వ్యర్థం కాని వృద్ధాప్యం
#RCKumar #శ్రీరామచంద్రకుమార్, #వ్యర్థంకానివృద్ధాప్యం, #TeluguArticle
Vyartham Kani vruddhapyam - New Telugu Article Written By R C Kumar Published In manatelugukathalu.com On 02/03/2026
వ్యర్థం కాని వృద్ధాప్యం - తెలుగు వ్యాసం
రచన: ఆర్ సి కుమార్
వృద్ధాప్యం అనేది సహజమైన, నిశ్చితమైన జీవశాస్త్ర ప్రక్రియ (Natural biological process). మన దేహంలో ఉండే జీవాత్మ వరుసగా బాల్యం, కౌమారం, యవ్వనం, వృద్ధాప్యం అనే దశలను దాటుకొని వెళుతుంది. వృద్ధాప్యం అనే పదం సంస్కృతంలోనిది. దీనినే తెలుగులో మలి వయసు అని కూడా అంటారు. ప్రపంచ సగటు ఆయుర్దాయం సుమారు 73 సంవత్సరాలుగా, మహిళల విషయంలో దాన్ని 78 సంవత్సరాలుగా అంచనా వేశారు. నిజానికి 60 దాటిన వారంతా అదృష్టవంతులే ఎందుకంటే 100 మందిలో 11 మంది మాత్రమే 60 సంవత్సరాల వయస్సుకు చేరుకుంటారు; 70 దాటినవారు ఏడుగురు; మరియు 80కి చేరుకునేవారు నూటికి ఇద్దరు మాత్రమే అని సర్వేలు చెబుతున్నాయి. ఎనభై సంవత్సరాలకు చేరినవారు జీవిత శిఖరాన్ని అధిరోహించినవారే. ఈ వయసులో గత స్మృతులను ఆస్వాదిస్తూ, కలల్ని తీరుస్తూ సంతోషంగా జీవించవచ్చు. ఆ విధంగా బోనస్ పీరియడ్ లో కూడా సంతోషంగా, చురుగ్గా, ఉల్లాసంగా జీవితాన్ని గడిపేవారు మరింత ఉత్సాహంగా ముందుకెళుతూ సెంచరీ దిశగా సాగిపోతారు. జీవన యాత్రలో వృద్ధాప్యం ఒక మజిలీ. ఇది సహజమైన ప్రక్రియ, జన్యువుల ద్వారా సంక్రమించే వృద్ధాప్య సమస్యల నియంత్రణ మన పరిధిలో లేకపోవచ్చు. సమతులాహారం తీసుకుంటూ కొద్దిపాటి వ్యాయామం చేస్తూ ఒత్తిడికి లోను కాకుండా ప్రశాంతమైన జీవితం గడిపితే శారీరక, మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. మెట్లు దిగేటప్పుడు మరియు బాత్‌రూమ్ వంటి తేమ ప్రాంతాల్లో జారి పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. చిన్న దెబ్బలకు కూడా ఎముకలకు హాని కలగవచ్చు. దీర్ఘకాలిక చికిత్సతో మంచాన పడితే ఇతరుల మీద ఆధారపడవలసి వస్తుంది. అలాంటి పరిస్థితి తెచ్చుకోకుండా వృద్ధాప్యంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. రోజుకు కనీసం 8 గంటలైనా కంటి నిండా నిద్రపోవాలి. డీహైడ్రేషన్, మలబద్ధకం వంటి సమస్యలు రాకుండా ఉండడానికి తగినంత నీరు తాగాలి. పనిలేకుండా కూర్చోవడం మరియు చురుగ్గా ఉండకపోవడం అనారోగ్యానికి ఆహ్వానం. ఇటువంటివారు రోగనిరోధక శక్తిని త్వరితగతిన కోల్పోతారు. నలుగురిలో కలవకుండా ఒంటరి జీవితాన్ని గడిపేవారు చేజేతులా ఆరోగ్యాన్ని పాడు చేసుకున్నట్లే. కొందరు 50 ఏళ్లు దాటినప్పటి నుంచి ముసలితనానికి