'Kala Vahinilo - Part 7' - New Telugu Web Series Written By Ch. C. S. Sarma
Published In manatelugukathalu.com On 08/09/2024
'కాల వాహినిలో - పార్ట్ 7' తెలుగు ధారావాహిక
రచన: సిహెచ్. సీఎస్. శర్మ
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
జరిగిన కథ:
సత్యానందరావు ఆ గ్రామానికి పెద్ద. ఆయన చెల్లెలి కూతురు కావ్య. అయన అక్క కొడుకు తిరుమల.
గ్రామంలో అయన ప్రత్యర్థి రాంబాబు. రాంబాబు కూతురు దివ్య. పెద్దల మనస్పర్ధలతో సంబంధం లేకుండా దివ్య, కావ్య మంచి స్నేహితులుగా ఉంటారు. ఇల్లు వదిలి వెళ్లిపోయిన చంద్రం తప్పకుండా వస్తాడని అనుకుంటారు తిరుమల, కావ్య.
తన బావ, సత్యానందరావు గారి కుమారుడు ఐన చంద్రాన్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నట్లు తండ్రి నరేంద్రతో చెబుతుంది కావ్య. బావతో తన వివాహం జరిగినట్లు కల కంటుంది. చంద్రం గురించి చులకనగా మాట్లాడిన నందాదేవితో కటువుగా మాట్లాడుతుంది కావ్య.
గతంలో నందాదేవి రాజకీయాల్లోకి ప్రవేశిస్తుంది.
ఇక కాల వాహినిలో.... పార్ట్ 7 చదవండి.
కాలగతిలో పదిహేను సంవత్సరాలు గడిచిపోయాయి. జిల్లా పరిషత్ ఛైర్మన్ ఎలక్షన్ వచ్చింది.
నందాదేవి పోటీ చేసింది. పార్టీ అధిష్టాన వర్గంలో మంచి పేరున్న నందాదేవి గెలిచింది. జిల్లా పరిషత్ ఛైర్‍పర్సన్ అయ్యింది. పదిహేను సంవత్సరాలుగా రాష్టంలో తాను తిరగని చూడని గ్రామం అంటూ లేదు. అందరి వ్యక్తుల తత్వాలు తనకు తెలుసు. కానివారికి రక్షణ.... అయినవారికి భక్షణ... ఇదీ నందాదేవి సిద్ధాంతం... తన వర్గీయులకంటే వ్యతిరేక వర్గ ప్రజానీకాన్ని జాగ్రత్తగా చూచి సాయం చేసి... వారి మనస్తత్వాలను మార్చేది.
సుబ్బారాయుడు ఆడబిడ్డ మీద ఉన్న అభిమానంతో... "అమ్మా!.... నీవు ప్రయోజకురాలి వైనావుగా.... నీకు నచ్చినవాణ్ణి నీ భర్తగా చేసుకో అమ్మా.... జీవితం ఇంకా బాగుంటుంది తల్లీ" అని చెప్పేవాడు.
రెండుసార్లు ఆ మాటలను విని విననట్లు నటించిన నందాదేవి మూడవసారి తండ్రి ఆ ప్రసక్తిని ఎత్తగానే "నాన్నా! ఇకపై నీవు ఆ విషయాన్ని గురించి నాతో మాట్లాడితే... నేను నా జీవితాంతం నీతో మాట్లాడను" ఖచ్చితంగా చెప్పి వెళ్ళిపోయింది.
రాంబాబు.... తండ్రి వ్యాపారాన్నే కొనసాగిస్తూ ’ఎ క్లాస్’ కాంట్రాక్టర్ అయినాడు.
"అతనికి ఒక కూతురు.... దివ్య. ఇరవై సంవత్సరాలు. యం.ఆర్.ఓ. ఆ దివ్యకు తల్లి శాంతికి నానమ్మ అనసూయకు తప్ప ఆ ఇంటి మిగతా జనాభా సుబ్బారాయుడు, రాంబాబు, నందాదేవి గారికి, సత్యానందరావు గారి కుటుంబంపై వైరభావం, పగ, ద్వేషం.
