'Adibhatla Narayana Dasu' - New Telugu Story Written By Jeedigunta Srinivasa Rao
Published In manatelugukathalu.com On 21/06/2024
(కవులను గూర్చిన కథలు - పార్ట్ 10)
'ఆదిభట్ల నారాయణ దాసు' తెలుగు కథ
రచన : జీడిగుంట శ్రీనివాసరావు
(ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత)
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
శతావధాన కవిత్వలలో తిరుపతి వెంకట కవులు ఎంత కీర్తి సంపాదించారో, హారికథల తో ఆదిభట్ల నారాయణ దాసు అంత పేరు సంపాందించాడు. ఈ నాడు కవిత్వం చెప్పే ప్రతీవాడు వెంకట శాస్త్రి గారి శిష్యుడే. ఆదిభట్ల నారాయణ దాసు విజయనగరం, మైసూర్, బొబ్బిలి మొదలైన సంస్థాలన్నిటిలో హారికధలు చెప్పి, ఘనమైన సన్మానాలు పొందాడు. ఆయన వ్రాసిన " జానకీ పరిణయం హరికథ " కావ్య గౌరవన్ని అందుకుంది.
ఆయన, అయన శిష్యులూ హారికథలతో ఆంధ్రదేశం ని భక్తిపారవశ్యం లో ముంచెత్తారు. ఆయన మరణానంతరం హారికధ చెప్పడం సులభమైన జీవనోపాయమని శబ్దదోచరణ సరిగ్గా తెలియని వాళ్ళు కూడా దీనికి ఎగబడి హారికథ యొక్క పరువు చెడగొట్టారు. హారికథ పోయి, కాంగ్రెస్ కథ, కమ్యూనిస్ట్ కథ, వెంకయ్య కథ చెప్పినట్టి బుర్రకథ గా మారి, చివరకు ఈ కళ రూపుమాసి పోయే స్థితికి వచ్చింది.
ఆదిభట్ల నారాయణ దాసు చిన్నతనంలోనే అద్భుతమైన తెలివితేటలు ప్రదర్శించాడు. ఐదేళ్ళప్పుడు తల్లీ తీర్ధానికి తీసుకుని వెళ్ళింది. అక్కడ ఒక పుస్తకాల కొట్టు దగ్గర యితడు భాగవతం కావాలి అని మారం చేసాడు. షాప్ యజమాని వేళాకోళం కి " నువ్వు చదువగలిగితే వూరికే యిచ్చేస్తా " అన్నాడు.
దాసు ఆ పుస్తకం తీసుకుని మూడు ఘట్టాలు ఏకబిగిన రాగ ధోరణిలో చదివి వినిపించాడు. షావుకారు సంతోషించి, ఆ పుస్తకం, అయిదు రూపాయలు బహుమతి యిచ్చాడు.
ఒకసారి తిరుపతి వెంకట కవులు ఈయనని " నీ కాలికి కడియం ఎలావచ్చింది" అని అడిగారు.
ఆదిభట్ల నారాయణ దాసు తడువుకోకుండా "తిరుపతి వెంకటేశ్వరులకు మొక్కుకున్నాను" అని జవాబు యిచ్చాడు.
"మీకు నమస్కారం నా జోలికి రాకండి" అని అర్ధం అందులో యిమిడి ఉండటం ఆ జంట కవులు గ్రహించి ఎంతో సంతోషించారు.
ఒక ఊరులో దాసుగారి హారికథ అని వేలాది జనం వచ్చి చేరారు. దాసుగారు రాత్రి పది తరువాత త్రాగి తూలుతో వేదిక మీదకి వచ్చి "ఏరా! మీకు హారికథ కావాలా? గిరి కథ కావాలా?" అని అడిగారు.
జనంలోనుండి ఓ పెంకె ఘటం "గిరి కథ" కావాలి అని అరిచాడుట.
దాసు గారు వెంటనే గంభీరస్వరంతో అశువుగా హిమవంతుడు తన కుమార్తె పార్వతిని శివునికిచ్చి వివాహం చేసిన కథ "పార్వతీ పరిణియం" చెప్పి, జనంని ఆశ్చర్యoలో ఓలలాడించారు. ఆయన ప్రతిభ అట్టిది. ఆయనకు తెలుగంటే అమితమైన యిష్టం.
ఒక చోట "మొలక లేతదనము, తలిరుల నవకంబు మొగ్గ సోగదనము, పూవు తావి తేనె తీయదనము, తెనుగునకే కాక పరుష సంస్కృతాఖ్య బాష కేది?" అన్నాడు.
ఆయన "ఉమరు ఖాయ్యం” రచనను అచ్చ తెలుగులోకి అనువదించాడు.
