top of page

విలువలు


'Viluvalu' written by Yasoda Pulugurtha

రచన : యశోద పులుగుర్త

అప్పుడే ఆఫీస్ నుండి వచ్చిన సుమన భర్త తన గదిలో కుర్చీలో కూర్చుని టీపాయ్ మీద డ్రింక్ బాటిల్స్ పెట్టుకుని అదే పనిగా త్రాగడం చూసి గద్గద స్వరంతో " కల్యాణ్, ఇలా రాత్రీ పగలూ అన్న తేడా లేకుండా త్రాగుడికి బానిసవైపోతే, నేను పిల్లలూ ఏమైపోవాలి?” అంది

“ఇంకా బ్రతికే ఉన్నానని సంతోషించు సుమా ! ఆత్మహత్య చేసుకోలేని పిరికితనం.. పిరికితనం కాదు, ఒక బలహీనత.. ఆ బలహీనత నీవూ, మన పిల్లలే అని గుర్తు పెట్టుకో”

.

“పిచ్చిగా మాట్లాడకు కల్యాణ్, ఉద్యోగాలలో ఇవన్నీ కామన్, ఆత్మహత్య చేసుకున్న వాళ్లంతా పిరికివాళ్లు నా దృష్టిలో. బ్రతకడం చేతకానివాళ్లు..

ప్రతీ సమస్యకూ పరిష్కారం ఉంటుంది, కానీ ఇలా మద్యాన్ని ఆశ్రయించడంకాదు”.

“కానీ నాది సమస్యకాదు సుమా, అవమానం, తట్టుకోలేని అవమానం.. హృదయం మండిపోతోంది.. దాన్ని చల్లబరచాలనే ఈ త్రాగుడు.. ఈ డ్రింక్ నా గొంతుకలో అలా జారుతుంటే నాకెంత బాగుందో తెలుసా.. నాకు సంభవించిన అవమానం సంగతి అసలు గుర్తే ఉండడం లేదు.. మనస్సంతా దూదిపింజంలా ఎగిరిపోతున్నట్లుగా అనుభూతి..

కావాలంటే నీవు కూడా కాస్త రుచి చూడు, స్వర్గంలో తేలిపోతున్నట్లుగా ఉంటుంది..”


“అలాగే కల్యాణ్! ఉండు పిల్లలని కూడా తెస్తాను. వాళ్లకీ రుచి చూపెడదువుగాని....”


“అదీ మా సుమ అంటే! పిల్లలని తీసుకురా సుమా, వాళ్లూ టేస్ట్ చేస్తా”రంటూ మత్తులో ముద్ద మద్దగా వస్తున్నాయి మాటలు..

కల్యాణ్ వైపు విస్తుపోతూ చూసిందో క్షణం..

కల్యాణ్ మాట్లాడుతున్న ప్రతీమాట సుమన మనసుని కకావికలం చేస్తున్నాయి..

ఎంత చలాకీగా ఉండేవాడు కల్యాణ్ ?

తన ఉద్యోగాన్ని ఎంతో ప్రేమించేవాడు, ఇష్టపడేవాడు..

ఆఫీస్ నుండి ఇంటికి రాగానే పిల్లలిద్దరితో కలసి బోలెడు అల్లరిచేస్తూ, తనని ఆటపట్టిస్తూ, ఆరోజు ఆఫీసుకబుర్లన్నీ తనతో పంచుకునేవాడు..

ఎప్పుడైనా క్లైంట్స్ తో సెమినార్, కాన్ఫరన్సెస్ లోనూ, అఫీషియల్ పార్టీలప్పుడు ఏదో కొద్దిగా మాత్రమే తప్పనిసరి పరిస్థితులలో డ్రింక్ చేసేవాడు. ఆ విషయం సుమ కు కూడా ముందుగానే చెప్పడమో, లేక పార్టీలు అయ్యాక ఇంటికి వచ్చాకనేనా చెప్పేవాడు.

