవతరగతి పిల్లలను తీసుకేల్దాము. నలభై మంది వున్నవాళ్లలో ఎంతమంది వస్తారో చూద్దాం. ఈ యాత్ర విజయవంతమైందంటే ఇంకొక సారి నాలుగవ తరగతి పిల్లలు లేక అన్ని తరగతి పిల్లల్ని తీసుకెళ్లాలా.. వద్దా అని ఆలోచిద్దాం " అన్నారు ఎల్లారెడ్డి.
"అలాగే మాస్టారూ " అన్నాను.
"చిన్న పిల్లలు చాలా జాగ్రత్తగా తీసుకొని రావాలి. యాత్ర అనేది సులభమైనది కాదు, ఎన్నో సమస్యలు రావడానికి అవకాశం వుంది. "అన్నారు.
ఆ రోజు సాయంత్రం నేను ఎల్లారెడ్డితో కలసి స్కూటర్లో అయన మిత్రుడు బాలాజీ తోటకు వెళ్ళాము. దారిలో చెరువును చూసి "ఈ యాత్ర తప్పకుండా సరదాగా వుంటుంది" అన్నాను.
“సరదాగా వుంటుంది. మనకుఎటువంటి సమస్య రాకుండా వుంటే చాలా బాగుంటుంది” అన్నారు.
మరుసటి రోజు ఉదయం ఐదవతరగతి పిల్లలకు నేను పాఠం చెబుతున్న సమయాన ఎల్లారెడ్డి వచ్చారు.
ఈ ఆదివారం యాత్రకు తీసుకెళ్తున్న సంగతి ఎల్లారెడ్డి గారు చెప్పగానే పిల్లలు ఒక్కసారిగా సంతోషంతో ఎగిరినంత పని చేశారు.
యాత్ర వివరాలు పూర్తిగా చెబుతూ ఏదైనా అనుమానాలు ఉంటే ఫోను చేసి కనుక్కోమని నా నంబరు ఇచ్చారు.
ఆ సాయంత్రం వరుసగా ఫోన్లు రావడం ప్రారంబించింది. వారడిగే ప్రశ్నలకు సమాధానము చెప్పాను.
"మన బడినుండి ఆదివారం ఉదయం సరిగ్గా ఏడుగంటలకు నడకతో ప్రారంభిస్తున్నాము. బడి నుండి ఊరిబయటనున్న టోల్ గేట్ కు రెండు కిలో మీటర్ల దూరం వుంది. బడినుండి టోల్ గేటువరకు నడిచిరావడం కష్టమనిపించే వారు, తమ పిల్లలని తల్లి తండ్రులు టోల్ గేటు దగ్గర ఎనిమిది గంటల లోపున రావాలి. సరిగ్గా ఎనిమిది గంటలకు అక్కడినుండి నడచుకొంటూ బయలుదేరుతాము. చెరువు దగ్గర టిఫన్ తినిపిస్తాము. టిఫన్ ఇంటిలోనుంచి తీసుకొని రావాలి " అని ఒక విద్యార్ధి తండ్రి ఫోనులో అడిగితే చెప్పాను.
*** *** ***
ఆదివారం ఉదయం ఏడుగంటలయింది ఒక్క అబ్బాయి కూడా రాకపోవడం నాకు ఆశ్చర్యం అనిపించింది.
నేనూ మా ఆవిడతో పాటు మరో ఇద్దరు టీచర్లు మాత్రమే వున్నాము.
మా నలుగురి వైపు చూస్తూ"మనం చెప్పిన ప్రకారం సమయం ఏడుగంటలయింది. మనమిక బయలుదేరుదాము " అన్నారు ఎల్లారెడ్డి.
మేమైదుగురు సరదాగా మాట్లాడుకొంటూ టోల్ గేటు దగ్గరకు చేరుకున్నాము. అక్కడ కొంతమంది విద్యార్థులు తండ్రులతో స్కూటర్లో వచ్చి మా కోసం ఎదురుచూస్తున్నారు. కాస్తా దూరం నడిస్తే ఎక్కడ పిల్లలకు శారీరక శ్రమ అనుకొనే తల్లి తండ్రులను చూస్తూ నవ్వుకొన్నాను. మా ఆవిడ అంతకు ముందు సిద్ధంగా ఉంచుకొన్న పిల్లల జాబితాలో ఎవరెవరు వచ్చారో హాజరు వేసుకొనసాగింది.
