యుద్ధ ఖైదీ
- Kandarpa Venkata Sathyanarayana Murthy
- May 10
- 6 min read
#YuddhaKhaidi, #యుద్ధఖైదీ, #KandarpaMurthy, #కందర్పమూర్తి, #సైనికసాహసకథ

Yuddha Khaidi - New Telugu Story Written By Kandarpa Murthy
Published In manatelugukathalu.com On 10/05/2025
యుద్ధ ఖైదీ - తెలుగు కథ
రచన: కందర్ప మూర్తి
దేశ సరిహద్దు నియంత్రణరేఖ వద్ద భీకర యుద్ధం జరుగుతోంది. టైగర్ హిల్ పోస్టు శత్రుసైనికుల చేతికి చిక్కి చాలామంది జవాన్లు తుపాకుల తూటాలతో శరీరాలు
ఛిద్రమై ప్రాణాలు వదిలారు.
పోస్టు చుట్టూ శత్రుసైనికుల భీకర అరుపులు కదలికలతో బంకర్లు గోలగా ఉన్నాయి. కనబడిన సైనికులను అంతం చేస్తూ బంకర్ తో పాటు మిగిలిన మందుగుండు సామగ్రీ
వారి ఆధీనంలోకి తీసుకున్నారు శత్రు సైనికులు.
"మేజర్ సాబ్! ఈ భారత సైనిక హవిల్దారు గాయాలతో స్పృహ తప్పి పడున్నాడు. ఇతన్ని ఖతమ్ (చంపేదా) చేసేదా ? " ఉర్దూలో అడిగాడు శత్రు సైనిక సుబేదార్.
"వద్దు, సుబేదార్ గారూ! అతనూ మనలాగే సైనికుడు. అతనకీ తల్లి తండ్రి భార్యా పిల్లలు ఉంటారు. అతను తన దేశం కోసం యుద్ధం చేస్తున్నాడు. మనకి అతనితో ఎటువంటి శత్రుత్వం లేదు. మనలాగే పై అధికారుల ఆజ్ఞను పాలించి ఆయుధాలు ఎత్తి పెట్టాడు. ముందుగా ఇతనికి వైద్యం చేయించండి. తర్వాత మన ఆఫీసర్ కల్నల్ సారు ఎలా చెబితే అలా చేద్దాం. " ఆర్మీ మేజర్ అనునయించాడు.
"అలాగే, సార్!" శల్యూట్ చేసాడు సుబేదార్.
***
భారతదేశ సరిహద్దు సైనిక స్థావరం పై శత్రుసైనికుల అకస్మాత్ దాడికి బంకర్లలో యుద్ధం చేస్తున్న
పటాలం తుపాకుల తూటాల ధాటికి బలై ప్రాణాలు వదిలారు. ఎటు చూసినా బులెట్ గాయాలతో
భారత సైనికుల శవాలు పడిఉన్నాయి.
కొద్ది సమయం తర్వాత హెలీకాఫ్టర్లలో అదనపు భారత దళాలు చేరేలోపు శత్రు సైనికులు బంకర్లలోని ఆయుధాలు మందుగుండు సామగ్రీతో అంతర్జాతీయ సరిహద్దు దాటి వారి భూభాగంలోకి పారిపోయారు.
భారత సైనిక స్థావరానికి చేరిన అదనపు బలగాలు బంకర్లలో చని పోయిన సైనికుల మృత దేహాలను గుర్తించి వివరాలు తయారు చేస్తున్నారు.
ప్లాటూన్ లో చనిపోయిన ఒక్కొక్కరి పేరు, ర్యాంకు, సర్వీస్ నంబరు లిస్టు తయారు చేసారు. చివర్లో ప్లాటూన్ కమాండర్ హవిల్దారు రాంసింగ్ జాడ తెలియలేదు. శత్రు సైనికుల రైఫిల్ బులెట్ తగిలి చనిపోయి ఉండవచ్చు. మరి చనిపోయిన శరీరం ఏమైందో తెలియడం లేదు. బులెట్ తగిలి పోస్టు నుంచి శత్రుస్థావరం వైపు పడి చనిపోయినట్టు నిర్ధారణ కొచ్చారు కమాండర్లు.
