top of page

కాల వాహినిలో - పార్ట్ 4



'Kala Vahinilo - Part 4'  - New Telugu Web Series Written By Ch. C. S. Sarma   

Published In manatelugukathalu.com On 24/08/2024

'కాల వాహినిలో - పార్ట్ 4' తెలుగు ధారావాహిక 

రచన: సిహెచ్. సీఎస్. శర్మ

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్



జరిగిన కథ:

సత్యానందరావు ఆ గ్రామానికి పెద్ద. ఆయన చెల్లెలి కూతురు కావ్య. అయన అక్క కొడుకు తిరుమల.


గ్రామంలో అయన ప్రత్యర్థి రాంబాబు. రాంబాబు కూతురు దివ్య.పెద్దల మనస్పర్ధలతో సంబంధం లేకుండా దివ్య, కావ్య మంచి స్నేహితులుగా ఉంటారు. ఇల్లు వదిలి వెళ్లిపోయిన చంద్రం తప్పకుండా వస్తాడని అనుకుంటారు తిరుమల, కావ్య.


ఇక కాల వాహినిలో.... పార్ట్ 4 చదవండి. 


తిరుమలరావు తన గదిలో ప్రవేశించాడు. తాను రాస్తున్న మావూరి కథలోని ప్రధాన విలన్ పాత్ర సుబ్బారాయుడి కథను వ్రాయడం విడిచిన దగ్గరనుంచి ప్రారంభించాడు.


రామయోగి లోనికి వచ్చాడు. తదేకంగా దీక్షతో వ్రాస్తున్న తిరుమలను చూచాడు. అతనికి భంగం కలిగించకుండా మౌనంగా ఎదుటి కుర్చీలో కూర్చున్నాడు. వ్రాయడం ఆపి తిరుమలరావు అతని ముఖంలోకి చూచాడు.

"ఏరా! చాలా మౌనంగా కూర్చున్నావ్?"


"నీవు చాలా సీరియస్‍గా వ్రాస్తున్నావుగా!"


"అయిపోయింది"


"ఏమైపోయింది అన్నా!"


"సుబ్బారాయుడి గారి కథ"


"మరి సత్యానందరావు బాబాయిగారి కథ"


"వారిది ఎప్పుడో వ్రాశాను" ఆనందంగా చెప్పాడు తిరుమలరావు.


"అన్నా!.. రాయుడు.. కథానాయకుడా?"


తిరుమల నవ్వాడు.

"యోగీ! మనవూరి కథకు వారే కదరా మెయిన్ విలన్!"


"అవునవును ఆ మాట నిజమే!"


"నేను వ్రాసిందంతా నిజమే!"


"ఈ నవల వ్రాయడంలో నీ ఉద్దేశ్యం!"


"వాడగాని.. వూరు గాని అందరూ పరస్పరం స్నేహభావంతో హితులుగా కలిసి కట్టుగా వుండాలనేదే నా అభిప్రాయం. పూర్వం అలా వుండేదట. స్వాతంత్ర్యం వచ్చి డెభ్భై మూడు సంవత్సరాలైంది. గ్రామాల్లో ఐక్యత నశించింది. కక్షలు, కార్పణ్యాలు పెరిగాయి. మనవూరి కథ నీకు తెలిసిందే. వాటిని నిర్మూలనం చేయాలన్నదే నా సంకల్పం. ఈ నవలను పూర్తిచేసి మన జిల్లాలోని అన్ని గ్రామాల లైబ్రరీలలో ఉండేలా చూస్తాను. ఆయా గ్రామ యువతీ యువకులను కలిసి.. నా అభిప్రాయన్ని వారికి తెలుపుతాను. వారిలో చైతన్యాన్ని కలిగిస్తాను" తన నిశ్చితాభిప్రాయాన్ని చెప్పాడు తిరుమలరావు.


"ఆ కథలో మన చంద్రం పాత్ర రాదా అన్నా!" సందేహంతో అడిగాడు రామయోగి.


