top of page
Writer's pictureSairam Allu

అగమ్యం


కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.








Youtube Video link


'Agamyam' New Telugu Story


Written By Allu Sairam


రచన: అల్లు సాయిరాం


ప్రసాదరావు రోజులాగే తన ఆఫీసు పనులు తొందరగా ముగించుకొని, ఐదుగంటలకి బ్యాగులో లంచ్ బాక్స్ సర్దుకొని, ఆఫీస్ నుండి గబగబా బొబ్బిలి రైల్వేస్టేషన్ కి బయల్దేరాడు. స్టేషన్ కి చేరుకునేసరికి తను వెళ్ళాల్సిన ఎక్స్ప్రెస్ ట్రైన్ కదిలిపోతుంటే, పరిగెత్తుకుంటూ వచ్చి ఎక్కేశాడు ప్రసాదరావు. నీళ్లుతాగి ఆయాసం తీర్చుకున్నాక, కోచ్ లోపల చూస్తే ప్రయాణికులతో నిండిపోయింది. పక్క సీట్లో కూర్చుని న్యూస్ పేపర్ చదువుతున్న రాహుల్ కొంచెం సీటు ఎడ్జస్ట్ చేసుకోని ఆయాసపడుతున్న ప్రసాదరావుని చూసి కూర్చోమన్నాడు. ప్రసాదరావు సర్దుకుని కూర్చున్నాడు.


"ఎంతవరకండీ?" అని రాహూల్ అడిగాడు.


ప్రసాదరావు గొంతు సవరించుకుని "పార్వతీపురం వరకు!" అని చెప్పాడు.


"మేం పార్వతీపురమేనండీ! ట్రైన్ టైం కి కొంచెం ముందు వస్తే బాగుణ్ణు కదండీ!" అని చెప్పాడు రాహుల్. ఎదురుగా మూడేళ్ల కొడుకు చింటూతో కూర్చున్న రాహుల్ భార్య శరణ్య లాప్-టాప్ లో తన పనిచేసుకుంటూ, వాళ్ళిద్దరి మాటలువింటుంది.


ప్రసాదరావు కిందపడిన న్యూస్ పేపర్ అందుకుంటూ "నేను రోజూ ఈ బండిలో వెళ్లివస్తుంటాను. రోజు కరెక్ట్ గా వచ్చేస్తాను. ఈరోజే కొంచెం లేటయింది" అని చెప్తూ పేపర్ చదువుతున్నాడు.


"గరమ్. గరమ్ సమోసాలే. 10 రుపాయిలకి 4 సమోసాలు" అంటూ సమోసాలవ్యాపారి నిలబడి ఉన్న మనుషుల సందుల్లోంచి వస్తున్నాడు.

"మమ్మీ! సమోసా!! " అంటూ శరణ్య పక్కన విండో సీటు దగ్గర కూర్చున్న చింటూ లేచి వస్తున్నాడు. సమోసాలవ్యాపారి గబగబా నాలుగు సమోసాలు తీసేసి, ఒక పేపర్లో పొట్లంకట్టేసి, బాబు చేతిలో పెడుతున్నాడు. చింటూ ఆశగా తీసుకోవడానికి వెళ్తున్నాడు.


" హే చింటూ! డోంట్ డూ దట్! సీ దేర్.. యాక్.. వెరీ ఆగ్లీ. కమ్ హియర్ " అని శరణ్య గట్టిగా అరుస్తూ, తనఒడిలో ఉన్న లాప్-టాప్ పక్కనపెట్టి, చింటూని తనదగ్గరికి తీసుకుంది.


శరణ్య చెవిలో ఇయర్-ఫోన్స్ పెట్టుకుని అరిచిన అరుపులు, ట్రైన్ శబ్దాన్ని మించి, ఆ కోచ్ మొత్తం వినిపించాయి. దాంతో, అంతకుముందు అదే వ్యాపారి దగ్గర సమోసాలు తీసుకున్న ఆ కోచ్ లో వాళ్ళందరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటున్నారు. శరణ్య మాటలకు కొందరు, యాసలో మాట్లాడుతున్న ఇంగ్లీష్ కి కొందరు తొంగితొంగి చూస్తున్నారు.


