top of page

కాల వాహినిలో - పార్ట్ 3



'Kala Vahinilo - Part 3'  - New Telugu Web Series Written By Ch. C. S. Sarma   

Published In manatelugukathalu.com On 19/08/2024

'కాల వాహినిలో - పార్ట్ 3' తెలుగు ధారావాహిక 

రచన: సిహెచ్. సీఎస్. శర్మ

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్



జరిగిన కథ:

సత్యానందరావు ఆ గ్రామానికి పెద్ద. ఆయన చెల్లెలి కూతురు కావ్య. అయన అక్క కొడుకు తిరుమల.


గ్రామంలో అయన ప్రత్యర్థి రాంబాబు. రాంబాబు కూతురు దివ్య.పెద్దల మనస్పర్ధలతో సంబంధం లేకుండా దివ్య, కావ్య మంచి స్నేహితులుగా ఉంటారు.


ఇక కాల వాహినిలో.... పార్ట్ 3 చదవండి. 


సత్యానందరావు వరండాలో వాలు కుర్చీలో కూర్చొని కళ్ళు మూసుకొని వున్నారు. భార్య సావిత్రి కాఫీ గ్లాసుతో వరండాలోకి వచ్చింది. రావుగారి ముఖంలోకి చూచింది. వారి వదనంలో విచారం. అర్థాంగి కదా సావిత్రి విషయాన్ని గ్రహించింది. వారిని సమీపించింది.

"ఏమండీ!" మెల్లగా పిలిచింది.


సత్యానందరావు తొట్రుపాటుతో కళ్ళు తెరిచారు. భార్య ముఖంలోకి చూచారు. 

సావిత్రి నవ్వుతూ వారి ముఖంలోకి చూచింది. చికాకుతో.. మనోవ్యాకులతతో వున్నవారికి తమ ఇల్లాలి మృదుమధురమైన పలకరింపు.. చిరునవ్వు.. కొంత వూరటను కలిగిస్తుంది.


అందుకే అన్నారు పెద్దలు... భార్య.. ’కార్యేషు దాసి.. కరణేషు మంత్రి... భోజ్యేషు మాతా... శయనేషు రంభ...’ అని. అది అక్షర సత్యం. కానీ అలాంటి అనుకూలవతి, అభిమానవతి అయిన ఇల్లాలు లభ్యపడడం.. గొప్ప అదృష్టం అవుతుంది.


అందుకే అన్నాడు ఓ తమిళ్ మహాకవి... ’మనవి (భార్య) అమియదెల్లాం (కూడుట) ఇరవన్ (దేవుడు) కుడుత్తవరం (ఇచ్చినవరము)’.

రావుగారి మస్తిష్కంలో వున్న భావాల స్థానంలో సావిత్రి బొమ్మ నిలిచింది.


"కాఫీ!..." అందించింది సావిత్రి చిరునవ్వుతో..


రావుగారు గ్లాసును అందుకున్నారు. సిప్ చేశారు. 

"చక్కెర సరిపోయిందా!"


"కలిపింది ఎవరు?... నా రాణిగారు కదా!" కళ్ళు ఎగరేస్తూ నవ్వుతూ చెప్పాడు సత్యానందరావు.


"ఏమండీ!..."


"ఆ.."


"దేన్ని గురించో దీర్ఘంగా ఆలోచిస్తున్నట్లున్నారు?"


"అవును సావిత్రీ!.. మన జానకి నరేంద్రలను గురించి!... వారంరోజుల్లో వస్తామని వెళ్ళినవారు ఇంతవరకు రాలేదంటే!..."


"అక్కడి పరిస్థితుల నన్నింటినీ చక్కబరచుకొని స్థిమితంగా ఇక్కడ వుండేదానికి రావాలిగా!.. కొంత సమయం పట్టే విషయం కదా అండీ!.." అనునయంగా చెప్పింది సావిత్రి.


