top of page
Writer's pictureBVD Prasada Rao

వీరి మధ్యన... ఎపిసోడ్ 12


'Veeri Madhyana Episode 12' New Telugu Web Series


Written By BVD Prasada Rao


(ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత)



(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)

బివిడి ప్రసాదరావు గారి ధారావాహిక 'వీరి మధ్యన..' చివరి భాగం


గత ఎపిసోడ్ లో…

గోవా టూర్ వెళ్లాలనుకుంటారు సాహసి, సామ్రాట్ లు.

ఇరువైపులా పెద్దలు అంగీకరిస్తారు.

ఇక వీరి మధ్యన.. చివరి భాగం చదవండి...


మర్నాడు -

ఫైవ్ థర్టీటు ఏయం.

సాహసి, సామ్రాట్ మోర్నింగ్ వాక్ లో ఉన్నారు. పక్కపక్కగా నడుస్తున్నారు. వాతావరణం చిరు గాలితో చల్లగా ఉంది.

వాకింగ్ ట్రాక్, వాకర్స్ తో నిండుగా ఉంది. కానీ ఎవరి సొద వారిదిగా అంతా నడుస్తున్నారు.


సాహసి రావడంతో సామ్రాట్ దిన చర్యల్లో మార్పులు వచ్చాయి. అందుకు సాహసి ఒత్తిడి ఏ మాత్రం లేదు. సాహసి కేవలం తన తీరును తాను కొనసాగిస్తుంటే, సామ్రాటే వాటిని గుర్తిస్తూ అటు మొగ్గేశాడు.


ఉదయం ఐదింటికి సాహసి సెట్ చేసుకున్న అలారం ధ్వనికి చక్కగా నిద్ర నుండి లేవగలుగుతున్నాడు సామ్రాట్. బాత్రూం పనులు కానిచ్చేసి చకచకా సిద్ధమైపోతున్నాడు. అప్పటికే తయారై తన పనిన తాను కదులుతున్న సాహసిని అనుసరించేస్తున్నాడు.


సిక్స్ థర్టీ ఐంది.

సాహసి, సామ్రాట్ లు వాకింగ్ నుండి ఇంటికి చేరారు.

మైన్ డోర్ లాక్ తీశాడు సామ్రాట్.

ఇద్దరూ హాలులోని సోఫాలో కూర్చున్నారు.

ఇద్దరూ కొద్దిసేపటిలోనే రిలాక్స్ అయ్యారు.


సాహసి కిచిన్ లోకి వెళ్లింది.

సామ్రాట్ హాలులోనే ఇంకా కూర్చున్నాడు.

కొద్ది నిమిషాల్లో సాహసి తిరిగి అక్కడికి వచ్చింది.

తన కుడి చేతి లోని గ్లాసును సామ్రాట్ కు అందిస్తూ, "ఈ రోజు సోరకాయ జ్యూస్." అంది.


సామ్రాట్ ఆ గ్లాస్ అందుకున్నాడు.

తన ఎడమ చేతిలోని తన గ్లాసును తన కుడి చేతిలోకి మార్చుకొని, సామ్రాట్ పక్కనే సోఫాలో కూర్చుంది సాహసి.

"కాఫీ వదిలి ఇలాంటి డ్రింక్స్ డైలీ తీసుకోవడం బాగుంది. థాంక్స్ హసి. మంచి మంచి అలవాట్లును పరిచయం చేశావు." అన్నాడు సామ్రాట్.

సాహసి ఏమీ అనలేదు.

"సోరకాయ జ్యూస్ టేస్టీగా ఉంది." చెప్పాడు సామ్రాట్ గ్లాస్ లోని ఆ జ్యూస్ ను కొద్దిగా కొద్దిగా తాగేక.


ఆ వెంబడే, "ఏమైనా నీ చేతి వంటలు చాలా రుచికరంగా ఉంటున్నాయి. ఎన్నాళ్లగానో మరిగిన మా అమ్మ చేతి వంటల రుచుల్ని ఇట్టే నీ చేతి వంటలు మరుగున పర్చేస్తున్నాయి." అన్నాడు.

