top of page
Original.png

అబద్ధానికి ఆత్రం ఎక్కువ


“అబద్ధం వేగంగా పరిగెడుతుంది… నిజం నెమ్మదిగా నడుస్తుంది… కానీ గెలిచేది నిజమే!”

Abhaddaniki Athram Ekkuva- Telugu Inspirational Story |Bhallamudi Nagaraju

అబద్ధానికి ఆత్రం ఎక్కువ - తెలుగు ప్రేరణాత్మక కథ | భళ్లమూడి నాగరాజు

Published in manatelugukathalu.com on 26/03/2026


“ఒక అబద్ధం… ఒక నిజాయితీ ఉన్న టీచర్ జీవితాన్ని నాశనం చేసింది… కానీ చివరికి జరిగిన ట్విస్ట్… మీరు ఊహించలేరు!”

భళ్లమూడి నాగరాజు గారు అబద్ధానికి ఆత్రం ఎక్కువ కథ ద్వారా వాస్తవాలు బహిర్గతం చేశారు.

రాయగడ జిల్లాలో అతి పెద్ద పంచాయతీ కాశీపూర్. ఇక్కడ ఉన్నత పాఠశాలకు మంచి పేరుంది. నీతి, నిజాయితీలకు మారుపేరులా నిలిచిన ప్రీతి మిశ్రాను ప్రధానోపాధ్యాయురాలిగా డి.ఇ.ఓ నియమించారు.


గ్రామంలో చిన్నపాటి నాయకుడిగా సూర్య ప్రతాప్ ఎదుగుతున్నాడు. అధికారులతో పోరాడి అభివృద్ధి పనులకు నిధులు తెప్పించగలిగాడు. గుత్తేదారుడిగా పనులు చేస్తూ ప్రజల దృష్టిని ఆకర్షిస్తున్నాడు.


ఊరిలో రోడ్లు, కాలువల పనులు చేయలేదు కానీ, పాఠశాల ప్రహరీ నిర్మించాడు. కొద్దిరోజులకే గోడ కూలి కొంతమంది విద్యార్థులకు గాయాలయ్యాయి. తల్లిదండ్రులు ఆగ్రహంతో సూర్య ప్రతాప్‌ను నిలదీశారు. తెలివిగా తప్పించుకొనే ప్రయత్నం చేశాడు.

“వచ్చిన నిధులన్నీ ప్రధానోపాధ్యాయురాలు ప్రీతి మేడంకే ఇచ్చాను. ఆమె నాసిరకం పనులు చేసి, నిధులు స్వాహా చేశారు” అని ప్రజలను తన మాటల గారడీతో నమ్మించగలిగాడు.


అంతా ఒక్కసారిగా విస్మయం చెందారు.

“నిజాయితీపరురాలిలా మాట్లాడుతారు.”

“ఆమె అలా చేసిందా?”

“డబ్బు అంటే ఎవరికి చేదురా?”

ఇలా గుసగుసలు మొదలయ్యాయి.

అబద్ధం ఆ క్షణమే ఊరు దాటింది.


ప్రీతిలో నిస్సత్తువ ఆవహించింది. అయినా నోరు మెదపలేదు.

తన విద్యార్థులే ఇప్పుడు దూరంగా ఉంటున్నారు.

స్కూల్ నుంచి విచారంగా వచ్చిన ప్రీతిని చూసి తల్లి కన్నీరు పెట్టుకుంది.


“నువ్వు మౌనంగా ఉంటే తప్పు అంగీకరించినట్లే లోకం భావిస్తుంది, తప్పు చేసే ఉంటావని నమ్ముతుంది. నోరు తెరిచి నిజం చెప్పు” అని అంది ఆమె.


ఆమె మాటలు విన్న ప్రీతి ఇలా అంది: “ఇప్పుడు నా మాటలు ఎవరూ వినరమ్మా, అబద్ధాన్ని నమ్మినంత త్వరగా నిజాన్ని నమ్మరు. కానీ ఎప్పటికైనా నిజమే గెలుస్తుంది” అని చెప్పి పడకగదిలోకి వెళ్ళిపోయింది.


తెల్లవారేసరికి ప్రీతి మీద దినపత్రికల్లో వార్తలు వచ్చాయి:

“అవినీతి గురువు”

“బడి సొమ్మే కాజేసిన ఉపాధ్యాయురాలు”

“చెప్పేవి నీతి బోధనలు.. చేసేవి అవినీతి పనులు”

“ఆమెకు ధనమే 'ప్రీతి'..”