తిరుమలరావు వెంటనే జవాబు చెప్పలేకపోయాడు. 

అతని వదనంలో విచారం.. కళ్ళు మూసుకున్నాడు.

తిరుమల స్థితిని చూచి.. ’చ్రందాన్ని గుర్తుచేసి తప్పు చేశాను. అన్న బాధపడుతున్నాడు’ అనుకొని తలదించుకొన్నాడు రామయోగి.


కావ్య.. వచ్చి ద్వారం దగ్గర నిలబడి గొంతు సవరించింది.

యోగి.. తిరుమలరావులు ఆమెను చూచారు. అందంగా నవ్వుతూ నిలబడి వుంది కావ్య.

"రా కావ్యా!" చెప్పాడు తిరుమలరావు.


"కూర్చో!" అన్నాడు రామయోగి.


కావ్య కుర్చీలో కూర్చుంది. కాంతిరహితంగా వున్న వారిరువురి ముఖాలను పరీక్షగా చూచింది.

"దేన్ని గురించి మీ ఆలోచన!" అడిగింది కావ్య.


"చంద్రాన్ని గురించి" మెల్లగా చెప్పాడు తిరుమలరావు.


ఆ పేరు వినగానే కావ్య ముఖంలో విచారం.. ఆమె పెదవులు ’బా...వ...’ అనే అక్షరాలను అస్పష్టంగా పలికాయి.


కిటికీగుండా శూన్యంలోకి చూచింది.

ఆమె కళ్ళల్లో కన్నీరు..

తిరుమలరావు.. రామయోగి ఆమె ముఖంలోని మార్పును చూచి ఒకరి ముఖాలు ఒకరు చూచుకొన్నారు విచారంగా. కొన్ని క్షణాలు వారి మధ్య మౌనంగా గడిచిపోయాయి. పవిటతో కన్నీటిని తుడుచుకుంది కావ్య. చిరునవ్వును పెదాలపైకి తెచ్చుకొంది.


"అన్నా!.."


తొట్రుపాటుతో తిరుమలరావు కావ్య ముఖంలోకి చూచాడు.

"బావ త్వరలో తప్పక వస్తాడు" నిశ్చిల చిత్తంతో చెప్పింది కావ్య. ఆ మాటలు చెప్పేటప్పుడు ఆమె కళ్ళల్లో వింత కాంతి.. తిరుమలరావు రామయోగి గమనించారు.


"నాకు ఆ నమ్మకం వుంది అన్నయ్యా!" తన నిశ్చితాభిప్రాయాన్ని మరోమారు చెప్పింది కావ్య.


"నాకూ అదే నమ్మకం వుందిరా! పన్నెండేళ్ళు అజ్ఞాతవాసం పూర్తిచేసుకొని నా బావ తిరిగి వస్తాడు. తను నిర్దోషినని నిరూపించుకొంటాడు. పద నీ ఆఫీస్ స్టాఫ్ వచ్చే టైమ్ అయ్యింది. అందరినీ రిసీవ్ చేసుకోవాలిగా!" అన్నాడు తిరుమలరావు. 


"అవునన్నయ్యా!" అంది కావ్య.


ముగ్గురూ కుర్చీలనుంచి లేచారు. రామయోగి ఇంటికి తాళం వేశాడు. వీధిలో ప్రవేశించారు. ఆరు నిముషాల్లో సత్యానందరావు గారి ఇంటిని సమీపించారు. ఇంట్లో ప్రవేశించారు.


వాకిట్లో జీప్.. కారు వచ్చి ఆగాయి. కావ్య పై ఆఫీసర్ ఎస్.పి రామకృష్ణ, వారి సతీమణి.. ఇద్దరు పిల్లలు. పదిమంది ఆఫీస్ పోలీసులు. అందులో ఐదుగురు ఆడవారు వచ్చారు.


