'Aa Roju Rathri Yemi Jarigindi' New Telugu Story
Written By Pandranki Subramani
రచన : పాండ్రంకి సుబ్రమణి
(ఉత్తమ రచయిత బిరుదు గ్రహీత)
(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)
ఆ రోజు ఉద్యోగస్థులైన దంపతులు పార్థసారథి పరిమళం ఇద్దరూ ఆపీసుకి వెళ్లకుండా ఇంట్లోనే ఉన్నారు. కారణం-ముఖ్యమైన కుటుంబ విషయం చర్చించి మాట్లాడి తీర్మానించాలని పకడ్బందీగా సర్దుకుని హాలులో కూర్చున్నారు. ఇంద్రానగర్ లో ఉంటూన్న పెద్ద కూతురు మాలిని గురించి యెదురు చూసారు గాని, ఆమేదో యూనివర్సిటీ గ్రాంట్స్ కమీషన్ ప్రతినిధులతో మాట్లాడాల్సి ఉందని, భర్త పరిపాలనా పర్యటనపై పొరుగూరు వెడళిపోవడాన బుజ్జిగాణ్ణి తనే కిడ్స్ ప్లేయింగ్ ప్రీ స్కూలు నుండి తీసుకు రావలసి ఉందని తనది యిప్పటికిప్పుడు కదల్లేని పరిస్థితంటూ తప్పుకుంది.
ఇక సీను కట్ చేసి చూస్తే వ్యవహారం మరీ అంత పెద్దదీ కాదు మరీ చిన్నదీ కాదు. చిన్నకూతురు సంకీర్తన పెళ్లి సంగతి తేల్చుకోవలసిన తరుణం ఆసన్న మైంది. నిజానికది ఆషా మాషీ సంగతేమీ కాదు. సంకీర్తన మామూలు స్థాయికి చెందిన అమ్మాయి కాదు. రేపు కాలం కలసి రావాలే గాని కంపెనీ డైరక్టర్ గా ఉంటూన్న తండ్రిగారికి సహితం మించిపోయే స్థాయికి చేరుకోగలదు. ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ సర్వీసుకి యెంపికై పూర్తి స్థాయిలో డెహరాడాన్ అకాడమీలో శిక్షణ తీసుకుని భారత రాజధాని ఢిల్లీ నగరం వెళ్ళబోతూంది. సెంట్రల్ రెవన్యూ డిపార్టుమెంటులో డైరక్టర్ గా పదవీ బాధ్యతలు స్వీకరించబోతూంది. అంచేత ఆమెను వెతుక్కుంటూ మండువా లోగిలిలో మూడు పెద్దింటి సంబంధాలు కాచుక్కూర్చున్నాయి. సంబంధం ఖాయం చేయడానికి ఫోన్లు వస్తూనే ఉన్నాయి.
కాని—వాళ్లిప్పుడు చర్చించబోయేది ఆ మూడు సంబంధాల విషయం కాదు. పార్థసారథి చిన్ననాటి నేస్తం రామగోపాలం కొడుకు సంబంధం గురించి. ఇక విషయానికి వస్తే మిత్రులిద్దరి మధ్యా పరస్పరావగాహన ఉన్నా అదీ అంత తేలికైన వ్యవహారం కాదేమో! ఎందుకంటే రామగోపాలానికి ముగ్గురు కొడుకులు. పోటీ పరీక్షలతో కసరత్తు చేస్తూ అహర్నిశలూ హోరాహోరీగా తిరుగూతూ ఎం దులోనూ కుదరలేకుండా పోతూన్న కామరాజుని భార్యాభర్తలెప్పుడో తెరవెనుక్కి సుతారంగా తోసేసారు. అతడెప్పుడు గట్టుకి
చేరుకుంటాడో ఇప్పటిప్పుడు తేల్చుకోలేని పరిస్థితి.
