top of page

వీరి మధ్యన... ఎపిసోడ్ 11


'Veeri Madhyana Episode 11' New Telugu Web Series


Written By BVD Prasada Rao


(ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత)



(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)


బివిడి ప్రసాదరావు గారి ధారావాహిక 'వీరి మధ్యన..' పదకొండవ భాగం



గత ఎపిసోడ్ లో…

రమేష్, కవితలతో బయలు దేరుతుంది సాహసి.

దారిలో సామ్రాట్ కారులోకి మారుతుంది.

వాళ్ళు అద్దెకు తీసుకున్న ఫ్లాట్ కు చేరుకుంటారు.

ఇక వీరి మధ్యన.. పదకొండవ భాగం చదవండి...



"కాల్ చేయ్. నేను వస్తాను. ఈ రోజు ఇంట్లోనేగా నేను ఉండేది." చెప్పాడు సామ్రాట్.

"అంకుల్ కు కారు అవసరం ఉంటుందిగా." అంది సాహసి.

"అక్కడ నా బైక్ ఉందిగా." చెప్పాడు సామ్రాట్.

కారు ముందుకు సాఫీగా పోతుంది.


"రూట్ చూస్తుండు. నువ్వు నీ స్కూటీ మీద బ్యాంక్ కు వెళ్లి రావడంలో తడబడవు." చెప్పాడు సామ్రాట్.

"రూట్ మ్యాప్ పెట్టుకుంటాలే." చెప్పింది సాహసి.

"థట్స్ ఫైన్." అన్నాడు సామ్రాట్.

"సాయంకాలంకి నా స్కూటీ వచ్చేస్తుంది." అంది సాహసి.

సామ్రాట్ ఏమీ అనలేదు.


"నువ్వు కారు మీద నీ ఆఫీసుకు తిరిగేస్తావా." అడిగింది సాహసి.

"లేదు లేదు. కారు ఐతే ట్రాఫిక్ ఛేదన కష్టం. సకాలంలో ఆఫీసును చేరలేను. ఇంటికి రాలేను. రేపు కారును ఇంటి వద్ద వదిలేసి, నా బైక్ తీసుకుంటాను." చెప్పాడు సామ్రాట్.

సాహసి ఏమీ అనలేదు.

***

సిక్స్ పియం దాటుతుంది.

సాహసి, సామ్రాట్ ఇంట్లో సామాన్లు సర్దుకుంటున్నారు.

గంట ముందు మోహనరావు పంపిన సామాన్లును ఫ్లాట్ లోకి చేర్పించుకున్నాడు సామ్రాట్.


అప్పటికే సామ్రాట్ చేతతో సాహసి బ్యాంక్ నుండి ఇంటిని చేరి ఉంది.

తండ్రికి ఫోన్ చేసి సామాన్లు చేరాయని చెప్పింది. తర్వాత తల్లితో మాట్లాడింది.

ఆ సమయంలోనే సాహసి నుండి ఫోన్ తీసుకొని, మోహనరావుతో సామ్రాట్ మాట్లాడేడు. సామాన్లు పంపినందుకు తన ఇబ్బందిని ప్రస్తావించేక, 'థాంక్స్' కూడా తెల్పాడు.

సమయం నైన్ పియం దాటింది.


అప్పటికి తెములుకొని, డిన్నర్ ప్రిపరేషన్ కై కిచిన్ లోకి నడిచింది సాహసి.

ఆమె వెనుకే సామ్రాట్ కూడా నడిచాడు.

"ఈ పూటకు ఉప్మా చేసేసుకుందామా." అడిగింది సాహసి.

"యాజ్ యు లైక్ హసి." అన్నాడు సామ్రాట్ సింపుల్ గా.


"సామాన్ల సొదతో బడలికయ్యింది." చెప్పుతుంది సాహసి.

అప్పుడే, "నో మోర్ మాటలు ప్లీజ్. ఉప్మాకు ఉల్లి, పచ్చిమిర్చి నేను తరుగుతాను. మిగతాది నువ్వు కానీ." అన్నాడు సామ్రాట్ చొరవగా.

చిన్నగా నవ్వేసింది సాహసి.

అర్ధ గంట తర్వాత -


"ఉప్మా కుక్ అవుతుందిగా. నేను చూసుకొని స్టౌవ్ కట్టేస్తాను. నువ్వు బాత్ కు వెళ్లు." అన్నాడు సామ్రాట్.

