top of page
Original.png

ఆ ఇల్లు ఇంకా ఖాళీ కాలేదు

4 hours ago
12 min read

ఆ ఇల్లు ఇంకా ఖాళీ కాలేదు తెలుగు హారర్ కథ కోసం పాత హైదరాబాద్ బంగళా, తెల్లచొక్కా ఆత్మ, నల్లటి నీళ్లతో ఉన్న స్టీలు గ్లాసు, ఆధునిక అపార్ట్‌మెంట్‌ను చూపించే భయానక దృశ్యం.

Aa Illu Inka Khaali Kaaledu - Telugu Horror Story | VVS Prasad

ఆ ఇల్లు ఇంకా ఖాళీ కాలేదు - తెలుగు హారర్ కథ | VVS ప్రసాద్

Published in manatelugukathalu.com on 17/10/2026


ఒక పాత బంగళా కూలిపోయినా, అక్కడి భయానక జ్ఞాపకాలు చెరిగిపోకపోతే? VVS ప్రసాద్ రచించిన “ఆ ఇల్లు ఇంకా ఖాళీ కాలేదు” అనే తెలుగు అతీంద్రియ హారర్ కథలో పాత మరణం, ఆత్మల రహస్యం, భూమిపై మమకారం కలగలిసి ఉత్కంఠను రేకెత్తిస్తాయి.


2026.

"మాధవ్ గారేనా?"


రాత్రి పదిన్నర దాటాక వచ్చిన ఆ తెలియని ఫోన్ కాల్ మాధవ్‌ని క్షణం అప్రమత్తం చేసింది.

"అవును, ఎవరు?"


"నా పేరు రాకేష్, 'ఆనంద నిలయం' అపార్ట్‌మెంట్‌లో ఉంటాను. మీతో ఒక విషయం మాట్లాడాలి."


'ఆనంద నిలయం'... ఆ పేరు వినగానే మాధవ్ మౌనంగా ఉండిపోయాడు.


"మీరు చిన్నప్పుడు ఈ స్థలంలో ఉండేవారని పక్కనే చాలా కాలంగా ఉన్న దుకాణం వాళ్లు చెప్పారు. పరిచయాలు పట్టుకుని మీ నంబర్ సంపాదించాను," అన్నాడు రాకేష్.


"అవును, కానీ ఇన్ని సంవత్సరాల తర్వాత నాకెందుకు ఫోన్ చేశారు?"

అటువైపు వ్యక్తి వెంటనే సమాధానం చెప్పలేదు. "మీరు ఒకసారి ఇక్కడికి రాగలరా సార్?"


"ఏమైంది?"


"ఫోన్లో చెబితే మీరు నమ్మరు. మా అబ్బాయి మూడు రాత్రులుగా ఒక పాత బంగళా బొమ్మ గీస్తున్నాడు. నాలుగు చిన్న పోర్షన్లు, పెద్ద వేపచెట్టు, గేటు దగ్గర ముగ్గురు పిల్లలు... ఇలాంటివన్నీ ఉన్నాయి."


మాధవ్ చేతిలో ఫోన్ బిగుసుకుంది. "ఆ బొమ్మ నాకెందుకు చూపించాలి?"


అటువైపు స్వరం తగ్గింది, "ఆ ముగ్గురిలో పెద్ద పిల్లవాడిని చూపిస్తూ... 'తెల్ల చొక్కా అంకుల్ ఇతన్ని తీసుకురమ్మన్నాడు' అంటున్నాడు.


బొమ్మను పక్క దుకాణం వాళ్లకు చూపించి ఆరా తీస్తే మీ నాన్నగారి పేరు మూర్తి అని, పెద్ద కొడుకు మీరు అని తెలిసింది."


కాల్ ముగిసిన తర్వాత మాధవ్ చాలాసేపు ఫోన్ చేతిలోనే పట్టుకుని కూర్చున్నాడు. 'ఆనంద నిలయం' పేరుతో ఇప్పుడు నిలిచిన అపార్ట్‌మెంట్ అతని జ్ఞాపకాల్లో మాత్రం ఇంకా ఒక విశాలమైన ఆవరణగానే ఉంది. దాని మధ్యలో ఒక పెద్ద బంగళా, వెనుక వైపు నాలుగు చిన్న అద్దె పోర్షన్లు!


జ్ఞాపకం నెమ్మదిగా ఒక పాత ఇనుప గేటును తెరిచింది.


1975-78 మధ్య కాలం.


హైదరాబాద్ ఇంకా ఇప్పటిలా ఊపిరాడనంత కాంక్రీటుతో నిండిపోని రోజులు. నల్లకుంట-శంకరమఠం-కోరంఠి ఫీవర్ హాస్పిటల్ ప్రధాన రహదారి మీద బస్సులు, రిక్షాలు తిరిగినా, దాని వెనుక సందుల్లో మాత్రం పాత హైదరాబాద్ నెమ్మదిగా నడిచేది.


అలాంటి ఒక సందు చివర పెద్ద ప్రహరీ గోడ కనిపించేది. గోడ మధ్యలో బరువైన ఇనుప గేటు. దాన్ని తోస్తే లోతైన లోహ శబ్దంతో తెరుచుకునేది. గేటు దాటగానే విశాలంగా, శుభ్రంగా ఉంచిన ఆవరణ. మధ్యలో పాతకాలపు వైభవంతో గంభీరంగా నిలిచిన పెద్ద బంగళా... ఎత్తైన స్తంభాలు, విశాలమైన వరండా, బలమైన గోడలు, మెరుపు తగ్గని చెక్క కిటికీలు... చూసిన వారికి యజమానుల స్తోమతను చెప్పే ఇల్లు!


బంగళా వెనుకవైపు, ప్రహరీకి ఆనుకుని నాలుగు చిన్న అద్దె పోర్షన్లు ఉండేవి. వాటిలో ఒకదానిలోకి మూర్తి తన భార్య సరోజ, ముగ్గురు కొడుకులతో వచ్చాడు. పెద్దవాడు మాధవ్, అతని తర్వాత ఇద్దరు తమ్ముళ్లు.


పిల్లలకు ఆ ఇల్లు మొదట్లో అద్భుతంగా అనిపించింది. పరిగెత్తడానికి పెద్ద ఆవరణ... మామిడి, వేప, సీతాఫల చెట్లు... ఎండకాలంలోనూ చల్లగా ఉండే బంగళా నీడ... గేటు దగ్గర నుంచి తమ పోర్షన్ వరకు పరుగు పందెం పెట్టుకోవడానికి సరిపడా దూరం!