***
అక్కడ శత్రుసైనిక స్థావరంలో తుపాకీ గుళ్లు తగిలి కొన ఊపిరితో ఉన్న భారత సైనిక రాంసింగ్ ను తమవెంట తీసుకుపోయి భారతసైనిక స్థావరాల రహస్యాలు తెలుసుకోడం కోసం వారి కమాండర్ ఆర్డర్ ప్రకారం వారి సైనిక చికిత్సాలయంలో చేర్చి చికిత్స జరిపించగా కొన్నాళ్లకు కోలుకున్నాడు కాని తలకి తగిలిన గాయం కారణంగా గతాన్ని మరిచి తన వివరాలు చెప్పలేకపోతున్నాడు. శత్రు సైనిక పహరాలో వారి అధీనంలో బందీగా రోజులు గడుపుతున్నాడు.
***
టైగర్ హిల్స్ చౌకీ మీద శత్రుసైనికుల చేతిలో హవల్దార్ రామ్ సింగ్ చనిపోయాడని అతని పార్థివ శరీరం భారత సైన్యానికి లభించలేదని తెల్సింది. ఎన్ని ప్రయత్నాలు చేసినా హవల్దారు శరీరం లభించలేదు.
ఆయన చనిపోయినట్టుగా నిర్దారించి హవల్దారుకి సంబంధించిన వస్తు సామగ్రి కుటుంబ సబ్యులకు
స్వగ్రామంలో సైనిక గౌరవ మర్యాదలతో అందచేసారు.
స్వగ్రామంలో రామ్ సింగ్ ముసలి తల్లి దండ్రులు, భార్య సుమతి, ఎనిమిది సంవత్సరాల కొడుకు మున్నా, ఐదు సంవత్సరాల పింకీతో పాటు గ్రామ ప్రజలు రామ్ సింగ్ వీరమరణం పట్ల విషాదం అలుముకుంది. సంతాప సభలు జరిగాయి. ఆయన ప్రతిమను ఊరి కూడలిలో ప్రతిస్టించారు.
***
శత్రుసైనిక అధీనంలో జైలు జీవితం గడుపుతున్న రామ్ సింగ్ మిలిటరీ ఖైదీగా ఐదు సంవత్సరాలు గడిచాయి. మిగతా సైనిక ఖైదీలతో దుర్భర జీవితం గడుపుతున్నాడు. యుద్ధ ఖైదీగా తీసుకెళ్లిన శత్రు సైనిక సిబ్బంది హవల్దార్ రామ్ సింగ్ వివరాలు భారత సైన్యానికి తెలియచేయలేదు. భారత దేశానికి అప్పగించ లేదు.
ఒకరోజు జైలులో కక్షతో తోటి ఖైదీల దాడిలో రాంసింగ్ కి తల మీద బలమైన దెబ్బ తగిలి స్పృహ తప్పి కోమాలో కెళిపోయాడు. మిలిటరీ జైలు అధికారులు వెంటనే స్పందించి సైనిక ప్రత్యేక వైద్యశాలలో చేర్పించి చికిత్స చేయించారు.
హవిల్దారు రాంసింగ్ తలకి చికిత్స జరిగిన తర్వాత అద్భుతం జరిగి తన గత జీవితం గుర్తుకు వచ్చింది. తను శత్రు సైనిక స్థావరంలో ఉన్నట్టు గ్రహించాడు
తను భారత సైన్య స్థావరం నుంచి ఎలా శత్రువులకు చిక్కి ప్రాణాలతో బయట పడిందీ అర్థం కాలేదు. శత్రు సైన్యం ఒక్క సారిగా నాలుగు వైపుల నుంచి ఎటాక్ చెయ్యడంతో పికెట్ పోస్టు నుంచి తన ప్లాటూన్ జవాన్లతో ధైర్యంగా ఎదుర్కోవడం తనకి బుల్లెట్ తగలడం వరకే తెలుసు.
