టెన్త్ క్లాస్ – పరీక్షలు
- Pulletikurthi Nagesh

- Apr 21
- 5 min read

Tenth Class Pareekshalu - Telugu Emotional Story | Pulletikurthi Nagesh
టెన్త్ క్లాస్ – పరీక్షలు - తెలుగు భావోద్వేగ కథ | పుల్లేటికుర్తి నగేష్
Published In manatelugukathalu.com On 21/04/2026
టెన్త్ క్లాస్…అది కేవలం ఒక పరీక్ష కాదు…
👉 అది బాల్యం నుండి బాధ్యతలకి దారితీసే సరిహద్దు
అనుభవాలే జ్ఞాపకాలు
జ్ఞాపకాలే కథలు...
కథలే మనం.....
మనం గడిపే ప్రతి క్షణం ఒక అనుభవమైతే,
అది మన మెదడులో ఒక అందమైన జ్ఞాపకంగా ముద్ర పడిపోతుంది.
ఆ జ్ఞాపకాలను నెమరు వేసుకున్నప్పుడు అవి కథలుగా మారుతాయి.
చివరికి ఆ కథలే మన వ్యక్తిత్వాన్ని, మన ప్రయాణాన్ని నిర్వచిస్తాయి.
మనమంతా ఒక నడిచే కథల పుస్తకాలం.
ఒక్కో పేజీలో ఒక్కో అనుభవం...
ఒక్కో అధ్యాయంలో ఒక్కో జ్ఞాపకం!
ముఖ్యంగా టెన్త్ క్లాస్....
అవును .. టెన్త్ క్లాస్..
ఇది మన జీవితం ముఖ్యమైనదే కాదు.. ఒక అద్భుతమైన అనుభవం.
టెన్త్ పరీక్షలు అంటేనే ఒక రకమైన యాంగ్జైటీ.
అప్పుడూ.. ఇప్పుదూ .. ఎప్పుడూ....
ఆ మాట వింటేనే ఒక రకమైన ఉత్సుకతతో గుండె కాస్తా వేగంగా కొట్టుకుంటుందేమో అనిపిస్తుంది నాకు..
మరి మీ పరిస్థితి ఏంటి..
ఇంచుమించు అంతే కదూ!!!
మొన్న ఏదో ఊరువెళ్తుంటే దార్లో స్కూల్ పిల్లలు పరీక్షలు రాసి బయటకి వస్తున్నారు.
అప్పుడు గుర్తుకు వచ్చింది. అవును కదూ.. పదవ తరగతి పరీక్షలు అవుతున్నాయి.
కారు ఒక ప్రక్కగా ఆపి మరీ వాళ్ళనందరిని పరీక్షగా చూడడం ప్రారంభించాను.
అందరి ముఖాలు గర్వంతో, ఆనందంతో మెరిసిపోతున్నాయి.
పైగా ఆఖరి పరీక్షలా వుంది, ముఖాలు ఆనందంతో, విజయ గర్వంతో మెరుస్తున్నాయి.
నాకైతే బాల్యనికి - యవ్వనానికి,
బలాదూర్ కి – బరువు బాధ్యతలకీ వున్న బోర్డర్ దాటుతున్న అమాయక సైనికులు మాదిరి కనిపించారు.
నేను కూడా నా కార్ విండో దించుకుని అలా చూస్తూ ఉండిపోయాను.
ఇంతలో ఒక కుర్రాడు హుషారుగా సైకిల్ మీద వెళ్తూ గట్టిగా అరిచాడు
"రేయ్.. పరీక్షలు అయిపోయాయి... ఇక పండగే రా!".
ఆ మాట వినగానే నాకు ఒక్కసారిగా గతం గుర్తొచ్చింది.
చిన్నగా నవ్వుకుంటూ వాడివైపు చూస్తూ "పండగ కాదురా.. ముసళ్ళ పండగరా, ముందు ముందు ఉంది" అని కొంచెం గట్టిగానే అన్నాను.
వాళ్ళని చూసేసరికి ఎప్పటిలానే నేను ఫ్లాష్ బాక్ లోకి వెళ్లిపోయాను.
సుమారు నలభై సంవత్సరాలు అయింది మా టెన్త్ పరీక్షలు అయి.
అయినా ఇప్పటికీ నా మైండ్‌లో ఆ మెమరీస్ చాలా ఫ్రెష్‌గా, నిన్న మొన్న పరీక్షలు అయిన ఫీల్ వస్తుంది.
