top of page
Writer's pictureSrinivasarao Jeedigunta

 సి. పి. బ్రౌన్ దొర


'C. P. Brown Dora' - New Telugu Story Written By Jeedigunta Srinivasa Rao

Published In manatelugukathalu.com On 15/06/2024

(కవులను గూర్చిన కథలు - పార్ట్ 9)

'సి. పి. బ్రౌన్ దొర' తెలుగు కథ

రచన : జీడిగుంట శ్రీనివాసరావు

(ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత)

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్



1800 సంవత్సరం ప్రాంతంలో బందరు వగైరా ప్రదేశాలలో జిల్లా జడ్జిగా పనిచేసిన ఆంగ్లెయుడు. ఈయన కవి కాదు. కాని ఈయన తెలుగు నేర్చుకుని, తెలుగు కవిత్వం లో అభిరుచి పెంచుకుని, మూల మూలలనున్న తెలుగు పుస్తకాల్ని బయటకు తెప్పించి, సంస్కరించి, ప్రచురించి ఉండకపోతే ఈనాడు మనకున్న సాహిత్య సంపాదలోని విశేషభాగం నష్టం అయిపోయి వుండేది. ఆనాటి ప్రభువులకు సాహిత్యం అందు అభిలాష లేదు.


ఈయనకు భారత, భాగవతాలలో గల పరిచయాన్ని ఈ క్రింది కథ తెలియచేస్తుంది. దరిద్రం చేత దీనావస్థలో వున్న ఒక ఆంధ్ర పండితుడు బ్రౌన్ దొర గారిని సహాయం చెయ్యమని ప్రాధేయపడుతూ వ్రాసిన అర్జీ ఈ క్రింద పద్యం లో ముగించాడు.


లావొక్కింతయు లేదు ధైర్యంబు విలోలంబయ్యే బ్రాణంబులున్

ఠావుల్ దప్పెను మూర్చ వచ్చే తనువులున్ డస్సెన్ శ్రమంబయ్యెడిన్

నీవే తప్ప నితః పరంబెరుగ మన్నింపన్ దగున్ దీనునిన్

రావే యీశ్వర కావవే వరద సంరక్షింపు భద్రాత్మకా!


యీ పద్యం పోతన భాగవతంలోని గజేంద్రమోక్షం ఘట్టం లోనిది. యీ దేశంలో మనుషులు అయినదానికి కానిదానికి అడ్డమైనవాడిని "నీవే తండ్రివి, నీవే భగవంతుడు వి అని దేబిరించడం ఎక్కువ" అని బ్రౌన్ గారు కోపగించుకుని, ఆ పండితుడికి కొంత డబ్బు పంపిస్తూ, యీ క్రింద పద్యం జవాబుగా రాసి పంపాడు.


 "ఏను మృతుండ నౌదునని యింత భయంబు మనంబు లోపలన్ 

 మానుము, సంభవంబు గల మానవ కోట్లకు జావు నిక్కంబు

 గాన హరిం దలంపుమిక గల్గదు జన్మము నీకు ధాత్రీపై 

 మానవనాధ పొందెదవు మాధవలోక నివాస సౌఖ్యముల్ "

ఈ పద్యం భాగవతంలోనిదే. యీ కథ ని బట్టి బ్రౌన్ దొర రసజ్ఞత తెలుస్తుంది.


తిరుపతి వేంకట కవులు 

 ======================


దివాకర్ల తిరుపతి శాస్త్రి, చెళ్ళపిళ్ళా వెంకటశాస్త్రి తిరుపతి వెంకట కవులు అయ్యారు. వారి పేర్లు కలిసినట్లే వారి హృదయాలు, వారి కవిత్వాలు కలిసి ఆంధ్రప్రదేశాన్ని రసప్రవాహంలో ముంచివేశాయి. యీ జంట కవులు రాజాప్రాసాదాలలోనూ, పండిత సభలలోనూ బంధికృతయై ఉన్న కవితా సరస్వతిని, పూలరధం మీద దేశదేశాలలోనూ ఊరేగించారు. ఆనాడు కవితాజ్యోతి పల్లెపట్టులలో కూడా ప్రజ్వలించింది.


