వామనావతార తత్వం
- Rayala Sreeramachandra Kumar

- 5 days ago
- 6 min read
Vamanavathara Thathwam - New Telugu Article Written By R C Kumar
Published In manatelugukathalu.com On 26/12/2025
వామనావతార తత్వం - తెలుగు వ్యాసం
రచన: ఆర్ సి కుమార్
బలిచక్రవర్తిని వామనుడు మూడడుగుల దానంతో పాతాళానికి తొక్కేయడమే కదా ఇందులో ఏముంది ! పాత కథే ! అనుకోవచ్చు కొందరు. ఈ వృత్తాంతాన్ని కాస్త లోతుగా పరిశీలిస్తే సామాన్య పాఠకులకు కొన్ని ప్రశ్నలు/సందేహాలు తలెత్తక మానవు. వాటికి పరిశోధనాత్మకంగా సమాధానాలు రాబట్టుకునే క్రమంలో ఆసక్తికరమైన వాస్తవాలు, ధర్మసూక్ష్మాలు బయట పడుతాయి.
1) దశావతారాల్లో విష్ణుమూర్తి యొక్క ఒక్కొక్క అవతారాన్ని ఒక్కొక్క విధంగా కీర్తిస్తూ దశావతార స్తోత్రం చేస్తాం. అసలు అవతారాలు తీసుకోవలసిన అవసరం ఎందుకు ?
2) అపార విష్ణుభక్తుడైన ప్రహ్లాదుని మనవడైన బలి చక్రవర్తి మహా పరాక్రమశాలి. ధర్మనిరతి, ప్రజల సంక్షేమం పట్ల నిబద్ధత కలవాడు. సత్యం, వినయం అతనిలోని సుగుణాలు. ఇక దానగుణంలో అతనికి మించిన వాడు లేడని పురాణాలు చెబుతున్నాయి ఎవరైనా సరే తన దగ్గరకు వచ్చి ఏది అడిగినా లేదనకుండా దానమిచ్చే స్వభావం గల బలిచక్రవర్తిని అంతం చేయవలసిన అవసరం ఎందుకొచ్చింది ?
3) దాన ప్రక్రియలో భాగంగా మూడు అడుగుల నేల మాత్రమే కావాలి అని అడగడంలో అంతరార్థం ఏమిటి ?
4) శుక్రాచార్యుడు జ్యోతిష్య శాస్త్రంలో, నీతి శాస్త్రంలో మహా పండితుడు. అతను రచించిన శుక్ర నీతి తరతరాలకు ప్రామాణికమైనది. చాణిక్య నీతికి మూలం కూడా ఇదే. మృత సంజీవిని విద్య ఈయన ఒక్కడికే తెలుసు. అటువంటి అపార జ్ఞాన సంపన్నుడు, గొప్ప ఋషి అయిన శుక్రాచార్యుడు కొన్ని సందర్భాలలో అబద్ధాలు చెప్పవచ్చని బలి చక్రవర్తికి బోధిస్తాడు ఎందుకు ?
5) విష్ణుమూర్తి కావాలనుకుంటే బలిచక్రవర్తిని ఏదో రకంగా మట్టు పెట్టవచ్చు. కానీ తల మీదే కాలు పెట్టి పాతాళానికి తొక్కేయడంలో అంతరార్థం ఏమిటి ?
మొదటి సందేహానికి జవాబు
++++++++++++++++++
అసలు భగవంతుడు అవతారాలు తీసుకోవలసిన అవసరం ఎందుకు అనే ప్రశ్నకు భగవద్గీతలో సాక్షాత్తు కృష్ణభగవానుడే చక్కటి ఉపదేశం చేశారు. "యదా యదాహి ధర్మస్య గ్లానిర్భవతి భారత। అభ్యుత్థాన మధర్మస్య తదా త్మానం సృజామ్యహమ్” అన్నారు. ధర్మానికి హాని జరిగి నప్పుడు, అధర్మం పెచ్చుమీరినప్పుడు, ధర్మాన్ని విచ్చిన్నం చేసేవాళ్లను హతమార్చడం, ధర్మాచరణ చేసేవాళ్లను ఉద్ధరించడం ద్వారా ధర్మసంస్థాపన చేయడానికి అనుకూలమైన మార్గాన్ని, రూపాన్ని ఎంచుకుంటాడు జగన్నాయకుడు. త్రిలోకనాథుడైన భగవంతుడికి అపారమైన శక్తి ఉన్నా, భక్తులకు మార్గనిర్దేశం చేయడానికి, లోకానికి ఒక ఆదర్శంగా నిలవడానికి సందర్భానుసారంగా అవతారాన్ని ధరిస్తాడు. భౌతిక రూపంలో ఉన్నప్పుడు మాత్రమే ప్రజలు సులభంగా దైవాన్ని అర్థం చేసుకుని, అనుసరించగలరు. ఇదే అవతరించడంలోని పరమార్థం, పరమ ప్రయోజనం. దేవతలతో సహా తాను సృష్టించిన సకల చరాచర జీవరాసులు అన్నింటిని అనుగ్రహించడమే అవతార తత్త్వం.
