వృక్షాల సాక్ష్యం..
- Kasivarapu Venkatasubbaiah
- Sep 23
- 4 min read
#KasivarapuVenkatasubbaiah, #కాశీవరపువెంకటసుబ్బయ్య, #VrukshalaSakshyam, #వృక్షాలసాక్ష్యం, #తెలుగుపల్లెకథలు

Vrukshala Sakshyam - New Telugu Story Written By - Kasivarapu Venkatasubbaiah
Published In manatelugukathalu.com On 22/09/2025
వృక్షాల సాక్ష్యం - తెలుగు కథ
రచన : కాశీవరపు వెంకటసుబ్బయ్య
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
కేతవరంలో ఉన్న పుట్టింటికి రాయవరం నుంచి కాన్పుకు వచ్చింది కాంతమ్మ. కూతురు పుట్టింటికి వచ్చిన సంతోష సందర్భంగా వైభవంగా కూతురికి శ్రీమంతం చేశారు అమ్మా నాన్న, అన్నా వదినలు. పౌష్టికాహారం పెట్టి కూతుర్ని బంగారంలాగ చూసుకున్నారు. మూడు నెలల తర్వాత బంగారం లాంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది కాంతమ్మ.
పాప పుట్టిన తొమ్మిదవ రోజు పెద్ద ఎత్తున పురుడు చేశారు. ఐదవ నెలలో ఊరంతటిని పిలిచి పాపకు త్రిష అని పేరు పెట్టి నామకరణ ఉత్సవాన్ని పండుగ లాగా చేశారు పుట్టింటివారు.
ఒక రోజు ఉదయం ఇంట్లో అందరు పొలానికి పోయారు. కాంతమ్మ పాపకు స్నానం చేయిస్తూ "ఒరేయ్ అభిరామ్! నేను పాపను పెట్టుకుంటా నువ్వు చెంబుతో నీళ్ళు పోస్తువు రా రా" అని ఆరేళ్ల అన్న కొడుకును పిలిచింది కాంతమ్మ.
వాడు పిల్ల చేష్టలతో, ఆటల మీద మోజుతో "నేను పొయ్యను పో" అన్నాడు.
"ఒరేర్రేయ్! నాయినా! బాబూ! ఒక్కదాన్ని పోసుకోలేక పోతున్నాను రా! రోంత సాయం చేస్తువు రా రా!" బతిమాలింది మేనల్లుణ్ణి.
"నేను పొయ్యను పో! నేను ఆడుకోవాల!" అన్నాడు.
"నువ్వు ఇప్పుడు పాపకు నీళ్ళు పోస్తే, పాప పెద్ద అయ్యాక నీకే ఇచ్చి పెళ్లి చేస్తా!" పిల్లాడికి ఆశ చూపించింది కాంతమ్మ.
"నిజంగా పాపనిచ్చి పెళ్లి చేస్తావా? నే నమ్మను పో!" అన్నాడు అభిరామ్.
"నిజంగా నీకే ఇచ్చి పెళ్లి చేస్తాను. కావాలంటే అక్కడ కనిపించే రావి వేప చెట్లు సాక్ష్యం" అంది కాంతమ్మ.
"మాట తప్పకుండా పిల్లనిచ్చి పెళ్లి చేస్తావా? ఈరెండు చెట్లే సాక్ష్యం? అట్లా అయితే పాపకు నీళ్ళు పోస్తాను." అని అత్త పాపకు సున్ని పిండి రుద్దుతుంటే, అల్లుడు చెంబు బానలో ముంచి పాపకు నీళ్ళు పోశాడు.
సంవత్సరం అయ్యింది. పాప త్రిషకు తొలి పుట్టిన రోజు చాల గొప్పగా జరిపి, కూతురికి అల్లుడికి కొత్త బట్టలు పెట్టి, కూతురికి ఒడి బియ్యం పోసి మెట్టినింటికి సాగనంపారు పుట్టినింటివారు.