ఇంచుమించు నెల రోజుల ముందు సీనియర్స్‌ని అడిగి ఇంపార్టెంట్ ప్రశ్నలు మార్క్ చేసుకోవడంతో ప్రిపరేషన్ స్టార్ట్ అయ్యేది.
రాత్రి పగలు చదవడం వలనేమో మా అందరి ముఖాలు కొంచెం నీరసం వున్నా, ఒక రకమైన వెలుగు వుండేది.
కొందరైతే తపస్సులోవున్న ఋషుల మాదిరి ముఖం గంభీరంగా పెట్టుకునే వారు,
ముఖ్యంగా అప్పట్లో మగపిల్లలే ఎక్కువ టెన్షన్ పడే వారు అని చెప్పొచ్చు.
ఆడపిల్లలకి అంత టెన్సిన్ వుండేది కాదేమో అనిపిస్తుంది.
అప్పటికే కొంత మందికి పెళ్లి సంబంధాలు ఫిక్స్ అయిపోయి వుండేవి, ముఖ్యంగా మేనరికాలు వుంటే ఫిక్స్ అవడం గారంటీ.
వాళ్ళు ముఖాలలో టెన్షన్ మచ్చు కైనా దొరికేది కాదు.
రిసల్ట్స్ ఏమైనా పెళ్లి మాత్రం గారంటీ అనే ధీమా కనిపించేది.
మేం మాత్రం పరీక్షలకి పోటీ పడి చదివేవాళ్ళం.
అంతే పోటీ తో రాసేవాళ్ళం కూడా,
ఎవరు ఎక్కువ అడిషనల్ షీట్స్ రాస్తారో అనే పోటీ కూడా వుండేది.
ఎక్కువ రాస్తే కొంచెం ఎక్కువ మార్కులు వేస్తారని ఒక దురభిప్రాయం అప్పట్లో ఎక్కువగా వుండేది.
ముఖ్యంగా నాలో మరీ ఎక్కువ వుండేది లెండి.
టెన్త్ పరీక్షల డిజైన్ ఎవరు చేశారో గాని అది ఇప్పటికీ ఏమాత్రం మారలేదు.
మొదట మనకి బాగా వచ్చిన తెలుగు, తరువాత అర్థం కానీ హిందీ, వచ్చీ రాని ఇంగ్లీషు, ధైర్యాన్ని నూరిపోసే మ్యాథ్స్, లాజికల్‌గా ఆలోచించమనే సైన్స్, ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టులు నేర్పే సోషల్.. సూపర్ అరేంజ్‌మెంట్ అనిపించేది.
నిజమే కదూ!
పరీక్షా హాల్లో ఇన్విజిలేటర్ 'లాస్ట్ ఫైవ్ మినిట్స్' అని అరిచినప్పుడు చూడాలి గుండెల్లో కలిగే ఆ రైలు పరుగు,
చివరి నిమిషంలో గుర్తొచ్చిన పాయింట్‌ని ఎలాగోలా గీకాలని పడే తాపత్రయం,
ఎవరైనా బిట్ పేపర్ లో ఒకటి రెండు బిట్స్ చెప్తారనే ఆశ..
అవన్నీ గుర్తొచ్చి నాలో నేనే నవ్వుకున్నాను.
ఆ రోజుల్లో పెన్ నిండా ఇంకు ఉంటే చాలు, ప్రపంచాన్ని గెలిచినంత ధైర్యం ఉండేది.
ఇప్పుడు చేతిలో ఖరీదైన ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు ఉన్నా ఆ పాత ఇంకు పెన్ను రాసినంత స్పష్టంగా జీవితం అర్థం కావడం లేదేమో అనిపించింది.
అప్పుడు ఆ రోజులు ఎంతో కష్టం అనుకున్నాము, పుస్తకాల బాగ్ బరువు చాలా ఎక్కువగా అనిపించేది
కానీ పెరిగి పెద్దయ్యాక కుటుంబ బరువు బాధ్యతలతో పోల్చుకుంటే అదొక లెక్కే కాదు.
ఇప్పుడు తలచుకుంటే ఆ రోజులే ఎంతో అందమైనవి కదూ..