"లేదు. నువ్వు వెళ్లి రా. ఆ లోగా నేను ఇక్కడవి సర్ది పెడతాను." చెప్పింది సాహసి.

"అంతే అంటావా." అన్నాడు సామ్రాట్.

"ముమ్మాటికి." అంది సాహసి.


సామ్రాట్ అక్కడ నుండి కదిలాడు. తమ బెడ్రూం కి వెళ్లి టవల్ తీసుకొని బాత్రూంలోకి వెళ్లాడు.

ఆ సమయంలోనే, తమ బెడ్రూంకి వెళ్లి, తన ఫోన్ తెచ్చుకుంది సాహసి.

మాలతికి ఫోన్ చేసింది.


అటు నుండి కాల్ కనెక్ట్ కాగానే, "ఆంటీ మా వాళ్లు పంపిన సామాన్లు వచ్చేశాయి. సర్దుకొనే సరికి ఇంత సమయం పట్టింది. అందుకే మీకు చెప్పడం ఆలస్యమవుతుంది." చెప్పింది సాహసి.

"సరేనమ్మా. అన్నీ బాగానే చేరాయిగా." అంది మాలతి.

"ఆ ఆంటీ." అంది సాహసి.

"డిన్నర్ అయిందా." అడిగింది మాలతి.


"లేదు ఆంటీ. ఉప్మా ఐపోతుంది. మీ అబ్బాయి స్నానంకి వెళ్లారు." చెప్పింది సాహసి. ఆ వెంబడే, "మీ డిన్నర్ అయిందా ఆంటీ." అడిగింది.

"ఆయి పోయిందమ్మా. తెలుసుగా మీ అంకుల్ కి ఎనిమిదయ్యే సరికి డిన్నర్ అయిపోవాలిగా. మరి ఆయనతోనే నాదిన్నూ." చెప్పింది మాలతి.


చిన్నగా నవ్వుకుంటూ, "మరే. తొలుత నుండి మీకు అలా అలవాటుగా. నిజానికి అది ఆరోగ్యానికి మంచిది కూడా." అంది సాహసి.

"ఏమోనమ్మా. డిన్నర్ వరకు పర్వాలేదు కానీ, ఆయనలా తొందరగా మాత్రం నేను నిద్ర పోలేను. అందుకే నిద్ర వచ్చే వరకు టివి చూస్తూ ఉంటాను. నేను పడుకుండే సరికి పదకొండు అవుతుంటుంది రోజూ." చెప్పింది మాలతి.


"కొద్దిగా త్వరగా పడుకోండి ఆంటీ." చెప్పింది సాహసి.

"ప్రయత్నించానమ్మా. అబ్బే. కావడం లేదు." చెప్పింది మాలతి.

మాలతితో మాట్లాడుతూనే, కిచిన్ లోని పనులను తన మట్టుగ తాను కానిచ్చేసుకుంటుంది సాహసి.


మాలతి కబుర్లాడుతూనే ఉంది.

సాహసి కిచిన్ లోని పనులను చేసేసింది.

తమ బెడ్రూం లోకి వచ్చేసింది.

బాత్రూం నుండి అక్కడికి సామ్రాట్ వచ్చాడు.


అతడికి ఫోన్ అందించి, "లైన్ లో ఆంటీ." అంది సాహసి.

తల్లితో సామ్రాట్ మాట్లాడుతున్నాడు.

సాహసి టవల్ తీసుకొని, బాత్రూం వైపు కదిలింది.

"తను స్నానంకి వెళ్తుంది." తల్లికి చెప్పుతున్నాడు సామ్రాట్.

***

వారం రోజులు తర్వాత -

ఆహ్వానం మేరకు కవిత, రమేష్ ల ఇంటికి -

సాహసి, సామ్రాట్ లు డిన్నర్ కై వచ్చి ఉన్నారు.

ముందు ఆదివారమే కవిత, రమేష్ లు సాహసి, సామ్రాట్ ల ఇంటికి ఆహ్వానింప బడ్డారు.


అక్కడ చక్కని లంచ్ ని ఎంచక్కా ఆరగించారు.

మాటా మంతీల పిమ్మట -

డిన్నర్ కై ఆ నలుగురు డైనింగ్ టైబిల్ ముందుకు చేరారు.

డిన్నర్ కానిస్తూనే మాటలు కొనసాగించుకుంటున్నారు.


