top of page

కాల వాహినిలో - పార్ట్ 2



'Kala Vahinilo - Part 2'  - New Telugu Web Series Written By Ch. C. S. Sarma   

Published In manatelugukathalu.com On 14/08/2024

'కాల వాహినిలో - పార్ట్ 2' తెలుగు ధారావాహిక

రచన: సిహెచ్. సీఎస్. శర్మ

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్



జరిగిన కథ:

సత్యానందరావు ఆ గ్రామానికి పెద్ద. 

ఆయన చెల్లెలి కూతురు కావ్య. 

అయన అక్క కొడుకు తిరుమల.

గ్రామంలో అయన ప్రత్యర్థి రాంబాబు.

రాంబాబు కూతురు దివ్య.

ఇక కాల వాహినిలో.... పార్ట్ 2 చదవండి. 


డి.ఐ.జి ఆఫీసులో మీటింగ్ ముగించుకొని ఎ.ఎస్.పి కావ్య జీప్‍లో తిరిగి వస్తూవుంది. తాను జీప్ నడుపుతూ వుంది. డ్రైవర్ హిమామ్ వెనుక సీట్లో కూర్చుని వున్నాడు. హైవే.. యం.ఆర్.ఓ దివ్య కారు... కావ్య కారు కంటే ముందు వెళుతూ వుంది. ఆ కారు దివ్యదని గ్రహించింది కావ్య.

కారు నడపటం వచ్చిన దగ్గరనుంచీ.. తనకంటే ముందుపోయే కారును క్రాస్ చేయడం కావ్యకు.. సరదా.. వేగాన్ని పెంచింది.


ఆకాశం మేఘావృతమయింది. చీకటి అలుముకుంది. ఉరుములు.. మెరుపులు.. వర్షం ప్రారంభమయింది. కావ్య కారు దివ్య కారును సమీపించింది. ఆ ప్రదేశాన్నించి వూరు ఆరు కిలోమీటర్లు.


దివ్య కారు ఆగిపోయింది. రీస్టార్ట్ చేసింది. ప్రయత్నం ఫలించలేదు. డ్రైవరు సోము ఆ రోజు పనికి రాలేదు. దిగాలుపడి రోడ్డు వైపు చూచింది.


సరిగ్గా ఆ సమయానికి కావ్య కారు ఆ కారువద్దకు చేరింది. యదార్థం చెప్పాలంటే ఆ వూరిలో రెండు పార్టీలు.. ఒక పార్టీ నాయకుడు సత్యానందరావు.. మరో పార్టీ నాయకుడూ దివ్య తండ్రి రాంబాబు. మూడు తరాలుగా ఆ రెండు కుటుంబాల మధ్యన వైరం.. ఈ ఇంటి కాకి ఆ ఇంటిమీద వాలదు. వాటికీ భయమే!.. కావ్య, దివ్యలది మూడవతరం.. ఇరువురూ ఆరుమాసాల వ్యత్యాసంతో సమ వయస్కులే అని చెప్పాలి. కావ్య పెద్దది.


వీరిరువురూ ఒకే ప్రాథమిక పాఠశాలలో చదువుకొన్నారు. అలాగే హైస్కూలు... కుటుంబాల మధ్యన వున్న బేధ భావాలతో వీరూ చనువుగా వుండేవారు కాదు కుటుంబ పెద్దలకు భయపడి..

కానీ వీరిరువురికి ఒకరిపట్ల ఒకరికి అభిమానం.. టెన్త్ పరీక్షలు వ్రాసిన తర్వాత... ఆ స్కూలు అధ్యాపకులు.. ఆడ మగ పిల్లలతో తమిళనాడున ఉన్న కాంచీపురం... మహాబలిపురం.. విహారయాత్రకు బయలుదేరారు. ఆ సమయంలో కావ్యకు దివ్య చేరువై ఆమె ప్రక్కనే బస్సులో కూర్చుంది.


"అక్కా!..." నవ్వుతూ పలుకరించింది దివ్య. "అమ్మ చెప్పింది నీవు నాకన్నా ఆరునెలలు పెద్దదానివట..." అంది.


