ఆ సిరిరాయుడు
- T. V. L. Gayathri 
- 21 hours ago
- 1 min read
#TVLGayathri, #TVLగాయత్రి, #TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #ఆసిరిరాయుడు, #సంకల్పబలము

గాయత్రి గారి కవితలు పార్ట్ 43
Aa Sirirayudu - Gayathri Gari Kavithalu Part 43 - New Telugu Poems Written By
T. V. L. Gayathri Published In manatelugukathalu.com On 30/10/2025
ఆ సిరిరాయుడు - గాయత్రి గారి కవితలు పార్ట్ 43 - తెలుగు కవితలు
రచన: T. V. L. గాయత్రి
ఆ సిరిరాయుడు.
(వచనకవిత)
***********************
అలిగిన వేళనే చూడు చెలీ! ఆ సిరిరాయని అందములు!
కులుకుల తిరిగెడి కృష్ణునివే వన్నెల చిన్నెల చిత్రములు!
జిలుగు వెలుగుల సోయగాన చిత్తము దోచే రూపములు.
పలుకుల తేనెల మధురిమలు వసుధను మేల్కొలుపు గీతికలు.
తిలకింపగ మేని పొంకమును చిత్తము మరచును ప్రపంచము.
విలసిత వేణుగానమదే వినిన కల్గు తాదాత్మ్యము.
కలకల నవ్విన రాలునటే కన్నుల ముందర ముత్యములు.
పులకించును కద హృదయలు పున్నెము నిచ్చెడి భాగ్యములు.
బలహీనులకే బంధువటే భయమును బాపెడి పోషకుడు.
కలతలు తీర్పగ దూకునటే కామితవర సుఖ దాయకుడు.
పిలిచిన పలికెడి మిత్రుడటే ప్రేమను చూపెడి సహచరుడు.
నలుగురి మేలుకై నిలుచునిదే నవయుగ శకముకు నాయకుడు.
పలురకముల కృత్యములటే వసుధలో నిల్పగ ధర్మమును.
సులువుగ దర్శన మిచ్చునటే శోభన మూర్తిగ భక్తులకు.
వెలసెను చూపుచు తిరుమలపై శ్రీ వేంకటేశుడే విభవమును.
తలపున నిలిపిన చాలునులే తరియించును మన జన్మములు.//
************************************

సంకల్పబలము
(ఇష్టపది)
************************************
సంకల్పబలముతో సాధించు విజయాలు!
సంకోచ మెందుకో? సవాళ్ళనెదుర్కో!
కష్టపడితే చాలు!కాలమే తలవంచు!
ద్రష్ట నీవని జనులు దండాలు పెడతారు!
నైపుణ్యమును జూపి నడచిపో నీతిగా!
దీపమై అజ్ఞాన తిమిరాన్ని తొలగించు!
ఘనుడైన భగీరథ గాథనే వినలేద?
చణకపుత్రుని గూర్చి చరితలో కనలేద?
ఒక్క యడుగును వేసి యుద్యమించుమ నీవు
చిక్కులెన్నింటినో చెదరగొట్టేస్తావు!
మానసిక ధైర్యమే మార్గమును జూపగా
మానిసీ!చింతనిక మాని జీవించుమా!
సత్య ధర్మాదులే జవజీవ మందీయ
నిత్య సంతోషివై నిలచిపో వసుధలో!
భారతీయుడవోయి!భయము నీకేలోయి!
కారుచీకటిలోన కాంతిరేఖవు నీవు!
నీదు పూర్వులు గొప్ప నిష్ఠతో మెలిగారు.
వేద విద్యలు నేర్చి విబుధులై వెలిగారు.
జాతికాదర్శమై శాంతినెలకొల్పారు.
ఆ తరమునే దలచి యంజలిని ఘటియించు!
త్యాగశీలివి నీవు ధరనుద్ధరింపగా
సాగిపో!ఠీవిగా! జగతికే స్ఫూర్తిగా!//

టి. వి. యెల్. గాయత్రి.
పూణే. మహారాష్ట్ర.
Profile Link:



Comments