విచిత్ర వీర్యుడి విచిత్ర వ్యసనం
- Rayala Sreeramachandra Kumar

- 3 hours ago
- 4 min read
Vichitra Veeryudi Vichitra Vyasanam - New Telugu Story Written By R C Kumar Published In manatelugukathalu.com On 05/02/2026
విచిత్ర వీర్యుడి విచిత్ర వ్యసనం - తెలుగు కథ
రచన: ఆర్ సి కుమార్
మహాభారతంలోని పాత్రలు వైవిధ్యభరితంగా ఉంటాయి. దేనిని గొప్ప పాత్ర అని, నీచమైన పాత్ర అని నిర్వచించడానికి వీలు ఉండదు. సంక్లిష్టమైన మానవ నైజాలను ప్రతిబింబించే విధంగా పాత్రల చిత్రీకరణ ఉంటుంది. ఈ రోజుల్లో మన జీవన శైలిని ఎలా మలచుకోవాలో 5200 సంవత్సరాల క్రితమే మనకు మహాభారతం చెప్పింది. అందుకే అందులోని పాత్రలు ఈనాటికీ మన జీవన విధానానికి సరిపోయే సజీవ సాక్ష్యాలు. చిత్రాంగదుడు, విచిత్రవీర్యుడు కురు వంశానికి చెందిన శంతన మహారాజు మరియు సత్యవతి దంపతుల కుమారులు; భీష్ముడికి సవతి సోదరులు. పేర్లకు తగ్గట్టుగానే చిత్రాంగదుడు, విచిత్ర వీర్యుడి నైజాలు చిత్ర విచిత్రాలుగా పరిణమించి ఒకరి తరువాత మరొకరు అకాల మరణాలు చెందడంలో మనం నేర్చుకోవలసిన జీవిత సత్యాలు, జీవిత పాఠాలు ఇమిడి ఉన్నాయి.
శంతనుడి పెద్ద కుమారుడైన చిత్రాంగదుడు గొప్ప యోధుడు. హస్తినాపురాన్ని అప్రతిహతంగా పరిపాలించాడు.
రాజ్యాన్ని ధర్మబద్ధంగా పరిపాలించి ప్రజలను రక్షించాలనే ముఖ్యమైన కర్తవ్యాన్ని మరిచి, తన ప్రతాపాన్ని ప్రదర్శించుకోవడంతోనే సమయం గడిపేవాడు. ఆ అహమే అతడి వినాశనానికి కారణం అయ్యింది. తన పేరే గల ఒక గంధర్వ రాజుతో వైరం పెట్టుకుని యుద్ధంలో అతని చేతిలో మరణించాడు. మనసులో గూడు కట్టుకున్న అహంకారమే సరైన సమయంలో సరైన విధంగా శిక్షించి తీరుతుందన్న సత్యం చిత్రాంగదుడి వృత్తాంతం ద్వారా తేటతెల్లమైంది.
ఆ పిమ్మట అతని సోదరుడు విచిత్రవీర్యుడు హస్తినాపుర సింహాసనాన్ని అధిష్టించవలసి వచ్చింది. మితిమీరిన భోగభాగ్యాలకు బానిసగా మారితే శారీరక మరియు మానసిక దృఢత్వం తగ్గి, జీవితంపై నియంత్రణ కోల్పోతారు. వంశ ప్రతిష్ట కూడా మంటగలిసిపోతుంది. దీనికి ఉదాహరణ విచిత్రవీర్యుడి వృత్తాంతం. విచిత్రవీర్యుడి భార్యలైన అంబిక, అంబాలిక అనే పాత్రలే లేకపోతే మహాభారతం ఎక్కడిది? వారిరువురికి వ్యాస మహర్షి ప్రసాదించిన పుత్రులే దృతరాష్ట్రుడు, పాండురాజులు. వారి కుమారులే కౌరవులు, పాండవులు.
కాశీరాజు తన కుమార్తెలైన అంబ, అంబిక, అంబాలికల స్వయంవరాన్ని ఏర్పాటు చేసి వీరులైన రాజులందరినీ ఆహ్వానించాడు. అయితే, ఆ స్వయంవరానికి హస్తినాపురం రాజైన విచిత్ర వీర్యుడు వెళ్లకుండా భీష్ముడు ఎందుకు వెళ్ళాడన్న సందేహం కలుగక మానదు. హస్తినాపుర రాజు బలహీనుడని తెలుసుకొని కాశీరాజు ఆ రాజ్యానికి ఆహ్వానం పంపలేదు. అది తన వంశానికి జరిగిన అవమానంగా భావించిన భీష్ముడు తానే స్వయంగా స్వయంవరానికి వెళ్లాడు. బ్రహ్మచర్య ప్రతిజ్ఞ చేసిన భీష్ముడు స్వయంవరానికి రావడం చూసి అక్కడి రాజులు ఆయనను ఎగతాళి చేశారు. తన పరాక్రమాన్ని ప్రదర్శించి భీష్ముడు అక్కడున్న రాజులందరి కిరీటాలను ఒకే బాణంతో పడగొట్టి వారిని ఓడించాడు. కాశీరాజు ముగ్గురు కుమార్తెలను బలవంతంగా తన రథంపై ఎక్కించుకుని హస్తినాపురానికి తీసుకువెళ్లాడు.