"ఏమో.. ఆ విషయం నాకు తెలియదు. కానీ నీవంటే నాకు ఇష్టం. మన రెండు కుటుంబాలు కలిసిమెలసి వుండకపోయిన కారణంగా నేను నీతో మాట్లాడేదాన్ని కాను. నాకు గర్వం అనుకున్నావా!" చిరునవ్వుతో అడిగింది కావ్య.


"లేదు.. కారణం నాకూ తెలుసుగా!... నీవంటే నాకు ఎంతో అభిమానం అక్కా!.."


"ఈ రెండురోజులు మనం హాయిగా కలిసి మెలసి కబుర్లుతో ఆనందంగా కాలం గడుపుదాం.. ఇక్కడ మనలను ఎవరూ చూడరుగా!"... ప్రీతిగా చెప్పింది కావ్య.


"అలాగే అక్కా!" సంతోషంగా చెప్పింది దివ్య.


ఆ గతస్మృతులను గుర్తుచేసుకొంటూ కావ్య..

"దివ్యా!.. నీ కారుకేమయింది?" అడిగింది.


"ఆగిపోయిందక్కా!..."


"డ్రైవర్!..."


"ఈరోజు డ్యూటీకి రాలేదక్కా!" విచారంగా చెప్పింది దివ్య.


కురిసే వానను లెక్కచేయకుండా కావ్య కారు దిగింది.

ఆమె డ్రైవర్ కారు దిగాడు. ముగ్గురు కలిసి దివ్య కారును రోడ్డు పక్కకు నెట్టారు. దివ్య కారును లాక్ చేసింది.

"రా.. నా కార్లో పోదాం.." అంది కావ్య.


దివ్య.. కావ్య... వెనుక సీట్లో కూర్చున్నారు. డ్రైవర్ కారు స్టార్ట్ చేశాడు.

అతని పేరు హిమామ్.. సత్యానందరావు గారి ఇంట్లో పదిహేను సంవత్సరాలుగా పనిచేస్తున్నాడు. వారిరువురూ అతనికి చిన్న వయసు నుండి బాగా తెలుసు.

"కావ్యమ్మా!.. ఈ రకంగా మీరిరువురూ ఒకే కార్లో వూర్లో ప్రవేశిస్తే.."


"ఏం ఏమౌతుంది?" గద్దించినట్లు అడిగింది కావ్య.


"అది కాదమ్మా!.. ఎవరైనా ఈ విషయాన్ని రాంబాబు గారికి చెబితే!..." నీళ్ళు నమిలాడు హిమామ్.


"ఏం ఫర్వాలేదు. ఇదిగో చూడు ముందు వచ్చేది దివ్య ఇల్లేగా.. ఆమెను ఇంటి దగ్గర దించి... మనం... మన ఇంటికి పోదాం. సరేనా!.. ఈ జడివానలో ఆ పిల్లను హైవేలో విడిచి మనం మన వూరికి వెళితే... మామయ్యకు ఈ విషయం తెలిస్తే వారేమంటారో తెలుసా!.. మీరు మనుషులా లేక పశువులా అంటారు అవునా!..."


"అవునమ్మా!... ఆ మాట నిజమే. మిమ్మల్ని అనరు. నన్ను అంటారు..." భయంతో చెప్పాడు హిమామ్.


"ఆ...ఆ భయం వుందిగా!... వాన జోరు జాస్తి అయింది. ముందు మిట్టపల్లాలు చూచి.. జాగ్రత్తగా నడుపు" అంది కావ్య.


దివ్య.. కావ్య ముఖంలోకి కృతజ్ఞతా పూర్వకంగా చూచి నవ్వింది. 

"ఆ... చెప్పు దివ్యా!... ఎలా వుంది నీ ఉద్యోగం... నీవు చేరి సంవత్సరం అయింది కదూ!..."

"అవునక్కా.. నిన్నటికి వన్ ఇయర్ కంప్లీటెడ్..."


