top of page
Original_edited.jpg

ఆశ్రమం

  • Writer: Dr. C S G Krishnamacharyulu
    Dr. C S G Krishnamacharyulu
  • May 10
  • 5 min read

#CSGKrishnamacharyulu, #CSGకృష్ణమాచార్యులు, #Asramam, #ఆశ్రమం, #TeluguInspirationalStories, #ప్రేరణాదాయకకథలు

ree

Asramam - New Telugu Story Written By  - Dr. C. S. G. Krishnamacharyulu

Published in manatelugukathalu.com on 10/05/2025 

ఆశ్రమం - తెలుగు కథ

రచన: Dr. C..S.G . కృష్ణమాచార్యులు

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్



సాయం సంధ్యా సమయం. పగటికి రాత్రికి సంధికాలం.  మనిషి ఆలోచనలలో మంచికి, చెడుకి మధ్య అస్తిత్వ పోరాటం జరిగే తరుణం. 


సూర్యుడు క్షితిజ రేఖకు దిగువున వుండి అసురుల కదలికలను గమనిస్తున్నాడు. ఆతడు నిస్సహాయుడు. చంద్రుని రాకకోసం అతను కూడా యెదురు చూస్తున్నాడు. ఆ సంక్రమణ సమయంలో రఘు ఇంట్లో, రఘుతో అతని స్నేహితులు, శేషు, వర్మ సమావేశమయ్యారు. 


కాసేపు వారు పాత స్నేహితుల గురించి కబుర్లు చెప్పుకున్నారు. ఆ తర్వాత సినిమాల గురించి అభిప్రాయాలు పంచుకున్నారు. ఆ తర్వాత క్రికెట్ పోటీల గురించి వాదించుకున్నారు. 

వీరి కబుర్లు వింటున్న, రఘు చెల్లెలు సింధూర కు ఒళ్ళు మండింది. 


"రఘు ఉద్యోగం కాని వుద్యోగమేదో వెలగ బెడుతున్నాడు. మీ సంగతేమిటి?" అని వారిని అడిగింది. 


"పేరుకే ఇంజినీరింగ్ డిగ్రీలు. కూలీకి తప్ప దేనికీ పనికి వచ్చేలా లేం. వీడు స్వయం వుపాధి అంటే వచ్చాం. " అన్నాడు శేషు.


"మీరు సొంతంగా యేం చేస్తారు? కబుర్లు, కాకరకాయలు తప్ప. మీరు సీరియస్ గా చేసిన పని ఒక్కటైనా వుందా? ఎవడి సెంచరీ కో హైఫైలు, ఎవడి సినిమాకో ఈలలు, ఎవడి ఎన్నికలకో ప్రచారాలు, చివరికి ఎవడి చావుకో డాన్సులు, ఇది గదా మీ బయో డేటా!" అని వెటకారంగా అంది సింధూర. 


రఘుకి కోపం వచ్చింది. " దెప్పి పొడవడం ఎవరైనా చేస్తారు. మా స్వభావాలకు అనుగుణంగావుండేది, నాలుగు రాళ్ళు సంపాదించి పెట్టేది, యేది? చెప్పు. నీకు మంచి ట్రీట్ యిస్తాం. తెలియక పోతే, నీకో నమస్కారం, వెళ్ళి రా!" అని అన్నాడు. 


"నీదేమైనా యక్ష ప్రశ్నా? ఏ ధర్మజుడో రావడానికి. మీకు కొంచెం తెలుగు తప్ప, యేమీ తెలీయదు. ఏ నైపుణ్యమూ లేదు. కాబట్టి, మీరు కిళ్ళీ కోట్టో, కిరాణా కొట్టో పెట్టుకోండి. "


"అది మాకిష్టంలేదు" అన్నాడు శేషు. 


"చిన్న రెస్టారంట్, రుచుల పొదరిల్లు" అంటూ నాలుక చప్పరించింది. 


"అబ్బే. నీకు తెలియదు. వంట వాళ్ళతో కష్టం. " అన్నాడు వర్మ, అనుభవమున్న వాడిలా. 


