top of page

చిలక పెట్టిన చిచ్చు'Chilaka Pettina Chichhu' - New Telugu Story Written By Jeedigunta Srinivasa Rao

Published In manatelugukathalu.com On 06/06/2024

'చిలక పెట్టిన చిచ్చు' తెలుగు కథ

రచన : జీడిగుంట శ్రీనివాసరావు

(ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత)

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్సుందర్, రమణి కి వివాహం జరిగి అయిదు సంవత్సరాలు అయ్యింది. సుందర్, రమణి యిద్దరూ హైదరాబాద్ లో మంచి ఉద్యోగం చేస్తున్నారు. స్వంత యిల్లు కొనుకున్ని సహాయం కి ఉపయోగం పడతారని ఒక వాటా అద్దెకు యిచ్చారు. అద్దెకు వచ్చిన వాళ్ళు కూడా కొత్తగా పెళ్ళైన వాళ్లే. 


పెళ్ళైన రెండు సంవత్సరాలకే పండంటి మగ పిల్లాడిని కని రమణి భర్త ని ఆనందం లో ముంచింది. శని ఆదివారాలలో పిల్లాడిని తీసుకుని మాల్స్ కి వెళ్లి అటునుంచి మంచి హోటల్ లో భోజనం చేసి సాయంత్రం కి ఇంటికి చేరేవాళ్లు సుందర్ రమణి దంపతులు.


“ఏమండీ! ఈ అద్దెకున్న రవి, సుగుణ యిద్దరు ఒక్కటే తగాదా పడుతువుంటారు, కొత్తగా పెళ్లి అయినవాళ్లు ఏమిటో” అంది రమణి. 


“ఆ ఎన్నాళ్లు కొట్టుకుంటారు, మొదట్లో ఇద్దరు ఒకరికి ఒకరు తమ మాట నెగ్గాలి అని అనుకుంటారు. మధ్యలో ఎవ్వరు దూరక పోతే వాళ్లే సర్దుకుంటారు” అన్నాడు సుందర్.


“అతను బిజినెస్ చేస్తాడు, మన లాగా ఉద్యోగం కాదు, పాపం ఆ అమ్మాయి కి సరదాగా భర్త తో ఆదివారం నాడు అయినా బయటకు వెళ్లి తిరగాలి అని సరదా, అందుకే ఆ గొడవలు” అన్నాడు సుందర్.


“బాగానే రీసెర్చ్ చేసారే, పోనీ ఆయన తో మాట్లాడండి, ఆవిడ ని మనతో పంపుతాడేమో ఆదివారం మనం బయటకు వెళ్ళినప్పుడు” అంది రమణి.


“మనకెందుకు ఆ గొడవ, వాళ్ళు వాళ్ళు చూసుకుంటారు, మన అద్దె మనకి సరిగ్గా యిస్తున్నారు అది చాలు” అన్నాడు సుందర్.


“పాపం మొగుడు పెళ్ళాలు అసంతృప్తి గా వున్నా సుందరి చాలా మంచిది. ఏదైనా స్పెషల్ వంటలు చేసినప్పుడు తీసుకుని వచ్చి యిచ్చేది. అలాగే పిల్లాడిని వాళ్ల యింటికి తీసుకుని ఆడించేది. 

రవి గారు కూడా ముభావం. అద్దె యిచ్చేసి వెళ్లిపోయేవాడు. కాఫీ తాగి వెళ్ళమన్నా వుండేవాడు కాదు”.

***


ఒకసారి అద్దె యివ్వడానికి వచ్చిన రవిని కూర్చోపెట్టి, “మొన్న మీ షాప్ వేపు నుంచి వెళ్తున్నప్పుడు చూసాను, జనం తో కిటకిటలాడుతోంది” అన్నాడు సుందర్. 


“ఏదో యిప్పుడిప్పుడే పుంజుకొంటోంది వ్యాపారం. యిప్పుడే బాగా కష్టపడితే రేపు సంసారం పెరిగినా యిబ్బంది వుండదు” అన్నాడు రవి.