"వాట్ ఈజ్ దిస్ చింటూ! సిట్ హియర్ సైలెంట్లీ!!" అని చింటూని విండో ప్రక్కన కూర్చోబెట్టి, చేతిలో స్మార్ట్ ఫోన్ పెట్టేసి, పక్కన కూర్చుని తన లాప్-టాప్ అందుకుంది శరణ్య.


సమోసాల వ్యాపారి చిన్నబుచ్చుకుని ముందుకు వెళ్ళిపోతున్నాడు.


"ఆఁ మమ్మీ! నాకు సమోసాలు కావాలి! లేకపోతే నాకు స్టోరీ చెప్పు" అని చింటూ అల్లరిచేస్తూ, శరణ్య నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తూ అడుగుతున్నాడు.


"చింటూ! వై యూ ఆర్ టాకింగ్ ఇన్ తెలుగు? టాక్ విత్ మి ఇన్ ఇంగ్లీష్!" అని చింటూని కదలనివ్వకుండా గట్టిగా పట్టుకుని అడిగింది శరణ్య.


"వాట్ రాహూల్! ఆర్ యూ వాచింగ్ సర్కస్ హియర్? ఐ టెల్ యు బుక్ టికెట్స్ ఇన్ ఏసి కోచ్. బట్, యు బుక్డ్ ఇన్ స్లీపర్ క్లాస్. చింటూ! గో దేర్.. యువర్ డాడీ విల్ టెల్ ది స్టోరీ! " అంటూ ఎదురుగా కూర్చుని రాహుల్ చేతికందించింది శరణ్య చిరాకుగా. వాళ్ళ మాటలు వింటుంటే, ఆ కోచ్ లో ఉన్నవాళ్ళందరికి కాసేపు అర్ధంకాని ఇంగ్లీష్ సినిమా చూసినట్లనిపించింది. ప్రసాదరావు పేపర్ చదువుతున్నట్లుగా ఆసక్తిగా గమనిస్తున్నాడు.

రాహూల్ చింటూని తన ఒడిలో కూర్చొపెట్టుకుని "చింటూ! స్టోరీ కావాలా! మరో పావుగంటలో మన వూరు వచ్చేస్తుంది. మన కారులో ఇంటికి వెళ్ళాక, నేను నీకు మంచి స్టోరీ చెప్తాను" అని ఆడిస్తూ చెప్పాడు.

శరణ్య మరింత చిరాకుగా " రాహూల్! టాక్ ఇన్ ఇంగ్లీష్ విత్ చింటూ. హి హెవ్ టు గెట్ అడ్మిషన్ ఇన్ ఇంటర్నేషనల్ స్కూల్! " అని అరిచి చెప్పింది. శరణ్య ఇంత కష్టపడి ఉత్తరాంధ్రయాసలో మాట్లాడే ఇంగ్లీష్, ఇంటర్నేషనల్ స్కూల్ లో పిల్లాడి అడ్మిషన్ కోసమన్న విషయం ప్రసాదరావుకి పూసగుచ్చినట్టు అర్థమయ్యింది.


"శరణ్య! ఎందుకు ప్రతిదానికి టెన్షన్ అయిపోతున్నావు?" అని అడిగాడు రాహూల్.


"టెన్షన్! మి!! పర్ వాట్ రాహూల్! విత్ ఇంగ్లీష్ చింటూ గెట్ గుడ్ ఫ్యూచర్! " అని కోపంగా చెప్పింది శరణ్య.