దగ్గర పడుతున్నామని నిరాశ నిస్పృహలతో భావోద్వేగానికి లోనవుతుంటారు. కానీ 50 ఏళ్లు దాటిన తరువాత కూడా ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించడం ద్వారా ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉండవచ్చు. వృద్ధాప్యానికి ఇదమిత్తమైన వయోపరిమితి, గడువు తేదీ అంటూ లేదు. నాకు ముసలితనం వచ్చేసింది అనే భావనతో మానసిక వృద్ధాప్యాన్ని దరికి చేరదీయకూడదు. 'ఎలా ఉన్నారు' అని ఎవరైనా అడిగితే 'ఏదో బండి నడిపిస్తున్నా, కృష్ణా, రామా అనుకుంటూ ఆ పిలుపు కోసం ఎదురుచూస్తున్నాను' వంటి మాటలు అనకూడదు. దేవుడి దయవల్ల ఇతరుల మీద ఆధారపడకుండా ప్రశాంతంగా, గౌరవంగా బతుకుతున్నాను అని చెప్పగలగాలి. వయసు మీరినప్పుడు శరీరం కొన్ని సంకేతాలు ఇస్తుంది. అవయవాల కార్యకలాపాలు నెమ్మదిగా తగ్గుతాయి. శ్వాస మారుతుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన వ్యాధి సంక్రమించవచ్చు. మనం దాన్ని శోధించి, విశ్లేషించుకోవలసిన అవసరం లేదు; వైద్యులు దీన్ని గుర్తిస్తారు, చికిత్స చేస్తారు. సరైన చికిత్స పొందిన తర్వాత కూడా చికిత్స విధానం, వాడిన మందుల తీవ్రత ద్వారా శరీరంపై వాటి ప్రభావం కొంతకాలం వరకు ఉంటుంది. ఆపరేషన్ తర్వాత శరీరంలో వచ్చే మార్పులు, ఒత్తిడి వలన చాలా మందిలో విచారం, నిరాశ, మరియు అలసట వంటి లక్షణాలు కనిపిస్తాయి. దీన్నే పోస్ట్-ఆపరేటివ్ డెలిరియం అంటారు. కుటుంబ సభ్యుల సహకారంతో ఇటువంటి భయాందోళనలను అధిగమించి, వైద్యుల సలహాలు పాటిస్తూ, సానుకూల వైఖరితో సవాళ్లను అధిగమించాలి. గతం గురించి పశ్చాత్తాపపడకూడదు, భవిష్యత్తు మీద గొప్పగా ఆశలు పెంచుకోవద్దు. ఈ రోజు పట్ల మక్కువ పెంచుకోవాలి. ప్రతి రోజును ఆనందంగా ఆస్వాదించాలి. ఇప్పటికీ నడవడం, తినగలగడం కొనసాగితే, అందమైన ప్రదేశాలు తిరుగుతూ, ఇష్టమైన వంటకాలు తింటూ కలలుగా మిగిలిపోయిన పనులు పూర్తి చేసుకోవచ్చు. ఆ విధంగా జీవితం వృథా కాకుండా, తుది శ్వాస వరకూ ఆనందించాలి. ఉదాహరణకు, 75 సంవత్సరాల వ్యక్తిని 'మీ వయసు ఎంత' అని ఎవరైనా అడిగితే, 'ఆ! నాకెంత 75 మాత్రమే!' అంటూ చిరునవ్వుతో చెప్పండి. 'అసలు 75 వచ్చినట్టుగా నాకు అనిపించడం లేదు' అనాలి. ఎందుకంటే ముసలితనం అనే భావనపై సుభాషితాలలో ఉన్న ఒక శ్లోకం ఏం చెబుతుందో చూడండి. "వార్ధక్యం వయసా నాస్తి మనసా నైవ తద్భవేత్ | సంతతోద్యమ శీలస్య నాస్తి వార్ధక్య పీడనమ్ ||" ముసలితనం వయసులో లేదు. మనసులోనూ ఉండకూడదు. ఎప్పుడూ ఏదో ఒక పనిలో నిమగ్నమై ఉండేవారికి ముసలితనపు పీడ ఉండదని దాని భావం. జీవితంలో ఎత్తుపల్లాలు చూసి, ఎన్నో సవాళ్లను