"ఆ...ఆ.. అవునవును.."


తిరుమల రావు వచ్చాడు..

"మామయ్యా! శుభోదయం! మామిడి తోటకు వెళదామా!"


"తిరుమలా! లోనికిరా! కాఫీ త్రాగి బయలుదేరుదువు గాని" రావుగారి చేతిలోని గ్లాసును అందుకొని సావిత్రి లోనికి నడిచింది.


"సరే పద.." తిరుమలరావు సావిత్రిని అనుసరించాడు. ఇరువురూ వంట ఇంట్లోకి ప్రవేశించారు.


"తిరుమలా! మీ మామయ్య జానకీ, నరేంద్రుల గురించి దిగులు పడుతున్నారురా! నీవు ఓసారి నరేంద్రతో ఫోనులో మాట్లాడరా!" అభ్యర్థనగా చెప్పింది సావిత్రి.


"అత్తయ్యా! మాట్లాడాను. తొంభైశాతం పనులు అయిపోయాయట. పదిరోజుల్లో వస్తారట."


"అలాగా!"


"అవునత్తా!"


"ఆ మాటను మీ మామయ్యతో చెప్పు..."


"చెప్పేవాణ్ణే!.. నీవు కాఫీ ఇస్తానన్నావుగా!.. నీ వెనకాలే వచ్చేశా!" నవ్వుతూ చెప్పాడు తిరుమలరావు.


"ఆయన ఎప్పుడూ ఒంటరిగా ఉండింది లేదు కదరా!... ఈ మధ్యన వారు..."


జానకి చేతిలోని కాఫీ గ్లాసును అందుకొని తిరుమల..

"అత్తయ్యా!.. నాకు అంతా తెలుసుగా!... ఐదేళ్ళుగా వారు పడే ఆవేదన నాకు తెలుసు. జానకితో మీరు ఇక్కడికి వచ్చి స్థిరపడండి అని చెప్పింది నేనే అత్తా" సావిత్రి ముగించకముందే చెప్పాడు తిరుమల.


"అలాగా!"


"అవును"


సావిత్రి ఆనందంగా నవ్వింది.


ఖాళీ గ్లాసును వంటతిన్నె మీద వుంచి తిరుమలరావు వెనకాలే సావిత్రి వరండాలోనికి వచ్చారు.

"మామయ్యా! మన జానకి వదిన.. నరేంద్ర అన్నయ్యలు పదిరోజుల్లో వస్తున్నారు. నిన్న అన్నయ్య ఫోన్ చేసి చెప్పారు"


"ఫోన్ చేసి చెప్పాడా!" ఆత్రంగా అడిగాడు సత్యానందరావు.


"అ...వు...ను" దీర్ఘం తీస్తూ... నాటక ఫక్కీలో చిరునవ్వుతో చెప్పాడు తిరుమల.


ఆమె చిరునవ్వుతో ’అవును’ అన్నట్లు తలాడించింది.


"సావిత్రీ! నేను తిరుమల మామిడి తోట వరకూ వెళ్ళి వస్తాము"


"వెళ్ళిరండి"


సత్యానందరావు ముందు, వెనకాల తిరుమలరావు వరండా మెట్లు దిగారు. సత్యానందరావు నడుస్తూనే వెనుతిరిగి సావిత్రి ముఖంలోనికి చూచారు.

"మంచిది" అంది సావిత్రి చిరునవ్వుతో..


మామా అల్లుడు వీధిలో ప్రవేశించారు. బులెట్‍పై ఇరువురూ పావుగంటలో మామిడి తోటకు చేరారు.

ఆ తోటలో ఓ దంపతులు కాపురం వున్నారు. అక్కడి చెట్లకన్నింటికీ పాదులు చేసి నీరుపెట్టి.. వాటి సంరక్షణ చేయడమే వారి బాధ్యత. అతని పేరు సోము. భార్య పేరు లక్ష్మి.


