top of page
Original.png

ఆ ఉషోదయ వేళ

#MallaKarunyaKumar, #మళ్ళకారుణ్యకుమార్, #ఆఉషోదయవేళ, #AaUshodayaVela, #TeluguInspirationalStories, #ప్రేరణాదాయకకథలు, కొసమెరుపు


Aa Ushodaya Vela - New Telugu Story Written By - Malla Karunya Kumar Published In manatelugukathalu.com On 12/02/2026

ఆ ఉషోదయ వేళ - తెలుగు కథ

రచన: మళ్ళ కారుణ్య కుమార్


ఎదురుగా కూర్చున్న సుందరమ్మ కళ్ళు రహదారి వైపుకు క్షణానికొకసారి చూస్తూ ఉన్నాయి.

ఎప్పుడూ చూసినా దిగులుతో, ఏదో కోల్పోయినట్లు కనిపించే సుందరమ్మ ముఖం మతాబులాగా ఈ రోజు వెలిగిపోతుంది.


ఆమెను చూసి ఆశ్చర్యపోతూ, "ఏంటి సుందరమ్మ! ఈరోజు నీ మోము ఆనందంతో కళకళలాడుతోంది! పైగా ఎవరికోసమో నిరీక్షిస్తున్నట్టు ఉన్నావు? చుట్టాలు ఎవరైనా వస్తున్నారా?" అడిగారు వీరేశం మాష్టారు.


"మాష్టారు! మీకు అసలు విషయం చెప్పలేదు కదూ. ఈరోజు నా కొడుకు వస్తున్నాడు. వాడి కుటుంబంతో." ఆమె పెదాలపై నవ్వులు విరబూసాయి.


కాసేపు ఆశ్చర్యంతో స్తబ్దుగా ఉండిపోయాడు. కొంత సమయం తర్వాత, "ఆశ్చర్యం! ఎప్పుడూ ఇటువైపు చూడడానికి కూడా ఇష్టపడని వాడు, ఈ ఊరికి వస్తున్నాడా? ఏమైనా ఆస్తి పంపకాలు చేస్తున్నావా?" కాస్త మెల్లగా అడిగాడు.


"లేదు మాష్టారు! వాడి ఇష్టం మీదే వస్తున్నాడు." అని బదులిచ్చింది సుందరమ్మ.


ఇంతలో కారు హారన్ శబ్దం వినిపించడంతో వేగంగా తాను కూర్చున్న చోటు నుండి లేచి రహదారి వైపుకు త్వరత్వరగా అడుగులు వేయసాగింది. వేగంగా వచ్చిన కారు సరిగ్గా సుందరమ్మ దగ్గర ఆగింది. వెంటనే దానిలో నుండి కొడుకు పరమేశ్, కోడలు నయన, మనవడు లక్కీ దిగారు. కొడుకు, కోడలు సుందరమ్మ దగ్గరకు చేరుకొని ఆప్యాయంగా పలకరించారు. కానీ మనవడు లక్కీ మాత్రం దూరం నుండి చూస్తూ నిలబడిపోయాడు.


మనవడిని చూస్తూ, "ఏమిటి రా, మీ తాతలాగా అలా చూస్తూ నిలబడ్డావు. ఈ నాన్నమ్మ దగ్గరకు రావా?" వేగంగా వెళ్లి వాడిని ముద్దాడింది. కానీ వాడు దూరంగా జరిగాడు.


వాడి ప్రవర్తన చూసి, "రేయ్ పరమేశ్, ఏమిటి వీడు, దూరంగా వెళ్ళిపోతున్నాడు?" ఆశ్చర్యంతో అడిగింది సుందరమ్మ.


"అమ్మ, వాడంతే, ఆ సంగతి అటుంచు. మనం ఇంటికి వెళ్దాం పదా." అని అంటూ అక్కడ నుండి బయలుదేరాడు పరమేశం.


"ఏమయ్యా పరమేశం, ఎలా ఉన్నావు?" ఎప్పటి నుంచో వీళ్ళ సంభాషణ వింటూ ఉన్న మాష్టారు మధ్యలో కల్పించుకొని అడిగారు.