అనుకొన్న సమయానికి ముపై రెండు మంది పిల్లలతో ఎనిమిది గంటలకు మా యాత్ర మొదలైంది. యాత్ర మొదలుకావడానికి ముందు "మీ సెల్ ఫోనులు అన్నింటినీ ఈ సంచిలో వెయ్యండి " అని ఎల్లారెడ్డి గారు చెప్పగానే నిరుత్సాహంతో కొంతమంది పిల్లలు సంచిలో వేయడం గమనించాను. ఐదవ తరగతి చదివేపిల్లల చేతిలో సెల్ ఫోనులు. అది పిల్లల తప్పు కాదు వారి తల్లితండ్రులది అనుకొన్నాను.
మట్టి రోడ్డు మీద నడచుకొంటూ వెళ్తున్నాము. పిల్లలతో వెళ్లడం చాలా సరదాగా వుంది. వారిచేత పాటలు పాడిస్తూ వెళ్తున్నాము. చెరువు దగ్గరకు చేరుకున్నాము. మూడు రోజులముందు నేనూ, ఎల్లారెడ్డి కలసి చూసివెళ్లిన అదే చెరువుగట్టు అయినా నాలో ఏదో ఆనందం, చెరువుగట్టుపై వీస్తున్న గాలి పీలుస్తుంటే నాలో ఒక ఉత్సాహం కలిగింది.
చెరువును చూసిన పిల్లల మొహాలు సంతోషంతో నిండిపోయింది. అందరి కళ్ళలో మెరుపులు గమనించాను.
"సార్, చేపలు వచ్చేచోట కాళ్ళు పెడితే చేపలు మనల్ని ముద్దు పెడుతున్నప్పుడు కిచ కిచలు పెడుతున్నట్లు బాగుంటుంది. ఇక్కడ కూడా చేపలున్నాయి. " అన్నాడు ఒకడు.
"నీకెలా తెలుసు" అనడిగాను.
"పోయిన నెల పట్నానికి వెళ్ళినప్పుడు అక్కడొక పెద్ద మాల్ లోనికి వెళ్ళాను. అక్కడ ఒక చోటు నీరున్న తొట్టిలో చేపలున్నాయి. ఆ తొట్టిలో కాళ్ళుపెట్టి పదినిమిషాలు ఉండటానికి వంద రూపాయలు తీసుకొన్నారు. ఇక్కడ ఎంత తీసుకొంటారు సార్" అడిగాడు.
చిన్న చేపలు మృత చర్మ కణాలను సున్నితంగా తొలగిస్తాయి, దీంతో పాదాలు పునరుజ్జీవనం పొందుతాయి అన్న ఉద్దేశ్యంతో ఫిష్ పెడిక్యూర్స్ పట్టణాలలో వెలిశాయి.
"ఇక్కడ ఎవరూ డబ్బు అడగరు. మీరంతా జాగ్రత్తగా వరుసగా నీటిలో నిలబడండి" అన్నాను.
"అదేమిటండి చాలా దైర్యంగా వాళ్ళను నిలబడమంటూ చెప్పారు జారిపడితే "అంది మా ఆవిడ.
"ఏమీ కాదు, చాలా దూరం వరకు మోకాలు లోతు మాత్రమే ఉంటుందని బాలాజీ చెప్పాడు. " అన్నాను.
ఎగిరి తుళ్లిపడుతున్న చేపలతో నిండిన చెరువును చూస్తుంటే నాకే ఆనందంగా ఉంటె ఇక పిల్లలు చెప్పలేనంత సంతోషంగా ఉంటారని తెలుసుకున్నాను.