ఎదురువెళ్ళి నవ్వుతూ అందరికీ స్వాగతం పలికింది కావ్య. ఎస్.పి రామకృష్ణగారు సత్యానందరావు గారిని గురించి విని వున్నాడు. ముఖ్యంగా వారిని చూచి మాట్లాడాలనే వారు వచ్చారు.


సత్యానందరావు.. తిరుమలరావు.. రామయోగి వరండాలోకి వచ్చారు. అందరికన్నా ముందుగా వస్తున్న రామకృష్ణకు నమస్కరించారు.


రామకృష్ణ ప్రతి నమస్కారాన్ని చేసి వారిని సమీపించాడు.

తన చేతిని ముందుకు సాచాడు. సత్యానందరావు తన చేతిని వారి చేతిలో వుంచి ప్రియంగా..

"రండి సార్!" అన్నాడు.


"సార్!.. నా పేరు రామకృష్ణ. మీరు నాకంటే పెద్దవారు. నన్ను రామా అనో, కృష్ణా అనో పిలవండి సార్! సంతోషిస్తాను" నవ్వుతూ చెప్పాడు రామకృష్ణ.


"ఆ..ఆ.. అలాగే.. రండి" చిరునవ్వుతో చెప్పాడు సత్యానందరావు. అందరూ హాల్లోకి ప్రవేశించారు. కుర్చీలలో కూర్చున్నారు.


"ఆ.. రామకృష్ణగారూ.. మా కావ్య తన ఉద్యోగ ధర్మ నిర్వహణలో ఎలా వుందండి?" అడిగారు సత్యానందరావు.


"నిప్పు సార్!" కావ్య వైపు చూచి నవ్వుతూ చెప్పాడు రామకృష్ణ.


భార్య సావిత్రి, అక్క అన్నమ్మ, చెల్లెలు జానకీ, ఆమె భర్త నరేంద్ర హాల్లోకి వచ్చారు. వారిని సత్యానందరావు, రామకృష్ణ.. సతీమణికి పరిచయం చేశారు. నమస్కార ప్రతి నమస్కారాలు జరిగాయి.


తిరుమలరావు. రామయోగి, కావ్య భోజనాల ఏర్పాట్లు చేశారు. అరిటాకులు, గ్లాసులు పెట్టారు. వడ్డన ప్రారంభించారు. అందరూ కూర్చుని ఆనందంగా కబుర్లతో భోంచేశారు. వడ్డన తిరుమలరావు, రామయోగి చేశారు. భోజనాలు ముగిశాయి.


అందరూ కావ్యను హృదయపూర్వకంగా ఆశీర్వదించారు. వరండాలో సమావేశమైనారు.

రామకృష్ణ సత్యానందరావు గారి పక్కన కూర్చున్నాడు.


కొన్ని క్షణాలు ఏదో ఆలోచన... తర్వాత.. సత్యానందరావు గారితో "సార్!.. నేను మీతో ఓ విషయం మాట్లాడాలి. ఏకాంతంలో.." చిరునవ్వుతో చెప్పాడు రామకృష్ణ ఎస్.పి.


"సరే రండి..." సత్యానందరావు కుర్చీలోంచి లేచారు. ఇంట్లోకి ప్రవేశించారు. రామకృష్ణ వారిని అనుసరించారు. ఇరువురూ సత్యానందరావు గారి గదిలో ప్రవేశించారు.

"కూర్చోండి సార్!" చెప్పాడు సత్యానందరావు.


రామకృష్ణ కుర్చీలో కూర్చున్నారు.

సత్యానందరావు ఎదుటి కుర్చీలో కూర్చుంటూ...

"విషయం ఏమిటో చెప్పండి" అడిగాడు సత్యానందరావు.