సత్యానందరావు కొడుకు చంద్రశేఖరరావు ఇంటినీ, వూరినీ వదలి వెళ్ళిపోయాడు. నందాదేవి కారణంగా పన్నెండేళ్ళ క్రిందట....
నందాదేవి గారి గత చరిత్ర....
గత జ్ఞాపకాలు...
అందులో ఆనందం కన్నా విషాదమే ఎక్కువ!
ఐదేళ్ళ క్రితం రఘునందన మరణం...
అప్పటికి అతని వయస్సు ముఫ్ఫై రెండు సంవత్సరాలు... నందాదేవి వయస్సు ముఫ్ఫై సంవత్సరాలు.అతను గుర్తుకు రాగానే నందాదేవి కళ్ళు చెమ్మగిల్లాయి.
తాను అతన్ని ప్రేమించింది. చూసి... సిగ్గుతో తల దించుకునేది.
అతనూ తన్ను చూచి నవ్వేవాడు.... అందగాడు...
తాను గుర్రపుబండీలో స్కూలుకు వెళ్ళేది.
అతను సైకిల్‍పై వచ్చేవాడు.
ఒక్కొక్కరోజు గుర్రపుబండి వెనకాలే కొంతదూరం తన్ను చూస్తూ వచ్చి.... తర్వాత బండిని క్రాస్ చేసి వేగంగా వెళ్ళిపోయేవాడు. చదువు పూర్తి అయ్యాక తన నిర్ణయాన్ని అతనితో చెప్పాలనుకొంది నందాదేవి.
అతను స్కూలులో పదో తరగతి ముగించి కాలేజీలో చేరి హాస్టల్లో వుండేవాడు. కలిసేదానికి ఆస్కారం లేకుండా పోయింది. సెలవల్లో అతని ఇంటికి వచ్చినప్పుడు శివాలయంలో రెండుసార్లు ఒకరినొకరు చూచుకొన్నారు. మాటలు లేవు... కేవలం చిరునవ్వుతోనే....
అన్నయ్య ఆనంద్... నిర్ణయం అన్నమ్మను వివాహం చేసుకోవాలని....
నాన్నగారు వెళ్ళి వారిని అడిగారు... వారు కాదన్నారు.
అన్నమ్మకు వారు వేరే పెళ్ళి చేసేశారు. అన్నయ్య బావిలో దూకి చచ్చిపోయాడు.
’పాత పగలతో రాంబాబు రఘునందనను చంపించాడు.
ఆ విషయం నాకు తెలుసు.... అది తప్పే!
ఈనాడు ఆ పిల్ల కావ్య ఏయ్ నా బావ వస్తాడే... అందంటే ధర్మం వారి పక్కనే ఉంది. అందుకే అనగలిగింది. నా పెద్దరికాన్ని గౌరవించి ఇంటిదగ్గర దింపింది. మా కుటుంబం కంటే వారు ఎంతో ఉన్నతులు’ అనుకొంది.
నందాదేవి నయనాలు చెమ్మగిల్లాయి.
నందాదేవి.... ఉదయం ఎనిమిదిన్నరకు తన గది నుండి హాల్లోకి వచ్చింది. దివ్య డ్యూటీకి బయలుదేరడానికి సిద్ధం అయి హాల్లోకి వచ్చింది.
"అత్తయ్యా! గుడ్ మార్నింగ్"
"ఆ.... గుడ్ మార్నింగ్ దివ్య! తాతయ్యను మీ నాన్నను పిలవరా!"
దివ్య... ఆ ఇరువురి గదులకు వెళ్ళి అత్తయ్య పిలుస్తూ వుందని ఇరువురికి చెప్పి హాల్లోకి వచ్చింది.
తండ్రి కొడుకులు..... దివ్య తల్లి లక్ష్మి.... హాల్లోకి వచ్చారు.
నందాదేవి వైపు పరీక్షగా చూచారు.