బులెట్ శబ్దం విన్న సోము పరుగున గేటును సమీపించి తెరిచాడు. నవ్వుతూ తిరుమలరావు లోనికి పోనిచ్చి.. అక్కడ ఓ ప్రక్కన వున్న పర్ణశాల ముందు ఆపాడు.

ఇరువురూ దిగారు.. పరుగున సోము వారిని సమీపించాడు.

"సోమూ! అంతా బాగున్నారా"


"ఆ.. అంతా... తమ దయ.."


"మామిడి చెట్లకు మందు కొట్టావా!"


"కొట్టానయ్యా!"


"ఈ ఏడు కాపు ఎలా వుంది?"


"పోయిన సంవత్సరం కన్నా బాగుందయ్యా! దిగుబడి బాగుంటదయ్యా!"


"నేను... తిరుమల అలా వెళ్ళి చెట్లను చూచి వస్తాం. నీవు నీ పని చూసుకో"


"అట్టాగేనయ్యా!"


సత్యానందరావు... ప్రక్కన తిరుమలరావు తోటలో మామిడిచెట్లు వున్న వైపుకు నడిచారు.

ఆ తోట వైశాల్యం ఎనిమిది ఎకరాలు. మూడు ఎకరాల్లో మామిడి, రెండు ఎకరాల్లో సపోటా, ఒక ఎకరంలో నిమ్మ, ఒక ఎకరంలో మల్లె, మిగతా ఎకరంలో కూరల మొక్కలు ఆయా ఋతువులను అనుసరించి పూస్తూ... కాస్తూ వుంటాయి.


సోమూకు ఒక కొడుకు, కూతురు. పది... ఎనిమిది ఏళ్ళ ప్రాయం. పిల్లవాడు పెద్ద. ఆ పిల్లలు సత్యానందరావు గారి తాతగారు కట్టిన హైస్కూల్లో చదువుతున్నారు.


సోమూకు సత్యానందరావు కుటుంబం అంటే ప్రాణం. అతని తండ్రి తిరుపాలు కూడా అదే కొలువు. ఆ తోటే అతనికి తెలిసిన ప్రపంచం. ఆవేశంలో నేరం చేసి జైలు పాలైనాడు. యావజ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తున్నాడు.


అన్ని చెట్లను చూచి చివరికి ఓ మామిడి చెట్టు కిందకు చేరి...

"తిరుమలా! ఇక్కడ కూర్చుందాం!" అన్నాడు సత్యానందరావు.


"అలాగే మామయ్యా!"


ఇరువురూ కూర్చున్నారు.

ఆ చెట్టు మొదలును తదేకంగా చూస్తున్న సత్యానందరావు గారి ముఖాన్ని కొన్ని క్షణాలు పరీక్షగా చూచి తిరుమలరావు..

"మామయ్యా! ఏంటి? ఆ మొదలును అలా చూస్తున్నారు?"


"తిరుమలా! ఈ చెట్టును మా తాతయ్యగారు నాటారు. దాదాపు యాభై మామిడి చెట్లు వున్నాయి. అన్నింటికంటే ఈ చెట్టు వయస్సు పెద్దది. దీని వయస్సు అరవై. నా వయస్సు అరవై ఎనిమిది. తల నెరిసింది. ముసలి తనం వచ్చేసింది. పుట్టాను... పెరిగాను.. వయస్సు వచ్చేసింది. ఏం సాధించాను? అని నన్ను నేను ప్రశ్నించుకుంటే తృప్తికరమైన జవాబు లేదు. ఈ జీవిత పయనం ఇంకా ఎన్నాళ్ళు సాగుతుందో!.. గడచిన జీవితం నాకు ఇచ్చింది అశాంతి... ఆవేదన.. నీకు కొన్ని విషయాలు తెలుసు.. కొన్ని తెలీవు.


