top of page

విశ్వాసం



'Viswasam' - New Telugu Story Written By Lakshmi Sarma Thrigulla

Published In manatelugukathalu.com On 14/08/2024

'విశ్వాసం' తెలుగు కథ

రచన: లక్ష్మీ శర్మ త్రిగుళ్ళ

(ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత)

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్



“అమ్మా.. నేను ఇకనుండి కాలేజి మానేస్తున్నాను నాకు కాలేజిలో పరువుపోతుంది, ” అంటూ రుసరుసలాడుతూ చేతిలో ఉన్న పుస్తకాలను విసిరివేసింది 

స్వాతి. 


“అయ్యో ఏమయింది చెల్లి .. ఎందుకు అంత కోపంమీద ఉన్నావు, ఎవరేమన్నా అన్నారా చెప్పు, వాడేవరైనా సరే మక్కెలు విరిచేస్తాను. నా చెల్లి జోలికి వచ్చినవాడేవరైనా చూస్తూ ఊరుకోను, ” చేతిలో సిగరేట్ పొగ వదులుతూ అన్నాడు స్వాతి అన్న సాగర్. 


“ఏమయింది ఎందుకిట్ల కోపంగున్నారు, ఏం జరిగిందో ఏమో.. చూడు స్వాతి, ఆడపిల్లకు చదువొద్దే అంటే విన్నావా, అందుకే నెత్తినోరు మొత్తకుని మీ నాన్నతో చెపితే వింటేనా, వయసొచ్చిన ఆడపిల్లకు పెళ్ళి చెయ్యమని చెపితే వింటాడా ఏమన్నా, ” అంటూ ముక్కను ఎగబీలుస్తూ వచ్చింది మంగమ్మ. 


“అబ్బా అమ్మా .. మొదలుపెట్టావా నీ దండకం, నాకేం జరగలేదు మీ ఆయన వల్లే నాకు కాలేజిలో తలకొట్టేసి నట్టవుతుంది, అందుకే నేను కాలేజి మానేసి నీలాగే ఇంట్లో గిన్నెలు కడుక్కుంటూ కూర్చుంటాను, ” తల్లిమీదకు గయ్యిన లేస్తూ అంది స్వాతి. 


“ఏందే నువ్వు మాట్లాడేది? మీ నాన్నకోసం నువ్వు కాలేజి మానేస్తవా, మీ నాన్న కాలేజి దగ్గరకు వచ్చిండా, వద్దయ్యా నువ్వు ఈ పని మానేయ్యమని చెబుతూనే ఉండా, నువ్వుండు మీ నాన్న రాని, నే అడుగుతా, ” బిడ్డ తల నిమురుతూ అంది మంగమ్మ. 


“పో అమ్మా నీకేం తెలియదు, ” అంది బుంగమూతిపెడుతూ. 


“అదికాదు చెల్లి, ఏమైందో చెప్పకుండా నువ్వు కోపగించుకుంటే ఎలా తెలుస్తుంది చెప్పు?” 


“ అదికాదన్నయ్యా .. నిన్న మా స్నేహితురాలు గుడికి వెళ్ళిందట, అక్కడ.. అక్కడ నాన్న అడుక్కోవడం చూసిందట, ఈ రోజు కాలేజిలో అందరి ముందు చెబుతుంటే నాకు తలకొట్టేసినట్టయింది తెలుసా, రేపటినుండి అందరు నన్ను ఎంత హేళన చేస్తారో.. అసలు వాళ్ళ ముఖాలు చూడాలంటేనే నాకు ఏడుపు వస్తుంది, ” చెబుతూనే బోరుమని ఏడ్చేసింది. 


“అంతే కాదురా స్వాతి, నాకు వచ్చే నెలలో గ్రాడ్యుయేషన్ ఉంది, అప్పుడు అందరి తల్లి తండ్రులను పిలుస్తారు. నేను మన అమ్మా నాన్నలను ఎలా పిలవాలో నాకు అర్థం కావడంలేదు. నాన్న గురించి అందరికి తెలిసిపోతుంది. నేను పదిమందిలో తలెత్తుకోగలనా? రేపు రేపు ఉద్యోగ ప్రయత్నం చేయ్యాలన్నా భయంగా ఉంది, నాన్న గురించి తెలిసిన వాళ్ళెవరు నాకు ఉద్యోగం ఇవ్వరు, ” సాగర్ బాధపడుతూ చెప్పాడు. 


