కవిత్వంలో మ్యూజింగ్స్

Musings in Poetry - Achhu Kayidam - Book Review | Thokala Rajesham
కవిత్వంలో "మ్యూజింగ్స్" - అచ్చు కాయిదం పుస్తక సమీక్ష | తోకల రాజేశం
Published in manatelugukathalu.com on 21/10/2026
తెలంగాణ పల్లె జీవితం, బాల్యస్మృతులు, మానవ సంబంధాలను 109 కవితల్లో ఆవిష్కరించిన అల్లాడి శ్రీనివాస్ 'అచ్చు కాయిదం' ఒక విశిష్ట సాహిత్య సంకలనం. ఈ పుస్తకంలోని మ్యూజింగ్స్ లక్షణాలు, తెలంగాణ భాషా సౌందర్యం, సామాజిక చరిత్రను సమీక్షకుడు తోకల రాజేశం విశ్లేషించారు.
తెలుగు సాహిత్యంలో "మ్యూజింగ్స్" లాంటి రచనలు ఈ మధ్య కాలంలో కనిపించటం లేదు. దానికి బహుశా 'మ్యూజింగ్స్'లోని లక్షణాలే కారణం కావొచ్చు.
'మ్యూజింగ్స్'లోని ఆలోచన ఒక క్రమ పద్ధతిలో సాగదు. ఆలోచనల్లోని ఈ క్రమబద్ధతారాహిత్యమే 'మ్యూజింగ్స్' అనే ప్రక్రియను ఆత్మకథ, స్వీయ చరిత్ర లాంటి ప్రక్రియల నుంచి వేరు చేసే మౌలికమైన లక్షణం. తెలుగులో ఆత్మకథల్లాంటి గ్రంథాలు చాలా అరుదుగా వస్తున్నాయి.
దానికి కారణం పాఠకుల నుంచి ఆ ప్రక్రియకు దక్కవలసిన ఆదరణ దక్కకపోవడమే కావొచ్చు. ఒకానొక నిర్దిష్ట కాలానికి సంబంధించిన స్పష్టమైన రాజకీయార్థిక, చారిత్రక అవగాహనను అందించగల ఆత్మకథలు, స్వీయ చరిత్రలకే తగిన ఆదరణ లేని కాలంలో రచనా స్వభావం చేతనే కొంత గజిబిజి గందరగోళానికి తావివ్వగల 'మ్యూజింగ్స్' లాంటి రచనలు రాకపోవటంలో ఆశ్చర్యం లేదు.
తెలుగులో చలం రాసిన 'మ్యూజింగ్స్' ఈ ప్రక్రియలో మొదటి రచన కాబట్టి చలం 'మ్యూజింగ్స్'లో సాధారణంగా తారసపడిన లక్షణాలనే 'మ్యూజింగ్స్' అనే ప్రక్రియకు లక్షణాలుగా చెప్పవచ్చు. పేరుకు తగిన విధంగానే 'మ్యూజింగ్స్' అంటే లోతైన ఆలోచనలో, ప్రశాంత చిత్తంతో మునిగి ఉండటం అని అర్థం. చలం జీవితంలోని ఆలోచనల్లోని లోతును వారి 'మ్యూజింగ్స్' ప్రదర్శిస్తాయి.
తెలుగు లోకంలో చాలా ప్రసిద్ధి పొందిన రచయిత చలం. అలాంటి గొప్ప వ్యక్తి జీవితంలోని విషయాలను తెలిపే పుస్తకం కాబట్టి అప్పట్లో చలం 'మ్యూజింగ్స్' చాలా ప్రసిద్ధి పొందింది. కానీ మిగిలిన వాళ్లు ఎవరూ ఈ ప్రక్రియలో సిద్ధహస్తులున్నట్లు కనిపించదు. ఒకరిద్దరు రాసినా ఎందుకో వారు అంతగా ప్రాచుర్యంలోకి రాలేకపోయారు. దానికి ముందే చెప్పినట్టు ఈ ప్రక్రియలోని సంక్లిష్టతే కారణం కావొచ్చు.
అల్లాడి శ్రీనివాస్ తాను రచించిన 'అచ్చు కాయిదం' అనే పుస్తకానికి శీర్షిక కింద 'అచ్చ తెలంగాణ భాష మ్యూజింగ్స్' అనే ఉపశీర్షిక ఉంచాడు. చలం మ్యూజింగ్స్ వ్యాసాత్మకమైతే అల్లాడి వారి మ్యూజింగ్స్ కవితాత్మకం. చలం మ్యూజింగ్స్ లాగే అల్లాడి వారి 'అచ్చు కాయిదం' ఆత్మాశ్రయ ధోరణిలోనే సాగినప్పటికీ నియమరహితమైన ఆలోచనలను ప్రధానం చేసుకొని సాగేటటువంటి - ఒకరకంగా చెప్పాలంటే మ్యూజింగ్స్ ప్రక్రియకే ప్రాణభూతమైన లక్షణం ఈ రచనలో
కనిపించదు.