ప్రధాన బంగళాలో ఒక కన్నడ కుటుంబం ఉండేది. దాదాపు ఎనభై ఐదేళ్ల వృద్ధురాలు, ఆమెతో అరవై ఐదేళ్లకు దగ్గరలో ఉన్న అవివాహిత చిన్న కుమారుడు ఉండేవాడు. వృద్ధురాలి నడక నెమ్మదయినా మాట గట్టిగా ఉండేది. ఆమె కుమారుడు మౌనంగా పత్రిక చదువుతూ, చీకటి పడక ముందే తలుపులు మూసేవాడు.


ఇంట్లోకి చేరిన మొదటి వారం నుంచే మూర్తికి ఏదో అసౌకర్యంగా అనిపించింది. దానికి రూపం లేదు, కారణం లేదు... కానీ అది ఉంది! ఆఫీసులో చిన్న విషయాలకి మూర్తి చికాకు పడేవాడు. సులభమైన పనుల్లో తప్పులు జరిగేవి. ఇంటికి వచ్చినా ఆందోళన తగ్గేది కాదు.


'కొత్త ఇల్లు... కొత్త వాతావరణం... అలవాటైపోతుంది' అని తనకు తాను సమాధానపరుచుకునేవాడు.


సరోజ ఆరోగ్యం మాత్రం రోజురోజుకూ క్షీణించింది. మొదట తలనొప్పి, తర్వాత నిద్రలేమి. అప్పుడప్పుడు ఎవరో పిలిచినట్లు ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూడటం.


"ఎవరమ్మా?" అని మాధవ్ అడిగేవాడు.


"ఏమీ లేదు, లోపలికి వెళ్లు," అనేది.


ఒక మధ్యాహ్నం వంటగదిలో పాత్రలు కడుగుతూ ఉన్న సరోజ ఒక్కసారిగా నేలపై పడిపోయింది. చేతులు బిగుసుకున్నాయి, శరీరం వణికింది, కళ్లలో తెల్లటి భాగమే కనిపించింది.


పక్క పోర్షన్ల వాళ్లు పరిగెత్తుకొచ్చారు. నీళ్లు చల్లారు, ఎవరో చెంచా తెచ్చి పళ్ల మధ్య పెట్టాలని చూశారు, ఇంకెవరో ఆటో తీసుకొచ్చారు. డాక్టర్ పరీక్షించాడు, మందులు ఇచ్చాడు, కారణం మాత్రం చెప్పలేకపోయాడు. "మళ్లీ వస్తే వెంటనే తీసుకురండి."


మళ్లీ వచ్చింది... ఈసారి అర్ధరాత్రి!

సరోజ నిద్రలోంచి ఉలిక్కిపడి లేచి, తలుపు వైపు చూస్తూ నిలబడింది.


"ఎందుకు అక్కడ నిలబడ్డావు?" మూర్తి అడిగాడు.

ఆమె సమాధానం చెప్పలేదు.


"సరోజా!"


ఆమె పెదవులు కదిలాయి, "ఆయన... లోపలికి రావాలంటున్నాడు."


అంతే... నేలపై కూలిపోయింది.


మూర్తి తలుపు తెరిచి బయట చూశాడు. ఆవరణ నిశ్శబ్దంగా ఉంది. వేపచెట్టు ఆకులు కూడా కదలడం లేదు.


బంగళా వరండా చివర ఒక కిటికీ మాత్రం తెరిచి ఉంది. ఆ చీకటి కిటికీ వెనుక ఎవరో నిలబడి ఉన్నట్టు అతనికి క్షణం అనిపించింది. మరుక్షణం అక్కడ ఏమీ లేదు.


డాక్టర్లు మారారు, మందులు మారాయి, పరీక్షలు జరిగాయి. నరాల బలహీనత లేదా ఒత్తిడి కావచ్చునన్నారు. కానీ సరోజ ఎందుకు స్పృహ తప్పుతోందో ఎవరూ చెప్పలేకపోయారు.


ఇంట్లో పరిస్థితి క్రమంగా మారిపోయింది. చిన్న పిల్లలు రాత్రి ఒంటరిగా బయటికి వెళ్లడానికి భయపడేవారు. పైకప్పు మీద ఎవరో నెమ్మదిగా నడిచినట్టు శబ్దం వినిపించేది. బయటికి వచ్చి చూస్తే పిల్లి కూడా కనిపించేది కాదు.


మాధవ్‌కు మాత్రం ఒక దృశ్యం తరచూ కనిపించేది... బంగళా వరండా స్తంభం వెనుక నుంచి ఒక మనిషి తనను చూస్తున్నట్టు. తెల్లటి చొక్కా, సన్నని ముఖం, దిగులుగా ఉన్న కళ్లు. మాధవ్ అటువైపు అడుగు వేస్తే అతను కనిపించేవాడు కాదు.


"అక్కడ ఎవరు ఉంటారు?" అని ఒకసారి ఇంటి యాజమానురాలిని అడిగాడు.


వృద్ధురాలి చేతిలోని జపమాల క్షణం ఆగిపోయింది. "ఎక్కడ?"


"ఆ స్తంభం దగ్గర."


ఆమె మాధవ్‌ను కొద్దిసేపు తదేకంగా చూసింది. "పిల్లలు చీకట్లో ఎక్కువగా తిరగకూడదు," అని మాత్రమే చెప్పింది.


ఆ రోజు నుంచి సాయంత్రం కాగానే బంగళా వరండాకు వెళ్లొద్దని సరోజ పిల్లలను హెచ్చరించింది. కానీ ఎందుకో ఆమె చెప్పలేదు.


ఒక వేసవి మధ్యాహ్నం పిల్లలు ఆడుతున్న బంతి వరండా చివర, ఎప్పుడూ తాళం వేసి ఉండే గది దగ్గరకు దొర్లింది. దాన్ని తీసుకోవడానికి వెళ్లిన మాధవ్‌కు ఆ గది మెట్ల మీద తెల్లటి చొక్కా మనిషి కూర్చుని కనిపించాడు. ఈసారి అతను మాయమవలేదు. ముఖం అలసిపోయి ఉంది, పెదవులు ఎండిపోయినట్లున్నాయి.


"నీళ్లు కావాలా?" అని మాధవ్ అడిగాడు.


అతను సమాధానం చెప్పలేదు.


మాధవ్ పోర్షన్‌కు పరుగెత్తి వెళ్లి గ్లాసు నిండా నీళ్లు తెచ్చాడు. తిరిగి వచ్చేసరికి మెట్టు ఖాళీగా ఉంది. గ్లాసును తలుపు పక్కన పెట్టి బంతి తీసుకుని వెళ్లిపోయాడు. సాయంత్రానికి గ్లాసు అక్కడ లేదు.


మరుసటి ఉదయం మూసిన చెక్క కిటికీ రెక్కల మధ్య నుంచి చూస్తే అదే గ్లాసు గదిలోని కిటికీ అంచుపై కనిపించింది. తలుపుకు వేసిన తాళం మాత్రం కదల్లేదు. గ్లాసు అంచున ఉన్న చిన్న సొట్టతో అది తమదేనని మాధవ్‌కు తెలిసింది.


