ఆత్మజ్ఞానమే మోక్షమార్గం
Aathmagnaname Mokshamargam - Telugu Spiritual Article | R C Kumar
ఆత్మజ్ఞానమే మోక్షమార్గం - తెలుగు ఆధ్యాత్మిక వ్యాసం | ఆర్ సి కుమార్
Published In manatelugukathalu.com On 21/10/2026
ఆత్మజ్ఞానం అంటే ఏమిటి? ఆత్మవిద్య, బ్రహ్మవిద్య, రాజవిద్యల ద్వారా మనిషి మోక్షమార్గాన్ని ఎలా తెలుసుకోవచ్చు? ధ్యానం, వైరాగ్యం, నిరంతర అభ్యాసంతో ఆత్మసాక్షాత్కారం వైపు సాగే ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ఈ వ్యాసంలో తెలుసుకుందాం.
ఆధ్యాత్మిక మార్గంలో ఆత్మవిద్య, బ్రహ్మవిద్య, రాజవిద్య అనే పదాలు తరచుగా వినిపిస్తాయి. ఇవన్నీ మోక్షమార్గానికి, పరమ సత్యాన్ని తెలుసుకోవడానికి సంబంధించినవే అయినప్పటికీ వాటి మధ్య చిన్నపాటి తేడాలు ఉన్నాయి. అర్థం చేసుకోవడంలో, చూసే దృక్పథంలో మరియు చేసే సాధనలో వ్యత్యాసాలు ఉన్నాయి.
ఆత్మవిద్య అంటే తనను తాను తెలుసుకోవడమే. ‘‘నేను ఎవరు?’’ (కోహమ్) అని ప్రశ్నించుకుని, ఈ దేహం, మనస్సు, బుద్ధి నేను కాదు, నేను కేవలం 'ఆత్మను' అని తెలుసుకోవడం. దాన్నే ఆత్మజ్ఞానం అని కూడా అంటారు.
సృష్టి అంతటా నిండి ఉన్న అనంతమైన పరబ్రహ్మ తత్వాన్ని గురించిన జ్ఞానమే బ్రహ్మవిద్య. నాలో ఉన్నదే విశ్వమంతా ఉంది అనే భావన కలగడం. అదే అద్వైత సిద్ధాంతం.
ఇక రాజవిద్య ఆచరణాత్మకమైనది. అడవులకు వెళ్లి కఠోర తపస్సులు చేసే అవసరం లేకుండా, సంసారంలో ఉంటూనే భక్తి, నిష్కామ కర్మల ద్వారా భగవంతుడిని చేరుకునే మార్గం. దీని గురించిన పూర్తి వివరణ భగవద్గీతలోని రాజవిద్యా రాజగుహ్య యోగంలో కృష్ణ పరమాత్మ చెప్పడం జరిగింది.
కోహమ్ (కః + అహమ్) అంటే ‘‘నేను ఎవరు?’’ ఈ శరీరమా? ఈ మనస్సా? లేక నాలోని ప్రాణమా? సోహమ్ అంటే (సః + అహమ్) ‘‘నేనే ఆ పరమాత్మను’’ / ‘‘ఆయనే నేను’’ అనే జ్ఞానం కలగడం. కోహమ్ నుంచి సోహమ్ కు చేసే ప్రయాణమే ఆత్మజ్ఞాన సాధన.
మోక్షం కావాలని అందరం కోరుకుంటాం. ఆత్మజ్ఞానమే మోక్షమార్గం కదా! అసలు ఆత్మజ్ఞానం అంటే ఏమిటి? అదేమీ అంతు పట్టని బ్రహ్మ పదార్థమైతే కాదు. దాన్ని పఠణం, శ్రవణం ద్వారా తెలుసుకుంటే సరిపోతుందా అంటే అది ప్రాథమిక దశ మాత్రమే. సాధన ద్వారా అనుభవపూర్వకంగా తెలుసుకోవడమే సరైన జ్ఞానం.
ఆత్మజ్ఞానం గురించి తెలుసుకోవాలి అనుకుంటే ముందుగా జ్ఞానం అంటే ఏమిటి, విజ్ఞానం అంటే ఏమిటో తెలుసుకోవాలి.
ఒక వ్యక్తికి తేనె గురించి ఎటువంటి అవగాహన లేకున్నా, సీసాలో ఉన్న తేనె యొక్క తియ్యదనం గురించి గొప్పగా చదువుతూ, వింటూ ఉండవచ్చు. అది పుస్తకపరమైన లేదా సిద్ధాంతపరమైన జ్ఞానంగానే మిగిలిపోతుంది. '
కానీ, ఆ తేనె బాటిల్ మూత తీసి దాంట్లో ఉన్న తేనె అనే పదార్థాన్ని నాలుకపై పెట్టి రుచి చూస్తే, దాని తియ్యదనం యొక్క స్వానుభవమైన జ్ఞానం వస్తుంది. రుచి చూడటం వల్ల ఆ పదార్థం పట్ల కలిగిన వివేకమే విజ్ఞానం.