అసలు ఈ పుస్తకానికి మ్యూజింగ్స్ అని పేరు పెట్టకపోయినా వచ్చే నష్టమేమీ లేదు. శీర్షిక కింద 'అచ్చ తెలంగాణ కవితలు' అనే ఉపశీర్షిక సరిగ్గా కుదురుతుంది. అల్లాడి వారి ఆలోచన క్రమబద్ధంగా సాగిపోవటం వల్ల - అంటే ఒక సందర్భంలో ఒక విషయం గురించి మాట్లాడుతున్నప్పుడు ఆ కవితలో అదే విషయానికి పరిమితం కావడం అనే లక్షణం ఈ పుస్తకాన్ని మ్యూజింగ్స్ అనే ప్రక్రియ నుంచి దూరం చేస్తున్నది.
కవి తన ముందుమాటలో చెప్పుకున్నట్లు ఇందులోనివి తన 'సిన్నప్పటి ముచ్చట్లు'. ఇవి కేవలం తన సొంత ముచ్చట్లే అనుకుంటే శ్రీనివాస్ ఈ పుస్తకం తెచ్చేవాడు కాదు. ఈ ముచ్చట్ల వెనుక నిలిచిన ఆనాటి సమాజాన్ని ఈనాటి తరానికి పరిచయం చేయాలనే సదుద్దేశమే ఈ రచనకు మూలం. ఆయన బాల్యమంతా పరుచుకున్న అపురూపమైన స్మృతుల తాలూకు ముచ్చట్లున్నాయిందులో.
ఆనాటి కాలపు ముచ్చట్లను ఆనాటి కాలంలో జన వ్యవహారంలో ఉన్న భాషలోనే చెప్పటం ఈ పుస్తకం ప్రత్యేకత. ఇందులోని 109 ముచ్చట్లన్నీ కవిత్వ రూపంలోనే ఉన్నాయి. ఈ కవిత్వ రూపానికి అచ్చ తెలంగాణ భాష ప్రాణం పోసింది. ఒక రకంగా చెప్పాలంటే మొదటి నుంచి తెలంగాణ భాషతో తమ కవిత్వాన్ని సుసంపన్నం చేసుకుంటున్న అన్నవరం దేవేందర్ లాంటి కవుల కవితా మార్గంలో సాగిన రచన ఇది. తెలంగాణ భాషలోని సౌందర్యం ఈ కవితల నిండా పరుచుకొని ఉంది.
తెలంగాణ రాష్ట్రావిర్భావానికి దారి తీసిన మలిదశ ఉద్యమ సందర్భంలో వచ్చిన రచనల్లో ఎక్కువ భాగం తెలంగాణ జీవద్భాషలోనే వెలువడేవి. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఆ భాష ప్రధాన సాహిత్య భాషగా రూపొందవలసి ఉండింది. కానీ ఆ పని జరగలేదు. కనీసం అప్పుడప్పుడైనా పూర్తి తెలంగాణ భాషలో బయటకు వచ్చే రచనల సంఖ్య కూడా తగ్గింది.
ఈ నేపథ్యంలో తెలంగాణ భాష పట్ల రచయితల బాధ్యతను గుర్తుచేసే విధంగా ఆసాంతం అచ్చమైన తెలంగాణ భాషలో నడిచిన 'అచ్చు కాయిదా'నికి తెలంగాణ సాహిత్య చరిత్రలో విశిష్టమైన స్థానం దక్కుతుంది.
ఇందులోని చాలా కవితల శీర్షికలను వాచ్యం చేశాడు కవి. అయినప్పటికీ ఆ శీర్షిక ద్వారా వ్యక్తమైన విషయం పట్ల తనకు గల గాఢమైన ఆత్మీయత వల్ల ఈ కవితలకు చదివించే గుణం అబ్బింది. అన్ని సందర్భాల్లో కవిత్వం మాత్రమే చదివించదని, వస్తువు కూడా దానికదే చదివించే శక్తిని కలిగి ఉంటుందనే సత్యాన్ని రుజువు చేసే సంకలనం ఈ 'అచ్చు కాయిదం'.