అతను ఆ గది వైపు చూస్తుండగా వృద్ధురాలు వెనుక నుంచి వచ్చి నిలబడింది. "ఇక్కడికి మళ్లీ రావద్దు," అంది. ఆమె స్వరంలో కోపం కంటే భయం ఎక్కువగా ఉంది. ఆమె చిన్న కుమారుడు వెంటనే కిటికీ చెక్క రెక్కలను మూసేశాడు.


ఒకసారి పని మీద మూర్తి తన స్వగ్రామానికి వెళ్లాడు. ఇప్పటి ఆంధ్రప్రదేశ్‌లోని ఆ ఊరు అప్పట్లో ఇంకా చిన్నదే... మట్టి రోడ్లు, పెంకుటిళ్లు, సాయంత్రానికి ఆలయ గంటలు. మూర్తి తండ్రి స్వంత అన్నయ్య వెంకటరామయ్య అక్కడే ఉండేవాడు. మూర్తికి ఆయన పెదనాన్న.


గంటల తరబడి పూజలు చేసేవాడు, చాలా తక్కువ మాట్లాడేవాడు. చెప్పిన మాట మాత్రం తప్పదని కుటుంబంలో నమ్మకం.


మూర్తిని చూసి సాధారణ విషయాలు అడిగాడు... ఉద్యోగం, పిల్లలు, హైదరాబాద్ జీవితం. తర్వాత చుట్టూ చూసి... "సరోజను తీసుకురాలేదేం?" అన్నాడు.


"ఆరోగ్యం బాగోలేదు పెదనాన్నా, ఈ మధ్య తరచూ పడిపోతోంది. డాక్టర్లకు కూడా ఏమీ అర్థం కావడం లేదు."


అంతవరకు సాదాసీదాగా మాట్లాడుతున్న వెంకటరామయ్య ముఖం ఒక్కసారిగా మారిపోయింది. కళ్లు మూసుకున్నాడు. కొద్దిసేపు ఏమీ మాట్లాడలేదు. తర్వాత కళ్లు తెరిచి మూర్తిని నేరుగా చూశాడు.


"నువ్వు ఇప్పుడు ఉంటున్న ఇల్లు వెంటనే ఖాళీ చేయి."


మూర్తి నవ్వాడు, "ఇల్లు ఎక్కడుందో కూడా మీకు తెలియదు, ఖాళీ చేయమంటారేమిటి?"


"చిరునామా నాకు అవసరం లేదు."


"అద్దె తక్కువ, ఆఫీసుకూ దగ్గర. ఇంకో ఇల్లు దొరకడం అంత తేలిక కాదు."


వెంకటరామయ్య స్వరం గట్టిగా మారింది, "అక్కడ ఒక ప్రాణం శరీరాన్ని విడిచింది, కానీ ఆ ఇంటిని విడిచిపోలేదు!"


మూర్తి ముఖంలోని నవ్వు తగ్గింది, "ఎవరైనా మీకు ఏమైనా చెప్పారా?"


"నీతో వచ్చింది వార్త కాదు, నీ మీద పడిన నీడ!"


ఆ మాటతో మూర్తికి చిరాకు వచ్చింది, "ఇలాంటి మాటలు సరోజ వింటే ఇంకా భయపడుతుంది."


వెంకటరామయ్య మళ్లీ కళ్లు మూసుకున్నాడు, "ఆ ఇంట్లో ఒక అసహజ మరణం జరిగింది. ఆ మరణం అక్కడితో ముగియలేదు.


ఎవరో ఆ ఇంటి మీద పెట్టుకున్న 'మాది' అన్న పట్టు, అందులోకి వచ్చిన వాళ్లను ప్రశాంతంగా ఉండనివ్వడం లేదు. ఎవరది, ఎందుకో తెలుసుకోవడానికి అక్కడే ఆగిపోకు... ముందు కుటుంబాన్ని బయటకు తీసుకురా!"


మూర్తికి ఆ చివరి వాక్యం అర్థం కాలేదు. అర్థం చేసుకోవాలనిపించలేదు కూడా.


హైదరాబాద్‌కు తిరిగొచ్చిన తర్వాత రెండు రోజులు అతను ఆ విషయాన్ని పట్టించుకోలేదు. మూడో రోజు సరోజ మళ్లీ స్పృహ తప్పింది. ఈసారి కళ్లు తెరిచిన తర్వాత తనకు తెలియని కన్నడ పదాలు రెండు పలికింది.


పక్క పోర్షన్‌లోని కన్నడ మహిళ అది విని తెల్లబడిపోయింది.


"ఆమె ఏమంది?" అని మూర్తి అడిగాడు.


ఆ మహిళ చెప్పడానికి సంకోచించింది, "'ಇಲ್ಲಿಂದ ಹೋಗಿ' అంటోంది," అంది.


"అంటే – 'ఇక్కడినుంచి వెళ్లిపోండి' అని."


ఆ రాత్రికి మూర్తికి నిద్ర రాలేదు.


మరుసటి ఉదయం బంగళా వరండాలో కూర్చున్న వృద్ధురాలి వద్దకు వెళ్లాడు.


"అమ్మా, ఒక విషయం అడగాలి, తప్పుగా అనుకోకండి."


వృద్ధురాలు అతని ముఖం చూసి, అడగబోయేది ముందే తెలిసినట్టు జపమాల పక్కన పెట్టింది.


"ఈ ఇంట్లో... ఎవరైనా చనిపోయారా?"


వరండాలో కూర్చున్న ఆమె అవివాహిత కుమారుడు పత్రిక మడిచాడు. వృద్ధురాలు అతనివైపు చూసింది, అతను తలదించుకున్నాడు.

కొన్ని క్షణాల తర్వాత ఆమె చెప్పింది, "నా పెద్ద కొడుకు."


"ఎలా?"


"తన గదిలో ఉరి వేసుకున్నాడు."


"బంగళా వెనుక ఎప్పుడూ మూసి ఉంచే గదేనా?" మూర్తి అడిగాడు.


ఆమె చిన్న కుమారుడి ముఖం తెల్లబడింది. వృద్ధురాలు సమాధానం చెప్పలేదు.

మూర్తి గొంతు ఎండిపోయింది, "ఎప్పుడు?"


ఆమె చెప్పిన సంవత్సరం చాలా పాతది. కానీ ఆమెకు అది నిన్న జరిగినట్లే అనిపిస్తున్నట్టు స్వరం కంపించింది.


"ఎందుకు అలా చేశాడు?"