ఈ చెట్టును నాటేనాటికి మా తాతయ్య కృష్ణారావు గారి వయస్సు నలభై ఐదు సంవత్సరాలు. నా వయస్సు అప్పటికి ఎనిమిది సంవత్సరాలు.


చెట్టును నాటి వారు నాతో చెప్పిన మాటలు "రేయ్! సత్యా!... మనం ఏ పని చేసినా అది మనకోసం అనే భావనలో చేయకూడదు. పదిమందికి ఉపయోగపడాలని ఆ దేవుడిని కోరుకోవాలి. సత్‍ భావాలకు ఆ దేవుని అనుగ్రహం.. విజయం తప్పక వుంటుంది. ఈ చెట్టును ఈ రోజు నేను నాటాను. దీని పండ్లను నేను తింటానో లేదో... నాకు తెలియదు. కానీ నీవు... అక్క... చెల్లీ. తమ్ముడు నీ భార్యా పిల్లలు తప్పక తింటారు. నాకు కావాల్సిందీ అదే నాన్నా!" నవ్వుతూ చెప్పారు.


"ఇక్కడికి వచ్చి తిరుగుతుంటే.. నాకు తాతయ్య మాటలు జ్ఞప్తికి వస్తాయి. నా మనో వ్యాకులత కొంతవరకు తీరుతుంది. భవిష్యత్తు మీద నమ్మకం... జీవితం మీద ఆశ కలుగుతాయి. అందుకే వారానికి రెండు మూడుసార్లు ఇక్కడికి వస్తాను.


నా గతంలో నా తాతగారి... తండ్రిగారి... తల్లిగారి మధుర జ్ఞాపకాలు ఎన్నో!!! వారి మాటలు నాకు వూరటను కలిగిస్తాయి.


ప్రతి వ్యక్తికీ తల్లి ప్రేమ చాలా అవసరం. ముఖ్యం. మనం ఎన్ని తప్పులు చేసినా మన్నించి మనకు మంచిమాటలు చెప్పి చక్కటి సంస్కారాన్ని నేర్పే తొలి గురువు అమ్మ... మన అమ్మ..


అలాంటి తల్లి. నా పది సంవత్సరాల ప్రాయంలో నాకు నావారికి దూరమైంది. ప్రసన సమయాన మగబిడ్డను కని మరణించింది. ఆ తమ్ముడూ మూడు మాసాల్లో ఆమె వెళ్ళిన చోటికే వెళ్ళిపోయాడు.

అమ్మలేదు... మా ఇంటిల్లిపాదికందరికీ ఎంతో ఆవేదన. తాతయ్య... నానమ్మలు తమ దుఃఖాన్ని దిగమ్రింగి అందరినీ అంటే అక్క మీ అమ్మను... నా చెల్లి కావ్య తల్లిని... నా సోదరుడు..."


చెప్పడం ఆపేశాడు సత్యానందం. వారి కళ్ళల్లో కన్నీరు.. కంఠం బొంగురుపోయింది. తమ్ముని జ్ఞాపకాలు వారిని ఎంతగానో కలవరపరిచాయి.


దీనంగా దిగులుగా సత్యానందరావు గారిని చూస్తూ వుండిపోయాడు తిరుమలరావు.

కళ్ళు మూసుకొని వున్న సత్యానందరావు కొన్ని నిముషాల తర్వాత... పై పంచతో కన్నీటిని ఒత్తుకొని..

"తిరుమలా! నా తమ్ముడు రఘునందన చాలా.. చాలా మంచివాడురా!" విచారంగా చెప్పాడు సత్యానందరావు.


"మామయ్యా!.. చిన మామయ్య ఎలాంటి వారో నాకు తెలీదా మామయ్యా!... మీరు శ్రీరాముడైతే.. వారు సాక్షాత్ లక్ష్మణుడే కదా!.. ఈ విషయం అందరికీ తెలిసిందే కదా మామయ్యా!" ఎంతో అనునయంగా చెప్పాడు తిరుమలరావు.