"ఆ ఆ. వేస్తున్న బిస్కెట్లు చాలు కానీ. ఒకర్ని ఒకరితో పోల్చడం మానుకోండి. ప్లీజ్." అంది.

ఆ వెంబడే, "ఆంటీ వంటకాల్ని తక్కువ చేసేలా కాక, నా వంటలు కూడా బాగుంటున్నాయి అనండి. నేను సంతోషిస్తాను." చెప్పింది సాహసి చిన్నగా నవ్వేస్తూ.

సామ్రాట్ సర్దుకున్నాడు.

తర్వాత సాహసి లేచి, రెండు ఖాళీ గ్లాసులతో తిరిగి కిచిన్ వైపుకు కదిలింది.

సామ్రాట్ స్నానంకై కదిలాడు.


ఎయిటో క్లాక్ సమయంన, "హాలో సార్." అంటూ సామ్రాట్ ను పిలిచింది సాహసి కిచిన్ నుండి.

తమ రూంలో ఉన్న సామ్రాట్, "ఆ. వస్తున్న హసి." అన్నాడు.

ఆ వెంబడే కిచిన్ లోకి వచ్చేశాడు.

"ఇంకా ఎన్నాళ్లు. ఈ సార్ పిలుపు. అన్నావుగా ఏదో పేరుతో నన్ను పిలుస్తానని. ఇప్పటికైనా సెలవివ్వు." అన్నాడు.

"నో. సమయం రావాలి. సరే కానీ ఆ తడి టవల్ తోనే ఉండే బదులు డ్రస్ వేసుకోవచ్చుగా." అంది సాహసి.


"బాత్ తర్వాత బెడ్ పై పడితే చాలా హాయిగా ఉంటుంది." అన్నాడు సామ్రాట్ గమ్మత్తుగా.

"చాల్లే సంబరం." అంటూ, "మన లంచ్ కై కిచిడి చేస్తున్నాను. చివరికి వచ్చేసింది. ఒన్ విజిల్ రాగానే స్టవ్ కట్టేయ్. నేను స్నానంకు వెళ్తా." చెప్పింది సాహసి.

'అలాగే' అన్నట్టు తలాడించాడు సామ్రాట్.

సాహసి కిచిన్ నుండి బయటికి కదిలింది.


తర్వాత సాహసి అప్పగించిన పనిని కానిచ్చేసి తమ రూంని చేరాడు సామ్రాట్. టవల్ తీసి తయారవుతున్నాడు.

స్నానం ముగించుకొని అక్కడికి సాహసి వచ్చింది. రెండు అర చేతుల్ని రబ్ చేస్తూ, "అబ్బ. ఆ ఫేన్ స్పీడ్ తగ్గించ వచ్చుగా. చాలా చల్లగా లేదు." అంది.

ఫేన్ స్విచ్ ఆఫ్ చేశాడు సామ్రాట్.

"థాంక్యూ." అంది సాహసి.


సాహసి తను ధరించబోయే బట్టలను తీసుకుంది. తర్వాత తన వంటి మీది టవల్ ని విడిచింది. అది చూసిన సామ్రాట్ నెమ్మదిగా చూపు మార్చుకున్నాడు.

ఆ ఇద్దరూ ఆ రూంలో చాలా దగ్గర దగ్గరగానే ఉన్నారు. తమ తమ తయారవ్వడాలను కానిస్తున్నారు చాలా మామూలుగా.

పది నిమిషాలలోపే, "రా. బ్రేక్ఫాస్ట్ చేద్దాం." అంటూ అక్కడ నుండి కదిలింది సాహసి.

సామ్రాట్ ఆమెను అనుసరించాడు.


ఇద్దరూ కిచిన్ లో ఉన్నారు. టు బౌల్స్ లో వేడి పాలు సమానంగా పోసి, వాటిలో కొద్ది కొద్దిగా బెల్లం పొడి వేసి స్పూన్ తో కలిపింది సాహసి. తర్వాత ఆ బౌల్స్ లో అప్పటికే రడీ చేసి ఒక పక్కన పెట్టుకున్న తడి అటుకులను రెండేసి టీ కప్పుల వంతున సర్దింది.