“అయ్యో దీనికోసమా మీరింత బాధపడుతున్నారు, బిడ్డా.. మీ నాన్న.. నేను నీ కాలేజి ఫంక్షన్ కు రాకుండా ఉంటే సరిపోతుంది, నువ్వు ఇంటికి వచ్చినాక ఫోటోలు చూపెట్టు చాలు కొడుకా, ” అంది బాధపడుతూ. 


“నీకేం ఇంట్లో కూర్చొని నువ్వు బాగానే చెబుతావు, చదువు సంధ్యలుంటే తెలిసేది ఆ ఫంక్షన్ అంటే ఏంటో. ఛీ ఛీ.. మన పరిస్థితి ఎవ్వరికి రావద్దు. డబ్బుండగానే సరిపోతుందా,ఏ లోటు లేకుండా పెరిగాము. అనుకున్నవి అనుకున్నట్టు నెరవేరుతాయి, కాకపోతే నాన్నతోనే వచ్చింది చిక్కంత. కనీసం ఇప్పుడన్నా బయట తిరగకుండా ఇంటిపట్టున ఉండి ఉంటే మనకు ఎలాంటి బాధ ఉండేది కాదు. మీ నాన్న ఫలాన అంటే తల కొట్టేసినట్టవుతుంది, ” గయ్యిమని లేచాడు తల్లిమీదకు. 


“అమ్మా అసలు ఇలాంటి వాడిని ఎలా పెళ్ళి చేసుకున్నావే, లోకంలో మనుషులే కరువైనట్టు ఈయనే దొరికాడా నీకు, ” ముఖమంతా చేదు మాత్ర మింగినట్టు పెట్టుకుని తల్లిని అడిగింది. 


“ఏం చెపుతానే తల్లి నా బాధ.. ఆ కాలం ఆడపిల్లకు పెళ్ళి చెయ్యడమే గగనం, నాకు తల్లి తండ్రి లేరు. దిక్కులేని దాన్ని కదా.. అందుకే ఈయనకు కట్టబెట్టి చేతులు దులుపుకున్నారు మా అమ్మమ్మ వాళ్ళు. మీ నాన్నను పెళ్ళి చేసుకున్నప్పటి నుండి ఆయనతో బయటకు పోవాలంటేనే నామోషీగా ఉండేది. నేను ఎటు పోవాలన్నా ఒక్కదాన్నే పోయేదాన్ని. ఆయన వస్తానంటే నేను మానుకునే దాన్నీ. ఆయనను కాదంటే నాకు నిలువ నీడ ఉండదని తెలిసి ఎలాగోలా సర్ధుకుపోయాను. దేవుడి దయ వల్ల రత్నాలాంటి పిల్లలు.. మిమ్మల్ని చూసుకుని అన్ని మరిచిపోయాను. మీ నాన్నకు ఆ కుష్టి రోగం తప్పా మనిషి చాలా మంచివాడు. ఎవరికి కష్టం వచ్చిన ఆదుకునే మంచి మనసుందమ్మా ఆయనకు. మనం దేనికి కష్టపడకూడదని ఎండనక వాననక డబ్బు సంపాదిస్తున్నాడు, ”


“సరే నువ్వు చెప్పినవన్ని బాగానే ఉన్నాయి కానీ ! ఇప్పుడు మనకు చాలా డబ్బుంది కదా! ఇక బిచ్చపు బ్రతుకు మానేస్తే మా పరువు నిలబడుతుంది. రేపోమాపో నాకు మంచి ఉద్యోగం వస్తుంది. చెల్లి చదువైపోతే దానికి ఉద్యోగం వస్తుంది. ఇంకా ఆయన కష్టపడడం మానేయ్యమని చెప్పు, ” తల్లి మాటలకు అడ్డు వస్తూ అన్నాడు. 


