top of page
Original.png

గుండె నిబ్బరం కలిగిన స్త్రీ మూర్తి - పార్ట్ 1

#NallabatiRaghavendraRao, #నల్లబాటిరాఘవేంద్రరావు, #గుండెనిబ్బరంకలిగినస్త్రీమూర్తి, #GundeNibbaramKaliginaSthreeMurthy, #TeluguInspirationalStories, #ప్రేరణాదాయకకథలు


Gunde Nibbaram Kaligina Sthree Murthy - Part 1/2 - New Telugu Story Written By - Nallabati Raghavendra Rao Published in manatelugukathalu.com on 04/02/2026

గుండె నిబ్బరం కలిగిన స్త్రీ మూర్తి - పార్ట్ 1/2 - పెద్దకథ మొదటి భాగం

రచన: నల్లబాటి రాఘవేంద్ర రావు

ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత

   

                    

''కమలిని... అమ్మా కమలిని'' తండ్రి పిలుపుతో వంటింట్లోంచి వచ్చింది కమలిని. వస్తూ పింగాణీ కప్పుతో టీ అందిస్తూ...''వచ్చేరా నాన్నగారు? టీ తీసుకోండి,'' అంది.


''మీ అమ్మకు ఈ సెల్ పనికి వస్తుందని తీసుకొచ్చానమ్మా. రేటు తక్కువే. మీ అమ్మకు సెల్ అంటే భయం. నేను చెప్పినా నేర్చుకోదు. ఈ రోజుల్లో సెల్ అవసరం లేకుండా బ్రతకలేం కదా. కనీసం ఫోన్ నెంబర్లు ఫీడ్ చేసుకోవడం, ఎవరైనా ఫోన్ చేస్తే మళ్లీ మాట్లాడడం, మెసేజ్‌లు రిసీవ్ చేసుకోవడం, మళ్లీ పంపడం, అలాగే... ఆ ఫోన్‌పే లాంటి కొన్ని విషయాలైనా నేర్పమ్మా. అత్యవసరంలో మీ అమ్మకు తెలియాలి కదా... సరేనా.'' అంటూ సెల్ చూపిస్తూ టేబుల్ మీద పెట్టాడు ఆమె తండ్రి న్నగభూషణరావు.


''ఆ మాట సరే గాని, మీకు మెడిసిన్స్ దొరికాయా?'' అడిగింది కమలిని.


''లేదమ్మా. సిటీకి దూరంగా ఇంద్రపాలెం అని ఉంది కదా, అక్కడ ఒక షాపు ఉంది. అక్కడికి వెళ్లి తెచ్చుకోవాలి. చాలా దూరం. ఎండగా ఉంది కదా అని వచ్చేసాను,'' అని అంటూ తన జేబులో ప్రిస్క్రిప్షన్ తీసి పక్కనే ఉన్న బల్ల మీద పెట్టి, మంచినీళ్లు తాగి వాలుకుర్చీలో జారపడ్డాడు.


''ఈ వయసులో మీకెందుకు ఈ కష్టం? నేను సిటీ బస్సు మీద వెళ్లి తెస్తాను కదా!'' అంటూ అక్కడున్న ప్రిస్క్రిప్షన్, డబ్బులతో తండ్రి వద్దని వారిస్తున్నా గబగబా బయటకు వెళ్లిపోయింది కమలిని. ముప్పై నిమిషాలలో తిరిగి వచ్చేసి తండ్రికి ఆ టాబ్లెట్లు అందించింది.


''ఆడపిల్లని బాధ పెట్టడం నాకు ఇష్టం లేదమ్మా.


మీ అక్కలు ఇద్దరినీ అలాగే పెంచి పెద్ద చేసి పెళ్లిళ్లు చేసి పంపించాను,'' టాబ్లెట్లు అందుకొని ఒకటి వేసుకుంటూ అన్నాడు ఫన్నగభూషణరావు.