ఈ లోగా సాహసి చెప్పినట్టు ఫ్రిడ్జ్ నుండి ఒక ఆపిల్ ని తీసి, చాకుతో సమానంగా ఎనిమిది ముక్కలు చేసి పెట్టాడు సామ్రాట్.


రెండు ప్లేట్ ల్లో చెరో అటుకుల బౌల్ ను, నాలుగేసి ఆపిల్ ముక్కలను, చేరో స్పూన్ ను సర్దింది సాహసి. ఒక ప్లేట్ ను సామ్రాట్ కి అందించి, మరో ప్లేట్ ను తను తీసుకుంది.

అలా ఆ ఇద్దరి బ్రేక్ఫాస్ట్ అయ్యాక, సాహసి రెండు లంచ్ బాక్సుల్లో కిచిడిని సమానంగా సర్ది పెట్టింది.

"స్నేక్స్ టైంలో తినడానికి నాలుగు బిస్కెట్స్ ని, ఒక కమలా పండును లంచ్ బాక్స్ తో పాటు నీ బేగ్ లో కూడా పెడతాను. ఈ లోగా మన వాటర్ బాటిల్స్ ని నింపి తే." చెప్పింది సాహసి.


సామ్రాట్ ఆ పని చేసి పెట్టాడు.

తర్వాత తమ తమ బ్యాగ్స్ తో తమ తమ వర్కులకు బయలుదేరారు ఆ ఇద్దరు.

సామ్రాట్ మైన్ డోర్ లాక్ చేశాడు. కీ ని జేబులో పడేసుకున్నాడు. ఆ వెంబడే, "నీ కీ నీ వద్ద ఉంచుకున్నావుగా." అడిగాడు.

"ఆ." అంది సాహసి.

సాహసి తన స్కూటీ తో, సామ్రాట్ తన బైక్ తో ఎవరి తోవన వారు బయలు దేరారు.

***

ఫోర్ ఫార్టీ పియం.

సాహసికి ఫోన్ చేశాడు సామ్రాట్.

"ఎక్కడ." అడిగాడు.

"ఇంటికి బయలుదేరుతున్నాను." చెప్పింది సాహసి.


"అవునా. నేనూ ఎరౌంట్ సెవనో క్లాక్ కి ఇంటికి వచ్చేస్తాను. నువ్వు డిన్నర్ ని ప్రిఫేర్ చేయకు." చెప్పాడు సామ్రాట్.

"ఏం." అడిగింది సాహసి కుతూహలంగా.

"ఈ రోజు డిన్నర్ ని మనం స్కైలో చేయబోతున్నాం." చెప్పాడు సామ్రాట్ గొప్పగా.

"వాట్. స్కైలోనా." అంది సాహసి విస్మయంగా.


"య. డియర్ హసి. ఆల్రడీ 'స్కై డైనింగ్' టికెట్స్ మనకై బుక్ చేసేశా." చెప్పాడు సామ్రాట్ హుషార్ గా.

"నాకేం అర్ధం కావడం లేదు." అంది సాహసి చిత్రంగా.

"కొద్ది గంటలు ఓపిక పట్టు. ప్లీజ్." అన్నాడు సామ్రాట్ తమాషాగా.

"సర్లే." అనేసింది సాహసి.

"బైబై. టేక్ కేర్." అన్నాడు సామ్రాట్.


"సరి సరే. నువ్వూ జాగ్రత్త." అనేసింది సాహసి.

వాళ్ల ఫోన్ కాలింగ్ కటయ్యింది.

సాహసి ఇంటికి బయలుదేరింది.

సామ్రాట్ ఫినిస్సింగ్ వర్క్ కానిస్తున్నాడు.


సరిగ్గా ట్వంటీ సిక్స్ మినిట్స్ తర్వాత - సామ్రాట్ ఫోన్ మోగింది.

చేస్తున్న వర్కను ఆపి, ఫోన్ స్క్రీన్ వైపు చూశాడు. సాహసి నుండి కాల్.

ఆ కాల్ కు కనెక్టై, "బోలో హసి" అన్నాడు.


అటు నుండి, "హలో సార్.. ఈవిడ మీ మిసెస్ అనుకుంటా. ఈవిడ ఫోన్ చూస్తే, లాస్ట్ కాల్ 'హబీ' అని ఉంది. దాంతో ఈ నెంబర్ కు కాల్ చేశాను." చెప్పుతున్నాడు ఒకతను.