ఈసారి ఆమె చిన్న కుమారుడు తలెత్తాడు. వృద్ధురాలు అతన్ని ఒక్క చూపుతో ఆపింది. "ఈ స్థలాన్ని అమ్మి తన వాటా తీసుకుని వెళ్లిపోతానన్నాడు," అంది. "నేను ఒప్పుకోలేదు. ఇది మా పూర్వీకుల నేల. మా కుటుంబం తప్ప ఇంకెవరి పేరూ దీనిమీద ఉండకూడదని చెప్పాను."


ఆమె చిన్న కుమారుడి వైపు చూసింది, "నా తర్వాత కూడా ఈ నేల పరాయివాళ్ల చేతికి వెళ్లనివ్వనని వీడు నాకు మాటిచ్చాడు."


ఆమె వేళ్లు జపమాలను మరింత బిగించాయి, "మరుసటి రాత్రి వాడు ఆ పని చేశాడు."

అతను పత్రికను ముఖానికి అడ్డంగా పెట్టుకున్నాడు, అతని చేతులు వణుకుతున్నాయి.


"అప్పుడప్పుడు కనిపిస్తాడని పనివాళ్లు చెప్పేవారు, కొంతమంది అద్దెవాళ్లు కూడా చెప్పారు. నీకేమైనా కనిపించాడా?"


మూర్తి వెంటనే సమాధానం చెప్పలేదు. "మీరు ఇల్లు ఇచ్చేటప్పుడు ఈ విషయం చెప్పలేదు?"


వృద్ధురాలి ముఖం కఠినమైంది, "మనుషులు చనిపోని ఇల్లు ఎక్కడుంటుంది? మనుషులు వస్తారు, పోతారు. కానీ ఈ నేల మా కుటుంబాన్ని వదిలి ఎక్కడికీ పోదు!"


పక్కనే కూర్చున్న కుమారుడు మొదటిసారి మూర్తిని నేరుగా చూశాడు, "అతను ఎవరికీ హాని చేయడు," అన్నాడు.


ఆ మాట మూర్తికి ఓదార్పుగా అనిపించలేదు... హెచ్చరికలా అనిపించింది!


ఆ రోజు నుంచే మూర్తి మరో ఇల్లు వెతకడం మొదలుపెట్టాడు. కానీ ఆ కుటుంబానికి సరిపడే అద్దె ఇల్లు దొరకలేదు. దగ్గరగా ఉన్నవి అద్దె ఎక్కువ, అందుబాటులో ఉన్నవి చాలా దూరం. ఒక ఇంటి యజమాని చివరి నిమిషంలో మాట మార్చాడు.


రోజులు గడిచాయి. ఇంట్లో పరిస్థితి మరింత తీవ్రమైంది.


ఒక రాత్రి స్టీలు గ్లాసు రాతి నేలపై దొర్లుతున్న శబ్దానికి మాధవ్ మేల్కొన్నాడు. సరోజ మంచంలో లేదు, పోర్షన్ తలుపు తెరిచి ఉంది.


మాధవ్ మూర్తిని లేపాడు. ఇద్దరూ బయటకు వచ్చేసరికి తడి పాదముద్రలు బంగళా వెనుకవైపు సాగుతున్నాయి. అవి ఎప్పుడూ మూసి ఉండే గది దగ్గర ఆగిపోయాయి.


సరోజ ఆ గది తలుపుకు చెవి ఆనించి నిలబడి ఉంది. బయట తాళం అలాగే ఉంది, కానీ లోపల ఎవరో గ్లాసును నేలపై నెమ్మదిగా దొర్లిస్తున్న శబ్దం వినిపిస్తోంది.

"సరోజా!" అని మూర్తి పిలిచాడు.


ఆమె వెనక్కి తిరిగింది, కళ్లు తెరిచే ఉన్నాయి, చూపు మాత్రం ఖాళీగా ఉంది. మూర్తి ఆమెను పట్టుకుని వెనక్కి లాగగానే, మూసిన గది లోపలి నుంచి తలుపు మీద ఒక్కసారిగా బలమైన దెబ్బ పడింది. సరోజ అతని చేతుల్లోనే స్పృహ తప్పింది.


మరుసటి ఉదయం వారి పోర్షన్ గడప ముందు మాధవ్ నీళ్లు పెట్టిన అదే స్టీలు గ్లాసు కనిపించింది. అది అంచువరకు నల్లటి నీటితో నిండి ఉంది. గడప నుంచి సరోజ మంచం వరకు తడి పాదముద్రలు ఉన్నాయి, బయటికి వెళ్లిన ముద్రలు మాత్రం లేవు!


అలా నెలలు గడిచాయి. 1978 ప్రారంభానికి మాధవ్ మూడో తరగతిలోకి వచ్చాడు. ఆ ఇంట్లోకి వచ్చినప్పటి ఉత్సాహం పిల్లల్లో ఎప్పుడో మాయమైంది.


వారం తర్వాత చివరకు ఒక చిన్న ఇల్లు దొరికింది. సౌకర్యాలు తక్కువ, దూరం ఎక్కువ, అద్దె కూడా కొంచెం అధికం. మూర్తి ఒక్క నిమిషం కూడా ఆలోచించలేదు.


వాళ్లు సామాను సర్దుకుంటున్న రోజు బంగళా వృద్ధురాలు వరండా నుంచి చూస్తూనే ఉంది, ఆమె కుమారుడు కనిపించలేదు.


చివరి పెట్టెను రిక్షాలో పెట్టాక మాధవ్ ఒకసారి వెనక్కి తిరిగి చూశాడు. వరండా స్తంభం దగ్గర తెల్లటి చొక్కా వేసుకున్న సన్నని మనిషి నిలబడి ఉన్నాడు.


ఈసారి అతను మాయమవలేదు. మాధవ్ వైపు చూస్తూ మెల్లగా చేయి ఎత్తాడు. అతని పాదాల దగ్గర ఖాళీ స్టీలు గ్లాసు బోర్లా పడి ఉంది.


ఆ చేయి ఊపడం కృతజ్ఞతను తెలిపేందుకో, వీడ్కోలు చెప్పేందుకో మాధవ్‌కు అర్థం కాలేదు.


కొత్త ఇంటికి వెళ్లిన తర్వాత మొదటి నెలలోనే సరోజ ఆరోగ్యం మెరుగుపడింది. స్పృహ తప్పడం క్రమంగా ఆగిపోయింది, మూర్తి ఆఫీసులోని ఒత్తిడి కూడా తగ్గింది.


కొన్ని సంవత్సరాలకు ఆ ఇంటి సంగతులు కుటుంబ సంభాషణల్లోంచి మాయమయ్యాయి. కానీ మాధవ్ జ్ఞాపకాల నుంచి మాత్రం పూర్తిగా పోలేదు.