కాలగమనంలో ఇరవై సంవత్సరాలు గిర్రున తిరిగి పోయాయి. కాంతమ్మ భర్త వ్యవసాయమే కాక వ్యాపారం కూడా చేసి బాగ ధనం సంపాదించాడు. పుట్టింటివారు మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఎదుగు బొదుగు లేకుండా ఉండిపోయారు. అభిరామ్ మాత్రం పట్టణంలో చదువుకొని ఒక స్థాయి ఉద్యోగంలో చేరి కొంత ప్రయోజకత్వం సాధించాడు.. త్రిష నగరంలో చదివి ఉన్నత స్థాయికి చేరుకుంది.
త్రిషకు పెళ్లి చెయ్యాలని ఉన్నత సంబంధాల కోసం వెతకడం ప్రారంభించారు కాంతమ్మ ఆమె భర్త. అది తెలిసిన అభిరామ్ తల్లిదండ్రులతో "అమ్మా!నాన్నా! నాకు త్రిషంటే ఇష్టం. మీరు అత్తామామలతో పెళ్లి విషయం మాట్లాడండి" చెప్పాడు.
చెల్లెలు ఇంటికి పోయి పెళ్లి సంబంధం అడుగగా "అన్నా! మీరు ఎదుగుదల లేకుండా ఎక్కడివారు అక్కడే ఉన్నారు. అభిరామ్ ఏదో కొంత చదివి ఒక మోస్తరు స్థాయికి ఎదిగాడు. ఇక మేము ధన సంపాదనలో అంచలు అంచలుగా ఎదిగి ఈరోజు ఊరిలో ముందు వరుసలో ఉన్నాం. త్రిష ఉన్నత చదువులు చదివి గొప్ప దశకు చేరుకుంది. కాబట్టి మా స్థాయికి మీరు తగరు. మాకు తగిన గొప్ప సంబంధం కోసం వెతుకుతున్నాం. మీరు వెళ్ళొచ్చు " చెప్పి అన్నా వదినను పంపించి వేసింది కాంతమ్మ.
"విషయం తెలుసుకున్న అభిరామ్ అత్త ఊరెళ్లి ఊరి పెద్దలందరిని కూడేసి " అయ్యలారా! ఊరి పెద్దలారా! మా అత్త కాంతమ్మ నా మరదలు త్రిషను నాకు ఇచ్చి పెళ్లి చేస్తాను అని మాట ఇచ్చి ఈనాడు మాకంటే ధనవంతులు అయ్యారని మాట తప్పుతుంది. మీరే కలుగజేసుకుని ఇప్పించమని మనవి చేసుకుంటున్నాను" పెద్దలకు పంచాయతీలో విన్నవించుకున్నాడు అభిరామ్.
పంచాయతీ పెద్దలు కాంతమ్మను ఆమె భర్తను పిలిపించి అభిరాంకు ఇచ్చిన వాగ్దానం విషయం అడిగారు.
"నేను వాగ్దానం చెయ్యలేదు, మాట ఇచ్చి మాట తప్పలేదు" అబద్దం ఆడింది కాంతమ్మ.
"మా అత్త మాటిచ్చి అబద్దమాడుతుంది. నాకు ఆరేళ్ల వయసప్పుడు పాప పెద్ద అయ్యాక నీకే ఇచ్చి పెళ్లి చేస్తాను అని వాగ్దానం చేసింది" వాదించాడు అభిరామ్.
"అయితే సాక్ష్యం ఏముంది?" అనింది కాంతమ్మ.
"సాక్ష్యం ఉంది. మా ఊరి దగ్గర ఉన్న రావిచెట్టు వేపచెట్టు సాక్ష్యం" అన్నాడు అభిరామ్.
"చెట్లు ఎక్కడన్నా సాక్ష్యం చెప్పుతాయా అభిరామ్ నీ వెర్రి కాకపోతే. " అడిగారు పెద్దలు.