"రకరకాల మనుషులు భూమి విషయంలో వస్తూంటారు. పూర్వాపరాలు పరిశీలించి ధర్మప్రకారం... న్యాయం చెయ్యి.. జాగ్రత్త" నీతిమాటలు చెప్పింది కావ్య.


"అలాగే చేస్తున్నా అక్కా!.."


"మంచిపేరు తెచ్చుకోవాలి... స్ట్రిక్ట్ ఆఫీసరు అనిపించుకోవాలి.."


"అవునక్కా.. నా ఆశయం అదే!.." క్షణం తర్వాత.. "అక్కా.. నీ ఉద్యోగం ఎలా ఉంది?..."


"నేను ఏరికోరి ఏంచుకొన్న ప్రొఫెషన్ ఇది.. నాకు చాలా ఆనందంగా ఉంది.." తృప్తిగా నవ్వింది కావ్య.


వారి కారును తిరుమల కారు క్రాస్ చేసింది. వారిని చూచి కారును ఆపాడు తిరుమలరావు.

వర్షం ఆగి తూర పడుతూ వుంది.


అతన్ని చూచిన కావ్య కారు దిగింది. నవ్వుతూ తిరుమలరావు కావ్యను సమీపించాడు. దివ్య వచ్చి కావ్య పక్కన నిలబడింది.


"నీ పనిమీదనే వెళ్ళి తిరిగి వస్తున్నా!" చిరునవ్వుతో అన్నాడు తిరుమలరావు.


రామయోగి వారిని సమీపించి దివ్యను చూచి నవ్వుతూ..

"కావ్యా!.. వీరు... నీకు!.."


"హైవేలో దివ్య కారు ఫెయిల్ అయ్యింది. అందుకే నాతో వస్తూవుంది.."


"విషయం చెప్పావా?" కావ్య అడిగింది.


"నీ బర్తడే విషయం!.."


"రామయోగీ!..." కళ్ళు వురుముతూ అతని ముఖంలోకి చూచాడు తిరుమలరావు.


"అన్నా!.."


"ఆ.. దివ్యా... మాటల్లో మరిచిపోయాను. రేపు నా బర్తడే.. నీవు తప్పకుండా రావాలి. సరేనా!" చెప్పింది కావ్య.


"వస్తానక్కా!" నవ్వుతూ సంతోషంగా చెప్పింది దివ్య.


ఓరకంట తిరుమలరావు ముఖంలోకి కొంటెగా చూస్తూ..

ఆమె చూపులోని భావాన్ని కావ్య ’పోలీస్’ గ్రహించింది.


"సరే పదండి... వర్షం జాస్తవుతుందేమో!" అన్నాడు తిరుమలరావు క్షణంసేపు కావ్య ముఖంలోకి చూచి..

ఎవరి కారుల్లో వారు ఎక్కారు. రెండు కార్లు బయలుదేరారు.

పదినిముషాల్లో గ్రామంలో ప్రవేశించాయి.


"అన్నా!.. మన కావ్యకు దివ్యకు మంచి స్నేహం వున్నట్లుంది"


"అవునా!.."


"ఒకే వయస్సు.. ఒకే స్కూల్లో కలిసి చదువుకొన్నారు. చిన్ననాటి నుంచీ పరిచయం వుంది కదరా!.."


"నీవు నా చెత్త పాయింట్‍ను క్యాచ్ చేయలేదు!.."


"నీ చెత్త పాయింట్‍ను క్యాచ్ చేయాల్సిన అవసరం నాకు లేదు. నోరు మూసుకో!"


"అంటే నన్ను ఏమీ మాట్లాడ వద్దంటావా!"


"చెప్పింది అదే!.. మట్టిబుర్ర..."


దివ్య వాళ్ళ ఇంటిముందు కావ్య కారు ఆగింది. దివ్య కారు దిగింది. పనివాడు గొడుగు చేత్తో పట్టుకొని వీధి వాకిట వైపుకు పరిగెత్తాడు. వరండలో నిలబడివున్న రాంబాబు అతని భార్య కావ్య కారును గమనించారు. దివ్య వరండాలో ప్రవేశించింది. నౌకరు గొడుగును ముడిచాడు. దివ్య పరుగున తన గదికి వెళ్ళిపోయింది. ఆమె తల్లిదండ్రులు ఆశ్చర్యంగా ఆమెను చూస్తూ నిలబడిపోయారు.