కాలం అతన్ని ముందుకు తీసుకెళ్లింది. చదువుకున్నాడు, పోటీ పరీక్షలు రాశాడు, కేంద్ర ప్రభుత్వంలో క్లాస్-వన్ అధికారిగా ఎదిగాడు. అతని పిల్లలు కూడా తమ తమ రంగాలలో స్థిరపడ్డారు.


2019లో ఒక రోజు పనిమీద నల్లకుంట వైపు వెళ్లినప్పుడు డ్రైవర్‌ను ఆ సందులోకి తిప్పమన్నాడు. తాను ఆ ఇంటిని విడిచి అప్పటికి నాలుగు దశాబ్దాలు దాటిపోయాయి.


చుట్టూ పాత ఇళ్ల స్థానంలో కళాశాలలు, కార్యాలయాలు, అపార్ట్‌మెంట్లు వచ్చాయి. రోడ్డు మీద వాహనాల రద్దీ పెరిగింది. కానీ ఆ ప్రహరీ గోడ మాత్రం ఇంకా ఉంది. ఇనుప గేటు ఒక వైపు వాలిపోయింది.


లోపల బంగళా శిథిలమై కనిపించింది. గోడల చీలికల్లోంచి మర్రి, రావి వేర్లు బయటికి వచ్చాయి. కిటికీలు లేవు, వరండా పైకప్పు కొంత కూలిపోయింది. చెట్లు బంగళాను కప్పేశాయో, బంగళానే చెట్లలో కలసిపోయిందో తెలియట్లేదు.


పక్కనే ఉన్న టీ దుకాణం వ్యక్తిని అడిగాడు, "ఈ స్థలం ఎవరిది?"


"ఎవరిదో వాళ్లకే తెలియదు సార్! ఆ ముసలమ్మ పోయాక ఆమె చిన్న కొడుకు చాలాకాలం ఒక్కడే ఉండేవాడు. అతనూ చనిపోయాక దూరపు వారసులందరూ వచ్చారు. కోర్టులో కేసు నడుస్తోంది, స్థలం కోట్లలో ఉంటుంది. అందుకే ఎవరూ వదలరు."


మాధవ్ గేటు బయట కొద్దిసేపు నిలబడ్డాడు. తన చిన్ననాటి పోర్షన్ ఎక్కడ ఉండేదో గుర్తించడానికి ప్రయత్నించాడు. చెట్ల మధ్య ఏదో తెల్లగా కదిలినట్లు కనిపించింది.


అప్పుడే వాలిపోయిన ఇనుప గేటు తనంతట అదే కదిలి మూసుకుంది.

లోపలినుంచి వృద్ధురాలి గొంతులో కన్నడ మాట వినిపించినట్టు అనిపించింది... "గేటు వెయ్యి!"


బాల్యపు జ్ఞాపకాలే తన మనసుతో ఆటలాడుతున్నాయనుకుని కారెక్కాడు.


మూడేళ్లు గడిచాయి. 2022లో ఒక ఆదివారం మాధవ్ కావాలనే ఆ సందుకు వెళ్లాడు... ఈసారి జ్ఞాపకాన్ని చూడటానికి!


కానీ అక్కడ జ్ఞాపకమే లేదు. బంగళా పూర్తిగా కూల్చేశారు, చెట్లు నరికేశారు, నేలను చదును చేశారు. పెద్ద నీలం రంగు రేకులతో స్థలాన్ని మూసి, ముందు ఒక బోర్డు పెట్టారు:


'త్వరలో... ఆనంద నిలయం లగ్జరీ రెసిడెన్సెస్'.


పాత యజమానుల ప్రత్యక్ష, పరోక్ష వారసులు ఏళ్ల తరబడి పోరాడి, చివరకు కోర్టు బయట రాజీ చేసుకున్నారని పక్కవాళ్లు చెప్పారు. స్థలాన్ని ఒక డెవలపర్‌కి అప్పగించారట.


"కూల్చడం కూడా సులభంగా జరగలేదు సార్," అన్నాడు పక్కనే ఉన్న టీ దుకాణం వ్యక్తి. "మొదటి రోజు జేసీబీ మూడుసార్లు ఆగిపోయింది. తలుపులే లేని బంగళాలో ఎవరో లోపల నుంచి గోడ తట్టారని పనివాళ్లు పారిపోయారు. మరుసటి రోజు వేరే పనివాళ్లను తెచ్చి చీకటిపడకుండా కూల్చేశారు."


మాధవ్‌కు వింతగా అనిపించింది. ఏళ్ల తరబడి మనుషులు కోర్టులో పోరాడిన భూమి ఇప్పుడు ఒక సంస్థ పేరుమీదికి వెళ్లాక, ఒక సంతకంతో యజమానులు మారిపోయారు. ఒక యంత్రంతో బంగళా మట్టిలో కలిసిపోయింది.


ఇక అంతా ముగిసిపోయిందని అనిపించింది. చనిపోయినవాళ్ల జ్ఞాపకాలు కూడా శిథిలాలతోపాటు తొలగిపోయి ఉంటాయని అనుకున్నాడు.


మరో మూడు సంవత్సరాల తర్వాత, 2025 లో 'ఆనంద నిలయం' పూర్తయింది. ఎనిమిది అంతస్తులు, రెండు బ్లాకులు, గాజు తలుపులు, వీడియో డోర్ ఫోన్లు, సెల్లార్ పార్కింగ్... విలువైన స్థలం కావడంతో ఫ్లాట్లు వేగంగా అమ్ముడయ్యాయి.


మాధవ్ దాని గురించి మళ్లీ ఎప్పుడూ తెలుసుకోవడానికి ప్రయత్నించలేదు. ఫ్లాట్లలో కుటుంబాలు చేరిన కొన్ని నెలల తర్వాత, ఆరో అంతస్తులోని ఒక ఫ్లాట్ యజమాని రాకేష్ చేసిన ఫోన్ అతన్ని గతం నుంచి మళ్లీ అదే చిరునామాకు పిలిచింది.


మరుసటి సాయంత్రం మాధవ్ ఆనంద నిలయానికి వెళ్లాడు. బయటనుంచి చూస్తే అది నగరంలో పుట్టుకొస్తున్న కొత్త అపార్ట్‌మెంట్ లాగానే ఉంది... సెక్యూరిటీ క్యాబిన్, పూలకుండీలు, విశాలమైన పార్కింగ్‌లో కార్లు, ఆడుకుంటున్న పిల్లలు.


రాకేష్ అతన్ని ఆరో అంతస్తులోని ఫ్లాట్‌కి తీసుకెళ్లాడు. అతని భార్య ఆందోళనగా కనిపించింది. హాల్లో ఎనిమిదేళ్ల బాలుడు సోఫాలో కూర్చుని బొమ్మలు గీస్తున్నాడు.


"వీడు ఆదిత్య, మూడో తరగతి," అన్నాడు రాకేష్.