ఇక వాళ్లు మిగతా ఇద్దరు కొడుకుల గురించే తీర్మానించాల్సి ఉంది. ఒక సం యుక్త అభిప్రాయానికి రావాలి. వాళ్లు తీర్మానించుకుని యెంపిక చేసుకున్నకుర్రాడి భోగట్టాను సంకీర్తన ముందు ఉంచాలన్న మాట. ఆమె ఇప్పటికే రెండు మూడు సార్లు తన విముఖతను అమ్మానాన్నల ముందు సున్నితంగా తెలియ చేసింది; ఇప్పటికి ప్పుడు తన పెళ్ళికి తొందరేమొచ్చిందంటూ--ఇక అసలు విషయం-ఆమె మొదట ఢిల్లీకి వెళ్ళి ఉద్యోగ బాధ్యతలు స్వీకరించాలి కదా! ఆసనంలో స్థిరపడాలి కదా! దానికి కాస్తంత కాల వ్యవధి పడ్తుంది కదా! తగినంత వెసులుబాటు కూడా కావాలి కదా!
కాని పార్థసారథి నిర్ద్వందంగా తీసిపారేసాడు. తను రామగోపాలానికి మాటిచ్చేసాడని-ఇచ్చిన మాటను వెనక్కి తీసుకో లేడని. అప్పుడు సమయం చూసి కూతుర్ని వెనకేసుకు రావడానికి నోరు తెరవబోయిన పరిమళానికి అతడు నరుక్కున బదు లిచ్చాడు-“తల్లీ కూతుళ్లిద్దరూ బాగా వినండి. నా ప్రాణ మిత్రుడు రామగోపాలం ముగ్గురు కొడుకుల్లోనూ ఒకణ్ణి పెళ్లి చేసుకోవటా నికి సిధ్ధమని చెప్పి ఉద్యోగ బాధ్యతలు స్వీకరించడానికి వెళ్ళాలి. అలాగ్గాని కాకాపోతే దాని సంగతి అదే చూసుకోవాలి. దాని భవిష్యత్తు అదే దిద్దుకోవాలి. నా జోలికి మీరిద్దరూ యిక యెప్పుడూ రాకూడదు” అంటూ జీడి పప్పుప్లేటుతో వచ్చిన పనిగత్తె లక్ష్మిని ప్రక్కకు నెట్తూ లేచాడు పార్థసారథి. అప్పుడు ఇసుమంత జాప్యానికి కూడా తావివ్వకుండా భర్తను చేయి పట్టుకుని దాదాపు తన పైకి లాక్కుంది పరిమళం.
“అంతలా ఆవేశపడితే యెలా డార్లింగ్ ! మీరిచ్చిన ప్రామిస్ ని బ్రేక్ చేయమని మేమన్నా మా! మా ఇష్టాయిష్టాలే ముఖ్యమని మీ చిన్ననాటి స్నేహాన్ని ఛిన్నాభిన్నం చేస్తామా! ఇప్పుడు చెప్పండి. ఏ అబ్బాయిని సెలెక్ట్ చేద్దాం? ”
అతడు బింకంగా చూసి అన్నాడు- “నేను చెప్పను. ఎవర్ని చేసుకోబోతుందో నీ కూతురే చెప్పాలి. మరొకసారి ఇద్దరబ్బా యిల ఉద్యోగ వివరాలు అందిస్తాను. రెండవ వాడు-అవినాశ్-ఐ పీ యెస్—మూడవ వాడు భావేశ్-సెంట్రల్ పోస్టల్ సర్వీ స్”
భర్త మాట అందుకున్న వెంటనే పరిమళం కూతురు వేపు చూపు సారించింది, సంకీర్తన స్పందించలేదు, లేచి వెళ్లి లక్ష్మి చేతినుండి జీడి పప్పు ప్లేటు అందుకుని అమ్మా నాన్నలకు చెరొకటీ అందిచ్చి పంచదార తక్కువగా ఉన్న టీ కలుపుకుని తెమ్మని పురమాయించి తండ్రి వేపు తిరిగింది. “మీరు చెప్పినట్టే ఇద్దరిలో ఒకరికి ఓకే అంటాను. ఐతే నాకు కొంచెం సమయం కావాలి”
ఎందుకన్నట్టు భార్యా భర్తలిద్దరూ కూతురు వేపు ప్రశ్నా ర్థకంగా చూసారు.