తడిసిన డ్రెస్ విప్పేసి డ్రస్ చేసుకొని దివ్య తన గది నుంచి హాల్లోకి వచ్చింది. 

"నీ కారేమయింది.." అడిగాడు రాంబాబు.


"పది కిలోమీటర్ల దూరంలో హైవేలో చెడిపోయింది. ఆ సమయానికి కావ్య అక్కడికి వచ్చింది. తనే నన్ను మన ఇంటి దగ్గర దింపింది..." తల్లిని సమీపించింది దివ్య.


"కావ్య చాలా మంచి పిల్లమ్మా" అంది వసుధ.


కనురెప్పలు పైకెత్తి భార్య ముఖంలోకి చూచాడు కోపంగా రాంబాబు.

"అమ్మ చెప్పింది నిజం నాన్నా!..." చిరునవ్వుతో చెప్పింది దివ్య.


"నిజానిజాలను గురించి మీరు నాకు చెప్పవలసిన అవసరం లేదు. నాకు బాగా తెలుసు. ఇదిగో దివ్యా!.. ఒక మాటను గుర్తుంచుకో. ఆ కుటుంబానికి మన కుటుంబానికి వైరం.. స్నేహం పనికిరాదు.."


"మనిషి ఏదో సందర్భంలో ఆవేశంతో తప్పు చేయడం సహజం నాన్నా!... దాన్ని మనసులో వుంచుకొని జీవితాంతం సాధించడం... పగను పెంచుకోవడం.. మానవత్వం కాదు.."


"అంటే!.."


"మీ ధోరణి మార్చుకోండి అని.. అవును కదమ్మా!"


కూతురు దివ్య ముఖంలోకి చూసింది వసుధ..

"అవునమ్మా!... మనం మనుషులం కదమ్మా!.. మనుషులుగానే బ్రతకాలి.."


"చిన్నదానివైనా నిజం చెప్పావు తల్లీ.. చల్లగా నూరేళ్ళు వర్థిల్లు.."


భార్య ముఖంలోకి తీక్షణంగా చూచాడు రాంబాబు.

"నిజం నాన్నకు నిష్టూరంగానే వుంటుందమ్మా!.. ఆ... అమ్మా.. రేపు కావ్య అక్క పుట్టినరోజు. నన్ను రమ్మంది. నేను వెళతాను..."


"వెళ్ళకూడదు.." ఆవేశంగా అన్నాడు రాంబాబు.


"నాన్నా!.. నేను చిన్నపిల్లను కాను. యుక్తాయుక్త విచక్షణాజ్ఞానం నాకు వుంది. ఏది తగునో.. ఏది తగదో... నాకు తెలుసు. నేను వెళతాను."


రాంబాబు జవాబు కోసం ఎదురుచూడకుండా దివ్య తన గదికి వెళ్ళిపోయింది.

వసుధ భర్త ముఖంలోకి క్షణంసేపు చూచి ముసిముసి నవ్వులతో వంటగది వైపు వెళ్ళింది.

రాంబాబు నిట్టూర్చి... సాలోచనగా తన గదిలోనికి వెళ్ళిపోయాడు.

ఉదయం ఆరున్నరకల్లా తిరుమలరావు అతని తల్లి అన్నమ్మ.. సత్యానందరావు గారి ఇంటికి వచ్చారు.


కావ్య స్నానం చేసి కొత్తబట్టలు ధరించింది. మేనమామ సత్యానందరావు గారికి, అత్తయ్య సావిత్రికి.. తండ్రి నరేంద్ర.. తల్లి జానకి పాదాలు తాకి నమస్కరించింది. వారు ఆమెను హృదయపూర్వకంగా దీవించారు.తర్వాత... తిరుమలరావు తల్లి అన్నమ్మకు.. అతనికి నమస్కరించింది. అన్నమ్మ.. భుజాలు పట్టుకొని తన హృదయానికి హత్తుకొని..