అటువంటి భర్త త్రాగుడకి బానిసైపోయి, ఒకరకమైన నిరాశా నిస్పృహతో గడిపేస్తున్నాడు.. సిగరెట్లు మీద సిగరెట్లు కాల్చి పారేస్తున్నాడు.. ఎప్పుడూ ఎటో శూన్యంలోకి చూస్తూ ఆలోచనలతో గడపివేస్తాడు..

కల్యాణ్ ......

చదువులో జీనియస్, ఐఐటీ ఖడ్గపూర్లో ఎలాక్టానిక్స్ అండ్ కమ్యూనికేషన్ బ్రాంచ్ లో టాపర్.

ఎమ్ టెక్ కూడా అక్కడే చదివాడు..

అతను ఫైనల్ ఇయర్ లో ఉండగానే ఎన్నో టాప్ కంపెనీలు అతనికి ప్లేస్ మెంట్ ను ఆఫర్ చేసాయి..

చివరకు " హువావే" అనే సంస్తలో ఆర్ అండ్ డీ డిపార్ట్ మెంట్ లో ఛీఫ్ ప్రాజక్ట్ ఇంజనీర్ గా జాయిన్ అయ్యాడు..

ఆ సంస్త, సమాచార,ప్రసార సాంకేతిక పరిజ్నానంలో పెద్ద పెద్ద వరల్డ్ లీడర్ కంపెనీలైన గూగుల్, ఏపిల్, సేమ్ సంగ్ మొదలైన కంపెనీలకు గట్టిపోటీనిస్తూ, మొబైల్ ఫోన్ తయారీ రంగంలో అగ్రస్తానంలో నిలబడింది.. ఆసంస్త తయారు చేస్తున్న ' హువావే పి- 30 మొబైల్ ఫోన్ ' ఇండియాలో ప్రసిధ్దిగాంచిన టాప్ టెన్ మొబైల్ ఫోన్లలో ఒకటి..

ఈ మొబైల్ ఫోన్ కి సంబంధించిన ముఖ్యమైన హార్డ్ వేర్ మరియు లేటెస్ట్ ఫీచర్ల డిజైన్, డెవలప్ మెంట్ల ప్రాజక్ట్ లో కల్యాణ్ ది కీలకమైన స్తానం .. ఈ మొబైల్ ఫోన్ హార్డ్వేర్ టెక్నాలజీ గురించి అతనికి ఉన్న సాంకేతిక పరిజ్నానం ఆ సంస్తలో ఎవరికీ లేదని చెప్పవచ్చు..

మార్కెట్ లో విజయవంతమైన ఈ మాడల్ కు తర్వాత వెర్షన్‌గా మరింత లేటెస్ట్ టెక్నాలజీ, ఫీచర్స్ తో ' హువావే మేట్ 40 ప్రో ప్లస్,' లాంచింగ్ కు ఆర్ అండ్ డి విభాగం తీవ్ర పరిశోధన చేస్త్తోంది.. ఈ కొత్త మొబైల్ ప్రస్తుతం మార్కెట్ లో ఉన్నఅన్ని మొబైల్ ఫోన్ల కంటే అత్యధిక కెమేరా క్వాలిటీ కలిగి ఉండడమే కాకుండా అద్భుతమైన ప్రదర్శన తో బాటూ, వినియోగదారుని వాడకానికి చాలా సులువుగా ఉంటుంది. "యూజర్ - ఫ్రండ్లీ మొబైల్ ఫోన్ " అవుతుందని ఒక గట్టి విశ్వాసం.

ఇంకొక ఆర్నెలలో ఈ లేటెస్ట్ మొబైల్ ఫోన్ ని మార్కెట్ లో లాంచ్ చేయాలని అనుకునే తరుణంలో ఎవరూ ఊహించని ఒక అనూహ్యమైన సంఘటన హఠాత్తుగా జరిగిపోయింది..

ఒకరోజు కల్యాణ్ ఆఫీస్ కు వచ్చేసరికి ఆ కంపెనీ సీఈవో నుండి ఆర్డర్, కల్యాణ్ ను వెంటనే వచ్చి తనని కలవమని ..