"కూర్చోండి"
సుబ్బారాయుడు.... రాంబాబు సోఫాల్లో కూర్చున్నారు.
"ఏమిటమ్మా! విషయం?" అడిగాడు సుబ్బారాయుడు.
"ఏదైనా సమస్యా నందూ!" అన్నయ్య రాంబాబు ప్రశ్న.
శాంతి దివ్య ముగ్గురిని మార్చి మార్చి చూశారు.
"నాన్నా! నేను చెప్పే విషయం జాగ్రత్తగా వినండి. మనం ఈ ఊరు వచ్చినప్పటినుంచీ మీరు ఎన్నో తప్పులు మీ స్వార్థం... సంతోషం... ఆధిక్యత కోసం చేశారు. తరతరాలుగా ఎంతో గొప్ప పేరు ప్రతిష్టలు వున్న కృష్ణారావు గారి కుటుంబంపైన పగను కక్షను ద్వేషాన్ని పెంచుకొన్నారు. మీ మాటలలో ఆ గుణాలను మీరు నాకు అన్నకూ పంచారు. మేమూ వారిని మీలాగే ద్వేషించాము."
"నాన్నా.... నాకూ వయస్సు పెరుగుతూ వుందిగా.... చాలు నాన్నా.... ఇక చాలు.... ఆ కుటుంబం జోలికి వెళ్ళవద్దు. మనం ఇప్పటికే వారికి ఎంతో నష్టాన్ని కలిగించాము. వారిదీ మన తత్వం అయివుంటే.... మన ముగ్గురినీ ఆ సత్యానందరావుగారు ఎప్పుడో చంపి తానూ చచ్చిపోయి వుండేవాడు. తన ముందు తరానికి శత్రు శేషం లేకుండా చేసి... ఈరోజు ఆ ఇంటిపిల్ల కావ్య.... రోడ్డున వెళుతూ... కారు చెడిపోయి నిలబడి వున్న నన్ను చూచి... నా దగ్గరకు వచ్చి.... ’రండి... మిమ్మల్ని మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తానని చెప్పి తన కార్లో నన్ను మన ఇంటి ముందు దింపింది. నిజం చెబుతున్నాను. అప్పుడు నాకు అర్థం అయింది. ఆ ఇంటివారి గొప్పతనం.... ఆ పిల్ల నా కళ్ళు తెరిపించింది."
"ఆ పిల్ల నాతో ఓ సవాల్ విసిరింది. దానికి కారణం నేనే.... నేను ఆ పారిపోయిన చంద్రం విషయంలో రాడని వాదించాను. ఆ పిల్ల ఏం చెప్పిందో తెలుసా!... ’త్వరలో నా బావ వస్తాడు....నీవు చూడబోతున్నావు’ అని పౌరుషంతో ఎంతో థీమాగా చెప్పింది. నాకూ అనిపిస్తూనే వుంది అది నిజం అవుతుందేమోనని..."
"ఒకవేళ వాడు వస్తే రేయ్!.... అన్నయ్యా!.... వాడి జోలికి పోవద్దు. వాడి బ్రతుకు వాడిని బ్రతకనీ.... రఘునందనను చంపి..." ఆవేసంలో ఆ పేరు నందాదేవి నోటినుంచి వెలువడింది. తప్పు చేశానని నాలుక కొరుక్కొని తలను ఆడిస్తూ "అలాంటి రాక్షస చర్యలకు ఇకపై స్వస్తి చెప్పు"
"నేను ఈనాడు ఈ స్థితిలో వున్నానంటే.... నా తత్వాన్ని పదేళ్ళముందే మార్చుకొన్నాను. కొన్ని నిర్ణయాలు తీసుకొన్నాను. పాటించాను. పెద్దా చిన్నలకు ఇవ్వవలసిన గౌరవాన్ని ఇచ్చాను. ఈనాడు అనుకొన్నది సాధించి ఎందరిచేతో గౌరవాన్ని పొంద కలుగుతున్నాను. నీవూ నాలా మారాలి. నీ సంకల్పం ఇప్పుడూ ఎలా వుండాలో తెలుసా అన్నయ్యా!..... నీకు మంచి అల్లుడు రావాలని దివ్య జీవితం ఆనందమయం కావాలని... వదినా నీవు దివ్య పిల్లా పాపలను చూచుకొంటూ....శేష జీవితాన్ని ఆనందంగా గడపాలనేదిగా వుండాలి."