కానీ ఎగ్జామ్ ఆఖరి రోజు, మేం రాసిన ఆ ఆఖరి ఆన్సర్ షీట్, ఎగ్జామినర్‌కి అందచేసే ఆ క్షణమే మాకు అప్పటివరకు ఉన్న బాల్యం అనే రక్షణ కవచాన్ని చీల్చేసిందని, అప్పుడు మాకు తెలియలేదు. మేం ఇచ్చిన ఆ ఆన్సర్ షీటే మేం మా బాల్యానికి ఇచ్చేసిన రాజీనామా పత్రమని.
టెన్త్ అయిపోతే వచ్చే స్వేచ్చ ని తలచుకుని మేం పోగొట్టుకోబోతున్న బాల్యం విలువ మాకు అప్పుడు తెలియ రాలేదు.
ఇప్పటికీ అప్పుడప్పుడు అనిపిస్తుంది ఒకవేళ దేవుడు ప్రత్యక్షమైతే, బాల్యాన్ని మార్చమని కోరను కానీ ఇంకో సారి ఎక్స్పీరియన్స్ చేసే వరం అడుగుతాను.
నెమ్మదిగా కారు ముందుకైతే పోనిచ్చాను కానీ, మనసు మాత్రం వెనక్కి వెళ్తాను అంటుంది... అదే మా స్కూల్ గేటు దగ్గరకి, మా క్లాస్ దగ్గరకి, మా టెన్త్ ఎగ్జామ్ సెంటర్‌కి.
అసలు ఆ రోజు పరీక్షా కేంద్రం నుంచి బయటకు వచ్చాక ఏం జరిగింది?
సెంటర్ నుండి ఇంటికి వెళ్లినంతవరకు ఫ్యూచర్ ప్లాన్స్, ఆ రాత్రి మేమంతా చేసిన హడావిడి.. ఆ జ్ఞాపకాల పొరలు ఒక్కొక్కటిగా విచ్చుకుంటున్నాయి.
పరీక్షల ఆఖరి రోజు మేం చేసుకున్న ప్రమాణాలు గుర్తుకొచ్చాయి
"రేయ్.. టెన్త్ అయిపోయింది కదా, ఇక మనల్ని ఆపేవాడే లేడు. ఇంజనీరో, డాక్టరో, లాయరో అయిపోయాక మళ్ళీ ఇక్కడే కలుద్దాం" అని గంభీరంగా మాటలు ఇచ్చుకున్నాం.
కానీ విడిపోయిన మేము మళ్ళీ కలవడానికి నలభై ఏళ్లు పట్టింది.
కాలేజీ ఊరి చివర వుండేదేమో, మా స్వేచ్చ సైకిల్ కొనడంతో ప్రారంభం అయ్యింది.
ఇక అప్పటి నుండి పోరాటమే కదా. ప్రతీ చోట, ప్రతీ సారి మనల్ని మనం నిరూపించు కోవాలి.
అప్పటి వరకు ఏమైనా సమాధానం చెప్పలేక పోతే పోనీలేరా చిన్న పిల్లాడు అనే వారు.
ఒక్కోసారి మాటజారి పరుషంగా మాట్లాడితే, కోపం తెచ్చుకోవడం మాని, పోనీ లేరా చిన్న పిల్లాడు తెలియక అనేశాడు అని వదిలేసే వారు.
చిన్న చిన్న పెంకి పనులు చేసినా పాపం పిల్లాడు తెలియక చేసాడులే అని క్షమించే వారు.
వీధిలో గొడవ చేసి వచ్చినాసరే మా పిల్లాడు ఇంకా చిన్నాడు అలా చేయడు అని వెనుకేసుకొచ్చే వారు..
ఇలా ప్రతి విషయం లో ఈ చిన్న పిల్లాడు అనే ఇమ్యూనిటీ మమ్మల్ని ఎంతో కాపాడింది.
లోకం ఏమనుకుంటుందో అనే భయం అప్పటివరకు మాలో ఏ కోశానా లేదు.
కానీ మా పరీక్షా ఫలితాలు వచ్చే లోపే.. చుట్టుప్రక్కల వాళ్ళ చూపులు, బంధువుల ప్రశ్నలు మమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టేవో ఆ దేముడికే తెలియాలి.
దేవుడా దేవుడా నీకు పుణ్యం వుంటుండి ఎలాగైన ఈ టెన్త్ నుండి మమ్మల్ని గట్టున పడేయీ అని మొక్కుకునే వాళ్ళం.
ఆ మొక్కేదేదో మమ్మల్ని ఫస్ట్ క్లాస్‌లో పాస్ చేయి అని మొక్కుకోవచ్చు కదా.. అదీ మా పరిస్థితి!