"సార్!.. మా చిన్నాన్నగారి పెద్దకొడుకు రఘు. గుంటూరు డి.ఎస్పీ గా పనిచేస్తున్నాడు. పోయినవారం ఈ ప్రాంతానికి పనిమీద వచ్చాడు. నా స్టేషన్‍లో మీ కావ్యను చూచాడు. ఆమె అతనికి నచ్చింది. మేమూ మీ కులం వాళ్ళమే. మీరు సమ్మతిస్తే.. కావ్యను మా ఇంటి కోడలుగా చేసుకోవాలనేది మా అభిప్రాయం" తాను చెప్పదలచుకొన్నది ఒకేసారి విన్నవించాడు రామకృష్ణ.


అంతా విని సత్యానందరావు మౌనంగా కళ్ళు మూసుకొన్నాడు. అతని కొడుకు చంద్రశేఖరరావు గుర్తుకు వచ్చాడు. ఆ కుటుంబ సభ్యులంతా కావ్య పుట్టగానే ఇది చంద్రం భార్య అనుకున్నారు ఆ రోజుల్లో. ఆ జ్ఞాపకాలు సత్యానందరావుగారి మనస్సున..

కొన్ని క్షణాలు వారి మధ్యన మౌనం తాండవం చేసింది. ’అడగకూడని విషయాన్ని అడిగినట్టున్నాను. రావుగారు అచేతనులైనారు. తప్పు చేశావా!’ అనుకొన్నాడు రామకృష్ణ.


సత్యానందరావుగారు మెల్లగా కళ్ళు తెరిచారు. వారి నయనాలు ఎర్రగా వున్నాయి. ఆ ఎరుపు వారి హృదయవేదనకు నిదర్శనం.


"సార్!.." అడగకూడనిది అడిగి నేను మీ మనస్సుకు కష్టం కలిగించాననుకుంటాను. సారీ సార్!"

ప్రాధేయపూర్వకంగా చెప్పాడు రామకృష్ణ.


నిట్టూర్చి మరుక్షణంలోనే "మీ నిర్ణయం మరోలా వుందనుకుంటాను" సత్యానందరావు జవాబు కన్నా ముందే చెప్పాడు రామకృష్ణ.


"సార్!.. మీ కోర్కెను నేను ఆమోదించలేను. వివాహ సమయంలో కావ్య అభిప్రాయం వేరుగా ఉంది. ఓ అపనిందతో... నా ఆగ్రహానికి గురై నా కొడుకు పన్నెండు సంవత్సరాల క్రిందట మా ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు. వాడు ఎక్కడ వున్నాడో.. ఏమైనాడో మాకు తెలియదు. కానీ ఆ పిచ్చిపిల్ల నా మేనకోడలు కావ్య తన బావ ఏదో ఒక రోజు తిరిగి వస్తాడనే వాదిస్తుంది. తాను ఆ నమ్మకంతోనే వుంది. ఇంతకు ముందు రెండు మూడు సంబంధాలు కూడా వచ్చాయి. కానీ ఆమె నిర్ణయంలో మార్పులేదు. మీ మాటను కాదంటున్నందుకు నన్ను..."


రామకృష్ణ సత్యానందరావు తర్వాత చెప్పబోయే పదాన్ని గ్రహించి తన కుడిచేతిని వారి నోటికి అడ్డుపెట్టాడు.


"మీరు పెద్దవారు నాకు మీరు క్షమాపణ చెప్పకూడదు. నాకు మా కుటుంబానికి మీలాంటి పెద్దల ఆశీర్వచనాలు కావాలి. యదార్థం చెప్పాలంటే.. మీ మనోభావం తెలియని నేను.. ఆ విషయాన్ని గురించి అడగడం.. నాదే తప్పు. నన్నే మీరు క్షమించాలి" చేతులు జోడించాడు రామకృష్ణ.

సత్యానందరావు కుర్చీనుంచి లేచాడు. గదినుంచి బయటకు నడిచాడు. రామకృష్ణ వారిని అనుసరించాడు. వాకిట వారికి సత్యానందరావు గారి ఇల్లాలు సావిత్రి ఎదురైంది. పవిటను సవరించుకొంటూ పక్కకు జరిగింది.