“మనకున్న ఇళ్ళ కిరాయిలతోటే దర్జాగా బ్రతుకొచ్చు. నీ ఉద్యోగం నా ఉద్యోగం కోసం ఎదురు చూడవలసిన పనే లేదన్నయ్యా. అయినా ఆయన మొండితనం వదలడు. ఈరోజు రాని, వచ్చాక అటో ఇటో తెల్చుకుంటాను. తను ఈపని మానేస్తేనే నేనీ ఇంట్లో ఉంటాను. లేదంటే నావాటా నాకిచ్చేస్తే పోయి ఎక్కడైనా బ్రతుకుతాను, ” ఉక్రోషంగా అంది. 


“స్వాతి, అంతమాటనకే. మీరు ఇల్లు విడిచి వెళ్ళపోతే మాగతేం కాను.. రేపు మమ్మల్ని ఎవరు చూస్తారు.. నేను మీ నాన్నతో మాట్లాడి ఆయనను బయటకు రాకుండా చూస్తాను. మీ నాన్నతో గొడవకు దిగకండి. ఆయన కోపంలో ఏమంటాడో ఏమో, ” స్వాతిని బ్రతిమాలింది. 


ఇక సాయంత్రం వరకు ఎవరి గదుల్లో వాళ్ళే ఉన్నారు. తండ్రి వచ్చి ఆటో ఇటో తెల్చేవరకు కోపావేశాలు తగ్గేట్టుగా లేవు ఎవరిలో. 


మంగమ్మకు అటు మింగలేకా కక్కలేకా అన్నట్టుగా ఉంది పరిస్థితి. పిల్లలకు అసలు విషయం చెబితే నిజంగానే మమ్మల్ని విడిచి వెళ్ళిపోతారు. చెప్పకపోతే ఆయనేమో తనకు బతుకునిచ్చిన వృత్తిని మానుకోను అంటాడు. ఏమి చెయ్యాలో అర్థంకాక ఆలోచించి తలనొప్పితో పడుకుండి పోయింది. 


పొయ్యిలో పిల్లి లేవలేదు అందరి కడుపులో ఆకలి దంచుతుంది. మాంచి ఆకలిమీద వచ్చాడు రాజయ్య. 


“మంగా .. నాకు చాలా ఆకలిగా ఉంది అన్నం పెడతావా, ఈలోపల నేను స్నానం చేసి వస్తాను, ” అనుకుంటూ గబగబా స్నానం ముగించుకుని తెల్లటి లుంగి తెల్లటి బనియను వేసుకుని దొరలా వచ్చి, ‘ఇదేంటి ఇంట్లో ఎవరు లేనట్టుంది చప్పుడు లేదు లైటు కూడా వేసుకోలేదు’ అనుకుంటూ లైట్లన్ని వేసాడు. 


భర్త గొంతువిని లేచి వచ్చింది మంగమ్మ. 


“అయ్యో నా మతిమండిపోను.. పాపం ఆయన ఆకలితో వస్తాడని తెలిసి కూడా వంట చెయ్యలేదు” అనుకుంటూ గబగబా బియ్యంకడిగి స్టౌమీద పెట్టి భర్తకు ఎలా చెప్పాలా అని ఆలోచించసాగింది. 


“ ఏమిటే మంగా అట్లా బీరిపోయావేంటి? నీ కళ్ళేంటి అంతలా వాచిపోయాయి, లైటు కూడా వేసుకోకుండా ఇంట్లో ఏం చేస్తున్నావు? పిల్లలు రాలేదా ఇంకా, ఏమైంది మాట్లాడకుండా

అలా చూస్తున్నావు, ” పరధ్యానంగా చూస్తున్నా భార్యను చూస్తూ అడిగాడు రాజయ్య. 