మాష్టారును చూసి అమిత ఆనందపడుతూ, "మాష్టారు, ఎలా ఉన్నారు! బాగున్నారా?" నవ్వుతూ కుశల ప్రశ్నలు వేశాడు పరమేశం.


"పోనీలే! ఇప్పటికైనా నీ ఊరు ఒకటి ఉందని గుర్తించావు. మంచిది." అని అన్నాడు మాష్టారు.


ఇంతలో కొందరు పిల్లలు గాలిపటాలతో వచ్చి మాష్టారు చుట్టూ చేరి, మాష్టారును కూడా పిలిచారు. వాళ్ళ మాట కాదనలేక వాళ్ళతో వెళ్ళడానికి సిద్ధమై, ఆగుతూ, "పరమేశం! మీ వాడిని పంపించు. ఈ పిల్లలతో కాసేపు ఆడుకొని వస్తాడు. నేను దగ్గర ఉండి తీసుకువస్తానులే." అని అన్నారు మాష్టారు.


మాష్టారు ఆ మాట అనడంతో కాస్త కంగారు పడ్డాడు పరమేశం. మాష్టారు దగ్గరకు చేరుకొని మెల్లగా, "మాష్టారు, మావాడి మానసిక పరిస్థితి అంతగా బాగా లేదు. వాడు ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తాడో తెలియదు. ఈ పిల్లల్ని వాడు గాయపరిస్తే పరిస్థితి ఏమిటి? అందుకే వాడిని నేను ఎక్కడికి పంపించడం లేదు." పరమేశం స్వరంలో బాధ స్పష్టంగా తెలిసింది.


"ఓహ్! అదేమంత పెద్ద సమస్య కాదని నాకు అనిపిస్తుంది. సరే, నేనే దగ్గర ఉండి వాడిని చూసుకుంటాను. నీకు నమ్మకం ఉంటే వదిలి వెళ్ళు." అని మాష్టారు అన్నారు.


మాష్టారు మాటను కాదని కొడుకుని తీసుకువెళ్లిపోతే మాష్టారు నొచ్చుకుంటారని, "సరే మాష్టారు! మీ మీద నమ్మకం ఉంది." అని అంటూ కొడుకుని మాష్టారుకు అప్పగించి అక్కడ నుండి ముందుకు కదిలాడు పరమేశం.


పరమేశం చేసిన పని భార్య నయనకు నచ్చలేదు. "ఏమిటి మీరు చేసిన పని? వాడి సంగతి తెలిసే వాడిని ఇక్కడ విడిచిపెట్టారా?" అని భర్తతో అంది నయన కాస్త మెల్లగా.


"నయన! మాష్టారు మాటను ఎలా కాదనగలను? అతని మీద నాకు నమ్మకం ఉంది. వాడు ఏ అల్లరి చేయకుండా ఉంటాడు." భార్యకు సర్దిచెబుతూ అక్కడ నుండి ముందుకు కదిలాడు పరమేశం.


పిల్లల చేతిలో ఉన్న ఒక గాలిపటం తీసుకొని లక్కీ చేతికి ఇచ్చారు మాష్టారు. ఆశ్చర్యంతో చూస్తూ దాన్ని అందుకున్నాడు.


"చూడు బాబు, ఇక్కడ ఉన్నవాళ్లు నీ స్నేహితులు. వాళ్ళు ఎలా ఎగరేస్తారో చూసి, నువ్వు కూడా ఎగరేయి." అని చెప్తూ అక్కడ ఉన్న పిల్లలకు గాలిపటం ఎగరేయడానికి సహాయం చేశారు మాష్టారు. ఆనందంతో పిల్లలు గాలిపటాలు ఎగరేస్తున్నారు. లక్కీ కూడా ప్రయత్నం చేశాడు. కానీ, గాలిపటం ఎగరేయలేకపోయాడు. పక్కనే ఉండి లక్కీ ప్రవర్తన చూస్తూ ఉన్నారు మాష్టారు. ఎగరేయడం చేతకాకపోవడంతో లక్కీలో కోపం ఎక్కువై అక్కడ గాలిపటాలు ఎగరేస్తూ కేరింతలు కొడుతున్న తోటి పిల్లాడిని నెట్టాడు. అది గమనించి వెంటనే పడిపోతున్న ఆ పిల్లాడిని పట్టుకున్నారు మాష్టారు.