"అవును... వాడు మంచితనాన్ని తెలియని వారంటూ ఈ ప్రాంతంలో ఎవరూ లేరు... ముగ్గురు తప్ప"


"అందులో ఇరువురు సుబ్బారాయుడు... అతని కొడుకు రాంబాబు కదా మామయ్యా!... మరి మూడవ వ్యక్తి?"


"నందాదేవి"


"మామయ్యా!" ఆశ్చర్యంతో అడిగాడు తిరుమలరావు.


"అవును...తిరుమలా!" విచారంగా చెప్పాడు సత్యానందరావు.


"ఇది ఎంతోకాలంగా నా గుండెల్లో దాగి వున్న విషయం. ఈరోజు నీతో చెప్పాలనిపిస్తుంది" జిజ్ఞాసగా అన్నాడు సత్యానందరావు.


"చెప్పండి మామయ్యా!"


"ఆ నందాదేవి లేకుంటే...నా తమ్ముడు నాప్రక్కనే ఈనాటికీ.. రేపటికీ... నా జీవితాంతం నాకు తోడుగా వుండేవాడు."


"మామయ్యా! మీరు చెప్పింది!"


"నిజం తిరుమలా!" తిరుమల పూర్తిచేయకముందే జవాబు చెప్పాడు సత్యానందరావు.


"తిరుమలా! మనుష్యుల మధ్యన రాగద్వేషాలు, ప్రేమాభిమానాలు మనం కోరుకొన్న రీతిగా సంక్రమించవు. మనం తలిచేది ఒకటి. జరిగేది మరొకటి.. అప్పటికి నా వివాహం మీ అత్తయ్య సావిత్రితో జరిగి రెండు సంవత్సరాలు.


రఘునందన.. నందాదేవి ఒకే కాలేజీలో చదివేవారు. బి.ఏ ముగించి రఘునందన లా కాలేజీలో చేరాడు. నీలాగే వాడికి సత్యాన్ని, ధర్మాన్ని, న్యాయాన్ని, నీతిని, నిజాయితీలను కాపాడాలనే గొప్ప ఆశయం. అందుకే ఆ వృత్తిని ఎన్నుకొన్నాడు. బాగా చదివాడు. వుత్తీర్ణుడైనాడు.


విషయం తెలిసిన వారంరోజులకు సుబ్బారాయుడు మన ఇంటికి ఓ రోజు వచ్చాడు. మా నాన్న నారాయణరావు గారు వారి రాకను గమనించి ముందుకు నడిచి నమస్కరించి వారికి స్వాగతం పలికారు. ఇరువురూ వరండాలోకి వచ్చారు. "కూర్చోండి!" ఎంతో వినయంగా చెప్పారు.


సుబ్బారాయుడు గారు కూర్చున్నారు నవ్వుతూ..

"కృష్ణారావు గారు వున్నారా?"


"వున్నారండి"


"పిలుస్తారా!... వారితో మాట్లాడాలి!"


"అలాగేనండీ" చెప్పి నాన్నగారు ఇంట్లోకి వచ్చి తాతయ్యకు విషయాన్ని చెప్పారు. అంతా విన్న తాతయ్యగారు.. "వాడు ఎందుకు వచ్చాడురా!" సాలోచనగా స్వగతంలో అన్నారు. వరండా వైపుకు నడిచారు. నేను నాన్నగారు వారి వెనకాల వరండాలోకి వచ్చాము. 


సుబ్బారాయుడు కంటే మా తాతయ్య వయస్సులో పెద్ద. అప్పటికి వారి వయస్సు తొంభై సంవత్సరాలు.