“అదేం లేదయ్యా, తల నొప్పిగా ఉంటే పడుకున్నాను. పిల్లలు వాళ్ళ గదుల్లో ఉన్నట్టున్నారు. ఆకలేస్తుందేమో అడగడమే మర్చిపోయాను. ఉండండి వాళ్ళను పిలుస్తాను, ” అంటూ వెళ్ళబోయింది మంగమ్మ. 


“మంగా .. ఇలా చూడు నా వైపు. నువ్వు అబద్దం చెబుతున్నావని నీ కళ్ళను చూస్తేనే తెలుస్తుంది. చెప్పు నువ్వెందుకు బాధపడుతున్నావు.. నిన్ను ఎవరైనా ఏమైనా అన్నారా”


“మేము చెబుతాము నాన్న.. అమ్మ చెప్పదని తెలుసు, అన్నయ్యా నువ్వు చెబుతావా నేను చెప్పనా, ”ఆవేశం ఆపుకోవడం స్వాతి వల్ల కావడంలేదు. 


“చెల్లి .. నువ్వాగు. అమ్మ చెబుతానంది కదా, అమ్మా అలా చూస్తూ నిలుచుంటావేంటి.. నాన్నతో చెప్పు, ” తల్లివైపు చూస్తూ అన్నాడు సాగర్. 


“బాబు, మీ నాన్న ఆకలిమీద వచ్చాడు. అందరం తిన్న తరువాత నేను మీ నాన్నతో మాట్లాడుతాను. నేను చెప్పిన గదా, మీరన్నట్టే చేస్తాను, ” తండ్రి - పిల్లలకు ఎక్కడ గొడవైపోతుందోనని భయపడసాగింది మంగమ్మ. 


“ఏమిటి మంగా .. వాళ్ళేదో అడగాలంటున్నారు అడగని, ఎందుకు వాళ్ళను ఆపుతున్నావు? పరవాలేదు, తినుకుంటూ మాట్లాడుకుందాం రండి బాబు, ” ఆప్యాయత నిండిన స్వరంతో పిలిచాడు రాజయ్య. 


“అయ్యో ఏం లేదు. ముందు తినడం అయిన తరువాత నేను చెబుతాను, స్వాతి రా. తిన్న తరువాత నేను మీ నాన్నతో మాట్లాడుతాను, ” అంది కళ్ళల్లో భయం తొణికిసలాడుతుంటే. 


“అదేం కుదరదు ఇప్పుడే ఏదో ఒకటి తెలిపోవాలి, ” భీష్మించుకుని కూర్చుంది స్వాతి. 


“మంగా నువ్వుండు, నేను అమ్మాయితో మాట్లాడుతాను. అమ్మా స్వాతి, ఏంటో నాతో చెప్పు తల్లి.


“నువ్వేమనుకుంటున్నావో అడుగు, ” స్వాతి దగ్గరకు వచ్చి తల నిమురుతూ అడిగాడు. 


“మీరు మా పరువు తీయ్యడం ఆపుతారా లేదా? మీకు మీ వృత్తి కావాలనుకుంటే మా వాటా మాకు పంచివ్వు, నీకు దూరంగా వెళ్ళిపోయి హాయిగా బ్రతుకుతాము మేము నలుగురిలో తలెత్తుకోలేక పోతున్నాము, నీగురించి తెలిసిన వాళ్ళు మమ్మల్ని అడుగుతుంటే నాకు ఎంత నామోషీగా అనిపించిందో తెలుసా, మా స్నేహితులందరు నన్ను ఒక అంటరానిదానిలా చూస్తుంటే భరించుకోలేక చచ్చిపావాలనిపిస్తుంది, ” చెప్పింది స్వాతి ఏడుపు గొంతుతో. 


“ అవును నాన్న .. రేపు రేపు నాకు ఉద్యోగం వస్తుందన్న ఆశకూడా నాకు కనిపిస్తులేదు, ఎందుకంటే ఎక్కడికి వెళ్ళిన నా గురించి నా కుటుంబ నేపథ్యం గురించి అడుగుతారు, నేను మీ గురించి చెప్పాననుకోండి మెడపట్టి నన్ను బయటకు గెంటివేస్తారు, అప్పుడు నేను కూడా మీలాగే ఒక చిప్ప పట్టుకుని అడుక్కోవడం తప్పా ఇంకేం చెయ్యలేను, ” తండ్రివైపు కోపంగా చూస్తూ అన్నాడు సాగర్. 