ఇప్పుడు చూస్తే తను శత్రుసైనికుల అధీనంలో ఉన్నట్టు తెల్సింది. తన ప్లాటూన్ సహచరుల ఆచూకీ ఏమీ తెలియడం లేదు.
ఇప్పుడు తను స్పృహలో కొచ్చినట్టు తెలిస్తే భారత సైనిక స్థావరాల రహస్యాలు చెప్పమని చిత్ర హింసలు పెడతారు. కనుక తను మతిలేనట్టే ప్రవర్తించి వీళ్ల రహస్యాలు తెలుసుకుని ప్రాణాలతో భారత భూభాగం చేరాలని నిశ్చయించుకున్నాడు.
వైద్యశాల నుంచి రాంసింగ్ ను మిలిటరీ జైలుకి తీసుకు వచ్చారు సైనిక సిబ్బంది. జైలులో తోటి ఖైదీలు ఎన్ని దుర్భాషలు మాట్లాడుతున్నా, దెబ్బలు కొడుతున్నా సహనంతో ఓర్చుకుంటూ ఎలా అక్కడి నుంచి తప్పించుకోడానికి సమయం కోసం ఎదురు చూస్తున్నాడు. మతి లేని వాడిగానే ప్రవర్తిస్తున్నాడు.
ఇలా ఉండగా కొద్ది రోజుల తర్వాత భారత సైన్యానికి చెందిన ఒక కచ్ఛర్ ( సైన్యానికి పర్వత ప్రాంతాల్లో ఆహార పదార్దాలు, ఇంధనం, ఆయుధ సామగ్రీ చేరవేసే తర్ఫీదు పొందిన కంచర గాడిద ) దారి తప్పి సరిహద్దు దాటి శత్రు స్థావరాల వైపు రావడంతో శత్రుసైనికులు దాన్ని బంధించి వారి ఆధీనంలో ఉంచారు.
సాధారణంగా సైనిక శిబిరాలలో ఉండే శునకాలు, కంచర గాడిదలు, ఒంటెలు వంటి జంతువులకు సైనికుల మాదిరి అన్ని రంగాల్లో తర్ఫీదు ఇచ్చి దేశ సరిహద్దు ప్రాంతాల్లో విధులకు పంపుతారు. ఒకవేళ శత్రు సైనికులకు చిక్కినా తెలివిగా తప్పించుకునే కిటుకులు నేర్పుతారు. వాటికి సంకేతాల ద్వారా తర్ఫీదు ఇస్తారు.
ఇప్పుడు దారి తప్పి వచ్చిన కంచరగాడిద పేరు ఆజాద్. అది మెడ మీద తెల్ల మచ్చలుండి ప్రత్యేకంగా కనబడుతుంది. అప్పుడప్పుడు ఆజాద్ హవిల్దార్ రాంసింగ్ విధులు నిర్వహించే పికెట్లకు ఆహార పదార్థాలు, నీళ్లు చేరవేస్తూండేది. రాంసింగ్ దానికి చపాతీలు, బిస్కెట్లు తినిపించేవాడు. శునకాల మాదిరి గుర్రపు జాతికి చెందిన కంచర గాడిదలు కూడా విశ్వాసం, గుర్తింపు గల జంతువులు.
సరిహద్దు దాటి వచ్చిన కచ్ఛర్ కనక ఆజాద్ ని జాగ్రత్తగా బంధించి తర్వాత వారి సైనిక సేవలకు
ఉపయోగించు కోవాలనుకున్నారు శత్రు సైన్యం.
ఒకరోజు యాధృచ్ఛికంగా సైనిక ఖైదీలతో తోటపనులు చేస్తున్న రాంసింగ్ కంట పడింది భారత సైనిక కచ్ఛర్ ఆజాద్. అది భారత సైన్యానికి చెందిన ఆజాద్ గా గుర్తించాడు. అది సరిహద్దు ప్రాంతం బాగా పసికట్ట గలదు.
ఎలాగైనా ప్రాణాలకు తెగించైనా ఆజాద్ సహాయంతో సరిహద్దు దాటి భారత భూభాగంలో చేరుకోవాలని తలిచి సమయం కోసం ఎదురు చూస్తున్నాడు.