తేలిగ్గా చెప్పాలంటే ఒక వస్తువు ఏదో తెలుసుకోవాలి అనుకోవడం జ్ఞానం. ఆ వస్తువు ఏ విధంగా ఉపయోగపడగలదో తెలుసుకోవడం విజ్ఞానం. నేను శరీరం కాదు, ఆత్మని అని తెలుసుకోవడం ఆత్మజ్ఞానం.
మొదటిది ఇచ్చాశక్తి, రెండవది జ్ఞానశక్తి, మూడవది క్రియాశక్తి. ప్రతి మనిషిని పుట్టించేటప్పుడే భగవంతుడు ఈ మూడు శక్తులను నిగూఢంగా పెట్టి పంపిస్తాడు. వాటిని గుర్తించి, బయటికి తీసి సక్రమంగా ఉపయోగించుకోవడం మన వంతు.
చెయ్యి పైకెత్తమని ఎవరికైనా చెప్పి, పైకెత్తబడిన ఆ చెయ్యి ఎవరిది అని అడిగితే అది నాది అంటారు. తన శరీరంలో ఏ అవయవాన్ని చూపించి అడిగినా అది నాదే అంటారు. తన లోపల ఉన్న ఆత్మ ఎవరిది అని అడిగితే అది కూడా నాదే అంటారు.
అంతేకానీ ఆత్మని, శరీరాన్ని వేరుగా చూడడం లేదు. లోపల ఉన్న ఆత్మ మాత్రమే నాది, పంచభూతాత్మకమైన ఈ శరీరం తాత్కాలికంగా అరువు తెచ్చుకున్నది అనే సత్యాన్ని గ్రహించడం లేదు.
రమణ మహర్షి ఏమంటారంటే— ఒక్కసారి నువ్వు నీ శరీరం నుండి బయటికి రా. పక్కకు తప్పుకొని, శరీర తత్వాన్ని, దాని ఉనికిని గమనించు. అప్పుడు నువ్వు వేరు, నీ శరీరం వేరు అనే విషయాన్ని తెలుసుకుంటావు.
ఏ దారిలో వచ్చామో ఆ దారిలోనే తిరిగి వెళ్ళాలి అనే స్పృహ కలగడమే ఆత్మజ్ఞానంలో మొదటి మెట్టు.
ఉదాహరణకి కిటికీ పక్కనే ఉన్న చిన్న రంధ్రం ద్వారా ఇంట్లోకి ప్రవేశించిన కందిరీగ తిరిగి బయటికి వెళ్లలేక కిటికీ తెరపై పైకి కిందికి తిరుగుతూ ప్రయాస పడుతూ ఉంటుంది.
అది కిటికీ పక్కనే ఉన్న రంధ్రంలోంచి లోపలికి వచ్చిన విషయాన్ని మరిచిపోయి, అక్కడక్కడే తిరుగుతుంటుంది. జీవాత్మ కూడా అంతే. ఏ దారిలో వచ్చిందో ఆ దారిలోనే తిరిగి వెళ్ళాలి అని ఆలోచన రాదు.
మరింత సులభంగా చెప్పాలంటే, మనల్ని మనం తెలుసుకునే జ్ఞానమే ఆత్మజ్ఞానం. నేను ఎవరు, ఎక్కడి నుంచి వచ్చాను, ఎక్కడికి వెళ్తాను అని ప్రశ్నించుకుంటే వచ్చే జవాబులతో తొలి దశ ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత సాధనలో పైపైకి వెళ్తూ అంతర్ముఖంగా పయనించి ఆత్మ స్వభావాన్ని, దాని సామర్థ్యాన్ని గుర్తించాలి.
మన శరీరం ప్రకృతి పురుషుల సంగమంతో పంచభూతాల ఆధారంగా తల్లి గర్భంలో పిండంగా ఏర్పడుతుంది. శరీరం కోసం ఎదురుచూస్తున్న జీవాత్మ వెంటనే ఆ పిండంలోకి ప్రవేశిస్తుంది. ఒక శరీరాన్ని ధరించిన జీవాత్మ కొంతకాలం తర్వాత ఆ శరీరం శిథిలావస్థకు చేరగానే మరో శరీరాన్ని వెతుక్కుంటూ వెళ్ళిపోతుంది.