అల్లాడి శ్రీనివాస్ గడచిన నాలుగు దశాబ్దాల నాటి తన పల్లె జీవితాన్ని ఈ గ్రంథంలో చిత్రించాడు. కొన్ని ప్రత్యేకతలను మినహాయిస్తే దాదాపు ఆ కాలంలోని తెలంగాణ పల్లెలన్నీ ఒకే రకంగా జీవించేవి. పల్లె పల్లెకు సామాజికార్థిక, రాజకీయ పరిస్థితుల్లో పెద్దగా తేడాలు ఉండేవి కావు.
కవి గారి బాల్యస్మృతులకు వేదికైన ఊరు ఉత్తర తెలంగాణ (భూషణ్ రావుపేట - నేటి జగిత్యాల జిల్లాలోని గ్రామం) లో ఉంది. ఈ క్రమంలో కవిగారు 'అచ్చు కాయిదం'లో చెప్పిన తన సొంతూరి ముచ్చట్లను తెలంగాణ ముచ్చట్లుగా, ఇందులో చిత్రితమైన చరిత్రను తెలంగాణ సామాజిక చరిత్రగా అర్థం చేసుకోవచ్చు.
దీనికి ముందుమాట రాసిన ప్రసిద్ధ విమర్శకులు గుడిపాటి గారు - 'తెలంగాణ సామాజిక చరిత్ర రాయాలనుకునే వారికి ఉపకరించే అంశాలనేకం వీటిలో దాగున్నాయి' అనే మాటను ఈ కోణంలోనే అన్నారు.
నలభై ఏళ్ల కిందటి మనుషులు ఎట్లా ఉండేవారో, వారి కట్టూ బొట్టూ, తిండీ తిప్పలూ, ఇల్లూ వాకిలీ, పరిసరాలూ - అవసరాలూ, పండగలూ పబ్బాలూ, ఆచార వ్యవహారాలూ, తోటి మనుషులతోటి వారి అనుబంధాలూ ఆప్యాయతలూ, ఆనాడు వినియోగంలో ఉండి ఇప్పుడు కనుమరుగైన అపురూపమైన వస్తు సామాగ్రి - ఇలా అనేకం 'అచ్చు కాయిదం'లో అచ్చు గుద్దినట్లు కనిపిస్తాయి.
ఏ కవితావస్తువును తీసుకున్నా దాన్ని ఆత్మీయతతో, ఎంతో దాదాత్మ్యంతో వర్ణిస్తాడు కవి. ఇవి ముచ్చట్లలాంటి కవితలు కాబట్టి ఎదుటివారిని ముందు కూర్చుండబెట్టుకొని తనతో మాట్లాడుతున్నట్లుగా ఉంటుంది ఇందులోని శైలి. దీనినే కవిత్వ సంప్రదాయంలో 'సంభాషణా శైలి' అంటారు.
జ్ఞాపకాల పరంపరను అలా వరుస పెట్టి చెప్పుకుంటూ వెళ్తున్న క్రమంలో ఈ శైలికి సహజంగానే ప్రవాహం లాంటి వేగం వచ్చి చేరింది. ఆ శైలీ, ఈ వేగమూ కలిసి ఈ ముచ్చట్లలో ఒదిగిన కవిత్వాన్ని ఆగకుండా చదివింపజేస్తాయి.
అల్లాడి శ్రీనివాస్ గారి 'మ్యూజింగ్స్'లో ఒక గుర్తించవలసిన ముఖ్య విషయం ఉంది. దీనిలో కవి ఎక్కడా కూడా గతాన్ని కీర్తిస్తూ మాత్రమే కూర్చోలేదు. గతానికీ - వర్తమానానికీ మధ్యగల సంబంధాన్ని స్పష్టంగా గుర్తించాడు. తన వర్తమాన జీవితంలోని ప్రస్తుత ఎదుగుదలకు గల మూలాలు తన గతంలో ఉన్నాయన్న గుర్తింపు ఈ పుస్తకంలో అనేక సందర్భాల్లో కనిపిస్తుంది.
ఆనాడు మా అవ్వ రాల్చిన ఎంటికెలకు
రంగురంగుల బుగ్గలచ్చినయి
గట్లనే....... మా అవ్వ రాల్చిన సెమట చుక్కలకు
ఇయ్యల్ల మాకు రంగురంగుల బతుకు దొరికింది.........
లాంటి వాక్యాలు ఈ విషయాన్ని రుజువు చేస్తాయి.
'అచ్చు కాయిదం'లో 109 కవితలున్నాయి. ఈ 109 కవితల్లో మనిషి బాల్యం తాలూకు సమస్త అనుభవాలను అక్షరబద్ధం చేశాడు కవి. ఈ సంకలనం విశిష్టతను వివరిస్తూ డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి గారు అచ్చ తెలంగాణ భాషలోనే ముందుమాట రాశారు. సంకలనంలో చెప్పిన విషయాల చారిత్రక ప్రాధాన్యాన్ని వివరిస్తూ, సంకలనం విశిష్టతను విడమరిచి చెప్తూ గుడిపాటి గారి 'ముందుమాట' సాగింది.