తర్వాత అక్కడ నుండి లక్కీని దూరంగా తీసుకువెళ్లి, "చూడు బాబు! నీకు ఈ గాలిపటం ఎగరేయడం కొత్త. అందుకే నువ్వు సరిగ్గా ఎగరేయలేకపోయావు. అలా అని అతని మీద కోపం చూపిస్తే ఎలా? ఇలా కోపంగా ఉంటే నువ్వు ఏ విషయం నేర్చుకోలేవు. అలా కాకుండా అతనితో స్నేహం చేశావంటే నీకు కూడా ఆ గాలిపటం ఎలా ఎగరేయాలో నేర్పిస్తాడు కదా. అప్పుడు నువ్వు కూడా ఆనందంగా ఎగరేయవచ్చు." అని బుజ్జగిస్తూ, గాలిపటాలు ఎగరేస్తున్న పిల్లల్ని పిలిచి, "చూడండి పిల్లలు. ఇతని పేరు లక్కీ! సిటీ నుండి వచ్చాడు. చూస్తుంటే క్లాస్ టాపర్‌లాగా కనిపిస్తున్నాడు. మీకు తెలియని సబ్జెక్ట్స్ ఏమైనా అతని సిలబస్‌లో ఉన్నాయేమో తెలుసుకోండి. అతని నుండి మీరు నేర్చుకోండి." అని అక్కడ ఉన్న పిల్లలతో చెప్పారు మాష్టారు.


ఆ మాటలు విని తనని టాపర్ అని మాష్టారు సంబోధించడం, తన గురించి గొప్పగా చెప్పడం విని లక్కీ లోలోపల ఉప్పొంగిపోయాడు. మాష్టారు లక్కీనే గమనిస్తూ ఉన్నారు. లక్కీ ప్రవర్తన మాష్టారు ఇట్టే పసిగట్టారు. "సరే పిల్లలు, ఈ లక్కీ ఈ రోజు నుండి మీ స్నేహితుడు. అతనితో మీ పరిచయం చేసుకోండి." అని మాష్టారు చెప్పడంతో వాళ్ళు తమ గురించి లక్కీతో పరిచయం చేసుకున్నారు.


లక్కీకి కూడా ఆ పిల్లల ప్రవర్తన నచ్చడంతో వాళ్లతో స్నేహం చేయడానికి సిద్ధమయ్యాడు.-----మరుసటి రోజు సుందరమ్మ ఎటో వెళ్తూ మాష్టారికి కనిపించింది.


'ఈరోజు ఎందుకో ఆమె మోములో సంతోషం కనిపించడం లేదు. విషయం ఏమిటో తెలుసుకుందాం' అని సుందరమ్మ దగ్గరకు చేరుకొని, "సుందరమ్మ! ఆరోగ్యం బాగానే ఉంది కదా?" అని అడిగారు మాష్టారు.


"ఆరోగ్యం బాగానే ఉంది మాష్టారు!" సన్నని స్వరంతో జవాబిచ్చింది.


"మరెందుకు నీలో ఈ దిగులు, కొడుకు వచ్చిన ఆనందం లేదు?"


ఆమె కళ్ళు చెమర్చాయి. "ఏం చెప్పను మాష్టారు. ఇన్ని రోజులకు కొడుకు వచ్చాడని సంతోషించాలో, లేక వాడు వచ్చింది ఆస్తి కోసం అని తెలిసి బాధపడాలో అర్థం కావడం లేదు." నిట్టూర్చింది సుందరమ్మ.