ముగ్గురిలో ఒకరైన అంబ సాల్వుడిని ప్రేమించి భంగపడిన కథ వేరు. పగతో రగిలేవారు విచక్షణ కోల్పోయి ఎలా ప్రవర్తిస్తారో ఆమె వృత్తాంతం తెలుపుతుంది. భీష్ముడిపై పగతో జన్మాంతర ద్వేషం పెంచుకొన్న అంబ అతని మరణానికి చేసిన ప్రయత్నాలు మహాభారతంలో మరువలేని మలుపులు. సింహాసనాన్ని చేపట్టిన విచిత్ర వీర్యుడు తన భార్యలైన అంబిక, అంబాలిక అనే అందమైన భార్యలతో కామ భోగాలలో తేలియాడుతూ రాచకార్యాలను మరిచిపోయాడు. పరిపాలన భ్రష్టు పట్టినా, విచ్చల విడిగా 7 సంవత్సరాలు కామ భోగాలు అనుభవిస్తూ కాలం గడిపాడు. భోగభాగ్యాలకు బానిసగా మారితే శారీరక మరియు మానసిక దృఢత్వం తగ్గి, జీవితంపై నియంత్రణ కోల్పోతారు. చివరికి విచిత్ర వీర్యుడు క్షయ వ్యాధికి గురై మంచాన పడ్డాడు. అతని స్నేహితులు, వైద్యులు ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ వ్యాధి నయం కాలేదు. చివరికి మరణించాడు. ఇప్పుడు హస్తినాపురం రాజు లేని రాజ్యం అయింది.
భరతవంశం వారసులను కోల్పోయిన ఆ క్లిష్ట సమయంలో సత్యవతి భరతవంశ పునరుద్ధరణ కొరకు, అదివరకే సద్యోగర్భంతో తనకు జన్మించిన వ్యాస మహర్షిని మనన మంత్రంచే తన వద్దకు పిలిపించుకుంది. భరతవంశాన్ని నిలబెట్టాల్సిన బాధ్యత తీసుకోమని వ్యాసుడికి ఆదేశించింది. తల్లి ఆదేశాన్ని అనుసరించి వ్యాస మహర్షి ఆ సమయంలో కళ్ళు మూసుకున్న అంబికకు దృతరాష్ట్రుని, భయపడి మొఖం పాలిపోయిన అంబాలికకు పాండురాజుని, అంబిక పంపిన దాసికి విదురుని ప్రసాదించి తిరిగి తపోవనానికి వెళ్ళిపోతాడు.
అడవిలో సంగమంలో జింకల రూపంలో ఉన్న కందమ మహర్షిని వేట కోసం వెళ్లిన పాండురాజు పొరపాటున చంపడం వల్ల, భార్యలతో సంయోగం జరిపితే మరణిస్తావని శపించి ఆ ముని మరణిస్తాడు. ఒక ఋషిని చంపినందుకు మరియు ఆ శాపం వల్ల కలిగిన భయం, విరక్తితో పాండురాజు తన రాజ్యాధికారాన్ని అంధుడైన ధృతరాష్ట్రునకు అప్పగించి, ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి వనవాసానికి వెళ్ళిపోతాడు. పాండురాజు వనవాసానికి వెళ్ళిన తర్వాత మాత్రమే అంధుడైన ధృతరాష్ట్రుడు హస్తినాపురానికి తాత్కాలికంగా (Acting King) రాజయ్యాడు. ముని శాపం వల్ల పాండురాజు భార్యలైన కుంతీ, మాద్రిలకు అతని ద్వారా సంతానం కలగలేదు. ఒకరోజు పాండురాజు తన భార్య మాద్రి సౌందర్యానికి ముగ్ధుడై, ఆమె వారించినా వినకుండా దగ్గరవ్వగా, శాపం అమలు జరిగి అక్కడికక్కడే మరణించాడు.
కుంతీదేవి చిన్నతనంలో తనకు అందించిన సేవలకు భక్తికి సంతోషించి దుర్వాస మహర్షి ఆమెకు ఒక ప్రత్యేకమైన మంత్రాన్ని (వరం) ప్రసాదించారు. ఈ మంత్రం ద్వారా కుంతి ఏ దేవతను తలుచుకుంటే ఆ దేవత ప్రత్యక్షమై, వారి అనుగ్రహంతో ఆమెకు అద్భుతమైన సంతానం కలిగేలా ఆ వరం పనిచేస్తుంది. ఆ విధంగా కుంతీదేవికి దుర్వాస మహర్షి ఇచ్చిన మంత్రంతో ఆయా దేవతలను ప్రార్థించి వారి ద్వారా యముడి అంశతో ధర్మరాజు, వాయుదేవుని అంశతో భీముడు, ఇంద్రుని అంశతో అర్జునుడిని పొందింది. కుంతీదేవి సహృదయంతో మాద్రి దేవికి తాను దుర్వాస మహర్షి నుంచి నేర్చుకున్న దివ్య మంత్రాన్ని బోధించగా, ఆ మంత్ర సహాయంతో మాద్రి దేవి అశ్విని దేవతలను ప్రార్థించి నకుల సహదేవులను పొందింది.