''సరే... మీరు ప్రతిసారీ 'ఆడపిల్ల, ఆడపిల్ల' అనకండి. నా చదువుతో పాటు ఇంటికి సంబంధించిన విషయాలు నేను చూసుకుంటాను... అని మీకు చాలాసార్లు చెప్పాను కదా!'' అంటూ


టేబుల్ మీద ఉన్న కొత్త సెల్‌తో వంటింట్లోకి వెళ్లిపోయింది కమలిని.


అక్కడ పని కొంచెం తగ్గాక, తల్లిని బయటకు తీసుకొచ్చి సోఫాలో కూర్చోబెట్టి, సెల్ చూపించి ఒక్కొక్కటి నేర్పడం మొదలు పెట్టింది.


''ఏ.బి.సి.డి.లు రానిదాన్ని, నాకెందుకే ఇవన్నీ? నువ్వు, మీ నాన్నగారు చూసుకోండి!'' అంటూ మళ్లీ వంటింట్లోకి వెళ్లబోయింది కమలిని తల్లి ఖర్జూరమ్మ.


''అమ్మా... ఇలా కూర్చో. రోజులు గతంలోలా లేవు. సెల్ చేతిలో లేకుండా బయటికి వెళ్లి ఇంటికి ఒక్కదానివే రాలేవు. ఇన్నాళ్లు ఏదో అయింది, ఇక ఇప్పుడు అలా కుదరదు. నా పెళ్లై నేను వెళ్లిపోతే అప్పుడు నీకు అర్థమవుతుంది. కనీసపు అవసర విషయాలు చెబుతాను, నేర్చుకో!'' అంటూ బలవంతంగా తల్లిని కూర్చోబెట్టి, ఒక్కొక్కటి చాలా విషయాలు నోట్‌బుక్ మీద తల్లికి అర్థమయ్యేలా రాసి చెబుతూ, ఒక నెల రోజుల్లో సెల్ గురించి పూర్తిగా నేర్పించింది కమలిని.


అలా అలా తన ఇంజనీరింగ్ చదువు కొనసాగిస్తూ, తల్లికి వంటింటి సహాయం చేస్తూ, ఏమాత్రం పరిజ్ఞానం లేకుండా బ్రతుకుతున్న ఆమెను మరికొన్నాళ్లలో నేటి సమాజంలో గుండెల మీద చెయ్యి వేసుకుని బ్రతికే స్థితికి తీసుకొచ్చింది. అంతేకాకుండా, తండ్రిని ఒక్క నిమిషం కూడా బయటకు వెళ్లనివ్వకుండా అతనికి సంబంధించిన ప్రతి విషయం కూడా తనే పూర్తిచేస్తూ, తండ్రికి కొడుకులేని బాధను తీరుస్తుంది కమలిని.


*******


కమలిని ఇంజనీరింగ్ పూర్తి చేయడం, వెంటనే జాబ్ రావడం, కొన్నాళ్లు చేశాక ప్రస్తుతం వర్క్ ఫ్రమ్ హోమ్. ఇరవై సంవత్సరాల నుండి తండ్రి సంపాదించలేనివన్నీ సంపాదించి పెడుతుంది ఇంట్లో. ఎప్పటినుండో ఉన్న అప్పులు కూడా పూర్తిగా తొలగిపోయాయి. తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల కూడా పూర్తి శ్రద్ధ తీసుకుంటుంది కమలిని.


ఆరోజు కమలిని బాబాయ్ వెంకటసచ్చిదానందం పెళ్లి కొడుకుల ఆల్బమ్ పట్టుకొని వచ్చాడు. అతనిది పక్క ఊరు అచ్యుతాపురం. కాఫీ, టిఫిన్ అయ్యాక, కమలినిని పక్కన కూర్చోపెట్టుకున్నాడు. ''ఇదిగోనమ్మా, మీ అమ్మానాన్న సంవత్సరము నుండి చెబుతున్నారు. నీకు 22 ఏళ్లు వచ్చేసాయి కదా, మంచి సంబంధం చూసి పెళ్లి చేసి పంపించేయాలని వాళ్ల ఆత్రుత. నీకోసం నేను 'పెళ్లిళ్లపేరయ్య' అవతారం ఎత్తక తప్పలేదు. నువ్వు మాట్రిమోనీలో రిజిస్టర్ అయ్యి, పెళ్లి కొడుకుని సెట్ చేసుకుంటాను అంటే ఓకే. లేదంటే ఈ ఫోటోలు చూసి నాకు ఒక మాట చెప్పావనుకో,