సుందరమ్మ సమాధానం విని కాసేపు మౌనం వహించి,

"సుందరమ్మ! ఎలాగూ ఆ ఆస్తి అంతా వాడికే చెందుతుంది కదా, దాని కోసం దిగులు పడటం ఎందుకు?"


"మీరు చెప్పింది నిజమే మాష్టారు. కానీ, ఇప్పుడున్న రెండెకరాలు మంచి ఫలసాయం ఇచ్చే భూమి. మా ఆయన ఉన్నప్పుడు ఆ భూమిని కన్న తల్లిగా భావించి దానిలోనే ఎన్నో పంటలు వేసేవారు. ఎప్పుడూ ఆ భూమి పచ్చగా ఉండాలని, నీటి కొరత ఉండకూడదని బోరు వేయించి, పంటలు పండించేవారు. అతను నన్ను కోరిన కోరిక ఒకటే, ఆ భూమి ఎప్పుడూ పచ్చగా ఉండాలని. ఆయన కోరిక మేరకు యోగయ్యకు కౌలుకు ఇచ్చి అక్కడ సాగు చేయిస్తున్నాను. యోగయ్యకు కూడా అది ఆర్థికంగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఉన్నపళంగా అతన్ని సాగు ఆపేయమంటే అతని ఉపాధికి ఇబ్బంది కదా!" అంది సుందరమ్మ.


"ఇంతకీ పరమేశ్ బాగా స్థిరపడ్డాడు కదా, ఈ భూమి అమ్మాల్సిన అవసరం ఏమిటి?"


"ఇదంతా కోడలి పిల్ల సలహా మాష్టారు. ఇక్కడ భూమి అమ్మి పట్నంలో ఏవో పెట్టుబడులు పెడతారు అంటా!" నిట్టూర్చింది సుందరమ్మ.

మాష్టారు ఆలోచనలో పడ్డాడు.


"సరే మాష్టారు." అని చెప్తూ అక్కడ నుండి ముందుకు కదిలింది సుందరమ్మ.

***

మరుసటి రోజు పిల్లలతో ఆడుతూ కనిపించాడు లక్కీ.

వాళ్ల దగ్గరకు చేరుకొని, "పిల్లలు, మీ స్నేహితుడికి మన గ్రంథాలయం చూపిద్దాం రండి." అని మాష్టారు అనడంతో పక్కనే ఉన్న గ్రంథాలయం వైపుకు పిల్లలు లక్కీని తీసుకొని పరుగుతీశారు.


చకచకా వెళ్లి తమకు బాగా ఇష్టమైన పుస్తకాలను తీసుకువచ్చి లక్కీ ముందు పేర్చి 'ఇది చదువు అంటే ఇది చదువు' అని అల్లరి చేశారు. లక్కీ వాళ్ళు తనపై చూపిస్తున్న అభిమానానికి ముగ్ధుడై. "హే స్టాప్! నేనే వీటిలో ఒక పుస్తకాన్ని సెలెక్ట్ చేసుకుంటా." అని ఆ పుస్తకంలో ఒకటి సెలెక్ట్ చేసుకున్నాడు. వాటిని చూసి అక్కడ పడేశాడు. "మీరు ఈ పుస్తకాలు అన్నీ తీసుకు వచ్చారు. కానీ నాకు తెలుగు అంతగా రాదు." అని ముఖం వేలాడేస్తూ అన్నాడు లక్కీ.


"ఓహ్, అలాగా! ఇక్కడ ఇంగ్లీష్ పుస్తకాలు కూడా ఉన్నాయి. కానీ మేమంతా నీ స్నేహితులం కదా, ఈ తెలుగు పుస్తకాలు చదవడంలో నీకు సహాయం చేస్తాం. నీకు కూడా తెలుగు బాగా వస్తుంది." అని లక్కీతో అన్నారు.


వాళ్ళు ప్రేమగా చెప్పడంతో సరే అని ఒప్పుకొని అక్కడే కూర్చున్నాడు లక్కీ. వాళ్ళు ఆ పుస్తకం తీసుకొని అందులో ఉన్న కథలు లక్కీకి చదివి వినిపించడం ప్రారంభించారు.