ఆయన మహా భక్తుడు. గొప్ప సంగీత విధ్వాంసుడు. త్యాగరాజు జయంతి నాడే మరణించి కారణజన్ముడని నిరూపించుకున్నాడు.
కొందరు అజ్ఞాత కవులు
================
నూజీవిడు సంస్థానము నేలిన నరసింహాప్పారావు ధర్మాదాత, తన రాజ్యంలో పశువులు దోమల బాధకు తట్టుకోలేకుండా ఉన్నాయని తెలిసి, రోడ్లు పొడుగునా స్థంభాలు పాతించాడు. పశువులు వాటిని రాచుకుని తమ దురద పోగొట్టుకునేవి. బాటసారులు తమ బరువులు దింపుకుని శ్రమ పోగుట్టుకునే నిమిత్తం మార్గాలలో రాతి అరుగులు కట్టించాడు. కొల్లేటిలో నక్కలు చలిబాధకు తట్టుకోలేక కూస్తున్నాయని మంత్రులు చెబితే, వాటన్నిటికీ కంబళ్ళు కప్పించాడు.
బైరాగులకు విరివిగా గంజాయి యిచ్చే ఏర్పాట్లు చేసాడు. ఆశ్రయించిన కవులకు అగ్రహారాలిచ్చాడు. ఆ రోజులలో అడగని వాడిది పాపం. ఈనాటికి బెజవాడ నుండి వారణాసి వరకు బైరాగులు "దునియామే నహి యప్పారావు హమకో దూస్రా" అని పాడుతూ వుంటారు.
అంతులేని దానధర్మాలవలన ఖాజాణా ఖాళీ అయి మంత్రులకు భయం పుట్టి యాచకులకు, కవులకు రాజదర్శనం కాకుండా ద్వారపాలకులను కట్టడి చేసారు. రాజుగారు షికారు వెళ్ళేటప్పుడు కూడా ఆయన సవారీ తలుపులు బిగించే వారు. ఆ పరిస్థితులలో ఒక కవీశ్వరుడు రాజ దర్శనం కోసం నూజివీడు వచ్చాడు. ద్వారపాలకులు ఆయనని తరిమివేసారు. ఒక పెదరాశి పెద్దమ్మ యింటిలో మాకాం వేసాడు. ఆమె అసలు సంగతి చెప్పింది. కవికి ఎలాగైనా రాజదర్శనం చేసి తీరాలని పట్టుదల కలిగింది.
సమయం కోసం నిరీక్షణ చేసి ఒకరోజు రాజుగారు షికారు కి వచ్చే సమయంలో ఒక చెట్టుక్రింద నిలబడ్డాడు. రాజుగారి సవారి చెట్టును సమిపించింది. తలుపులన్నీ మూసి వున్నాయి.కవీశ్వరుడు బిగ్గరగా "వెలమ కులంబునందు నిలు వెళ్లరు కాంతలనంగ విందు, నప్పలుకు లబద్ధమాయె"అని చదివి ఊరుకున్నాడు.
యిది రాజుగారు విన్నారు. ఆయన ఒళ్ళు మండిపోయి, ఎవడో తన కులాన్ని అవమానిస్తున్నాడని "సవారీ ఆపు" అని అరిచారు. బోయిలు భయపడి సవారీ ఆపి, తలుపులు తెరిచారు. ప్రభువు ఒక్కసారిగా బయటకి వురికి, ఎవ్వరిప్పుడు "వెలమ కులంబునందు" అని చదివినది? అని ఆడిగాడు.
అందుకే కనిపెట్టుకుని వున్న కవీశ్వరుడు ముందుకు వచ్చి "ప్రభూ! ఆ చదివినది నేనే. అందులో అసత్యం ఏమి లేదు” అని
"వెలమ కులంబునందు నిలు వెళ్లరు కాంతలనంగ విందు, నప్పలుకు లబద్ధమాయె జనపాల శిఖామణి యప్పరాయ రాట్కలభవు గీర్తికాంత జయకాంత మహిం గృతికాంత మువ్వురుంగల జగమెల్లయుం దిరుగగా గనుగొంటిమి చిత్ర మిద్దరిన్."
పద్యం చెప్పాడు.
ప్రభువు కన్నులలోని కెంపులు నశించి, మల్లెలు వికసించాయి. కవి చమత్కరానికి పట్టలేని సంతోషం కలిగి "ముందు నన్నెందుకు రెచ్చగొట్టావు " అని అడిగాడు.
కవి "మంత్రులు తమ దర్శనం కాకుండా కట్టడి చేసారు, అందుకే ఈ ఉపాయం పన్నవలసి వచ్చింది, మన్నించండి” అని వేడుకున్నాడు.