వీరు సంస్కృతాంధ్రాలలో విశేష పాండిత్యం కలవారు. తిరుపతి శాస్త్రి పాండితీ ప్రతిభ, వెంకటశాస్త్రి అపూర్వ మేధాశక్తి కలిపి అద్భుతమైన కవితాప్రవాహం ఆవిర్భవించింది. ఆరోజులలో వీరు చూడని సభ లేదు, పొందని రాజగౌరవం లేదు. ఎరుగని కవితా రహస్యం లేదు. వీరు సర్వస్వతంత్రులు, నిరంకుశులు. ఎవ్వరిని లెక్కచేయ్యలేదు. " ఏనుగు నెక్కినాము, ధరణీంద్రులు మ్రోక్కగా నిక్కీనాము " అని స్వగరవంగా చెప్పుకున్నారు. ఒక శతావధాన సభలో ఎవరో " మీరు వైదికులై ఉండి కూడా మీసాలు పెంచారెందుకు "అని అడుగగా 


 "దోస మటం చెరింగియును దుందుడు కొప్పగా బెంచినార మీ 

 మీసము రెండు, బాసలకు, మేమే కవీంద్రుల మంచు దెల్పగా 

 రోసము కలిగ్గినన్ గవివరుల్ మము గెలువ్వుడు, గెల్చిరేని యీ 

 మీసము తీసి, మీ పద సమీపములందల లుంచి మ్రోక్కమే? "


అని సవాలు చేసారు. శ్రీనాధుని తర్వాత యింతటి స్వతంత్రులైన కవులు పుట్టలేదు. తిరుపతి శాస్త్రి 


 "లలిత కవితా విలాసిని వలపుసాని " అని 

 " వెలనాటి వాడ, కవితకు వెల నాటిన వాడ " ననీ వేంకట శాస్త్రి 


 "కవనార్ధంబు బుదయించితన్, సుకవితా కార్యంబె నా వృత్తి " అని సగర్వంగా చెప్పుకున్నారు. మెదడును కరిగించివేసే శతావధాన విద్యను, పరమాద్భుతముగా అనేకసారులు ప్రదర్శించి, అందులో వారికి వారే సాటి అనిపించుకున్నారు.


"ఒక్కరు రచించిరేని, నది కాదగు తిర్పతి వేంకటేయమై "


అని ప్రతిజ్జ చేసి, ఆ ప్రకారమే నడుచుకున్నారు. తిరుపతి శాస్త్రి మరణం తరువాత వెంకటశాస్త్రి వ్రాసిన పుస్తకాలు కూడా తిరుపతి వెంకటేశ్వర్లు పేరు మీదే ప్రకటింపబడడం ఆ కవుల మధ్య గల సౌభ్రాతృత్వాన్ని వెల్లడి చేస్తోంది. తిరుపతి శాస్త్రి స్మారకసభలో, వేంకట శాస్త్రి చదివిన 


 "నాకన్న ధీ బలమ్మన

 నే కాదు! తనూబలమున నెంతయు హెచ్చో 

 లోకాస్తుత్యుడు తిర్పతి 

 నాకన్నన్ మున్నే యెట్లు నాకము ముట్టెన్? "


తిరుపతి శాస్త్రి మరణం వల్ల ఆయన భార్య, నోరేరుగని పసిపిల్లలు దిక్కులేనివారయ్యారు. భూమి, పుట్రా ఏమీ లేవు. సంసారం గడవడం దుస్తరమయింది. అప్పుడు వేంకట శాస్త్రి చెలికాని లచ్చారావు జమీoదారు గారికి, 