ఎంతో అత్యవసరమైతే తప్ప ఆయన పిలవడు.. అందుకనే హడావుడిగా సిఈవో ఛాంబర్ కు వెళ్లాడు..

ఆయన కల్యాణ్ ను చూడగానే ఆగ్రహావేశాలకు లోనౌతూ.......

“యూ ఆర్‌ ఫైర్డ్‌ మిస్టర్ కల్యాణ్! మీ మీద ఎంతో నమ్మకం పెట్టుకున్న ఈ సంస్థ యొక్క బిజినెస్ నే దెబ్బతీయాలన్న నీలాంటి అవినీతిపరులకు ఇక్కడ స్థానం లేదనగానే కల్యాణ్ కు ఆయన చెపుతున్నదేమిటో అర్ధం కావడం లేదు..

తను దెబ్బతీయాలన్న ప్రయత్నం చేయడమేమిటో అయోమయంగా ఉంది. భూమి గిర్రుమని తిరుగుతున్నట్లుగా భావన..

తనకు తను ధైర్యం తెచ్చుకుంటూ....”సర్, ఐ డునాట్ అండర్ స్టాండ్ వాట్ యూ మీన్” అని పొలైట్ గా అనేసరికి, ఆయన అగ్గిమీద గుగ్గిలమైపోతూ, " ఇంకా విడుదలకాని న్యూ మొబైల్ హార్డ్ వేర్, ఇంకా ప్రకటించని ఫీచర్లు, భవిష్యత్తులో రానున్న ఉత్పత్తి వివరాలను మన పోటీదార్ల కంపెనీకి బహిర్గతం చేసావన్న సమాచారం మాకు అందింది.. అది నీవే చేసినట్లుగా క్లియర్ కట్ సమాచారం . నీవు చేసిన పని మన కంపెనీ మనోధైర్యాన్ని ,బ్రాండ్ ఇమేజ్ నీ దెబ్బతీసిం”దంటూ ..........

‘నౌ యూకెన్ గో’ అంటూ చెప్పుతో కొట్టినట్లుగా మాట్లాడాడు.. తనకు ఒక్క మాట మాట్లాడడానికి అవకాశం ఇవ్వలేదు..

జీవితంలో కోల్కోలేని దెబ్బ తిన్నాడు తను.. తన కెరీర్ అంతా సర్వ నాశనం అయిపోయింది.. ఇంక తనకు భవిష్యత్తే లేదనుకుని ఆవేదన చెందాడు.. తల ఎత్తుకోలేక ఇంటికి తిరిగివచ్చేసాడు.. ఇంటికి వచ్చాక తన రూమ్లోకి వెళ్లిపోయి తలుపులు వేసుకుని రెండురోజులవరకు తెరవలేదు..

సుమన బ్రతిమాలగా, బ్రతిమాలగా ఆమె ఒడిలో తలపెట్టుకుని దుఖించాడు..

నేను అలా ఎందుకు చేస్తాను సుమా అంటూ !

నా కంపెనీ నాకు ప్రాణంతో సమానం.. అటువంటి కంపెనీను మోసం చేస్తానా అంటూ ఎంతో వ్యధాభరితంగా మాట్లాడుతున్న కల్యాణ్ ను చూస్తుంటే సుమకు దుఖం ఆగడంలేదు..

అలా దుఖంతో విచలితుడౌతున్న తమ తండ్రిని చూస్తూ కల్యాణ్ కూతురు ధీర, కొడుకు ధనుష్ కూడా ఏడ్చేస్తున్నారు..

సుమన భర్తకు ఎంతగానో ధైర్యం చెపుతోంది, ఎక్కడో ఏదో పొరపాటు జరిగి ఉండచ్చని, నిజం ఏనాటికైనా తెలీకపోదని ఊరడిస్తోంది..

ఆ అవమానాన్ని తట్టుకోలేక త్రాగుడు మొదలు పెట్టాడు.. ఎప్పుడు పడితే అప్పుడు మంచినీళ్లల్లా తాగేస్తున్నాడు. త్రాగుడే అతని మానసిక పరిస్తితికి సాంత్వనం కలిగిస్తోంది.. తిండి సరిగా తినడు, నిద్రపోడు.. పిల్లలని పలకరించడు..