" అది ఒకే! కాని, ఈ వయసు నుంచి ఇంత ఒత్తిడి పెడితే ఫ్యూచర్ ఏమో గాని, ఇప్పుడే డిప్రెషన్ వస్తుంది. చింటూకి నాలుక తిరగకపోతే, నోట్లో చేయిపెట్టి నాలుక తిప్పేస్తావా ఏంటి? నువ్వు డిగ్రీ పూర్తిచేసి, ఆరునెలలు స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్ కి వెళ్తే, ఒక సంవత్సరానికి నీ నోటికి వచ్చింది ఇంగ్లీష్. మరి చింటూకి ఈ వయసులో అంతవేగంగా ఏలా వచ్చేస్తుంది. దేనికైనా టైం పడుతుంది. అయినా, ఇంట్లో మనతో మాట్లాడితే చాలు కదా! ఇలా బయట కుడా ఎందుకు? " అని సంజాయిషీగా చెప్పాడు రాహుల్. శరణ్య కోపంగా వాష్ రూం వైపు వెళ్ళింది.


ప్రసాదరావు న్యూస్ పేపర్ మడతపెట్టి రాహూల్ కి ఇస్తూ " బాబు! మీరు తప్పుగా అనుకోకపోతే, మీఇద్దరూ మీ పర్సనల్ విషయాలు ఇలా బయట మాట్లాడుకోవడం చూడడానికి అంత మంచిగా ఉండదు " అని ఒకింత తడబడుతూ చెప్పాడు.

"అయ్యో! అదేం లేదండీ! రెండురోజుల ముందు ఓ ఇంటర్నేషనల్ స్కూలుకి వెళ్తే, చింటూ సరిగ్గా ఇంగ్లీష్ మాట్లాడటం లేదని అడ్మిషన్ ఇవ్వలేదు. తను ఆ కోపంలో ఉంది. అంతే!" అని జరిగినది కూలంకుషంగా చెప్పాడు రాహుల్.


ప్రసాదరావుకి మొత్తం విషయం అర్ధమయ్యాక మరింత చనువు తీసుకుని "అడ్మిషన్ ఇవ్వడానికి ప్రమాణంగా తీసుకునేటంత ఏం ప్రత్యేకం ఉందో లేదో తెలియదు గాని, గట్టిగా మాట్లాడితే కోచ్ లో ఉన్నవాళ్ళందరూ చూసేటంత ప్రత్యేకత అయితే ఉంది" అని అన్నాడు ప్రసాదరావు వెనుకవైపు వాష్ రూం నుంచి వచ్చిన శరణ్యని చూడకుండా.


"ఏం ప్రత్యేకత లేకపోతే అందరూ ఎందుకు కావాలనుకుంటారు?" అని శరణ్య అడిగేసరికి ప్రసాదరావు తుళ్ళిపడి వెనక్కి చుశాడు.

శరణ్య ఎదురుగావచ్చి కూర్చుంది.

ప్రసాదరావు కొంచెం సర్దుకుని " ఎప్పుడో వచ్చేదో, ఎక్కడ ఉండేదో మనకి స్పెషల్. మన ఇంటికివచ్చే అతిథి చుట్టం కుడా మనకు స్పెషలే! ఎంత క్లోజ్ అయినా, మనింటి మనిషి అవుతారా అమ్మా? " అని అడిగాడు.


"మరి, మీ పిల్లల్ని ఎందులో చదివించారండీ?" అని శరణ్య సూటిగా అడిగింది.