"తల్లీ.. నిండుగ నూరేళ్ళు సర్వ సౌభాగ్యాలతో నిన్ను ఎంతో ప్రేమగా చూచుకొనే భర్తతో పండంటి బిడ్డలకు తల్లివై.. ఆనందంగా... దీర్ఘసుమంగళిగా వర్ధిల్లు తల్లీ!..." అంటూ హృదయపూర్వకంగా దీవించింది. 


అన్నమ్మ కావ్యకు పెద్దమ్మ.

అదే సమయానికి దివ్య.. రామయోగి వచ్చారు.

ఆమెను చూచి సత్యానందరావు.. సావిత్రి.. నరేంద్ర... జానకీలు ఆశ్చర్యపోయారు.


కావ్య వారిరువురికీ నవ్వుతూ స్వాగతం పలికింది. దివ్య కావ్య చేతిని తన చేతిలోకి తీసుకొని శుభాకాంక్షలు తెలియజేసింది.


తిరుమలరావు టేబుల్ పైన కేక్‍ను సిద్ధం చేశాడు. కావ్య కేక్‍ను కట్ చేసింది. ముందుగా తన మామయ్య సత్యానందరావుకు.. అత్తయ్య సావిత్రికి.. తల్లి... తండ్రికి కేక్ ముక్కను అందించింది. వారు కూడా కావ్యకు తినిపించారు. ఆ తర్వాత మిగతావారు అదే పని చేశారు.


అందరి హృదయాల్లో ఆనందం.. అందరూ కావ్యను మనస్ఫూర్తిగా దీవించారు.

దివ్య కావ్యకు... తనకోసం తండ్రి తెచ్చి ఇచ్చిన గోల్డ్ ఫ్రేమ్ వాచ్‍ని బహూకరించింది.

అందరూ ఆశ్చర్యపోయారు. 


తిరుమలరావు దివ్య ప్రక్కకు చేరి మెల్లగా..

"ఈ వాచ్‍ని ఎప్పుడు కొన్నావు?" అడిగాడు.


"మనస్సు వుంటే మార్గం వుంటుంది బావా" నవ్వుతూ చెప్పింది దివ్య.


చివరగా అన్న ’బావా’ అనే మాటను విని తిరుమలరావు దివ్యకు దూరంగా జరిగాడు. ఆ సుందర దృశ్యాన్ని కావ్య రామయోగి చూచారు. నవ్వుకొన్నారు. 


తర్వాత అందరూ శివాలయానికి వెళ్ళి శివ సహస్రనామాభిషేకాన్ని నిర్వర్తించి.. తీర్థ ప్రసాదాలను స్వీకరించి ఇంటికి తిరిగి వచ్చారు.


అందరూ కలిసి ఆనందంగా అల్పాహారాన్ని సేవించారు. సావిత్రి, అన్నమ్మ, జానకీలు మధ్యాహ్నం భోజనాలకు వంటపని ప్రారంభించారు. సత్యానందరావు నరేంద్ర.. పొలాల వైపుకు బయలుదేరారు.

దివ్య కావ్యను సమీపించింది.

"ఇక నేను ఇంటికి వెళతాను" అంది దివ్య.


"వుండకూడదా!"


"వద్దులే అక్కా!.. వెళతాను" క్షణం తర్వాత...

"మరోసారి వస్తాను. నాన్న ఇంట్లో లేరు కాబట్టి ఆనందంగా రాగలిగాను" అందంగా నవ్వుతూ చెప్పింది దివ్య.


"అర్థం అయింది దివ్య. వెళ్ళిరా. మనం తర్వాత ఫోన్‍లో మాట్లాడుకొందాం.." సాలోచనగా చెప్పింది కావ్య.


"సరే అక్కా.."


వంటగదిలోకి వెళ్ళి పెద్దలకు చెప్పి దివ్య ఇంటికి బయలుదేరింది.

"అన్నా.. మనమూ వెళ్ళి ఆఫీస్ పని చూచుకొని ఓ గంట తర్వాత రావొచ్చుగా!.." అడిగాడు రామయోగి.