ప్రశాంతంగా పిల్లల మాటలు విని చిరునవ్వుతో వాళ్ళ వైపు చూస్తున్న భర్తను చూసేసరికి మంగమ్మకు ఎక్కడలేని కోపం ముంచుకొచ్చింది. “ఏంటయ్యా పిల్లలు అంతగనం బాధపడుతుంటే నీకు నవ్వులాటగా ఉందా? ఇన్నేళ్ళ నుండి సంపాదిస్తున్నావు, మనకు కావలసిన దానికంటే పదింతలు డబ్బు కూడాబెట్టావు చాలదా, ఇప్పటికైనా ఆ బిచ్చమెత్తుకునే పద్ధతి మానేస్తే పిల్లలకు సంతోషం కదా! 


నేనంటే దిక్కుమొక్కులేని దాన్ని గనుక నీ మొగుడు బిచ్చగాడు కుష్టువాడు అన్నా భరించుకున్న ఇన్నాళ్ళు, ఇప్పుడు పిల్లలు పెద్ద పెద్ద చదువులు చదువుతున్నారు నలుగురిలో వాళ్ళ పరువేం కాను, తండ్రిగా ఆ మాత్రం ఆలోచించకపోతే ఎట్లా, అవున్లే కడుపున పుట్టిన బిడ్డలయితే

ఆలోచించేవాడివి, ” ఆవేశంతో అంటున్న మంగమ్మ టక్కున ఆపేసి పిల్లలవైపు చూసింది భయపడుతూ. తల్లి మాటలు అర్ధం కానట్టుగా చూస్తున్నారు వాళ్ళు. 


“మంగా .. ఇంక ఆపుతావా నీ వాగుడు .. ఏమన్నావు కడుపున పుట్టిన పిలలైతే ఆలోచించేవాడినా అని కదా!, ”


“ఏమయ్యా .. నేను ఏదో తొందరలో నోటికొచ్చింది అన్నాను, ”

 

“మంగా .. ఇంతదూరం వచ్చింది గనుక అసలు విషయం చెప్పకపోతే రేపు వీళ్ళ జీవితాలు బాగుపడకపోతే దానికి నేనే బాధ్యుడిని అవుతాను, ఏమ్మా .. నావలన నువ్వు నలుగురిలో తలెత్తుకోలేకపోతున్నానని కదా అన్నావు, అంటే చాటుగా నేను ఎలా సంపాదించానో తెలియక్కరలేదు కానీ, నీ తండ్రి ఒక బిచ్చగాడని తెలియకూడదు అవునా? నువ్వు కాలు కిందపెడితే ఎక్కడ మట్టంటుందోనని నీకోసం ఇంత పెద్ద బంగళా కట్టి తివాచి పరిచి దానిమీద నిన్ను నడిపించాను ఎందుకో తెలుసా, నిన్ను నా ఇంటి మహాలక్ష్మి అనుకున్నాను గనుక. నువ్వు దేనికి బాధపడకూడదని నీకోసం అహర్నిశలు కష్టపడాలనుకుని ఇంత డబ్బు సంపాదించాను. కానీ ఈరోజు మీ నాన్న రూపం నీకు మింగుడుపడడం లేదు, అవునా, ” కూతురివైపు చూస్తూ అడిగాడు. 


“ఏమయ్యా .. ఇప్పుడవన్నీ ఎందుకు నువ్వు ఇంటిపట్టున ఉంటే చాలంటున్నారు పిల్లలు, ” బాధతో అంది మంగమ్మ. 


“మంగా.. నువ్వు మాట్లాడకు ఇది నాకు వాళ్ళకు వచ్చిన సమస్య, ” గట్టిగా చెప్పాడు రాజయ్య భార్యతో. 