ఒకరోజు శత్రు స్థావరాల్లో వారి సంప్రదాయ పండగ ఉత్సవాల్లో మునిగి మత్తు ద్రవాలు సేవించి మజా
చేస్తున్నారు. ఆటపాటలు తిండి తిని అందరూ ఒళ్లు మరిచి ఉన్నారు.
ఇదే అదునుగా హవల్దార్ రాంసింగ్ మెల్లగా కచ్ఛర్ ఆజాదును బంధించిన స్థావరాని కొచ్చి దానికి భారత సైనిక సంకేతం ఇచ్చాడు. కంచర గాడిద ఆజాద్ రాంసింగును గుర్తించింది. అప్పుడప్పుడు తనకి పికెట్ మీద తిండి పెట్టేవాడని గుర్తు పట్టింది. తనలాగే శత్రు శిబిరంలో చిక్కుకున్నాడని గ్రహించింది. అతని సంకేతాన్ని అందుకుంది.
సాయంకాలమైంది. శత్రుసైనిక స్థావరాలలోఅందరూ ఆదమరిచి మత్తులో ఉన్నారు. ఇదే అదనుగా రాంసింగ్ జైలు ఆవరణ నుంచి మెల్లగా గాడిద ఆజాద్ ఉన్న ప్రదేశానికి చేరుకుని దానికి బంధ విముక్తి కావించాడు. విశ్వాసం తో రాంసింగ్ చేతిని స్పర్సించి తన వీపు మీద సవారి చేయమని సంకేత మిచ్చింది.
రాంసింగ్ వీపు మీద కూర్చోగానే పరిసరాలు గుర్తిస్తూ కంచె దాటి భారత భూభాగంలో ప్రవేసించి నోటితో సకిలించింది. భారత సైనిక సిబ్బంది ఒక్కసారిగా ఎలర్టై పొజిషన్లు తీసుకున్నారు. కచ్ఛర్ ఆజాద్ ను చుట్టుముట్టి హవల్దార్ రాంసింగ్ ను అదుపులోకి తీసుకున్నారు.
బక్క చిక్కిన శరీరం, పెరిగిన గెడ్డం, చింపిరి జుత్తుతో యుద్ధ ఖైదీగా ఉన్న రాంసింగ్ బుల్లెట్ తగిలి అపస్మారక స్థితిలో శత్రుసైనికులకు బంధీగా చిక్కి అనుభవించిన కష్టాలు, ప్రాణాల మీద ఆశ వదులుకున్న సమయంలో ఆజాద్ చొరవతో సరిహద్దు దాటి భారత భూభాగంలో చేరడం వరకూ వివరంగా భారత సైనిక సిబ్బందికి తెలియ చేసాడు.
భారత సైనిక వైద్యచికిత్సాలయంలో తగిన చికిత్స జరిపి మంచి ఆహార సదుపాయం అందించగా రాంసింగ్ తొందరగా కోలుకున్నాడు. తర్వాత సైనిక హెడ్ క్వార్టర్స్ కి పంపి అక్కడ జరగ వలసిన ఆంతరంగిక విధులు ముగించారు.
హవల్దార్ రాంసింగ్ ను రక్షణదళ సన్మాలతో గౌరవించి పదవీ విరమణ సదుపాయాలు కల్పించి స్వగ్రామానికి పంపేరు.
యుద్ధంలో చనిపోయాడనుకున్న రాంసింగ్ ప్రాణాలతో సన్మాన సత్కారాలతో తిరిగి రావడం చూసి కుటుంబ సబ్యులు, గ్రామస్తులకు పట్టరాని ఆనందం కల్గింది. జిల్లా అధికారులు, గ్రామ ప్రజల సమక్షంలో ఘన సన్మానం జరిగింది.
కచ్ఛర్ ఆజాద్ సాహసంతో శత్రు సైనిక స్థావరం నుంచి తనతోపాటు భారత సైనికుణ్ణి రక్షించినందుకు జనవరి 26, దేశ గణతంత్ర దినోత్సవం రోజున కవాతులో సాహస పతకంతో సన్మానం అందుకుంది.