పిల్లలందరూ చెరువులో వరుసగా నిలబడ్డారు. ముందుగా తెచ్చిన బొరుగులు తీసి కొద్దీ కొద్దిగా ఇస్తూ "ఒకటే సారి మొత్తం వేయకండి ఒకటి రెండుగా వెయ్యండి. అయిపోయిందంటే మరలా బొరుగులు లేవు. ఎట్టి పరిస్థితిలోనూ కాలు ఆడించకుండా వుండండి. " అని చెప్పాను.
పిల్లలు బొరుగులు వేయడం ప్రారంభించారు. చేపలు రావడం ప్రారంభించింది. మా ఆవిడ నా ప్రక్కన నిలబడి చెరువులో బొరుగులు వేసింది.
"ఏమండీ చాలా బాగుంది ఓహ్ సూపర్.. చేపలు నా కాళ్ళను." అంటూ చిన్నపిల్లలా గట్టిగా సంతోషంతో అంటూ నా చేతిని గట్టిగా పట్టుకొంది.
సామాన్యంగా మా ఆవిడ ఇల్లుదాటిందటే నన్ను తాకడానికి కూడా సిగ్గుపడుతుంది. అటువంటి మా ఆవిడ ఇప్పటి ప్రవర్తన చూడగానే వీణ మీటినట్లు, మరెన్నో కోయిలలు కూసినట్లనిపించింది. పెళ్ళైన తరువాత మొదటి సారి మాఆవిడ ముఖంలో ఇంతటి సంతోషం చూసి మరింత ఆశ్చర్య పడ్డాను. యాత్రల విలువలు తెలుసుకున్నాను.
పిల్లల వైపు చూసాను. వారు కేరింతలతో అరుస్తున్నా, కాళ్ళు కదిలించకూడదన్న భావనతో చేతులను బిగపట్టుకొని నిలబడ్డారు.
"సార్ ఇక్కడే ఉందాము సార్, తోటకు ఇంకొకరోజు వెల్దాము " ఒక అబ్బాయి అన్నాడు.
కొంత సమయం తరువాత "బొరుగులు అయిపొయింది సార్" అంటూ బిక్కమొహంతో పిల్లలు చెప్పారు.
"మీరిలాంటి పని చేస్తారని తెలిసే హెచ్ ఏం గారు దాచి వుంచారంట. ఆయన ఇప్పుడే చెప్పారు. ఈ సారి జాగ్రత్తగా వాడండి అట్నూమరికొన్ని బొరుగులు అందరికీ పంచాను.
మరికొంత సమయం అక్కడే గడిపారు.
ఆ తరువాత అందరినీ చెరువు దగ్గరున్న గుడి దగ్గరకు తీసుకెళ్ళాము.
"మీరు తెచ్చుకొన్న టిఫన్ ఇక్కడ తినండి. నీళ్లు త్రాగడానికి బోర్ నందు నీళ్లు వుంది" అన్నాను.
"లేదు సార్ మేము వాటర్ బాటిల్ నందు తెచుకొన్నాము "
"నీళ్లు ఇక్కడే దొరుకుతుందని చెప్పానుగా "అన్నాను.
"అవి త్రాగితే జబ్బు వస్తుందని మా అమ్మ చెప్పింది " అన్నాడు.
‘జంక్ ఫుడ్ తింటే, కంపెనీ కూల్ డ్రింక్స్ త్రాగితే జబ్బురాదు కానీ గ్రామంలోని బోరు నీళ్లు తాగితే జబ్బు వస్తుంది అని భావించే తల్లి తండ్రులున్నారు’ అనుకొన్నాను.
టిఫీన్ అందరూ పూర్తి చేసుకొన్నారు.
ఒక అబ్బాయి నా దగ్గరకు వచ్చి "సార్ అదేం చెట్టు" అంటూ చూపించాడు.
"ఈత చెట్టు. వాటి పండ్లు చాలా తీయగా ఉంటుంది. ఇంతవరకు తినలేదా " అనడిగితే లేదన్నట్టుగా తలాడించాడు.