'మూడో తరగతి'... ఆ రెండు పదాలు మాధవ్ మనసులో ఎక్కడో తలుపులు తెరిచాయి.

ఆదిత్య తలెత్తి అతన్ని చూశాడు, "వచ్చావా నువ్వు?" అన్నాడు.


మాధవ్ ఉలిక్కిపడ్డాడు, "నెనెవరో నీకు తెలుసా?"


"నువ్వేగా తెల్ల చొక్కా అంకుల్‌కు నీళ్లు పెట్టిన అబ్బాయివి?"


మాధవ్ ముఖంలో రంగు మారిపోయింది.


బాలుడు తన ముందున్న కాగితాన్ని చూపించాడు. అందులో ఒక పాత బంగళా, పొడవాటి వరండా, నాలుగు చిన్న పోర్షన్లు, ఒక పెద్ద వేప చెట్టు, గేటు దగ్గర ముగ్గురు పిల్లలు... వెనుక మూసి ఉన్న గది మెట్టు మీద ఒక చిన్న గ్లాసు!


మాధవ్ గొంతు ఎండిపోయింది, "ఇది ఎక్కడ చూశావు?"


"ఇక్కడే ఉండేది."


"ఎవరు చెప్పారు?"


ఆదిత్య పెన్సిల్‌తో వరండా స్తంభం దగ్గర గీసిన సన్నని మనిషిని చూపించాడు, "ఈ అంకుల్."


రాకేష్ భార్య కళ్లల్లో నీళ్లు తిరిగాయి, "మూడు రాత్రులుగా నిద్రలో లేచి వంటగదిలోని స్టీలు గ్లాసులో నీళ్లు తీసుకుని లిఫ్ట్‌లో వెళ్తున్నాడు సార్! సెల్లార్ పార్కింగ్‌లో ఒక గోడ దగ్గర పెట్టి వస్తున్నాడు. ఉదయం అదే గ్లాసు వీడి మంచం కింద ఉంటుంది. అందులో నీళ్లు నల్లగా మారిపోయి ఉంటాయి."


మాధవ్ బాలుడి దగ్గర కూర్చున్నాడు, "ఆ అంకుల్ నీతో ఏమంటాడు?"


"వెళ్లిపోమంటాడు."


"ఎందుకు?"


ఆదిత్య మరో కాగితం తీశాడు. అందులో ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. సన్నని మనిషి గేటు బయట నిలుచుని ఉన్నాడు, లోపల ఒక వృద్ధురాలు, ఆమె పక్కన మరో వృద్ధుడు.


"ఈ ఇద్దరూ వెళ్లనివ్వరట."


మాధవ్ వెన్నులో చలి పాకింది, "వాళ్లు ఎవరు?"


బాలుడు వృద్ధురాలిని చూపించాడు, "ఈ అమ్మమ్మ." తర్వాత వృద్ధుడి బొమ్మపై వేలు పెట్టాడు, "ఈయన ఆమె చిన్న కొడుకట."


గదిలో ఎవరూ మాట్లాడలేదు. కొద్దిసేపటి తర్వాత ఆదిత్య చాలా సహజంగా అన్నాడు, "నువ్వు పెట్టిన నీళ్లను ఆయన మర్చిపోలేదట! ఆ ఇంట్లో అందరూ ఆయన్ని చూసి భయపడ్డారు, నువ్వు మాత్రం ఆయనకు దాహంగా ఉందేమో అనుకున్నావట."


మాధవ్ చేతిలోని కాగితం వణికింది. ఆ గ్లాసు సంగతి అతను అప్పట్లో తన తల్లిదండ్రులకు కూడా పూర్తిగా చెప్పలేదు. రాకేష్ కుటుంబానికి తెలిసే అవకాశం అసలే లేదు!


రాకేష్ చెప్పిన వివరాలు మాధవ్ నిశ్శబ్దంగా విన్నాడు. కుటుంబాలు వచ్చిన మొదటి నెల నుంచే విచిత్రాలు మొదలయ్యాయట. రాత్రికి సరిగ్గా ఉన్న కొన్ని ఫ్లాట్ల నేమ్ బోర్డులు ఉదయానికి తలకిందులుగా తిరిగి ఉండేవి.


అర్ధరాత్రి ఖాళీ కారిడార్‌లో తలుపు తట్టిన శబ్దం వినిపించేది, బయట ఎవరూ ఉండరు. కొన్నిసార్లు అదే చప్పుడు బెడ్‌రూమ్ అలమర లోపలి నుంచి వచ్చేది. మరికొన్నిసార్లు వృద్ధురాలి గొంతులో కన్నడలో... 'ఇది మా ఇల్లు... ఖాళీ చేయండి' అనే మాట గోడల మధ్య నుంచి వినిపించేది.


ఒక రాత్రి కరెంట్ పోయిన సమయంలో లిఫ్ట్ తనంతట అదే ఆరో అంతస్తుకు వచ్చింది (అప్పుడు జనరేటర్ కూడా పనిచేయట్లేదు).


అందులోకి వెళ్లిన వ్యక్తి పది నిమిషాల తర్వాత సెల్లార్ పార్కింగ్‌లో స్పృహ లేకుండా కనిపించాడు. కాళ్లకు ఎర్రటి మట్టి అంటుకుని ఉంది, చేతివేళ్ల గోళ్ల నుంచి రక్తం కారుతోంది! ఆ పది నిమిషాలూ ఎక్కడ ఉన్నాడో అతనికి గుర్తులేదు. సీసీటీవీలో మాత్రం అతను లిఫ్ట్‌లోకి వెళ్లిన తర్వాత తలుపులు మళ్లీ తెరుచుకోనేలేదు.


మరో రాత్రి సెక్యూరిటీ గార్డు ఒక వృద్ధురాలు, వంగిన భుజాలతో ఒక ముసలివాడు పార్కింగ్ గోడలోకి నడిచి మాయమవ్వడం చూశాడు. కెమెరాలో ఖాళీ గోడ ముందు గార్డు వెనక్కి తగ్గుతూ ఎవరినో వేడుకోవడం మాత్రమే నమోదైంది. మరుసటి రోజే అతను ఎవరికీ చెప్పకుండా ఉద్యోగం మానేశాడు.


ఒక ఫ్లాట్‌లోని మహిళకు సరోజకు వచ్చినట్టే కారణం లేకుండా మూర్ఛలు మొదలయ్యాయి. స్పృహ వచ్చినప్పుడల్లా తనకు తెలియని కన్నడలో పెద్ద కొడుకును తిడుతుండేది.


ఏడో అంతస్తులోని ఒక బాలిక నిద్రలో నడుచుకుంటూ టెర్రస్ గోడపైకి ఎక్కబోతుండగా తండ్రి పట్టుకున్నాడు. 'కింద పాత ఇల్లు చూపిస్తానని అమ్మమ్మ పిలిచింది' అని ఆ అమ్మాయి చెప్పింది.