 "దిక్కుల నెల్ల నాత్మ గురుతేజము నింపి దివాకరుండు తి 

 ర్యక్కుల కందరాని గగనాంతర సౌధపు చంద్రశాలపై 

 కెక్కెను, లచ్చరాయ " అని మొదలుపెట్టి తిరుపతి శాస్త్రి కుటుంబానికి సహాయం చేయవలసిందని కోరుతూ ఒక పెద్ద మాలిక వ్రాసి పంపించాడు. రసాహృదయుడు అయిన లచ్చారావు గారు, తిరుపతి శాస్త్రి కుటుంబానికి నెలకు నూరు రూపాయల చొప్పున పంపే ఏర్పాటు చేసాడు.


వేంకట శాస్త్రి తెలుగువారికి బెర్నాడుషా వంటివాడు. ఆయన సమయస్ఫూర్తి, హాస్యయుక్తి గా వుంటాయి. వెంకటశాస్త్రి, జంధ్యాలా గౌరీనాధ శాస్త్రి గారి యింటిలో పట్టుబట్ట కట్టుకుని భోజనం చేస్తుంటే, గౌరీనాధ శాస్త్రి గారు 


 "పట్టు బట్ట ఎంతకాలం దాకా మడి అండి" అని అడుగగా 


"చెమట కంపు కొట్టకుండా వుంటే, ఎంతకాలమైన మడే " అని టకీమని జవాబు చెప్పాడుట.


ఒకసారి వెంకటశాస్త్రి కాశీ సంతర్పణ చేస్తూ, ఒక పెద్ద ఉద్యోగిని భోజనానికి పిలిచాడుట. గర్విష్టి అయిన ఆ ఉద్యోగి 


 "మీది పెంకుటిల్లా, తాటకీల్లా?" అని అడిగాడుట.

వెంకటశాస్త్రి, "మాది పూరిల్లు" అనేసరికి, ఆ ఉద్యోగి తెల్లబోయాడుట.


మహా కవులయిన తిరుపతి వెంకటేశ్వరులు, అనవసరపు తగాదాలలో తగులుకుని, పది కాలాలు నిలబడే కావ్యాన్ని రాయలేకపోయారు. వారి " బుద్ధచరిత్రము " " దేవి భాగవతం " నిలబడతాయి అంటారు, కాని యీ నాటి స్థితిని బట్టి చెప్పడం కష్టం. శతావధానాలతో వారు కవిత్వన్ని చౌక చేసి, రాజవీధులలో తిప్పారు. అప్పటి నుండి కవిత్వం 


 " ఆకాశంబునుండి, శంభుని శిరంబందుండి " అన్నట్టుగా, యీ నాటికి చాకలి పద్దులు వేయడానికి, పెళ్లి శుభలేఖలు వ్రాయడానికి ఆ కవి పాటలను ఉపయోగింపబడే దుస్థితికి దిగజారింది. శాశ్వత సత్యాని, సుందరంగా నిరూపించి హృదయాలిని రాసార్థరాం చేసేది కవిత్వం. నిరక్షరాస్యులకు కూడా పనికిరావలనడం వెర్రితనం.


 నడిమింటి సర్వ మంగలేశ్వర శాస్త్రి.

 ======================


ఈయన విజయనగర సంస్థానంలో సంస్కృత కవీశ్వరుడు. మంత్రశాస్త్ర నిధి, శాపానుగ్రహ సమర్దుడు. బహు నిరంకుశుడు, స్వతంత్రుడు. మొదట ఈయన రాజదర్శనానికి వెళ్ళినప్పుడు, ఆ ప్రభువు ఈయనని " మీ యింటి పేరు ఏమిటి " అని ఆడిగాడు. ఈయన "నడిమింటి వారని " జవాబిచ్చాడు. ప్రభువు " యింటి పేరు యిలా వుందేమిటి " అని ఆశ్చర్యం వెలిబుచ్చాడు. ఈయన " పూసపాటి చెయ్యదా మహాప్రభూ " అని జవాబు యిచ్చాడు. విజయనగర ప్రభువుల యింటి పేరు " పూసపాటి ". యీ సమయోచితమైన పెంకి జవాబు కి రసజ్జనుడైన ప్రభువు సంతోషించి, ఈయనని అస్థాన కవిగా చేరుచుకున్నాడు.


