'Vinayaka Vratham' - New Telugu Story Written By Sripathi Lalitha
Published In manatelugukathalu.com On 11/09/2024
'వినాయక వ్రతం' తెలుగు కథ
రచన: శ్రీపతి లలిత
కథా పఠనం: పద్మావతి కొమరగిరి
వెండికొండ మీద పరమశివుడు తనలో తాను ధ్యానం చేసుకుంటుంటే, జగన్మాత పార్వతి కూడా ధ్యానం చేద్దామని కూర్చుంది కానీ, అస్సలు ధ్యానం కుదరడంలేదు,కారణం పుత్రుడు వినాయకుడే.
రోజూ ఈ పాటికి ఎంచక్కా ఉదయపు ఫలహారం కానిచ్చి, నెమ్మదిగా ఎలకనెక్కి భక్తుల కోరికలు తీర్చడానికి భూలోకానికి విహారం బయలుదేరేవాడు.
ఇవాళ ఇంకా రాలేదు, అసలే ఆకలికి తాళలేడు, ఆలోచించినకొద్దీ తల్లి మనసు ఆగలేకపోయింది.
“గణేషా! ఎక్కడున్నావు నాయనా!” అంటూ కైలాసమంతా వెదకసాగింది.
అసలే శ్వేతవర్ణపు మంచుకొండ, అందులో తెల్లటి కొడుకు ఎక్కడున్నాడో కనిపించక తల్లడిల్లిపోయింది.
తల్లి బాధ తెలిసినట్టుంది నెమ్మదిగా “మాతా! ఇక్కడున్నాను” నీరసంగా వినిపించింది గజాననుడి గొంతు. గబగబా ఆ శబ్దం వచ్చినవేపు నడిచింది పార్వతి.
అక్కడ ఒక మంచు పలక మీద పడుకొని ఆకాశం వేపు చూస్తున్నాడు హేరంభుడు.
“ఏం నాయనా ఇలా పడుకున్నావు? ఆరోగ్యం బాగాలేదా?” ఆదుర్దాగా ఫాలచంద్రుని నుదిటి మీద చెయ్యి పెట్టి చూసింది అంబ.
“మనసు బాలేదమ్మా।” బాధగా అన్నాడు సుముఖుడు.
“మనసా! కొంపదీసి భూలోకంలో ఇంకెవరిమీదన్నా మనసు పడ్డావా! సిద్ధి, బుద్ధి చితక్కొడతారు” కోపంగా అన్నది గిరిజ.
“అబ్బా! ఉన్న ఇద్దరితోనూ వేగలేక పోతుంటే ఇంకొకరా, అది కాదమ్మా!” అన్నాడు గజకర్ణుడు.
“భూలోకంలో వినాయక చవితి వస్తోంది, అదితలుచుకుంటేనే గజ గజ వణుకు వస్తోంది” అన్నాడు గజముఖుడు.
“అదేమిటీ? నీ పండగేగా అది, నిన్ను అందరూ వివిధ రూపాలతో పూజిస్తారు, నీకెందుకు భయం” ఆశ్చర్యం వ్యక్తం చేసింది హైమవతి.
“అవును నా పండగే, కానీ భక్తులు పోటీ పడి, ప్రతీసందులోనూ నా విగ్రహం పెడతారు, ఒకరు రెండు అడుగులు, ఇంకోరు నాలుగు అడుగులు, ఇంకోరు నలభై అడుగులు.
ఒకరు అరకిలో లడ్డూ చేతిలో పెడితే, ఇంకోరు పది కిలోల లడ్డు పెడతారు, ఆ లడ్డూ మొయ్యలేక భుజం నొప్పి, చెయ్యి నొప్పి వస్తుందమ్మా!
ఎంత చెప్పినా ఇంకా ఆ రంగులు అద్దడం మానలేదు, కిందటి ఏడాది వచ్చిన ఆ దురదలు ఇంకా తగ్గలేదు.
అప్పటికీ మీరు హిమలయాల్లోని మూలికలతో నాకు నలుగు పెట్టారు. ఇప్పుడు మళ్ళీ ఆ రంగులు తలుచుకుంటే భయం వేస్తోంది.
ఒక పందిరిలో ప్రసాదం తినేలోగా ఇంకో పందిరిలో నైవేద్యం. ఒక చోట నుంచి ఇంకో చోటకి పరుగులవుతున్నాయి. నా ఎలక వాహనం కూడా వృద్ధుడయ్యాడు“ బాధగా అన్నాడు ధూమకేతుడు.
“అదంతా నీమీద భక్తి కదా నాయనా!” అంది జగజ్జనని.