“ఇద్దరితో మాట్లాడాలి. విడి విడిగా మాట్లాడాలి. నాకు వాళ్ళ పోస్టుల గురించి కాదు. వాళ్ళ మనోభావాలు కూడా ముఖ్యం. వాళ్లకు నా విషయంలో యేవైనా నెగటివ్ అభిప్రాయాలుంటే కియర్ చేయాల్సిన బాధ్యత నాకుంది. అలా కాకుండా ముందుకు సాగితే మండేకుంపటిని ఆర్పకుండా వెళ్ళిపోయినట్లుంటుంది”
ఆ మాట విన్నంతనే పార్థసారథి మోము విప్పారింది. “ఇటీజ్ పైన్. రియల్లీ పైన్. మరైతే వాళ్లింటికి యెప్పుడు వెళ్దాం? ”
”అక్కయ్యతో ఓపారి మాట్లాడి వస్తాను. ఆ తరవాత వెళదాం“ఇద్దరూ తలలూపారు. ప్లేటు నుండి జీడిపప్పుని అందుకుంటూ--
సంకీర్తన వెళ్ళేటప్పటికి మాలిని ఇంట్లోనే ఉంది;బుజ్జిగాడికి బువ్వతినిపిస్తూ--అక్కయ్యను చూసిన వెంటనే సంకీర్తన యెగిరి పడింది. ”ఈ మధ్య చాలాబాగా మారిపోయావే అక్కాయ్! నేను ఢిల్లీ వెళ్ళబోతున్నాను గనుక, నేనిక కనిపించేది లేదు గనుక నన్ను చేతులు కడిగేసుకో వాలని తీర్మానించావా! అక్కడేమో కుతకుతలాడిస్తూన్న హాట్ సీన్. ఇక్కడేమో నీ ఉదాసీనత. నీకెంతటి బంగారు బావ దొరికినా నువ్వు నాలాగే అక్కడ పుట్టి పెరిగిన దానివేనన్నది మరచిపోకు”
“ఓకే.. ఓకే! నీ కోపానికి కారణం అర్థమైంది. అక్కడ యెప్పుడో గాని ఇటు రాని యూనివర్సిటీ గ్రాంట్ కమీషన్ వాళ్ళకు సరైన వివరాలివ్వక పోతే మాకు దాదాపు మొండి చెయ్యే మిగిల్తుంది. లేకపోతే నా తోబుట్టువు భవిష్యత్తు గురించి నాకక్కరుండదా! ముందు నీళ్లు తాగి నీ పెళ్లి సంబంధం యెంతవరకొచ్చిందో దాపరికం లేకుండా చెప్పు”అంటూ బుజ్జిగాడి కోసం ఉంచిన మంచి నీళ్ల బాటిల్ చెల్లెలికి అందించింది. మంచి నీళ్లు రెండు గుటకులు మింగి చెప్పసాగింది. “నాన్న చాలా స్ట్రాంగ్ గా ఫీలవుతున్నాడు నేను ఢిల్లీకి వెళ్ళేముందు ఆయన స్నేహితులబ్బాయిలలో ఒకతన్ని సెలెక్టు చేసి వెళ్లమని. నేనిప్పుడు అవినాశ్ భావేశ ఇద్దరి మధ్యా ఒకరిని సెలెక్ట్ చేసి తీరాలి. వాళ్లిద్దరితో ఓసారి మాట్లాడిన తరవాత నిర్ణయం చెప్తానని తప్పించుకుని నిన్నువెతుక్కుంటూ వచ్చాను”
ఆ మాట విన్నంతనే మాలిని ముఖం అదోలా మారిపోయింది. కళ్లు పెద్దవయాయి. “ఇద్దరంటున్నావే-మరి వాళ్ల పెద్దకొడుకు—“
“అతణ్ణి ఇంట్లోవాళ్లు ఫిల్టర్ చేసేసారుగా అతడికంత స్థిరమైన మంచి ఉద్యోగం లేదని. . నా పొజిషన్ కి తగడని—“