బలిచక్రవర్తి వృత్తాంతం :
+++++++++++++++
దేవతల తల్లి అదితి కశ్యపుడి భార్య రెండవ భార్య దితి రాక్షసులకు తల్లి. ఒక సందర్భంలో అదితి రాక్షసుల ఆగడాలు భరించలేక విష్ణుమూర్తి దగ్గరికెళ్ళి , రాక్షసులు స్వర్గాన్ని ఆక్రమించుకుని దేవతలను భయభ్రాంతుల్ని చేస్తున్నారు. బలి చక్రవర్తి ఇంద్రలోకంపై దండెత్తి ఇంద్రుడిని పదవీ భ్రష్టుడ్ని చేశాడు. అతని బారి నుంచి నువ్వే రక్షించాలి'' అంటూ ప్రార్థించింది. మానవజాతినే కాదు, దేవతలను రక్షించాల్సిన బాధ్యత కూడా భగవంతుడిదే కదా. అందుకు విష్ణుమూర్తి నవ్వుతూ తల పంకించి, ''ధైర్యంగా ఉండండి... త్వరలో నేను మీకు పుత్రుడిగా జన్మిస్తాను. దేవేంద్రుడు తిరిగి స్వర్గాధిపతి అవుతాడు" అంటూ అదితికి అభయమిచ్చాడు. ఇది రెండవ ప్రశ్నకు జవాబు
వరము ఇచ్చినట్లుగానే విష్ణుమూర్తి అదితికి వామనరూపంలో జన్మించాడు. వామనుడు అంటే అందగాడు. అంతేగాని పొట్టివాడు, మరుగుజ్జు అని కాదు. దశావతారాల స్తోత్రంలో "వటుపటువేష మనోజ్ఞ నమో భక్తం తే పరిపాలయ మామ్ అంటూ స్తుతిస్తాము. వామనుడిగా బ్రహ్మచారి రూపంలో అద్భుతంగా, అందంగా కనిపించేవాడా, మనోజ్ఞ నమో అంటే మనస్సును ఆకర్షించేవాడా, నీకు నమస్కారం. కేరళ తమిళనాడు లోని వామనాలయాల్లో, మధ్యప్రదేశ్ ఖజురహో వామన విగ్రహంలో వామనుడి ముగ్ధమోహన స్వరూపాన్ని చూడవచ్చు. వామనుడికి సూర్యభగవానుడు, గాయత్రీ మంత్రాన్ని ఉపదేశించాడు. భూదేవి కృష్ణాజినాన్ని, (పవిత్రమైన నల్ల జింక చర్మం) గగన దేవత గొడుగును, బృహస్పతి యజ్ఞోపవీతాన్ని, కుబేరుడు భిక్ష పాత్రను ఇచ్చారు.