నెల తిరగకుండా నీ పెళ్లి అయిపోతుంది. నువ్వు అత్తగారింటికి వెళ్లిపోతావు. మీ అమ్మనాన్న హ్యాపీ. నువ్వు ఈ కాలం అమ్మాయిల్లా కాకుండా నాకు ఒక ఛాన్స్ ఇయ్యి, తల్లి!'' అంటూ ఆల్బమ్ ముందు పెట్టాడు వెంకటసచ్చిదానందం.


''బాబాయ్... అమ్మా, నాన్న ఇక్కడే ఉన్నారు కదా. అందరికీ వినబడేలాగే చెప్తున్నాను, వినండి! మా నాన్న ఇంతవరకు ఏమీ సంపాదించలేకపోయారు, బాబాయ్. మేము అద్దె ఇంట్లోనే ఉంటున్నాము కదా. అందుకని నా నిర్ణయం ఏమిటంటే, నేను ఐదు ఏళ్ల వరకు పెళ్లి చేసుకోను. ఈ కాలంలో నేను కొంత డబ్బు పోగుచేసి, అమ్మానాన్నకు ఒక చిన్న ఇల్లు కొనిపెడతాను. ఆ తర్వాత నువ్వు చెప్పినట్టు వింటాను, బాబాయ్. అంతవరకు దయచేసి సంబంధాలు తీసుకురావద్దు...'' అంటూ పైకి లేచింది కమలిని.


''అబ్బో! బాగుందమ్మా. నువ్వు మన కుటుంబంలో సమస్యలు తెచ్చి పెట్టేలా కనిపిస్తున్నావు. పెళ్లి ముందు నీలా ఇలా మాట్లాడిన వాళ్ళని చాలామందిని చూశానమ్మా. పెళ్లికి ముందు ఇలాగే చెప్పి, ఆనక ఆరు నెలలకు ఒకసారి కూడా తల్లిదండ్రులకు ఫోన్ చేయరు. కొమ్ములు తిరిగిన మగరాయుడులా మాట్లాడకు. ఆడపిల్లలా పెళ్లి చేసుకుని నీ కాపురం ఏదో నువ్వు చేసుకో. ఇక్కడ మా పాట్లు మేం పడతాం. ఇది మా మూలే కదా!'' కొంచెం చిరాకు పడినట్టు అన్నాడు వెంకటసచ్చిదానందం.


''అదేమిటి, బాబాయ్? ఎవరో అమ్మాయిలు ఎక్కడో నేటి సమాజపు వికృత పద్ధతులలో పడి తప్పుదారిలో నడుస్తున్నారని, మొత్తం సమాజంలో ఉన్న వాళ్ళందర్నీ అదే గాటిలో కట్టేస్తే ఎలా బాబాయ్?'' కమలిని బాబాయ్ చెప్పేది, తల్లిదండ్రులు చెప్పేది వినకుండా తన రూమ్‌లోకి వెళ్లబోయింది.


''ఆగవే! పోనీ ఒక పని చేయరాదూ? అప్పు చేసి ఇల్లు కొను. పెళ్లయ్యాక ఈ జాబ్ ఎలాగూ చేస్తావు కదా. నెమ్మదిగా వాయిదాలు కడుతూ ఉంటే ఓ పది సంవత్సరాలకు అప్పు తీరిపోతుంది కదా?''