చెల్లి బదులు విని మాలిని పెదవి విరిచింది. “నేనేమో నిన్ను నా కంటే స్మార్టుగా ఉంటావని నాకంటే తెలివైన దానివనుకున్నాను. లోతైన దాని వనుకున్నాను. పప్పులో కాదు తప్పులో కాలేయ బోతున్నావు. ఎదురొచ్చిన బంగారు తరుణాన్ని చేతులారా పోగొట్టుకోబోతు న్నావు. సరే నీ తలవ్రాత అలాగుంటే నేనేమి చేసేది? కొందరికి హోదా కావాలి. కొందరికి జీవితం కావాలి. అంతేమరి! ఇక అమ్మానాన్నలతో వెళ్లి ఇద్దరిలో ఒకతణ్ణి యెంపిక చేసుకో! ”
అక్కయ్య మాటలకు చిర్రెత్తుకు వచ్చింది సంకీర్తనకు. “అదేంవిటే అక్కా అలా పుల్లవిరుపుగా మాట్లాడతావు.. అదేదే మూడో మనిషిని ఫేస్ చేస్తున్నట్టు. చెప్పేదేదో సూటిగా చెప్పు. వంకర టింకరగా మాటలు దొర్లించకు”
“చెప్తే వింటావా! ”
సంకీర్తన అదోలా ముఖం పెట్టి చూసింది-“ఎందుకు విననూ? మా అక్కయ్య నాబాగోగుల గురించి చెప్పదా! ”
“సరే చెప్తాను. నువ్వు కామరాజుని చేసుకుంటానని చెప్పు”
సంకీర్తన తెల్లబోయి చూస్తూ అడిగింది “ఏం-మిగతా వాళ్లిద్దరూ—“
“మంచివారు కారని నేనన లేదుగా! కారణం కావాలంటావు ఔనా! చెప్తాను. నాకు చాలా ఇష్టమైనది మగాడిలో శోభిల్లే మగటిమి. ఆ మగటిమిలో కృతకం ఉండదు. అటువంటి మగాడితో ఆడది జీవితాంతం గుండెలపైన చేయి వేసుకుని బ్రతికేయ వచ్చు”
“వాళ్ల పెద్దకొడుకు కామరాజు గురించి నీకు తెలుసా అక్కా! ”
“ఉండు. నీ మేనళ్లున్ని బుజ్జోబెట్టి వస్తాను. విషయం వచ్చింది కాబట్టి చెప్పే తీరాలిగా! ” అంటూ బుజ్జిగాణ్ణి యెత్తుకుని లోపలకు తీసుకు వెళ్లింది. మరి కాసేపట్లో పిల్లాణ్ణి పడుకుండబెట్టి చేతిలో రెండు ఆరెంజి పండ్లతో వచ్చి చెల్లికి ఒకటి ఇచ్చింది. సంకీర్తన
ఇప్పుడు పండుని ఒలిచి తినే మూడ్ లో లేదు. పండుని ప్రక్కన పెట్టి అక్కయ్య ముఖంలోకి తేరి చూస్తూ కూర్చుంది. మాలిని ఆరంబించింది- “నేను చెప్పబోయేది యెక్కడా యెప్పుడూ యెవరితోనూ చెప్పకూడదు. రియల్లీ పర్సనల్”
“ఇదెక్కడి తిక్క పలుకే అక్కా! ఇది నాకు చెప్పాలా! అసలు మీరందరూ నన్ను ఐ ఏ యెస్ ఆఫీసరుగా ట్రీట్ చేయడం లేదు. ఇంకా స్కూలు అమ్మాయిలానే ట్రీట్ చేస్తున్నట్టున్నారు. ఇక ముందుకు సాగు”