ఎదుర్కొని, పిల్లల్ని పెంచి వృద్ధిలోకి తెచ్చి, ఎవరి మీదా ఆధారపడకుండా బాదరబందీ లేని జీవితం గడుపుతున్న వయోధికులు కూడా కొన్ని సందర్భాల్లో ఒత్తిడికి గురి అవుతూ ఉంటారు. విశ్రాంత జీవితం గడుపుతున్న వారందరికీ 365 రోజులు సెలవులే. ఏం చేయదలుచుకుంటే అది చేయవచ్చు. సరదాగా బయటికి వెళ్లండి, బంధువులను, స్నేహితులను కలవండి, ఇష్టమైన పాటలు వినండి, సినిమాలు చూడండి, యాత్రలు చేయండి. అల్జీమర్స్ వంటి వాటికి లోను కాకుండా పజిల్స్, క్రాస్‌వర్డ్స్, సుడోకు వంటి మెదడు ఆటలు ఆడాలి. స్నేహితులు, కుటుంబ సభ్యులతో నిరంతరం కనెక్ట్ అయి ఉండి సంభాషించాలి. పలకరింపులే పరమ ఔషధాలు. సీనియర్ సిటిజన్లకు, సంభాషణల్లో పాల్గొనడం కేవలం ఒక సోషల్ యాక్టివిటీ మాత్రమే కాదు, మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి అది శాస్త్రీయంగా ఉపయోగపడే ఒక మార్గం. సీనియర్ సిటిజన్లు మాట్లాడటం అంటే కేవలం మాటలు పంచుకోవడం మాత్రమే కాదు, మెరుగైన ఆరోగ్యానికి అది జీవనాడిగా పనిచేస్తుంది. గతంలో జరిగిన తీపి జ్ఞాపకాలను గుర్తుచేసుకోవడం, వర్తమానంలో రాజకీయాలు, ఇతర సామాజిక వార్తల గురించి చర్చించడం లేదా భవిష్యత్తు కోసం ప్రణాళికలు వేయడం వంటి ప్రతి సంభాషణ మానసిక ఆరోగ్యం దిశగా అడుగుపడుతుంది. మనం భోగభాగ్యాలతో తులతూగుతూ గొప్పగా జీవించి ఉండకపోవచ్చు కానీ సుఖ సంతోషాలతో ఓలలాడుతూ ప్రశాంతంగా జీవించాను అన్న తృప్తి మిగిలితే చాలు. భగవంతుడు ప్రసాదించిన ఆయుర్దాయాన్ని సక్రమంగా వినియోగించుకుంటూ నలుగురిలో మంచి పేరు తెచ్చుకుంటే అంతకుమించి కావలసింది ఏముంది. అంత్యకాలంలో భగవంతుడిని మూడంటే మూడు వరాలు కోరుకుంటే చాలు. "అనాయాసేన మరణం వినా దైన్యేన జీవనం | దేహాంతే తవ సాన్నిధ్యం దేహిమే పరమేశ్వర! ||" ఎటువంటి బాధలు లేని మరణం; ఒకరిపై దయనీయ స్థితిలో ఆధారపడకుండా జీవనం; అంత్యకాలంలో నీ సన్నిధికి చేరుకోవడం... అనే మూడు వరాలు ప్రసాదించు పరమేశ్వరా. "వృద్ధాప్యం అనేది ఓడిపోయిన యవ్వనం కాదు, అది గెలిచిన జీవితానికి నిదర్శనం." స్వస్తి సర్వేజనా సుఖినోభవంతు ఆర్ సి కుమార్ |
ఆర్ సి కుమార్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:
నమస్తే
ఆర్.సి. కుమార్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ లో వివిధ హోదాల్లో అత్యుత్తమ సేవలు అందించి అనేక అవార్డులు రివార్డులు పొందారు. అసిస్టెంట్ జనరల్ మేనేజర్ గా పదవీ విరమణ చేసిన పిదప సంస్థకు చెందిన పూర్వ ఉద్యోగులతో వెటరన్స్ గిల్డ్ అనే సంస్థను స్థాపించి అనేక సామాజిక, సాంస్కృతిక, సంక్షేమ కార్యక్రమాలకు పునాది వేశారు.