"అవునా. ఈ వీకెండ్ న హానీమూన్ ట్రిప్ కి మీరు ప్లాన్ చేసుకున్నారా. గ్రేట్. గో హెడ్." అన్నాడు సామ్రాట్ నవ్వేస్తూ.

"ఒన్ వీక్." చెప్పాడు రమేష్ నవ్వుతూ.

సామ్రాట్ ఏమీ అనలేదు.


"మీరు ప్లాన్ చేసుకోవచ్చుగా." అంది కవిత, సాహసితో.

సాహసి ఏమీ అనలేదు.

"మీకు తెలిసిందే మా పెద్దల తీరు. ఆషాఢం తర్వాతే ఏదైనా." చెప్పేశాడు సామ్రాట్.

"ఏముంది. ఎలానూ వాళ్లని ఒప్పించి, మీరు కలిసి మెసులుకుంటూన్నారుగా." చెప్పుతున్న రమేష్ కు అడ్డై -

"చిన్న సవరణ లేదా వివరణ." అన్నాడు సామ్రాట్.


రమేష్ చెప్పడం ఆపేశాడు. సామ్రాట్ నే చూస్తున్నాడు.

"అదే. 'కలిసి' మాత్రం కాదు, 'మెసులుకుంటున్నాం' అన్నది మాత్రమే కరెక్టు." చెప్పాడు సామ్రాట్.

"అదదే. సరి సరేలే." అన్నాడు రమేష్ తొట్రుబాటుగా.

పిమ్మట అక్కడి నలుగురూ హెల్దీగా నవ్వుకోగలిగారు.

***

నాలుగు రోజుల తర్వాత -

ఫోన్ లలో మాట్లాడుకుంటున్నారు సాహసి, శైలజలు.

శైలజ తమ ఇంటి హాలులో ఉంది.

మోహనరావు తమ బెడ్రూంలో బెడ్ మీద నడుము వాల్చి ఉన్నాడు.


సాహసి తమ బెడ్రూం లో బెడ్ మీద ఒక చివరన కూర్చొని ఉంది.

అదే బెడ్ మీద రెండో చివరన సామ్రాట్ పడుకొని ఉన్నాడు.

అతడి చేతిలో పుస్తకం ఉంది. పడుకొనే ముందు ఏదొకటి చదవడం తనకి అలవాటు.

"నాకు వరస మూడు రోజులు హాలీడేస్ వస్తున్నాయి. మరో రెండు రోజులు సెలవు పెట్టుకొని, నేను, సామ్రాట్ గోవా వెళ్లొచ్చా." అడుగుతుంది సాహసి.


సామ్రాట్ టక్కున పుస్తకం మీది నుండి చూపు మార్చి, గమ్మున తల తిప్పి, సాహసిని చూశాడు.

"ఎలా వెళ్తారమ్మా." అంది అటు నుండి శైలజ.

"ఏంమ్మా. మీ అనుమతితో, మీకు మాటిచ్చినట్టే మా ఇద్దరం ఇక్కడ ఉంటున్నాంగా. అలానే అక్కడా ఉంటాం. తప్పేమైనా ఉంటుందా." అడిగింది సాహసి.


సామ్రాట్ ఇంకా చూపు మార్చుకోలేదు.

"సారీ. నీ మాటలు నేను వింటున్నాను." అని మాత్రం అన్నాడు సాహసికి మాత్రమే వినిపించేలా.

సాహసి చిన్నగా నవ్వేసి, 'సరే' అన్నట్టు తలాడించింది.


"నిజానికి ఇది నా ప్లాన్. సామ్రాట్ తో ఇంకేమీ అనలేదు. మీ అభిప్రాయం తెలుసుకొనేకనే సామ్రాట్ తో ఈ విషయమై మాట్లాడాలని అనుకుంటున్నాను." చెప్పింది సాహసి. అప్పుడు మాత్రం తను సామ్రాట్ వంకే చూస్తుంది.

'సాహసి నిజమే అంటుంది. నిజానికి తను నాతో ఈ విషయమై మాట్లాడ లేదు.' అనుకున్నాడు సామ్రాట్ ఇంకా ఆమెనే చూస్తూ.


"అమ్మా. ఏమంటావు." అంటుంది సాహసి.

"మీ నాన్నతో మాట్లాడి చెప్తాను." అనేసింది శైలజ.

"వస్తున్న శుక్రవారం నుండే నాకు హాలీడేస్. రేపటికి చెప్పేసి. మీరు 'యస్' అంటే, సామ్రాట్ తో మాట్లాడాలి. ప్రయాణ ఏర్పాట్లు చేసుకోవాలి." చెప్పింది సాహసి.