''లేదు, బాబాయ్. పెళ్లయ్యాక భర్త, అత్తమామలకు నేను అనువుగా నడుచుకోవాలి. ఇలాంటి విషయాలతో వాళ్ళింటికి కోడలుగా వెళ్లి నా కాపురం పాడు చేసుకోలేను. మరో విషయం


విను, బాబాయ్. పెళ్లికి ముందు నేను జాబ్ మానేస్తాను. నా భర్త, అత్తమామలు కోరితే

పెళ్లయిన మర్నాడు మళ్లీ జాబులో చేరతాను. నా అత్తమామకు సేవ చేసుకుంటూ, ఇంటి పనులు చూసుకుంటూ, నా భర్తకు ఆనందం కలిగిస్తూ నేను అత్తవారింట్లో నడుచుకోవాలి కదా. పుట్టబోయే పిల్లలను కూడా ఎక్కడో 'సేఫ్టీ హౌస్'లో పడేసి సంపాదించే జీవితం కూడా నాకు అవసరం లేదు. పిల్లలను ప్రేమగా చూసుకుని, సమాజ ఉన్నతికి ఉపయోగించే పౌరులుగా తీర్చిదిద్దాలనేదే నా ఆశయం. ఇప్పుడు ఇలాగ ఖచ్చితంగా నేను చెప్పినా, నా అత్తంటి వారు ఎలా ఆదేశిస్తే అలా మళ్లీ మారిపోవాలి, తప్పదు. అది నాణానికి రెండవ వైపు. ఇదే నా నిర్ణయం, బాబాయ్!'' కమలిని నవ్వుతూ బాబాయి వంక చూస్తూ అంది.


''అదేమిటి? ఈ సమాజానికి సంబంధించిన మనిషివి కాదా నువ్వు? ఎప్పుడూ లేనిది ఇంతంత పెద్ద విషయాలు మాట్లాడేస్తున్నావ్ ఏంటి? నీకేమైనా దెయ్యం పట్టిందా? అబ్బో! అన్నయ్య, దీనికి పెళ్లి సంబంధాలు తీసుకురావడం నావల్ల కాదు!'' తన బ్యాగ్ సదురుకుని నీరసంగా వెళ్లిపోయాడు వెంకటసచ్చిదానందం, తన అన్నగారు, వదిన దగ్గర సెలవు తీసుకుని.


*****


అనుకున్నట్టుగా విజయం సాధించింది కమలిని. ఐదు సంవత్సరాలు జాబ్ చేస్తూ, ఖాళీ సమయంలో వేరే విధానాల ద్వారా కూడా డబ్బు సంపాదిస్తూ, తన గోల్ చేరడం కోసం ఏమాత్రం అప్పు చేయకుండా డబ్బు సంపాదించి, ఒక చిన్న సొంత గూడు తల్లిదండ్రులకు కొనగలిగింది, వాళ్ల పేరు మీద.


స్త్రీ స్వాతంత్ర్యంతో నేటి ఆధునిక పోకడల వేలం వెర్రిలో కొట్టుకుపోతున్న చాలామంది అమ్మాయిల ముందు వెలుగు దివ్వెలా ఉన్నట్టు అనిపించింది ఆమె తల్లిదండ్రులకు.


ఐదు సంవత్సరాలు గడిచాక ఒకరోజు తన బ్యాగ్‌తో పెళ్ళికొడుకుల ఫోటోలు పట్టుకొని మళ్లీ దిగాడు ఆ ఇంట్లో కమలిని బాబాయ్ వెంకటసచ్చిదానందం.


''క్షమించు, బాబాయ్. నాకంటూ నేను కొన్ని జీవిత నిర్ణయాలను ఏర్పాటు చేసుకుని, ఇప్పటి సమాజ వికృత పోకడలలో మునిగిపోకుండా బ్రతకాలని ఐదు సంవత్సరాల క్రితం నిన్ను బాధపెట్టి పంపించేశాను కదా. ఇప్పుడు నువ్వు ఎవరిని చెప్తే వాళ్లని పెళ్లి చేసుకుంటాను, బాబాయ్. ఎందుకంటే పెద్దవాళ్లు మా శ్రేయస్సు కోరే కదా చెప్తుంటారు!'' అంటూ ఒంగి బాబాయ్ కాళ్లకు నమస్కరించింది.