"ఆ... సరే పద..." అన్నాడు తిరుమలరావు.


బయలుదేరిన దివ్య వారి మాటలను విన్నది. వరండాలోనే నిలబడిపోయింది.

తిరుమలరావు... రామయోగి కావ్యకు చెప్పి వరండాలోకి వచ్చారు.

దివ్య గొంతు సవరించింది.


తిరుమలరావు ఆమె వైపు చూచాడు. చిరునవ్వుతో దివ్య తలదించుకొంది. 

"అన్నా!... నీవు నడువు... అమ్మతో మాట చెప్పి వస్తాను" రామయోగి ఇంట్లోకి నడిచాడు.


తిరుమలరావు వరండా మెట్లు దిగాడు. దివ్య అతన్ని అనుసరించింది. నాలుగు అడుగులు వేసి వెనక్కి తిరిగి చూచింది.

టాటా చెబుతూ "బెస్ట్ ఆఫ్ లక్..." అంది కావ్య నవ్వుతూ..


ఆమెకు దివ్య అభిప్రాయం అర్థం అయ్యింది.

దివ్య వేగంగా నడిచి తిరుమలరావు ప్రక్కకు చేరింది.

"సార్!" నవ్వుతూ పిలిచింది దివ్య.


"ఏమిటి?"


"మీరు ఏదో కథ వ్రాస్తున్నారట!... నిజమేనా!"


"నీకు ఎవరు చెప్పారు?"


"రామయోగి అన్నయ్య!"


"రామయోగి నీకు అన్నయ్యా"


"మీరు బావ అయితే ఆయన అన్నేగా!" చిలిపిగా నవ్వింది దివ్య.


చురచురా చూచాడు తిరుమలరావు దివ్య ముఖంలోకి.

"బాగాలేదు!"


"ఏంది?"


"ఆ చూపు!" గలగలా నవ్వింది దివ్య.


"మాట్లాడకుండా నడు..."


"నడవను"


"నడవ్వా!"


"మాట్లాడకుండా నడవను"


"అంటే వాగుతూనే నడుస్తావా!"


"నా మాటలు నీకు వాగుడుగా వినిపిస్తున్నాయా!"


"సుశీలమ్మగారి గానంలా వినిపిస్తున్నాయా!"


"సుశీలమ్మగారి గానంలా వినిపిస్తున్నాయ్!" కసిగా చెప్పాడు తిరుమలరావు.

"నిజంగా!"


"ఏది?"


"ఇప్పుడు నీవన్నమాట"


"ఆ..." వెక్కిరింపుగా అన్నాడు తిరుమలరావు.


"అవును నీకు తెలీదుగా! నేను చాలా బాగా పాడుతాను. రమ్మంటావా మీ ఇంటికి ఓ మంచి పాట పాడి వినిపిస్తాను"


"వద్దు.. అదిగో నీ దారి"


"తప్పించుకోలేవు బావా!" నవ్వుతూ తలూపింది దివ్య.


తిరుమలరావు తన సందులో ప్రవేశించాడు. నవ్వుకొంటూ దివ్య తన ఇంటివైపుకు నడిచింది.


========================================================================

ఇంకా వుంది..

========================================================================

సిహెచ్. సీఎస్. శర్మ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ సిహెచ్. సీఎస్. శర్మ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 


విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

రచయిత పరిచయం:

 పేరు చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ.

 కలంపేరు సి హెచ్ సి ఎస్ శర్మ.

 బాల్యం, చదువు: జననం నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా గుంట పాలెం

విద్యాభ్యాసం: రొయ్యల పాలెం, బుచ్చి రెడ్డి పాలెం, నెల్లూరు

ఉద్యోగం: మద్రాసులో 2015 వరకు వివిధ కంపెనీలలో చీఫ్ జనరల్ మేనేజర్/టెక్నికల్ డైరెక్టర్ గా పదవి నిర్వహణ.

తరువాత హైదరాబాద్ మెగా ఇంజనీరింగ్ సంస్థలో చేరిక.


32 views0 comments

コメント


bottom of page