అటుగా వెళ్తున్న ఒక అబ్బాయిని చూసాను. వాడికి సుమారు పదిహేను సంవత్సరాల ఉండవచ్చు. అబ్బాయికి ఇరవై రూపాయలు ఇచ్చి ఈత పండ్లు కోసివ్వమని అడిగితే వాడు ఆ డబ్బులు నా చేతిలోనే పెడుతూ "సారూ, గెడ తీసుకొని వచ్చి పళ్ళు కోసినతరువాత తీసుకొంటాను "అంటూ వేగంగా వెళ్ళాడు.
మరికొన్ని నిముషాలలో కత్తి కట్టిన పొడుగాటి కర్ర తీసుకునివచ్చి ఈత పండ్ల గెలను కోసిచ్చాడు. వాడు గెలనుంచి పండ్లను తుంచి ఒక చోట వేసాడు, అందరూ పండ్లను చాలా బాగుంది అంటూ తినసాగారు.
వాడికి ఇరవై రూపాయలు ఇవ్వడం చాలా తక్కువనిపించి ఎక్కువిద్దామనుకొన్నాను. మా హెచ్ ఏం యాభై రూపాయల నోటు తీసిచ్చారు. వాడు సంతోషంతో చేతులు జోడించి వెళ్ళాడు.
"ఆరోగ్యానికి హానికరం చేసే పిజ్జాలు, బర్గర్లు తినడానికి అలవాటు పడిన వీళ్లకు, ఎన్నో పోషక విలవులున్న ఈ ఈతపండ్ల గురించి తెలీదు. "అన్నారు ఎల్లారెడ్డి.
నేను ఈతపండ్లలో వున్న పోషక విలువలగురించి చెబితే ఆశ్చర్యంగా విన్నారు.
మా ఆవిడ నాదగ్గరకు వచ్చి "ఇలాంటి సమస్య వస్తుందనుకోలేదు" అంది.
"ఏమైంది "అనుమానంగా అడిగారు హెచ్ ఏం.
"అశ్విని నా దగ్గరకు వచ్చి రెండు వేళ్ళు చూపించి 'వెంటనే వెళ్ళాలి' అంది.
"అక్కడెక్కడైనా చెట్టు చాటుకు తీసుకెళ్లి కూర్చోమని చెప్పు" అన్నాను.
"లేదండీ దానికి లెట్రిన్ నందే కూర్చోవాలంట అంటూ ఏడుస్తోంది " అంది.
"ఆరుబయట చాటుగా కూర్చోవడం గురించి నీవే మెల్లగా సర్ది చెప్పాలి "అన్నాను
"చెప్పబోతేనే యాకి తూ.. నేను లెట్రిన్ లోనే కూర్చొంటాను అంటూ ఏడుస్తోంది"
నేను ఏంచెయ్యాలన్నట్టుగా హెచ్ ఏం వైపు చూసాను.
"ఇంతకు మునుపే మా స్నేహితుడు బాలాజీ వస్తున్నట్లు ఫోనులో చెప్పాడు. వాడి గ్రామంలో ఏదైనా ఏర్పాటు చేయగలడా చూద్దాం. అదిగో వస్తున్నాడు. " అన్నారు ఎల్లారెడ్డి.
బాలాజీ రాగానే జరిగింది చెప్పాడు.
"మా గ్రామంలో ఒకరింట్లో టాయిలెట్ కట్టివున్నారు, ఎందుకంటే వాళ్ళ పిల్లలు ముంబైలో ఉన్నారట, లెట్రిన్ లేకుంటే రామని చెప్పడం వలన సంవత్సరానికి ఒకసారి వచ్చే పిల్లలకోసం కట్టారట. వారింటికి తీసుకెళ్తాను "అన్నాడు.
అశ్విని స్కూటర్ వెనుక కూర్చొనగానే బాలాజీ బయలుదేరాడు.