అనుకున్నట్టు అంతా సవ్యంగా జరగడంతో, రంగరాజపురం వారి సంబంధంతో రెండు నెలలలో కమలిని పెళ్లి అయిపోయింది.


భర్త ప్రద్యుమ్న సాఫ్ట్‌వేర్ ఇంజనీర్. మంచివాడు.


అత్త మామలు ఇంకా మంచివాళ్ళు. అలా మెట్టినింట్లో అడుగు పెట్టిన కమలిని ఆనందంగా జీవితం కొనసాగిస్తుంది.


"నా జీవితంలోకి నీ రాకతో నేను శిఖరం ఎక్కినంత ఆనందం అనుభవిస్తున్నాను, కమలిని. ముఖ్యంగా ఎప్పుడూ అనారోగ్యంతో ఉండే అమ్మానాన్న. వాళ్లకు నువ్వు అందిస్తున్న సేవలతో ఇప్పుడు చిన్న పిల్లల్లా తిరుగుతున్నారు. థాంక్స్!'' అని భర్త తనను తరచూ పొగుడుతుండడంతో, కమలిని కూడా జీవితంలో ఏదో సాధించిన అనుభూతికి లోనవుతూ, ఆ ఆనందం అనుభవిస్తుంది.


సరదాలు, సంతోషాలు, పండుగలు, సినిమాలు, ఎగ్జిబిషన్లు, యాత్రలు... కమలిని జీవితం ఆనందంగా గడిచిపోయింది ఒక సంవత్సరం.


ఇంకా ఉంది

గుండె నిబ్బరం కలిగిన స్త్రీ మూర్తి: పెద్ద కథ రెండవ భాగం త్వరలో


**

నల్లబాటి రాఘవేంద్ర రావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.







రచయిత పరిచయం: నల్లబాటి రాఘవేంద్ర రావు


30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.


ముందుగా  " మన తెలుగు కథలు"  నిర్వాహకులకు నమస్సులు..

"రచయిత పరిచయం"..... ఇది చాలా ముఖ్యం.

రచయిత తన  గొప్పలు చెప్పుకోవడం కాదు గాని తన గతచరిత్ర వివరాలు అందరికీ తెలియ చేయటం అవసరమే. ఈ చర్య ఆ రచయితకు మానసికంగా ఎంతగానో ఉపయోగపడి అతను మరిన్ని మంచి మంచి రచనలు చేసి సమాజానికి అందించే అవకాశం ఉంది.. ఎంతో పెద్ద ఆలోచనతో అలాంటి 'మహా ప్రయత్నం'.. చేస్తున్న 'మన తెలుగు కథలు' కు మరొక్కసారి అభినందనలు.

పునాది....

-----------

ఏడు సంవత్సరాలు వయసు నాది. మా తండ్రి సుబ్బారావు గారు  ప్రోత్సాహంతో శ్రీ కృష్ణార్జున యుద్ధం అనే 10 నిమిషాల నాటకాన్ని నేనే రాసి కృష్ణుడి వేషం  నేనే వేసి దర్శకత్వం నేనే చేసి పెద్ద స్టేజి మీద  దసరా నవరాత్రులకు ప్రదర్శించాము.


ఆ తర్వాత భక్త ప్రహ్లాద లో ప్రహ్లాదుడు గా.. మరో నాటకంలో శ్రీరాముడుగా..   రచన దర్శకత్వం నాదే.. ఏడు సంవత్సరాల వయస్సు.


తర్వాత పదిహేను సంవత్సరాల వయసులో

టెన్త్ క్లాస్ యానివర్సరీ కి  15 మంది నటులతో నా దర్శకత్వం లో పెద్ద స్టేజి మీద నాటకం వేసాము.