వాళ్లను చూస్తూ ముసి ముసి నవ్వులు నవ్వుతూ అక్కడే చూస్తూ కూర్చున్నారు మాష్టారు. పక్కనేదో అలికిడి కావడంతో మాష్టారు చూపు పక్కకి తిప్పారు. అక్కడ ఉన్న నోటీసు బోర్డులో ఉన్న పేపర్ కటింగ్స్ చూస్తూ ఉన్నాడు పరమేశం.


పరమేశం వైపు చూసి, "పరమేశ్! ఏమిటి అక్కడే ఆగిపోయావు? ఇక్కడకు వచ్చి కూర్చో!" అని అన్నారు మాష్టారు.


మాష్టారు మాటలకు అటువైపు నుండి చూపు తిప్పి మాష్టారు వైపు చూసి మాష్టారు వైపుకు కదిలాడు.


"మాష్టారు! ఇది మన ఊరేనా? ఈ గ్రంథాలయం ఏమిటి? ఎంత అధునాతనంగా ఉంది. డిజిటల్ లైబ్రరీతో పాటు తెలుగు, ఇంగ్లీష్, హిందీ పుస్తకాలు చాలా ఉన్నాయి. పైగా అప్పటి రోజుల్లో ఈ ఊరికి రావడానికి చాలా కష్టం అయ్యేది. కానీ, ఇప్పుడు నది దాటడానికి వీలుగా బ్రిడ్జి కూడా ఉంది. ఈ ఊరిలో ఎక్కడా చెత్తాచెదారం లేకుండా చాలా పరిశుభ్రంగా ఉంది. చుట్టూ పచ్చని చెట్లు ఉన్నాయి. నాకు ఆశ్చర్యంగా ఉంది." అని అన్నాడు పరమేశ్.


"పరమేశ్, ముందు కూర్చో." ఎదురుగా ఉన్న కుర్చీ చూపిస్తూ అన్నారు మాష్టారు. ఎదురుగా కుర్చీలో కూర్చొని అక్కడ పిల్లలతో పాటు ఏకాగ్రతతో పుస్తకాలు చూస్తున్న కొడుకుని చూసి ఆశ్చర్యపోయాడు.


"పరమేశ్! నేను చిన్నప్పటి నుండి చూసాను. ఈ గ్రామం నుండి వేరే ప్రాంతాలకు వెళ్లి స్థిరపడి, చివరి దశలో అంటే చనిపోయిన తర్వాత పుట్టిన ఊరు అని ఇక్కడకు ఆ శరీరాన్ని తీసుకువచ్చి అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి మళ్ళీ వెళ్లిపోవడం. ఇవన్నీ నాలో ఆలోచన రేకెత్తించాయి. నేను కూడా ఉద్యోగ విరమణ తరువాత వేరే ప్రాంతంలో స్థిరపడదాం అనుకున్నాను. కానీ చిన్నప్పటి నుండి నాకు ఈ ఊరుతో ఉన్న అనుబంధం. మా నాన్నగారు వ్యవసాయం చేస్తుంటే అతనితో తిరిగిన జ్ఞాపకాలు నన్ను ఉండనీయలేదు. ఎన్ని జ్ఞాపకాలు!


ఉన్నన్ని రోజులు హాయిని ఇచ్చిన ఈ ఊరికి ఏదైనా చేయాలని సంకల్పించుకున్నాను. నా శక్తి మేరకు పోరాడి ఈ ఊరికి బ్రిడ్జి పూర్తి అయ్యేలా పోరాటం చేసి సాధించాను. పల్లెటూరులో పుట్టాము, మాకు ఎటువంటి సాంకేతికత, నాణ్యమైన విద్య దొరకదు అని ఏ పిల్లలు బాధ పడకూడదు అని ఇక్కడ డిజిటల్ లైబ్రరీతో పాటు చాలా పుస్తకాలు, విద్యకు అవసరమైన సౌకర్యాలు ఏర్పాటు చేశాను. పర్యావరణ పరిరక్షణే ముఖ్యమని ఇక్కడ వ్యర్థాలు శుద్ధి చేయడం ఎలాగో ప్రజలకు తెలియజేసి వాళ్ళు పాటించేలా చేస్తున్నాను. నాకు ఓపిక ఉన్నంత వరకు ఇక్కడ ఏ లోటూ లేకుండా చూసుకుంటాను." నవ్వుతూ సమాధానమిచ్చారు మాష్టారు.