ఇప్పటికే రెండు కుటుంబాలు ఇళ్లు ఖాళీ చేశాయి. ఒకరు ఫ్లాట్‌ను అమ్మకానికి పెట్టారు. మిగిలినవాళ్లు బ్యాంకు రుణాలు, పిల్లల పాఠశాలలు, నగరంలో పెరిగిన ధరలు... ఇవన్నీ ఆలోచిస్తూ అక్కడే ఉంటున్నారు.


"ఇవన్నీ యాదృచ్ఛికాలు కావచ్చు," అన్నాడు మాధవ్. ఆ మాట రాకేష్‌కు చెప్పాడో, తనకు తానే చెప్పుకున్నాడో అతనికి తెలియలేదు.


ఆదిత్య మాత్రం మళ్లీ తన బొమ్మల్లో రంగులు నింపడం మొదలుపెట్టాడు.

మాధవ్ వెళ్లడానికి లేచాడు. తలుపు దగ్గరకు వచ్చేసరికి బాలుడు వెనుక నుంచి పిలిచాడు, "అంకుల్!"


మాధవ్ తిరిగి చూశాడు.


"ఆ తెల్ల చొక్కా అంకుల్ అందరినీ త్వరగా వెళ్లిపోమంటున్నాడు."


మాధవ్ గుండె ఒక్కసారిగా బలంగా కొట్టుకుంది, "ఎందుకు?"


ఆదిత్య తలుపు వైపు చూశాడు, "ఆ అమ్మమ్మకు ఇక్కడ ఎవరూ ఉండడం ఇష్టం లేదట."


మాధవ్‌కు వెంకటరామయ్య మాట దాదాపు ఐదు దశాబ్దాల తర్వాత పూర్తిగా అర్థమైంది.


ఆయన హెచ్చరించింది ఆత్మహత్య చేసుకున్న పెద్ద కొడుకు గురించి కాదు... బతికున్నప్పుడూ, చనిపోయాకా 'మాది' అన్న పట్టును వదలని తల్లీకొడుకుల గురించి!


మాధవ్ లిఫ్ట్‌లో దిగుతున్నప్పుడు డిస్‌ప్లేలో అంకెలు ఒక్కొక్కటిగా తగ్గాయి... 6... 5... 4... మూడో అంతస్తు దాటిన తర్వాత అకస్మాత్తుగా అంకెలు మాయమయ్యాయి. లిఫ్ట్ ఆగింది, తలుపులు తెరుచుకున్నాయి.


ముందు అపార్ట్‌మెంట్ కారిడార్ లేదు... మసక వెలుతురులో పాత బంగళా వరండా కనిపించింది! స్తంభం దగ్గర తెల్లటి చొక్కా వేసుకున్న సన్నని మనిషి నిలబడి ఉన్నాడు.


దశాబ్దాల క్రితం గేటు దగ్గర తనకు చేయి ఊపినట్లే మళ్లీ చేయి ఎత్తాడు. అతని వెనుక మూసిన గది మెట్టు మీద చిన్న స్టీలు గ్లాసు ఉంది, అంచున అదే సొట్ట!

"నువ్వు..." మాధవ్ గొంతు ఆగిపోయింది.


"నువ్వేగా నీళ్ల గ్లాసు పెట్టిన చిన్నవాడివి?" అన్నాడు ఆ మనిషి. "నన్ను చూసిన వాళ్లంతా భయపడ్డారు, నువ్వు మాత్రం నాకు దాహంగా ఉందేమో అనుకున్నావు."


"నన్నెందుకు పిలిచావు?"


"నేను ఈ ప్రహరీ దాటి వెళ్లలేను. ఇక్కడ జరిగినది కల కాదని చెప్పగలిగే బ్రతికున్న సాక్షివి నువ్వు! అమ్మ, తమ్ముడు బ్రతికుండగానే నన్ను చూశావు. శిథిలమైన తర్వాత కూడా తిరిగి వచ్చావు. ఇప్పుడు వీళ్లకు నిజం చెప్పగలిగేది నువ్వే."


మాధవ్ గొంతు పెగల్లేదు.


"వాళ్లు ఎందుకు అందరినీ వెళ్లగొడుతున్నారు?" అని చివరకు అడిగాడు.


"వాళ్లు బ్రతికున్నంతకాలం వాళ్లే యజమానులు. వాళ్లు చనిపోయాక స్థలం ఏళ్ల తరబడి ఖాళీగా ఉంది. కోర్టు కేసు నడిచినంతకాలం ఎవ్వరూ దీన్ని తమ ఇల్లు అనలేదు."


అతను వరండా నేలవైపు చూశాడు, "ఇప్పుడు ప్రతి తలుపుపై వేరొకరి పేరు ఉంది, ప్రతి పత్రంలో కొత్త యజమాని ఉన్నాడు. అమ్మకు అది అమ్మకం కాదు... తన నేలను పరాయివాళ్లు ఆక్రమించుకోవడం! చిన్న కొడుకు ఆమెకు ఇచ్చిన మాటను చనిపోయాక కూడా వదల్లేదు. వాళ్లకు బంగళాతో పని లేదు, ఈ నేల ఖాళీగా ఉండాలి... అంతే!"


"అందుకే అందరినీ వెళ్లగొడుతున్నారా?"


"ముందు భయపెడతారు. వినకపోతే పిల్లల్ని పిలుస్తారు. ఇక్కడ ఒక ప్రాణం పోతే మిగిలిన కుటుంబాలు తామే పారిపోతాయని వాళ్లకు తెలుసు."


"మరి నువ్వు?"


తెల్ల చొక్కా మనిషి కళ్లలోని దిగులు మరింత గాఢమైంది, "నేను ఈ చోటు వదిలి వెళ్లాలని కోరుకున్నాను. ఆవేశంలో నా ప్రాణం తీసుకున్నాను.


ఎక్కడి నుంచి వెళ్లిపోవాలనుకున్నానో అక్కడే శాశ్వతంగా బందీ అయ్యాను. ఆ తప్పు ఇంకొకరి మరణంగా మారకూడదు. నేను చేయగలిగింది హెచ్చరించడం మాత్రమే!"


వరండా లోపలి చీకటిలో రెండు ఆకారాలు కదిలాయి... ఒక వృద్ధురాలు, ఆమె వెనుక వంగిన భుజాలతో ఒక ముసలివాడు.


"ఇది మా నేల! ఇక్కడ ఎవరి పేరూ ఉండకూడదు!" అని వృద్ధురాలి గొంతు కన్నడలో వినిపించింది. ఆమె చిన్న కుమారుడి ఆకారం చీకటిలోంచి ముందుకు వచ్చింది.