రాక్షస రాజైన బలి చక్రవర్తి ఒకసారి అశ్వమేథ యాగాన్ని తలపెట్టాడని తెలుసుకొని బలిని అణగ దొక్కేందుకు ఇదే సరైన సమయంగా భావిస్తాడు విష్ణుమూర్తి. ఎవరైనా సరే తన దగ్గరకు వచ్చి ఏది అడిగినా లేదనకుండా దానమిచ్చే స్వభావం బలిచక్రవర్తిది. అందులోనూ బ్రాహ్మణులు వచ్చి అడిగితే అడిగినవన్నీ ఇవ్వడం ఆయన బలహీనత. అది గ్రహించిన విష్ణుమూర్తి వామన రూపంలో బలి చక్రవర్తి యజ్ఞశాలకు వెళ్తాడు. జగన్నాయకుడైన శ్రీహరి వామనుడై యాచనకు పూనుకున్నాడు. ఇచ్చేవాడు మహాదాత బలి. అమోఘమైన దృశ్యం అది. బలి చక్రవర్తి వామనుని చూడగానే, "ఆహా ! ఉపనయనం చేసుకుని వటువుగా నా దగ్గరికి వచ్చావు. నా జన్మ ధన్యమైంది. నీకు భిక్ష ప్రసాదించడం నా అదృష్టం. ఏం కావాలో కోరుకో'' అన్నాడు. వరచేలంబులో, (పట్టు వస్త్రాలు) మణి మాణిక్యాలో, వామాక్షులో, అశ్వంబులో, ధరణీఖండమో, ఏదికావాలో కోరుకొమ్మన్నాడు. అవన్నీ అవసరం లేదు కానీ, మూడడుగుల నేల చాలన్నాడు వామనుడు. ఏంటీ ? మూడు అడుగుల నేలా ? ''నువ్వు అడుగుతోంది ఒక చక్రవర్తిని అని మర్చిపోయావా? ఇలాంటి అల్పమైన కోరిక కోరడం అన్యాయం. మరీ ఇంత చిన్న కోరికా? మొహమాట పడకుండా ఇంకేదయినా పెద్ద కోరిక కోరుకో" అన్నాడు బలి. అయినా మూడు అడుగుల నేల మాత్రమే కావాలని పట్టుబడ్డాడు వామనుడు.
మూడవ సందేహానికి జవాబు
వామనుడి రూపంలో ఉన్న విష్ణుమూర్తి దానశీలి అయిన బలి చక్రవర్తిని మూడు అడుగులు భూమి కావాలని కోరడంలోని ఆంతర్యం ఏమిటంటే ఆ మూడు అడుగులు సత్వ రజ తమో గుణాలనీ, + సృష్టి స్థితి లయలను సూచిస్తాయి. త్రైలోక్యనాథుడిని నేనే అనే సూచన కూడా ఉంది. బలి చక్రవర్తికి అర్థం కాలేదు కానీ, అక్కడే సభలో ఉన్న రాక్షసుల గురువైన శుక్రాచార్యునికి వామనుడి రూపంలో వచ్చింది సాక్షాత్తు శ్రీమహావిష్ణువువే అని తెలిసిపోయింది. ఆపద రాబోతున్నదని గ్రహించిన శుక్రాచార్యుడు లేచి నిలబడి ''బలీ, ఈ వామనుడు మారువేషంలో వచ్చాడు. ఇతనికి ఏమీ ఇవ్వొద్దు'' అన్నాడు. బలి ఏమాత్రం ఆలోచించకుండా ''గురువర్యా, ఇచ్చిన మాట ఎన్నటికీ తప్పను'' అన్నాడు.
నాలుగవ సందేహానికి జవాబు
ఈ సందర్భంగా శుక్రాచార్యులు నీతి సూత్రాలు వల్లిస్తూ ఎప్పుడెప్పుడు అబద్ధాలు చెప్పవచ్చో వివరిస్తున్నాడు. వారిజాక్షులందు, వైవాహికము లందు, ప్రాణ, విత్త, మాన, భంగమందు జకిత గోకులాగ్రజన్మ రక్షణ మందు బొంకవచ్చును, అఘము పొందదధిప ! అంటారు. ఓ బలిచక్రవర్తి! ఆడవారి విషయంలో కానీ, పెళ్ళికి సంబంధించిన విషయాల్లో కాని, ప్రాణానికి, ధనానికి, గౌరవానికి భగం కలిగేటప్పుడు, భయపడుతున్న గోవులను, విప్రులను కాపాడే టప్పుడు కాని, అవసరమైతే అబద్ధం చెప్పవచ్చు. దాని వల్ల పాపం రాదని బోధిస్తాడు. అయిననూ సమ్మతించని బలి చక్రవర్తి వామనుడి వైపు తిరిగి, ''నీకు మూడు అడుగుల భూమియే కావాలని పట్టుదల ఉంటే అలాగే తీసుకో'' అంటూ ధార పోయడానికి కొమ్ము చెంబును చేతిలోకి తీసుకున్నాడు బలి చక్రవర్తి. ఆ నీరు బయటికి వచ్చిందంటే దాన ప్రక్రియ పూర్తయినట్టే.