"అలానే. అన్నట్టు ఇంకా మీ అత్తవారు ఏమంటారో తెలుసుకోవాలిగా." అంది శైలజ.

"ముందు మీరు తేల్చండి. పిమ్మట సామ్రాట్ అటు మాట్లాడి తెలుసుకుంటారు." చెప్పింది సాహసి.

"సరే. రేపు ఉదయమే చెప్తాలే." అంది శైలజ.

తర్వాత ఆ సంభాషణ ముగిసింది.


"ఏమిటి హసి. ఈ ట్విస్ట్." అడిగాడు సామ్రాట్ లేచి కూర్చుంటూ. చేతిలోని పుస్తకాన్ని మూశాడు.

"మీకు తెలుసుగా. మాకు ఫ్రైడే హాలీడ్. సో, నెక్స్ట్ టూ డేస్ కలిసొచ్చిన హాలీడేస్. అదనంగా మరో రెండ్రోజులు సెలవు పెట్టేస్తే, టోటల్ గా ఫైవ్ డేస్ మీతో ఎంచక్కా గోవాలో ఎంజోయ్ చేద్దామని నా ప్లాన్. ముందు 'నీకు కుదురుతుందా' చెప్పు" అంది సాహసి.


"బాగుంది. నాకు అవుతుంది. కానీ మనకు అయ్యే పనేనా." అన్నాడు సామ్రాట్ నీర్సంగా.

"ప్రయత్నం చేస్తున్నానుగా." అంది సాహసి. ఆ వెంబడే, "ఐనా. వెళ్తే తప్పేం ఉంది. ఇక్కడ ఉన్నట్టే అక్కడా మనం ఉండొచ్చుగా." అంది చాలా ఈజీగా.


సామ్రాట్ 'అవును' అన్నట్టు తలాడించేశాడు.

"ఈ లోగా నువ్వు నీ వాళ్లతో కదిపి చూడరాదూ." అంది సాహసి టక్కున.

"అంతే అంటావా." అన్నాడు సామ్రాట్.


"అంతే కాదు. ప్రయత్నిస్తే 'అవుతుంది' అని కూడా నమ్ముతున్నాను." చెప్పింది సాహసి చాలా సూటిగా.

"సరే." అంటూ టీపాయ్ మీద తన చేతిలోని పుస్తకాన్ని పెట్టేసి, ఆ చేతితోనే అక్కడే ఉన్న తన ఫోన్ ని తీసుకున్నాడు సామ్రాట్.


"అమ్మకి చేస్తాను." అన్నాడు.

"అంతేగా మరి. ఈ టైంలో ఆవిడ టీవీ చూస్తూ ఉంటారు. ఇప్పుడే మాట్లాడేయ్." అనేసింది సాహసి.

మాలతికి ఫోన్ చేశాడు సామ్రాట్.

కాల్ కలవగానే, "అమ్మా ఒక విషయంలో మీ అభిప్రాయంకై నీకు ఫోన్ చేశాను." చెప్పాడు సామ్రాట్.


"చెప్పు." అంది మాలతి.

సాహసి హాలీడేస్ విషయం చెప్పి, తాము ఆ రోజుల్లో గోవా వెళ్లి వస్తామని చెప్పగలిగాడు సామ్రాట్.

"అవునా. వీలైతే వెళ్లండి. మాకు మాటిచ్చినట్టు ఇక్కడ ఉన్నట్టే గోవాలో కూడా ఉండండి. చాలు." అనేసింది మాలతి తేలిగ్గా.

"మరి డాడీ." అన్నాడు సామ్రాట్.


"నేను చెప్తాలే. ఆయనా కాదనరు." చెప్పేసింది మాలతి.

"థాంక్సమ్మా." అన్నాడు సామ్రాట్ సరదాగా.

"చాల్లేరా. గుడ్ నైట్." అంది మాలతి అటు నుండి సరదాగా.

కాల్ కట్ చేసేక, "మా వాళ్ల వైపుది గ్రీన్ సిగ్నేల్." చెప్పాడు సామ్రాట్.


"విన్నాను. స్పీకర్ ఆన్ చేసి పెట్టావుగా." అంది సాహసి తృప్తిగా. ఆ వెంటనే, "ఛ. మా వాళ్లే." అంది నొచ్చుకుంటున్నట్టు.