సమాప్తం
కందర్ప మూర్తి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం: https://www.manatelugukathalu.com/profile/kandarpamurthy
పూర్తి పేరు : కందర్ప వెంకట సత్యనారాయణ మూర్తి
కలం పేరు : కందర్ప మూర్తి
పుట్టి పెరిగిన ఊరు : 02 జూలై -1946, చోడవరం (అనకాపల్లి జిల్లా)ఆం.ప్ర.
భార్య పేరు: శ్రీమతి రామలక్ష్మి
కుమార్తెలు:
శ్రీమతి రాధ విఠాల, అల్లుడు డా. ప్రవీణ్ కుమార్
శ్రీమతి ఉషారమ , అల్లుడు వెంకట్
శ్రీమతి విజయ సుధ, అల్లుడు సతీష్
విద్యార్థి దశ నుంచి తెలుగు సాహిత్యం మీద అభిలాషతో చిన్న కథలు, జోకులు, కార్టూన్లు వేసి పంపితే పత్రికలలో ప్రచురణ జరిగేవి. తర్వాత హైస్కూలు చదువులు, విశాఖపట్నంలో పోలీటెక్నిక్ డిప్లమో కోర్సు చదివే రోజుల్లో 1965 సం. ఇండియా- పాకిస్థాన్ యుద్ధ సమయంలో చదువుకు స్వస్తి పలికి ఇండియన్ ఆర్మీ మెడికల్ విభాగంలో చేరి దేశ సరిహద్దులు,
వివిధ నగరాల్లో 20 సం. సుదీర్ఘ సేవల అనంతరం పదవీ విరమణ పొంది సివిల్ జీవితంలో ప్రవేసించి 1987 సం.లో హైదరాబాదు పంజగుట్టలోని నిజామ్స్ వైద్య విజ్ఞాన సంస్థ (నిమ్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్) బ్లడ్ బేంక్ విభాగంలో మెడికల్ లేబోరేటరీ సూపర్వైజరుగా 18 సం. సర్వీస్ చేసి పదవీ విరమణ అనంతరం హైదరాబాదులో కుకట్ పల్లి
వివేకానందనగర్లో స్థిర నివాసం.
సుదీర్ఘ ఉద్యోగ సేవల పదవీ విరమణ తర్వాత మళ్లా తెలుగు సాహిత్యం మీద శ్రద్ధ కలిగి అనేక సామాజిక కథలు, బాల సాహిత్యం, సైనిక జీవిత అనుభవ కథలు, హాస్య కథలు, విశ్లేషణ వ్యాసాలు, కవితలు, గేయాలు రాయగా బాలమిత్ర, బుజ్జాయి, బాలల చంద్ర ప్రభ, హాయ్ బుజ్జీ,
బాలభారతం, బాలబాట, మొలక, సహరి, సాక్షి ఫన్ డే, విపుల,చిన్నారి, హాస్యానందం, ప్రజాశక్తి, గోతెలుగు. కాం, తపస్వి మనోహరం, సాహితీ కిరణం, విశాఖ సంస్కృతి, వార్త ఇలా వివిధ ప్రింటు, ఆన్లైన్ మేగజైన్లలో ప్రచురణ జరిగాయి.
నాబాలల సాహిత్యం గజరాజే వనరాజు, విక్రమసేనుడి విజయం రెండు సంపుటాలుగాను, సామాజిక కుటుంబ కథలు చిగురించిన వసంతం, జీవనజ్యోతి రెండు సంపుటాలుగా తపస్వి మనోహరం పబ్లికేషన్స్ ద్వారా పుస్తక రూపంలో ముద్రణ జరిగాయి.
నా సాహిత్య రచనలు గ్రామీణ, మద్య తరగతి, బడుగు బలహీన వర్గ ప్రజల, జీవన విధానం, వారి స్థితిగతుల గురించి రాస్తు సమాజానికి ఒక సందేశం ఉండాలని కోరుకుంటాను.
Comments