మాలిని స్పందించలేదు. గాలి అలల్లోనుంచి ఆ లోచనల్ని అల్లుకుంటున్నట్టు కాసేపు యెటో చూస్తూండిపోయి పిదప నిదానంగా చెప్పసాగింది. “ఆ సంఘటన ఒక రోజు రాత్రి నిశ్సబ్ద నీరవ వాతావరణంలో వణికించే చలిలో తుఫాను గాలిలో జరిగింది. నేనూ కామరాజూ ఒకే కాలేజీలో చదువుకున్నాం. అతను నాకు సీనియర్. ఒక రోజు సాయంత్రం ఊరి శివార్లలో వాగు ప్రక్కనున్న ప్రశాంతమైన ప్రైవేటు విడిదిలో మా క్లాసుమేట్ పుట్టిన రోజు ఫంక్షన్ జరిగింది. దాని పేరు చెప్పను. కామరాజు పైన దానికి కన్నుంది. కాని అతను అదో టైపు. ఇటువంటి విషయాలకు దూరంగా ఉంటాడు. జాలీ టైప్ అంతకంటే కాడు. కాని మా క్లాసుమేట్ పిలుపందుకుని తన స్కూటర్ పైన వచ్చాడు. నా తరపున నేనూ వచ్చి తోచిన గిఫ్ట్ ఇచ్చాను. అమావాస్యేమో.. యేడు గంటలకే ఆకాశం నలుపు బారింది. అక్కడక్కడ తారలు జిమిలిగా చేరి చీకటిని యెలా తరమాలో తేల్చుకోవడానికి సభలు చేసుకుంటున్నాయి. చెట్లపైన సవారీ చేస్తూ గుడ్లగూబలు చిత్ర చిత్రంగా అరుస్తున్నాయి. పిట్టలు పకపక నవ్వడానికి ప్రయిత్నిస్తున్నట్టు వింత వింత కూతలు. అప్పుడు ఆరంభమైంది ఇరు గ్రూపులుగా చీలి పోయిన స్టూడెంట్సు మధ్య గొడవలు. పుచ్చుకుని ఉన్నారేమో పట్టుకోల్పోయి అదుపు కోల్పోయి ఒకరినొక రు కొట్టుకోసా గారు. తివాసీ రక్తసిక్తమైంది. మా క్లాసుమేటుని కొందరు రౌడీ స్టూడెంట్స్ మేడ గదిలోకి తీసుకు వెళ్లి యేదో చేయడానికి ప్రయత్నిస్తున్నట్టున్నారు. హెల్ప్-హెల్ప్ అని అరుస్తూంది. ఇంకా ఇద్దరు ముగ్గురు అమ్మాయిల గొంతులు కూడా చీకుడు గొంతుతో వినిపిస్తున్నాయి. నేను నోటమాట రాక బిక్కసచ్చిపోయి బైటకు ఎక్సిట్ గేటు వేపు పరుగెత్తాను. అప్పుడు నా చేతిని యెవరో పట్టుకున్నారు. తిరిగి చూస్తే—కామరాజు.
”ఉష్! మరీ గీపెట్టకండి. మీరిప్పుడు గాని బైటకు వెళ్తే మరీ ప్రమాదం. బయటంతా చిమ్మచీకటి. ఎవరో కరంటే మెయిన్ స్విచ్ లాగేసినట్లున్నారు. కరెంట్ పోయింది. మిమ్మల్నెలాగో ఒకలా మీ ఇంటికి చేర్పిస్తాను. నాతో రండి! ”అంటూ నా చేయి పట్టుకుని చెట్ల వరసలోకి పరుగెత్తాడు కామరాజు. నేనూ అతడితో పరుగెత్తాను. అప్పటికి నాకు తెలిసిన దారి అదొక్కటే! గతి తప్పితే దురదృష్టం ఎనుములా వెంటాడుతుందంటారు. అదే జరిగింది. భోరున వర్షం పడనారంభించింది. చలిగాలిలో వానా! అదేమిటో అనుకుంటూ ఆశ్చర్యపోయాను. కాని అదే జరిగింది మరి--చెట్ల మద్య పరుగుత్తుతూనే ఇద్దరమూ ముద్దగా తడిసిపోయాం.
