విజయానికి ఎన్ని మెట్లు
- P. Malleswara Rao
- Dec 10, 2020
- 2 min read
Updated: Feb 26, 2023

'Vijayaniki Enni Metlu' New Telugu Story
Written By P. Malleswara Rao
రచన : పి. మల్లేశ్వర రావు
త్వర త్వరగా ఇంటర్ పూర్తిచేసి, మంచి కాలేజీలో ఇంజనీరింగ్ లో సీటు సంపాదించి, బాగా చదివి,ఇరవై ఒక్క ఏళ్ళకే ఉద్యోగం సంపాదించి, స్థిరపడిపోవాలనుకున్నాడు విజయ్. మనం అనుకున్నవే సాఫీగా సాగిపోతే దాన్ని జీవితం అని ఎందుకంటారు? బి టెక్ అయితే పూర్తి చేయగలిగాడు గానీ ఉద్యోగం అయితే సాధించలేకపోయాడు.
తండ్రి లేని కుటుంబానికి తనే ఆసరా అవ్వాలనుకున్నాడు. కానీ తనున్న పరిస్థితికి అది సాధ్యపడలేదు. ప్రస్తుతం తన అన్న, తన కుటుంబాన్ని కూలీ పని చేస్తూ పోషిస్తున్నాడు. తనకు వచ్చే అంతంతమాత్రం డబ్బులు ఇల్లు గడవడానికి ఏ మాత్రం సరిపోదు. ఇల్లు గడవడానికి విజయ్ సాయం అవసరమయ్యింది. ఎన్నాళ్ళని ఇలా ఖాళీగా ఉంటావు? ఏదో ఒక పని చూసుకోమని ఇంట్లో నుండి ఒత్తిడి రావడం మొదలయ్యింది.
చదువు తప్ప మరే ఇతర పని తెలియని విజయ్ కి ఇతర పనులు చేయడంలో ఎటువంటి ఆసక్తీ లేదు. ఇంట్లోనే ఉండి పుస్తకాలతో కాలక్షేపం చేసే విజయ్ కి కుటుంబం నుండి కూడా నిరాశే ఎదురయ్యింది. తన మనసును అర్థం చేసుకోకుండా తను ఏం చేయాలనుకుంటున్నాడో గ్రహించక, అన్న కూడా పనికి వెళ్ళమన్నారు. అది విజయ్ కి ఏ మాత్రం నచ్చలేదు. మళ్ళీ పుస్తకాలతో కుస్తీ మొదలెట్టాడు.
కుటుంబానికి ఎటువంటి ఆర్దిక ప్రోత్సాహం అందివ్వక కుటుంబానికి భారంగా తయారయ్యాడు విజయ్. ఇటు ఇంట్లో అటు సమాజం నుండి వచ్చే సమాధానం లేని ప్రశ్నలు విజయ్ ని వెంటాడుతూనే ఉన్నాయి. మనసులో ఎన్నో ఆలోచనలు, ఎప్పటికైనా ఉద్యోగం రాకపోదా అనే చిన్న ఆశ. రాను రానూ విజయ్ ప్రవర్తన ఇంట్లో వారికి విసుగు కల్గింది. భాధ్యతారాహిత్యంగా ఉంటున్నారనుకున్నారు గానీ దేనికోసం ఎదురుచూస్తున్నాడో అర్థం చేసుకోలేకపోయారు.
రకరకాల పోటీ పరీక్షలు రాస్తూ ప్రతీ దానిలో వైఫల్యాలను చవి చూసాడు. అలా రెండేళ్ళు గడిచిపోయాయి. నెమ్మదిగా విజయ్ కి తన ఇంట్లో విలువ లేకుండా పోయింది. ఎన్నాళ్ళు ఇలా ఇంట్లోనే ఉంటావు ఏదోక ఉద్యోగం చూసుకోమని లేదా కూలీపనికి పో అని అమ్మ, అన్న ఇద్దరూ ఒత్తిడి తెస్తున్నారు. అటు ఊరిలో ఎవరికీ సమాధానం చెప్పలేని ప్రశ్న "ఏరా అబ్బాయ్! ఏం చేస్తున్నావ్? ఉద్యోగం ఏమైనా వచ్చిందా?" దీనికి తన దగ్గర సమాధానం లేదు. ఇలా ఎన్నో మనసు మోయలేని సంఘటనలు కూలీ పనిలో మోసే బరువుల కంటే బరువుగా అనిపించాయి.
ఒకానొక సమయం లో తన తల్లి అనే మాటలకు మనసు ముక్కలైన విజయ్ ఆత్మహత్యాయత్నం చేసుకోబోయాడు. కానీ తన విజయాన్ని ప్రపంచానికి పరిచయం చేయడం కోసం ఆగిపోయాడు. ఇరవై సంవత్సరాలు ఇష్టంగా పెంచిన తన తల్లికి ఈ రెండేళ్ళలో ఎందుకు బరువయ్యానా అని బాధపడ్డాడు. తన తల్లి అనే ప్రతీ మాట తన మంచికే అని తెలుసుకోలేకపోయాడు. తను ఆ రెండేళ్ళలో ఎదుర్కొన్న సంఘటనలన్నీ తనలో మరింత కసిని పెంచాయి. అలా ఇంకొక సంవత్సరం పుస్తకాలతో కనబడని యుద్దం చేసాడు విజయ్.
ఆ సమయంలో ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. బి టెక్ అర్హత తో ధరఖాస్తు చేసుకుని పరీక్షకి బాగా సన్నద్ధమయ్యాడు. పరీక్ష బాగా రాశాడు. పట్టణంలోని ప్రభుత్వ కార్యాలయంలో కొలువు చేపట్టాడు.
సమాధానం లేని సమాజం వేసే ప్రశ్నలకు తన విజయమే ఒక సమాధానం. బాధ్యత లేదనుకున్న తన కుటుంబానికి తన విజయమే ఒక భరోసా.




Comments