సాహసి ఫోన్ నుండి వేరే ఎవరో మాట్లాడుతుండడంతో, సామ్రాట్ అయోమయం అవుతున్నాడు.

"ఇక్కడ ఈవిడ స్కూటీకి యాక్స్డెంట్ ఐంది. కింది పడ్డ ఈవిడను నేను, కొంత మందిమి కలిసి దగ్గరలో ఉన్న హాస్పిటల్ లోకి చేర్చాం." చెప్పాడు ఆ ఒకతను.

తడబడిపోతూ, "ఏ హాస్పిటల్." అడగ్గలిగాడు సామ్రాట్.

ఆ ఒకతను చెప్పాడు.


"వస్తున్నాను." అంటూ ఆ కాల్ కట్ చేసేసి, హడావిడిగా పనిని సర్దేసి కదిలాడు సామ్రాట్ చిందరవందరగా.

అతడి వాలకం గమనించిన కోలీగ్స్ అతడిని ప్రశ్నించారు.

"నా మిసెస్.. కి.. యాక్స్డెంట్.. ఐందట." తడబడిపోతున్నాడు సామ్రాట్.

దాంతో వాళ్లలో ఒకరు, "ఎక్కడ." అడిగాడు సామ్రాట్ ని పట్టుకొని ఆపి.

సామ్రాట్ హస్పిటల్ పేరు చెప్పాడు.

ఆ కొలీగ్ సామ్రాట్ ని తీసుకొని అటు బయలుదేరాడు తన బైక్ తో.


హాస్పిటల్ చేరేక, రిసెప్షన్ లో వాకబు చేస్తుండగా, అక్కడే వేచి ఉన్న సామ్రాట్ కి ఫోన్ చేసిన ఆ ఒకతను, "నేను కృపాకర్. నేనే మీకు ఫోన్ చేసింది. ఆవిడను ఐసియులో పెట్టారు. రండి." అన్నాడు.


"తను ఎలా ఉంది." అడుగుతున్నాడు సామ్రాట్.

"లోపలి నుండి ఇంకా ఎవరూ రాలేదు." చెప్పాడు కృపాకర్.

సామ్రాట్ ని తన కొలీగ్ ఒడిసి పట్టే ఉన్నాడు. "కూల్. కూల్." అంటున్నాడు.

పావు గంట తర్వాత, ఒక డాక్టర్ ఐసియూ నుండి బయటికి వచ్చాడు.


"మీరే కదూ. ఆమెను తీసుకు వచ్చింది." అడిగాడు డాక్టర్, కృపాకర్ ను చూస్తూ.

"అవును సార్. ఆవిడ తాలూకా వాళ్లు వీళ్లు." చెప్పాడు కృపాకర్.

"డాక్టర్. తను ఎలా ఉంది." అడిగాడు సామ్రాట్ బొంగురు గొంతుతో.

"డోన్ట్ వర్రీ. రికవరీ అవుతారు. ట్రీట్మెంట్ మొదలు పెట్టాం. కొన్ని టెస్టులు అవుతున్నాయి. రిపోర్ట్స్ వస్తే మరింత నిర్థిష్టంగా చెప్పగలం." చెప్పేసి వెళ్లి పోయాడు డాక్టర్.


"కూల్ అవ్వండి సార్. ఏమీ కాదు." అన్నాడు కృపాకర్, సామ్రాట్ ను అక్కడే ఉన్న కుర్చీలో కూర్చుండబెడుతూ.

ఆ వెంబడే, "నేను సుమారుగా పది అడుగుల దూరంలో ఉండగా యాక్స్డెంట్ ఐంది. తను ఎదురుగా వేగంగా వస్తున్న బైక్ ను తప్పించుకుంటుండగా, తన స్కూటీ స్కిడ్ ఐనట్టు ఉంది. తను టక్కున కింద పడిపోయింది. ఆమె మీద స్కూటీ పడిపోయింది. పెద్ద గాయాలు ఏమీ కాలేదు. కానీ పొట్టకు గట్టి దెబ్బ ఏదో తగిలినట్టు ఉంది. పాపం పొట్ట పట్టు కొని ఆమె బాగా గింజుకున్నారు." చెప్పాడు.