ఇరువురూ వరండాలోకి వచ్చారు. వారిని చూచి కూర్చొన్నవారంతా లేచి నిలబడ్డారు. 

తిరుమలరావు, రామయోగి సత్యానందరావు ముఖంలోకి చూచి విషయాన్ని గ్రహించారు.

"సార్!.. మీ ఆతిధ్యం అమోఘం. ఇక మేము బయలుదేరుతాము" చేతులు జోడించాడు రామకృష్ణ.

సత్యానందరావు భార్య సావిత్రి.. రామకృష్ణ సతి సుమలతకు చీరా, రవిక పండ్లతో తాంబూలం ఇచ్చింది. కొత్తగా వచ్చిన ముత్తైదువను ఆ రీతిగా గౌరవించటం ఆ యింటి సాంప్రదాయం... ఆంధ్రుల ఆచారం..


కావ్య రామకృష్ణను సమీపించి "మీరు వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా వుంది సార్" వినయంగా నవ్వుతూ చెప్పింది.

అందరికీ చెప్పి రామకృష్ణ కుటుంబం ఇతరులూ వెళ్ళిపోయారు.

ఆ రాత్రి భోజనాల తర్వాత ఎవరి గదుల్లోకి వారు వెళ్ళిపోయారు. కావ్య తండ్రి నరేంద్ర, తల్లి జానకి వారి గదిలో మంచంపై వాలారే కాని వారికి నిద్ర పట్టలేదు... కారణం కావ్య వివాహ సమస్య.

అప్పటికి మూడు సంబంధాలు వచ్చాయి. పిల్లవాడు నచ్చలేదు అంది కావ్య. నాల్గవ సంబంధం రేపు చూడవస్తున్నారని చెప్పిన తల్లిదండ్రులతో కావ్య..


"నాకు ఇప్పట్లో వివాహం చేసుకోవాలని లేదు. దయచేసి ఆ విషయాన్నే అంటే... నేను కాదన్న విషయాన్ని గురించి నాకు చెప్పకండి. మీకు చేతులెత్తి మ్రొక్కుతున్నాను. చేతులు జోడించి అందరికీ నమస్కరించి తన గదిలోకి వేగంగా వెళ్ళిపోయింది.


ఈ సంఘటన జరిగి మూడు మాసాలైంది.

"ఏమండీ.."


"ఆ.."


"నిద్రపోలేదా!"


"రావడం లేదు!"


"కారణం!"


"నీవు నిద్రపోవడం లేదేం?"


"నాకూ నిద్ర రావడం లేదండీ!" విచారంగా చెప్పింది జానకి.


"మన ఇరువురి సమస్యా ఒక్కటే.. లే.. అమ్మాయితో ఓసారి మాట్లాడి వద్దాము పద" అన్నాడు నరేంద్ర.


జానకి.. లేచి రెస్ట్ రూంకు వెళ్ళింది రెండు నిముషాల్లో బయటకు వచ్చింది.

నరేంద్ర... తలుపు తెరిచి ద్వారం వద్ద వున్నాడు. అతన్ని సమీపించి ఇరువురూ కావ్య గదిని సమీపించారు. తలుపును మెల్లగా త్రోశాడు. తలుపుగడియ బిగించనందున తెరచుకొంది. గదిలో దేదీప్యమానంగా బార్ లైట్ వెలుగుతూ ఉంది.

"కావ్య నిద్రపోనట్లుంది" అంది జానకి.


"అవును... పిలుస్తాను" క్షణం తర్వాత "అమ్మా!..." పిలిచాడు నరేంద్ర.


ఆ పిలుపును విన్న కావ్య వులిక్కిపడింది. తన ఎదపై వుంచుకొని వున్న చంద్రం ఫొటోను గమనించకుండా వేగంగా మంచం దిగింది. ఫొటో జారి మంచంపై పడిపోయింది. సమయం.. రాత్రి పన్నెండు గంటల ప్రాంతం..