సుమ ఎంతగా నచ్చచెప్పి కాళ్లావేళ్లా పడుతూ అతని వ్యసనాన్నిమానిపించాలని ప్రయత్నిస్తున్నా, అతను ఆవేశాన్ని అణుచుకోలేక సుమ మీద చేయెత్తిన సంధర్భాలు ఎన్నో..

భర్త పరిస్తితిని చూస్తూ కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది సుమ.. భావోద్వేగంతో కూడిన దుఃఖం వరదలా ప్రవహిస్తోంది.

తరంగం అల్లకల్లోలమైనట్లు , అంతరంగం అతలాకుతలమై హృదయం నీటిమబ్బులా బరువెక్కిపోతోందామెకు..

పిల్లల ఏడుపు తాలూకు వెక్కిళ్ల పరంపరలు కెరటాలై ఎగసిపడుతున్నాయి..

అటువంటి పరిస్తితిలో........

ఆరోజు ఉదయం పదిగంటలకు కల్యాణ్ ను వెంటనే రమ్మనమని కంపెనీ నుండి ఫోన్ వచ్చింది..

నేను వెళ్లలేను సుమా అంటున్న భర్తకు, " మీరు తప్పుచేయనపుడు మీకెందుకు భయం అంటూ వెళ్లిరమ్మనమంటూ ధైర్యం చెప్పింది" ..

కల్యాణ్ వెళ్లేసరికి కంపెనీ అంతా హడావుడిగా ఉంది.. ఎక్కడపడితే అక్కడ ఉగ్యోగస్తులందరూ చిన్న చిన్న గుంపులుగా చేరి ఏదో సీరియస్ గా మాట్లాడుకుంటున్నారు..

కల్యాణ్ తిన్నగా తన బాస్ కేబిన్ లోకి వెళ్లాడు..

ఆయన కల్యాణ్ ను సాదరపూర్వకంగా ఆహ్వానిస్తూ కూర్చోమన్నాడు..

ఎంతో చలాకీగా , ఆరోగ్యంగా ఉండే కల్యాణ్ రూపం చూసి ఎంతో ఆశ్చర్యపోయాడాయన..

హా.... కల్యాణ్ , నీకు ఈ విషయం తెలుసా, " నీతో కలసి పనిచేసి ఒక ఆరు నెలల క్రితం ఈ కంపెనీనుండి వెళ్లిపోయిన ప్రేమచంద్ ఈ రోజు ఉదయమే సూసైడ్ చేసుకున్నాడనగానే " కల్యాణ్ తెల్లబోయాడు..

'ప్రేమ్' సూసైడ్ చేసుకోవడం ఏమిటి సర్, నాకు మీరు చెపితే ఇప్పుడే తెలిసింది.. ' ఐ యామ్ సో సారీ ఫర్ ది న్యూస్ ' .. వాట్ హేపెండ్ సర్ ?

అతను సూసైడ్ నోట్ కూడా వ్రాసి పెట్టి పోయాడుట.. అందులో కుతూహలం కలిగించే ఎన్నో నిజాలు ఉన్నాయి..

ఆ నోట్ నేను నా మొబైల్ ఫోన్ లో డౌన్ లోడ్ చేసుకుని సేవ్ చేసి ఉంచాను, నీకూ ఫార్వర్డ్ చేస్తాను.. చదువుతాను, విను కల్యాణ్ ....