"ఆ బైక్ వాడు ఆగలేదా." అడిగాడు సామ్రాట్ కొలీగ్.

"లేనట్టు ఉంది. ఒక్క సారి అంతా మూగేశారు. ఐనా తప్పు అతనిది కాదు. స్కూటీయే స్కిడ్ ఐనట్టు ఒక్క మారుగా పడిపోయింది." చెప్పాడు కృపాకర్.

కొన్ని నిమిషాల తర్వాత, సామ్రాట్ కుదురవుతూ, "థాంక్స్ అండీ." అన్నాడు కృపాకర్ ని చూస్తూ.


"ఇట్స్ ఓకే. సకాలంలో వైద్యం అందుతుంది. ఏమీ కాదు. ధైర్యంగా ఉండండి." అంటూ తన ఫోన్ నెంబర్ ఇచ్చి, "మరి నేను వెళ్తాను." అన్నాడు కృపాకర్.

"మీరేమైనా ఖర్చు పెట్టారా." అడిగాడు సామ్రాట్ కొలీగ్.


"అబ్బే. ఏమీ లేదు. తన వాళ్లు వస్తున్నట్టు హాస్పిటల్ వాళ్లకు చెప్పాను. బిల్లింగ్ మీరు చూసుకోండి. అలాగే ఆమె హేండ్, లంచ్ బ్యాగ్ లను, ఫోన్ ని హాస్పిటల్ వాళ్లకు అప్పగించాను." చెప్పాడు కృపాకర్. తర్వాత తను అక్కడ నుండి వెళ్లి పోయాడు.

"మీ వాళ్లకు ఇన్ఫర్మ్ చేయ్. వాళ్లు ఉండేది ఎక్కడ." అడిగాడు సామ్రాట్ కొలీగ్.

"డాడీ వాళ్లు ఇక్కడే ఉంటున్నారు." చెప్పాడు సామ్రాట్.

"మరి చేయ్." చెప్పాడు సామ్రాట్ కొలీగ్.


సామ్రాట్ జేబులోంచి ఫోన్ తీశాడు. గోపాలస్వామికి కాల్ చేశాడు.

***

పది రోజులు తర్వాత -

మూడు రోజులు క్రితం ఆషాఢ మాసం ముగిసింది.

ఉదయమే సాహసిని హాస్పిటల్ నుండి డిఛార్జ్ చేశారు.

ప్రస్తుతం గోపాలస్వామి ఇంట్లో అంతా ఉన్నారు.


కబురు తెలిసి మోహనరావు, శైలజలు ఎప్పుడో వచ్చి ఉన్నారు.

"కొన్నాళ్లు అమ్మాయిని మాతో ఉంచుకొని పంపుతాం." అంటుంది శైలజ.

"లేదు లేదు. హసి నాతోనే ఉంటుంది. నేను బాగా చూసుకుంటాను." చెప్పాడు సామ్రాట్.


"అది కాదు బాబూ." చెప్పబోతున్నాడు మోహనరావు.

"లేదంకుల్." అడ్డై అనేశాడు సామ్రాట్.

"అది కాదురా. వాళ్లడిగేది తప్పు కాదురా. అమ్మాయి వెళ్లని." అంది మాలతి.

"లేదమ్మా. అందరికీ చెప్పుతున్నాను. సాహసి నాతోనే ఉంటుంది. మరియు మా ఇద్దరం ఆ ప్లాట్ కు వెళ్లి ఉంటాం." చెప్పాడు సామ్రాట్.


"అదేంట్రా. అలా ఎలా. ఇప్పటి తన పరిస్థితిని బట్టి అమ్మాయికు బాగా రెస్ట్ అవసరం. తన వాళ్ల వద్ద ఉంటేనే తనకు వీలుగా ఉంటుంది. వెళ్లని. మనమే అప్పుడప్పుడు వెళ్లి వద్దాం." చెప్పాడు గోపాలస్వామి.

సామ్రాట్ 'ససేమిరా' అంటున్నాడు.


"నాన్నా. మాట విను. ఆడవాళ్ల ప్రొబ్లమ్ రా. అర్ధం చేసుకో." చెప్పింది మాలతి.

