top of page

విరిసిన సుమం


'Virisina Sumam' New Telugu Story

(ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత)



(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)

"సుమా! సాయంత్రం సినిమా కెళదామా!” అడిగాడు రవి క్లాసు నుంచి బయటకు వస్తున్న సుమను.

"ఓకె రవి" అంది సుమ. ఎక్కడ? ఎన్నింటికి కలవాలో ఇద్దరూ మాట్లాడుకుని ఎవరిళ్ళకు వాళ్ళు వెళ్ళారు. సాయంత్రం ఇద్దరూ అనుకున్న సమయానికి సినిమా ధియేటర్లో కలిసి సినిమా చూసి ఆతర్వాత హొటలుకు వెళ్లి సరదాగా కాసేపు గడిపి ఇంటికి వెళ్ళారు. రవి, సుమ ఇద్దరూ ఒకే కాలేజీలో ఇంజినీరింగ్ ఆఖరి సం.. చదువుతూ ఏడాది నుంచి ప్రేమించుకుంటున్నారు. ఇద్దరి చదువు పూర్తి అయి మంచి ఉద్యోగం వచ్చేదాకా తమ ప్రేమ విషయం ఇంట్లో పేరెంట్సుకు చెప్పకూడదని నిర్ణయించుకున్నారు. ఇలా తరచూ సినిమాలకు, హోటల్స్ కు వెళ్ళి సరదాగా గడపడం వాళ్లకు అలవాటు.

సుమ తరచూ బయటకు వెళ్లి ఆలస్యంగా ఇంటికి రావడం తల్లి రాధ గమనించి కూతురిని నిలదీసింది. ఏదో ఒక అబధ్ధం అతికినట్టు చెపుతూ తల్లిని నమ్మించటంతో 'తన పెంపకాన్ని కూతురు వమ్ముచేయదులే ' అనుకుంది రాధ. తెలివిగలదీ, చురుకైనదీ అయిన సుమ అంటే తండ్రి శ్రీధర్ కు కూడా చాలా ఇష్టం. రోజులు గడుస్తున్నాయి. సుమ, రవిల చదువులు పూర్తయి మంచి కంపెనీలలో ఉద్యోగాలు పొందారు.

ఇద్దరి ఇళ్ళలోనూ పెళ్లి సంబంధాలు చూడటం మొదలుపెట్టారు. ఇద్దరూ వాళ్ళ వాళ్ళ పేరెంట్సుకు తమ ప్రేమ విషయం చెప్పి తమ నిర్ణయాన్ని తెలిపారు. ఇరు కుటుంబాల పెద్దలు ఏవేవో కారణాలతో పెళ్లికి అంగీకరించలేదు. ఒక రోజున రవి, సుమ రిజిస్టరు మారేజి చేసుకుని ఒక ఇంటిని అద్దెకు తీసుకుని కొత్త కాపురం మొదలు పెట్టారు. రోజూ ఉద్యోగం, సరాగాల కాపురంతో రవి, సుమలు ఆనందంగా ఉన్నారు. వాళ్ళ అన్యోన్య దాంపత్యానికి గుర్తుగా ఏడాది తిరిగేసరికి చక్కటి పాప పుట్టినది. ఆ పాపకు 'దీప' అని పేరు పెట్టుకుని ప్రేమగా పెంచుకుంటున్నారు. ఇద్దరినీ కంపెనీ వాళ్లు అమెరికా పంపారు. దీపని తీసుకుని ఇద్దరూ అమెరికా వెళ్ళారు. అక్కడికి వెళ్ళి ఇల్లు ఆదీ సమకూర్చుకున్నాక ఉద్యోగ కర్తవ్య నిర్వహణలో బిజీ అయ్యారు.

కొన్నాళ్లకి సుమ పేరెంట్సుల పట్టుదల సడలి వాట్సప్, ఫేస్ టైమ్ లలో కూతురు, అల్లుడితో మాటలు, మనుమరాలితో ముద్దు ముచ్చట్లు మొదలయ్యాయి. వీళ్ళ అన్యోన్య దాంపత్యంను చూసి విధికి కన్నుకొట్టిందేమో అన్నట్లుగా కొన్నాళ్లుగా రవి ప్రవర్తనలో మార్పు వస్తోంది. ఇంటికి సరిగ్గా రాకపోవటం, త్రాగుడు మొ... వ్యసనాలు అలవడి సుమని నిర్లక్ష్యం చేయడం, పాపను కూడా దగ్గరకు తీయకపోవడం చూసి సుమ చాలా బాధ పడి రవిలో మార్పుకు కారణం ఏమిటి? అని అడిగింది. "ఏంలేదు, మామూలే!" అని బుకాయించినా అతని కళ్ళల్లో అబధ్ధాన్ని పసిగట్టింది సుమ. కానీ కారణం తెలీలేదు. 'ఏదో పని ఒత్తిడేమో కొన్నాళ్ళకు అవే సర్దుకుంటాయిలే' అని ఓర్పు పట్టింది కానీ ఈ విషయాలు పేరెంట్సుకు చెప్పదలుచుకోలేదు. చెప్పి వాళ్ళను బాధపెట్టడం ఇష్టం లేదు సుమకు.