‘కల్యాణ్ తో కలసి పనిచేస్తున్నట్లుగా అతన్ని నమ్మించి అతనినుండి కొత్త మొబైల్ ఫోన్ కు సంబంధించిన అనేక వాణిజ్య రహస్యాలను తెలుసుకుని ఆ ట్రేడ్ సీక్రెట్లన్నీ నేనే పోటీదార్ల కంపెనీకు చేరవేసాను.. దాని ఫలితంగా వచ్చిన సొమ్మును నా స్టార్టప్ లో పెట్టుబడి పెట్టాను.. ఆ స్టార్టప్ కంపెనీ వాటాదారునితో ఏవో విబేధాలు వచ్చినకారణంగా నేను పెట్టుబడి పెట్టిన డబ్బును వాపసు ఇవ్వకుండా మోసం చేయడమేకాకుండా, నేను మీ కంపెనీ ట్రేడ్ సీక్రెట్ ను కాంపిటీటర్ కంపెనీకి బహిర్గతం చేసానన్న విషయాన్ని మీ కంపెనీ కే కాకుండా మీడియాకు కూడా తెలియపరుస్తానని సవాలు చేస్తూ బెదిరించాడు.. ఈ అవమానం, భయం తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్నాను.. కల్యాణ్ ఎంతో నిజాయితీ పరుడు, మంచివాడు.. పనిపట్ల అతనికున్న అంకితభావం చాలా గొప్పది.. అతను మీ కంపెనీకే ఒక ఎసట్.. నన్ను ఎవరూ అనుమానించే అవకాశం ఉండకూడదని, నేనే కొత్త మొబైల్ కు సంబంధించిన టెక్నాలజీని కల్యాణే కాంపిటీటర్ కు లీక్ ఔట్ చేసాడని మీ సీఈఓ కి నేనే కంప్లైంట్ చేసాను.. కల్యాణ్ , " నీకు చేసిన అన్యాయానికి నన్ను క్షమించు..".. తిరిగి కల్యాణ్ ను ఉద్యోగంలోకి తీసుకోమని రిక్వెస్ట్ చేస్తూ వ్రాస్తున్న నా ఆఖరి నోట్’ ఇదంటూ ఆయన చదవడం ముగించాడు..

కల్యాణ్ కు ఇదంతా అయోమయంగా అనిపిస్తోంది.. ముఖ్యంగా తనతో ఎంతో ఫ్రెండ్లీ గా ఉండే ఒకప్పటి ప్రేమ్ ఆత్మహత్య అతని మనసుని కదలించివేస్తోంది..

పదే పదే " ఎందుకు ప్రేమ్ ఇలాచేసేవంటూ " అతని మనసు ఆక్రోశిస్తోంది..

ఇంతలో బాస్ మాటలకు వాస్తవానికి వచ్చాడు..

సీఈవో గారు నీవు రాగానే మనిద్దరినీ ఆయన ఛాంబర్ కు రమ్మనమని ఇప్పటికే రెండుసార్లు ఫోన్ చేసి చెప్పారు..

నీకు అపాలజీస్ చెప్పాలంటూ తొందరపడ్తున్నారు, నడవండి కల్యాణ్ అంటూ కల్యాణ్ భుజం చుట్టూ చేయివేసి ఇద్దరూ సీఈవో ఛాంబర్ వైపు నడవసాగారు..

" ప్రేమ్ చనిపోతూ తన నిజాయితీని రివీల్ చేసాడుకాబట్టి తను ఏమిటో లోకానికి తెలిసింది, లేకపోతే, లోకం దృష్టిలో తను ఎప్పటికీ నిందితుడినే కదా" అని ఆలోచిస్తున్న తరుణంలో సుమన తనతో అన్నమాటలు మెదడులో తటాలున మెరిసాయి, " ఎక్కడో ఏదో పొరపాటు జరిగి ఉండచ్చని, నిజం ఏనాటికైనా బయటకు వస్తుందని" చెప్పడం..

భార్య తనకు కష్ట సమయంలో ఇచ్చిన ధైర్యం, ప్రోత్సాహం తను ఎన్నటికీ మరచిపోలేడు.. తాగిన మైకంలో ఆవేశంతో తను సుమమీద చెయెత్తడం గుర్తొచ్చి ........ ' “సారీ సుమా నన్ను క్షమించు, ఇంకెప్పుడూ త్రాగుడు జోలికి పోను, నీమీద, పిల్లలమీద ఒట్టంటూ" మనసులో గట్టిగా అనుకున్నాడు..