“అది నిజమే అనుకోండి, కొత్తగా పెళ్లి అయ్యిన వారు కదా! వారానికి ఒక రోజు హాయిగా గడపండి సినిమాలు, హోటల్లు అంటూ” అన్నాడు. 

రవి ఒక్కసారి సుందర్ మొహం లోకి చూసి, “మేము మిమ్మల్ని ఏమైనా డిస్టర్బ్ చేస్తున్నామా” అన్నాడు. ఇంతలో రమణి కాఫీ తీసుకుని వచ్చి యిద్దరికి యిచ్చింది. 


“అబ్బే అటువంటిది ఏమీ లేదు, మా పెళ్లి అయ్యి ఐదు సంవత్సరాలు అవుతోంది. వారం లో అయిదు రోజులు ఆఫీస్ పనితో విసిగిపోయి వుంటాము యిద్దరం. శనివారం ఎపుడు వస్తుందా అని ఎదురు చూడటం, రాగానే రోడ్డు మీద కి వెళ్లిపోవడం అది మా వరస. మీకు అభ్యంతరం లేకపోతే రేపు ఆదివారం ఎన్టీఆర్ పార్క్ కి వెళ్లి, అటునుంచి హోటల్ లో టిఫిన్, సినిమా చూసి యింటికి వద్దాము. జీవితం యిప్పుడే అనుభవించాలి రవి, పిల్లలు పుట్టిన తరువాత మజా వుండదు, చూడండి మా పిల్ల పిశాచి బయటకు తీసుకొని వెళ్తే ఒక్కటే పరుగులు పెడతాడు, వాడిని పట్టుకుని కాపలా కాయడంతో హుషారు కాస్తా నీరసంగా మారిపోతుంది” అన్నాడు సుందర్.


“సరే సార్, అలాగే! ఆదివారం షాప్ సాయంత్రం తెరవకుండా మనం ప్రోగ్రాం ప్రకారం వెళద్దాం, మేము రావడం వల్ల మీకు ఏమి యిబ్బంది లేదు గా” అన్నాడు రవి. 


“యిబ్బంది లేదు నిజం చెప్పాలంటే మా చంటాడిని మీరు ఎలాగో మీతోనే ఉంచుకుంటారు కాబట్టి మాకు కొద్దిగా శ్రమ తగ్గుతుంది” అన్నాడు నవ్వుతు సుందర్.


రవి వెళ్లిన తరువాత, “ఏమిటండి ఆ మాటలు, పిల్లాడు మనల్ని ఏదో బాధ పెడుతున్నట్టు మాట్లాడుతారు, అతను ఏమనుకుంటాడు” అంది రమణి. 

“ఏదో నవ్వించుదామని అన్నానులేవే, మీరిద్దరూ ఎంత కామ్ గా వుంటారో బయటకు తీసుకువెళ్తే నాకు తెలియదా” అన్నాడు.ఆదివారం వచ్చింది, పాపం రవి భార్య సుందరి మాకు ఉదయం ఫలహారం తనే పంపించింది. రమణి కూర, పులుసు చేసి సుందరి వాళ్ళకి పంపి, సాయంత్రం అయిదు గంటలకు బయలుదేరాలి రెడీగా ఉండమని గుర్తు చేసింది.


సాయంత్రం అయిదు గంటలకల్లా పిల్లాడిని తయారు చేసి, రవి వాళ్ళ ఫ్యామిలీ తో కారులో బయలుదేరారు సుందర్, రమణి.


కారు పార్కింగ్ లో పెట్టి వచ్చేసరికి రవి అందరికి ఎంట్రన్స్ టికెట్స్ తీసుకున్నాడు. లోపలికి వెళ్ళగానే “అబ్బో నేను చూసినప్పుడు ఎన్టీఆర్ పార్క్ యింత పెద్దగా లేదు, యిప్పుడు బాగా డెవలప్ చేసారు” అన్నాడు రవి. 