ఒక రోజున రవి "మేరీ" అనే అమ్మాయిని ఇంటికి తెచ్చి తన గర్ల్ ఫ్రెండ్ గా సుమకు పరిచయం చేశాడు. వాళ్ళిద్దరూ చాలా సన్నిహితంగా మెలగటం, కిలకిలా నవ్వులు, సరాగాలను చూసి సుమ బాధ పడినా ఇలాంటివి ఈ దేశంలో సహజం అని తన మనసుకు సర్దిచెప్పుకుంది. తను ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త కనుక వీసమెత్తైనా అనుమానం రాలేదు రవి మీద. ఇదే అలుసుగా భావించి రవి మేరీకి ఇంకా బాగా దగ్గరయి వివాహేతర సంబంధం కూడా పెట్టుకున్నాడు.

తరచూ రవి మేరీని ఇంటికి తేవడం, అతనే మేరీ ఇంటికి వెళ్ళడం పరిపాటి అయింది. ఇది సుమ మనసును బాగా కలచివేస్తోంది. ఈ విషయంలో సుమ‌, రవిల మధ్యన వాదనలు, గొడవలు అయి ముందు బుకాయించినా చివరకు రవి మేరీతో తనకున్న సంబంధాన్ని ఒప్పుకున్నాడు. సుమ నిర్ఘాంతపోయి బాధపడింది. కాపురం పాడుచేసుకోవటం ఇష్టం లేక చిన్న పిల్ల దీప కోసమన్నా తన ప్రవర్తనను మార్చుకోమని, ఇండియాకు వెళ్లి హాయిగా ఉందామని చెప్పింది.

రవి వినకపోగా "నీకు నచ్చకపోతే దీపను తీసుకుని ఇండియాకు వెళ్లి అక్కడే ఉండిపో" అని

సలహా ఇచ్చాడు. ఇక క్రమేపీ ఇద్దరి మధ్య దూరం పెరిగింది. తల్లి తండ్రుల గొడవలు అర్థం కాని 2 సం.. దీప ప్రేమగా దగ్గరకు తీసుకున్న తల్లిని తన బోసి నవ్వులతో అలరిస్తోంది.

తండ్రి ప్రవర్తన భవిష్యత్తులో ఆ పసిమనసుని ప్రభావితం చేస్తుందని భయపడి దీప భవిష్యత్తు కోసం మంచి నిర్ణయం తీసుకోవాలని అనుకుంది సుమ. బాగా ఆలోచించి మంచి వాతావరణంలో తన పిల్లను పెంచి బాగా చదివించి ప్రయోజకురాలిని చేయాలనుకుని రవికి విడాకులు ఇచ్చి దీపతో ఇండియాకు వెళ్ళే తన స్థిర నిర్ణయాన్ని చెప్పింది భర్తకు. రవి ఏమాత్రం బాధపడకపోగా ఎగిరి గంతేసినంత పని చేశాడు.

సుమ అక్కడ ఉద్యోగానికి రాజీనామా చేసి దీపను తీసుకుని ఇండియాలో పేరెంట్సు వద్దకు వచ్చింది. విషయం తెలిసి వాళ్లు బాధపడినా సుమ నిర్ణయాన్ని సమర్థించారు. సుమ లాయరును కలిసి రవికి విడాకుల నోటీసును పంపింది. అది రవికి కూడా ఇష్టమే కనుక వాటి మీద సంతకం చేసి పంపాడు. అతి త్వరలోనే విడాకులు మంజూరయ్యాయి. సుమ ఉద్యోగ ప్రయత్నం చేసి మంచి ఉద్యోగం సంపాదించుకుంది. జరిగినదంతా ఒక పీడకలగా మర్చిపోయి క్రొత్త జీవితం ప్రారంభించింది.