“ఏరా .. నిన్ను చదివించింది రేపు బిచ్చమెత్తుకోవడానికి అనుకున్నావా? చూడు పుట్టుకతోనే అందరు మేధావులు అయిపోరు, బడా బడా శ్రీమంతులందరు సక్రమంగా సంపాదించిన డబ్బుతోనే చదువుకున్నారనుకుంటున్నావా, ఏం వాళ్ళు ఆలోచించడం లేదా నీలాగా కుటుంబపరువు ఏమౌతుందోనని? ఎవరికి అన్యాయం చెయ్యకుండా న్యాయంగా నా చేతులగల కష్టం చేస్తూ నేను సంపాదించడం మీకు పరువుతక్కువగా కనిపిస్తుందా?


నన్ను మీలాగా చదివించేవారుంటే నాకు ఈ పరిస్థితి వచ్చేది కాదు. నాకు రోగం ఉందని తెలిసి మావాళ్ళు నన్ను రోడ్డున పడేసిననాడు నాకు కడుపు నింపింది ఈ వృత్తే. నన్ను కడుపున పెట్టుకుని చూసింది ఈ యాచననే. అదేలేకపోయింటే ఈరోజు మీరుండేవాళ్ళుకాదు నేనుండేవాడిని కాదు, ” చెప్పడం ఆపి భార్య వైపు చూసాడు. 


ఆమె అప్పటికే నోటికి కొంగు అడ్డుపెట్టుకుని కమిలిపోతుంది. అయిపోయింది పిల్లలు తమను విడిచి వెళ్ళిపోతారు అని. 


“అవును నాన్న, అదంతా గడిచిపోయినా కాలం. అది తలుచుకుంటూ ఇంకా నువ్వు కష్టపడవలసిన అవసరం లేదు, నువ్వు హాయిగా ఉండు, మేము సంపాదిస్తాము. కనీసం మాకు ఉద్యోగాలు పెళ్ళి అయ్యేవరకైనా నువ్వు ఈపని మానెయ్యి, ” అన్నది స్వాతి. 


“అంటే నేనీపని మానేస్తే మీరు పరువుగా ఉండగలరు అంటావు, అప్పుడు మీ నాన్న ఏం చేస్తుంటారు అని అడిగితే ఏం లేదు కుష్టురోగంతో తిని పడుకుంటాడు అని చెబుతావా? లేక మా నాన్ననే లేడు అని చెబుతావా, ” నవ్వుతూ అడిగాడు. 


“నాన్న, ఏమిటా మాటలు.. చదువు సంధ్యలు సంస్కారంలేని మీకు ఏం చెప్పినా అర్థంకాదు, ఇదంతా కాదు గానీ మా వాట మాకు పంచివ్వు, మేమెక్కడన్నా వెళ్ళిపోయి హాయిగా బ్రతుకుతాము. మీరెలాగు మారరని తెలుసు, ” ఉక్రోషంతో అన్నారు పిల్లలు. 


“అవునమ్మా నేను మీ అంత చదువుకోలేకపోయినా జీవితాన్ని బాగా చదివినవాడను గనుకనే మీరిద్దరు నాలాగా అనాథలు కావద్దనే మిమ్మల్ని నా బిడ్డలుగా పెంచాను, సంస్కారవంతుడిని అనుకునే మీకు మంచి భవిష్యత్తు ఇవ్వాలనుకున్నాను. అందుకు నాకు చేతనైన పని చేసి మిమ్మల్ని ఎంతో ఎత్తులో కూర్చోబెట్టాను చూడు, అందుకు నాకు చదువు సంధ్యలు లేవనే చెప్పావు. దిక్కులేని మీ అమ్మను చేరదీసి పేరుకే తాళికట్టిన భర్తగా ఉంటూ పిల్లల కోసం అలమటించే ఆమె కోసం రోడ్డునపడిన మిమ్మల్ని తీసుకవచ్చి మీ అమ్మను తల్లిని చేసిన నేను సంస్కారం లేని వాణ్ణి అవునా?