"నాన్నా! అన్నయ్యా!... నేను మన కుటుంబ భవిష్యత్తు బాగుండాలని... వూర్లో.... చుట్టుప్రక్కల గ్రామాల్లో, సమాజంలో, మీకూ మంచి పేరు రావాలనే తాపత్రయంలో చేసిన తప్పులను దిద్దుకుంటూ మీకు నా ఉద్దేశాన్ని చెప్పాను. మనస్సు మార్చుకొని మంచి మనుషులుగా మారండి."
"టైమ్ అయ్యింది. నేను బయలుదేరాలి. వదినా టిఫిన్ పెడతావా!"
"రా నందూ!... రెడీ చేసి డైనింగు టేబుల్ మీద ఎప్పుడో వుంచాను" నవ్వుతూ చెప్పింది శాంతి.
నందాదేవి... దివ్య డైనింగు టేబుల్ వైపుకు నడిచారు.
"తాతయ్యా! నాన్నా!.... లేవండి టిఫిన్ తిందురుగాని" చెప్పింది దివ్య.
రాంబాబు నందాదేవిని పరీక్షగా చూచి.... కూతురు మటలను వినిపించుకోకుండా తన గదికి వెళ్ళిపోయాడు.
ఎనభై ఆరేళ్ళ సుబ్బారాయుడు సాలోచనగా తన గదివైపునకు నడిచాడు.
నందాదేవి... దివ్య డైనింగు టేబుల్ ముందున్న కుర్చీలలో కూర్చున్నారు. శాంతి ప్లేట్లను వారి ముందు ఉంచి ఇడ్లీలు పెట్టి చట్నీ సాంబార్ గిన్నెల్లో వేసి ప్రక్కన వుంచింది. నందాదేవి.... దివ్య తినడం ప్రారంభించారు.
"దివ్యా!..."
"ఏం అత్తా!..."
"నీవు ఎవరినైనా ప్రేమించావా!" చిరునవ్వుతో అడిగింది నందాదేవి.
దివ్య ఉలిక్కిపడి నందాదేవి ముఖంలోకి చూచి... ’లేదు’ అన్నట్టు తల ఆడించింది. మౌనంగా తినసాగింది.
"వదినా!.... పిల్ల మనస్సున ఎవరైనా వున్నారేమో కనుక్కో!" నవ్వుతూ మొదట శాంతి ముఖంలోకి తర్వాత దివ్య ముఖంలోకి చూసింది నందాదేవి.
"వదినా!... నేను తమాషాకు చెప్పలా... నేను వెళ్ళాక కనుక్కొని నాకు ఫోన్ చెయ్యి" చిరునవ్వుతో చెప్పింది నందాదేవి.
"అలాగే నందూ!"
"వదినా!"
"చెప్పమ్మా!"
"దివ్య చాలా మంచిది వదినా... నీలాగే... అది తన జీవితాంతం ఆనందంగా వుండాలి. ఆమె వివాహం... ఆమె ఇష్టానుసారంగా ఆమెకు బాగా నచ్చిన వ్యక్తితో జరిపించడం మన బాధ్యత."
’ఆ పిల్ల జీవితం నా జీవితంలా కాకూడదు’ మనస్సున అనుకొంది నందాదేవి.
"ఆ.... నీవేమంటావ్ వదినా!" మదిలోని భావాలను పక్కకు నెట్టి అడిగింది నందాదేవి…
"ఎవరైనా కోరుకొనేది... తమ బిడ్డల క్షేమాన్నే కదమ్మా! మా అత్తయ్యగారు నీ చిన్న వయస్సులో పోయిన కారణంగా..."