"లేదులే. వాళ్ల ఆలోచనలు వాళ్లవి. వాటినీ మనం గుర్తించాలి." అన్నాడు సామ్రాట్.

సాహసి చేతిలోని తన ఫోన్ ని సామ్రాట్ కి ఇచ్చి, "టీపాయ్ మీద పెట్టేయ్." అంది.

ఆ ఫోన్ ని, తన ఫోన్ ని తనకి దగ్గరిగా ఉన్న టీపాయ్ మీద సర్దేశాడు సామ్రాట్.

ఆ తర్వాత - తమ తమ స్థానాల్లో మంచం మీద నడుములు వాల్చారు ఆ ఇద్దరు.


సామ్రాట్ తన తలకి దగ్గరగా బెడ్ కే అమర్చి ఉన్న బెడ్ లైట్ స్విచ్ ఆన్ చేశాడు. ఆటోమెటిక్ గా ట్యూబ్ లైట్ ఆఫ్ ఐపోయింది. బెడ్ లైట్ వెలిగింది. గదంతా పల్చని బ్లూ కాంతి ఆక్రమించుకుంటుంది.


తర్వాత ఐదు నిమిషాల లోపే సాహసి ఫోన్ మోగుతుంది.

సామ్రాట్ లేచి, బెడ్ లైట్ స్విచ్ ఆఫ్ చేశాడు. బెడ్ లైట్ ఆరిపోయింది. ఆటోమెటిక్ గా ట్యూబ్ లైట్ వెలిగింది. గదంతా బ్రైటైన వైట్ కాంతి ఆక్రమించుకుంది.


సాహసి ఫోన్ ని టీపాయ్ మీద నుండి సామ్రాట్ తీసుకున్నాడు.

"మీ మదర్." అన్నాడు ఫోన్ స్క్రీన్ వైపు చూస్తూనే.

సాహసి లేచి కూర్చుంది. తన ఫోన్ సామ్రాట్ నుండి అందుకుంది.

కాల్ కలిపి, "ఏంటమ్మా." అంది.


"పడుకుండిపోయావా." అంది శైలజ.

"చెప్పు." అంది సాహసి.

"అదే. నాన్నతో మాట్లాడేను. మీ 'హద్దు'ల్లో మీరుంటూ వెళ్లొచ్చు అన్నారు." చెప్పింది శైలజ.


"సరేమ్మా." అనేసింది సాహసి, సామ్రాట్ నే చూస్తూ. ఆ వెంటనే, "గుడ్ నైట్." అనేసింది.

కాల్ కట్ చేసి, సామ్రాట్ ను చూస్తూ, "మా వాళ్లూ ఒప్పుకున్నారు." చెప్పింది.

"తెలుస్తుందిలే. నీ మొహం ఈ ట్యూబ్ లైట్ కాంతి కంటే రెట్టింపుగా వెలిగిపోతుందిగా." అన్నాడు సామ్రాట్ తమాషాగా.

"పో." అంది సాహసి.


"రా. టిక్కెట్స్ బుక్ చేసేసి వచ్చి బబ్బుందాం." అన్నాడు మంచం దిగుతూ సామ్రాట్.

"రేపు చూద్దాం." అంటూనే మంచం దిగేసింది సాహసి.


"నో నో. ప్లీజ్ కమ్." అంటూ హాలు లోకి నడిచాడు సామ్రాట్.

సాహసి వెనుకే వెళ్లింది.

టీపాయ్ మీదిన ఉన్న తన బేగ్ లోంచి తన లాప్టాప్ తీస్తున్నాడు సామ్రాట్.

సాహసి సోఫాలో కూర్చుంది. తను చాలా హుషార్ లో ఉంది.

***

(కొనసాగుతుంది..)

***

బివిడి ప్రసాదరావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


కథలు, నవలలు మరియు జోకుల పోటీల వివరాల కోసం



మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



Podcast Link


Twitter Link


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం : బివిడి ప్రసాదరావు.

30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.


రైటర్, బ్లాగర్, వ్లాగర్.

వీరి బ్లాగ్ - బివిడి ప్రసాదరావు బ్లాగ్

వీరి యూట్యూబ్ ఛానల్ - బివిడి ప్రసాదరావు వ్లాగ్

వీరి పూర్తి వివరాలు ఈ క్రింది లింక్ ద్వారా తెలుసు కోవచ్చు.


34 views0 comments

コメント


bottom of page