నిస్వార్ధంగా, నిబద్ధతతో చేసే సేవ ఎన్నటికీ వృధా కాదనే సత్యానికి మహర్షులు కుంతీదేవి, గాంధారికి ఇచ్చిన వరాలు ఒక నిదర్శనం. దుర్వాస మహర్షి తనకు సేవలు చేసినందుకుగాను కుంతికి దేవతల ద్వారా సంతానం పొందే వరాన్ని ప్రసాదిస్తే, గాంధారి అంధుడైన తన భర్తకు చేసిన సేవలకు ప్రతిగా వ్యాస మహర్షి వందమంది పుత్రులను కనే వరాన్ని ప్రసాదించాడు. మనం మనవారికి, ఇతరులకు ఏమి ఇస్తామో, అదే మనకు ఏదో రూపంలో తిరిగి వస్తుంది అనేది ఇందులోని పరమార్థం. అది గౌరవం కావచ్చు లేదా మన కష్టకాలంలో లభించే సాయం కావచ్చు.
శ్రీకృష్ణార్పణమస్తు
ఆర్ సి కుమార్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:
నమస్తే
ఆర్.సి. కుమార్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ లో వివిధ హోదాల్లో అత్యుత్తమ సేవలు అందించి అనేక అవార్డులు రివార్డులు పొందారు. అసిస్టెంట్ జనరల్ మేనేజర్ గా పదవీ విరమణ చేసిన పిదప సంస్థకు చెందిన పూర్వ ఉద్యోగులతో వెటరన్స్ గిల్డ్ అనే సంస్థను స్థాపించి అనేక సామాజిక, సాంస్కృతిక, సంక్షేమ కార్యక్రమాలకు పునాది వేశారు.
పదవి విరమణ తర్వాత గత పది సంవత్సరాలుగా వివిధ హోదాల్లో తన ప్రవృత్తికి ఊతమిచ్చే సామాజిక సేవా కార్యకలాపాలు కొనసాగిస్తూనే ఉన్నారు. అమీర్ పేట, సనత్ నగర్ ప్రాంతాలలో గల కాలనీల సంక్షేమ సంఘాలతో కూడిన సమాఖ్యను 'ఫ్రాబ్స్' (FRABSS, ఫెడరేషన్ అఫ్ రెసిడెంట్స్ అసోసియేషన్స్ ఆఫ్ బల్కంపేట్, సంజీవరెడ్డి నగర్, సనత్ నగర్) అనే పేరుతో ఏర్పాటు చేసి అచిరకాలంలోనే స్థానికంగా దానినొక ప్రఖ్యాత సంస్థగా తీర్చిదిద్దారు. సుమారు ఐదు సంవత్సరాల పాటు ఆ సంస్థ తరఫున అధ్యక్ష హోదాలో అనేక కార్యక్రమాలు చేపట్టి ప్రముఖ సామాజిక వేత్తగా పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్నారు.
రాయల సేవా సమితి అనే మరొక స్వచ్ఛంద సంస్థను స్థాపించి పర్యావరణ పరిరక్షణ, ప్లాస్టిక్ రహిత సమాజం పై అవగాహన కార్యక్రమాలు కొనసాగిస్తూ, బీద సాదలకు అన్నదానాలు, ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు పుస్తకాలు, స్కాలర్షిప్ లు అందించడం, మొక్కలు నాటించడం వంటి సేవా కార్యక్రమాలు ప్రతి నెలా చేస్తుంటారు. బస్తీలు, కాలనీల లో సమాజ సేవా కార్యక్రమాలతో పాటు పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నివారణ, జల సంరక్షణ వంటి అనేక సామాజిక అంశాలపై ప్రజల్లో అవగాహన తెచ్చే విధంగా పాటుపడ్డారు. స్థానిక ఎమ్మెల్యే, మాజీ మంత్రివర్యులు శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు వీరి సేవలను కొనియాడుతూ ప్రశంసా పత్రాన్ని సైతం అందజేశారు.
కథలు కవితలు రాయడం వారికి ఇష్టమైన హాబీ. స్వతంత్ర పాత్రికేయుడిగా వీరి రచనలు తరచుగా మాస పత్రికలు, దినసరి వార్తా పత్రికల్లోని ఎడిటోరియల్ పేజీల్లో ప్రచురింపబడుతుంటాయి. వక్తగా, వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ అనేక కార్యక్రమాల నిర్వహణ బాధ్యతను కొనసాగించడమే కాక ఆధ్యాత్మిక ఉపన్యాసాలు, సత్సంగ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు.
వందనం, ఆర్ సి కుమార్
(కలం పేరు - రాకుమార్, పూర్తి పేరు - ఆర్. శ్రీరామచంద్రకుమార్)
సామాజికవేత్త





Comments