చలీ వానా కూడబల్కుకున్నట్టు జత కట్టాయేమో వణకు మరింత యెక్కవైంది. అప్పుడు నా చేయి పట్టుకుని పరుగెత్తుతున్నవాడల్లా కామరాజు చెట్ల మధ్య చటుక్కున ఆగిపోయాడు. అదే ఊపున నా చేయి పట్టుకుని చెట్లకు అడ్డంగా పరుగు తీస్తూ ప్రక్కనున్న పాడు పడ్డ కట్టడంలోకి ప్రవేశించాడు. అప్పుడు నేను ఆశ్చర్యంగా అడిగాను “ఇక్కెడికెందుకు తీసుకొచ్చావు కామరాజూ! ” అతడు బదులివ్వలేదు. తడిసిపోయిన షర్టు తీసి పిండి పిట్ట గోడపైన పరిచాడు. అప్పుడు చూసాను అనుకోకుండా కామరాజులోని కండలు తిరిగిన శరీరాకృతిని. సిక్స్ ప్యాక్ తో నునుపుదేలిని అతడి శరీరాన్ని. చక్కటి అతడి అందమైన రూపాన్ని చూస్తూండిపోయాను. నాకు తెలియకుండానే నాలోని స్త్రీయత్వం ఫెళ్ళున మేల్కుంది. నిదురించు జ్ఞాపకాలు కాదు.
నిదురించు వాంఛలు చెలరేగాయి. యవ్వనం పురివిప్పిన నెమలిలా నాట్యమాడసాగింది. ఎదలో ఊగిసలాట యెక్కువైంది. ఉప్పొంగిన యవ్వనోద్రేకంతో అతణ్ణి వాటేసుకున్నాను. “ప్లీజ్ కామూ! నాకు చాలా భయమేస్తుంది. నన్ను మా ఇంటి వద్ద దింపేయి. ఎక్కువ ఆలస్యం చేయకు” అతడు నానుండి విడిపించుకుంటూ అన్నాడు. “అందుకేగా నిన్ను విడిపించుకుని నీతో పరుగు లంకించుకుందీ! ముందు నువ్వ డిగిన ప్రశ్నకు జవాబివ్వనియ్యి. మూడు కారణాలున్నాయి. మొదటిది-నువ్వు మంచి యెరుపుతో మంచి యెత్తుతో బాగుంటావు. అక్కడున్న వాళ్లందరూ మత్తులో ఉన్నారు. ఒళ్లెరగని కండకావరంతో ఉన్నారు. అందుకే నిన్ను విడిపించడానికి పూనుకున్నాను. రెండవది-చుట్టు ప్రక్కల పిడుగులు పడుతున్నాయి. భయంతో బిక్కసచ్చిపోయున్నావేమో నీకు వినిపించి ఉండకపో వచ్చు. నాకు వినిపించాయి. మనల్ని మనం పిడుగుల బారినుండి కాపాడుకోవడానికి వచ్చామిక్కడకి. మూడవ కారణం-అంత పెద్దది కాదనుకో—కాని చెప్పాలి. ఈ చుట్టు ప్రక్కల అడవి పందులు యెక్కువగా ఉన్నాయని విన్నాను. వాటికి నీ యవ్వన శోభ గురింతి తెలియదు. కోరలతో అటాక్ చేస్తాయి. నీతో బాటు నేను కూడా అభేస్--ఇప్పుడు అర్థమైందా యెందుకు నిన్నీ పాడు పడ్డ కట్టడంలోకి తీసుకు వచ్చానో! ”
నేను ఉఁ అంటూనే మళ్లీ అతణ్ణి వాటేసుకున్నాను. అతడు కంగారు పడుతూ అడిగాడు-“ఇదేమిటి? నువ్వేమి చేస్తున్నావో తెలుసా! నిప్పుతో చెలగాట మాడుతున్నావు”
అప్పుడు మరింత బిగువుగా కౌగలించుకుం టూ అన్నాను-“తెలుసు. నాకిప్పుడు నిప్పే కావాలి”
అప్పుడతను బలంగా నా చేతుల్ని విడదేసి దూరంగా నెట్టాడు. “నేనిప్పుడు యెవరి బాధ్యతల్నీ తీసుకునే స్థితిలో లేను. ఇప్పటికే మా ముగ్గురు అన్నదమ్ముల భారం మోయలేక తికమక పడ్తున్నాడు నాన్న. అది చాలదని ఇదొక్కటా పులి మీద పుట్రలా! ”
“నేను నిన్ను బాధ్యత తీసుకోమని అడగలేదుగా! ”
“ఔను నువ్వడగ లేదు. కాని నాకుంది. మగవాడిగా నిన్ను ముట్టుకున్న మరుక్షణం నుంచీ నా బాధ్యత ఆరంభమవుతుంది.