రాయుడు మావూరి స్థానిక వంశీయుడు కాదు. ఐదు సంవత్సరాల క్రిందట పడమటి సీతారామపురం ప్రాంతం నుండి ఎత్తివచ్చిన కుటుంబం. ఇల్లు, భూములు కొనుక్కొని మీ గ్రామ వాసులుగా మారిపోయారు. అంతవరకూ మూడు నాలుగువందల ఇళ్ళు ఉన్న ఆ గ్రామంలో మా తాతయ్యగారి మాట వేదవాక్కు. ఎవరికి ఏ సమస్య ఏర్పడినా ఇరువర్గాల వారు మా ఇంటికి.. తాతగారి వద్దకు వచ్చి విషయాన్ని చెప్పుకునే వారు. 


ఇరువురి విన్నపాలను మనోభావాలను విని ధర్మబద్ధమైన సలహాలను వారికి చెప్పేవారు. వారు ఆత్మావలోకనంలో.. తమ తమ తప్పు ఒప్పులను గ్రహించి తాతగారి మాటలను గౌరవించి... చేతులు కలుపుకొని హితులుగా మారి ఆనందంగా వెళ్ళిపోయేవారు.


సుబ్బారాయుడుగారు గ్రామంలో చేరిన రెండు సంవత్సరాల్లో గ్రామవాసులను కొందరికి తనచతుర కుయుక్తి మాటతో తన వైపుకు త్రిప్పుకున్నారు. కారణం... మాఇంటికి.. తాతయ్య గారికి వున్న పేరు ప్రతిష్టల మీద వారికి ద్వేషం కలిగింది. తాతయ్య గారికి మించిన పేరు ప్రతిష్టలు తనకు సంక్రమించాలనుకొని నీచ చతురతను ఆ అమాయక ప్రజలపై ప్రయోగించాడు. కొందరు వారిని అనుసరించారు.


ఏకంగా వున్న గ్రామంలో రెండు వర్గాలు ఏర్పడ్డాయి. అది మంచిది కాదని ఎరిగిన తాతయ్యగారు సుబ్బారాయుడు గారిని పిలిపించి హితబోధ చేశారు. వారి మాటలు రాయుడిగారికి రుచించలేదు. వ్యంగ్యంగా నవ్వుతూ వెళ్ళిపోయారు. ఆ తర్వాత రెండు ఇండ్ల మధ్యన రాకపోకలు లేవు. అది జరిగి అప్పటికి రెండు సంవత్సరాలు అయ్యింది. అకస్మాత్తుగా మా యింటికి వచ్చిన రాయుడి గారి రాకకు అందరం ఆశ్చర్యపోయాము.


మన హైందవ సంప్రదాయం.. శత్రువు ఇంటికి వస్తే అతన్ని ఆత్మీయునిలా గౌరవించాలన్నది, తాతయ్యగారు పాటించారు.


"సుబ్బరాయుడు గారూ!.. అంతా కుశలమా!"చిరునవ్వుతో వారిని పలకరించారు.

గర్వి.. అహంకారి...కుర్చీలోంచి లేవలేదు. సంస్కారం రక్తంలో వుండాలి. మధ్యలో రావడం దుర్లభం.

వారి ఎదుటి కుర్చీలో తాతయ్య గారు కూర్చున్నారు. సుబ్బారాయుడు నవ్వుతూ చేతులు జోడించారు.


తాతయ్య ప్రతి నమస్కారం చేసి... "చెప్పండి... విషయం ఏమిటో!" ఎంతో ఆత్మీయతతో అడిగారు.

"మీతోటి ముఖ్య విషయం మాట్లాడాలని వచ్చాను"


"నిర్భయంగా చెప్పండి నాకు వీలైతే చేస్తాను"


"మీ చిన్నబ్బాయి రఘునందనకు మా అమ్మాయి నందాదేవికి వివాహం జరిపించాలని నా కోరిక!" ప్రాధేయపూర్వకంగా అడిగాడు సుబ్బారాయుడు.


తాతయ్యగారు వారి ముఖంలోకి చూచి వ్యంగ్యంగా నవ్వారు.