అలా యేది చెప్పినా, ఏదో ఒక వంక పెట్టి కాదంటూంటే, ఆమె కాసేపు గంభీరంగా ఆలోచించింది. ఆ తర్వాత వాళ్ళని చూస్తూ, పకపకా నవ్వసాగింది. ముగ్గురు మిత్రులు నివ్వెరబోయి చూస్తూండిపోయారు. 


రఘు, "పిచ్చిదానిలా యేమిటా నవ్వు?" అని ఆమెను గదిమాడు. 


సింధూర నవ్వడం ఆపి, యిలా చెప్పింది. 

"మీ బద్ధకానికి, గాలి తిరుగుడికి, సరిపడ్ద పని ఆశ్రమ నిర్వహణ. మీరు మీ వేషభాషలు మారిస్తే చాలు. జనాన్ని దీవిస్తూ, వాళ్ళు చెప్పే సమస్యలను ఓపికగా విని, పూజలు చేస్తే కోరుకున్న ఫలితాలు లభిస్తాయని చెబుతూ, నాలుగు రాళ్ళు వెనకేసుకోవచ్చు.” అని తన సలహా వివరించింది. 


వర్మకి ఈ ఆలోచన నచ్చింది. "నేను ఆశ్రమం వెబ్ సెరీస్ చూసాను. డబ్బే డబ్బు.” అని వర్మ ఆశ్రమంలో తన పెత్తనం, తను సంపాదించే డబ్బూ, నగల గురించిన, ఊహల్లోకి వెళ్ళిపోయాడు. 


“స్వామి ఎవరు? ఆశ్రమం ఎక్కడ? పెట్టుబడికి డబ్బు ఎక్కడినుంచి తెస్తాం? స్వయం వుపాధి పధకం క్రింద బ్యాంకు అప్పు యిస్తుందా?” అని శేషు ప్రశ్నల వర్షం కురిపించాడు.

 

"మా పెదనాన్నకి పుదుచెర్రీ నుంచి దిండివనం వెళ్ళే రహదారికి ఆనుకుని అయిదెకరాల తోట వుంది. అందులో పెదనాన్న ఒక పెద్ద హాలు, రెండు గదులు వున్న యిల్లు కట్టించాడు. పెద్దమ్మ నడిగి అది మీకు అద్దెకిప్పిస్తా. ఆశ్రమాన్ని స్వయం ఉపాధి పధకంగా ఇంకా గుర్తించినట్లు లేదు. అప్పో సప్పో చేసి ఒక లక్ష రూపాయలు, సమకూర్చుకోండి. ” అని చెప్పింది సింధూర. 


ఆ తర్వాత ఆమె ఆ ముగ్గురి ముఖాలు కాసేపు చూసి, యిలా అంది. 


"శేషుకి. నాటకానుభవముంది. మేకప్ వేస్తే బుద్ధునిలా వుంటాడు. ఏం శేషూ, ఒక మూడు నెలలు మౌనవ్రతం అందాం. ఆ సమయం చాలు, యూట్యూబ్ వీడియోలు విని నాలుగు మంచి ముక్కలు నేర్చుకోవడానికి. స్వామిగా వుపన్యసించడానికి. " 


శేషుకి యేమనాలో తెలియ లేదు. రఘు, వర్మ, యిద్దరూ సింధూర మాటలను బలపరిచారు. 


 "దైవభక్తి, వల్ల నీ కళ్ళల్లో, తేజస్సు వుంది. శాకాహారం వల్ల నీ దేహం మృదువుగా వుంది. నీ నడకలో గాంభీర్యం, నీ చూపులో కరుణ. అచ్చు వివేకానందలా వుంటావు. అద్భుతం " అని శేషుని వుబ్బేసారు. 


శేషు ఒక రకమైన అయోమయంలో తన అంగీకారం తెలిపాడు. 