అప్పుడే నేను రచయితను కావాలన్న

ఆశయం   మొగ్గ తొడిగింది.

నా గురించి..

---------------

50 సంవత్సరాల సుదీర్ఘ సాహితీ ప్రయాణం.

450  ప్రచురిత కథల రచన అనుభవం.

200 గేయాలు  నా కలం నుండి జాలువారాయి

200 కవితలు నా మేధస్సు నుండి ఉద్భవించాయి

20 రేడియో నాటికలు ప్రసారం.

10 టెలీఫిల్మ్ ల నిర్మాణం.

200 కామెడీ షార్ట్ స్కిట్స్

3  నవలలు దినపత్రికలలో


" దీపావళి జ్యోతి "అవార్డు,

"రైజింగ్స్టార్" అవార్డు

" తిలక్ స్మారక" అవార్డు... మరికొన్ని అవార్డులు.


ప్రస్తుత ట్రెండ్ అయిన  ఫేస్బుక్ లో  ముఖ్యమైన 15 గ్రూపుల్లో... ఇంకా అనేక వెబ్ సైట్లు, బ్లాగులు,ఆన్లైన్ పత్రికలలో యాక్టివ్ గా తరచు  నాకథలు,  కవితలు,గేయాలు, ముఖ్యంగా కామెడీ షార్ట్ స్కిట్స్ ప్రతి రోజూ దర్శనమిస్తూ ఉంటాయి..

రమారమి 75 అవార్డులు, రివార్డులు అందు కున్నాను... అని గర్వంగా చెప్పుకునే అవకాశం  కలగటం... ఆ చదువులతల్లి అనుగ్రహమే!

ఇదంతా ఒక్కసారిగా  మననం చేసుకుంటే...  'పడని సముద్ర కెరటం' లా... నూతనశక్తి మళ్లీ పుంజుకుంది.

ఇక నా విజయ ప్రయాణగాధ....

------+------------------------------

పేపర్లెస్ రచయితగా... ఒక కుగ్రామం లో పేరు ప్రఖ్యాతులు పొందిన  నా తండ్రి సుబ్బారావు గారు నా ఆలోచనలకు, రచనలకు ప్రాణప్రతిష్ట చేసిన ప్రథమగురువు. తల్లి వీరభద్రమ్మ  నాకే కాదు నా కథలకూ ప్రాణదాతే!!


తదుపరి రమారమి 50 సంవత్సరాల క్రితమే.. మా ఊరివాడైన నా జూనియర్ క్లాస్మేట్... నా స్నేహితుడు ఇప్పటి సినీ దర్శకుడు " వంశీ "... కథలు రాస్తూ...   నన్ను కూడా కథలు రాయ మని... చెప్తుండేవాడు. అప్పటి నుండి  ఎక్కువగా రాయడం మొదలు పెట్టాను.ఆ తర్వాత మా ఊరి  వారైన  సినీ గేయరచయిత

" అదృష్టదీపక్".. నా కథలు.. చదివి.. మెచ్చు కునే వారు.. దాంతో ఇంకా విరవిగా కథలు రాయడం మొదలు పెట్టాను.


1. మొదటి రచన 1975 నాటి ప్రఖ్యాత పత్రిక "ఆంధ్రసచిత్రవారపత్రిక" లో బుద్ధిలేనిమనిషి  కథ.


2. రేడియో నాటికలు  గొల్లపూడి మారుతీ రావు    గారి సమకాలంలో విరవిగా వచ్చాయి.


3. సినిమాకథలపోటీ లో అలనాటి "విజయచిత్ర"  ద్వితీయబహుమతి కథ..  "డిసెంబర్ 31 రాత్రి"


4. ఉగాది కథలపోటీ "ఆంధ్రభూమి" బహుమతి కథ


5. ఉగాది కథల పోటీలో "ఆంద్రజ్యోతి" బహు మతి కథ


6.  దీపావళి కథలు పోటీలో  "ఆంధ్రజ్యోతి" బహుమతి కథ.