అలా ఇలా చుట్టుప్రక్కల వాళ్ళ ప్రశ్నలు, చూపులతో మేం ‘పిల్లాడు’ అన్న హోదా నుండి ‘కుర్రాడు’ అన్న బాధ్యతలోకి మా ప్రయాణం నిశ్శబ్ధంగా మొదలైంది.
ఆ ఇమ్యూనిటీ కవచం ఊడిపోయిన తర్వాత, మొదటిసారిగా సమాజం మమ్మల్ని ఒక 'బాధ్యత గల వ్యక్తి'గా చూడటం మొదలుపెట్టింది.
అప్పుడు అర్ధం కాలేదు ఈ “బాధ్యత గల వ్యక్తి” అన్న పదం జీవితాంతం మమ్మల్ని వెంటాడుతుందని, దాన్ని నిలబెట్టు కోవడానికి రోజూ యుద్ధం చేయాలని,
ఇంటిలోనూ, వీధిలోనూ, ఉరిలోనూ, ఆఫీసు లోనూ, తల్లి తండ్రుల దగ్గర, భార్య దగ్గర, అత్త, మామల దగ్గర, పిల్లల దగ్గర, బాస్ దగ్గర, కోలీగ్స్ దగ్గర ఇలా ప్రతి దగ్గర నిరూపించుకోవాలని, దాని కోసం చాలా కోల్పోవాలి అని.
రిజల్ట్స్ వచ్చాయి. పాస్ అయ్యామన్న సంతోషం కంటే, ఇకపై మనల్ని మనం నిరూపించుకోవాలనే యుద్ధం మొదలైందన్న గంభీరత చుట్టూ ఉన్న వాతావరణంలో కనిపించింది.
అప్పటివరకు అల్లరిని నవ్వుతూ భరించిన వారు, మొదటిసారిగా "ఇక చదువు జాగ్రత్త సుమా.. కాలేజీ అంటే ఆటలు కాదు" అని సీరియస్‌గా చెప్పారు.
నా మొదటి సైకిల్ మీద ఊరి చివర ఉన్న కాలేజీకి వెళ్తుంటే..
ఆ పెడల్ తొక్కే ప్రతిసారీ నా మీద నాకే తెలియని ఒక బరువు పెరుగుతున్నట్లు అనిపించేది.
కానీ ఆ ప్రయాణంలోనే కొత్త మిత్రులు, కొత్త కలలు పరిచయమయ్యాయి
ఆ కాలేజీ రోడ్డు మీద సైకిల్ తొక్కుతూ మేము వేసుకున్న ప్లాన్లు, ఆ ముచ్చట్లు.. ఒకటా రెండా? ఆ రోజుల్లో మా దగ్గర డబ్బులు తక్కువ, అప్పుడు వచ్చిన మార్కులు కూడా తక్కువే.. కానీ ఆశలు మాత్రం ఆకాశమంత ఉండేవి.
మా సైకిల్ బెల్ శబ్దంలో కూడా ఒక రకమైన గర్వం ధ్వనించేది.
నిజంగా కాలేజీ అంటేనే స్వేచ్ఛ కదా..
ఏమంటారు?
అంతే కదా?
కారు ముందుకు వెళ్తుంది.. కానీ నా మనసు మాత్రం వెనక్కి వెళ్ళి ఆగింది.. అక్కడే.. ఆ పరీక్ష సెంటర్ దగ్గరే ..
నా బాల్యం నిలిచిపోయిన ఆ చివరి రోజు దగ్గరే వుంది..
ఇక కాలేజీ రోజుల గురించి చెప్పుకుంటే అదంతా ఒక పెద్ద కావ్యం!!!
ముచ్చటించుకుందాం ఇంకోసారి!!!
సమాప్తం
👉 మీ టెన్త్ జ్ఞాపకాలు కామెంట్ చేయండి
👉 మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేయండి
***
పుల్లేటికుర్తి నగేష్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2026 కథల పోటీల వివరాల కోసం
ఉగాది షడ్రుచుల కథల పోటీల వివరాల కోసం
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత పరిచయం: పుల్లేటికుర్తి నగేష్

పేరు: పుల్లేటికుర్తి నగేశ్
వృత్తి: ప్రభుత్వ ఉద్యోగం.
వుండేది: విజయవాడ మరియు హైదరాబాద్
పుట్టిన ఊరు;;;; శ్రీకాకుళం




Comments