ప్రభువు మర్నాటి సభకి ఆ కవిని రప్పించి, ఆయన వ్రాసిన కావ్యమంకితం తీసుకుని, ఒక అగ్రహారం యిచ్చి పంపించాడు.
2) నారయ్యప్పారావుగారి సంస్థానంలో జమాబందీ నిమిత్తం కరణాలు నూజివీడు వచ్చి ఉద్యోగుల అశ్రద్ధ వలన నెలలతరబడి అక్కడే వుండవలిసి వచ్చేదిట. ఒకరోజు ప్రభువు కరణాల సత్రవుకు వచ్చి మీకీక్కడ సుఖంగా వుందా? అని అడిగాడుట.
అప్పుడు ఒక కరణం గారు
"శీత జల స్నానంబునుభూతల శయనంబు నొంటి పూ టశనంబున్నాతి గల బ్రహ్మచర్యమునా తరమా! పూట గడప నారయ ధూపా!”
అన్నాడుట.
తాత్పర్యం.... ‘ప్రతి రోజూ చన్నీళ్ల స్నానం, కటిక నేల మీద పడుకోవడం, ఒంటిపూట భోజనం, యింటి దగ్గర భార్య వున్నా యిక్కడ బలవంతపు బ్రహ్మచర్యం ఇది నా వల్ల కాదు నారాయప్పాగారు’.
కరణాలు పడుతున్న బాధలు గుర్తించి, నొచ్చుకుని, ఉద్యోగస్థులని తొందరపెట్టి జమాబంధీ పూర్తి చేయించి ఎవరి యిళ్లకు వాళ్ళను పంపించారుట.
3) పెద్దాపురం సంస్థాన మేలిన తిమ్మగజపతిని, ప్రజలు లోభి అనీ, ఎవ్వరికీ ఏమి ఇవ్వడని చెప్పుకునే వారు. ఒక కవి ఆయన దగ్గరికి వెళ్లి
"ఇవ్వడు, యివ్వడంచు జనులెప్పుడు తప్పక చెప్పుచుందురేమివ్వడు, యన్యక్రాంత కురమివ్వడు, సంగర రంగమందు వెన్నివ్వడు, శత్రుల నృబ్బల నివ్వడు, బెబ్బులినైన బట్టి పోనివ్వ డసత్య వాక్యమెపు డివ్వడు, తిమ్మ జగత్పతీంద్రుడే " అని పొగిడాడు.
రాజు కవి చమత్కారంకి, తనను పొగిడినందుకు సంతోషించి ఘనంగా బహుకరించాడు.
4) పెద్దాపురం సంస్థానలో ప్రకాశరాయుడనే మంత్రి వుండేవాడు. ఆయన కవులను చేరనిచ్చేవాడు కాదు. పైగా యిదివరకు కవులకిచ్చిన అగ్రహారాల మీద, యీనాముల మీద పన్నులు వేసి, యిచ్చుకోలేకపోతే నానా బాధలు పెట్టేవాడు. ఈ బాధలకు గురిఅయి ప్రాణం విసుగెత్తి ఒక కవీశ్వరుడు ఈ క్రింద పద్యం చెప్పాడు.
"ఇరువది చేతులం దలలు నెక్కువ తక్కువ యంతే కాని వీడరయగ రావణాసురుని యంతటివాడు, ప్రకాశరాయు డీశ్వర పద భక్తిన్ సమర శక్తికి ధర్మముపై విరక్తికిన్బర వనితాను రక్తికిని బ్రాహ్మణు సొమ్ము హరించు యుక్తికిన్
అర్ధం :- ఈ ప్రకాశరాయుడికి యిరవై చేతులు, పది తలలు లేవు కాని మిగిలిన గుణాలన్నిటిలోనూ రావణాసురుడంతటి వాడు. ఆ మిగిలిన గుణాలు ఏమిటంటే, శివభక్తి, యుద్ధశక్తి, ధర్మం మీద విరక్తి, పర స్త్రీల మీద ఆసక్తి, బ్రాహ్మణుల సొమ్ము కాజేయడంలో యుక్తి.
5) లక్ష్మి సరస్వతులు అత్తాకోడళ్ళు అని, వాళ్లిద్దరూ ఒకచోట ఉండరనీ వాడుక, సాధారణముగా మన కవులలో నూటికి తొంబైమంది దరిద్రులే. పూర్వమేమోగాని ఈనాడు సాహిత్యం, చిత్రలేఖనం వంటి కళలెవ్వరికితిండి పెట్టడంలేదు. పూర్వం రాజులు, జమీందారులు కళలను పోషించేవారు. ఈనాడు వారు అంతరించారు. ప్రజలకు తిండి మీద ధ్యాస ఉన్నతమైనా విలువలమీద లేదు.
ఒక కవి తన దారిద్రాయాన్ని గురించి శివుడికి ఈవిధంగా మోరపెట్టుకున్నాడు.
