జీవితమంటే ఉగాది పచ్చడి
- Ayyala Somayajula Subramanyam

- 2 hours ago
- 3 min read
#AyyalaSomayajulaSubrahmanyam, #జీవితమంటేఉగాదిపచ్చడి, #JivithamanteUgadiPachhadi, #అయ్యలసోమయాజులసుబ్రహ్మణ్యము, #TeluguComedyStories, #తెలుగుహాస్యకథలు

Jivithamante Ugadi Pachhadi - New Telugu Story Written By Ayyala Somayajula Subrahmanyam Published In manatelugukathalu.com On 05/02/2026
జీవితమంటే ఉగాది పచ్చడి - తెలుగు కథ
రచన: అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము
ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత
“గోపీ”
“రాధా”
“‘ఉగాది వచ్చేసింది. ఈ పండక్కి అయినా మన విషయం మీ ఇంట్లో చెబుతావా గోపీ?”
“‘లేదు రాధా, లేదు..... నేను చెప్పలేను.”
“ఏం?”
“ఏం అంటే ఏం చెప్పను. అసలే నిన్నగాక మొన్ననే మా నాన్న పిచ్చిపిచ్చిగా మద్దతిచ్చే
పార్టీ, ఎన్నికల్లో ఘోరంగా మట్టికరిచింది. ఆ రోజు నుంచి మనిషి మనిషిలో లేడు.
ఉద్యోగి అయ్యుండి కనీసం ఆఫీసుకు లేటుగా వెళ్ళడం మానేశాడు. ఇలాంటి మానసిక
స్థితిలో ఆయన్ని మరింత బాధ పెట్టడము భావ్యమా చెప్పు?”
“పోనీ అమ్మకైనా?”
“అమ్మ.. 'జీడిపాకం' సీరియల్ పూర్తయిపోయిందని కలత చెందే అమ్మ .. మా
అబ్బాయి ఇంకా పాలు తాగే పసివాడి నని మురిసిపోయే అమ్మ.. ప్రభుత్వ పథకాలన్నీ
పద్ధతిగా అందుతున్నాయనే ఆనందంలో మునిగిపోయిన అమ్మ.. ఇలాంటి నేపథ్యంలో
నా ప్రేమ విషయం చెప్పి సంతోషాన్ని కాలరాయమంటావా? చెబితే విని తట్టుకునే
శక్తి ఆమెకి లేదు రాధా… మొన్ననే డాక్టర్ గారు బీపీ ఎక్కువగా ఉందని చెప్పారు.”
“నీకా గోపీ?”
“కాదు రాధా, అమ్మకు.”
“తమ్ముడికి చెబితే?”
“హూ….తమ్ముడు… బెట్టింగ్ యాప్స్‌లో డబ్బులు పోగొట్టి, చెడు తిరుగుళ్ళు తిరుగుతున్న
తమ్ముడు…. దొరికితే అప్పులోళ్ళు తంతారని ఇంటికైనా రాని తమ్ముడు. వాడికి చెప్పినా
వృథా రాధా… చెప్పినా వృథా!”
“మరేం చేద్దాం గోపీ?”
“విడిపోదాం.”
“గోపీ…!!! నా ఈ చిన్ని హృదయంలో అంతటి భారీ బడబాగ్ని బద్దలు కొట్టకు.
బంగాళాఖాతం అంత బాధను నింపకు. నిన్నేమైనా బంగళాలు అడిగానా? ఒక్క బంగాళ
దుంప చిప్స్ ప్యాకెట్ అడిగాను. అంత మాత్రానికే ఇంతటి విపరీత నిర్ణయాలు తీసు
కుంటావా?”
“ఇవాళ ఏం పండుగ రాధా?”
“ఉగాది.”
“ఈ రోజు ఏం తింటారు?”
“ఏం తింటారు. పొద్దున్నే అమ్మ చిట్టి గారెలు వేసింది. అవి తినేసి నువ్వు పిలిచావని ఇటు
వచ్చా. మధ్యాహ్నం వెళ్ళేసరికి పులిహోర, పాయసం చేస్తానని చెప్పింది. నేనేమో పూర్ణం
బూరెలు కూడా అడిగాను. ఇంక సాయంత్రమేమో...”
“నేను అడిగింది నువ్వు పండుగతో సంబంధం లేకుండా ఆబగా తిని అరిగించుకునే పదా
ర్థాల జాబితా కాదు రాధా; ఉగాది రోజున మాత్రమే ప్రత్యేకమైన పదార్థం గురించి.”
“ఓ అదా! ఉగాది పచ్చడి.”
“అందులో ఏముంటాయ్?”
“మామిడికాయ ముక్కలు, బెల్లం, వేపపువ్వు, ఇంకా?”
“నా ఫ్లో అర్థం చేసుకుని జవాబు ఇవ్వు రాధా- నేను అడిగేది రుచుల గురించి.”
“తెలుసు. తీపి, పులుపు, చేదు, కారం, వగరు..”
“హమ్మయ్య! పాయింట్‌కొచ్చావు. జీవితం కూడా ఉగాది పచ్చడి లాంటిదే రాధా! తీయని
ప్రేమలే కాదు… చేదు బ్రేకప్పులు కూడా ఉంటాయి. ఈ ఉదాహరణ చెప్పడం కోసమే ఇందా