"అతని మేకప్, అతను నేర్చుకోవల్సిన విషయాలు, హావభావాలు నేను చూసుకుంటాను. మీరు స్వామికి ప్రచారం కల్పించే పని చూడండి. మన యూనివర్సిటీలో మార్కెటింగ్ ప్రొఫెసరు సుమలతను కలవండి. ఆమె మా బ్యూటీ పార్లరు కస్టమరు. నేను ఫోన్ చేసి చెప్తాను. " అని వుత్సాహంగా చెప్పింది సింధూర. 

@@@

సింధూర ఆ ముగ్గురు మిత్రులను తన పెద్దమ్మకి పరిచయం చేసింది. ఆవిడ, వీరి ఆలోచనలను విని పెద్దగా నవ్వింది. 


"ఆశ్రమాలు స్వయం వుపాధి పధకాలవుతాయని నేను అనుకోలేదు. బాగుంది. కష్టాలవల్ల మనసు బలహీన పడ్డ వారికి వుపశమనం కలిగించేలా వుండాలి మీ ఆశ్రమం. అంతే గాని దాన్ని ఆసరాగా చేసుకుని డబ్బు దండుకునేది కాకూడదు. ముఖ్యంగా స్త్రీల మానాభిమానాలకు గౌరవ హాని జరగకూడదు” అని దిశా నిర్దేశం చేసింది. 


"మోసం చెయ్యం. నాలుగు మంచి మాటలు చెప్తాం. పురాణ కథలు వినిపించి నీతి బోధనలు చేస్తాం. మంచి ఆశ్రమ వాతావరణంలో ధ్యానం, పూజలు భజనలు, ప్రోత్సహిస్తాం. ప్రార్ధనల ద్వారా కోరికలు నెరవేరి ప్రజలు సంతోషంగా వుండేలా చూస్తాం. " అన్నాడు శేషు. 


"అదే మాట మీద నిలబడండి. మంచి మాట, మంచి పని, జన శ్రేయస్సు, వీటిని మూల సూత్రాలుగా ఆశ్రమం నడపండి. మీరు ఆశ్రమాన్ని పాలసముద్రం చేస్తే, లక్ష్మి, సంతోషంగా విచ్చేస్తుంది. " అని ఆమె మరొక్క మారు హితబోధ చేసి, తన తోటలో, ఆశ్రమానికి చోటు, వుచితంగా యిచ్చింది. 


ఆ తర్వాత, ముగ్గురు మిత్రులు ప్రొఫెసర్ సుమలతను కలిసి ఆమె సలహాలు తీసుకున్నారు. ప్రచారాన్ని మించిన ఆయుధం లేదని చెప్పి, దాన్ని యెలా ఉపయోగించాలో ఆమె వారికి వివరంగా చెప్పింది. 

@@@

సింధూర పర్యవేక్షణలో శేషు, “దేవీ పుత్ర మౌనానంద స్వామి” గా, దర్శనాలివ్వడం ప్రారంభించాడు. ఆశ్రమం పచ్చని తోరణాలతో, రహదారి మీద పోయే వారిని ఆకర్షించేలా రూపు దిద్దుకుంది. భజన గీతాల హోరు వల్ల అటూ ఇటూ వెళ్ళే జనాలకు ఆశ్రమం పట్ల ఆసక్తి కలిగింది. హిమాలయాలలో వున్న శ్రీ భార్గవానందస్వామి కలలో కనబడి మంత్రోపదేశం చేసారని, ఆ మంత్రం జపిస్తూ స్వామి మౌన దీక్షలో వున్నారని మూడు నెలల తర్వాత మాట్లాడతారని ప్రచారం చేసారు. 


హాలులో దేవీ విగ్రహాన్ని పెట్టి నిత్య పూజలకు ఒక పూజరిని నియమించారు. ప్రవచనాలు, హరికథలతో ఆశ్రమం సందడిగా కనిపించేలా చేసారు. ఆశ్రమం విశేషాలు, లోకల్ టీవిలోని ప్రకటనల ద్వారా రోజూ ప్రజలకు చేరేలా చేసారు. 