ఈ స్పృహ కలిగితే మమకారాసక్తులు తగ్గి నిర్మోహత్వం కలుగుతుంది. దాంతో నిస్సంగత్వం, నిశ్చలతత్వం ఏర్పడతాయి. నిశ్చలంగా, ఏకాగ్రతతో ఉన్నప్పుడు ఒక వ్యక్తి తనలో చైతన్యంగా ఉన్న ఆత్మను వీక్షించగలడని బృహదారణ్యక ఉపనిషత్తు చెబుతోంది.
ఆత్మజ్ఞానం కలిగితే ఆత్మసాక్షాత్కారం కలుగుతుంది.
ఆత్మసాక్షాత్కారం అంటే, మన అంతర్గత స్వరూపాన్ని (ఆత్మను) అనుభవపూర్వకంగా తెలుసుకోవడం. ఆత్మసాక్షాత్కారం కలిగితే భగవత్సాక్షాత్కారం కలిగినట్టే.
ఈ స్థితికి రావాలంటే వస్తు విషయాలపై ఆలోచనలను, భావోద్వేగాలను అధిగమించి మనలో ఉన్న నిత్యమైన, సత్యమైన, ఆత్మ స్వభావం వైపుకు దృష్టి సారించాలి.
తనది కాని వస్తువులను దొంగలించే ప్రయత్నం చేస్తాడు దొంగ. దొంగిలించబడిన వస్తువులతో తన శరీరాన్ని సుఖపెడుతూ ఆనందించవచ్చు అనుకుంటాడు.
అజ్ఞాని మనస్తత్వం కూడా అలాంటిదే. తనది కాని శరీరాన్ని సుఖపెడుతూ తాత్కాలిక ఆనందం కోసం అందమైన దుస్తులు, అలంకరణలు, భోగభాగ్యాలను అనుభవించే అన్ని రకాల ప్రయత్నాలు చేస్తుంటాడు. తనదైన ఆత్మలో రమిస్తూ శాశ్వత సుఖాన్ని పొందే ప్రయత్నం మాత్రం చేయడు.
ఆత్మను పరమాత్మతో అనుసంధానం చేసి, చైతన్య స్వరూపుడైన భగవంతునితో ఏకం కావడమే మన అంతిమ లక్ష్యం. నేను ఈ శరీరం కాదని, నిత్య, శుద్ధ, బుద్ధ, ముక్త ఆత్మ అని గ్రహించాలి. ఆ ఆత్మ ఒక పవిత్రమైన దైవిక ప్రాంతం అనే అవగాహన రావాలి.
ఆత్మలోనే పరమాత్మను దర్శించగలిగితే భగవత్సాక్షాత్కారం కలిగినట్టే. నిరాకార నిర్గుణ బ్రహ్మ ఎక్కడో లేడు, మనలోనే ఉన్నాడు.
అయితే ఆత్మసాక్షాత్కారం అనేది ఒక ప్రక్రియలా కొనసాగే సుదీర్ఘ ప్రయాణం. ఇది ఒక్క రోజులో, నెలలో సంభవించేది కాదు. 'అభ్యాసేన తు కౌంతేయ' అని కృష్ణ పరమాత్మ అన్నట్టు నిరంతర ప్రయత్నం, అభ్యాసంతోనే అది సాధ్యపడుతుంది.
అభ్యాసం లేకుండా ఉన్నఫళంగా ఏదో సాధించేయాలని ప్రయత్నిస్తే ఏం జరుగుతుందో ఒక కోతి కథలో తెలుసుకుందాం.
ఒక రోజు చెట్టు మీద కూర్చున్న ఒక కోతి, చెట్టు కింద ప్రవచనం చేస్తున్న స్వామీజీ ఉపన్యాసం విన్నది. ఆ రోజు స్వామీజీ తన ఉపన్యాసంలో ఉపవాసం ప్రాముఖ్యతను చాలా చక్కగా వివరించారు.
అది వినేసరికి తను కూడా ఉపవాసం చేయాలనుకున్న కోతి ఒక ఏకాదశి పర్వదినాన్ని ఎంచుకుంది. ఆ రోజు ఉపవాసం చేస్తూ ధ్యానంలో ఉండాలి కాబట్టి దానికి తగిన ఏర్పాట్లు చేసుకుంది.
ఉపవాసం చేసిన తర్వాత నీరసంతో జబ్బు పడతానేమో అనుకొని ముందుగానే అరటిపళ్లను తెచ్చిపెట్టుకొని గదిలో ఓ మూల ఉంచింది. ఉపవాస దీక్ష విరమించగానే వాటిని తిందామని దాని ఉద్దేశం. ఇక ఒక ఈతచాప పరుచుకొని కళ్ళు మూసుకొని ధ్యానంలో కూర్చుంది.