"చూసాను మాష్టారు. ఆదర్శ గ్రామంగా కలెక్టర్ గారు అవార్డు ఇచ్చిన ఫోటో చూసాను. ఇంకా చాలా అవార్డులు ఉన్నాయి." మాష్టారు వైపు అభినందన పూర్వకంగా చూస్తూ అన్నాడు పరమేశం.


"నిజానికి నా లక్ష్యం అవార్డులు కాదు పరమేశ్. గ్రామం అంటే ఆప్యాయత, అనురాగానికి, మంచి జీవనానికి పునాది. అలాంటి గ్రామాలు అనాగరికతతో నశించిపోకూడదు. నూతన నాగరికత సంతరించుకొని తన ఉనికి కాపాడుకోవాలి. అప్పుడే ఈ సమాజం బాగుంటుంది అని నా ఉద్దేశ్యం." అని అన్నారు మాష్టారు.


మాష్టారు మాటలు విని నిశ్శబ్దం వహించాడు పరమేశ్.


"పరమేశ్! నీ మౌనానికి అర్థం నాకు బోధపడింది. ఈ గ్రామం గురించి ఏ రోజూ ఆలోచించలేదు అని నీ బాధ కదా?" అని అన్నారు మాష్టారు.


చెమ్మగిల్లిన తన కళ్లను తుడుచుకుంటూ, "నిజమే మాష్టారు. కానీ నేను చాలా సార్లు రావడానికి ప్రయత్నం చేశాను. కానీ నా భార్య సిటీలో పుట్టి, సిటీలో పెరిగింది. ఇక్కడకు రావాలంటే ఆమెకు ఇష్టం ఉండదు. ఆమె రాకపోతే నా కొడుకు రాడు. వాళ్ళు లేకుండా నేను ఇక్కడకు వస్తే 'అమ్మ ఒక్కడివే వచ్చావు, వాళ్లను తీసుకురాలేదు' అంటుంది. అమ్మకు అసలు విషయం చెబితే బాధపడుతుంది. ఈ సందిగ్ధావస్థలో నేను సతమతం అవుతున్నాను. ఇప్పుడు కూడా ఇక్కడకు రావడానికి కారణం నా కొడుకు కాస్త ఈ వాతావరణం చూసి బాగుపడతాడని. వాడు ఎందుకు అలా తయారయ్యాడో నాకు అర్థం కావడం లేదు మాష్టారు." బాధపడుతూ చెప్పాడు పరమేశ్.


"పరమేశ్! నీ కొడుకు ఒంటరి అని బాధపడుతూ ఇలా అయిపోయాడు. నాకు తెలిసి నీ కొడుకు చదువులో కాస్త వెనకబడి ఉన్నాడు. తోటి విద్యార్థులు వాడిని ఈ విషయంలో బాధపెట్టారని నాకు అర్థమైంది. పైగా 'నేనే గొప్ప' అన్న మనస్తత్వం నీ కొడుకుది." అని లక్కీ గురించి తేటతెల్లం చేశారు మాష్టారు.


మాష్టారు చెప్పింది విని ఆశ్చర్యపోతూ, "మీరు చెప్పింది నిజమే మాష్టారు. వాడిది అచ్చం నయన పోలికే. అన్ని విషయాల్లో 'నేనే గొప్ప, వేరెవరూ గొప్ప కాదు' అని ఆమె కొన్నిసార్లు మొండిపట్టు పట్టుకొని కూర్చుంటుంది. వీడు కూడా ఆమెలా తయారయ్యాడు. మానసిక వైద్యులను కూడా చూపించాను కానీ లాభం లేదు. కానీ మీరు ఎలా ఇవన్నీ తెలుసుకున్నారు?" అడిగాడు పరమేశ్.