"నా మాట సత్యమైతే చెట్లు సాక్ష్యం చెప్పుతాయి. నేను చెప్పిస్తాను. పిల్లను ఇప్పించి పెళ్లి చేస్తారా? పెద్దలను అడిగాడు అభిరామ్.
"కాంతమ్మా! చెట్లతో సాక్ష్యం చెప్పిస్తే పిల్లనిచ్చి పెళ్లి చేస్తావా" అడిగారు పెద్ద మనుషులు.
"చెట్లతో సాక్ష్యం చెప్పిస్తే మాట తప్పకుండా పిల్లనిచ్చి పెళ్లి చేస్తాను" సాధ్యం కాదనే ధీమాతో మాట ఇచ్చింది కాంతమ్మ.
"అభిరామ్! నీవు చెట్లను తోడుకొని వచ్చి సాక్ష్యం ఇప్పించు! నీకు పిల్లను ఇప్పించి పెళ్లి చేయిస్తాం" పెద్దలు చెప్పారు.
సరేయని అభిరామ్ సొంత ఊరు పోయి వృక్షాలు చుట్టూ ముమ్మారు ప్రదక్షిణ చేసి నమస్కరించి "మహావృక్షములారా! మా అత్త తన కూతురు పెద్ద అయ్యాక నీకే ఇచ్చి పెళ్లి చేస్తాను. ఈ వృక్షాలే సాక్ష్యం అని వాగ్దానం చేసింది కదా! ఇప్పుడు మాట తప్పి పిల్లనిచ్చి పెళ్లి చెయ్యను, నేను మాట ఇయ్యలేదు అని అబద్దం ఆడుతుంది. మీరు వచ్చి సాక్ష్యం ఇవ్వండి. " అని వేడుకున్నాడు.
"అభిరామ్! మేము వచ్చి సాక్ష్యం చెప్పుతాం. నీవు వెనక్కి చూడకుండా ముందుకు పోతూవుండు, మేము వెనుక వస్తూ ఉంటాం. నీవు వెనక్కి తిరిగి చూశావో మేము అక్కడే నిలిచి పోతాం. " అభిరాంతో అన్నాయి వృక్షాలు.
అట్లానే అని అభిరామ్ ముందుకు పోసాగాడు. ఊరి పొలిమేరకు పోయాక వృక్షాలు వస్తున్నాయో లేదో అని అనుమానంతో వెనక్కి తిరిగి చూశాడు అభిరామ్.
"వెనక్కి తిరిగి చూశావు కాబట్టి మేము ఇక్కడే ఉంటాము. నీవు పోయి పెద్ద మనుషులను పిలుచుకొని రాపో అభిరామ్.
మేము ఇక్కడే సాక్ష్యం చెపుతాం" అన్నాయి వృక్షాలు.
ఎంత పని చేశాను అని చింతిస్తూ అభిరామ్ పెద్ద మనుషుల దగ్గరకు పోయి జరిగిన ఉదంతాన్ని తెలిపి "రెండు వృక్షాలు పొలిమేర వరకు వచ్చాయి. మీరంతా రాండి సాక్ష్యం చెప్పుతాయి" చెప్పాడు.
అంతా ఆశ్చర్యపోయి పెద్ద మనుషులు, అత్త కాంతమ్మ, ఆమె భర్త అందరు కలిసి పొలిమేరకు పోయి చూశారు. అక్కడ వృక్షాలు ఉండడం చూసి విభ్రాంతి గురైనారు.
పెద్ద మనుషులు వృక్షాలకు నమస్కారించి "ఓ వృక్ష రాజములారా! కాంతమ్మ అభిరాంకు తన కూతురు పెద్దైయాక బిడ్డ నిచ్చి పెళ్లి చేస్తాను అని మాట ఇచ్చిందా? సాక్ష్యం చెప్పే ఈ సమస్యను పరిష్కరించండి" అని కోరారు పెద్ద మనుషులు.