“మీరు ఈ పార్క్ కి వచ్చింది ఎప్పుడు” అని అడిగాడు సుందర్. 


“ఎన్టీఆర్ బతికి వున్నప్పుడు వచ్చాను” అన్నాడు నవ్వుతూ రవి. 


“అప్పుడు ఈ పార్క్ లేదులే రవి, యిప్పుడు బాగా ఎంజాయ్ చెయ్యండి” అన్నాడు. 


ఒక గంట తిరిగేసరికి సుందర్ కి నీరసం వచ్చి, అక్కడే వున్న బల్ల మీద కూర్చుని, “రవి, యింక మేము తిరగలేము, మీ భార్యభర్తలు యిద్దరూ తిరిగి యిక్కడకే రండి” అని వాళ్ళని పంపించాడు.


“అదేమిటి అప్పుడే అలసిపోయారా” అంది సుందర్ ని భార్య రమణి. 


“పాపం ఆ కొత్తదంపతులకి ఫ్రీడమ్ యిద్దామని నేను యిక్కడ ఆగిపోయాను” అన్నాడు నవ్వుతు భార్య వంక చూసి.


“అయితే అక్కడ షాప్ దగ్గరికి వెళ్లి మనకి ఐస్క్రీం తెస్తాను, చంటాడిని పట్టుకోండి” అంది. 


“యిప్పుడే వద్దు. మనం తింటూ వుంటే వాళ్ళు వస్తే బాగుండదు” అన్నాడు సుందర్.


“యిదిగో అటు చూడు, చిలుక జోష్యం చెప్పేవాడు వున్నాడు. పద,చెప్పించుకుందాం” అని లేచాడు.


“అబ్బా! నాకు వాటి మీద నమ్మకం లేదు. మీరు వెళ్ళండి కావాలంటే” అంది రమణి. సుందర్ లేచి నుంచోవడం గమనించిన చిలక జోష్యం వాడు నమస్కారం పెట్టి రమ్మని పిలిచాడు.


“నువ్వు చెప్పుతావా, నీ చిలక చెప్పుతుందా జోష్యం” అన్నాడు అతని దగ్గరికి వెళ్లి సుందర్.


“చిలక చెప్పింది నేను విని మీకు చెపుతాను” అన్నాడు చిలక వాడు.


“దంపతులకి అయితే వంద రూపాయలు, ఒక్కరికైనా వంద యివ్వాలి, అమ్మగారిని కూడా పిలవండి” అన్నాడు.


“అమ్మగారికి జోష్యం మీద నమ్మకం లేదు, నాకు చెప్పు, నిజం అయితే వంద యిస్తాను” అన్నాడు బల్లమీద కూర్చొని సుందర్.


“పేరేమిటి దొరా” అన్నాడు చిలుక యజమాని.


“సుందర్” అన్నాడు సుందర్. 


“తమిళ వాళ్ళా” అన్నాడు ఆ పేరు విని. 


“కాదులే, ముందు జాతకం చెప్పు” అన్నాడు సుందర్.


పంజరం తలుపు తీసి “ఓహో చిలుకమ్మ.. ఈ సుందర్ బాబు గారి జాతకం కార్డు తీసి యివ్వు” అన్నాడు. 


పంజరం లోనుండి చిలుక బయటకు రాకపోవడం తో, “ఉదయం నుంచి గిరాకి లేక చిలుక నీరసం తో వుంది” అంటూ బయటకు వచ్చి “మంచి కార్డు తీసి యిస్తే బాబుగారు నీకు జామపండు పెడ్తారు” అని చేతిలో వున్న చిన్న కర్రతో పంజరం మీద కొట్టాడు. 