“ఏమి భక్తో! వీళ్ల సృజనాత్మకత కాదు గానీ నా విగ్రహాలు రకరకాల రూపాల్లో పెడుతున్నారు. ఒక చోట మోటార్ సైకిల్ మీద కూర్చోపెడితే , ఇంకో చోట విమానం. ఒక చోట తెలుగు సినీ నటుడు, ఇంకో చోట హిందీ నటుడిలా, అసలు నా రూపం ఎలా ఉంటుందో నేను మర్చిపోయాను.
ఈ మధ్య కొందరు ప్రకృతి ప్రేమికులు మట్టితో విగ్రహాలు చేస్తున్నారు కానీ, ఆ మట్టి ఎక్కడి నుంచి తీస్తున్నారో చూస్తే నాకు వికారం వస్తోంది. ఆ కాల్వలన్నీ కాలుష్యంతో నిండిపోయి ఉన్నాయి.
అసలు నా విగ్రహం చిన్నగా మట్టితో ఎందుకు చెయ్యాలో తెలీదు నా భక్తులకి, భాద్రపద మాసం వర్షాలు వచ్చి చెరువులు నిండుతాయి, ఆ చెరువు ఒడ్డున ఉన్న మట్టి తీస్తే పూడిక తీసినట్టు అయ్యి ఇంకొంత నీరు చెరువులోకి వెళ్తుంది.
గట్టు దగ్గర తవ్వితే చెరువు వైశాల్యం పెరుగుతుంది.
ఇప్పుడు, భారత దేశంలో చెరువులేవి తల్లీ! ఇప్పుడు ఇరుకైన చెరువులలో, అంత పెద్ద విగ్రహం నిమజ్జనం చేస్తుంటే, నాకు ఆ నీళ్లు లేని చెరువులో ఊపిరాడడంలేదు” దిగులుగా అన్నది స్కంధపూర్వజుడు.
“మరి భక్తుల ప్రేమ అలానే ఉంటుంది నాయనా! తప్పదు తట్టుకోవాలి, నేను నవరాత్రులలో తట్టుకోవడం లేదూ” అన్నది దుర్గమ్మ.
“నీకు పూజలు చేస్తారు కానీ నా నవరాత్రులలో డిజెతో సినిమా పాటలు పెడతారు, ఆ పెద్ద శబ్దాలకి నా చాట చెవులు చిల్లులు పడుతున్నాయి“ చెవులు మూసుకుంటూ అన్నాడు శూర్పకర్ణుడు.
జాలిగా చూసింది కుమారుని శివాని.
“అంతేనా, పత్రి పూజ అని కనపడ్డ ప్రతి ఆకు తెచ్చి నా ముఖాన వేస్తున్నారు, వ్రత కల్పంలో చెప్పిన పత్రి ఉండనే ఉండదు. అసలు ఆ పత్రి పూజ ఎందుకో కూడా ఇంత చదువుకున్న భక్తులకి అర్థం కాదు. ఈ మాసంలో సూక్ష్మక్రిములు (బాక్టీరియా) ఎక్కువ వృద్ధి చెందుతాయి, ఈ పత్రికి ఆ క్రిములని చంపే గుణం ఉంటుంది, అందుకే ఆ పత్రిని నీళ్ళల్లో నిమజ్జనం చేస్తే నీటిలో ఉన్న క్రిములు కూడా చస్తాయి, అది అర్థం చేసుకోకుండా నాలుగు రోజుల క్రితం ఏరిన ప్రతీ ఆకు,పూవు వాడిపోయినా సరే వేస్తారు, దానికంటే ఇంట్లో తాజాగా ఉన్న నాలుగు పూలు కోసి వేస్తే చాలదా అమ్మా! “ వ్యథతో అన్నాడు వికటుడు.
“పోనీలే నాయనా! నువ్వు భోజన ప్రియుడవని రకరకాల ప్రసాదాలు పెడుతున్నారుగా!” అంది అన్నపూర్ణ.
“అమ్మో! ఆ ప్రసాదాలు గుర్తు చెయ్యకు. వాళ్లకు తినాలని ఉన్నవి పెడతారు కానీ, నాకు ఇష్టమైనవి, ఆరోగ్యానికి మంచివి పెట్టరు, బిరియానీలు, బిసిబెలిబాతులు నా ప్రసాదాలేంటి? ఇంకపిజ్జాలు, పాస్తాలు కూడా పెడతారేమో! నాకు నాలుగు అరటి పళ్లు, ఉండ్రాళ్ళు,పానకం, వడపప్పు పెట్టినా చాలు. ఈ కాలంలో ఆవిరి మీద ఉడికించిన ఉండ్రాళ్లు తింటే ఆరోగ్యానికి మంచిది. అదికూడా తెలీదు ఈ మానవులకి, ఆ ప్రసాదాలు కూడా వేరే వాళ్ళ చేత చేయిస్తారు, వాళ్ళు ఎంతోమందికి చెయ్యాలని ముందు రోజే చేసి ఉంచుతారు.