దర్శనం చేసుకున్నవారికి ప్రసాదం పంపిణీ చేయసాగారు. 

ఉచిత దర్శనం, ఉచిత ప్రసాదం జనాల్ని ఆకర్షించాయి. మెల్ల మెల్లగా జనం రావడం. మొదలైంది. 


మొదట వచ్చిన వారు వుబుసు పోక, వచ్చిన వారే. వారు తమకే యేదో ఒక గొప్ప విషయం తెలిసినట్లు పరిచయమున్న వారందరికి "మీకు తెలియదా? అక్కడున్న స్వామికి మ్రొక్కితే అన్ని కోరికలు తీరుతాయి" అని చెప్పారు. 


అలా ఒకరికొకరు అతిశయోక్తులు జోడించి చెప్పడంతో జనాదరణ పెరిగింది. వివిధ కార్యక్రమాలకి విరాళలనిచ్చే దాతలు పెరిగారు. చిన్న విరాళాలిచ్చిన వారి పేర్లు కూడా ఒక వారం రోజులు మైకులో యేకధాటిగా, హోరెత్తించడంతో, దాతల అహం సంతృప్తి చెందింది.


విరాళాలిచ్చేవారిలో పోటీ పెరిగింది. మూడు నెలల తర్వాత, స్వామి మౌన దీక్ష ముగిసింది. స్వామి ప్రసంగం వినడానికి జనం పోటెత్తారు. పిచ్చి జనం! నాట్యం చేసారు. భక్తి మత్తులో వూగిపోయారు. ఎంతో జాగ్రత్తగా ప్రసంగించి, స్వామి శ్రోతల హృదయాలలో భక్తి భావం నింపారు. 

@@@ 

దిన దిన ప్రవర్ధమానమవుతూ, ఆశ్రమం మూడు జన్మ దినోత్సవాలు జరుపుకుంది. తొలిరోజుల్లో వాన తుంపరలా మొదలైన ధన ప్రవాహం, ఇప్పుడు జీవ నదిగా మారింది. రఘు, వర్మల, ఆలోచనలలో మార్పువచ్చింది. 


వారిద్దరూ శేషుని మోసగించి డబ్బు వెనకేసుకుంటున్నారు. అలాగే, అక్రమ సంబంధాలతో స్వర్గం వెళ్ళి వస్తున్నారు. వీరికి భిన్నంగా, శేషులో సుగుణాత్మకమైన మార్పు చోటు చేసుకుంది. మొదట చాటుగా తిరగడం, తినడం చేసిన అతను, ప్రజల నమ్మకాన్ని, పరిహాసం చేయకూడదని భావించి, నిజమైన స్వామిగా మారిపోయే దిశలో వున్నాడు.

 

ముగ్గురినీ గమనిస్తున్న సింధూరకు శేషు, ఆర్ధికంగా నష్ట పోవడమే గాక, స్నేహితుల దుష్ప్రవర్తన వల్ల నేరస్తుడయ్యే ప్రమాదముందని గ్రహించింది. 


రఘు, వర్మలను పెద్దమ్మ దగ్గరకు తీసుకుని వెళ్ళి, ఆమె యెదుట వారిని హెచ్చరించింది. మంచిగా మసలుకుంటామని వారు రాజ్యలక్ష్మి పాదాల పైన ప్రమాణాలు చేసారు. కానీ బురద మెచ్చిన పందికి పాలరాతి భవంతి నచ్చదు. అలాగే వ్యసనాల వూబిలో చిక్కుకున్న వారికి నైతికత నచ్చదు. వారితో ఈ పతనం ఆగలేదు. 


చెడుకు ఆకర్షణ యెక్కువ. వారి ని చూసి, ఆశ్రమ పరిచారకులలో అందినంత దోచుకునే మనస్తత్వం పెరిగి పోయింది. సేవాభావం కను మరుగైంది. భక్తుల నుంచి ఫిర్యాదులు మొదలయ్యాయి. సింధూర ఈ విషయాలన్నీ రాజ్యలక్ష్మికి చెప్పి, తరుణోపాయం అడిగింది. 