ఎంత ప్రయత్నించినా దానికి ధ్యానం మీద మనసు లగ్నం కావడం లేదు. రకరకాల ఆలోచనలు వస్తున్నాయి... "నేను ఉపవాసంతో ధ్యానంలో ఉన్నప్పుడు అక్కడ ఉన్న అరటిపళ్లను ఎవరైనా కాజేస్తే ఎలా?" ఆ ఆలోచన రాగానే ధ్యానం నుంచి లేచి అరటిపళ్లను కాస్త దగ్గరలో పెట్టుకుని మళ్లీ ధ్యానంలో కూర్చుంది.
కానీ ధ్యానంపై మనసు నిలవడం లేదు. కాసేపయ్యాక ఇంకో ఆలోచన వచ్చింది. "ధ్యానం పూర్తి చేశాక నీరసపడి కదలలేకపోతే ఆ పండ్లు ఎలా తినగలను?" అనుకొని ఆ పళ్లను తనకు చేతితో అందుకునేంత దగ్గరకు లాగి పెట్టుకుంది. మళ్లీ ధ్యానంలో కూర్చుంది.
మరొక ఆలోచన — "నేను ఉపవాసం చేసి అలసిపోయి పండ్లు కూడా అందుకొని తినలేని పరిస్థితి వస్తే? నీరసంలో సొమ్మసిల్లి పడిపోతే ఇంకేమైనా ఉందా?" అనుకుంటూ, "ఉపవాస దీక్ష విరమించగానే వెంటనే తినడానికి ఈ పళ్లను నా బుగ్గన పెట్టుకుంటాను కానీ తినను" అనుకొని పండ్లను తన బుగ్గన పెట్టుకొని మళ్లీ ధ్యానంలో కూర్చుంది.
అయినా ధ్యానం మీద మనసు లగ్నం కావడం లేదు. బుగ్గలో పెట్టుకున్న పండ్ల తీపి నోట్లో ఊరుతుండడంతో రుచి తగిలింది. "సరేలే… ఈ పండ్లు నాకోసం తెచ్చుకున్నవే, ఎప్పటికైనా నేనే తినాలి కదా" అనుకుంటూ బుగ్గన పెట్టుకున్న పండ్లను తినేసింది.
అవి చాలక, పక్కనున్న పండ్లు కూడా పూర్తిగా తినేసి భుక్తాయాసంతో ఆవలింతలు వచ్చేసరికి చాప మీద పడుకొని నిద్రపోయింది. ఈ విధంగా కోతి తన ఉపవాస దీక్షను గురకలు పెట్టి నిద్రపోతూ దివ్యంగా పూర్తి చేసింది.
ఉపవాసం చేయడం అంటే సామాన్యం కాదు. మహిళలు పట్టుదలతో చేస్తారు కానీ అందరూ చేయలేకపోవచ్చు. కోతి లాగే మనుషుల మనస్తత్వం చంచలంగా ఉంటుందని చెప్పడానికి సరిగ్గా సరిపోయే కథ ఇది.
మన జీవనశైలిని నియంత్రించుకొని ఆహార నియమాలు పాటిస్తూ ధ్యానం మరియు ప్రాణాయామం వంటి పద్ధతులు పాటిస్తే అంతఃశుద్ధికి మార్గం సుగమం అవుతుంది.
'మనో దుర్నిగ్రహం చలమ్' — చంచలమైన మనసును నిగ్రహించడం కష్టసాధ్యమే కానీ అసాధ్యం కాదని, దాన్ని అదుపులోకి తెచ్చుకుని పరమాత్మ వైపు నడిపించడానికి వైరాగ్యం, అభ్యాసం అనేవి రెండు రెక్కల లాంటివి అనేది కృష్ణ భగవానుడి బోధన.
కృష్ణార్పణమస్తు! 🙏
***
📢 మనతెలుగుకథలు.కామ్ WhatsApp ఛానల్‌ను ఉచితంగా ఫాలో అవ్వండి!
మనతెలుగుకథలు.కామ్‌లో ప్రచురించే కథలు • కవితలు • ప్రత్యేక వ్యాసాలు • సీరియల్ ఎపిసోడ్స్ - వాటి తాజా లింక్స్‌ను మా WhatsApp ఛానల్లో పొందవచ్చు.