7. అప్పాజోస్యుల( అమెరికా) నిర్వహించిన కథల పోటీలో "నలుగురితో నారాయణ".. ఆంధ్రప్రభ విశిష్ట కథ ప్రచురణ


8. అల్లూరి స్మారక జయంతి "కళావేదిక " కరప తిలక్ స్మారక అవార్డు కథ " బ్రతుకు జీవుడా"


9. "స్వాతి "   తానా అమెరికా కథల పోటీలో ప్రచురణ కు ఎన్నికైన కథ..." వైష్ణవమాయ."


10. రాష్ట్రస్థాయి కథలపోటీ హైదరాబాద్  "నిమ్స్"ద్వితీయ బహుమతి కథ..న్యాయనిర్ణేత శ్రీమతి యద్దనపూడి సులోచనారాణి." బంగారు పేకమేడ"


11. "అనిల్ అవార్డ్" స్వాతి కన్సోలేషన్ బహు మతి..." అమృతం  కురిసింది"


12. సస్పెన్స్ కథల పోటీ "స్వాతి" లో ఎన్నికైన కథ


13. "పులికంటి సాహితీ సంస్థ" రాష్ట్రస్థాయి పోటీలకు ఎన్నికైన కథ..


14. రాష్ట్రస్థాయి కథలపోటీ "ఆరాధన" హైదరా బాద్ ద్వితీయ బహుమతి కథ.." అదిగో స్వర్ణ యుగం"  న్యాయనిర్ణేత   జ్ఞానపీఠ అవార్డు గ్రహీత.. శ్రీ రావూరి భరద్వాజ గారు.


15. "అభ్యుదయ ఫౌండేషన్" కాకినాడ రాష్ట్ర స్థాయి అత్యుత్తమ కథ.. " ఐదేళ్ల క్రితం " .


16. సి.పి.బ్రౌన్ "సాహితీ స్రవంతి".. ప్రత్యేక కథ

" ఇంద్రలోకం".


17.  కొమ్మూరి సాంబశివరావు స్మారక  సస్పెన్సు కథల పోటీలో  "నవ్య' ప్రచురణకు ఎన్నికైన కథ.


18. "వేలూరు పాణిగ్రహి" విజయవాడ "  గాంధీ తాత"  రాష్ట్రస్థాయి ద్వితీయ బహుమతి కథ.


19. 'కదలిక'... సర్వశిక్షఅభియాన్  రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో నిర్మింపబడిన అత్యున్నత టెలీ ఫిల్మ్... చిన్న సినిమా.


20. "అల కమ్యూనికేషన్" హైదరాబాద్ కథల పోటీలో ఎంపికైన కథ...." హృదయానికి శిక్ష".


21. రాష్ట్రస్థాయి కథలపోటీ "మైత్రేయ కళాసమితి" మెదక్.. పుస్తక సంకలనానికి ఎన్నికైన కథ. "బిందెడు నీళ్లు".


22. రాష్ట్ర స్థాయి కథల పోటీలు "జాగృతి" కన్సోలేషన్ బహుమతి  కథ "ఆలస్యం అమృతం విషం"


23. రాష్ట్రస్థాయి దీపావళి కథల పోటీ  "ఆంధ్ర ప్రదేశ్" పత్రిక ప్రత్యేక బహుమతి హాస్య కథ.


24. రాష్ట్రస్థాయి దీపావళి కథల పోటీ "ఆంధ్రప్రభ" ప్రచురణకు ఎంపికైన కథ.


25. దీపావళి కథల పోటీ "ఆంధ్రభూమి" ప్రచురణ కు ఎన్నికైన కథ.


26.  రాష్ట్రస్థాయికథల పోటీ "ఆప్కో ఫ్యాబ్రిక్స్" హైదరాబాద్ నిర్వహణ  పోటీ లో ఎన్నికైన కథ.