"లేదు. ఆడవాళ్లది అనేయకు. నా భార్యది అను. బాగుంటుంది. తన పరిస్థితి నేను తెలుసుకున్నాను. తనకు రెస్ట్ అవసరమే. అది నా వల్ల కూడా తనకి బాగా లభిస్తుంది. ప్రామిస్." చెప్పాడు సామ్రాట్. అతడు సాహసినే చూస్తున్నాడు.

సాహసి ఏమీ అనలేక పోతుంది.


గోపాలస్వామి కలగచేసుకున్నాడు. "నీ మొండితనం వల్ల నాకు ఇలా చెప్పవలసి వస్తుంది. మనకు తెలుసు. అమ్మాయి పొట్టలో గట్టి గాయం కావడంతో, తన గర్భసంచి తీసేయవలసి వచ్చింది. బయటికి తెలియక పోయినా, లోపల ఇంకా పచ్చిగానే ఉంటుంది. తనంతట తాను తిరిగే సమయం కాదు ఇది. కొన్నాళ్లు తనకు సపర్యలు అవసరం ఉంది." చెప్పాడు.


"అరె. నాకేం ఇవి తెలియవా. తనని మీ కంటే నేనే బాగా చూసుకోగలను. వినుకోండి. నేను తనని సంసారంకై తీసుకు వెళ్లడం లేదు, నా సపర్యలు అందించడంకై నాతో ఉంచుకుంటున్నాను." చెప్పాడు సామ్రాట్.

మిగతావారు ఎవరూ వెంటనే ఏమీ అనలేక పోతున్నారు.

అంతలోనే, "దయచేసి నాది మూర్ఖం అనుకోవద్దు. అర్థం చేసుకోండి." అన్నాడు సామ్రాట్.


పెద్దలు మొహాలు చూసుకుంటున్నారు.

"పర్వాలేదు. నేను ఇతనితోనే ఉంటాను. నన్ను ఇతను బాగా చూసుకోగలరు. నాకు తెలుసు." చెప్పింది సాహసి అప్పుడే.

"థాంక్స్ హసి. థాంక్యూ." అన్నాడు సామ్రాట్ గొప్పగా.

తర్వాత, తను కూర్చున్న చోట నుంచి లేచి, సాహసి పక్కకు చేరి, ఆమె చేతులను తన చేతుల్లోకి తీసుకొని, "మనం ఒకరికి ఒకరంగా ఉందాం. నాకు నువ్వు కావాలి. నేను నీకు ఉండాలి. ఇక మీదట నువ్వే నా బిడ్డవి. నేనే నీ బిడ్డను." అంటున్నాడు సామ్రాట్.

భళ్లున ఏడ్చేస్తూ, "థాంక్యూ.. థాంక్యూ సామ్రాట్." అంటుంది సాహసి.


తొలిమారుగా సాహసి పేరుతో తనను పిలవడంతో సామ్రాట్ మిక్కిలి సంతసిల్లుతున్నాడు.

సాహసి తొలుత నుండి సామ్రాట్ ని, తన సామ్రాట్ గానే పిలవాలని తలుస్తుంది.

***

(సమాప్తం)

***

ఈ సీరియల్ ను ఆదరించిన పాఠకులకు మనతెలుగుకథలు.కామ్ తరఫున, రచయిత శ్రీ బివిడి ప్రసాదరావు గారి తరఫున కృతజ్ణతలు తెలియజేసుకుంటున్నాము.

బివిడి ప్రసాదరావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


కథలు, నవలలు మరియు జోకుల పోటీల వివరాల కోసం



మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



Podcast Link

Twitter Link


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం : బివిడి ప్రసాదరావు.

30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.


రైటర్, బ్లాగర్, వ్లాగర్.

వీరి బ్లాగ్ - బివిడి ప్రసాదరావు బ్లాగ్

వీరి యూట్యూబ్ ఛానల్ - బివిడి ప్రసాదరావు వ్లాగ్

వీరి పూర్తి వివరాలు ఈ క్రింది లింక్ ద్వారా తెలుసు కోవచ్చు.




46 views0 comments

Comments


bottom of page