"ఆ.....ఆ.... ఆ గతాన్ని గురించిన ఆలోచన.... ఇప్పుడెందుకులే వదినా! నేను అంతా దైవ నిర్ణయం అనుకొన్నాను" నవ్వుతూ చెప్పింది నందాదేవి.
ఆ నవ్వు పైకి మాత్రమే.... మనస్సు.... గత జ్ఞాపకాలతో మూగదైపోయింది. లేచి వెళ్ళి చేతిని బేసిన్‍లో కడుక్కొని... వదిన అందించిన కాఫీ గ్లాసును అందుకొని... త్రాగి గ్లాసును టీపాయ్ మీద వుంచి లేచి....
"వదినా! నేను వెళ్ళి వస్తాను. నాన్నగారిని జాగ్రత్తగా చూచుకో!"
"అలాగే అమ్మా! నీవు జాగ్రత్త!"
నందాదేవి వెళ్ళి కార్లో కూర్చుంది. డ్రైవర్ కారు స్టార్ట్ చేశాడు.
"అమ్మా!.... అత్తయ్య చాలా మారిపోయింది కదూ!" నవ్వుతూ అడిగింది దివ్య.
"అవున్రా..." సంతోషంగా చెప్పింది శాంతి.
రామయోగి తల్లిదండ్రులు కాశీ క్షేత్రాన్ని దర్శించాలని యోగిని రెండు మూడు సార్లు అడిగారు. ’పోదాంలే అమ్మా... పోదాంలే’ అని చెబుతూ కాలాన్ని గడిపాడు.
ఆ రాత్రి భోంచేసే సమయంలో యోగి తల్లి అన్నపూర్ణమ్మ... తండ్రి సోమయాజులు కాశీ యాత్ర విషయాన్ని గురించి ప్రస్తావించారు.
"వయస్సు అవుతూ వుందిరా మాకు" అన్న తండ్రి మాటలకు యోగి వారిని కాశీ తీసుకొని వెళ్ళాలని నిర్ణయించుకొన్నాడు.
"నాన్నా! మనం తిరుమలరావు, అతని తల్లి, సత్యానందరావు మామయ్య గారి కుటుంబం అందరం కలిసి వెళదాము. పదిమంది కలిసి వెళితే అందులోని ఆనందమే వేరు. రేపు తిరుమలరావు మామయ్య సత్యానందరావు గార్లతో మాట్లాడుతాను. ప్రోగ్రాం ఫిక్స్ చేస్తాను. సరేనా!" అన్నాడు రామయోగి.
ఆ తల్లిదండ్రులకు ఎంతో ఆనందం కలిగింది. మరుదినం ఉదయం తిరుమలరావును వారి ఇంట కలిశాడు. కాఫీ గ్లాసును చేతికి అందించిన అన్నమ్మతో...
"పిన్నీ! అమ్మా నాన్నలు కాశీకి వెళ్ళాలనుకుంటున్నారు"
తిరుమలవైపు తిరిగి "అన్నా!.... అమ్మా నీవు మాతో వస్తారా! మీరు సతే అంటే సత్యానందరావు బాబాయిని కూడా అడుగుతాను. అందరం కలిసి వెళితే బాగుంటుందిగా! ఏమంటావ్ అన్నా!" అడిగాడూ రామయోగి.
"నాన్నా.... తిరుమలా!... మనం కూడా వెళదామా!" ప్రాధేయపూర్వకంగా అడిగింది అన్నమ్మ.
రామయోగి ఆలోచన తిరుమలరావుకు బాగా నచ్చింది. "సరే బాబయితో మాట్లాడి అందరం కలిసే వెళదాము. మీ బాబాయ్ ఒప్పుకుంటారా!" తన సందేహాన్ని వ్యక్తం చేసింది అన్నమ్మ.
"సరే... పదరా!.... బాబాయితో మాట్లాడుకుందాం"
ఇరువురూ సత్యానందరావు గారి ఇంటివైపుకు బయలుదేరారు. ఐదు నిముషాల్లో చేరారు.