మాధవ్ లిఫ్ట్ 'డోర్ క్లోజ్' బటన్‌ను పదేపదే నొక్కాడు.


తెల్ల చొక్కా మనిషి వేగంగా లిఫ్ట్ దగ్గరకు వచ్చాడు, "ముందుగా పిల్లలను బయటికి తీసుకెళ్లండి, తర్వాత అందరూ వెళ్లిపోవాలి!" అన్నాడు. "ఈ రాత్రి వాళ్లు ఇక్కడ ఉండకూడదు."


లిఫ్ట్ తలుపులు మూసుకుపోతుండగా వృద్ధురాలు కదలకుండానే ఒక్కసారిగా దగ్గరికి వచ్చినట్లు కనిపించింది. తలుపుల మధ్య నుంచి ఆమె ముఖం మాత్రమే కనిపించింది... "వాళ్లు వెళ్లకపోతే... ఒకరిని ఇక్కడే ఉంచుకుంటాను," అంది.


తెల్ల చొక్కా మనిషి తలుపులను బలంగా మూసేశాడు.

తర్వాత లిఫ్ట్ మామూలుగా గ్రౌండ్ ఫ్లోర్ చేరింది.


సెక్యూరిటీ గార్డు మాధవ్ తెల్లబడిన ముఖం చూసి పరుగెత్తుకొచ్చాడు, "సార్... మీరు కిందికి ఎలా వచ్చారు? కెమెరాలో లిఫ్ట్ ఇంకా ఆరో అంతస్తులోనే ఉంది, పది నిమిషాలుగా కదల్లేదు!"


మాధవ్ వెనక్కి తిరిగి చూశాడు, డిస్‌ప్లేలో 'G' వెలుగుతోంది.


మూసుకున్న లిఫ్ట్ లోపల ఎవరూ లేరు. అయినా పాత ఇనుప గేటును లోపలి నుంచి బిగించినట్టుగా పెద్ద శబ్దం వినిపించింది.


ఆ రాత్రే రాకేష్ కుటుంబం ఫ్లాట్ ఖాళీ చేసింది.


మాధవ్ అపార్ట్‌మెంట్ సొసైటీకి తాను చూసినదంతా చెప్పాడు. కొందరు పిల్లలను బంధువుల ఇళ్లకు పంపించారు, మరికొందరు అతని మాటలను వయసుతో వచ్చిన భ్రమగా కొట్టిపారేశారు.


ఆ రాత్రి రెండు గంటల పదమూడు నిమిషాలకు ప్రతి ఫ్లాట్‌లోని వీడియో డోర్ ఫోన్ ఒకేసారి మోగింది. తెరపై కారిడార్ కనిపించలేదు... పాత బంగళా వరండా కనిపించింది! దాని చివర వృద్ధురాలు ఒక్కో తలుపును లెక్కపెడుతున్నట్టు కన్నడలో సంఖ్యలు పలికింది.


ఆమె ప్రతి సంఖ్య పలికినప్పుడు ఒక్కో ఫ్లాట్ మెయిన్ డోర్ తాళం క్లిక్ మంటూ దానంతట అదే తెరుచుకుంది.


కరెంట్ పోయింది!


చీకట్లో అన్ని అంతస్తుల్లోనూ పాత ఇనుప గేటు మూసుకున్న శబ్దం ఒకేసారి వినిపించింది.


మరుసటి ఉదయం ప్రతి పడకగదిలో మంచం పక్కన ఒక స్టీలు గ్లాసు కనిపించింది, వాటిలో నల్లటి నీరు నిండి ఉంది. మెయిన్ డోర్ నుంచి మంచం వరకు తడి పాదముద్రలు ఉన్నాయి; బయటికి వెళ్లిన ముద్రలు మాత్రం ఎక్కడా లేవు!


ఆ ఉదయం తర్వాత మాధవ్ మాటలను భ్రమగా కొట్టిపారేసినవాళ్లు కూడా మౌనమయ్యారు. రెండు కుటుంబాలు అదే రోజు ఇళ్లు ఖాళీ చేశాయి, మరికొందరు తమ ఫ్లాట్లను అమ్మకానికి పెట్టారు. కొనడానికి వచ్చినవాళ్లకు మాత్రం "నగరం మధ్యలో అరుదైన అవకాశం" అని బ్రోకర్లు చెప్పారు.


పత్రాల్లో స్థలం వివాదరహితమైంది. కోర్టు కేసు ముగిసింది, వారసులు రాజీపడ్డారు, డెవలపర్ అనుమతులు పొందాడు, కొనుగోలుదారులకు రిజిస్ట్రేషన్లు జరిగాయి. చట్టం దృష్టిలో ప్రతి అంగుళానికీ కొత్త యజమాని వచ్చాడు.


కానీ ఆ నేల జ్ఞాపకంలో యజమాని మారలేదు! చట్టం పేర్లను మార్చింది... మరణం మాత్రం 'మాది' అన్న పట్టును మార్చలేకపోయింది!


బంగళాను కూల్చేశారు...

పాత గేటును తొలగించారు...

చిరునామాను మార్చేశారు...


ఆ ఇల్లు మాత్రం ఇంకా ఖాళీ కాలేదు!

సమాప్తం -


*** 



📢 మనతెలుగుకథలు.కామ్ WhatsApp ఛానల్‌ను ఉచితంగా ఫాలో అవ్వండి!

మనతెలుగుకథలు.కామ్‌లో ప్రచురించే కథలు • కవితలు • ప్రత్యేక వ్యాసాలు • సీరియల్ ఎపిసోడ్స్ - వాటి తాజా లింక్స్‌ను మా WhatsApp ఛానల్‌లో పొందవచ్చు.

✅ ఛానల్‌ను Follow చేయండి✅ WhatsAppలో Updates → Channels ద్వారా మా పోస్టులు చూడండి✅ మీకు నచ్చిన కథ లేదా పోస్టు లింక్‌పై క్లిక్ చేసి చదవండి✅ కొత్త పోస్టులు మిస్ కాకుండా Notifications 🔔 ON చేసుకోండి✅ మీ స్నేహితులు, సన్నిహితులతో మా ఛానల్‌ను Share చేయండి

👉 మా WhatsApp ఛానల్: https://whatsapp.com/channel/0029VbE7RFB3mFY84MHHSb3y



VVS ప్రసాద్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 



మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.



రచయిత పరిచయం: VVS ప్రసాద్

నేను కేంద్ర ప్రభుత్వం లో పని చేసి 2024 లో వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నాను. చిన్నప్పటి నుంచి ఉన్న అభిరుచి తో రచనా వ్యాసంగం మొదలుపెట్టాను. నాకున్న ఇతర అభిరుచులు.. ఫోటోగ్రఫీ, మార్షల్ ఆర్ట్స్, సంగీతం.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page