దీపను మంచి స్కూల్ లో చేర్చి వృధ్ధులైన తల్లి తండ్రులను దగ్గరుండి కంటీకి రెప్పలా చూసుకుంటోంది. దీప తన చిలిపి అల్లరి, ఆటపాటలతో వాళ్ళ మనసులను రంజింప చేస్తోంది. చిన్నప్పటి నుంచి సుమకు రచనలు వ్రాయటం చాలా ఇష్టం. చదువు, ఉద్యోగం, పెళ్ళి మొ... వాటితో ఆ కోరిక తీరలేదు. ఇప్పుడు రచనా వ్యాసంగాన్ని చేపట్టింది. ఉద్యోగ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ చక్కగా మంచి కవితలు, కధలు వ్రాస్తూ వివిధ పత్రికలకు పంపుతోంది. చాలా తక్కువ కాలంలోనే ప్రేక్షకుల మనసులను రంజింపచేసి వాళ్ళ ఆదరాభిమానములను చూరగొన్నది. కొన్నాళ్లకు వ్రృధ్ధాప్య బాథలతో సుమ తల్లి తండ్రులు గతించారు.

సుమ "దీపజ్యోతి" అనే అనాధాశ్రమాన్ని నెలకొల్పి చాలా మంది అనాధలను‌, వికలాంగులను చేరదీసి వాళ్ళను కంటికి రెప్పలాగా చూసుకుంటోంది. సుమ సేవలు నచ్చి అనేక స్వఛ్ఛంద సంస్థలు విరాళాలను ఇచ్చి ప్రోత్సాహిస్తున్నాయి. సుమకు ప్రభుత్వం "మహిళా రత్న " అనే బిరుదు నిచ్చి ఘన సన్మానం చేసింది.

దీప చక్కగా పెరిగి పెద్దదై ఇంజనీరింగ్ పూర్తి చేసి M. S. చదువు కోసం అమెరికా వెళ్ళింది. ఉద్యోగం, సేవాసంస్థల సేవలతో సుమ ఊపిరి సలపనంత బిజీగా ఉంటోంది. సుమ పేరుప్రతిష్టలు నలుదిశలా వ్యాపించింది. కొన్ని నెలల తర్వాత అమెరికా లోని ప్రవాస భారతీయులు సుమను సన్మానం చేయదలచి అక్కడకు ఆహ్వానించారు. దీపని కూడా చూడవచ్చు అని సుమ కొన్నాళ్ళు ఉద్యోగానికి శెలవు పెట్టి అనాధసంస్థ బాధ్యతలను పరిచయస్థులకు అప్పగించి అమెరికా బయలుదేరింది.

ఎయిర్ పోర్టుకు దీప వచ్చి తల్లిని ఇంటికి తీసుకుని వెళ్ళింది. 4 రోజులయ్యాక అక్కడ సుందర దృశ్యాలను చూపిస్తే సుమ ముగ్థురాలయింది. సుమకు సన్మానం చేసే రోజు రానేవచ్చింది. ప్రవాస భారతీయులందరూ సంఘసంస్కర్తగా, రచయిత్రిగా సుమ సేవలను పొగుడుతూ ఘనంగా సత్కరించారు.

కార్యక్రమం పూర్తవగానే కారెక్కబోతూ ఉంటే ఎవరో ఒకాయన ఎదురొచ్చి మాట్లాడటానికి ప్రయత్నించాడు. ఎవరా అని పరిశీలనగా చూస్తే రవి. జుట్టు బాగా నెరిసి, మాసిపోయిన గడ్డంతో పిచ్చి వాడిలా ఉన్నాడు రవి. సుమకు అతన్ని చూడటానికి కూడా మనస్కరించలేదు.

"మీతో కొంచెం మాట్లాడాలి. అనుమతిస్తారా? " అడిగాడు రవి. "చెప్పండి" అంది సుమ.

"సుమా! నేను చేసిన తప్పులను క్షమించవూ. మన బిడ్డ దీప కోసమన్నా మనం కలిసి ఉందాము" అన్నాడు తడబడుతూ రవి.

"సారీ. మీతో పరిచయం, ప్రేమ, పెళ్ళి,

సంసారం అవన్నీ ఒక పీడకలగా మర్చిపోయాను. ఇప్పుడు నేను, నాకూతురు సంతోషంగా ఉన్నాము. దయచేసి ఇంక ఎప్పుడూ మీరు మా జీవితాలలో అడుగు పెట్టద్దు. ఆటలాడుకోవద్దు. శలవు. " అని కారెక్కింది సుమ.

"ఆయన ఎవరు మమ్మీ?" అంది కారు డ్రైవింగ్ చేస్తూ దీప.

"ఎవరో పాపం! నాకూ తెలియదు. అచ్చు నాలాంటి పోలికలతో ఉన్న వాళ్ళవాళ్ళెవర్నో పోగొట్టుకున్నాడుట. ఒకసారి చూడాలని వచ్చాడు " అంది సుమ.