దానితో చిలుక బయటకు వచ్చి, కార్డ్స్ మీద నడుచుకుంటూ వెళ్లి ఒక కార్డు బయటకు లాగి, పంజరం లోకి వెళ్ళిపోయింది.


కార్డులో వున్న చిన్న కార్డు తీసి, “నంది స్వామి వచ్చారు, స్వామి చెపుతున్నారు నువ్వు మంచి నమ్మకస్తుడివి అని, మంచి ఉద్యోగం లో ఉంటావని, దానధర్మాలు విరివిగా చేస్తావని, పరిపూర్ణ ఆయుష్ వుంది నీకు” అన్నాడు. 


“నువ్వు నీ భార్య ని బాగా చూసుకుంటావు, కానీ కొంతకాలం నుంచి నీ భార్య ప్రేమ నీ మీద తగ్గి వేరే కూన మీదకి మరలింది” అన్నాడు. ఆ మాటతో సుందర్ కి మైండ్ ఆబ్సెంట్ అయ్యింది.


“అదేమిటి యిలా అన్నాడు.. అవును ఈ మధ్య తన ప్రేమ తగ్గింది, కొంపదీసి ఆ రవి గాడి మీదకి మరల లేదు కదా, ఛీ యిలా ఆలోచిస్తున్నాను ఏమిటి” అనుకుంటూ, జోష్యం చెప్పిన వాడికి డబ్బు యిచ్చి నీరసంగా భార్య పిల్లాడు వున్న బెంచి దగ్గరికి వచ్చి కూర్చున్నాడు.


“ఏమంది మీ చిలుక?” అంది రమణి. 


“ఏదో అందిలే, వాళ్ళు రాగానే హోటల్ లో టిఫిన్ తిని యింటికి పోదాం, తలనొప్పిగా వుంది” అన్నాడు సుందర్. 


హోటల్ కిటకిటలాడుతోంది. “యింట్లో ఎవ్వరు వండుకోవడం మానేసినట్టున్నారు, ఆ రెండు కుర్చీలలో మీరు కూర్చోండి, యిక్కడ వున్న రెండు కుర్చీలలో మేము కూర్చుంటాము, ఒకేచోట దొరకడం లేదు” అన్నాడు రవి సుందర్ తో.


సర్వర్ రాగానే తనకి ఒక ప్లేట్ ఇడ్లీ చెప్పుకున్నాడు, రమణి ఉల్లిదోశ ఆర్డర్ యిచ్చింది. “నీకు నా మీద ప్రేమ తగ్గిపోయింది, నాకు రవ్వదోశ యిష్టం అని తెలిసికూడా మీరు ఇడ్లీ తినడం ఏమిటి అనికూడా అడగలేదు. నీ పట్టాన ఉల్లిదోశ ఆర్డర్ యిచ్చుకున్నది చాలక, వాళ్ళని కూడా అదే తినమని రికమెండ్ చేస్తున్నావ్” అన్నాడు రమణి తో సుందర్. 

“బాగానే వుంది యిప్పుడే గా తలనొప్పిగా వుంది అంది, అందుకే ఇడ్లీ తింటారేమో అనుకున్నాను” అంది.


రవి వాళ్ళ యింట్లో గొడవ తగ్గి సుందర్ వాళ్ళ యింట్లో మొదలైంది. రోజు ఆఫీసుకి వెళ్తూ బై చెప్పే సుందర్ ముభావంగా వెళ్ళపోతున్నాడు. రమణికి భర్త లో వచ్చిన ఈ మార్పు అర్ధం కావడం లేదు.


ఆదివారం ఉదయం, ప్లేట్ నిండా పూరీలు, యింకో బాక్స్ నిండా కూర తీసుకొని వచ్చి అందించాడు రవి సుందర్ కి.


భర్త చేతిలోనుంచి ప్లేట్ అందుకున్న రమణి, పూరీ కూర గుమగుమ లాడుతోంది. త్వరగా రండి తిందాం అంది భర్త తో.