ప్రసాదరావు చిన్నగా నవ్వుతూ "ఈమధ్యన ఎక్కడైనా భాషల గురించి ప్రస్తావన వస్తే చాలు, మొదటిగా అడిగే బ్రహ్మాస్త్రంలాంటి ప్రశ్న యిదే! చూడమ్మా! నావయసు 54సం. నా కూతురు కూడా నీలాగే ఉంటుంది. నా చిన్నప్పటి పరిస్థితుల్లో, చదివితే చాలు అన్నట్టుగా ఉండేది. మీ చిన్నప్పటి పరిస్థితుల్లో, చదువు అవసరం తెలిసింది. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో, చదువు కంటే మిగతా విషయాలే అత్యవసరమైపోయాయి" అని కాలక్రమేణా చదువులో వచ్చిన మార్పుల్ని అనుభవపూర్వకంగా బదులిచ్చాడు. అరుపుల నుంచి మొదలైన సందర్భం అర్ధవంతమైన సంభాషణగా మారడంతో కోచ్ లో ఉన్న కొందరు ఆసక్తిగా చూస్తున్నారు. కొందరు తాము ఓ మాట కలపడానికి పక్కన చేరారు. కొందరు ఇంగ్లీష్ మాట్లాడుతున్న శరణ్య నోట్లో తెలుగు మాట్లాడితే చుద్దామని చూస్తున్నారు.


"ఇంతకీ, మీరు ఏమంటారు. యి భాష నేర్చుకోవద్దంటారా? మాట్లాడవద్దంటారా??" అని శరణ్య మరింత సూటిగా ప్రశ్న అడిగితే "చూడు తల్లీ! ఒకటి కాదమ్మా. పది భాషలు నేర్పించు. అది మంచిదే! వయసులో పెద్దవాడిగా కాదు, నా ఉద్యోగరీత్యా చాలారాష్ట్రాలు తిరగడంవలన నాలుగైదుభాషలు తెలిసినవాడిగా చెప్తున్నా. బహుభాషా పరిజ్ఞానం తెలియడంవల్ల మరింత జ్ఞానం వస్తుంది. అయితే ఒక భాష నేర్చుకోవడానికి మరొక భాషని అసలు మాట్లాడవద్దు అని చెప్పడమే వద్దు అంటున్నాను. అది అంతగా మంచిదికాదు అంటున్నాను. పోనీ, ఏదో మాట్లాడేసినంత మాత్రాన, ఆ భాష పూర్తిగా తెలుసని కాదు కదా! కడుపుకి తినడం తెలిసినందరికి, వంటవండడం తెలియాలనిలేదు కదా!" అని ప్రసాదరావు చెప్పిన సమాధానానికి శరణ్య కొంచెం మెత్తబడి


" మీరే చెప్పారు కదా, ఈ జనరేషన్ వాళ్ళకి అత్యవసరం అయిందని! అదే, అందరూ చేసేదే, మేం మా పిల్లలకి ఇవ్వడానికి చూస్తున్నాం. అది తప్పా? " అని అడిగింది.


"కొన్నిరోజులముందు, మా ఫ్రెండ్ ఒకరు చనిపోతే, చూడడానికి అతని మనవడు, మనవరాలు అక్కడికి వచ్చారు. పాపం! వాళ్ళ తాతయ్యని అలా చూసి వాళ్ళకి బాధ కలిగి, ఓ మై గ్రాండ్ ఫాదర్ అని ఇద్దరూ గట్టిగా ఏడుస్తుంటే, మిగతావాళ్ళందరూ ఏడుపు మానేసి వాళ్ళిద్దరినే చూస్తున్నారు. భాషలు నేర్చుకోవడం అవసరం. కానీ, మన మూలాలు మర్చిపోయేటంత అవసరమైతే కాదు. ఇలా అవసరానికి మాత్రమే మనం గుర్తుచేసుకోవడం వల్లనే, మన మాతృభాష గమ్యంలేని విడిచిపెట్టిన బాణంలా, దిక్కు తెలియని స్థితిలో నెట్టబడుతుంది. ఏమనుకోవద్దమ్మా! ఇప్పుడు, మీ చింటూకి చిన్నవయసులో తల్లిదండ్రులుగా మీఅవసరం ఉంది. రేపు వాడు పెరిగిపెద్దయ్యాక, కాలానుగుణంగా ఆ తరానికి వచ్చిన మార్పులుప్రకారం, మీ అవసరంలేదని, మిమ్మల్ని వదిలేస్తే మీకు పర్వాలేదా అమ్మా??" అని ప్రసాదరావు చెప్పిన మాటలు ఎందుకో మనసుని గట్టిగా తాకి ఆలోచనలోపడింది శరణ్య.