"ఇలాంటి పిల్లల్ని నేను చాలా మందిని చూసాను పరమేశ్. పైగా మానసిక తత్వశాస్త్రంలో నాకు అనుభవం కారణంగా వాడి లక్షణాలను పసిగట్టాను. అప్పుడే ట్రీట్‌మెంట్ కూడా మొదలు పెట్టాను. పరిస్థితి కాస్త మెరుగుపడేలా కనిపిస్తుంది." అక్కడే పిల్లల్తో నవ్వుతూ ఉన్న లక్కీని చూపిస్తూ అన్నారు మాష్టారు.


"మీరు నా పాలిట దైవం మాష్టారు. నన్ను నిద్ర పట్టనివ్వక సతమతం చేసిన సమస్యను మీరు కొంత వ్యవధిలో పటాపంచలు చేశారు." మాష్టారు చెయ్యి పట్టుకొని కృతజ్ఞతలు చెప్పాడు పరమేశ్.


"పరమేశ్! గురువు అంటే వెలుగు వైపుకు నడిపించేవాడు కదా. నీకు కొన్ని చిట్కాలు చెప్తాను. విని నువ్వు, నీ భార్య వాడితో కాసేపు మాట్లాడండి, ఆటలు ఆడండి. మీరు వాడి ఎదుట ఎప్పుడూ గొడవ పడవద్దు. ఇతర విషయాలు వాడి ముందు ప్రస్తావించవద్దు." అని చెప్పారు మాష్టారు.


"అలాగే మాష్టారు, మీరు చెప్పినట్టే చేస్తాను." అని తలాడిస్తూ అన్నాడు పరమేశ్.


'పరమేశ్ కొడుకు బాగు కోసం వచ్చాను అని చెప్తున్నాడు. కానీ, సుందరమ్మ ఆస్తి కోసం వచ్చాడు అని చెబుతుంది. చూస్తుంటే పరమేశ్ భార్య ఈ విషయం ప్రస్తావించి ఉంటుంది అని నాకు అనిపిస్తుంది.' అని అనుకుంటూ బాగా ఆలోచించి, "పరమేశ్! చాలా రోజులకు ఈ గ్రామానికి వచ్చావు కదా. అలా ఒకసారి ఊరు చూపిస్తాను. రేపు తిరిగి వద్దాం." అని పరమేశ్తో అన్నారు మాష్టారు.


"సరే మాష్టారు." అని అంగీకారం తెలిపాడు పరమేశ్.


"ఆ, నీ భార్యను, కొడుకును కూడా తీసుకురా. వాళ్ళకు కూడా ఇవన్నీ తెలుస్తాయి." అని చెప్పారు మాష్టారు.


నయన ఒప్పుకుంటుందో లేదో అని సందిగ్ధపడుతూ, "సరే మాష్టారు." అని సమ్మతి తెలిపాడు.


మెల్లగా ఎలాగో భార్యను ఒప్పించి మరుసటి రోజు ఉదయం భార్యతో, కొడుకుతో కలిసి మాష్టారు దగ్గరకు చేరుకున్నాడు పరమేశం.


అప్పటికి పరమేశం గురించి ఎదురుచూస్తున్న మాష్టారు.


వీళ్ళను చూసి, "వచ్చారా! పదండి." అని అంటూ ముందుకు నడిచాడు.


దారి పొడవునా కనిపించిన ప్రతి ఒక్కరూ పరమేశం గురించి మాష్టారును ప్రశ్నించడం, మాష్టారు పరమేశం గురించి చెప్పడం, వాళ్ళు సంతోషంతో ఉప్పొంగిపోయి ఆప్యాయంగా పలకరించడం జరిగింది. ఇలా ముందుకు సాగుతున్నారు. ఆ ఊరి వ్యవసాయ పొలాలకు తీసుకువెళ్ళారు మాష్టారు. ఆ ఉషోదయ వేళ సూర్యుడు నిటారుగా ఆకాశంలోకి తూర్పు తీరం నుండి వస్తున్నాడు. పొలాల్లో పక్షులు ఎగురుతూ కనువిందు చేస్తున్నాయి. ఆ పొలాల గురించి చెబుతూ చివరికి పరమేశం పొలం దగ్గరకు తీసుకువెళ్లారు మాష్టారు.