"నా జీవితాన్ని నాశనం చేసిన ఆయనే నీ కన్నతండ్రి" అని చెపితే పెళ్లి కావలసిన పిల్ల, మంచి బంగారు భవిష్యత్తు ఉన్న దీప జీవితం ఎక్కడ నాశనం అవుతుందో అని అబధ్ధమాడింది సుమ. దీప, సుమలు ఏవో కబుర్లు చెప్పుకుంటూ ఇంటికి వెళ్ళారు. అక్కడ కొన్నాళ్ళు ఉండి తిరిగి ముందుగా రిజర్వు చేయించుకున్న రోజుకు ఇండియా కు వచ్చి ఉద్యోగం, అనాధ సంస్థ కార్యక్రమాలు సమర్థవంతంగా నిర్వర్తిస్తూ ప్రశాంత జీవితం గడుపుతోంది సుమ.

....... సమాప్తం..

సమాప్తం.

నీరజ హరి ప్రభల గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

కథలు, నవలలు మరియు జోకుల పోటీల వివరాల కోసం

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


Twitter Link

Podcast Link

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.

మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.

గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత్రి పరిచయం :


30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత్రి బిరుదు పొందారు



"మన తెలుగు కధలు " వేదిక మిత్రులందరికీ నమస్కారం. నా పేరు నీరజ ప్రభల. నాది చాలా చిన్న కుగ్రామంలో చాలా సాంప్రదాయ కుటుంబంలో జననం. అగ్రహారం. నాన్న గారు బాలకృష్ణ మూర్తి గారు బ్రాంచి పోస్ట్ మాస్టర్, వ్యవసాయ దారుడు, పంచాయతీ ప్రెసిడెంట్. అమ్మ కమల గృహిణి . మేము ఆరుగురం సంతానం. నాకు ముగ్గురు అక్కయ్యలు, ఇద్దరు అన్నయ్యలు. అందరిలోకీ నేనే ఆఖరిదాన్ని. చిన్న దాన్ని. నాకు చిన్న వయసులోనే వివాహం. మేము విజయవాడలో ఉంటాము. నేను గృహిణిని. మా వారు వాసుదేవశర్మ. రిటైర్డ్ లెక్చరర్. మాకు ముగ్గురు అమ్మాయిలు. మా కూతుళ్ళు, అల్లుళ్ళు సాఫ్ట్ వేర్ ఇంజనీర్లుగా డెన్మార్క్ , అమెరికాలలో సెటిలయ్యారు. మా ముగ్గురు అమ్మాయిలు చిన్నప్పటి నుంచీ కర్ణాటక సంగీతం నేర్చుకుని అనేక పోటీలలో గెలుపొంది , ప్రతి సం.. త్యాగరాజ ఉత్సవాలలో కచేరీలు చేసి ప్రముఖ విద్వాంసుల ప్రశంసలు పొందటం నా అదృష్టంగా ఎల్లప్పుడూ భావిస్తాను. అంతేకాకుండా పాడుతా తీయగా, పాడాలనుంది, రాగం- సంగీతం మొ.. ప్రోగ్రాములలో పాల్గొని పెళ్ళైనాక కూడా విదేశాల్లో కచేరీలు చేస్తూ అందరిచే ప్రశంసలు పొందుతున్నారు. ప్రస్తుతం మాకు ఇద్దరు మనవరాళ్ళు, ఒక మనవడు. నాకు చదువంటే చాలా చాలా ఇష్టం. పిల్లలు సెటిలయ్యాక B.Com, MA సంస్కృతం, MAఇంగ్లీష్, MA తెలుగు చేశాను. సంగీతం - సాహిత్యం నాకు ప్రాణం. సంగీతం నేర్చుకున్నాను. ఇప్పుడు వీణ కూడా నేర్చుకుంటున్నాను. టైపు, షార్ట్ హాండ్ ప్రధమ శ్రేణి లో ఉత్తీర్ణత. కధలు-కవితలు వ్రాస్తాను. మీ అందరి ప్రోత్సాహంతో కధలు, కవితలు వ్రాస్తున్నాను . నాకధలు లోగడ పత్రికలలో కూడా ప్రచురితమైనవి. గార్డెనింగ్, స్టిచింగ్, అల్లికలు, సాఫ్ట్ టాయ్స్ బొమ్మలు, డ్రాయింగ్ , ఫాబ్రిక్ పెయింటింగ్, రంగవల్లులు, క్రియేటివ్ ఆర్టికిల్స్ తయారీ మొ.. నా హాబీ. అమ్మ , నాన్న గారు స్వర్గస్ధులయ్యి 10 సం.. అయినది. నాకు నా మాతృభాష తెలుగు అంటే చాలా చాలా ఇష్టం, అభిమానం‌, గౌరవం. ఈ వేదిక మీద మిమ్మల్నందరినీ పరిచయం చేసుకోవడం నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. నా కధలను ఆదరించి ప్రోత్సాహిస్తున్న మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు.🙏🙏



53 views0 comments
bottom of page