ఆ దానాన్ని ఎలాగైనా ఆపి, బలి చక్రవర్తిని కాపాడాలనే పట్టుదలతో శుక్రాచార్యుడు ఒక ఉపాయాన్ని ఆలోచిస్తాడు. ఎందుకంటే బలి చక్రవర్తి తర్వాత రాక్షస రాజుల పాలన అంతమైపోతుంది. ఆ ఉద్దేశంతో శుక్రాచార్యుడు, ఒక మక్షిక (తేనెటీగ వంటి కీటకం) రూపంలో చెంబులో ప్రవేశించి నీరు బయటికి రాకుండా అడ్డుపడతాడు. "అయ్యో, నీరు రావడం లేదేంటి" అని బలి కంగారుపడ్డాడు. విషయం గ్రహించిన విష్ణుమూర్తి, దర్భతో కొమ్ములోనికి పొడిచాడు. అంతే, కొమ్ములో అడ్డంగా ఉన్న శుక్రాచార్యుని కంట్లో దర్భ గుచ్చుకుంది. అంతటితో శుక్రాచార్యుడు, ఓ కన్ను పోగొట్టుకుని ఏకాక్షి అయ్యి బయటికి వచ్చాడు. దానం పూర్తయింది. దానం స్వీకరించిన వామనుడు కొద్దికొద్దిగా పెరుగుతూ ఇంతింతై వటుడింతై అన్నట్టుగా యావత్ బ్రహ్మాండమంతా ఆక్రమించేస్తాడు. ఒక పాదము (అడుగు) భూమి మీద వేసి, రెండవ పాదము ఆకాశమ్మీద వేసి, మూడవ పాదం ఎక్కడ వెయ్యాలని బలిచక్రవర్తిని అడుగుతాడు.
అప్పుడు బలి ఇక నాదగ్గరు ఇచ్చేందుకు ఏమీ లేదు. మీ మూడవ అడుగు నా నెత్తి మీద వెయ్యి పురుషోత్తమా అంటాడు. వామనుడు తన మూడో పాదాన్ని బలి నెత్తి మీద వేసి అథ:పాతాళానికి తొక్కేస్తాడు. వామనుడు బలిచక్రవర్తి నుండి మూడు అడుగులకు గాను ఒక అడుగు భూమిని, ఒక అడుగు ఆకాశాన్ని ఆక్రమించాక వారు ఇరువురు నిలుచున్న భూమి అప్పటికే వామనుడిది అయిపోయింది కదా. మరి మూడో అడుగు బలి తలపైనే ఎందుకు పెట్టవలసి వచ్చింది ? బలి నిలబడి ఉన్న భూమి కూడా వామనుడి సొంతమైపోయింది కదా. దీనికి సమాధానం ఏమిటంటే బలి చక్రవర్తి నిలిచిన భూమి వామనుడిదే కాని బలి శరీరం ఆయనదే కదా ! బలి కూడా మూడవ అడుగు కోసం తన తలనే సమర్పించాడు. అందుకే వామనుడు ఆయన తలపై పాదం పెట్టి పాతాళానికి అణగ తొక్కవలసి వచ్చింది.
ఐదవ సందేహానికి (తల మీదే కాలు పెట్టి తొక్కడం ఎందుకు) జవాబు :
బలి తలమీద పాదం మోపడం అతని అహంకారాన్ని అణిచివేసే సూచన. ఎవరైనా అతిగా అహంభావం ప్రదర్శిస్తే వాడికి గర్వం నెత్తికెక్కింది అంటాం కదా. అది పాప కార్యానికి తగిన ఫలితం. తనంత గొప్పవారు లేరనే దురహంకారంతో ఇంద్రలోకాన్ని ఆక్రమించి దేవతలందరికీ ఇబ్బందులు కలిగించిన బలిచక్రవర్తి గర్వాన్ని అణిచి దురహంకారంతో విర్రవీగే వారికి ఎన్నటికైనా ఇటువంటి అథోగతి తప్పదని తెలియజేశాడు శ్రీ మహావిష్ణువు. ఇక బలి చక్రవర్తి పుణ్య కార్యాలకు కూడా దానికి తగ్గ ఫలితం దక్కింది. అపార విష్ణుభక్తుడైన ప్రహ్లాదుని మనవడైన బలి చక్రవర్తి ప్రజల సంక్షేమం కోసం పాటుపడుతూ సత్యం, వినయం, ఇచ్చిన మాట తప్పకపోవడం వంటి మంచి గుణాలను పరిగణనలోకి తీసుకొన్న విష్ణుమూర్తి ఆయనను పాతాళానికి చక్రవర్తిగా చేశారు. దీపావళి తర్వాత వచ్చే కార్తీక శుద్ధ పాడ్యమిని బలి పాడ్యమిగా పిలుస్తూ మహాబలి చక్రవర్తిని పూజించే రోజు. ఆ రోజున విష్ణుభక్తుడైన బలి చక్రవర్తి పాతాళం నుండి భూమిపైకి వస్తాడని నమ్ముతారు.