"ఈ కాలం పిల్లలకోసం బడి ఎన్నుకొనడానికి తల్లితండ్రులు మొదట చూసేదేమిటో తెలుసా.. టాయిలెట్ గదులు శుభ్రంగా ఉంటేనే బడిలో చేరుస్తారు. మన బడి టాయిలెట్ గదులు శుభ్రంగా ఉండటం చూసిఒక అబ్బాయి తల్లితండ్రులు వారింటి ప్రక్కనే వున్న కాన్వెంట్ బడి వదిలి ఇక్కడ చేర్పించుతున్నట్లు చెప్పారు. "అన్నారు ఎల్లారెడ్డి.
పిల్లలు గుడిముందున్న చెట్ల దగ్గర ఆడుకొంటున్నారు.
మరికొంత సేపటికి అశ్వినితో కలసి స్కూటర్ మీద వచ్చాడు బాలాజీ.
"అంతతొందరగా వచ్చేసారే "అన్నాను.
"ఎత్తుపల్లాలున్న స్కూటరుపై వెళ్లడం వలన అశ్విని నిగ్రహించుకోలేక మధ్యలోనే నిలబడమని చెప్పింది, అక్కడే చెట్టు చాటుకెళ్ళి టాయిలెట్ కు వెళ్ళింది " నవ్వుతూ అన్నాడు బాలాజీ.
"మరి నీళ్లు"
"పొలానికి వెళ్తున్న నీటి కాలువను చూపించాను "అన్నారు బాలాజీ.
"ఎత్తుపల్లాలున్న రోడ్డుమీద గర్భిణీ స్త్రీలు ఆటోలోనో బస్సులోనో వెళ్తే సులభముగా ఆసుపత్రికి వెళ్లకుండానే ప్రసవం అవుతుందన్న జోక్స్ ఎన్నో సార్లు చదివాను. అలాగే ఇప్పుడు "అంటూ నవ్వాను.
*** *** ***
చెరువునుండి బయలుదేరుతున్నప్పుడు చింత చెట్ల దగ్గర పిల్లలు కాస్సేపు ఆడుకున్నారు. ఎల్లారెడ్డి తన సంచిలోనున్న ఉప్పు కారం పొట్లాలను బయట పెట్టారు. ఒక బండమీద చింతకాయలు చితక్కొట్టి ఉప్పు క్కారం కలిపి తాను తిన్నతరువాత వాటి రుచి ఎలావుంటుందో పిల్లలకు కొద్దీ కొద్దిగా ఇచ్చాడు. సగం మంది పిల్లలు బాగుందంటే మరికొంతమంది పులుపు కారం అంటూ మూసేసారు.
మామిడి తోటలో గండుచీమ ఒకటి తన బరువుకన్నా ఎన్నో రేట్లు పెద్దదైన ఆహారాన్ని మోసుకెళ్ళడం అందరూ వింతగా చూసారు.
చెట్టుకింద పిల్లలు ఆడుకొంటున్నారు. మరికాస్సేపట్లో భోజనాలు వస్తుందని బాలాజీ చెప్పాడు.
"ఇంకొక సారి మా బడి మాస్టార్ల కుటుంబసభ్యులతో కలసి ఈ నెలలో ఒక ఆదివారం వద్దామనుకొంటున్నాము బాలాజీ " అన్నారు హెచ్ ఏం.
"భోజన ఏర్పాట్లు నేను చేస్తానురా " బాలాజీ చెప్పాడు.
"మేమె వచ్చి వంటలు చేసి తిని సాయంత్రం వెళ్తాము " అన్నారు.
"చాలా మంచి ఆలోచన సార్ "అంది మా ఆవిడ.
"ఇప్పుడు యాత్రలు అంటే అర్థం లేకుండా పోయింది. ఆ కాలంలో జాతరకు వెళితే ఎవరు హోటల్ గది తీసుకొంటారు. గుడి ఆవరణలో. మైదానాలలో నేలమీద పడుకొని కబుర్లు చెప్పుకొంటూ సరదాగా గడుపుతారు, అప్పుడే వారిమధ్య ఆప్యాయత లు అనుబంధాలు మరింత గట్టి పడుతుంది. కొత్త అనుభవాలు వారిలో చోటు చేసుకొంటోంది. ” అన్నారు ఎల్లారెడ్డి.