ఈయనకు సమయస్ఫూర్తి హెచ్చు. ఒకసారి ఎవరో ఈయనని " కుక్క ఎడమ నుంచి వెళ్తే మంచిదా లేకపోతే కుడినుంచి వెళ్తే మంచిదా " అని అడగగా " కరవకుండా ఉంటే ఎటు వెళ్లినా మంచిదే " అని జవాబు యిచ్చాడుట. పూరీ జగన్నాధంలో స్వామి ప్రసాదం మర్రి ఆకులో పెట్టుకుని తింటూవుండగా, ఒక ఫండా " అయ్యా మర్రి ఆకు పై విష్ణుమూర్తి శయనించాడు, మీరు దానిలో ఫలహారం చేసి స్వామికి అపచారం చేస్తున్నారు" అన్నాడుట. ఈయన వెంటనే " మీరు అవతారలకు అవతారలే తినేస్తారే, అది అపచారం కాదు కాబోలు " అని హేళన చేసాడు. ఒరియా బ్రాహ్మణులు చేపలు తింటారు. విష్ణుమూర్తి మత్యావతారం మెత్తాడు కదా! యీ ఎదురు దెబ్బతో, ఆ ఫండాకు మొహం మాడింది.


శాస్త్రి గారు శాపానుగ్రహ సమర్థడు. ఈయన ఒక సత్రంలో బస చేస్తుండగా, ఒక మహ్మదీయ ఉద్యోగి ఈయన స్థలం ఆక్రమించి, పైగా అవమానం కూడా చేసాడు. అక్కడ వాళ్ళు ఈయన శాపమిస్తాడు జాగ్రత్త అని చెప్పగా, ఆ మహ్మదీయుడు, " యీ శాస్త్రి కాశీ వెళ్లే లోపు మేమే మర్గయా చేస్తాం " అన్నాడుట. అప్పుడు శాస్త్రి గారు


 "శీతలే! భూతలే యోమా! మధ్విష ద్దుర్జనోజన :

 పంచతా మంచతా చ్చీఘ్రo! స్ప్తోటకాత్ కీటకాకులాత్,


అని శపించాడు.


తాత్పర్యం... తల్లీ శీతలాదేవి వీడు నా మీద కక్ష కట్టాడు. కనుక వీడికి మసూచి వ్యాధి వచ్చి చచ్చేటట్లు చెయ్యి " 


ఆ మహ్మదీయుడు ఆ ప్రకారమే మరణించడం జరిగింది. ఈ నాటి నవనాగరికులు శాపాలు అంటే నమ్మరు. వారికి, ప్రతీదానికి శాస్త్రియా సమాధానం కావాలి.


 9 వ భాగం సమాప్తం. చివరిది 10 వ భాగం అతి త్వరలో.

(ఆధారం మా తండ్రిగారు శ్రీ జీడిగుంట రాఘవేంద్ర రావు గారి రచన

-- శ్రీనివాసరావు జీడిగుంట) 


జీడిగుంట శ్రీనివాసరావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ జీడిగుంట శ్రీనివాసరావు గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 


విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం:

నా పేరు జీడిగుంట శ్రీనివాసరావు. నేను గవర్నమెంట్ జాబ్ చేసి రిటైర్ అయినాను. నేను రాసిన కథలు అన్నీ మన తెలుగు కథలు లో ప్రచురించినందులకు ఎడిటర్ గారికి కృతజ్ఞతలు.


30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.










24 views0 comments

Comments


bottom of page