అంతా అయింతర్వాత యేమీ కాలేదని స్త్రీని నడిరోడ్డున ఉంచి తన దారిన తను వెళ్లిపోయే వాడు మగాడే కాడు. ఇక సంభాషణ కట్టిపెట్టి బయల్దేరు. వర్షం తగ్గినట్లుంది. ప్రమాదం పొంచి ఉన్నట్లనిపిస్తుంది. నేను తెచ్చుకున్న స్కూటర్ పార్కింగ్ ప్లేస్ లోనే ఉంటుంది. కమాన్! ”అంటూ విప్పార్చి ఉంచిన షర్టు తీసుకుని వేసుకుంటూ బైటకు నడిచాడు. నేను తలవంచుకుని అతణ్ణి అనుసరించాను“
మాలిని చెప్పడం ఆపి చెల్లి వేపు తిరిగి అంది. ”ఇదీ మగటిమి అంటే—తనను కోరి వచ్చిన పడతికి కూడా తన వల్ల హాని కలగకూడదన్న సత్య గుణాంశం. ఇటువంటి మగటిమి గల మగాడు నీకిష్టం లేదా! ”సంకీర్తన నిశ్శబ్దంగా ఉండిపోయింది.
----------------------------------------------------------------
మరునాడు ఉదయం అక్కాచెల్లెళ్లిద్దరూ పార్థసారథి గారింటికి వెళ్లే టప్పటికి మండువాలో కుటుంబమంతా ఉత్సాహంతో ఊగిసలాడుతూంది. కామరాజు ఆనందోద్రేకంతో అంటున్నాడు. “చూసేవే అవ్వా! ఎట్టకేలకు సాధించేసాను. ఇంతవరకూ టెంపరరీ కొలువులు చేస్తున్నవాడికి దేవీ కటాక్షం వల్ల యేకంగా గ్రూప్ బి పోస్టు-అదీను మామూలు గ్రూప్ బి పోస్టు కాదు. గెజిటెడ్ గ్రూప్ బీ పోస్టు వచ్చేసింది. ఎప్పుడు చూడూ-మనవళ్లిద్దరినీ బంగారు కొండ-వెండి కొండ అని తెగ వాగేదానివే . ఇప్పుడేమంటావే అందాల ముసలిదానా! ”
“నేనెప్పుడురా నిన్ను చులకన చేసి మాట్లాడానూ! నువ్వు నాకు వజ్రాల కొండవు. చాలా! ”
“చాలదంటే చాలదు. నేనిప్పుడు యెగ్జాయిటింగ్ మూడ్ లో ఉన్నాను. నువ్విప్పుడు నాతో డ్యాన్య్ చేయాలంటే చేయాల్సిందే! ”
“నేనా! ఈ వయసులోనా—అరవైలో నిప్పు గుండమన్నట్టు--” అప్పుడు వెనుకనుండి మాలిని దూసుకు వచ్చింది. “ఆగండి! ఆగండి! సమస్యను నేను పరిష్కరిస్తాను. అన్నపూర్ణమ్మగారూ మీరు పెద్దవారు. అదెప్పుడో మీరు కూచిపూడో భరత నాట్యమో ఆడి ఉంటారు. బాలగోపాల తరంగణి. హరిగిరి నందిని-మహిషాసుర మర్దిని వంటి నృత్యాలను చేసుంటారు. కాదనను. మరిప్పుడు ఈ వయసులో అదే హోరుతో ఆడగలరా! మీ పెద్ద మనవడితో జత కట్టి ఆడటానికి అందాల భామ సిధ్దంగా ఉంది. అదిగో చూడండి”