"చూడండి సుబ్బారాయుడు గారూ! తమరి ఇంటికి అల్లుడయ్యే అర్హత మా రఘునందనుడికి లేదు" సౌమ్యంగా చెప్పారు.


సుబ్బారాయుడు ఆశ్చర్యపోయాడు.

"మాకు అభ్యంతరం లేదు" మెల్లగా చెప్పాడు సుబ్బారాయుడు.


"మీకు లేకపోవచ్చు.. కానీ మాకుంది!" తాతయ్యగారి లేచి చేతులు జోడించారు.


దాని అర్థం ’తమరు ఇక బయలుదేరవచ్చు’ అని..


"మరోసారి ఆలోచించండి!" కుర్చీలోంచి లేస్తూ సుబ్బారాయుడు గారు అన్నారు.


"మాకు బాగా ఆలోచించే నిర్ణయం తీసుకునే అలవాటు సుబ్బారాయుడు గారూ!" చిరునవ్వుతో చెప్పారు తాతయ్య.


సుబ్బారాయుడికి అవమానంతో ముఖం చిన్నబోయింది. వరండా మెట్లు దిగి పదిఅడుగులు వేసి వెనుదిరిగి చూచాడు.


"నాపరాళ్ళు కాస్త ఎగుడు దిగుడుగా వున్నాయి. ముందుకు చూస్తూ.. జాగ్రత్తగా వెళ్ళండి రాయుడుగారు" సౌమ్యంగా చెప్పారు తాతయ్య కృష్ణారావు గారు.


సుబ్బారాయుడు గారు మమ్మల్ని చూపుతోనే భస్మం చేసేలా చూచి వెళ్ళిపోయాడు.

"నారాయణా! నేను ఏమైనా తప్పుగా మాట్లాడానా?" నాన్నగారి ముఖంలోకి చూస్తూ అడిగారు తాతయ్య.


"లేదు నాన్నా!" చిరునవ్వుతో నాన్నగారు జవాబిచ్చారు.


"తాతయ్య అంటుండేవారు...’ముందు తరం యోగ్యత ఇంటికి వచ్చిన కోడలి యొక్క తత్వం.. సంతానాన్ని సాకే విధానాలపై ఆధారపడి వుంటుందని’ స్వానుభవంలో తెలిసింది అది సత్యం అని..


అకారణంగా మా రెండు కుటుంబాల మధ్యన సఖ్యత సమసిపోయింది. సుబ్బారాయుడి కుటుంబ సభ్యులకు మా కుటుంబం పట్ల పగ, ద్వేషం పెరిగాయి. 


"తిరుమలా! జీవితం చాలా చిన్నది. ఆ కాలంలో స్వార్థంతో కాకుండా పరమార్థంతో సాటివారిని అభిమానించడం.. మనకు వున్నంతలో కొంత పేదవారికి దానం చేయడం, పదిమంది చేత మంచివాళ్ళు అనిపించుకోవాలనే మార్గంలో తాతయ్యా, నాన్నగారు నడిచారు. నేనూ అదే మార్గాన నడుస్తున్నాను. మీ చినమామయ్య మరణానికి కారకులెవరో తెలిసి కూడా నేను కేసు కోర్టును ఆశ్రయించలేదు. ఎవరు చేసిన పాపం వారు అనుభవించక తప్పదు.


ఆ తర్వాత.. నందాదేవి... మీ బావ చంద్రశేఖర్‍పై మోపిన నింద... అది విని నేను నిజం అని నమ్మి వాణ్ణి అసహ్యించుకున్న తీరు, నీకు తెలిసిందే.. వాడి విషయంలో నేను ఆవేశంతో తప్పు చేశాను. దానికి ఫలితంగా వాడు గుర్తుకు వచ్చినప్పుడల్లా నేను నరకయాతన అనుభవిస్తున్నాను. శేష జీవితం ఎంతో నాకు తెలియదు.పోయే లోపల వాణ్ణి చూడగలనో లేదో తెలీదు. 