సీఈ ఓ గారి ఛాంబర్ సమీపించడంతో లోనికి అడుగుపెట్టారిరువురూ ..

వీరికోసమే ఎదురుచూస్తున్న సీఈవో, కల్యాణ్ ను చూడగానే సీట్లోంచి లేచి అతనికి కరచాలనం చేసి కల్యాణ్ ను అపాలజీస్ కోరుతూ వెంటనే అతన్ని ఉద్యోగంలో చేరిపొమ్మని రిక్వెస్ట్ చేసాడు..

" ఐయామ్ సారీ ఫర్ నాట్ యాక్సెప్టింగ్ యువర్ రిక్వెస్ట్ సర్" అనగానే ఆ సిఈఓ గారు ఖంగుతిన్నారో క్షణం..

“యస్ సర్. ఆరోజు నేను ఆపని చేయలేదని మీకు విన్నవించుకుందామనుకునేసరికి మీరు నాకు ఆ అవకాశం ఇవ్వలేదు" .

సింపుల్ గా నామీద ఆరోపణ మోపబడింది, నేను నిందితుడైనాను.. ఈ మూడునెలలు నేను అనుభవించిన మానసిక క్షోభ, కోల్పోయిన నా మనో నిబ్బరత మీకు అర్ధం కాదుసర్.. ఎన్నో ఆనందాలను, సంతోషాన్ని కోల్పోయి నిద్రలేనిరాత్రులతో, జీవచ్ఛవంలా బ్రతికానని చెప్పినా మీకు అర్ధంకాదు.

నేను న్యాయ పరిరక్షణ కోసం కంపెనీపై వ్యాజ్యం వేయచ్చు.. కానీ నేను ఆ పని చేయలేను.. నేను గెలిచినా ఓడిపోయినా నా కెరీర్ లో నాకు మంచి జరగక పోవచ్చని భావించాను.. కాలం నాకు చాలా విలువైనది సర్ !

మీరెవ్వరూ సరియైన ఎన్ క్వైరీ చేసి ఇందులో అసలు నా పాత్ర ఉందా లేదా అని తెలుసుకోలేకపోయినందుకు నాకు చాలా విచారంగా ఉంది.. నేను ఆ స్థానంలో ఉన్నందుకు నేనే ఆ తప్పుడు పనిచేసానని మీ అనుమానం..

ప్రేమ్ చంద్ ఆత్మహత్య నోట్ మాత్రమే నేను నిర్దోషినని నాకు క్లీన్ చిట్ ఇచ్చింది..

అంటే అంటే......ప్రేమ్ చనిపోతూ నన్ను బ్రతికించాడు.

లేకపోతే నేను ఎప్పటికీ నిందితుడినే..

మీరు నన్ను ఉద్యోగంలోనుండి తొలగించిన మర్నాటి నుండే ఎలా తెలిసిందో ఏమోగానీ, మన పోటీదార్ల కంపెనీలనుండి నాకు బంపర్ ఆఫర్లు రావడం మొదలుపెట్టాయి..

ఉద్యోగం ఒక్కటే నాకు ప్రధానం కాదు సర్ !

దానికి మించిన విలువలను నేను ఎక్కువ ఇష్టపడతాను..

నేను నిర్దోషినని మీకు తెలిసింది..

ఇప్పుడు నాలో ఆత్మవిశ్వాసం మరింత ఇనుమడించింది..

నా చదువు, అనుభవం, నా కేరక్టర్ తో మరో ఉద్యోగం రావడం నాకు కష్టతరంకాదు .

"ఐ రియల్లీ ఎంజాయ్డ్ ది పిరియడ్ ఆఫ్ వర్కెంగ్ విత్ యూ సర్.

గుడ్ బై ..... “

అంటూ ఎంతో ఆత్మవిశ్వాసంతో ముందుకు నడుచుకుంటూ వెళ్లిపోతున్న కల్యాణ్ ను అలా చూస్తూ నిలబడిపోయారిరువురూ !!


48 views0 comments
bottom of page