@@@

 నెలరోజుల తర్వాత పుదుచెర్రీ టీవిలో ప్రముఖ వార్త. 

" దేవీ పుత్ర మౌనానందస్వామి, గురువాజ్ణ పాటించి, హిమాలయాలకు వెళ్ళిపోయారు. " 


ఆ వార్త విని, "గురువంటే సింధూర. హిమాలయమంటే కోయంబత్తూరు. అవునా సింధూ" అన్నాడు శేషు. 


"ఏదో పెన్నిధి పోయినట్లు, ఆముదం త్రాగినట్లు, ఆ ముఖమేమిటి?. నీ మంచికోరి నిన్ను తీసుకొచ్చాను. తెలుసుకో. " అని సింధూర శేషు తల మీద మెట్టికాయ వేసింది.


"మంచో చెడో తెలియదు. నా తపస్సుని మెచ్చి దేవుడు, సింధూరని నాకు భార్యగా యిచ్చాడని మాత్రం తెలుసు. " అంటూ శేషు, సింధూర ఒడిలో తలదాచుకున్నాడు. 

రాజ్యలక్ష్మి ఆశ్రమం మూసి వేయడానికి నిర్ణయించింది. వర్మ, రఘులు వద్దని ఎంత మొత్తుకున్నా ఆమె వినలేదు. 


"విషబీజాలు నాటింది మీరే. ఆ గరళం మహాగ్ని కాక ముందే, నేను జాగ్రత్త పడుతున్నాను. జన శ్రేయస్సు కోరని మీకు నా అండ వుండదు" అని ఖరాఖండిగా చెప్పింది. 


విషయం తెలిసి, ప్రొఫెసర్ సుమలత “మనల్ని నమ్మిన ప్రజలను మోసం చేయడం, వ్యాపార సూత్రాలకు విరుద్ధం." అని రాజ్యలక్షి నిర్ణయాన్ని అభినందించింది. 

 

@@@@@

.

 

@@@@@


C..S.G . కృష్ణమాచార్యులు  గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


ree

రచయిత పరిచయం: Dr. C..S.G . కృష్ణమాచార్యులు

 

శ్రీ వెంకటేశ్వర విశ్వ విద్యాలయం, తిరుపతి  లో మేనేజ్మెంట్ విభాగంలో ప్రొఫెసరుగా రిటైర్ అయ్యాను. ప్రస్తుత నివాసం పుదుచెర్రీ లో.  నేను రచించిన మేనేజ్మెంట్ పాఠ్య గ్రంధాలు ప్రెంటిస్ హాల్, పియర్సన్ ఎడ్యుకేషన్, వంటి ప్రముఖ సంస్థలు  ప్రచురించాయి.

 ఈ మధ్యనే నాకిష్టమైన  తెలుగు రచనా వ్యాసంగం, ప్రారంభించాను.  ఆ సరస్వతీ మాత కృపవల్ల కొన్ని బహుమతులు గెలుచుకున్నాను. అందులో కొన్ని. చేజారనీకే జీవితం- నవల, ( కన్సొలేషన్ -మన తెలుగు కథలు .కాం ). మనసు తెలిసింది,  చీకటి నుంచి వెలుగుకు, (వారం వుత్తమ కథ- మన తెలుగు కథలు .కాం), గురువే కీచకుడైతే (3 వ బహుమతి - విమల సాహితీ ఉగాది కథల పోటీ) ఒకే పథం- ఒకే గమ్యం( ప్రత్యేక బహుమతి --వాసా ప్రభావతి స్మారక కథల పోటీ-  వాసా ఫౌండేషన్ & సాహితీకిరణం), తెలుగు భాష (ప్రత్యేక బహుమతి- పద్యాలు - షార్ సెంటర్ ఉగాది పోటీ), జంటగా నాతి చరామి ( కన్సొలేషన్- సుమతి సామ్రాట్ కథల పోటీ).

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page