అయితే అల్లాడి శ్రీనివాస్ గారు తన బాల్యంలోని అనుభవాల పరంపరను పరవశంతో వర్ణించడంలో పడిపోయి కవిత్వం గురించి పెద్దగా పట్టించుకోలేదనిపిస్తుంది. కవిత్వ రూపంలో చెప్పినప్పటికీ ఇందులోనివి ముచ్చట్లు కావడం వల్లా, ముచ్చట్లు చెబుతున్నప్పుడు ఆ చెప్పే వ్యక్తికి సహజంగా కలిగే తన్మయత్వం వల్లా, ఆ ముచ్చట్లలోని జ్ఞాపకాలు ప్రవాహ సదృశంగా తన్నుకు రావటం అనే లక్షణం వల్లా ఇందులోని కవిత్వం కొంచెం తగ్గి ఉంటుంది. మొత్తానికి కొన్ని 'మ్యూజింగ్స్' లక్షణాలను, కొన్ని వచన కవిత్వ లక్షణాలను కలగలిపి సృష్టించిన అరుదైన సంకలనంగా అల్లాడి వారి 'అచ్చు కాయిదం' నిలుస్తుంది.
***
📢 మనతెలుగుకథలు.కామ్ WhatsApp ఛానల్‌ను ఉచితంగా ఫాలో అవ్వండి!
మనతెలుగుకథలు.కామ్‌లో ప్రచురించే కథలు • కవితలు • ప్రత్యేక వ్యాసాలు • సీరియల్ ఎపిసోడ్స్ - వాటి తాజా లింక్స్‌ను మా WhatsApp ఛానల్లో పొందవచ్చు.
✅ ఛానల్‌ను Follow చేయండి✅ WhatsAppలో Updates → Channels ద్వారా మా పోస్టులు చూడండి✅ మీకు నచ్చిన కథ లేదా పోస్టు లింక్‌పై క్లిక్ చేసి చదవండి✅ కొత్త పోస్టులు మిస్ కాకుండా Notifications 🔔 ON చేసుకోండి✅ మీ స్నేహితులు, సన్నిహితులతో మా ఛానల్‌ను Share చేయండి
👉 మా WhatsApp ఛానల్: https://whatsapp.com/channel/0029VbE7RFB3mFY84MHHSb3y
తోకల రాజేశం గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం: నా పేరు తోకల రాజేశం.
తోకల రాజేశం మంచిర్యాల జిల్లాలోని నెన్నెల మండలం ఆవడం గ్రామానికి చెందిన వారు. ప్రస్తుతం ప్రభుత్వ ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నారు.9 వ తరగతి చదువుతున్నపటి నుంచే పద్యాలు రాస్తున్నారు.వీరి ఊరు ఆవడంలో చదివే పిల్లలు 20 మందితో శతకాలు రాయించారు.ఇప్పటివరకు వీరు తెలుగు బాల శతకం(2006),చెమట చుక్కలు(నానీలు-2010),పాతాళ గరిగె(సాహిత్య వ్యాసాలు-2013),అడవి దీపాలు(వచన కవిత్వం-2017),మంచిర్యాల జిల్లా సాహిత్య చరిత్ర(తెలంగాణ సాహిత్య అకాడెమీ ప్రచురణ-2020),కొబ్బరి నీరా! శతకం(పదిమందితో కలిసి-2023),మట్టి విజయం(పద్యకవిత్వం-2024),ఆట సాగుతూనే ఉంటది(వచన కవిత్వం-2026)అనే పుస్తకాలు ముద్రించారు.తెలుగులో వెలువడుతున్న ప్రసిద్ధ దిన, వార, మాస పత్రికలన్నింటిలోనూ రాజేశం రాసిన కవితలు, వ్యాసాలూ వచ్చాయి. తెలుగునాట ప్రతిష్టాత్మక ఎక్స్ రే ప్రధాన పురస్కారం(2012),సహస్ర వసంతాల పద్య పురస్కారం(2012),సాహితీ శిరోమణి పురస్కారం(2015),సినారె పురస్కారం(2023),తో పాటు రాష్ట్రస్థాయిలో పలు పురస్కారాలు అందుకున్నారు. ప్రస్తుతం తెలంగాణ రచయితల వేదికకు మంచిర్యాల జిల్లా అధ్యక్షునిగా ఉన్నారు.







Comments