సత్యానందరావు, నరేంద్ర వరండాలో కూర్చొని వ్యవసాయ విషయాలు మాట్లాడుకుంటున్నారు.
తిరుమలను రామయోగినీ చూచి చిరునవ్వుతో "రండి... రండి" అన్నాడు సత్యానందరావు.
ఇరువురూ వరండాలో ప్రవేశించారు. వారి ముఖభంగిమలను చూచిన సత్యానందరావుకు వారేదో ముఖ్యమైన విషయాన్ని తనతో మాట్లాడాలనుకొంటున్నారన్న విషయం వారికి అర్థం అయ్యింది.
"కూర్చోండి"
ఇరువురూ కూర్చున్నారు.
"చిన్నాన్నా! మీతో ఓ విషయం మాట్లాడాలని వచ్చాను" చెప్పాడు రామయోగి.
"ఏమిటి నీ పెళ్ళి విషయమా!" నవ్వాడు సత్యానందరావు.
"అదికాదు చిన్నాన్నా!"
"మరేమిటి?"
"అమ్మగారు కాశీ వెళ్ళాలని అడిగారు. తిరుమల అమ్మా నాన్నలు కూడా అదేమాట. కాబట్టి మీరు సరే అమ్టే మన మూడూ కుటుంబాల సభ్యులము అందరం కలిసి కాశీకి వెళ్ళి ఆ సర్వేశ్వరుని మాత అన్నపూర్ణమ్మను దర్శించి వద్దాం" చిరునవ్వుతో చెప్పాడు రామయోగి.
"ఓ... అలాగా!" సత్యానందరావుగారి జవాబు.
సావిత్రి.... వరండాలోకి వచ్చింది.
"అత్తయ్యా... మనం కాశీకి వెళుతున్నాము" చెప్పాడు తిరుమలరావు.
"ఆ... ఎప్పుడు...!" ఆశ్చర్యంతో అడిగింది సావిత్రి.
"ఆ విషయాన్ని మమయ్యగారు నిర్ణయించాలి"
"ఏమండీ! అందరం కలిసి ఆనందంగా కాశీకి వెళ్ళి వద్దామండీ!" నవ్వుతూ అడిగింది సావిత్రి.
జానకీ... వరండాలోనికి వచ్చి తన వదినగారి చివరి మాటలను విన్నది.
"అన్నయ్యా! మీరు అంగీకరించాలి. ఏమండీ మీరేమంటారు?" భర్య నరేంద్ర వైపు చూచి అడిగింది జానకి.
"నాదేముంది... బావ సరే అంటే నేను సరే!" నవ్వాడు నరేంద్ర.
"మామయ్యా! నా వర్గం బలపడింది. మీరు గ్రీన్ సిగ్నల్ ఇవ్వక తప్పదు" నవ్వుతూ చెప్పాడు తిరుమలరావు.
"కావ్యను ఏం చేద్దామురా!" అడిగాడు సత్యానందరావు.
"చిన్నాన్నా! కావ్యనూ మనతో తిసుకొని వెళదాం" యోగి జవాబు.
"ఆమెకు శలవు చిక్కుతుందో లేదో!"
"చిక్కుతుందిలే బాబాయ్! అవసరం అనిపిస్తే మీరు రామకృష్ణరావు గారితో ఓ మాట చెప్పండి పనైపోతుంది" నవ్వుతూ చెప్పాడు యోగి.
"పిన్నీ కావ్య ఇంట్లో లేదా!" అడిగాడు తిరుమలరావు.
"లేదు తిరూ! ఉదయాన్నే అర్జంటు పని వుందని వెళ్ళిపోయింది" జానకి జవాబు.
"మామయ్యా! నేనే కావ్యకు ఫోన్ చేస్తున్నా!"
"చెయ్యి"
"హలో!" నెంబర్ డయల్ చేసి అన్నాడు తిరుమలరావు.