“వాళ్ళు వీళ్ళు యిచ్చే వి తినడమేనా నువ్వు రుచిగా చెయ్యడానికి ప్రయత్నం చెయ్యవా?” అన్నాడు విసుగ్గా సుందర్. 


దానితో రమణి కి సహనం నశించి, కూర్చి లాక్కుని సుందర్ కి ఎదురుగా కూర్చుని, “ఈ రోజు తేలిపోవాలి, ఏమైంది మీకు? మూడు వారాలనుంచి చూస్తున్నాను, ప్రతీ దానికి విసుగు, మొహం పీక్కు పోయి వున్నారు, ఆ చిలుక జోష్యం వాడు ఎమైనా నెత్తికి ఆయిల్ రుద్దాడా” అంది.


“అవును, చిలుక జోష్యం లో నీ సంగతి బయట పడింది, నీకు నా మీద ప్రేమ తగ్గిపోయి వేరే వాడి మీదకి మోజు పెరిగిపోయింది అన్నాడు. నేనే పిచ్చి వెధవ ని గుర్తించలేక మోసపోయాను. నువ్వు వాళ్ళని కూడా బయటకు తీసుకుని వెళదాం అంటే ఎందుకు అన్నావో కూడా తెలుసుకోలేక పోయాను” అన్నాడు సుందర్.


భర్త మాటలకి తెల్లబోయి “అంటే మీకు నా మీద అనుమానం ఉందా, ఆ చిలుక ని నమ్మినంతగా నన్ను నమ్మలేదు అన్నమాట. సరే, సాయంత్రం మళ్ళీ ఆ చిలుక జోష్యం వాడి దగ్గరికి వెళ్దాం, ఈసారి కూడా అదే చెప్పితే నా దారి నేను చూసుకుంటా” అంది కోపంగా.


సాయంత్రం ఎన్టీఆర్ పార్క్ కి వెళ్లి డైరెక్ట్ గా చిలుక జోష్యం అతని దగ్గరికి వెళ్ళాడు.


వీళ్ళని చూసి “దంపతులు యిద్దరికి అయితే రెండు వందలు, ఒక్కరికి అయితే నోటయాభై” అన్నాడు. అంటే పెంచేసాడు అన్నమాట అనుకుని “ముందు నా ఒక్కడికి చూడు, నచ్చితే తను చెప్పించుకుంటుంది” అన్నాడు.


“పేరు చెప్పు దొరా” అన్నాడు. తన పేరు చెప్పగానే గుర్తు పడ్తడేమో అని తన యింటి పేరు ‘శిష్ఠల’ అని చెప్పాడు.


“చిలుక తల్లీ! శిష్ఠల దొర కార్డు తీసి యివ్వు అన్నాడు. చిలుక యధాప్రకారం ఒక కార్డు తీసి యిచ్చింది.


“శివపార్వతులు వచ్చారు, మీరిద్దరూ ఆదిదంపతులని చిలుక తల్లీ చెప్పింది. మీ సంసారం సుఖ సంతోషాలతో నిండి వుంటుంది. ఒకరి కోసం ఒకరు జీవిస్తున్నారు” అన్నాడు. 


“ఆగు! మొన్న నా భార్య కి నా మీద మోజు పోయింది అని చెప్పావుగా” అన్నాడు సుందర్. 

ఆ మాటకి అతను కొద్దిగా కంగు తిని “యిది వరకు చెప్పించుకుని, నా చిలుక ని టెస్ట్ చేద్దామని వచ్చావా, నేను అప్పుడు చెప్పింది నిజమే, నీ మీద ప్రేమ అంతా నీ కోడె మీదకి మరలింది” అన్నాడు. 


“మేము బ్రాహ్మణలం. కోడె మా యింట్లో ఎందుకుంటుంది” అన్నాడు కోపంగా సుందర్.