పత్రికల్లో శీర్షికలు చూసి ప్రీతికి ఏడుపు వచ్చేసింది.


ఆమెను ఎంతగానో మెచ్చుకొని, ఇక్కడికి బదిలీ చేసిన డి.ఇ.ఓ ఆమెను సస్పెండ్ చేశారు.


ఈ వార్తలు తెలుసుకున్న ఆ పాఠశాల పూర్వ విద్యార్థి, జర్నలిస్ట్ నాగు కాశీపూర్ చేరుకున్నాడు. పరిస్థితి గమనించాడు. గ్రామ కార్యదర్శిని కలిసి సమాచార హక్కు చట్టం ద్వారా రికార్డులు, పత్రాలు అడిగి పరిశీలించాడు.


ప్రీతి మేడం నిధులు ఖర్చు చేసినట్లు వివరాలు ఉన్నాయి.

సంతకాలు ఆమే చేసింది.

అప్పుడే ఒక్క నిమిషం మెరుపులాంటి ఆలోచన వచ్చింది.


సంతకాల్లో ఒక్కో చోట ఒక్కోలా కనిపించాయి. అది ప్రీతి మేడం సంతకం కాదు, ఫోర్జరీ సంతకం అని గుర్తించి అధికారుల ముందు ఉంచాడు. సంతకాలను పరిశీలనకు ల్యాబ్‌కు పంపించారు. అవి నకిలీ అని తేలింది.


గ్రామంలో సభ ఏర్పాటు చేసి, నిజం అందరికీ తెలియజేశాడు. కరతాళ ధ్వనులతో అభినందించారు.

“ఒక్క నిమిషం.. వినండి” అని అరిచాడు.

“ఈ కేసు నేను ప్రీతి మేడం మీద అభిమానంతో చేయలేదు” అనేసరికి అంతా ఒక్కసారిగా నిశ్శబ్దం.

మరలా ఇలా చెప్పసాగాడు:

“నా చిన్నప్పుడు ప్రోగ్రెస్ కార్డు మీద నాన్న సంతకం ఫోర్జరీ చేసి మాస్టారుగారికి ఇచ్చాను. అది మా నాన్న సంతకం కాదని గుర్తించిన ఆయన నన్ను దండించలేదు. కానీ ఒక్క మాట చెప్పారు.”


“నువ్వు ఈరోజు తప్పించుకున్నా.. నిజం నిన్ను వెంటాడుతుంది. మరో తప్పులో నువ్వు ఇరుక్కున్న రోజు నిన్ను కాపాడటానికి ఎవ్వరూ ముందుకు రారు. అలాంటి తప్పు మరోసారి చేయకుండా చూసుకొనే బాధ్యత నీదే” అని అన్నారు. “ఆయన మరెవ్వరో కాదు, ప్రీతి వాళ్ళ నాన్నగారే.”


“ఆయన మాటలే నన్ను మంచి జర్నలిస్ట్‌గా నిలిపాయి.”


అని వివరించేసరికి ప్రజలు మరలా చప్పట్లతో అభినందించారు.

సూర్య ప్రతాప్ అరెస్ట్ అయ్యాడు.

ప్రీతి మేడం పై సస్పెన్షన్ ఎత్తివేశారు.

ప్రీతి తల్లి పాదాలకు నమస్కరించి,

“అబద్ధానికి ఆత్రం ఎక్కువ.. తొందరగా వ్యాపిస్తుంది.

నిజానికి నిలకడ ఎక్కువ.. నెమ్మదిగా తెలుస్తుంది”

అంటూ తల్లి ఒడిలో తలపెట్టి “నీ కూతురు తప్పు చేయదమ్మా”


అనేసరికి ఆవిడ హృదయం ఉప్పొంగిపోయింది.


***

భళ్లమూడి నాగరాజు  గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

 

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.



రచయిత పరిచయం:

నా పేరు భళ్లమూడి నాగరాజు, రాయగడ ,ఒడిశా లో ఉంటున్నాను. ఇప్పటి వరకు 30కథలు వివిధ వార,మాస పత్రికల్లో ప్రచురితం అయ్యాయి సుమారు వంద కవితలు ప్రచురితం.

Telugu story, moral story Telugu, truth vs lie story, inspirational stories Telugu, social awareness story, భళ్లమూడి నాగరాజు


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page