"నిద్రపోలేదా అమ్మా!"


"లేదు నాన్నా"


"నీతో కొంచెం మాట్లాడాలి!"


"రండి నాన్నా!"


తల్లి... తండ్రి ఇరువురినీ చూచి... "కూర్చోండి" చెప్పింది కావ్య.

నరేంద్ర కుర్చీలో కూర్చున్నాడు.

జానకి మంచంపై కూర్చుంది. ఆమె చేతికి చంద్రం ఫొటో తగిలింది.

కుర్చీలో తండ్రికి ఎదురుగా కావ్య కూర్చుంది.

"చెప్పండి నాన్నా!"


తన చేతికింద ఉన్న ఫొటోను చేతికి తీసుకొంది జానకి.

కావ్య వీపు ఆమె వైపున వున్నందువలన నిర్భయంగా ఆ ఫొటోను చూచింది. ఫొటోను దిండు కిందకి నెట్టింది. ఆమెకు తన కుమార్తె అభిప్రాయం అర్థం అయ్యింది. మౌనంగా వుండిపోయింది జానకి.

"అమ్మా! మామయ్య నీతో చెప్పిన ఆ సంబంధం.. అదే మీ బాస్ రామకృష్ణ గారి తమ్ముడి విషయాన్ని గురించి..."


"నాన్నా!..." నరేంద్ర చెప్పడం ఆపేశాడు. కావ్య మధ్యలోనే ’నాన్నా’ అని సంబోధించడంతో ఆశ్చర్యంతో ఆమె ముఖంలోనికి చూచాడు.


కావ్య లేచి దిండు పైకెత్తి క్రింద వున్న కవర్‍ను చేతికి తీసుకొని తండ్రికి అందించింది.

"చదవండి నాన్నా!"


ఆమె ముఖంలోకి చూస్తూ సందేహంతోనే లోని కాగితాన్ని బయటకు తీశాడు నరేంద్ర.

"అమ్మ కూడ వింటుంది పెద్దగా చదవండి నాన్నా!"


’ప్రియాతి ప్రియమైన నా కావ్యకు..

నామీద పడిన అపవాదును భరించలేక నాన్నగారికి నా ముఖాన్ని చూపించలేక నేను ద్రోహిగానే వెళ్ళిపోతున్నాను. కాని నేను ఆ నందాదేవి చెప్పినట్టు ఏ తప్పూ చేయలేదు. తాను తప్పుచేసింది. తప్పు చేసినవారు మనలను చూచి భయపడాలంటే మన చేతిలో పవర్, హోదా వుండాలి. ప్రస్తుతంలో ఆ రెండూ నా చేతిలో లేవు. వాటిని సాధించాలనే మీ అందరికీ దూరంగా వెళ్ళిపోతున్నాను. తలచుకొన్నది సాధించి తిరిగి రావాలనేది నా ఆకాంక్ష. నేను చేయబోతున్న నా జీవిత సమరంలో.. గెలుస్తానో.. ఓడిపోతానో నేను ఇప్పుడే చెప్పలేను. కానీ ప్రయోజకుడినై తిరిగి రావాలనే కోర్కె నాలో బలంగా వుంది. నామీద నీవు ఆశలు పెట్టుకుంటున్నావని నాకు తెలుసు. నేను తిరిగివస్తానో రానో నాకే తెలియదు. నా కారణంగా నీవు నీ తల్లిదండ్రులకు బాధ కలిగించకు. వారి మాటను విను. బాగా చదివి... ప్రయోజకురాలిగా మారి.. సత్యం, ధర్మం, న్యాయం, నీతి నిజాయితీలకు ప్రతినిధిగా మంచి గౌరవప్రదమైన ఉద్యోగాన్ని సంపాదించాలి. నీకు నచ్చిన నీవు మెచ్చిన వారిని వివాహం చేసుకొని... నీ అమ్మా నాన్న, అత్తామామలకు ఆనందం కలిగించాలి. నన్ను మరిచిపోవాలి. నీవు సదా ఆనందంగా వుండాలి. నీకు నా శుభాశీస్సులు..