శుచి, శుభ్రం లేకుండా చేసిన ప్రసాదాలు తిని జీర్ణం కాక, మీరు కాచిన కషాయాలు తాగి, తాగి గొంతు మండిపోతోంది" ఏడుపు గొంతుతో అన్నాడు వక్రతుండుడు.
"మరి ఏమి చేద్దామని పుత్రా?" అన్న తల్లితో "ఈ సారి ఎక్కడైనా దాక్కుందామని చూస్తున్నాను అమ్మా! ఈ మానవులు అన్ని గ్రహాలకి ప్రయాణం కడుతున్నారు ఎక్కడ దాక్కున్నా పట్టుకుంటారు, ఏ మార్గం తోచక ఇలా కూర్చున్నాను" అన్నాడు వినాయకుడు.
"నువ్వు అలా చేస్తే నిజమైన భక్తులు కూడా బాధపడతారు, నేను చారుమతికి వరలక్ష్మీ వ్రతం గురించి చెప్పినట్టుగా, నువ్వే భూలోకంలో ఉన్న ఒక భక్తుడికి కలలో కనిపించి నీ పూజ ఎలా చెయ్యాలో చెప్పు, లేకపోతే పరిణామాలు దారుణంగా ఉంటాయని చెప్పు, నెమ్మదిగా చెప్తే వినరు కానీ, ఈ మానవులు శాపాలకి భయపడతారు.
సామ, దానం కుదరకపోతే దండం తో పని తప్పక జరుగుతుంది" అంది కాళీ దేవి.
"భళా! నీ ఉపాయం బావుంది, ఇప్పుడే ఒక భక్తుని కలలో అన్నీ వివరంగా చెప్తాను” అన్నాడు విఘ్నహంత్రుడు.
“స్వామీ! నన్ను కరుణించావా, నేను నీకు ముఖ్యభక్తుడుని అని నా కలలో కనిపించావా!” నిద్రలో లేచి చెంపలు వాయించుకుంటూ మాట్లాడుతున్న భర్తని చూసి “ఏమైందండీ” ఆత్రంగా అడిగిన భార్యకి
“ఈ సారి మన గేటెడ్ కమ్యూనిటీలో వినాయక చవితి వ్రతవిధానం గురించి అందరితోనూ చర్చించాలి, ప్రతిసారిలా కాక, స్వామి చెప్పినట్టు చిన్న విగ్రహం పెట్టి, కొద్ది పత్రి తో, శుచిగా చేసిన కొన్ని ప్రసాదాలతో, పిల్లల తో మంచి శ్లోకాలు చదివిస్తూ పూజచేసి స్వామి కృపకి పాత్రులమవ్వాలి, త్వరగా తయారవుదాం పద” అంటూ హడావిడిపడుతున్న భక్తుడిని చూసి పూజగది లోనించి నవ్వులు చిందించాడు ప్రథమ పూజ్యుడు.
***
శ్రీపతి లలిత గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత్రి పరిచయం:
నా పేరు శ్రీమతి శ్రీపతి లలిత.
నేను ఆంధ్రా బ్యాంకు లో ఆఫీసర్ గా పని చేసి పదవీ విరమణ చేశాను.
నా భర్త గారు శ్రీపతి కృష్ణ మూర్తి గారు కేంద్ర ప్రభుత్వం లో గెజెటెడ్ ఆఫీసర్ గా పని చేసి పదవీ విరమణ చేసారు.
నాకు చిన్నప్పటి నుంచి పుస్తక పఠనం , శాస్త్రీయ సంగీతం , లలిత సంగీతం వినడం ఇష్టం.
అరవై ఏళ్ళ తరవాత జీవితమే మనకోసం మనం బతికే అసలు జీవితం అనుకుంటూ రచనలు మొదలు పెట్టాను.
నా కధలు ఫేస్బుక్ లోని "అచ్చంగా తెలుగు " , "భావుక " గ్రూప్ లో , " గోతెలుగు. కం" లో ప్రచురించబడ్డాయి.
ప్రస్తుత సమాజం లో ఉన్న సమస్యల మీద , ఏదైనా పరిష్కారం సూచిస్తూ కధలు రాయడం ఇష్టం.
నేను వ్రాసిన కధలు ఎవరైనా చదువుతారా !అని మొదలు పెడితే పాఠకులనుంచి మంచి స్పందన, ప్రోత్సాహం , ఇంకాఉత్సాహం ఇస్తుంటే రాస్తున్నాను.
పాఠకుల నుంచి వివిధ పత్రికల నుంచి ప్రోత్సాహం ఇలాగే కొనసాగగలదని ఆశిస్తూ.. మీకందరికీ ధన్యవాదాలుతెలుపుతూ మళ్ళీ మళ్ళీ మీ అందరిని నా రచనల ద్వారా కలుసుకోవాలని నా ఆశ నెరవేరుతుంది అనే నమ్మకం తో ... సెలవు ప్రస్తుతానికి.
Comments