“అయ్యో తండ్రి.. కోడె అంటే నీ కొడుకు, ఏ స్త్రీ కైనా భర్త మీద ప్రేమ సంతానం కలిగే వరకే వుంటది, తరువాత ప్రేమ బిడ్డల మీదకు పోతుంది. అదే చిలుక చెప్పింది. తప్పుగా అర్ధం చేసుకుని అమ్మని బాధపెట్టలేదు కదా, అమ్మ పార్వతి దేవి, తప్పుగా తలిస్తే కను గుడ్లు ఉడికిపోతాయి జాగ్రత్త” అన్నాడు. సుందర్ కి మనసులోని బాధ ఐస్ లా కరిగిపోయింది.


“సరేలే, ఈ కోడె తో ఆఖరా యింకా ఏమైనా” అని ఆడిగాడు సుందర్ చిలుక జోష్యం అతనిని. 


ఒక్కసారి సుందర్ మొహం లో కి చూసి నవ్వుతూ, యింకా కోర్రో లేదు మొర్రో లేదు” అన్నాడు చిలుక కి శనగ గింజలు పెడుతో.


“మళ్ళీ అర్ధం కాని బాష వద్దు మాములుగా మాట్లాడు” అన్నాడు సుందర్.


“కోర్రో అంటే కొడుకు, పెరిగి పెద్దయినా తల్లిదండ్రుల ని కుయ్యో అనిపించేవాడు, మొర్రో అంటే కూతురు, పెళ్లి అయినా తల్లిదండ్రులని ఏదో ఒక బాధ చెప్పి మొర్రో అనిపించేది. నీకు యిప్పుడున్న కోడె ఒక్కటే ఈ జీవితాన్ని కి” అన్నాడు.


“నువ్వు అదివరకు ఏమైనా రచయితవా?” అని అడిగాడు అతనిని సుందర్. 


“అవును దొర.. పారితోషకం చాలక ఈ వృత్తి లో కి వచ్చాను” అన్నాడు. సుందర్ రెండు వంద రూపాయల కాయితాలు అతని చేతిలోపెట్టి అక్కడ నుంచి కదిలారు.


“ఇప్పుడైనా అనుమానం తీరిందా” అని అడిగింది. 


“నీ ప్రేమ అయినా నా ప్రేమ అయినా చంటాడు మీదే గా” అని, “సరే హోటల్ టిఫిన్ తిని సినిమా కి వెళ్దాం పదా” అంటూ కొడుకుని ఎత్తుకుని ముద్దు పెట్టుకున్నాడు. 


పాత సినిమా అవడంతో జనం తక్కువగా వున్నారు. పెద్ద పొపకార్న్ ప్యాకెట్ కొనుక్కుని లోపలకి వెళ్లారు అప్పుడే " పెళ్ళాం చెపితే వినాలి " అని టైటిల్ పడింది. 


ఇంటర్వెల్ లో బయట నుంచి పెద్ద పొపకార్న్ ప్యాకెట్ తో లోపలికి వస్తున్న రవి ని చూసి, మీరు ఈ సినిమా కే వచ్చారా అన్నాడు సుందర్. "పెళ్ళాం చెపితే వినాలి"  కదా సార్ అంటూ తన సీటు దగ్గరికి వెళ్ళాడు.


 మనం చేసే పనులు మీదే మన జాతకం వుంటుంది, జాతకం అంటూ చెప్పించుకుని మనశ్శాంతి ని పోగొట్టుకోకండి.


 శుభం 
జీడిగుంట శ్రీనివాసరావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ జీడిగుంట శ్రీనివాసరావు గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 


విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం:

నా పేరు జీడిగుంట శ్రీనివాసరావు. నేను గవర్నమెంట్ జాబ్ చేసి రిటైర్ అయినాను. నేను రాసిన కథలు అన్నీ మన తెలుగు కథలు లో ప్రచురించినందులకు ఎడిటర్ గారికి కృతజ్ఞతలు.


30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.

58 views0 comments

Comments


bottom of page