ఇట్లు

మీ.. 

బావ చంద్రం’


సాంతం చదిచేసరికి నరేంద్ర కళ్ళల్లో కన్నీరు.. జానకి భోరున ఏడ్చింది.

కళ్ళల్లో సుళ్ళు తిరుగుతున్న కన్నీటిని పవిటతో తుడుచుకొని కావ్య...

"ఏడవకు.. అమ్మా!.. నా బావ వస్తాడమ్మా" ఆ మాట అన్నప్పుడు కావ్య గొంతు బొంగురుపోయింది.

ముగ్గురి మనస్సున చంద్రాన్ని గురించిన జ్ఞాపకాలే!...

కొద్ది నిముషాలు వారి మధ్యన మౌనంగా గడిచిపోయాయి.


"అమ్మా!.. నాన్నా!.. నా నిర్ణయం అర్థం అయింది కదా! వెళ్ళి ప్రశాంతంగా పడుకోండి. నా బావ వస్తాడు.. తాను అనుకొన్నది సాధించి తప్పక వస్తాడు" దృఢ విశ్వాసంతో చెప్పింది కావ్య.


"నీ కోర్కె త్వరలో తీరాలి తల్లీ!" ప్రీతిగా కావ్యను దగ్గరకు తీసుకొని తన కుడిచేతిని ఆమె తలపై వుంచి దీవించింది జానకి.


"తల్లీ!.. నీ నమ్మకమే నీకు జయం... తప్పక త్వరలో చంద్రం వస్తాడు. నీ కోర్కె తీరుతుంది" నరేంద్ర కూడా తన చేతిని కావ్య తలపై ప్రేమతో వుంచాడు.


కావ్య కళ్ళనిండా ఆనంద భాష్పాలు. తల్లి తండ్రిని తన చేతులతో చుట్టేసింది.

ఆ స్థితిలో కొన్ని క్షణాలు పరమ ప్రశాంతంగా దొర్లిపోయాయి.

"అమ్మా!... ఇక మేము వెళతాము. నీవు ప్రశాంతంగా నిద్రపో అమ్మా!" అంది జానకి. 


"అలాగే అమ్మా!"


ఆ ఇరువురూ గదినుండి బయటికి మౌనంగా నడిచారు.

కావ్య మంచంపై వాలిపోయింది.

మంచంపై వున్న చంద్రం లేఖను చేతికి తీసుకొంది.

నిదానంగా చదువుకొంది. మనస్సు నిండా చంద్రాన్ని గురించిన జ్ఞాపకాలు...


మస్తిష్కంలో ఓ ఆశా కిరణం..

ఎదలో పులకింత

బుగ్గలు ఎరుపెక్కాయి..


’అవును... వస్తాడు నా బావ.. నా కోసం... నా కోసం..’ ఆనందంగా అనుకొని కళ్ళు మూసుకొంది కావ్య.


========================================================================

ఇంకా వుంది..

========================================================================

సిహెచ్. సీఎస్. శర్మ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ సిహెచ్. సీఎస్. శర్మ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 


విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

రచయిత పరిచయం:

 పేరు చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ.

 కలంపేరు సి హెచ్ సి ఎస్ శర్మ.

 బాల్యం, చదువు: జననం నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా గుంట పాలెం

విద్యాభ్యాసం: రొయ్యల పాలెం, బుచ్చి రెడ్డి పాలెం, నెల్లూరు

ఉద్యోగం: మద్రాసులో 2015 వరకు వివిధ కంపెనీలలో చీఫ్ జనరల్ మేనేజర్/టెక్నికల్ డైరెక్టర్ గా పదవి నిర్వహణ.

తరువాత హైదరాబాద్ మెగా ఇంజనీరింగ్ సంస్థలో చేరిక.


28 views0 comments

Comentarios


bottom of page