ఆ విధంగా భగవంతుడు పుణ్య కార్యానికి పుణ్యఫలం, పాప కార్యాలకు పాప ఫలాన్ని అందించే బాధ్యత తీసుకుంటాడు. కథలోని సారాంశం ఏమిటంటే - ఎవరు తమ శిరస్సును అనగా తలపులను శ్రీహరికి సమర్పిస్తారో వారు శ్రీహరి కరుణా కటాక్షాలను శిరాన ధరిస్తారు అని గ్రహించాలి.
లోక సమస్తా సుఖినోభవంతు
ఆర్ సి కుమార్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:
నమస్తే
ఆర్.సి. కుమార్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ లో వివిధ హోదాల్లో అత్యుత్తమ సేవలు అందించి అనేక అవార్డులు రివార్డులు పొందారు. అసిస్టెంట్ జనరల్ మేనేజర్ గా పదవీ విరమణ చేసిన పిదప సంస్థకు చెందిన పూర్వ ఉద్యోగులతో వెటరన్స్ గిల్డ్ అనే సంస్థను స్థాపించి అనేక సామాజిక, సాంస్కృతిక, సంక్షేమ కార్యక్రమాలకు పునాది వేశారు.
పదవి విరమణ తర్వాత గత పది సంవత్సరాలుగా వివిధ హోదాల్లో తన ప్రవృత్తికి ఊతమిచ్చే సామాజిక సేవా కార్యకలాపాలు కొనసాగిస్తూనే ఉన్నారు. అమీర్ పేట, సనత్ నగర్ ప్రాంతాలలో గల కాలనీల సంక్షేమ సంఘాలతో కూడిన సమాఖ్యను 'ఫ్రాబ్స్' (FRABSS, ఫెడరేషన్ అఫ్ రెసిడెంట్స్ అసోసియేషన్స్ ఆఫ్ బల్కంపేట్, సంజీవరెడ్డి నగర్, సనత్ నగర్) అనే పేరుతో ఏర్పాటు చేసి అచిరకాలంలోనే స్థానికంగా దానినొక ప్రఖ్యాత సంస్థగా తీర్చిదిద్దారు. సుమారు ఐదు సంవత్సరాల పాటు ఆ సంస్థ తరఫున అధ్యక్ష హోదాలో అనేక కార్యక్రమాలు చేపట్టి ప్రముఖ సామాజిక వేత్తగా పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్నారు.
రాయల సేవా సమితి అనే మరొక స్వచ్ఛంద సంస్థను స్థాపించి పర్యావరణ పరిరక్షణ, ప్లాస్టిక్ రహిత సమాజం పై అవగాహన కార్యక్రమాలు కొనసాగిస్తూ, బీద సాదలకు అన్నదానాలు, ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు పుస్తకాలు, స్కాలర్షిప్ లు అందించడం, మొక్కలు నాటించడం వంటి సేవా కార్యక్రమాలు ప్రతి నెలా చేస్తుంటారు. బస్తీలు, కాలనీల లో సమాజ సేవా కార్యక్రమాలతో పాటు పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నివారణ, జల సంరక్షణ వంటి అనేక సామాజిక అంశాలపై ప్రజల్లో అవగాహన తెచ్చే విధంగా పాటుపడ్డారు. స్థానిక ఎమ్మెల్యే, మాజీ మంత్రివర్యులు శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు వీరి సేవలను కొనియాడుతూ ప్రశంసా పత్రాన్ని సైతం అందజేశారు.
కథలు కవితలు రాయడం వారికి ఇష్టమైన హాబీ. స్వతంత్ర పాత్రికేయుడిగా వీరి రచనలు తరచుగా మాస పత్రికలు, దినసరి వార్తా పత్రికల్లోని ఎడిటోరియల్ పేజీల్లో ప్రచురింపబడుతుంటాయి. వక్తగా, వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ అనేక కార్యక్రమాల నిర్వహణ బాధ్యతను కొనసాగించడమే కాక ఆధ్యాత్మిక ఉపన్యాసాలు, సత్సంగ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు.
వందనం, ఆర్ సి కుమార్
(కలం పేరు - రాకుమార్, పూర్తి పేరు - ఆర్. శ్రీరామచంద్రకుమార్)
సామాజికవేత్త





Comments