కటి నుంచి నీ తింగరి సమాధానాలన్నీ ఓపికగా విన్నాను. భరించాను. ఇప్పటికైనా
అర్థమైందా రాధా?”
“అయింది కానీ గోపీ. పచ్చడిలో చేదు వేయాలా వద్దా అన్నది మన ఇష్టమే కదా! కేవలం
బెల్లం మామిడి ముక్కలు వేసి ఈ సారికి కానిచ్చేద్దాం ఏమంటావ్?”
“మన నాయకుల్లా అతి తెలివితేటలు ప్రదర్శించకు రాధా! అసలు జీవితమంటే తెలుసా
నీకు? జీవితమంటే ……”
“రోటీ పచ్చడి….. సారీ, ఉగాది పచ్చడి!”
“కదా! అందులో అన్ని రుచులు - తీపి, చేదు…”
“ఆ సోదంతా ఇందాక చెప్పావ్ గోపీ….. ఎందుకు నాకిష్టమైన విదేశానికి రెండోసారి ఎన్నికైన
అధ్యక్షుడి లా అంత కఠినంగా ఉంటున్నావ్? నా కళ్ళలోకి చూసి చెప్పు… నా మీద
ప్రేమ లేదూ?”
“ప్రేమ ఉందో లేదో చెప్పగలను కానీ కళ్ళల్లోకి మాత్రం చూడలేను రాధా….”
“ఏం?”
“సీజనల్ ఇన్ఫెక్షన్ వచ్చి కన్ను వాచింది. నీరు కనబడకుండా కళ్ళజోడు పెట్టుకుని
కవర్ చేస్తున్నా.”
“పోనీ ఇదైనా చెప్పు….. నా చేతిలో చెయ్యేసి చెప్పిన మాటలన్నీ అబద్ధాలేనా?”
“కావు రాధా, కావు!”
“మరి?”
“అన్నీ నిజాలే. ఒక్క నా జుట్టు ఒరిజినల్ అన్నమాట తప్ప. పెరిగిపోతున్న పొల్యూషన్
దెబ్బకి ఎప్పుడో పుటుక్కుమంది. మొన్ననే కొత్త విగ్గు పెట్టించుకొచ్చా. కావాలంటే చూడు.”
“గోపీ!!!”
“ఏమిటి రాధా! సొరంగంలా నోరు తెరిచావు!”
“నేను ఎన్నో మోసాలు చూశాను. కానీ ఇది మరీ మైసూరుపాక్‌లో పాక్ లేనంత మోసం.”
“ఇది వగరు రాధా! జీవితమంటే అన్ని రుచులు ఉంటాయి. అందులో……”
“ఆల్రెడీ చెప్పి చచ్చావు గోపీ. కొన్ని రాష్ట్రాల్లో కొత్త ప్రభుత్వాలు, మంచి ప్రభుత్వాలు
వచ్చి మంచి జరుగుతోంది కదా… మనకు అలా మంచి జరిగే అవకాశమే లేదంటావా గోపీ?”
“ఇది నిజమే అనుకో. ముప్పై ఏళ్ళు అధికారం మాదే అన్నోళ్ళే ఫామ్‌హౌస్‌లో
పల్లీలు తింటూ పరేషాన్‌గా కూకున్నారు. మనం కూడా ఇదే పార్క్‌లో భార్యాభర్తలుగా బఠానీ
లు తినే రోజు వస్తుందని ఎదురు చూద్దాం. ఇవాల్టి కైతే నీకు ఉగాది శుభాకాంక్షలు.”
“అలాగే గోపీ, అలాగే నీక్కూడా శుభాకాంక్షలు!!!!!”
——————————————శుభంభూయాత్————————————————
అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం
రచనలు -ఆర్థిక ,రాజకీయ, సామాజిక, అధ్యాత్మిక వ్యాసాలు.
అధ్యాత్మిక, సామాజిక, కుటుంబ, చారిత్రక కథలు, నవలు., కవితలు.
ప్రచురించిన పత్రికలు- జాగృతి, తెలుగువెలుగు, ప్రజాడైరీ, శ్రీ వేంకటేశం,
ఆంధ్రభూమి, దేశభక్తిసాహిత్య ఈ పత్రిక, సహరి, మిసిమి,తపస్విమనోహరం,మాధురి
మాసపత్రిక,ఉషాపక్షపత్రిక, సుమతి మాస పత్రిక, షార్ వాణి,మన తెలుగు కథలు.కామ్.
బిరుదులు- సాహిత్యవిక్రమార్క- దేశభక్తిసాహిత్య ఈ పత్రిక
ఉత్తమ రచయిత- మనతెలుగుకథలు.కామ్.
కలహంస—- నెలవంక- నెమలీక మాస పత్రిక.
ప్రథమబహుమతులు- నవలల విభాగము- మనతెలుగుకథలు.కామ్ మరియు
తపస్విమనోహరము.
ప్రథమద్వితీయబహుమతులు— కథల విభాగము- సహరి, మనతెలుగుకథలు.కామ్
చారిత్రక నవలలో ప్రథమ, ద్వితీయబహుమతులు.
సాంఘికనవలలో ద్వితీయ, కన్సోలేషన్ బహుమతులు.
ఇవేకాక ఆర్థిక, సామాజిక, ఆరోగ్య, ,రాజకీయ సంబంధించి పెక్కు వ్యాసాలు పత్రికల్లో వస్తూంటాయి.
కవితలు కూడా అన్ని విషయాల మీద కూడా వస్తూంటాయి.
30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.






Comments