సంఘంలో నా పిల్లలు గొప్పవాళ్లు కావాలనే ప్రతి తండ్రి ఆశపడినట్టు నేను ఆశపడ్డాను. ఇంత డబ్బు ఉన్నా నా ఉనికికి కారణమైన నా జీవన విధానాన్ని నా విశ్వాసాన్ని నేను వదులుకోలేను. ఎన్నో ఆటుపోట్లు చవిచూసినా వాడిని మీరు నన్ను విడిచి వెళతానంటే సంతోషంగా వెళ్ళిపోవచ్చు. అహా మీరేం భయపడకండి. ఉత్తచేతులతో మిమ్మల్ని పంపించను. మీకు రావలసిన వాటాలు మీ అమ్మతో సహా రాసి పెట్టాను. నా జీవిత చరమాంకం వరకు నేనిలానే బ్రతుకుతాను, ” అంటూ గబగబాలేచి వెళ్ళి బీరువాలో దాచిన వీలునామా కాగితాలు తెచ్చి టేబుల్ మీదపెట్టాడు. 


“ నాన్నా.. మీరు చెబుతున్నది నిజమా! అమ్మా.. నాన్న చెప్పింది అబద్దమని చెప్పమ్మా, డబ్బులో పుట్టి పెరిగామన్న గర్వంతో మేమేం మాట్లాడుతున్నామో మాకు తెలియలేదు. నాన్న.. మంచి మనసుతో మీరు మమ్మల్ని చేరదియ్యకుంటే మేము ఏ అనాథాశ్రమంలోనో రోడ్డుపక్కన బిచ్చమెత్తుకుంటో బతికేవాళ్ళం. తలుచుకుంటేనే భయంగా ఉంది నాన్న, ఆ జీవితం. నాన్న మమ్మల్ని క్షమించండి. డబ్బు గర్వంతో మిమ్మల్ని అనరాని మాటలన్నాము, ” తండ్రి కాళ్ళమీదపడిపోయారిద్దరు. 


“వాళ్ళేకాదు నన్ను కూడా క్షమించవయ్యా నేను చాలా పెద్ద తప్పుచేసాను, నీ మనసు గుర్తించలేక కళ్ళుమూసుకపోయి నిన్ను చిన్నచూపు చూసాను, మాకు కావలసింది డబ్బే అనుకున్నాము కానీ ? ఆ డబ్బు సంపాదిస్తున్న మనిషికి ఒక మనసుంటుందని మాకోసం అహర్నిశలు కష్టపడుతున్నాడని తెలుసుకోలేకపోయాము, నాకు ఏ డబ్బు అవసరంలేదయ్యా నేను నీతోనే ఉంటాను నన్ను విడిచి వెళ్ళద్దు, ” అంటూ భర్త చేతులుపట్టుకుని బ్రతిమాలింది మంగమ్మ. 


“మంగా.. ఇన్నాళ్ళుగా మీరు నన్నర్ధం చేసుకుంటారని ఎదిరిచూసాను, మీకు నేను సంపాదించిన డబ్బు కావాలి కానీ నాతో పని లేదని తెలుసుకున్నాను, ఏ వృత్తితో ఇంతవాణ్ణి అయ్యానో ఈనాడు అదే మీకు తలవంపులుగా అవుతుందని అనుకోలేదు.


మీరు పరువుగా బ్రతకాలనుకున్నారు కదా అందుకే మీకు కావలసినంత డబ్బును ఇస్తున్నాను మీరు గొప్పగా బ్రతకాలన్నదే నా ఆశ, ” పిల్లల తలనిమురుతూ చెప్పాడు. 


“నాన్న.. మాకే డబ్బొద్దు మిమ్మల్ని విడిచి మేమెక్కడికి వెళ్ళము, మేము మీతోనే ఉంటాము కావాలంటే మేము మీతో వస్తాము నాన్న, మమ్మల్ని వేరు చెయ్యొద్దు అమ్మా మీరు అందరం కలిసే ఉందాము, ” తండ్రిని ప్రాధేయపడుతూ అడిగారు. 