27. రాష్ట్రస్థాయి కథలపోటీ "ఆంధ్రప్రదేశ్పత్రిక" కు ఎన్నికైన హాస్యకథలు." చంద్రమండలంలో స్థలమును అమ్మబడును".


28.దీపావళి కథల పోటీ "జాగృతి" పత్రిక కు ఎన్నికైన కథ.


29. "హాస్యానందం" విశేష స్కిట్స్ కొరకు.. "రైజింగ్ స్టార్".. అవార్డు.


30 ఆంధ్రజ్యోతి "భావ తరంగం"  వారం వారం 30 కథలు.


31. "కళా దర్బార్"  రాజమండ్రి.. రాష్ట్రస్థాయి  కవితలపోటీలలు... 4 సంవత్సరాలు ఉత్తమ  కవిత్వానికి ప్రథమ బహుమతి...మూడుసార్లు.. ఉత్తమ కవిత్వానికి ద్వితీయ బహుమతి.


32.."హాసం" మాస పత్రిక లో ప్రచురింపబడిన  "చిరాకు దంపతులు చింతకాయ పచ్చడి"    కథ చదివిన చాలా మంది సినీ ప్రముఖులు  ఫోన్ కాల్స్ చేసి అభినందించడం.


33. ప్రఖ్యాత సిరివెన్నెల పత్రికలో  సిరివెన్నెల సీతా రామశాస్త్రి గారి నిర్వహణలో జానపద పాటల పోటీలో  ప్రథమ బహుమతి  పాటకు వారి నుండి  పత్రికాముఖంగా ప్రత్యేక ప్రశం సలు.. తదుపరి ఆ పాట అనేక   రంగస్థల ప్రదర్శనలు పొందడం.


34. విశేష కథలుగా  పేరు ప్రఖ్యాతులు తెచ్చిన కథలు

  నలుగురితోనారాయణ

  కొరడా దెబ్బలు

  అమృతం  కురిసింది.

  వైష్ణవమాయ

  ఐదేళ్ల క్రితం

  ఇంద్రలోకం

  బిందెడు నీళ్లు

  చంద్రమండలంలో స్థలములు అమ్మబడును

  డిసెంబర్ 31 రాత్రి

  మహాపాపాత్ముడు

 

35. రాజమండ్రి ,కాకినాడ ,విజయవాడ, విశాఖ పట్నం ,రామచంద్రపురంలో.. విశేష సన్మానాలు.


ప్రస్తుతం...


1. ఒక పరిశోధన నవల.. ఒక చారిత్రక నవల రాసే ప్రయత్నం


2. పరిషత్ నాటికలు జడ్జిగా..


3.  కొందరు సినీప్రముఖుల ప్రోత్సాహంతో..

సినిమాలకు కథ మాటలు స్క్రీన్ప్లే అందించే ప్రయత్నం.


4. ..  4 కథల సంపుటిలు... రెండు కవితా సంపుటిలు.. 1గేయ సంపుటి.. 2 కామెడీ షార్ట్ స్కిట్స్.. రెండు నాటికల సంపుటిలు..ఒక నవల ప్రచురణ తీసుకొచ్చే ప్రయత్నం.


5. ఒక ప్రింటెడ్ పత్రిక  ప్రారంభించే ఉద్దేశ్యం.


భార్య.. గోవిందీశ్వరి... హౌస్ వైఫ్.

కుమారుడు... వెంకట రామకృష్ణ .. బి.టెక్ సాఫ్ట్వేర్ ఇంజనీర్... మైక్రోసాఫ్ట్.. హైదరాబాద్.

కోడలు... మాధురీ లత..... ఎం ఫార్మసీ.

కుమార్తె.. సౌభాగ్య.. స్టూడెంట్.

మనుమరాలు.. ఆద్య... యాక్టివ్ బేబీ.

నా కథలను ఆదరించి తమ అమూల్య అభి ప్రాయాలు తెలియజేస్తున్న... రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలందరికీ... వినమ్ర నమస్సులు.

నల్లబాటి రాఘవేంద్ర రావు 


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page