"ఔను ఈ కాంతమ్మ అభిరామ్ ఆరేళ్ల వయసు ఉన్నప్పుడు అభిరాంతో పాప పెద్ద అయ్యాక నీకే ఇచ్చి పెళ్లి చేస్తాను అని వాగ్దానం చేసింది. మేమే సాక్ష్యం. లేదని అబద్దం ఆడితే ఆమెకే నష్టం కలుగుతుంది " అని సాక్ష్యం ఇచ్చాయి జంట వృక్షాలు.
కాంతమ్మ వాగ్దానం చేసిన విషయం ఒప్పుకుని "అబద్దం ఆడి తప్పు చేశాను. క్షమించండి వృక్ష దేవతలారా! అభిరాంకు త్రిషను ఇచ్చి వివాహం జరిపిస్తాను. " చెప్పుకుంది కాంతమ్మ.
పెద్దల సమక్షంలో అభిరామ్ త్రిషల వివాహ మహోత్సవం అత్యంత వైభవంగా జరిపించారు కాంతమ్మ ఆమె భర్త.
శోభనం రోజు త్రిష అభిరాంతో "నన్ను మొత్తం మీద పోరాడి సాధించుకున్నావే బావా" త్రిష మెచ్చుకోలుగా అన్నది.
"నీమీద నాకున్న ప్రేమ అలాంటిది త్రిషా!" అన్నాడు ఆప్యాయంగా అభిరామ్.
-------
కాశీవరపు వెంకటసుబ్బయ్య గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ కాశీవరపు వెంకటసుబ్బయ్య గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:
Profile Link:
YouTube Playlist Link:
పేరు కాశీవరపు వెంకటసుబ్బయ్య.
పుట్టింది 1960లో.
చదివింది డిగ్రీ.
నివాసం ఉంటున్నది కడప జిల్లా ప్రొద్దుటూరులో.
అమ్మానాన్నలు - చిన్నక్క, వెంకటసుబ్బన్న.
భార్య - కళావతి.
సంతానం - రాజేంద్ర కుమార్ , లక్ష్మీప్రసన్న, నరసింహ ప్రసాద్ .
కోడలు - త్రివేణి. అల్లుడు - హేమాద్రి (సాగర్). మనుమరాలు - శాన్విక. తన్విక
మనుమడు - దేవాన్స్ విక్రమ సింహ
రచనలు - ఎద మీటిన రాగాలు' కవితా సంపుటి, 'తుమ్మెద పదాలు' మినీ కవితల సంపుటి,
'పినాకిని కథలు' కథల సంపుటి.
రానున్న రచనలు - 'చమత్కార కథలు' చిన్న కథల సంపుటి. 'పౌరాణిక పాత్రలు, చారిత్రక వ్యక్తులు' కథల సంపుటి.
సన్మానాలు సత్కారాలు - సాహితీమిత్రమండలి.
పెన్నోత్సవం 2004.
జార్జి క్లబ్ వారు,
ప్రొద్దుటూరు నాటక పరిషత్.
యువ సాహితీ. గాజులపల్లి పెద్ద సుబ్బయ్య అండ్ సుబ్బమ్మ గార్ల సేవా సమితి.
స్నేహం సేవా సమితి.
కళా స్రవంతి.
తెలుగు సాహితీ సాంస్కృతిక సంస్థ.
NTR అభిమాన సంఘం.
తెలుగు రక్షణ వేదిక
వండర్ వరల్డ్ రికార్డు కవి సత్కారం.
గోదావరి పుష్కర పురస్కారం.
కృష్ణా పుష్కర పురస్కారం.
స్వామి క్రియేషన్స్.
కృష్ణదేవరాయ సాహితీ సమితి.
భానుమతి స్వరం మీడియా.
కళాభారతి. కొలకలూరి ఇనాక్ జాతీయ కవితా పురస్కారం అందుకున్నాను
Comments