ప్రసాదరావు కొనసాగిస్తూ "తెలుగు మనకి అమ్మ .. ఇతర భాషలు అత్త లాగా. అమ్మ అంటే మమకారం.. అత్త అంటే అభిమానం. అసలు, యి సృష్టిలో తల్లితో పోల్చడానికి ఏది సరిపోదు. ఏది సాటిరాదు. ఆలోచించుదరుగాక! నువ్వు తల్లివి. నీకు యింతకుమించి చెప్పక్కర్లేదు!!" అని చెప్తుండగానే పార్వతీపురం స్టేషన్ వచ్చేసింది.


లగేజీలు సర్దుకుని రాహుల్, శరణ్య, చింటూ ట్రైన్ దిగారు. వాళ్లవెనుకగా ప్రసాదరావు దిగుతూ శరణ్యని చూస్తూ " నా కూతురు, మనవడిలా భావించి, ఏదో చెప్పాలనిపించింది. చెప్పాను. మీకు తప్పుగా అనిపిస్తే, పర్వాలేదు వదిలేయండమ్మా!" అని కొంచెం తడబాటుగా చెప్పాడు. నిండా ఆలోచనల్లో ఉన్న శరణ్య స్పందించలేదు.


అప్పుడు రాహుల్ "అదేమీ లేదండీ! మీలాంటి పెద్దవారు అనుభవపూర్వకంగా చెప్పిన విషయాలన్ని, మా మంచి కోసమేనండీ! తను కొంచెం టెన్షన్ లో ఉంది. అన్ని ఆలోచించి నిర్ణయం తీసుకుంటాం. థాంక్స్ అండి!" అని చెప్పిన మాటలకి ప్రసాదరావుకి ఆనందంగా అనిపించి "మంచిది బాబు!" అని చెప్పాడు. రాహూల్ కుటుంబం కోసం వాళ్ళింటి దగ్గర నుంచి కారు వస్తే, లోపల లగేజీలుపెట్టి, ముగ్గురు కూర్చున్నారు.


రాహూల్ కారు ఎక్కాక " కొన్ని ప్రయాణాలు గుర్తుండిపోతాయి. మీలాంటి కొందరు, తక్కువ సమయంలోనే చాలా దగ్గరైపోతారు. మళ్ళీ, మిమ్మల్ని కలవాలంటే? " అని ప్రసాదరావుని అడిగితే " ఈ పక్కనే బాబు! బైపాస్ రోడ్డులోనే మా యిల్లు. నా ఫోన్ నెంబర్ యిది" అంటూ కారు దగ్గరికి ఆత్రుతగా వచ్చిచెప్పాడు ప్రసాదరావు.

"సరేనండీ! మళ్ళీ కలుద్దాం!!" అని రాహూల్ చెప్పాడు. కారు కదిలినప్పుడు, శరణ్య చింటూని దగ్గరికి తీసుకుని, నుదుటన ముద్దుపెట్టి, తండ్రి స్థానంలో ప్రసాదరావుని ఆప్యాయంగా చూస్తూ చిరునవ్వు నవ్వింది.

అది చూసిన ప్రసాదరావుకి ఏదోతెలియని ఒక సంతృప్తికరమైన అనుభూతితో తన యింటివైపు నడుచుకుంటూ వెళ్తున్నాడు.

***

అల్లు సాయిరాం గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


కథలు, నవలలు మరియు జోకుల పోటీల వివరాల కోసం



మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.




122 views2 comments

2 comentarios


ABR Creations • 2 days ago

మా మిత్రుడు అల్లు సాయిరాం వ్రాసిన కధలు చాలా బాగుంటాయి.....,

Me gusta

Naveen Palaka • 2 days ago

Nice1 bro

Me gusta
bottom of page