చచ్చేంత వరకు పగ… ప్రతీకారాలకు దూరంగా ప్రేమ… ఆదరణ… అభిమానాలకు దగ్గరగా బ్రతకాలనేదే నా వాంఛ. నానమ్మ, తాతయ్యలు చనిపోయి ఆరు ఏళ్ళు. నాన్నగారు పోయి నాలుగేళ్ళు అయ్యిందిగా. వారు పోయినప్పటినుంచి మనస్సున ఏకాకినై పోయాననే భావన. అందుకే నరేంద్ర, జానకి, కావ్యలను ఇక్కడి మన ఇంటికి రమ్మని కోరాను. నా చెల్లి జానకి, బావ నరేంద్ర సమ్మతించినందుకు ఎంతో సంతోషం.


రెండు సంవత్సరాల క్రిందట గతించిన మా బావగారు... మీ నాన్న.. శంకరరావు.. నాకు బావే కాదు. మంచి స్నేహితుడు... వారూ తన పని అయిపోయిందని వెళ్ళిపోయారు. ఇప్పుడు వారి స్థానంలో నాకు నీవు వున్నావు. నా చివరి వరకు నీవు నాతో ఇలాగే వుంటావా తిరుమలా!" దీనంగా అడిగాడు సత్యానందరావు.


"తప్పకుండా వుంటాను మామయ్యా!.. నాకు పెద్ద దిక్కు మీరే కదా మామయ్యా!.. నేను ఈనాడు ఈ స్థితిలో వున్నానంటే దానికి నా మానసిక గురువులు మీరే!"


"తిరుమలా! చాలా సంతోషం అయ్యా! కొడుకు పోయిన నాకు కొడుకు స్థానంలో నీవు వున్నావు. అది నాకు ఎంతో ఆనందం"


"మామయ్యా!"


"ఏం తిరుమలా!"


"బావ ఏదో ఒకరోజున తిరిగి వస్తాడని నాకు నమ్మకం మామయ్యా!" శూన్యంలోకి చూస్తూ కళ్ళు మూసుకొన్నాడు తిరుమల.


అతన్ని పరీక్షగా చూచాడు సత్యానందరావు.. కొన్ని క్షణాలు..

"నీ నోటి వాక్యం ఫలించాలి తిరుమలా!"


"తప్పక ఫలిస్తుంది మామయ్యా!"


ఆనందంగా తన కుడి చేతిని తిరుమల శిరస్సుపై వుంచాడు సత్యానందరావు.

సోము రెండు టెంకాయలను తీసుకొని వచ్చి వారికి అందించాడు. ఇరువురూ ఆ నీటిని త్రాగారు. పైకి లేచారు.. సోమూకు చెప్పి బులెట్‍పై వూరి వైపుకు బయలుదేరారు.

========================================================================

ఇంకా వుంది..

కాల వాహినిలో - పార్ట్ 4 త్వరలో

========================================================================

సిహెచ్. సీఎస్. శర్మ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ సిహెచ్. సీఎస్. శర్మ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 


విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

రచయిత పరిచయం:

 పేరు చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ.

 కలంపేరు సి హెచ్ సి ఎస్ శర్మ.

 బాల్యం, చదువు: జననం నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా గుంట పాలెం

విద్యాభ్యాసం: రొయ్యల పాలెం, బుచ్చి రెడ్డి పాలెం, నెల్లూరు

ఉద్యోగం: మద్రాసులో 2015 వరకు వివిధ కంపెనీలలో చీఫ్ జనరల్ మేనేజర్/టెక్నికల్ డైరెక్టర్ గా పదవి నిర్వహణ.

తరువాత హైదరాబాద్ మెగా ఇంజనీరింగ్ సంస్థలో చేరిక.


26 views0 comments

Comments


bottom of page