"సాంబ గరాశ దిగంబరడంబుగ నిన్నాశ్రయించుటం జేసీ కదాయాంబళు లన్నము లయ్యేన్కంబళు లంబరము లయ్యే గవిరాజులకున్ "
తా! ఓ శివుడా! నువ్వు విషం తింటావు, బట్టకట్టుకోవు, నిన్ను సేవించుట చేత, మాకు భోజనానికి అంబళ్ళు, కట్టుకోవడానికి కంభళ్ళు దొరుకుతున్నాయి, నిన్నాశ్రయించటం వల్ల మేము కూటికి, గుడ్డకు మొగం వాచిపోయాము.
మరో కవి, కృష్ణంరాజు అన్న ప్రభువు దగ్గరకు వెళ్లి తన గోడు యిలా వెళ్ళబోసుకున్నాడు.
"గురువుల రాక దాసి మృతి, గుఱ్ఱపు దాడియు నల్లు డల్కయున్వరసతి గర్భవేదన, వివాహము, విత్తులు జల్లు కార్తియున్పొరుగున నప్పు బాధ, చెవిపోటును, వీధిని దొమ్మరాటయన్గరువు దరిద్ర మాబ్దికము, కలిగే నొకప్పుడు కృష్ణ భువరా "తా :- గురువులు వచ్చారు, ఆయన కోసంఏర్పాట్లు చెయ్యాలి. అప్పుడే యింట్లో పనిచేసే దాసీ చచ్చిపోయింది. ఊరు మీద దోచుకోవడానికి గుఱ్ఱపు దండు వచ్చిపడింది, యింట్లో అల్లుడు అలిగి కూర్చున్నాడు. ఒకప్రక్క భార్య ప్రసవవేదన పడుతోంది, కూతురి పెళ్లి ముహూర్తం ఆనాడే. విత్తనాలు చాల్లే కార్తి కూడా వచ్చిపడింది. పొరుగువాళ్ళు అప్పు తీర్చమని సతాయిస్తున్నారు. చెవిపోటు మొదలుపెట్టింది, వీధిలో దొమ్మరి వాళ్ళు అట మొదలుపెట్టి చెవులు పగిలేడట్లు డోలు వాయిస్తున్నారు, దేశంలో కరువు, యింటిలో దరిద్రం, పైగా తద్దినమొకటి. ఏం చెప్పను నాస్థితి కృష్ణ భూవరా.
ఈనాడు మధ్యతరగతి వాళ్ళ స్థితి యిలాగే వుంది.
6) ఒక కవిశ్వరుడు ఒకసారి బంధువుల యింటికి చుట్టపు చూపుగా వెళ్ళాడు. ఆరాత్రి ఆయన పడుకోవడానికి ఒక నులక మంచం వేసారు.
దైవప్రార్దన చేసి నడుము వాల్చాడు. చిట్టుక్కుమని పొడిచింది. అమ్మా అంటూ ఒత్తిగిల్లాడు. వీపు మీద ఒకటి కుట్టింది. కాలి మీద ఒకటి కరిచింది. లేచి చూస్తే పక్కమీద నువ్వులు చెల్లినట్టు నల్లులు పాకుతున్నాయి. కసితీరా కొన్నిటిని చంపాడు. కాని యింకా కావలసినన్ని ఉన్నాయి. చేసేది లేక నెల మీద పడుకుని ఈ పద్యం చెప్పాడు.
"శివు డద్రిని వసించుటరవి చంద్రులు మింటనుంట రాజీవాక్షుoడవిరళ సముద్రమందునబవలించుట నల్లిబాధ పడలేక సుమీ "
తా :- శివుడు కైలాస పర్వతం మీద కాపురం ఉండటం, సూర్యచంద్రులు ఆకాశం మీద మకాం పెట్టడం, విష్ణు మూర్తి సముద్రంలో పడుకోవడం, నల్లి బాధ పడలేకనే సుమా.
శుభం.
చివరిది, 10 వ భాగం - సమాప్తం
(ఆధారం మా తండ్రిగారు శ్రీ జీడిగుంట రాఘవేంద్ర రావు గారి రచన
-- శ్రీనివాసరావు జీడిగుంట)
జీడిగుంట శ్రీనివాసరావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ జీడిగుంట శ్రీనివాసరావు గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత పరిచయం:
నా పేరు జీడిగుంట శ్రీనివాసరావు. నేను గవర్నమెంట్ జాబ్ చేసి రిటైర్ అయినాను. నేను రాసిన కథలు అన్నీ మన తెలుగు కథలు లో ప్రచురించినందులకు ఎడిటర్ గారికి కృతజ్ఞతలు.
30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.
Comments