రకరకాల కూరగాయలతో ఆ పొలం పచ్చగా కనిపిస్తుంది.

అప్పటికి అక్కడకు చేరుకొని తన పనిలో నిమగ్నమై ఉన్నాడు యోగయ్య. యోగయ్యను చూపిస్తూ,

"పరమేశ్! ఇదే మీ పొలం. అదుగో యోగయ్య ప్రాణానికి సమానంగా ఈ నేల తల్లిని చూసుకుంటున్నాడు. మీ నాన్నగారి కోరిక కూడా అదే, ఎప్పుడూ ఈ భూమి పచ్చగా, పంటలతో కళకళలాడాలని. యోగయ్య లాంటి వాళ్ళకు మనం చేయూతనివ్వాలి పరమేశం. అప్పుడు నేల తల్లి కూడా సంతోషిస్తుంది. పైగా యోగయ్య నేల తల్లికి హాని కలుగుతుందని సేంద్రీయ వ్యవసాయం చేస్తున్నాడు." ఇంకా వివరాలు చెబుతున్నారు మాష్టారు.


పరమేశ్‌కు మాష్టారు మాటలకు అంతరార్థం ఏమిటో అర్థమైంది. పక్కనే ఉన్న తన భార్య వైపు చూశాడు. ఆమె సంతోషంతో చుట్టూ చూస్తూ పులకించిపోతుంది.


'ఈ ప్రకృతి, ఈ పంట పొలాలు, మనసులకు నిజమైన నేస్తాలు కదా. ఎంతో ప్రశాంతత మనసుకు చేకూరుస్తుంది. మనల్ని మనం మరిచిపోతాం.' అని తనలో అనుకుంటూ,

"నయన! ఇప్పుడు కూడా నీకు ఈ భూమి అమ్మి పెట్టుబడి పెట్టాలి అనిపిస్తుందా?" భార్యను సూటిగా ప్రశ్నించాడు.


"ఏవండీ! ఇవన్నీ చూసిన తర్వాత మానవత్వం ఉన్న మనిషి ఎవరైనా అమ్మాలి అనుకుంటారా? ఈ భూమి ఇలానే ఉండనివ్వండి." అని అంది నయన.


భార్య మాటలకు పరమేశ్ మనసు తేలికపడింది. మరింత సంతోషిస్తూ కొడుక్కి చుట్టుపక్కల ప్రకృతి దృశ్యాలు చూపిస్తూ ముందుకు సాగాడు.


 ***సమాప్తం****

మళ్ళ కారుణ్య కుమార్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 


ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం


కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:

నా పేరు మళ్ళ కారుణ్య కుమార్అమ్మవారి పుట్టుగ (గ్రామం)శ్రీకాకుళం జిల్లా.

విద్య : ఫార్మసీఉద్యోగం : ప్రైవేట్ ఉద్యోగం.

సాహితీ ప్రస్థానం : నేను కథలు,కవితలు రాస్తాను.యిప్పటి వరకు చాలా కథలు,కవితలు వివిధ పత్రికల్లో సాక్షి,ప్రజాశక్తి,తపస్వి మనోహరం,సుమతీ,తెలుగు జ్యోతి,సహరి,సంచిక,జాగృతి ప్రింట్/అంతర్జాల మాస/వార పత్రికల్లో ప్రచురితం అయ్యాయి.

పురస్కారాలు :1.లోగిలి సాహితీ వేదిక యువ కవి పురస్కారం.2.సుమతీ సాహితీ సామ్రాట్ పోటీలలో ద్వితీయ స్థానం.3.సుమతీ మాసపత్రిక వారి దీపం ఉగాది పురస్కారం.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page