“ఏమ్మా .. మీరు నాతో వస్తారా? అంటే మీరు నాలాగా ఈ వృత్తిని చేస్తారా? తప్పమ్మా, అలాంటి మాటలు మీ నోటితో రావద్దు, ఏ జన్మబంధమో మనమందరం ఒకే గూటిలో చేరాము. కడుపున పుట్టిన పిల్లలు కాకపోయినా మిమ్మల్ని కన్నతండ్రిగా చూసుకున్నాను. మీరు కష్టపడుతుంటే ఈ తండ్రి భరించుకోగలడా ! మీ తప్పు మీరు తెలుసుకున్నారు నాకది చాలు, మనందరం కలిసే ఉందాము సరేనా.. ఏమంటావు మంగా, నీకు ఇష్టమేనా, ” అడిగాడు భార్యవైపు చూస్తూ. 


“ఏమయ్యా! నీకు ఇంకా నామీద అనుమానంగానే ఉందా? ఇన్నాళ్ళు ఎంత తప్పు చేసానో ఇప్పుడు తెలిసింది, ఇక నుండి నీ భార్యగా సంతోషపెడతాను నిన్ను నా ప్రాణంగా

చూసుకుంటానయ్యా, ” అంది అతని కాళ్ళదగ్గర కూర్చుంటూ. 


“మంగా .. ఇంత అపూరపమైనా వరం ఇచ్చిన ఆ దేవుడికి మనసారా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను, అమ్మా స్వాతి .. బాబు సాగర్! ఇకనుండి మీ నాన్న మీకు తలవంపులు రాకుండా చూసుకుంటాడు, మీరు గొప్పవాళ్లు కావడమే నాకోరిక, ” అంటూ పిల్లలను దగ్గరకు తీసుకున్నాడు ఆప్యాయంగా. రెక్కలురాని పక్షుల్లా తండ్రి హృదయంలో తలదాచుకున్నారు ఇద్దరు. 


******* ********** ********** **********


లక్ష్మీ శర్మ త్రిగుళ్ళ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ లక్ష్మీ శర్మ త్రిగుళ్ళ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం


విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత్రి పరిచయం : లక్ష్మి శర్మ త్రిగుళ్ళ

నా గురించి కొన్ని విషయాలు ప్రస్తావిస్తాను, నేను సికింద్రాబాద్ లాలాపేటలో వుంటాను,

నాకు చిన్నప్పటి నుండి కథలు రాయడంమన్న చదవడంమన్న చాలా ఇష్టం, 1991 నుండి రాయడం మొదలుపెట్టాను, ఎక్కడ ఏ పేపర్ కనిపించినా రాసాను, కానీ ఎవరికి చూపలేదు చెప్పుకోలేదు, ఈమధ్యనే మా అమ్మాయిలు మావారు చూసి కథలు బాగున్నాయి కదా ఏదైనా పత్రికకు పంపమంటే పంపంస్తున్నాను, కర్నూలు గణేశ్ పత్రిక లో నేను రాసిన కవితలు కథలు చాలా వచ్చాయి.ఈ మధ్యలో నేను రాసిన కథలన్నీ ( మబ్బులు వీడిన ఆకాశం ) అనే కథల సంపుటి వచ్చింది, (కిన్నెర ఆర్ట్ పబ్లికేషన్స్) వారిచేత.


ఇంకా ముఖ్యంగా, (మన తెలుగు కథలు కామ్) యాజమాన్యం వారి ప్రోత్సాహం , నాకు ప్రశంసా పత్రాలు ఇవ్వడంతో నాలో ఇంకా ఉత్సాహం పెరిగింది.

 

మీకు చాలా కృతజ్ఞతలు తెలుపుతూ,

లక్ష్మి శర్మ

లాలాపేట సికింద్రాబాద్

30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత్రి బిరుదు పొందారు. 







 




 


















 


51 views3 comments

3 Comments


@lakshmiitrigulla5835

• 2 days ago

Thank you swapna and sowmya

Like


@swapnaj8931

• 2 days ago

Chaala bagundi attayya

Like

@sowmyakoride9848

• 3 days ago

Super attaya

Like
bottom of page