పదవి విరమణ తర్వాత గత పది సంవత్సరాలుగా వివిధ హోదాల్లో తన ప్రవృత్తికి ఊతమిచ్చే సామాజిక సేవా కార్యకలాపాలు కొనసాగిస్తూనే ఉన్నారు. అమీర్ పేట, సనత్ నగర్ ప్రాంతాలలో గల కాలనీల సంక్షేమ సంఘాలతో కూడిన సమాఖ్యను 'ఫ్రాబ్స్' (FRABSS, ఫెడరేషన్ అఫ్ రెసిడెంట్స్ అసోసియేషన్స్ ఆఫ్ బల్కంపేట్, సంజీవరెడ్డి నగర్, సనత్ నగర్) అనే పేరుతో ఏర్పాటు చేసి అచిరకాలంలోనే స్థానికంగా దానినొక ప్రఖ్యాత సంస్థగా తీర్చిదిద్దారు. సుమారు ఐదు సంవత్సరాల పాటు ఆ సంస్థ తరఫున అధ్యక్ష హోదాలో అనేక కార్యక్రమాలు చేపట్టి ప్రముఖ సామాజిక వేత్తగా పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్నారు.
రాయల సేవా సమితి అనే మరొక స్వచ్ఛంద సంస్థను స్థాపించి పర్యావరణ పరిరక్షణ, ప్లాస్టిక్ రహిత సమాజం పై అవగాహన కార్యక్రమాలు కొనసాగిస్తూ, బీద సాదలకు అన్నదానాలు, ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు పుస్తకాలు, స్కాలర్షిప్ లు అందించడం, మొక్కలు నాటించడం వంటి సేవా కార్యక్రమాలు ప్రతి నెలా చేస్తుంటారు. బస్తీలు, కాలనీల లో సమాజ సేవా కార్యక్రమాలతో పాటు పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నివారణ, జల సంరక్షణ వంటి అనేక సామాజిక అంశాలపై ప్రజల్లో అవగాహన తెచ్చే విధంగా పాటుపడ్డారు. స్థానిక ఎమ్మెల్యే, మాజీ మంత్రివర్యులు శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు వీరి సేవలను కొనియాడుతూ ప్రశంసా పత్రాన్ని సైతం అందజేశారు.
కథలు కవితలు రాయడం వారికి ఇష్టమైన హాబీ. స్వతంత్ర పాత్రికేయుడిగా వీరి రచనలు తరచుగా మాస పత్రికలు, దినసరి వార్తా పత్రికల్లోని ఎడిటోరియల్ పేజీల్లో ప్రచురింపబడుతుంటాయి. వక్తగా, వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ అనేక కార్యక్రమాల నిర్వహణ బాధ్యతను కొనసాగించడమే కాక ఆధ్యాత్మిక ఉపన్యాసాలు, సత్సంగ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు.
వందనం, ఆర్ సి కుమార్
(కలం పేరు - రాకుమార్, పూర్తి పేరు - ఆర్. శ్రీరామచంద్రకుమార్)
సామాజికవేత్త






Comments