"నేటి తల్లి తండ్రులు పిల్లల్తో యాత్రలకు వెళ్లడం చాలా అరుదు. వెళ్లినా శారీరక శ్రమ వుండకూడదు, నడవకూడదు, అన్ని వసతుల గది దొరకాలి, మంచి భోజనం కావలి ఇలాంటి ఆలోచనలతో డబ్బు వెదజల్లుతూ యాత్రలు చేస్తున్నారు. ఈ పిల్లలూ పెద్ద వారైనాతరువాత అలాగే చేస్తున్నారు. మొక్కై వంగనిది మానై వంగుతుందా " అన్నాను.
(అయిపోయింది )
ఓట్ర ప్రకాష్ రావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

1. పేరు: ఓట్ర ప్రకాష్ రావు
https://www.manatelugukathalu.com/profile/oprao/profile 2. నా గురించి : 2017న జనవరి నెలలో రాణిపేట బి.హెచ్.ఈ.ఎల్. నందు పదవీ విరమణ పొందిన తరువాత తమిళ నాడు లోని తిరుత్తణి లో స్థిరపడ్డా ను. ”Free Yoga” పేరు మీద తిరుత్తణి ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలకు ఉచితముగా యోగాసనములు నేర్పుతున్నాను. తీరిక సమయంలో కథలు వ్రాయడానికి ప్రయత్నిస్తున్నాను 2020 సంవత్సరం మార్చ్ మాసం నుండి లాక్ డౌన్ కారణంగా బడులు తెరవకపోవడంతో పిల్లలకు ఉచిత యోగ తరగతులకు వెళ్ళలేక పోయాను 3. విద్య : ఐ టీ ఐ 4. సాహిత్య ప్రపంచంలోని తీపి జ్ఞాపకాలు : 1988 న ఆంధ్రప్రభ వారు నిర్వహించిన తెలుగు మినీ కథల పోటీలో మొదటి బహుమతి, 2015 నందు రాయగడ రచయితల సంఘం నిర్వహించిన కథల పోటీలో కన్సోలేషన్ బహుమతి, 2017 ,2018,2019,2020 నందు కెనడా తెలుగు తల్లి వారు నిర్వహించిన కథల పోటీలో బహుమతి పొందా ను. 2018 న కెనడా తెలుగు తల్లి వారు నిర్వహించిన కవితల పోటీలో బహుమతి పొందాను 2018 అక్టోబర్ నెలలో Mytales.in నిర్వహించిన చిట్టినీతి కథల పోటీలో నా కథను ఉత్తమ కథగా ఎన్నిక 2020 ప్రతిలిపి వారు నిర్వహించిన మాండలిక కథల పోటీలో మొదటి బహుమతి లభించింది 2021 శ్రీ శ్రీ కళావేదిక వారు నిర్వహించిన సంక్రాంతి కథల పోటీలో మొదటి బహుమతి 2021 మనతెలుగుకథలు.కామ్ వారు నిర్వహించిన సంక్రాంతి కథల పోటీలో ప్రత్యేక బహుమతి 6. ఇంతవరకు ప్రచురించినవి ఆంధ్రప్రభ ,ఆంధ్రపత్రిక, ఆంధ్రభూమి, గోతెలుగు ,హాస్యానందం, జాగృతి, కెనడా తెలుగుతల్లి, ప్రజాశక్తి ,ప్రతిలిపి ,ప్రియదత్త, రచన, వార్త, విపుల ,శ్రీ శ్రీ కళావేదిక, మనతెలుగుకథలు.కామ్ - పత్రికలలోమొత్తం మీద ఇంతవరకు 70 కథలు ప్రచురించబడింది ఆంధ్ర ప్రభ , బాల భారతo ,ఈనాడు హాయ్ బుజ్జి , మనతెలంగాణ , నవతెలంగాణ , ప్రభాత వెలుగు దర్వాజా , ప్రజాశక్తి , సాక్షి, వార్త , విశాలాంధ్ర - పత్రికలలో 130 బాలసాహిత్యపు కథలు




Comments