ఆ మాట విన్నంతనే అందరూ వాకిటి వేపు తలలు తిప్పి చూసారు. అక్కడ సంకీర్తన నవ్వుతూ నిల్చుంది. ఆమెను చూసి కామరాజు తల్లి చంద్రవతి ఆనందంతో యెదురు వెళ్లి సంకీర్తన చేతులు అందుకుని అంది-“నువ్వా సంకీర్తనా! మాఇంటికి రాకుండానే అక్కణ్ణించి అలా నువ్వు ఢిల్లీకి వెళ్లిపోయుంటావనుకున్నాను మీ నాన్నగారిని వెంటతీసుకుని. కలెక్టర్ గారు నిన్ను పిలిచారటగా! సి యెమ్ కార్యాలయం నుండి సీనియర్లు అభినందనలు తెలిపారటగా! వాళ్లను చూసొచ్చావా! రేపు వాళ్ళ సహకారం నీకు యెంతైనా కావలసి ఉంటుంది“
“ఇప్పటికి అదంతా అయింది అత్తయ్యా! మిగతాది తరవాత నిదానంగా చెప్తాను, ఇప్పటికి నేను మీ పెద్దబ్బాయితో డ్యాన్స్ ఆడాలి. మీరందరూ దూరంగా తొలగి ఉండాలి. ఈజిట్ ఓకే! ”అంటూ కామరాజు వద్దకు వెళ్లి అంది. “నేను సిధ్దం. మరి పాట లేక పోతే ఆట రాదుగా! ఏం పాట పాడుతావు కామరాజ్? ”
అతడు వెంటనే బదులివ్వలేక పోయాడు. వెన్నెల వెలుగులోని పాలరాతి విగ్రహంలా నిండుగా మెరిసి పోతూన్న సంకీర్తనను కళ్లు తిప్పుకోకుండా చూస్తూ స్వగతంలా అన్నాడు.
“పల్లెకు పోదాం పారుని చూద్దాం ఛలో ఛలో—“ అంటూ ఆగిపోయాడతడు.
“ఏం—పల్లెకు పోయి పారునే చూడాలా! మా ఊరికి వచ్చి నన్ను చూడకూడదా? లేక నేను నీకు తగనా! ”
అతడు మాట్లాడ లేదు. మాటలు ముసుగేసుకున్నాయి. ఊపిరి నిశ్సబ్దంగా ఊసులాడుతూంది. ఆమెను తదేకంగా చూస్తూ వీపు చుట్టూ చేతులు పోనిచ్చి తన దగ్గరకు లాక్కున్నాడు. ఆమె గువ్వలా ఒదిగి పోయి అతడి మెడ చుట్టూ చేతులు పోనిచ్చి నిమురుతూ అతణ్ణి మరింత దగ్గరకు లాక్కుంది. అది చూసి అందరూ చప్పట్లు కొట్టనారంభించారు. ఇప్పుడక్కడ ఆనందం తేనెల వానై కురుస్తూంది.
***
పాండ్రంకి సుబ్రమణి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
కథలు, నవలలు మరియు జోకుల పోటీల వివరాల కోసం
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
Podcast Link
Twitter Link
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
1) పేరు-పాండ్రంకి సుబ్రమణి
2)తండ్రి పేరు-పాండ్రంకి నరసియ్య
3) తల్లిపేరు-పాండ్రంకి పైడమ్మ
4)స్వస్థలం-విజయనగరం
5)ఉద్యోగ విరమణచేసి స్థిరపడినది-హైద్రాబాదు
6)సాహితీ నేపథ్యం-కథలు వివిధ పత్రికల్లో ప్రచురితమైనవి.ఒక నవల సాహితీ కిరణం మాసపత్రికలో మరొక నవల- ఆంధ్రభూమి మాసపత్రికలో ప్రచురించబడ్డాయి.
30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత బిరుదు పొందారు.
Comments