"ఆ.... చెప్పు అన్నయ్యా!"
"మరేం లేదమ్మా! మనం అందరం కలిసి వారణాసి అదే కాశికి వెళుతున్నాము. ఓ వారంరోజులు నీకు శలవు దొరుకుతుందా!"
"ఎక్కడికి కాశీకా!" అడిగింది కావ్య.
"అవునమ్మా!"
"సరే!.... శలవు అప్లయి చేస్తాను. వెళదాం అన్నయ్యా!"
"ఓకే అమ్మా! ఇంటికి ఎప్పుడు వస్తావు?"
"ఆరున్నరకల్లా వస్తాను"
"నేను నీకు టికెట్ బుక్ చేస్తున్నా!"
"చెయ్యి ఎలా వెళుతున్నాము?"
"చెన్నై నుంచి ఫ్లయిట్‍లో వెళదాం"
"అలాగే"
"ఓకే అమ్మా జాగ్రత్తగా రా!"
"అలాగే అన్నయ్యా!"
కావ్య సెల్ కట్ చేసింది.
తిరుమలరావు స్పీకర్ ఆన్ చేసిన కారణంగా అందరూ కావ్య మాటలను వినగలిగారు.
"చిన్నాన్నా! లైన్ క్లియర్" నవ్వుతూ చెప్పాడు రామయోగి.
"సరే... టికెట్స్ బుక్ చెయ్యి"
"యోగీ! ఇప్పుడు నీకు ఆనందమేగా"
"అన్నా!.... చాలా.... చాలా..." సంతోషంగా నవ్వాడు యోగి.
"పిన్నీ.... అత్తయ్యా.... ఆనందమేగా!"
"యస్.... మై డియర్ తిరుమలా!" అంది జానకి నవ్వుతూ.
"నీవు ఏది తలచుకున్నా అది తప్పక జరుగుతుంది తిరూ!" సాలోచనగా చిరునవ్వుతో అంది సావిత్రి.
"మనస్సులో మరో కోరిక వుంది పిన్నీ!" అన్నాడు తిరుమల.
"అలాగా! అదీ తప్పక జరుగుతుంది" అంది జానకి.
"అదేందో తెలుసుకోకుండా!" అన్నాడు సత్యానందరావు.
"అది మనందరికి తెలిసిందే!" కూతురు ముఖంలోనికి చూస్తూ చిరునవ్వుతో అంది సావిత్రి.
"చిన్నాన్నా! ఇక నే వెళతను" చెప్పాడు రామయోగి.
"సరే నాన్నా!" చెప్పాడు సత్యానందరావు.
తిరుమలరావు రామయోగి వీధివైపునకు నడిచారు.
సావిత్రి... జానకి లోనికి వెళ్ళిపోయారు.
"బావా! మన కావ్య! వివాహ విషయంలో..."
"విన్నాను. నిన్న రాత్రి మీ మధ్యన జరిగిన సంభాషణను ఆమె నమ్మకమే ఆమెకు జయం" చిరునవ్వుతో చెప్పాడు సత్యానందరావు.
మౌనంగా తలాడించాడు నరేంద్ర....
========================================================================
ఇంకా వుంది..
========================================================================
సిహెచ్. సీఎస్. శర్మ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ సిహెచ్. సీఎస్. శర్మ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
రచయిత పరిచయం:
పేరు చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ.
కలంపేరు సి హెచ్ సి ఎస్ శర్మ.
బాల్యం, చదువు: జననం నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా గుంట పాలెం
విద్యాభ్యాసం: రొయ్యల పాలెం, బుచ్చి రెడ్డి పాలెం, నెల్లూరు
ఉద్యోగం: మద్రాసులో 2015 వరకు వివిధ కంపెనీలలో చీఫ్ జనరల్ మేనేజర్/టెక్నికల్ డైరెక్టర్ గా పదవి నిర్వహణ.
తరువాత హైదరాబాద్ మెగా ఇంజనీరింగ్ సంస్థలో చేరిక.
コメント