✅ ఛానల్‌ను Follow చేయండి✅ WhatsAppలో Updates → Channels ద్వారా మా పోస్టులు చూడండి✅ మీకు నచ్చిన కథ లేదా పోస్టు లింక్‌పై క్లిక్ చేసి చదవండి✅ కొత్త పోస్టులు మిస్ కాకుండా Notifications 🔔 ON చేసుకోండి✅ మీ స్నేహితులు, సన్నిహితులతో మా ఛానల్‌ను Share చేయండి
👉 మా WhatsApp ఛానల్: https://whatsapp.com/channel/0029VbE7RFB3mFY84MHHSb3y
ఆర్ సి కుమార్ గారి కొన్ని ఇతర రచనలు:
ఆర్ సి కుమార్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:
నమస్తే
ఆర్.సి. కుమార్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ లో వివిధ హోదాల్లో అత్యుత్తమ సేవలు అందించి అనేక అవార్డులు రివార్డులు పొందారు. అసిస్టెంట్ జనరల్ మేనేజర్ గా పదవీ విరమణ చేసిన పిదప సంస్థకు చెందిన పూర్వ ఉద్యోగులతో వెటరన్స్ గిల్డ్ అనే సంస్థను స్థాపించి అనేక సామాజిక, సాంస్కృతిక, సంక్షేమ కార్యక్రమాలకు పునాది వేశారు.
పదవి విరమణ తర్వాత గత పది సంవత్సరాలుగా వివిధ హోదాల్లో తన ప్రవృత్తికి ఊతమిచ్చే సామాజిక సేవా కార్యకలాపాలు కొనసాగిస్తూనే ఉన్నారు. అమీర్ పేట, సనత్ నగర్ ప్రాంతాలలో గల కాలనీల సంక్షేమ సంఘాలతో కూడిన సమాఖ్యను 'ఫ్రాబ్స్' (FRABSS, ఫెడరేషన్ అఫ్ రెసిడెంట్స్ అసోసియేషన్స్ ఆఫ్ బల్కంపేట్, సంజీవరెడ్డి నగర్, సనత్ నగర్) అనే పేరుతో ఏర్పాటు చేసి అచిరకాలంలోనే స్థానికంగా దానినొక ప్రఖ్యాత సంస్థగా తీర్చిదిద్దారు. సుమారు ఐదు సంవత్సరాల పాటు ఆ సంస్థ తరఫున అధ్యక్ష హోదాలో అనేక కార్యక్రమాలు చేపట్టి ప్రముఖ సామాజిక వేత్తగా పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్నారు.
రాయల సేవా సమితి అనే మరొక స్వచ్ఛంద సంస్థను స్థాపించి పర్యావరణ పరిరక్షణ, ప్లాస్టిక్ రహిత సమాజం పై అవగాహన కార్యక్రమాలు కొనసాగిస్తూ, బీద సాదలకు అన్నదానాలు, ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు పుస్తకాలు, స్కాలర్షిప్ లు అందించడం, మొక్కలు నాటించడం వంటి సేవా కార్యక్రమాలు ప్రతి నెలా చేస్తుంటారు. బస్తీలు, కాలనీల లో సమాజ సేవా కార్యక్రమాలతో పాటు పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నివారణ, జల సంరక్షణ వంటి అనేక సామాజిక అంశాలపై ప్రజల్లో అవగాహన తెచ్చే విధంగా పాటుపడ్డారు. స్థానిక ఎమ్మెల్యే, మాజీ మంత్రివర్యులు శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు వీరి సేవలను కొనియాడుతూ ప్రశంసా పత్రాన్ని సైతం అందజేశారు.
కథలు కవితలు రాయడం వారికి ఇష్టమైన హాబీ. స్వతంత్ర పాత్రికేయుడిగా వీరి రచనలు తరచుగా మాస పత్రికలు, దినసరి వార్తా పత్రికల్లోని ఎడిటోరియల్ పేజీల్లో ప్రచురింపబడుతుంటాయి. వక్తగా, వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ అనేక కార్యక్రమాల నిర్వహణ బాధ్యతను కొనసాగించడమే కాక ఆధ్యాత్మిక ఉపన్యాసాలు, సత్సంగ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు.
వందనం, ఆర్ సి కుమార్
(కలం పేరు - రాకుమార్, పూర్తి పేరు - ఆర్. శ్రీరామచంద్రకుమార్)
సామాజికవేత్త
war impact economy, oil crisis Telugu, inflation Telugu, global economy war, Iran Israel war impact, petrol price increase, economic crisis Telugu, Yuddha Prabhavam Arthika Samkshobham, యుద్ధ ప్రభావం ఆర్థిక సంక్షోభం, R C Kumar, ఆర్ సి కుమార్ |











Comments